తెలుగువారి అదృష్టం వెయ్యేండ్ల సారసత్వం దినదినాభివృద్ధి చెందుతూ పరిఢవిల్లడం. వివిధ ప్రత్యేకతలతో పాటు అవధాన ప్రక్రియ కూడా ఆంధ్రుల సొత్తు.
అష్టావధాన, శతావధాన, సహస్రావధాన ప్రదర్శనలు 20వ శతాబ్ది ఉత్తరార్థంలో అవధాన శేఖరులు పోటాపోటీగా నిర్వహించారు. సాహిత్య సంస్థలు వారిని ప్రోత్సహించాయి. విదేశాలలో సైతం ఈ విద్యకు ఆలంబన లభించింది. తొలినాళ్ళలో రాజాశ్రయంలో, సంస్థానాధిపతుల ఆధ్వర్యంలో పండిత సభలలో ఏర్పాటైన అవధాన ప్రదర్శనలు పాండితీస్ఫోరకంగా కొనసాగాయి.
తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదర కవులు ఇత్యాదులు ‘స్పర్దయా వర్ధతే విద్యా’ అన్న రీతిలో యావదాంధ్ర దేశంలో జైత్రయాత్రలు చేశారు. సన్మానాలు పొందారు. ఆ తరువాతి దశాబ్దులలో సంఖ్యాపరంగా అష్టావధానం పంచ సహస్రావధానం పరిమితికి పెరిగింది. ఒక వినోద సాహిత్యక్రీడగా అది పరిణమించింది.
డా. రేవూరు అనంతపద్మనాభరావు (1947) స్వతహాగా అష్టావధాని. 1968-78 దశకంలో పలు ప్రాంతాలలో అవధాన ప్రదర్శనలిచ్చారు. ‘సంచిక’ ద్వారా లోగడ ‘ఆకాశవాణి పరిమళాలు’, ‘తిరుమలేశుని సన్నిధిలో’, ‘జ్ఞాపకాలు – వ్యాపకాలు’, ‘కావ్యపరిమళం’ – శీర్షికలు సుసంపన్నం చేశారు.
ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు. 120 గ్రంథాల రచయిత అయిన అనంతపద్మనాభరావుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి.
వచ్చే వారం నుండీ ఆస్వాదించండి ‘అవధానం ఆంధ్రుల సొత్తు’ ఫీచర్!