తన వెన్నును కరగదీసి
దేశానికి వెన్నెముకగా నిలవడంలో
నిత్య కృషీవలుడుగా
నిరంతర శ్రామికుడై
అర్ధాకలి బాధను పంటికింద బిగపట్టి
మంది ఆకలి తీర్చే దేవుడతడు
దుక్కి దున్నిన నాటి నుండీ
కళ్ళలో ఒత్తులు వేసుకుని
ఆకాశం నుండి జారే కాసిన్ని చుక్కల కోసం
చుక్కలు చూసే దీన బాంధవుడతడు
ఆ చుక్కలే లెక్క తప్పితే
తన కంటి వరద ప్రవాహమై
హరితవర్ణం హరించిపోయి
విధివంచితుడై
నెర్రెలిచ్చిన నేలతల్లి ఎదపై
రోదించే గుండె గోదారి అతడు
నకిలీ లీలల చక్రాలకింద నలిగిపోతూ
దళారీల దోపిడీ ఎరలో చిక్కిన పక్షి
ఆరుగాలం కష్టాల గరాళాన్ని స్వీకరించి
మనకు మాత్రం అహరహం
అమృతాన్ని పంచే దేవదేవుడతడు
పెట్టుబడి చేజారిపోతే
అప్పుల ఊబిలో కూరుకుని
ఊతమిచ్చే దిక్కులేక ఆక్రందన అరణ్య రోదనై
విధికి తలవంచి పురుగుల మందే శరణ్యంగా
లోకాన్ని విడిచే అభాగ్యుడతడు