Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అతనూ – ఆమెల యాత్రా సంగీతం!

[గీతాంజలి గారు రచించిన ‘అతనూ – ఆమెల యాత్రా సంగీతం!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

నువ్వేమీ నీ గ్రహాన్ని విడిచి
దూరాలు నడుచుకుంటూ రానక్కరలేదులే.
సముద్రాలు కూడా ఈది రాకు.
నీ ఆకాశంలో నువ్వుండు చాలు!
కాస్త నాకు కనిపిస్తూ!
ఎప్పుడైనా మేఘాలతో అన్నా సందేశం పంపకూడదా?
అంటుంది ఆమె రహస్యంగా గుసగుసగా, బోలెడంత ఆశగా!
మరింత కరడుగట్టి అతను ఆమె ఆకాశాన్ని దాటిపోబోతాడు!
ఆమె తనలోనే ఉందన్న సంగతి మరిచిపోయినట్లు నటిస్తాడు!
*
అలా అతననుకుంటాడు!
కానీ, మన నుంచి వెళ్లిపోయిన వాళ్ళు,
పూర్తిగా వెళ్ళిపోరు.
కొంచెం మనలో మిగిలిపోతారు.
వెన్నెల అంటిన ఆకాశంలా,
చెమ్మబారిన మేఘంలా,
పరిమళాన్ని కోల్పోని పువ్వులా,
ఆగిపోయాక కూడా వినిపించే రాగంలా,
కంటిలోని చెమ్మలా,
దేహంలోని హృదయంలా,
రాత్రుళ్ళు వచ్చే కలల్లా,
వాళ్ళలా లోలోపల మిగిలి పోతుంటారు.
*
సగం మిగిలిన రాత్రిని, కొన్ని పగిలిన కలల్ని
దోసిళ్ళల్లో నిర్లక్ష్యంగా జార విడిచి,
మళ్ళీ నిద్రపోమ్మని కనురెప్పల్ని
బలవంతాన మూసేసి వెళ్ళిపోతుంటారు.
వొట్టి నిర్దయులు!
*
కానీ, వాళ్లకేం తెలుసు?
వాళ్లే రాత్రిలోకి చొరబడి నిద్రని అవహిస్తుంటారని?
కళ్ళల్లోకి కలల్ని నింపుతుంటారని!
చివరి నక్షత్రం మిగిలిన ఆకాశంలా,
వెన్నెల మరకలు అంటిన అడవిలా,
ఎంతకీ తగ్గని నొప్పిలా
కలత రేపుతుంటారనీ!
*
పోనీ, వెళితే వెళ్లులే!
నువ్వు యాత్రలకి వెళ్ళినప్పుడన్నా
నన్ను మర్చిపోకు అంటుందామె!
ఎలా మర్చిపోతాను?
నువ్వు నాలోనే కదా ఉన్నది?
నువ్వే నా యాత్రవి అంటాడతను!
ఆమెతో కాదు తనలో తాను!
అయినా నిన్నూ, యాత్రని రెంటినీ మరిచే చోటు
కాస్త నువ్వే చెప్పు అని కూడా అంటాడు దీనంగా తల నేలకి వొంచేస్తూ!
కనులు కలపలేక మూటా ముల్లె సర్దుకొని వెనక్కి కూడా
తిరిగి చూడకుండా తడబాటు అడుగులతో వెళ్ళిపోతాడు!
*
కఠినాత్ముడతను!
ఆమెకి రాగాలు వినడం అలవాటు అయ్యాక
అతను వీణను విరగ్గొట్టి అజ్ఞాతమైపోయాడు!
ఆమెని నిదుర లేపిన అతను, మెలకువ వచ్చి
తనని వెతుక్కుంటున్న ఆమెకి కనిపించకుండా వెళ్ళిపోతాడు!
*
అయినా,
ఎలా మిగిలి పోయాడతడలా నాలో?
అని ఆమె తన ఆత్మలోకి , దేహంలోకి,
వెతుకులాడుతుంది అతన్ని పట్టుకోవడానికి!
దొరికీ, దొరకడతను!
చివరికి కలత నిదుర లోని
కలలోకి వచ్చిన అతన్ని పట్టుకుని
ప్రాధేయపడుతుంది ఆమె!

అతని కనులని అధరాలతో మూసేస్తుంది
తను తప్ప బయటి లోకం కనపడకుండా!
దయలేని వాడు కదా! ఆమెకి మెలకువ తెప్పించి
కలలోంచి కూడా పారిపోతాడతడు.
ఆమెకిక దుఃఖం ఆగదు!

దుఃఖమూ ఆమెను ఆపదు!
అతను పంపిన పాత రాగాల పెట్టెని
తత్తర పడుతూ, తెరుస్తూ, మూస్తూ ఆలాపనై పోతుంది.
అతని పాటలు వింటూ ఒకసారి, ఆపేస్తూ మరొకసారి,
కన్నీటి అలల్లో తేలుతూ ఉండి పోతుంది.
తనని తాను అతని విరహంలో, అతని మీది ఆగ్రహంలో
మగ్గబెట్టుకుంటూ ఉంటుంది!
కానీ ఆమెలోంచి అతని పాట పోదు,
అతనూ పోడు!
*
ఆమెకు తెలుసు!
అక్కడెక్కడో రాగాలతో
గాయాలు చేసే మనిషి కూడా నిదురపోడని!
ఆమె వినడాన్ని, వినక పోవడాన్ని
అతను కూడా దూరాలనుంచి
తన నిద్ర పట్టని రాత్రుళ్ళ
కిటికీల్లోంచి వింటూ ఉంటాడని!
చాలా సార్లు ఆమె దాకా వచ్చి తలుపు తట్టి,
ఆమె తలుపులు తెరిచే లోపలే తప్పించుకు పోతాడని!
వెక్కిళ్లు అదిమిపెడుతోన్న అతని దుఃఖ ధ్వనులను
ఆమె నిశబ్దంలో వింటూ ఉంటుంది!
*
ఇక ఇక్కడ ఆమెని మరవాలనుకున్న అతను
పాట వినిపించి ఉలిక్కిపడతాడు,
తను ఆమెలోంచి తెంచేసిన రాగలెట్లా
బతికి వచ్చాయో అని కంగారు పడతాడు!
తన యాత్ర దారి సరిగ్గా ఉందో లేదో అని
తన పాదాల వైపు చూసుకుంటాడు.
వీధి మలుపులు వెతుకుతాడు.
ఎండలో కాగుతాడు.
వర్షంలో చిత్తడవుతాడు.
చలి తుఫానులో మిగిలిన చిట్ట చివరి ఎండుటాకులా ఎగిరి పోతాడు!
ఎడారి పూల ముళ్ళతో దేహాన్ని రక్తసిక్తం చేసుకుంటాడు.
తన లోపలి రాగాల తీవెలను నిర్దాక్షిణ్యంగా
తెంపేస్తూ ముందుకు వెళుతుంటాడు.
తన నుంచి తాను పారిపోతూ పరిగెడుతూ ఉంటాడు!
దిక్కులు తెలీక తన్లాడుతుంటాడు.
*
అయినా ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది.
చివాఖరుకి తనలోంచే ఆ పాట వినిపిస్తోంది అని తెలుస్తుంది.
నిర్ఘాంత పోతాడు!
తానే కదా ఆమెకి రాగాలను అలవాటు చేసిందీ అనుకుని
కాసింత సిగ్గు పడతాడు.
ఆమెకి తానంటించిన ప్రేమ సుగంధపు రుచి
అతని శ్వాసలో కూడా నిండిపోతుంది!
అప్పుడతని యాత్ర అసంపూర్ణమవుతుంది.
ఆమెని పొందలేకపోవడమే
ప్రేమ అనీ,
ఆమెను పొందని నడకే యాత్ర అనీ అతనికి అర్థం అవుతుంది!
ఆమెకి లొంగిపోవడం ప్రేమ కాదనీ అహంకారపడతాడు.
ఆమెని పోగొ ట్టుకుంటానేమో అని భయపడతాడు కూడా!
అద్దంలో తన లోపలి పిరికివాడి
మొహాన్ని చిరాకుగా తుడిచేస్తూ ఉంటాడు!
~
ఇకప్పుడు యాత్ర పరమార్థం
ఆది నుంచీ అంతం దాకా, ఆమెతో సహా,
తనకు తానుతో సహా ఏదీ, అందీ, అందక పోవడమే అని అర్థం అయ్యాక
ముందుకు అడుగు పడక, వెనక్కి వెళ్ళనూ లేక అతను ఉన్న చోటనే శిలై పోతాడు!
*
ఇటు యుగాలుగా నిరీక్షించి అలిసిన ఆమెకీ,
అతనిక భౌతికంగా అవసరం లేదు!
దరికి చేరుకునేంతలోనే దూరమై పోయే
ఈ అనంతమైన పునరావృత యాత్రే,
చివరాఖరికి
అతని వియోగమే,
తనకి దక్కిన ప్రేమ అని అర్థం అవుతుంది ఆమెకి!
ఆమె అతని పాటలోనే, బహుశా
పాటని మరిచి నిశబ్దమైపోతుంది!

Exit mobile version