Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆగస్టు పదిహేను – జయభారతం

[శిరీష పద్మ యర్రంశెట్టి గారు రచించిన ‘ఆగస్టు పదిహేను – జయభారతం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

అంధకారాన్ని చీల్చిన అరుణకిరణమా!
అమరుల రక్తంతో పూసిన పుణ్యధరమా!
శతాబ్దాల సంకెళ్లను తెంచిన స్వేచ్ఛాస్వరమా!
ఆగస్టు పదిహేను – భారత జాతి పునర్జన్మమా!

మీరట్‌ మట్టిలో మిన్నంటిన తిరుగుబాటు జ్వాల.
ఝాన్సీ రణంలో మెరిసిన రాణి ఖడ్గధార.
మంగళ్‌ పాండే గుండెలో మోగిన ధిక్కార నాదం.
అదే స్వాతంత్ర్య విత్తనానికి తొలి మొలకగానం!

తిలక్‌ పలికిన స్వరాజ్యమే స్వాభిమాన శంఖం.
లాల్‌-బాల్‌-పాల్‌ గర్జనే జనచైతన్య తంత్రం.
చరఖా తిరిగిన చోట స్వదేశీ దీపం వెలిగె..
ప్రజల గుండెల్లో స్వాతంత్ర్య స్వప్నం మొలిచె!

సబర్మతి తీరాన సత్యం అడుగులు వేసె..
దండి దారిలో ఉప్పు పిడికెడు పిడుగై మ్రోగె.
అహింస చేతిలో ఆయుధమై సామ్రాజ్యం వణికె.
ఒక మహాత్ముని అడుగుతో చరిత్ర దిశ మారె!

భగత్‌సింగ్‌ నవ్వులో విప్లవాగ్ని మెరిసె..
రాజ్‌గురు–సుఖ్‌దేవుల త్యాగదీపం వెలిగె.
సుభాష్‌ సింహనాదం సైన్యమై ముందుకు సాగె..
“ఢిల్లీ చలో” పిలుపుతో దాస్యపు గుండె దడదడలాడె!

నలభై రెండులో నేలంతా నినదించిన నాదం..
నరనరాన నిండె స్వేచ్ఛా దీక్షా ప్రవాహం.
కారాగార గోడలెన్ని కట్టినా ఏమి లాభం???
ప్రజల గుండె చప్పుడు ఆపగలదా సామ్రాజ్యం?

చివరికి అర్ధరాత్రి ఆకాశం వెలిగె.
త్రివర్ణ పతాకం స్వేచ్ఛా గీతమై ఎగిరె..
కానీ విజయవేళలో విభజన గాయం మిగిలె.
స్వాతంత్ర్యంతో పాటు మానవత్వం విలువ తెలిసె.

నేడు పరాయి సంకెళ్లు మన చేతుల్లో లేవు..
కానీ అజ్ఞానపు నీడలు ఇంకా పూర్తిగా పోలేదు.
అవినీతి, అసమానతల గోడలు కూలవలసిందే..
స్వేచ్ఛకు సార్థకత కర్తవ్యంతో రావలసిందే!

రైతు చెమట బిందువే భారత భవితకు ధనం.
కార్మికుని కరశ్రమే అభివృద్ధికి బలం.
శాస్త్రవేత్త మేధయే ఆకాశానికి సవాలు.
యువత సంకల్పమే స్వర్ణభారతానికి వెలుగు!

విజ్ఞానం మన రెక్క, వివేకం మన బలం.
సమత్వం మన నడక, మానవత్వం మన గమ్యం.
స్వావలంబన శక్తిగా, సత్యం మన మార్గంగా..
భారతీయ దృష్టితో విశ్వహితం మన ధ్యేయంగా!

నిన్నటి త్యాగాగ్ని నేటి జ్ఞానదీపమై వెలగాలి.
నేటి కర్తవ్యనిష్ఠ రేపటి వైభవమై నిలవాలి.
యువత సంకల్పం దేశ భవితకు దారిగా మారాలి.
విశ్వవేదికపై భారత కీర్తి శాశ్వతంగా మార్మోగాలి!

పూలతో కాదు – ఆచరణతో నివాళి అర్పిద్దాం.
మాటలతో కాదు – చేతలతో దేశం నిర్మిద్దాం.
అమరుల ఆశయాలను హృదయంలో నిలుపుదాం.
వికసిత, సమైక్య, శక్తిమంత భారతాన్ని నిర్మిద్దాం!

అమరుల రక్తంతో ఉదయించిన స్వాతంత్ర్య సూర్యుడు
మన చేతుల్లో ఎన్నడూ అస్తమించకూడదు.
2047 – వికసిత భారతం దిశగా మన అడుగు సాగాలి.
కలగన్న భారతమే మన చేతుల్లోసాకారం కావాలి!

జై హింద్!
వందే మాతరం!

Exit mobile version