[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘అవిశ్రాంత శ్రామికుడు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
దశాభ్దాలెన్ని గడిచినా
తాతలు పంచి ఇచ్చిన
వారసత్వ సంపద
ఎర్రమట్టి భూమిలో..
అన్నం గింజలు మొలక లెత్తడానికి
నువ్వు చిందించిన
చెమట చుక్కల సువాసన
నా నాసిక పుటాలకు
ఇప్పటికీ అంటుకునే వుంది!
నాలుగెకరాల దుక్కి తోనే
నలుగురు బిడ్డల భవిష్యత్తును ముడిబెట్టి
వరుణ దేవుడి కరుణ కోసం
ఆశగా ఎదురు చూస్తూ
రెక్కలు ముక్కలు చేసుకోని
బీడుభూమిని పంట చేనుగా మార్చి
ధాన్యపు సిరులు పండించావు!
నీ బిడ్డల ఆకలి మాత్రమే గాక
సభ్య సమాజం కడుపుమంట కూడా తీర్చి
అన్నదాతవై అలరారావు!
భార్యాబిడ్డల ఆనందమయ జీవనం..
కుటుంబ బాధ్యతల బంధాలు..
సుసంపన్నమైన బిడ్డల భవిష్యత్ జీవితం..
నీ జీవిత లక్ష్యాలుగా
కష్టాల కడలిలో ఈదులాడుతూ
జీవన గమ్యానికి చేరుకున్నావు గానీ..
నీకంటూ ఏమో మిగుల్చుకోలేక
నీ కోసం ఇసుమంతైనా దాచుకోలేక
నీ జీవన భాండాగారంలోని
శ్రమను..
వయస్సును..
శక్తినీ..
మా ఔన్నత్యం కోసం
నిస్వార్థంగా త్యాగం చేశావు!
మాకు జీవితాన్ని ఇచ్చావు..
బ్రతుకు దారి చూపావు!!
నువ్వు మా కోసం నిర్మించిన
జీవన రహదారిపై. నడుచుకుంటూ..
విలాసవంతమైన జీవన గమ్యంలో
భార్యాబిడ్డలతో
తృప్తిగా స్థిరపడిపోయాము!
కానీ.. నువ్వు మాత్రం
ఇంకా అక్కడే..
ఆ ఎర్రమట్టి భూమిలోనే..
స్వేదం వర్షాన్ని కురిపిస్తూ..
భావి తరాలకు అన్నం పెట్టాలని
శ్రమిస్తూ..!?
నీ శ్రమను దోపిడీ చేసి..
నిన్ను మరచిపోయి..
కృతజ్ఞతా భావనను విస్మరించి..
నగరవాటికలో
హాయిగా బ్రతుకుతోన్న..
నీ బిడ్డల్ని మన్నించు నాన్నా!!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.
