Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అవకాశహీనుడు

[డా. మామిడాల శైలజ గారు రచించిన ‘అవకాశహీనుడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

అప్పటివరకు పచ్చగా కళకళలాడిన పెళ్లి పందిరి ఒక్కసారిగా రక్తసిక్తమైపోయింది. కూతురు పెళ్లిని కన్నులారా చూసుకున్నానన్న ఆనందం ఎంతోసేపు నిలవకుండానే సంజీవ కళ్ళు నిర్జీవాలైపోయాయి. శరీరం వేటకొడవళ్ల దాడికి తునాతునకలైపోయింది. ఒక్కసారిగా వాతావరణం బీతవాహంగా మారిపోయింది. హాహాకారాలు చేస్తూ పెళ్లి జనం పరుగులు తీశారు.

కాసేపట్లో పోలీస్ జీప్ వచ్చి ఆగింది. సంజీవ భార్యా పిల్లల రోదనల మధ్య హత్య తాలూకు పరిస్థితులను ఆరా తీయసాగారు పోలీసులు.

కళ్ళ నుంచి కారుతున్న కన్నీళ్లు గుండెను తడిపేస్తుండగా నిశ్చలంగా అలాగే నిలబడిపోయాను నేను.

“హరిణమ్మ.. మీరు తప్పకుండా పెళ్లికి వచ్చి నా బిడ్డను ఆశీర్వదించాలమ్మా.. మీరు నాకు దేవుడిచ్చిన తల్లి.. ఆ దేవత ఆశీస్సులే నా బిడ్డకు లభించినట్లు భావిస్తాను. మీలాంటి మంచి మనసున్న వాళ్లు ఆశీర్వదిస్తే నా బిడ్డ కలకాలం చల్లగా ఉంటుంది..” సంజీవ మాటలే చెవుల్లో మారుమ్రోగుతున్నాయి..

ఒక్కసారిగా నా మనసులో తుఫాను రేగింది.. మారిన మనిషికి స్థానం లేని సమాజంలో ఇంకా సజీవంగా నిలబడి ఉన్నానా అని నా మనసు రోదించసాగింది. ఎలా ఇంటికి వచ్చి పడ్డానో తెలియదు.. మంచినీళ్ల బాటిల్ అందుకొని గడగడా తాగి తలనొప్పి మాత్ర ఒకటి వేసుకొని సోఫాలో జారగిలపడ్డాను.

మనసు వెనక్కి పరిగెత్తుతూ సంజీవ పరిచయమైన రోజు దగ్గర ఆగిపోయింది.

***

అప్పట్లో నేను వరంగల్ నుంచి నర్సంపేట డిగ్రీ కాలేజీకి కారులో అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. నాతోపాటు నా కొలీగ్స్ ఉండేవారు. నా కారు సీఎన్జీతో నడిచేది. అందుకే భద్రకాళి టెంపుల్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకులో ప్రతి రెండు రోజులకు ఒకసారి సిఎన్జీ నింపుకునే దాన్ని. ఆ పెట్రోల్ బంక్ జైల్లో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో నడిచేది. దాదాపు పన్నెండు, పద్నాలుగు సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించి విడుదలకు దగ్గరగా ఉన్న మరియు క్షమాభిక్ష కోసం వేచి ఉన్న నేరస్తులతో నడపబడేది. సీఎన్జీ ఫిలప్ చేసే దగ్గర పరిచయమయ్యాడు వెంకన్న అనే ఖైదీ.

తీవ్రమైన నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అని తెలిసినప్పటి నుంచి వాళ్ల గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మొదలైంది నాకు. అందుకే వాళ్లతో మాటలు కలిపేదాన్ని. వాళ్లు ఆ నేరాలు చేయడానికి గల కారణాలు తెలుసుకోవడమే కాక, ఆ సమయంలో వాళ్ళ భావోద్వేగాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఉబలాటపడేదాన్ని. వాళ్లు తాము చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందుతున్నారా లేక ఇంకా ప్రతీకారభావాలు ఉన్నాయా అని తెలుసుకోవాలని ఉండేది.

ముందుగా వెంకన్నను పలకరించాను. సిఎన్జీ ఫిల్ చేసి డబ్బులు తీసుకుంటున్న అతన్ని పేరు అడిగాను. ఆ మాత్రం దానికే అతని మొఖం వెలిగిపోయింది. తన పేరు చెప్పి సంవత్సరం నుంచి ఇక్కడ పని చేస్తున్నా అని చెప్పాడు. మిగిలిన డబ్బును ఇవ్వబోగా “పర్వాలేదు ఉండనీయండి” అన్నాను.. ముందుగా వద్దని తర్వాత మొహమాటంగా తీసుకున్నాడు.

ఇంటికి వెళ్తున్న సమయంలో నా కొలీగ్స్ నన్ను పెట్రోల్ బంక్ వర్కర్లతో ఎక్కువగా మాట్లాడవద్దని వారించారు. “వాళ్లతో మాటలెందుకు మేడం.. వారంతా దారుణమైన హత్యలు చేసి వచ్చిన కరడుగట్టిన నేరస్థులు. వాళ్లతో ఏం మాట్లాడితే ఎలా తీసుకుంటారో మన పని మనం చేసుకుని వస్తే బెటర్” అని.

కానీ నేను ఆ మాటలు పట్టించుకునే దాన్ని కాదు. ఎన్నో ఆలోచనలు వేధించేవి నన్ను. బహుశా వాళ్ళు కావాలని నేరం చేసి ఉండకపోవచ్చు అలా చేసేవారైతే ఇంత పొలైట్‌గా ఉండరు. వాళ్ల ప్రవర్తన బాగా లేకపోతే వాళ్లని విశ్వసించి పెట్రోల్ బంకులో పని కల్పించరు జైలు అధికారులు. నేను బాగా గమనించాను, నా చిన్న పలకరింపుకే వాళ్ల మొహంలో వెల్లివిరిసిన ఆనందాన్ని. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే వీళ్ళు నేరస్థులు అని తెలిసిన వారెవరు వీరిని దగ్గరకు రానీయరు. మాటలు కాదు కదా ఆత్మీయ పలకరింపులు అనేవి అసలే ఉండవు. దాంతో వాళ్లు ఒక రకమైన నైరాశ్య భావంతో, ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు. అలాంటిది సమాజంలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి తమను మనిషిగా గుర్తించి, గౌరవంగా మాట్లాడింది అంటే తమను కూడా సమాజంలో గుర్తించే వారు ఉన్నారు అనే ఒక ఆత్మవిశ్వాసంతో కూడిన ఆనందం వారిలో కనబడింది నాకు.

అలా వెంకన్నతో మాటలు కొనసాగించేదాన్ని. నా కారు దూరం నుంచి రావడం చూడడంతోనే “మేడమ్ గారికి కాలేజీకి లేటవుతుంది ఒక్క నిమిషం ఆగండి” అని మిగతా వెహికల్స్ వారికి చెప్పి నా కారులో గ్యాస్ ఫిలప్ చేసేవాడు.

“భోజనం చేశారా? కస్టమర్స్ లేకున్నా ఎంతసేపు అలా నిలబడతారు కాసేపలా కూర్చోవచ్చు కదా”

“మాకు ఇది అలవాటే లేమ్మా.. సార్ ఏం చేస్తారు?” మొదట్లో ఇలాంటి మాటలు నడిచేవి మా మధ్య.

అతని నేరనేపథ్యం అడుగుదామని అనుకొని మళ్లీ అంతలోనే విరమించుకునేదాన్ని. పాత గాయాలను తిరగదోడి మళ్లీ వాళ్లను బాధపెట్టడం అవసరమా అనిపించేది. మామూలుగా “పిల్లలు ఏం చేస్తున్నారు? ఇంటికి ఎప్పుడైనా వెళ్లారా. మిమ్మల్ని చూడడానికి ఎవరు వస్తారు? జైల్లో భోజనం ఎలా ఉంటుంది?” ఇలాంటివి అడిగేదాన్ని.

క్రమక్రమంగా నా కారు పెట్రోల్ బంక్ లోకి ఎంటర్ అవుతుంటే అతని కళ్ళు ఆనందంతో మెరవడం గమనించేదాన్ని.

కొన్ని రోజులు కాలేజీకి సెలవులు వచ్చి వెళ్లకపోతే “ఇన్ని రోజులు రాలేదేంటమ్మా?”అని అడిగేవాడు వెంకన్న. అలా నా మధ్యలో స్నేహబంధం కుదిరింది.

ఇంతలో ఒకరోజు వెంకన్న స్థానంలో ఒక మోస్తరు పొడవుగా, దానికి తగ్గ లావుతో, చామనచాయగా ఉన్న వ్యక్తి సిఎన్జీ  ఫిల్ అప్ చేసే దగ్గర ఉన్నాడు. అతని పేరు అడిగి అతని దగ్గర వెంకన్న గురించి ఆరా తీశాను. తన పేరు సంజీవరెడ్డి అని, వెంకన్నను వేరే పెట్రోల్ బంకు పంపించారని ఆ ప్లేస్‌లో తనను ఇక్కడ నియమించారని చెప్పాడు.

“మీరేనామ్మ హరిణమ్మ మేడం అంటే.. వెంకన్న ప్రతిరోజు మీ గురించే చెప్పేవారు.. మహా దయగల తల్లి అట మీరు. అందరూ అసహ్యించుకొని దూరం పెట్టే మమ్మల్ని ఎంతో ఆదరంగా తల్లిలా పలకరిస్తారట.. ఈ దేవతను చూడాలని ఇన్ని రోజులు ఎదురు చూశాను. నీకు దండాలమ్మ మిమ్మల్ని ఆ యేసు ప్రభువు చల్లగా చూస్తాడు” అని ఆశీర్వదించాడు.

నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను చేసింది ఏముంది? సాటి మనిషి కదా అని కాస్త ప్రేమ పూర్వకంగా పలకరించాను అంతే.. ఆ మాత్రం దానికే అతని అభిమానానికి ఆశ్చర్యపోయాను. ఒక్కసారి నేరం చేసినంత మాత్రాన జీవితాంతం వాళ్లను అదే కోణంలో చూసి హింసించడం ఎంతవరకు సబబు అనిపించింది.

ఆ రోజు నుంచి సంజీవతో మంచి అనుబంధం ఏర్పడింది. నన్ను అమ్మ అని మా వారిని అయ్యా అని మా బాబును తమ్ముడు అని సంబోధించేవాడు. ఉండబట్టలేక అడిగాను ఒకరోజు “ఏ నేరం కింద మీకు శిక్ష పడింది” అని. “మర్డర్ కేస్ అమ్మ.. పొలం దగ్గర పంచాయితీ అయ్యి మా నాయనను అవతలి వాళ్లు కొడితే ఆవేశంలో నేను చేయి చేసుకున్నాను.. అతను అక్కడికక్కడే చనిపోయాడు” అని చెప్పాడు.

తనకు ముగ్గురు పిల్లలు అని అందరూ బాగా చదువుకొని లైఫ్‌లో సెటిల్ అయ్యారని.. కూతురు కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చెప్పాడు. ఇండిపెండెన్స్ డే కు క్షమాభిక్ష పెట్టే వాళ్ళ లిస్టులో తన పేరు కూడా ఉందని ఆ జీవో కోసమే ఎదురుచూస్తున్నానని చెప్పాడు.

సంవత్సరానికి ఒకసారి ఇంటికి వెళ్లి వచ్చే అవకాశం కల్పిస్తారని భార్యాపిల్లలతో కొన్నాళ్లు గడిపి మళ్లీ వస్తాను అని చెప్పాడు. బంధువులు ఇంకా తనని దూరం పెడతారని తన కుటుంబాన్ని ఏ శుభకార్యాలకు పిలవరు అని బాధపడ్డాడు.

ఒకరోజు మా ఇల్లు తెలుసుకొని వచ్చాడు సంజీవ. అతని గురించి మా వారితో ఇంతకుముందు డిస్కషన్ చేసి ఉండడం వల్ల మావారు అదో రకంగా చూశారు నా వైపు, సంజీవను ఎందుకు ఇంటికి రానిచ్చావు అన్నట్లుగా. సంజీవ అలా నేరుగా ఇంటికి వస్తాడని తెలియని నేను గతుక్కుమన్నాను. అతడు వెళ్లిపోయాక మా వారితో ఎన్ని చీవాట్లు తినాల్సి వస్తుందో అని.

సంజీవ మా వారిని, నన్ను, బాబును కూర్చోబెట్టి స్తోత్రాలతో ప్రేయర్ చేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. తర్వాత వెళ్లడానికి లేస్తుంటే నేను స్నాక్స్ తెచ్చి ఇచ్చాను. తర్వాత కాఫీ తాగుతూ ఉండగా మావారు “జైలులో సుదీర్ఘకాలం ఉన్నారు కదా! దాదాపు మీ యవ్వనమంతా అక్కడే గడిచిపోయి ఉంటుంది” అన్నాడు సానుభూతిగా

“అవును సార్. కానీ నేను చేసిన నేరం చిన్నది కాదు కదా.. ఒక మనిషి ప్రాణం తీయడం అంటే మాటలు కాదు.. అతని కుటుంబానికి అతన్ని కాకుండా చేశాను. క్షణికావేశంలో చేసినప్పటికీ అది మహా పాపం కదా” అన్నాడు..

అతని మాటల్లో అంతర్గతంగా ఉన్న తప్పు చేశాననే ఫీలింగ్ స్పష్టంగా కనిపించింది నాకు.

ఒక నేరస్థుడు ఇంటికి రావడం నచ్చని మా శ్రీవారికి సంజీవ మాటలు, మంచి ప్రవర్తనతో కాస్తంత సంతృప్తిని ఇచ్చినట్లు కనిపించి ఊరటగా అనిపించింది నాకు.

జైలులో ఉండగానే డిగ్రీ పూర్తి చేశానని ఖైదీలందరికీ వారంతా సత్ప్రవర్తన దిశగా మార్పు చెందడానికి ఫాస్టర్ గా వ్యవహరించే వాడినని, జైలు అధికారులు తనకు మంచి మద్దతు ఇచ్చేవారని ఖైదీలు అందరిని సమన్వయ పరిచే బాధ్యతను అప్పగించారని, అంతేకాక సత్ప్రవర్తన కింద ముందస్తు విడుదలకు అవసరమైన రికమండేషన్‍కు కూడా సమ్మతించారని తెలిపారు.

చూస్తుంటే మా వారికి కూడా సంజీవ అంటే సదుద్దేశం కలిగిందని అనిపించింది నాకు. మా వారు అడిగారు సంజీవని “ఏం నేరం చేయడం వల్ల శిక్ష పడింది” అని .

ఆ దారుణం జరిగిన రోజును కళ్లకు కట్టినట్లు వివరించాడు సంజీవ. సంజీవ వాళ్ళది ఐనవోలు దగ్గర ఒంటిమామిడిపల్లి. సంజీవ తండ్రి జంగయ్యకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు సంజీవ అయితే, చిన్నవాడు కరుణాకర్. జంగయ్యకు పది ఎకరాల పొలం ఉండేది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న సంజీవకు ఆరు ఎకరాల పొలం, బాధ్యతలు పట్టకుండా తిరుగుతున్న చిన్న కొడుకు కరుణాకర్‌కు నాలుగు ఎకరాలు భూమి రాసిచ్చాడు.

ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతూ ఉండేది. నాయనకు మాయ మాటలు చెప్పి ఆస్తంతా రాయించుకున్నావు. నా పిల్లలకు అన్యాయం చేశావు అని గొడవపడేవాడు కరుణాకర్. భార్య సుధ భర్తకు వత్తాసు పలుకుతూ మమ్మల్ని అన్యాయం చేశావు మాకు రావలసిన ఆస్తిని రాకుండా చేసి నా పిల్లలకు అన్యాయం చేశావు వాళ్ల ఉసురు నీకు, మీ కుటుంబానికి తగులుతుంది” అని దుమ్మెత్తి పోసేది.

ఒకరోజు పొలం గట్టు దగ్గర మొదలైన గొడవ చిలికి చిలికి గాలి వాన అయింది. అక్రమంగా తీసుకున్న భూమిని తిరిగి మేము ఆక్రమించుకుంటాము అని చిన్నాన్న కొడుకులు గట్టు దాటి వస్తుంటే వారిని నిలువరించడానికి సంజీవ చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. వాళ్లు దూకుడుగా గట్టును తవ్వుతూ ముందుకు వస్తున్నారు. ఇలా చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసి వస్తుందని జంగయ్య వాళ్ళని హెచ్చరించాడు.

ఈ గొడవకు పొలాల దగ్గర పనిచేసుకుంటున్న వారంతా చుట్టూ చేరారు.. కరుణాకర్ కొడుకులు సంజీవతో తలపడ్డారు.

జంగయ్య కొడుకును ఆపడానికి ప్రయత్నిస్తుంటే “ఇదంతా నువ్వు చేసిన పనే ఒక కొడుకును ఒక విధంగా మరొక కొడుకును మరొక విధంగా చూస్తావా? వాడే పుట్టాడా నీకు నేను పుట్టలేదా?” అంటూ దూషించడం మొదలుపెట్టాడు.

ఉడుకు రక్తంగల సంజీవరెడ్డి తండ్రిపై వారు వేసే నిందలు తట్టుకోలేక పరుష పదజాలంతో దూషిస్తూ తమ జాగాలో తాము ఉండాలని లేకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు. దాంతో చిన్నాన్న కొడుకులు రెచ్చిపోయారు.. సంజీవతో కలబడ్డారు. మధ్యలో వచ్చిన జంగయ్యను కరుణాకర్ పెద్ద కొడుకు గణేష్ కింద పడి ఉన్న బండరాయి తీసుకుని తలపైన గట్టిగా కొట్టాడు. రక్తం దారలుగా కారుతుండగా కింద పడిపోయాడు జంగయ్య. తండ్రి పరిస్థితి చూసి సంజీవకు కోపంలో ఒళ్ళు తెలియలేదు.. పక్కనే ఉన్న పొలం పనిముట్ల నుంచి గడ్డపార తీసి గణేష్ తల మీద బలంగా ఒక్కవేటు వేశాడు. అంతే అతని నుంచి చిన్న మూలుగు తప్ప మరేమీ రాలేదు. మొదలు నరికిన చెట్టులా కింద పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అప్పుడు గాని తాను చేసిందేమిటో అర్థం కాలేదు సంజీవకు. ఆ సంఘటనతో ఊరు ఊరంతా అట్టుడికి పోయింది.

ప్రాణరక్షణ కోసం క్షణికావేశంలో చేసిన హత్య అని సంజీవ తరపు లాయర్ వాదించినప్పటికీ అతనికి కోర్టు యావజీవ జైలుశిక్ష విధించింది. ముగ్గురు పిల్లలతో ఉన్న భార్య యాదమ్మ కంటికి ముంటికి ఏకధారగా రోదించింది భర్త జైలుకు వెళుతుంటే.

గణేష్ బామ్మర్దులు సంజీవను అడ్డగించి “మా బావను చంపి మా చెల్లెల్ని విధవరాలిని చేశావు. పిల్లల్ని ఒంటరివాళ్లను చేసావు.  ఉరిశిక్ష పడలేదని సంతోషించకు. నీ చావు ఎప్పటికైనా మా చేతుల్లోనే రాసి ఉంది” అని హెచ్చరించారు.

అలా పద్నాలుగు సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. ఊళ్లో పొలం పనులు చేసుకుంటూ ఒంటి చేత్తో పిల్లల్ని సాకి పెద్ద చేసింది యాదమ్మ. పిల్లలకు చదువు బాగానే అబ్బింది మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పెద్ద కొడుకు పెళ్లికి బెయిల్ మీద వచ్చి వెళ్ళాడు సంజీవ.

తిరిగి జైలుకు వెళ్లిన సంజీవకు శుభవార్త తెలిసింది రిపబ్లిక్ డే సందర్భంగా సత్ప్రవర్తన కలిగి ఉన్న ఖైదీల లిస్టును గవర్నర్ గారు ఖరారు చేశారని తెలిసింది. దీంతో జైల్లో పండగ వాతావరణం చోటు చేసుకుంది. ఎవరెవరికి ఆ అవకాశం వస్తుందో అని మాట్లాడుకున్నారు. అంతవరకు తాము కలిసి గడిపిన రోజులను నెమరు వేసుకుంటూ గుండె బరువెక్కించుకున్నారు. సంజీవకు విడుదల లభిస్తుందని దాదాపుగా ఖరారు అయిపోయినట్లుగానే అందరు భావించారు.

అలా చాలా సేపు మాట్లాడాక వెళ్తానని లేచాడు సంజీవ. “కూతురు పెళ్లి కుదరగానే చెబుతాను తప్పకుండా అమ్మను తీసుకొని రావాలి నాయనా!” అని పదే పదే దండం పెట్టాడు.

అలా వెళ్ళిన కొన్ని రోజులకే విడుదలైన సంజీవ కుటుంబంతో సంతోషంగా గడుపుతూ కూతురు పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టాడు. అందరికీ శుభలేఖలు పంచాడు. మాకు కూడా శుభలేఖ ఇచ్చి “అమ్మ మీరు మా పాలిట దేవత.. మీ చల్లని ఆశీస్సులు నా బిడ్డకి కావాలి.” అని పాదాభివందనం చేశాడు. తప్పకుండా వస్తామని మాటిచ్చాము.

కానీ సరిగ్గా పెళ్లి సమయానికి మావారికి ఏదో రిజిస్ట్రేషన్ పని పడడంతో నేను ఒక్కదాన్నే వెళ్లాల్సి వచ్చింది.

***

జరిగిన దారుణం గుండెను కలచి వేస్తుండగా కళ్ళముందు సంజీవ రూపం కదలాడుతోంది.

“అదేంటి అప్పుడే వచ్చేసావ్? పెళ్లి ఎలా జరిగింది ? ఎందుకలా ఉన్నావ్? అసలు ఏమైంది.?” అప్పుడే వచ్చిన శ్రీవారు ప్రశ్నల మీద ప్రశ్నలు రెట్టించి అడుగుతున్నారు.

జరిగిన విషయం వినగానే ఆయన ఒక్కసారిగా ఉసూరుమన్నాడు. “అయ్యో అలా జరిగి ఉండాల్సింది కాదు ఊహించని దారుణం జరిగిందే.. ఆయన ఇప్పటికైనా కుటుంబంతో శేష జీవితం సంతోషంగా ఉంటాడని అనుకున్నాము కదా” అని బాధపడ్డాడు.

లేచి రోజువారి పనుల్లో పడడానికి కూడా నా మనసు అంగీకరించడం లేదు. ఏ పని చేయాలన్నా చేతులు రావడం లేదు సంజీవ రూపమే కళ్ళల్లో మెదులుతూ ఉంటే కళ్ళల్లో మాటిమాటికి నీళ్లు చిప్పిల్లుతున్నాయి. తన తప్పును తెలుసుకొని మారినప్పటికీ అతని గతం మాత్రం అతన్ని వదలలేదు.

సమాజపు పోకడ, న్యాయ వ్యవస్థ పనితీరుపైన నాలో అంతులేని ప్రశ్నలు ఉదయించాయి. క్షణికావేశంలో చేసిన తప్పుకు జీవిత కాలం శిక్ష సరైనదేనా? కొన్ని తప్పులను శిక్షతో కాదు హృదయమార్పుతో నయం చేయాలి అని ఎప్పుడు ఆలోచిస్తుందీ సమాజం. మారిన మనిషికి మరొక అవకాశం ఇవ్వాలని సమాజ జీవన స్రవంతిలో కలుపుకోవాలనే పరివర్తన మనుషులలో ఎప్పుడు కలుగుతుంది?

అంతు చిక్కని ప్రశ్నల అలజడిలో నా మనసు చిక్కడిపోయింది.

(అయిపోయింది)

Exit mobile version