[ఉద్యోగ విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ బానోత్ స్మృతిలో, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ అజమ్ రచించిన ‘అటవీ అమరుడా.. నీకు నా వందనం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
అమరుడా.. నీకు సలాం!
అడవుల రక్షణ కోసం
నిరంతరం సాగించిన
నీ పోరాటానికి సలాం!
అడవిలో రోదిస్తూ,
ఆకలికి మట్టినే బువ్వగా భావించి,
దప్పికకు వాగునీటినే తాగి,
అలసటను లెక్కచేయక
సాగించిన నీ అటవీ పోరాటానికి
ఓ సలాం!
చెట్టు.. పుట్ట..
ప్రతి జీవిని కాపాడటమే
నీ కర్తవ్యంగా భావించిన
నీ నిబద్ధతకు వందనం!
నీ శ్వాసే అడవి..
నీ శ్వాసే జీవజాలం..
అడవి కోసం పోరాడుతూ
నీ ఆరోగ్యాన్ని సైతం మరచిన
నీ త్యాగానికి సలాం!
ప్రకృతిపై ప్రేమలేని ఈ లోకంలో
చెట్లకూ.. జంతువులకూ
హాని చేసే వారిని ఎదిరించి,
వాటిని కాపాడిన
నీ ప్రయత్నానికి
నా హృదయపూర్వక వందనం!
నీ పోరాటానికి..
నీ పట్టుదలకు..
నీ ధైర్యానికి..
నా హృదయపూర్వక వందనం!
నీ కుటుంబాన్నే
ప్రకృతిగా భావించి,
నీ ఇల్లాలిని..
నీ సంతానాన్ని వదిలి,
పగలూ.. రాత్రీ..
నిద్రను మరచి
అడవిని కాపాడిన
నీ బాధ్యతకు వందనం!
అడవిలో పోరాడుతూ
ప్రకృతి కోసం
నీ ప్రాణాన్ని సైతం
త్యాగం చేసిన
నీ అమర పోరాటానికి
ఓ సలాం!
ఎందరికో స్ఫూర్తినిచ్చే
నీ ఆశయం కోసం
ప్రకృతి ఒడిలో నిద్రించే నీకు
ప్రతి అటవీ ప్రేమికుడు అందించే
అంతిమ నివాళి ఇదే..
అటవీ అమరుడా..
నీ త్యాగం
ఎన్నటికీ మరువలేనిది.
నీ సేవ
మాకు స్ఫూర్తి..
నీ ధైర్యం
మాకు మార్గం..
నీ త్యాగం
అడవికి చిరస్థాయి రక్షణ..
అటవీ అమరుడా..
నీకు ఇదే
నా హృదయపూర్వక వందనం!
