[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘అవకాశం అంటూ వస్తే’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
గదిలోని చీకటి
మదిలోని నిరాశతో పాటు
రంగు వెలిసిపోయిన భవిష్యత్తు
రాజ్యమేలుతోంది నా చుట్టూ
తలుపు తట్టిన చప్పుడయ్యింది
నీరసంగా కదిలి ఆ నీడల్లోంచే చూసాను
గడపవతల ‘అవకాశం’
హడావిడి పడుతూ నిలుచుని ఉంది
ఉండనా.. మరి వెళ్ళనా అని అన్నట్టు
తన చేయందుకున్నాను
అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా
నా మీదకు లాక్కున్నాను
నిర్లజ్జగా నిర్మొహమాటంగా నిస్సంకోచంగా
అలికిడి ఏదో ఐతే
అలా భుజం మీంచి వెనక్కి చూసా
చీకటిని.. నిరాశను
బలవంతంగా బయటకు నెట్టేస్తూ
మిలమిల మెరిసిపోతోంది
మెరుగుబంగారంలా నా భవిష్యత్తు
చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
