Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఔదార్యం

[మోహనరావు మంత్రిప్రగడ గారు రచించిన ‘ఔదార్యం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“సరే నువ్వు అన్నట్లు మనం పెళ్ళి చేసుకోవచ్చు. ఎలాగు నీకు జాబ్ దొరికింది కదా, కాని నాదో సలహా. ఈ సంగతి మీ అమ్మగారికి కూడా చెపుదాం. ఆవిడ సలహా కూడా తీసుకొందాం” అంది నీరజ.

“షిట్. నాన్సెన్స్. మధ్య ఆవిడెందుకు? పెళ్ళి చేసుకోబోయేది మనం కదా” కోపంగా అన్నాడు రవి.

“అది సరే కాని, నా ఉద్దేశం వారిని కూడా సంప్రదిస్తే మంచిదని” ఆగింది నీరజ.

“నాకిష్టం లేదు. ఆవిడంటే నాకు పడదు” అన్నాడు రవి గట్టిగా.

“అదేంటి రవీ? కన్నతల్లి.. చిన్నప్పటినించి పెద్ద చేసింది, మీ తండ్రిగారు లేకపోయినా నిన్ను ఈ స్టేజికి తీసుకొచ్చింది, ఆవిడంటే ఇష్టం లేదా, నిన్న కాక మొన్న కలసిన నేనంటే బాగా ఇష్టం అంటున్నావు. కాని ఇంతకాలం పెంచిన తల్లంటే ఇష్టం లేదంటున్నావు. రేపు ఏ కారణం చేతైన నేనంటే ఇష్టం పోయిందనుకో, అప్పుడు నేనేం చెయ్యాలి?” అడిగింది నీరజ.

“అలా ఎందుకవుతుంది? నువ్వంటే నాకు బాగా ఇష్టం అని చెపుతున్నాను కదా.”

“సరే, బాగుంది. చిన్నప్పటినించి పెంచిన తల్లంటే ఇష్టం లేదు, మధ్యలో వచ్చిన నేనంటే ఇష్టం అంటున్నావు, దీన్నెలా అర్థం చేసుకోవాలి? ఇదే నీ సంస్కారం అనుకోవాలా? అంచేత నేను మీ అమ్మగారితో మాట్లాడాలంటున్నాను” అని దృడంగా చెప్పింది నీరజ.

“అయితే నువ్వు ఆ మాట మీదే ఉంటే నాకు నచ్చదు, బై”, అని లేచి వెళ్ళిపోయాడు రవి.

చిన్నగా నవ్వుకొని గబగబా నడచుకొంటూ వెళ్ళిపోయింది నీరజ.

***

తిన్నగా రవి ఇంటికి వెళ్ళింది, అప్పుడే ఆఫీసు నించి వచ్చిన రాధమ్మ నీరజని చూసి సంతోషంగా లోపలకి ఆహ్వానించింది.

“ఏం అమ్మాయి? కాయా, పండా?” అని అడిగింది.

“కాయే ఆంటీ” అని జరిగిన సంభాషణంతా వివరించింది నీరజ.

“గుడ్. నువ్వు బాగానే సేవ్ అయ్యావు, నేను ముందే ఎక్స్‌పెక్ట్ చేసాను ఇలా జరుగుతుందని” అంది ఆవిడ నవ్వుతూ.

“నిజంగా మీ ఔదార్యం వల్లే నేను మేలుకోగలిగాను” అంది నీరజ రాధమ్మ రెండు చేతులు పట్టుకొని.

“మేడం, రవిది మొదలునించీ అలాంటి టెంపరమెంటేనా” అని అడిగింది కొన్ని క్షణాల తర్వాత.

“లేదమ్మా. ముందు బాగానే ఉండేవాడు. వాడి మనసులో ఇంత మూర్ఖత్వం ఉందని నేనెప్పుడు ఊహించలేదు. ఉద్యోగం వచ్చాక బాగా మారిపోయాడు, తరచూ నేనంటే ప్రేమ కాని అభిమానం కాని లేనట్లుగా ప్రవర్తించేవాడు. కొంత కాలంగా మాట్లాడటం మానేసాడు. ఉదయం బైటకెళ్ళి మళ్ళా రాత్రే ఇంటికొచ్చేవాడు, భోజం ఎక్కడ తినేవాడో మరి” అందావిడ కొంచెం బాధగా. “ఓసారి నేను ఆఫీసు నించి వస్తుంటే మీరిద్ధరు మాట్లాడుకుంటూ రావడం చూసాను. ఆ తరవాత నీ వివరాలు సేకరించి నిన్ను కలిసాను. నువ్వో అమ్మాయివి. నీ జీవితం నాశనం కాకూడదని నీతో ఆ విధంగా మాట్లాడమని చెప్పాను. ఏమి అనుకోకమ్మా” అంది కొంచం గధ్గద స్వరంతో.

“అయ్యో అమ్మా, అతను మీ కొడుకైనా, నా జీవితం గురించి ఆలోచించిన మీ ఔదార్యం గురించి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మీరు ఓ అమ్మగా కాక ఓ స్త్రీలా ఆలోచించడం నాకిప్పటికీ ఆశ్చర్యంగా ఉంది మేడం” అంది నీరజ.

“అది కాదమ్మా. నాకే ఓ కూతురుంటే ఇలాగే ఆలోచించాలి కదా, అది ధర్మం” అంది రాధమ్మ.

“సరే నా మాట విని నీ జీవితం అభాసు పాలుకాకుండా చేసుకున్నావు కదా. ఇప్పుడు బాగా విజ్ఞతతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో” అంది రాధమ్మ నీరజని హత్తుకొని.

ఇద్దరి హృదయాలు తేలికయ్యాయి. ఆనంద బాష్పాలు ప్రవహించాయి.

Exit mobile version