[డా. కొర్లగుంట సాయి ప్రసాద్ రచించిన ‘ఔరా! ఔరౌర! ఇది ఎంత అద్భుతమ్ము’ అనే పద్య కవితని అందిస్తున్నాము.]
సీ.:
తేనెపట్టును చూడు తెగతెగకు అరలు
అచ్చుగుద్దినట్లు అమరియుండు;
చక్కటి గూడును చిక్కగా నిర్మించు
పక్షిజంటలు మహా ప్రజ్ఞతోడ;
చూడ చిన్నది చీమ ఏడున్నదో శక్తి
రెట్టింపు బరువెత్తు దిట్టముగను;
ఎంత రెక్కల బలం! అంతోటి దూరముల్
వలసపక్షులెగురు అలుపులేక;
తే.గీ.:
అల్పప్రాణుల కేడదీ ఆత్మబలము?
ఏమి నైపుణ్యవైశిష్ఠి; ఇంత తెలివి!
బుజ్జి కూనలు నేర్చె ఏ ‘ఒజ్జ’ కాడ?
ఔర! ఔరౌర! ఇది ఎంత అబ్బురమ్ము!
