[మరింగంటి సత్యభామ గారు రచించిన ‘అవనిలో త్రిమూర్తుల సంచారం’ అనే కథని అందిస్తున్నాము.]
వేసంగి గాళ్పు కాలం అని ఎవరన్నారు? ఆమని రాకడే చల్లని పవనాలతో.. ఆహ్లాదంగా తరువుల నిండుగా విరులతో లేలేత మాకంద పల్లవాలతో.. గుత్తులు గుత్తులుగా.. పువ్వుల పరిమళాలతో.. చిరు వగరు పిందెలలో.. లోకం ఆహ్లాదకరంగా ఆనందమయంగా ఆమని వసంతాగమనాన్ని ఆహ్వానిస్తూ పిక కూజిత మధుర స్వరాలతో .. ప్రకృతి మాత సుందర దరహాసాలతో ఉల్లాసాన్ని తెచ్చే వసంతకాలం, తీయని, పుల్లని మామిడి కాయలలో, పళ్ళతో గ్రీష్మఋతు ప్రవేశం!
అసురు ఉసురు అనిపించే భానుని ప్రతాపాన్ని చూసి భయపడినా.. మనసులో మమకారమే గ్రీష్మo అంటే!
లేలేత తాళముంజెలు, ఆ నీరు, కొబ్బరిబొండాం నీటితో తాపం తీరి, ఆ చల్లని రుచి మరువము! లేత ఎరుపురంగులో తియ్యని నీరు ఊరి పుచ్చపండు ముక్కలు.. రసం, లేలేత ఎరుపు, పసుపు, వర్ణంలో దాహం తీర్చే కరబూజ ఫలం, మధ్యలోనేను ఉన్నా నోచ్.. అంటూ చవులూరించే తియ్యని పాలసపోటా.. పసిపిల్లలు చప్పరించి తన్మయులౌతారు..!
ముళ్ళల్లా పెద్దగా ఉద్భవించానని బెదురుతున్నారా! ఆ భయం వద్దు! అని అభయం ఇచ్చే స్వర్ణ కలశం పనస పండు! సువర్ణ వర్ణ శోభిత! తన కుక్షిలో ఫలాల తోనలు విత్తులు దాచుకుని ముసి ముసి నవ్వులతో రండి!
ఆరగించి తరించండి! అని ఆహ్వానిస్తుంది.
మీరేనా? మరి నేనో! పెద్ద పెద్ద వాన చినుకుల వంటి ముత్యాలతో తెలుపు లేత ఎరుపు పెద్ద తొనలతో మందహాసాలతో దరికి వచ్చే పంపర పనస! లోపల పెద్ద తొనలు తియ్యగా!
డొప్ప పడవలు.. పిల్లల ఆటలకి.. ఇంకా తాటి గిలకలు తాటి కాయ సవారీ తయారీ!
శలవుల్లో పిల్లల మహా సందడి, తీరిక లేని ఆటలతో! ఉదయం అల్పాహారం పెరుగన్నం, ఆవకాయ ముక్క,ఇంకా ఇడ్లీ, దోసె, మినపరొట్టె ఆవపిండి అద్ది తింటే ఆ రుచి వహ్వా! వహ్వా!
భోజనాల వేళ ఆడి పాడి అలిసిపోయే పిల్లలు ఇంట, బైట పనుల్లో వేసారిన పెద్దలు అందరూ వంట గదిలో రెండు వరుసలుగా కూచుని అన్నపూర్ణని తలచి నమస్కరించి పళ్ళెంలో పసుపు వర్ణంతో ముద్దపప్పు విరిసిన మందారం రంగులో ఎర్రెర్రని ఆవకాయలో మామిడి ముక్క. ,ఘుమ ఘుమ లాడే నెయ్యి ఒక పక్క వెన్నముద్ద, తెల్లని మల్లెపువ్వులా వేడి వేడి అన్నం చూడగానే ఆకలి విజృంభించదూ!
అందులోకి ఆధరువు.. అప్పడం., వడియం, చిక్కని మజ్జిగ పులుసు.. పల్చని రసం పెరుగన్నంలో ఆవకాయ నములుతూ, దేవుడా! ఈ రుచులు ఎలా స్పష్టించావయ్యా! ఎప్పుడైనా ఆరగించావా! నీవు రుచి చూసి ఉండవులే! ఆ చవులు తెలిస్తే స్వర్గం అమృతం వదలి భూలోకానికి రావా! ఇల పైనే ఉండి పోవా! నీ మీద నాకు చాలా జాలిగా ఉంది. స్వామీ! వేసంగిలో ఒక పర్యాయం.. వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకం నుండి ముగ్గురూ దేవేరులలో కలిసి భూలోకానికి రారాదూ! ఒక మాసం మకాం వేసి అన్ని రుచులూ చవి చూడవచ్చుగా! ఆవకాయల్లో ఎన్నెన్ని రకాలు! అన్నీ భిన్న రుచుల మయమే ! రక రకాల రుచులు ఆస్వాదించవచ్చు!
శ్రీ మహలక్ష్మి, సర్వమంగళ, అక్షరాంబిక వచ్చి చూస్తే ఆ అంబలను ఆవకాయ పట్టడం నేర్చేదాకా వదుల్తారా స్వామీ!
ఇలా భువిలో మాక౦ద ఫల రసా స్వాదనలు నిరంతరం జరిగే వేళ నారద ముని భూలోకం సందర్శించి బహు కాలమైనది. ఒక పర్యాయము భువిని సందర్శించెదను గాక! అని అదృశ్య రూపుడై ఇలకు అరుదెంచినాడు!
***
అవనిలో వైశాఖ మాసము (మాధవ మాసము) ప్రజలు మాధవార్చనలు చేయు విధం పరిశీలించెద ననుకొని దశావతారముల దేవళములలో నారాయణుని దర్శనం చేసుకొనదలచి భువికి చేరగానే వేడి గాడ్పులతో
ఉక్కిరి బిక్కిరి అయి.. ‘భానుని ప్రతాపం చండ ప్రచండంగా ఉన్నది! పాపం! మానవుల జీవనము ఎట్లు ఉన్నదో’ అని చింతించుచుండగా.. పవనుడు నారదమునిని చూసి శీతల వాయువులు చల్లగా వీచుచూ,
మేఘ ఛత్రము పట్టి అనుసరిస్తున్నాడు!
నారదుని మేను చల్లబడి వాయుదేవుని దీవించి అవనిపై దిగాడు!
భూలోకవాసులు పనులలో తలమునకలుగా ఉన్నారు! విషయమేమా అని భువికి దిగి పరికించి చూశాడు! అందరి ఇళ్ళల్లో బహు పసందైన పరిమళ వీచికలు! ఘుమ ఘుమలు నాసికను భ్రమింపచేస్తూ! ఏమా సువాసన!
నాలుక ఆ ‘తావి’కి చవులూరుచున్న కారణమేమి? మహార్షులకు జిహ్వా చాపల్యము పుట్టించు ఆ పదార్థమేదో తెలియ రాకున్నది! ఆలోచన ఏల? గృహ ప్రాంగణములు పరిశీలించిన అవగత మగును కదా! అని ఆ
పరిమళ తావి వచ్చు ఒక ఇంటి వద్ద ఆగి లోనికి వెళ్ళి పరిశీలనగా చూస్తున్నాడు నారదముని!
ఆ తిరుమాళిఘ లో ఒక పెద్ద ముత్తయిదువ పార్వతీమాతలా.. పట్టుచీరె కట్టి, నుదుట కుంకుమ శోభలతో, తలకట్టు సిగచుట్టి, నిండు గాజులతో దర్శనం ఇచ్చింది!
ఆవిడ మాటలు వేద సూక్తాలలా వినసాగాడు!
“అమ్మా! కమలా! జయంతీ ! పిల్లలతో రండమ్మా అందరూ!”
అందరినీ పిలిచి, వారందరూ వచ్చి పెద్దామెను చూస్తుండగా కలిపిన ఆవకాయ జాడీలకెత్తి .. ఆ పెద్ద పళ్ళెంలో అన్నం నెయ్యి వడ్డించి కలిపి అందరికీ ఒక్కొక్క ముద్దపెట్టి రుచి చూపింది! వారందరూ ఆరగిస్తుంటే, అదృశ్య
రూపంలో ఉన్న నారదుడు వారి మాటలను బహు జాగ్రత్తగా విన్నాడు.
ఆ తల్లి కోడళ్ళకు, కూతుళ్ళకు ఆవకాయలలో రకాలు.. ఎలా పెట్టాలో వివరించి చెప్పింది. అన్ని మస్తకంలో
భద్రపరిచాడు!
వచ్చిన సంచారం ముగించి స్వర్గానికి వెళ్ళాడు.
***
ఆ దేవ ముని దివిలో ఉన్న త్రిమూర్తుల దర్శనము చేయ నిర్ణయించి, ఇలా తలపోశాడు!
“ఓ త్రిమూర్తులారా! ఒక పర్యాయం సతీసమేతంగా భువి పైకి రారాదూ! మాకంద రసా స్వాదనం చేయవచ్చు. అమృత పానము వల్ల రసన మధురమయమై.. పోయింది! నూతన రుచుల చవి చూసి తరియించగ!”
విషయ వివరము తెలుపు అభిలాషతో ముందుగా బ్రహ్మలోకం పయనించాడు. ఆ లోకంలో – బ్రహ్మా,శారదా
దేవి దర్శనం అవక దివ్యదృష్టితో చూశాడు!
అల వైకుంఠ పురంలో ఆ మూల సౌధంలో త్రిమూర్తులు, వారి వెంట సిరిదేవి, శంకరి, వాణి ముచ్చట్లలో ఉన్నారు! నారదముని నారాయణ నామ స్మరణతో, కీర్తనలు గానంచేస్తూ మహాతి వాయిస్తూ.. వికుంఠ ధామం ప్రవేశించాడు!
విష్ణుమూర్తి లేచి నారదుని ఆహ్వానిస్తూ ఆసనం చూపించి కూచున్నాక.. “నారద మునీ! ఎచటి నుండి రాక! ఏమి విశేషములు?” అని అడిగాడు త్రిలోక సంచారిని!
“విశ్వంభరా ప్రణామాలు! విధాతా! నమో నమః! శంకరా! నమస్తే! నమస్తే !నమః! లోక పాలక ప్రభువులారా! అవనీ దర్శనానికి వెళ్ళి నేను ఒక అద్భుత దృశ్యం వీక్షించాను! మీరు మాధవ మాసపు పర్వదినాలలో అవనిపై కొన్నాళ్ళు ఉండరాదూ? భువిపై మాకందఫలాస్వాదన చేయవచ్చు! మామిడి కాయలతో
తయారు చేసే ఆవకాయల.. రుచుల నాస్వాదించ వచ్చు! మీతో శ్రీదేవి, శాంభవి, శారదాంబ ఇలపైకి వస్తే, ఆవకాయ పట్టి ఆ రుచి త్రిమూర్తులకు చూపక వదుల్తారా!” అన్నాడు.
ఆ మాటలు విని సర్వ మంగళ, రమ, వాణి “నారదమునీ! ఆ పదార్థం తయారు చేయుట ఎలా? మా నాథులకు ఆరగింపు చేయవలెనని కోరిక పుట్టు చున్నది!” అన్నారు.
అనగా నారదుడు “ఆవకాయ పట్టుట మాటలా తల్లీ! ముందు రకరకాల కారాలు పాళం ప్రకారం తయారు చేయాలి! అమ్మలారా! తయారీ గూర్చి ఈ తరం వారిని అడగరాదు: యూ.. కాలువ (చానల్సు) చూడరాదు.. అవి రుచులు మార్చగలవు! పెద్ద ముత్తయిదువు లయిన సరిగ్గా చెప్పగలరు! మంచి స్వభావం ఉన్న వారినే
వాకబు చేయాలి. తల్లులారా! ఏ మామిడికాయతో.. ఏ ఊరగాయ మంచిదో తెలుసుకోవాలి! అయినా మీకు స్నేహాలు పరిచయాలు ఎందుకు లెండి! దివ్యదృష్టి వున్నదిగా! ఒక పర్యాయం చూడండి మాతలారా! అమ్మా!
అన్నపూర్ణా భవానీ! ఒకసారి ప్రయత్నించి చూడు తల్లి! పరమేశ్వరుడు ‘బిక్షాం దేహి కరావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’ అని ‘కపాలం’ పట్టుకుని వచ్చినపుడు ‘ఆవకాయ’ అన్నంముద్దలు వెన్నతో కలిపి వడ్డిద్దువు గాని! అంబా! ఆవకాయ ఊరగాయ తయారీ ప్రయత్నించు తల్లీ!” అన్నాడు.
పరమేశ్వరి.. లక్ష్మీదేవి.. బ్రాహ్మి ముగ్గురూ మల్లగుల్లాలు పడి, కారాలు, జాడీలు, తైలం వగైరా ప్రయత్న మాత్రాన ఒక దగ్గర పెట్టారు!
మంచి మామిడి కాయలు ‘దివ్యదృష్టి’ తో వెతికారు! పాపం వారు నాణ్యమైన మామిడికాయల ఎంపికకి చాలా తికమక పడ్డారు!
ఎందుకా తికమక అని సందేహం వచ్చేసిందా మీకు.. అప్పుడే!
ఒక మామిడి తోటలో కాయలు ఎంపిక చేసేవారు, మేలిమి కాయలు కొన్ని బుట్టలో సర్ది, విదేశాలకు శకటాల్లో పంపేశారు. పాపం. వీరి దగ్గరికి వచ్చేసరికి తక్కువ నాణ్యం కాయలు మిగిలాయి! సరే! ధర? పంపేసిన కాయల రేటే! తగ్గేదేలే! అన్నారు. పాపం!
దొరికిన కాయలే తీసుకున్నారు! వీరి స్వార్థం చూసి అంబ ‘నా బిడ్డలు ఎంత దిగజారిపోయారో’ అని చింతించి.. మాతృ ప్రేమతో క్షమించి కాయలు తీసుకుని వెళ్ళింది!
వెనక ‘నంది” మోశాడు లెండి! సేనించుకోవాలిగా!
కాయలు ముక్కలు చేయడం ఎలా? అదో పెద్ద చిక్కుముడి అయింది! అప్పుడు ‘గరుడుడు’ వచ్చి కాయలు రెక్కలతో శుభ్రం చేసి ముక్కుతో ముక్కలు తరిగాడు!
తరవాత ఒక పెద్ద పళ్ళెం స్పష్టంచి.. కారం, ఆవపిండి, ఉప్పు, తైలం, మెంతులు.. కొంచెం హింగు వేసి బాగా కలిపి ముక్కలు వేసి కలిసేలా కలిపింది.. శాంభవి! ఆవకాయలో మారు నూనె పోసింది.. లక్ష్మి! ఆ ఆవకాయ జాడీలోకి సర్దింది వాణి!
ఈ లోగా ముక్కంటి వేగంగా వచ్చి, “ఆహాహా! ఏమా పరిమళం! రసన రసము లూరుతున్నది! ఆగలేకున్నా! వేగమే అన్నం పెట్టు అన్నపూర్ణా!” అని ఆవకాయ కేసి చూశాడు శంకరుడు!
“చూస్తే చూశావు గానీ ఈశ్వరా! మూడో నేత్రం తెరవకు! ఊరగాయ భస్మ మవగలదు!” అంది మందహాసంతో దాక్షాయణి.
“అన్నపూర్ణా! ఆకలి! ఆగలేకున్నా! అన్న ప్రసాదం పెట్టు అన్న పూర్ణేశ్వరీ!” ఈశుని.. త్వర!
అధోక్షజుడు వేగంగా వచ్చి “రమా! ఆవకాయతో సాదం ఆరగింపు సేవ చేయి! తిని వేగం వెళ్ళాలి! గజరాజు పిలుస్తున్నాడు! సాపాటు ఆరగించి వెళ్తా! మరి కాసేపు మకరంతో పోరాడుతాడులే! త్వర!” అన్నాడు.
బ్రహ్మదేవుడు .. నాలుగు తలలతో వచ్చి నాలుక తడుపుకుంటూ “భారతీ! ఆలస్యమేల? ప్రాణేశుడు ఆకలి మీద ఉన్నాడే! సాదం పెట్టాలని త్వర పడ వెందుకు?” నిష్ఠూరంగా అన్నాడు.!
ఇక ముగ్గురమ్మల్లో ఒక అమ్మ – పెద్ద తామరాకులు తెచ్చి ఆ ఆకుపచ్చని ఆకులో ఎర్రని ఆవకాయ, తెల్లని అన్నం.. ఘుమ ఘుమలాడే నెయ్యితో కలిపి పెట్టింది. శర్వాణి!
ఇంకేముందీ!
గరళ కంఠుడు గుండ్రాయిలంత ముద్దలు గుటుక్కు గుటుక్కుమని ఆరగించి.. “జగదీశ్వరీ! శాంభవీ! ఇంత రుచిగా ఉందేమిటి? హాలాహలం బలాదూరుస్మీ! ఈ రుచి ముoదు” అని ఊరగాయతో అన్నం స్వాహా చేశాడు!
అరవింద దళాయ తాక్షుడు అధోక్షజుడు.. అరవింద పత్రంలో ఆవకాయ సాదం నవనీతంతో ఆస్వాదిస్తూ.. “అద్భుతం!.. అమృతం ఎందుకు దేవీ! దీని ముందు బలాదూరు! సిరి దేవీ! దధి కూడా వడ్డించు! ఆవకాయ
ముక్కతో ఆరగిస్తా!” అన్నాడు అరమోడ్పు కనులతో చూస్తూ!
“స్వామీ! గజేంద్రుడు మొర పెట్టి పెట్టి గొంతు ఎండిపోతోందేమో! త్వర త్వరగా ఆరగించి వెళ్ళండి! మీ వెనక నేను రావాలి కదా.. ‘సిరికిం చెప్పడు.. శంఖ చక్ర యుగముం చేదోయి సంధింపడు’ అంటూ పద్యం రాసిన ‘పోతన’ మీ వెనుక రాకుంటే చిన్న బోతాడు..! పాపం!” అని తొందర పెట్టింది లచ్చి.
ఇంక వాణి మగడు నాలుగు తామరాకులలో ఒక ఆకులో సింధూర రంగులో.. ఆవకాయ నెల్లూరు బియ్యపు అన్నం.. వెన్నతో, మరొక సరోజ దళంలో పెసరావకాయ, నెయ్యి అన్నం, మూడో ఆకులో బెల్ల పావకాయ.. అన్నం.. నువ్వుల నూనెతో, నాలుగో ఆకులో మాగాయ పెరుగన్నం సుష్టుగా ఆరగించి ‘పెరుగన్నం మాగాయ.. మహాత్తరి మహాత్తరి’.. అని ఆ కవిని గుర్తు తెచ్చుకుని ‘బ్రేవ్’మని తేల్చి “ఇన్ని రకాల ఊరగాయలు ఎక్కడ నేర్చావు! శారదా!” అని అడిగాడు!
వీణా పాణి నవ్వుతూ “ఆవకాయ పట్టే జ్ఞానం కూడా నా దగ్గర ఉంది లెండి!” అంది బిడియంగా.
“సరే! నేను మన లోకానికి వెళ్తున్నా!” అని విధాత ప్రాణుల తల రాతలు రాసి సృష్టి కార్యం నిర్వహించడానికి మాయం అయ్యాడు.
అలా త్రిమూర్తులు భూలోకానికి దిగి.. ఆవకాయ సాదం ఆస్వాదించి వారి వారి లోకాలకు వెళ్ళారు! ముగ్గురమ్మలు వారి వెనకే!
