[శ్రీ వేంకట చండీశ్వర్ రచించిన ‘అతడు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
దేని కోసమో అన్వేషిస్తున్నాడు
ఎంతో సౌమ్యంగా మెదలుతున్నాడు
గడ్డం-మీసం పెంచి మారు వేషంలో
ఉన్న ఉద్యమ యోధుడిలా ఉన్నాడు
ఆయుధం లేకుంటే ఏం
తన ఆలోచనలే అంబుల పొదిగా
మనో బలమే జన-ధనువుగా సాగుతున్నాడు
జనతంత్రాన్ని నిరంతరం పరీక్షిస్తూ – ప్రశ్నిస్తూ
ఏ చిన్న అవకాశం దొరికినా
వ్యక్తులను-వ్యవస్థలను మరమ్మతు చేస్తూ
ప్రాణ భీతి- ప్రజామోదాలను అధిగమించి
పది కాలాల పాటు నిలిచే పనులు చేస్తూనే ఉన్నాడు
అతడు మనలాంటి మామూలు మనుషులనుండి
పోతపోయబడ్డవాడు – దశాబ్దాలుగా రాటుదేలి
చరిత్రని సరైన మలుపు తిప్పేందుకు మనలోంచి
బయట పడ్డవాడు
ఏ ఇడుములకూ వెరవని ధీరోదాత్తుడిలా ఉన్నాడు
అలాంటి వారు మన నిత్య జీవితంలో
అప్పుడపుడు తారస పడుతుంటారు
వీలయితే కరచాలనం చెయ్యండి
కుదిరితే హృదయంతో ఆలింగనం చేసుకోండి
మీలో ఆత్మ విశ్వాసం కొండలా పెరుగుతుంది
కొండలు పిండి చేసే బలం మీలోకి ప్రవహిస్తుంది
అల్పులు – అరాచకులు సృష్టించే
అన్ని అడ్డంకులను అవలీలగా
అధిగమిస్తారు – నవ శకానికి నాంది పలుకుతారు
చైతన్య పథాలపై ప్రజా రథాలు పరుగులు తీయిస్తారు
