[ప్రముఖ కవి, విమర్శకులు, అనువాదకులు వంశీకృష్ణ గారు రాసిన ‘Seven Saris of the Sun’ అనే ఇంగ్లీష్ కవితని తెలుగులో అనువదించి ‘అతని కానుక!’ పేరిట అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి.]
~
సున్నితమైన ప్రాతః కాలపు చివరి క్షణాలలో,
ఆమె వేళ్ళు తెల్లని ముగ్గు పిండిని
రాతి లాంటి భూమిపై
నక్షత్ర గుంపుల్లాగా
అల్లుకుంటూ పోతాయి
~
ఆ క్షణాల్లోనే ఆమె గొంతు
భూపాలరాగంతో
శీతల ప్రవాహమై
మత్తుగా ఉన్న భూమిని
నిద్ర లేపుతుంది!
~
ఇక సరిగ్గా మిట్ట మధ్యాహ్నానికి
ముందరి ఘడియల్లో,
చిక్కని గాఢమైన చికోరీ కాఫీ
ఆవిరి పొగలు ఇల్లంతా
అద్భుతమైన రుచిగా కలి తిరుగుతూ ఉన్నప్పుడు,
వేయించిన కాఫీ గింజల సువాసనల మధ్య
వాళ్ళిద్దరి చూపులు అర్థవంతంగా కలుసుకుంటాయి!
~
అప్పుడిక అంతులేని
లాలిత్యం నిండిన
నీలాంబరి రాగంలో,
కాలం తన పదధ్వనులని
తానే తన్మయత్వంతో వింటూ ఆగిపోతుంది!
~
మధ్యాహ్నం ముగిసిపోతూ
ఉన్నప్పటి నీడలన్నీ
కరిగిపోతున్న సమయంలో,
ఇక ఆమె మధ్యమావతి రాగాన్ని
దహించే ఎండలోకి చల్లగా వదులుతుంది!
~
ఆమె నిర్మలమైన స్వరం
రోజంతా అటూ ఇటూ
ఆందోళనగా పరుగులెత్తిన
కాలాన్ని ప్రేమగా ఆపి,
నిదానంగా ఆ ప్రశాంత క్షణాలకి కట్టిపడేస్తుంది!
~
ఇక గోధూళివేళ,
సంధ్యాకాలపు నీలివర్ణం
తన మడతలను నిదానంగా విప్పుతుంది!
అతడు మల్లె పరిమళాల తీవెలను
చంద్రుడి నుంచి జాలువారిన
వెన్నెల పూలతో స్వరాలుగా
అల్లి ఆమెకివ్వడానికి సిద్ధమైపోతాడు!
ఆ ప్రియ రాగాలను
ఆమె భుజాల చుట్టూ
ఎంతో ఇష్టంగా శాలువలా కప్పుతాడు!
అప్పుడామె
“ప్రియా ఈ సప్త వర్ణ రాగాలను
ఎంతో ప్రేమగా సమకూర్చుకున్నదే కదా
మన ఈ జీవితం?” అంటూ
అతని మణికట్టు నల్లని వంపుని
తన పెదాలతో స్పర్శిస్తూ గుసగుసలాడుతుంది!
~
ఆమెలోని వెలుగును ఓపికగా
నీడలా వెంబడించిన అతడు
తన జేబులోంచి వెచ్చని పాల మీద
తేలే తెల్లని నురుగులాంటి
మెత్తని కాగితాలతో ఉన్న
చిన్న పుస్తకాన్ని తీసి ఆమె చేతుల్లో ఉంచుతాడు!
~
ఆమెకి అతని నుంచి అందిన
మాటలే లేని కానుక అది!
ఆమె చేతి వేళ్లు ఆ
పలుచని కాగితాలను
మెల్లగా విడదీయగానే
ఏమీ రాయబడని ఆకాశపు
చిన్న తునక ఒకటి
నిశ్శబ్దంగా ఆమె ఒడిలో వాలిపోతుంది!
~
అచ్చం అతనిలా!
ఆంగ్ల మూలం: వంశీకృష్ణ
అనువాదం: గీతాంజలి
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ . ఫోన్: 8897791964
