[‘అతడిలా అర్థమయ్యాడు’ ఆవిష్కరణ సభ – నివేదిక అందిస్తున్నారు శ్రీ మాకినీడి సూర్యభాస్కర్.]
ఆగస్టు 23, 2025 సాయంత్రం కాకినాడ ‘రామకృష్ణ మిషన్ స్కూలు’ ఆవరణలోని వివేకానంద ఆడిటోరియం ఒక ప్రత్యేకమైన ఆత్మీయతతో నిండిపోయింది. ‘అతడిలా అర్థమయ్యాడు’ అనే పుస్తకావిష్కరణ సభ అక్కడ జరుగుతోంది. సాధారణ సభలా కాకుండా, ఇది ఒక కుటుంబ వేడుకలా సాగింది. ప్రతి ఒక్కరి మాటలో, పలకరింపులో స్నేహం, సాహిత్యం, అనురాగం ఒకే తీరులో ప్రవహించాయి.
గ్రంథకర్త పెండ్యాల కామేశ్వరరావు ఆంగ్ల ఉపన్యాసకుడిగా పనిచేసి ఇప్పుడు కాకినాడలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. కవిత్వం అంటే ప్రాణమైన ఆయన, మణిబాబు రచనలు పది పుస్తకాలను లోతుగా చదివి, వాటిపై పేజీలకు పేజీలు నోట్స్ రాసుకున్నారు. ఆ నోట్స్ అలా పెరిగి పెరిగి వందల పేజీలకు చేరింది. వాటిలో “బాటే తన బ్రతుకంతా”, “నాన్న.. పాప”, “నేనిలా.. తానలా..”, “నింగికి దూరంగా.. నేలకు దగ్గరగా..” అనే నాలుగు కవిత్వ పుస్తకాలపై విశ్లేషణ ఈ గ్రంథంగా రూపుదిద్దుకుంది.
మణిబాబు, కామేశ్వరరావు ఇద్దరికీ అత్మీయులైన మధునాపంతుల సత్యనారాయణమూర్తి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి “ఎంతో వేగంగా చదివి, వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చి, దాన్ని గ్రంథస్తం చేయగలగడం చాలా ఆశ్చర్యమే కాదు అరుదైన విషయం. మణిబాబు కవిత్వంపై ఉన్న ప్రేమే ఈ గ్రంథాన్ని తీసుకువచ్చింది” అని అన్నారు.
“రోజులో ఉద్యోగం పూర్తయ్యాక మిగలిన జీవితమంతా పరిశీలన, విశ్లేషణ, అవగాహన అనే మూడు పంగలతో సాహిత్యంతోనే గడిపే మణిబాబు గురించి కామేశ్వరరావుగారు పుస్తకం వ్రాయడం మా అందరికీ ఒక పండుగే” అని ఆత్మీయ ప్రసంగం చేశారు, డా. కాళ్ళకూరి శైలజ.
ముక్కామల చక్రధర్, బొల్లోజు బాబా, మాకినీడి సూర్యభాస్కర్, సి.ఎస్., మార్ని జానకిరాం చౌదరి, రామకృష్ణ శ్రీవత్స, రాజా రామవరపు – మణిబాబు కవిత్వ పంక్తులను, వాటిని కామేశ్వరరావు విశ్లేషించిన విధానాన్ని ఆసక్తికరంగా వివరించారు. “మణిబాబు కవిత్వం బంగారు పళ్లెం అయితే, కామేశ్వరరావుగారు గోడగా నిలిచి ఆ కవిత్వపు కాంతిని అందరికీ కనబడేలా చేశారు. ఇలాంటి ప్రోత్సాహం ఉంటే నాలాంటివాళ్లూ కలం కదిలిస్తాం!” అని నవ్వులు పూయించారు, ఎస్.కె. మోహనరావు.
“ఇంతవరకూ చేసిన నా సాహిత్య ప్రయాణాన్ని వెనక్కి చూసుకునేలా, పాఠకుడికి మరింత చేరువకాగలిగేలా ఈ గ్రంథం దిక్సూచిలా ఉపకరిస్తుంది” అంటూ కృతజ్ఞతాపూర్వకంగా మణిబాబు తన స్పందన తెలియజేసారు.
కామేశ్వరరావుగారు త్వరలో ఇంతవరకూ తాను చేసిన అనువాదాలు, యత్రానుభవాలు, ఇతర కవుల కవిత్వ విశ్లేషణలు ప్రచురించనున్నట్లు తెలియజేశారు. ఏడు పదులు దాటిన వయసులో వారి కృషి, ఉత్సాహం, ప్రణాళికలు అందరికీ ఆదర్శమని వక్తలందరూ ప్రశంసించారు.
ఒక సాదాసీదా పుస్తకావిష్కరణ సభలా కాక, ఒక సాహిత్య కుటుంబం కలసి కూర్చుని స్మృతులను పంచుకున్న ఉత్సవం. వక్తలు పలకరింపులు, జ్ఞాపకాలు, అనురాగపు మాటలు – అన్నీ కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశంలా మారాయి. అరవై మంది పైగా పాల్గొన్న ఈ సభలో ప్రతి ఒక్కరూ ఒకే భావనతో వెళ్ళారు – “మణిబాబు కవిత్వం మనసుకు చేరువైంది, పెండ్యాల గారి సమాలోచన దానికి ప్రతిధ్వనిగా నిలిచింది”.
‘అతడిలా అర్థమయ్యాడు’ – అనే ఈ గ్రంథం కేవలం ఒక విమర్శా రచన కాదు, అది స్నేహం – సాహిత్యం – కవిత్వం మూడింటి సంగమం. కాకినాడ సాహిత్య వేదికకు ఇది ఒక మధురమైన జ్ఞాపకం.
