Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అవసరం

[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘అవసరం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

‘అవసరం ఆవిష్కరణకు అమ్మ!’
ఉదర పోషణ అక్కర
ఆత్మరక్షణ అవసరమూ
ఆది మానవుని చేత
తొలి ఆయుధాన్ని ఆవిష్కరింప జేసింది!
తల దాచుకోవలసిన ఆవశ్యకతే
అతని చేత
గుహల గూటిని నిర్మింపజేసింది!
చెకుముకి రాళ్ళ రాపిడి నుండి
నిప్పును పుట్టించే విద్యను నేర్పింది!
అవసరమే గురువుగా మారిన
వింత ఇక్కడ విస్పష్టం!

దృఢంగా నిలద్రొక్కుకునేందుకు
నేల లోతులలోకి వేరులను
బలంగా చొప్పించాలనే చేతనను
చెట్టుకు నేర్పిన గురుదైవం అవసరమే!

కనులు తెరవగానే యీదే నేర్పును,
పాదుకున్న వెంటనే వికసించే
విన్నాణాన్ని,
ఎదగ గానే ఎగిరే నేరిమినీ
చేప పిల్లకు
విత్తుకు,
పక్షి కూనకూ నేర్పిన
గురు ప్రభువు అవసరమే!

అవసరం
తన కాంక్షా పూర్తికి తగిన
పధ్ధతిని అన్వేషించే
పరిస్థితిని సృష్టిస్తుంది!
పరిస్థితి
తన తృప్తికి యుక్తమైన
పరిష్కారాన్ని శోధించే
అవసరాన్ని సృజిస్తుంది!

అవసరాలు కల్గించే పరిస్థితులు,
పరిస్థితులు కల్పించే అవసరాలు
శుభాన్ని చేకూర్చాలి
క్షేమాన్ని సమకూర్చాలి!

అవసరం వల్ల
యుక్తమైన యోచనే అంకురించాలి!
ఉచితమైన సాధనే
ఉపక్రమించబడాలి!

అవసరం లేని వేళ
నవ్యావిష్కృతి అసంభవం!
ప్రగతి దుర్లభం!

Exit mobile version