Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అవిటి పక్షి

[చిందం రమేష్ గారు రచించిన ‘అవిటి పక్షి’ అనే కవితని అందిస్తున్నాము.]

వికాసం నిండినా నాగరికత నరనరాల్లో
విద్వేషంతో నిండిన మానని గాయాలు ఎన్నెన్నో..
అందుకు చరిత్ర నిండా నెత్తురు మరకలే సాక్ష్యాలు..

నేను కార్పోరేట్ కూడలిలో అనాగరికతకు ఆఖరి ఆనవాలు..
మెరిసేదంతా బంగారమే అయినట్టు
ప్రతి నవ్వులో ప్రేమ పుప్పొడిని పులుముకునే తేనేలూరే ‘భ్రమ’రాన్ని..
బృందావనం లాంటి ఇంటి తోటను వదిలి ప్లాస్టిక్ వనంలో
ఎగిరే తుమ్మెదను..
మతం ఏది లేనట్టు.. మానవత్వమే రక్తవర్గం అంటూ
గొంగళి పురుగుల చుట్టూ చేరి ఎగిరే అందాల సీతాకోకచిలుకను..
నవ్వు వెనకాల నకిలీని..
విశ్వాసాల వెనకాల విద్వేషాలను..
ఆచారాల వెనకాల అగాధాలను..
గుర్తించక రెక్కలు తెగిన శాంతి కపోతాన్ని..
శాంతి సహనాన్ని కురిపించే సన్నటి నెలవంకకు
ఉరిపోసుకున్న తొలుచూరి లౌకిక ప్రవచన వాక్యాన్ని నేను..
తెలుపు వాక్యాల వెనకాల నలుపు ముసుగులను పసిగట్టక
కనపడని పంజరంలో చిక్కిన ఒంటరి గువ్వను..
ఎగరలేను..
తోడు పక్షులను కలవలేను..
రెక్కలు తెగిన పక్షిని.. నేను..
వికాసంతో వికటించిన అవిటి పక్షిని నేను..

Exit mobile version