Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అత్యాశ – అనర్థం

[బాలబాలికల కోసం ‘అత్యాశ – అనర్థం’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

సిద్ధయ్య చెట్లు కొట్టుకుని కట్టెలు అమ్ముకుని బ్రతుకుతున్నాడు. ఒక రోజు పెద్ద ఎండిన చెట్టు ఎక్కి పైన ఉన్న కొమ్మలు కొడుతున్నాడు. కొన్ని కొమ్మలు కొట్టాక చేతిలోని గొడ్డలి జారి కాండానికి ఉన్న పెద్దతొర్రలో పడిపోయింది! చిత్రంగా ఆ కన్నంలో నుండి రెండు గొడ్డళ్ళు బయటికి విసిరివేయబడ్డాయి! సిద్దయ్య ఆశ్చర్యపోయి, జాగ్రత్తగా ఆ తొర్ర లోకి తొంగిచూశాడు. రెండు మెరుస్తున్న కళ్ళు కనబడ్డాయి! తన పంచలో కట్టుకుని ఉన్న జామకాయల్లో ఒకటి తీసి ఆ చెట్టు తొర్రలోకి వేశాడు. చిత్రంగా రెండుకాయలు బయట పడ్డాయి!

సిద్ధయ్య తొర్రలోకి మొహం పెట్టి “లోపల ఎవరు?” అని గట్టిగా కేక వేశాడు. అయినా లోపలినుండి ఏ అరుపూ, జవాబు రాలేదు. సిద్ధయ్యలో ఆశ ఎక్కువ అయిపోయింది!

వెంటనే బయటపడిన జామపండ్లు, పంచెలోని మరికొన్ని పండ్లు, ఐదు రూపాయలు తీసి ఆ తొర్రలో వేశాడు. ఎంతసేపు ఎదురు చూసినా తను వేసిన పండ్లు, ఐదు రూపాయలు రెట్టింపు అయి రాలేదు!

ఉన్నవన్నీ పోయేసరికి సిద్ధయ్య లబోదిబోమన్నాడు. కళ్ళింత చేసి తొర్రలోకి చూడసాగాడు.

“సిద్ధయ్యా, నా పేరు ఆశారాజు, నేను కొన్ని వందల సంవత్సరాల క్రితం అతి ఆశతో బతికేవాణ్ణి. ఎక్కడి వస్తువులు, ధనం నాకే కావాలని అనుకుంటూ బ్రతికేవాణ్ణి. ఒక రోజు ఒక ముని నేనున్న ఊరికి వచ్చి అవసరమున్న వారికి తన కమండలంలోంచి నీళ్ళు చల్లి కొంత డబ్బు, శుభం కలిగించే మంచి మాటలు చెప్పి పంపసాగాడు. నాకు కూడా శుభాలు కలిగించే మంత్రాలు వ్రాసి ఉన్న తాళపత్రాలు ఇచ్చి రోజూ చదువుకోమన్నాడు. కానీ వాటితో నాకు తృప్తి కలగలేదు. ఆ ముని కమండలం దొంగలిస్తే, నేను కోరుకున్నవన్నీ దానిలోని జలంతో సృష్టించుకోవచ్చునని అత్యాశతో దుష్టపన్నాగం పన్ని ఆ ముని ఏదో పనిలో ఉన్నప్పుడు ఆ కమండలం దొంగలించాను. ముని తన తపఃశక్తితో ఆ విషయం తెలుసుకుని, నాకు అత్యాశ ఉంది కనుక ‘అత్యాశ రాక్షసుడి’గా అయిపోయి చెట్టు తొర్రల్లో బతకమని శపించాడు. నేను ఆయన కాళ్ళమీద పడి నన్ను శాపవిముక్తుణ్ణి చేయమని ప్రార్థించాను.

‘నీ శాపం వెంటనే వెనక్కు తీసుకోలేను, చేసిన తప్పుకి శిక్ష అనుభవించల్సిందే. ఎవరైనా నీవు కల్పించే అత్యాశను జయిస్తే నీకు శాప విముక్తి కలుగుతుంది’ అని చెప్పాడు. అప్పటి నుండి నేను ఎంతో మందికి అత్యాశను కల్పిస్తున్నాను. కానీ ఎవ్వరూ అత్యాశను వదులుకోలేక పోతున్నట్ఠు నాకు తెలిసింది. అత్యాశను వదలి వేస్తున్నట్లు నాకు చెప్పినా వారు అత్యాశను వదలలేక పోతున్నారు. మరి నీవు మారతావా? నీవు మారి కష్టపడి సంపాదించుకుంటే నీకు సంపదలు సమకూరతాయి. నీవు అత్యాశను వదలకపోతే నీ అత్యాశ సంగతి నాకు తెలిసిపోతుంది!” చెట్టు తొర్రలోని ఆశారాజు చెప్పాడు.

“నా తప్పుని క్షమించు ఆశారాజు, నేను బీదవాణ్ణి, నీవు చెప్పింది నిజమే అత్యాశ అనేక అనర్థాలకు మూలం. ప్రతి మనిషి తన ఆశ ప్రకారం సంపాదించుకునేందుకు దేవుడు బుద్ధినిస్తాడు. అత్యాశ అంటే పెడ బుద్ధి అని తెలుసుకున్నాను. నీ మాట ప్రకారం ఈ రోజునుండి అత్యాశతో ఏ పని చేయను. నేను అత్యాశతో ఏమి చేసినా నన్ను నీ శక్తితో శపించు” అని మారిన బుద్ధితో చెప్పాడు.

“నీ మాటను నమ్ముతున్పాను. ఈ రోజు నుండి ఎవ్వరికీ అత్యాశ పరీక్ష పెట్టను. నీవు నిజంగా పూర్తిగా మారిన రోజు నాకు శాప విముక్తి కలుగుతుంది” తొర్రలోని ఆశారాజు చెప్పాడు.

వెంటనే సిద్ధయ్య తొర్రలో వేసిన పండ్లు డబ్బులు యథాతథంగా బయట పడ్డాయి. వాటిని తీసుకుని ఆ తొర్రలోని ఆశారాజుకి నమస్కారం పెట్టి సిద్ధయ్య ఇంటికేసి బయలుదేరాడు.

ఆశారాజు మాయవలన అతనికి దారిలో వెండినాణేలు పడిఉండటం కనిపించింది. కొంత ఆలోచించి వాటిని తీసుకున్నాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి మరికొన్ని బంగారు నాణేలు పడి ఉండటం కనుపించింది. అది అత్యాశకు పరీక్ష అని, ఆశారాజు మాయ అని తెలుసుకున్నాడు. ధృఢ నిశ్చయంతో ఇక అత్యాశకు లోను కాకుండా అడుగులు ముందరికి వేశాడు. అంతే ఆకాశంలో పెద్ద వెలుగు కనబడింది. సిద్ధయ్య అత్యాశను త్యజించడం వలన ఆశారాజుకి శాపవిముక్తి కలిగి చెట్టు తొర్రనుండి బయటపడి ప్రకృతిలో కలసిపోయాడు.

ఆ రోజు నుండి సిద్ధయ్య మారిన మంచి మనసుతో ఏ లోటు లేకుండా తృప్తిగా, హాయిగా బతకసాగాడు.

మనిషికి ఆశ ఉండవచ్చు గానీ అత్యాశ ఉండకూడదు. అత్యాశ అనేక అనర్థాలకు మూలం అవవచ్చు.

Exit mobile version