Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆగస్ట్ – మృత్యు మాసం!

[మౌమితా ఆలం రచించిన కవితని ‘ఆగస్ట్ – మృత్యు మాసం!’ అనే పేరుతో తెలుగులో అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of Moumita Alam’s poem ‘August the month of death!’ by Mrs. Geetanjali.]

~
పేపర్ మీద నేను ఆగస్టులో పుట్టినట్లుంటుంది.
పాలిపోయి బలహీనంగా
తక్కువ బరువుతో ఉన్న నన్ను నా జన్మ భూమి నుంచి
కత్తెరలతో బలవంతంగా లాగారు!
నా తల్లికి అప్పుడు రక్తం చాలా పోయింది
ఇంకా పోతూనే ఉంది!
***
ఆమె కడుపు మీది భయంకరమైన కోతలు, గాట్లు ఇప్పటివా?
యుగాల కాలం నాటివి!
అవి అప్పుడప్పుడూ ఉన్నట్లుండి తేడాగా, కరుణ లేని ఊహల్లోంచి,
రాడ్‌క్లిఫ్ దేశవిభజన రేఖ అంత ఎరుపు రంగులో
కాకపోయినా ఖచ్చితంగా అంతే ఎర్రగా కోయబడుతుంది!
***
మా అమ్మ కడుపు కోసి నన్ను బయటకు లాగేటప్పుడే
అంతగా అనుభవం లేని మంత్రసాని
నా ఆత్మని కూడా లాగి చింపి పడేసింది!
నా కవల సోదరి తన అనారోగ్యానికి
నన్ను నిందించింది.
నేనేమైనా ఊరుకున్నానా?
నేనూ ఆమెను శపించాను!
***
మేమేమీ సలీం సినాయి లాగా అర్థరాత్రి పిల్లలం కాదు!
ఏ మాయా మంత్రమూ లేకుండానే నేను 15 ఆగస్ట్ కి పుట్టాను.
కానీ మోయలేనంత మృత్యుభారంతో!
***
ఆమె కడుపు మీది గాయపు
మాంసం పుండుగా మారుతుంది!
నేను నా తల్లి భరించలేని నొప్పితో చేసే
మూలుగుని నిస్సహాయంగా వింటాను!
ఆమె ఇంకా శ్వాస తీసుకుంటోందా లేక
నేనేమన్నా భ్రాంతికి లోనవుతున్నానా?
***
ఓహ్., జెండా ఒకటి ఆమె గొంతులో దిగబడింది!
ఆమె ఇక స్పందించదు.
బహుశా అసలు మాట్లాడలేదు!
ఎందుకంటే ఇది ఆగస్టు నెల!
మృత్యువు కరాళ నృత్యం చేసిన నెల!
~

మూలం: మౌమితా ఆలం
అనుసృజన: గీతాంజలి


మౌమితా ఆలం పశ్చిమ బెంగాల్‍కి చెందిన కవయిత్రి. ధిక్కార స్వరం ఆమె కవిత్వపు ప్రత్యేకత.

Exit mobile version