[ధనంజయ లక్ష్మీ రామకృష్ణగారు వ్రాసిన ‘మత్తె మూకజ్జి’ అనే కన్నడ నవలని ‘అవ్వగారు’ పేరుతో అనువదించి ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.]
~
అనువాదకుని ముందుమాట..
అవ్వారు – అవ్వగారు
తెలుగు సాహితీవేత్తల్లో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు ఆస్తికులు. వారు శ్రీమద్రామాయణ కల్పవృక్షం రాశారు. దానికి తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. విమర్శిస్తే అలాంటి పుస్తకాన్నే విమర్శించాలి. అప్పుడే మంచి ప్రచారం లభించే అవకాశం ఉంటుంది. అందుకే కొందరు దానిని విమర్శించడం ద్వారా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో కొందరైనా కొంతమేరకైనా సఫలమయ్యారు.
కన్నడంలో కువెంపు అనే కలంపేరుతో రాసే కుప్పళ్ళి వెంకటప్ప గౌడ పుట్టప్పగారు ఆస్తికులు కారు. అయినాసరే రామాయణ దర్శనం రాశారు. రసఋషిగా పేరొందారు. దానికి కూడా కన్నడంలో మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. దాని గురించి ఇప్పటికీ ప్రాచీన కావ్యాన్ని ఆధునిక దృక్పథంతో ఎలా రాయవచ్చో చెప్పడానికి ఒక మంచి పాఠ్యపుస్తకంలా ఉపయోగించుకుంటూ ఉంటారు. దీన్నిబట్టి సాహిత్యకారులు ఆస్తికులు కావడం-కాకపోవడం కన్నా, వారి అస్తిత్వ వాదాలకన్నా, వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న కావ్యానికి సాధికారికతను సమకూర్చడమే మిన్న అనే విషయం అర్థమౌతోంది. అయినాసరే, “కువెంపుగారి రామాయణ దర్శనంలో ఆధునికత ఉంది. విశ్వనాథవారి కల్పవృక్షంలో లేదు, అందుకే విమర్శించాం” అంటే దానికి సమాధానం చెప్పడం కష్టం. ఒకవేళ ఎవరైనా సమాధానం చెప్పినా దాన్నంతా ‘ఛాందసం’ కింద కొట్టిపారేస్తారే తప్ప అందులోని ఆధునికతని పట్టించుకోరు. అదీ మన తెలుగువారి ప్రత్యేకత.
***
కడలతీర భార్గవుడని పేరొందిన శివరామ కారంత్ గారు నిరంతర ప్రయోగశీలి. ఆయన రాసిన ‘మూకజ్జియ కనసుగళు’ నవలకి జ్ఞానపీఠ పురస్కారం లభించింది.
నవల, కథ రెండూ ఆధునిక ప్రక్రియలు. వాటికి సంబంధించిన కథన శైలుల్లో ఎన్నో ప్రయోగాలు జరిగాయి. జరుగుతున్నాయి. జరుగుతూనే ఉంటాయి. అలాంటి ప్రయోగాల్లో ఈ ‘మూకజ్జియ కనసుగళు’ నవల ఒకటి. ఇది సరళమైన మాంత్రిక వాస్తవిక కథనశైలికి దగ్గరగా ఉంటుంది. ఇలాంటి శైలి విశ్వనాథ సత్యనారాయణగారి ‘హాహాహూహూ’ నవల్లోనూ, మరికొన్ని కథలలోనూ కనిపిస్తుంది. కానీ కస్తూరి మురళీకృష్ణగారు తప్ప దాన్ని ఇంకెవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.
దృష్టి ఆధునికమైనా కావచ్చు.. ప్రాచీనమైనా కావచ్చు. ప్రక్రియ మనదైనా కావచ్చు పరాయిదైనా కావచ్చు. కానీ నడక మనదే. కనుక మన నడక మనతోనే ప్రారంభం కావడం ప్రకృతి. మనం ఇతరుల కాళ్ళతో నడవడం వికృతి. కన్నడ సాహిత్యం విదేశీ ప్రక్రియల్ని తీసుకున్నా కన్నడనాడులోని సాంస్కృతిక నేపథ్యంలోనే నడుస్తోంది. తెలుగు సాహిత్యం దానికి పూర్తిగా భిన్నమైన రీతిలో ప్రయణిస్తోంది.
***
శివరామ కారంత్ ‘మూకజ్జియ కనసుగళు’ నవల 1958లో వెలువడింది. దానికి 1977లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఆ నవలని అదే పేరుతో పి. శేషాద్రి అనే దర్శకుడు చలన చిత్రంగా రూపొందించారు. అది 2016 జనవరిలో విడుదలైంది. అదే సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మూకజ్జియ కనసుగళు చిత్రానికి ఉత్తమ కన్నడ చలన చిత్ర పురస్కారం లభించింది. కన్నడ సాహిత్యంలో దాదాపుగా విమర్శకులందరూ కూడా రచయితలే. అందుకే అక్కడ విమర్శార్హమైన విషయాలున్న పుస్తకాలమీద నిరంతర చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఆయా చర్చల ద్వారా కొత్త పుస్తకాలలోని విషయలతోబాటు పాత పుస్తకాలలోని విశేషాలు కూడా అందుబాటులోకి వస్తూంటాయి.
కన్నడ సినిమా దర్శకుల్లో అధికశాతం ఉత్తమస్థాయి సాహిత్యాభినివేశం కలిగిన పాఠకులు కావడం వల్ల, పుస్తకాలు కేవలం పుస్తకాలుగానే కాకుండా చలన చిత్రాలుగా కూడా రూపొందుతూ ఉంటాయి. తెలుగులో పాప్యులర్ నవలలు తప్ప సీరియస్ సాహిత్యం సినిమాలుగా వచ్చిన సందర్భాలని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.
***
ఈటీవీ కన్నడ వాహినికి ఎడ్యుకేటర్స్ ఛానెల్ అనే పేరుండేది. అందుకు కారణం ఆ ఛానెల్లో సాహిత్యపరమైన విమర్శలు వ్విశ్లేషణలు ఎక్కువగా జరుగుతూండటమే. ప్రతి సంవత్సరం జ్ఞానపీఠ పురస్కారం పొందిన సాహితీవేత్తల రచనల గురించి కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. ఒక సంవత్సరం ‘రసఋషిగె నమస్కార’. ఇంకొక సంవత్సరం ‘కడలతీర భార్గవనిగె నమస్కార’, మరొక సంవత్సరం ‘బేంద్రెమాస్తరిగె నమస్కార’.. ఇలా ప్రతి ఆదివారం ఉదయం పూట గంటసేపు చర్చాకార్యక్రమం ప్రసారమయ్యేది. ఆ కార్యక్రమంలో ఆ మహామహుల సాహిత్యానికీ సాహిత్యకారులకీ సంబంధించి బంధుమిత్రులతో మొదలుపెట్టి వారిపై పరిశోధనలు చేసినవారు, విమర్శలు చేసినవారు, వారి భావజాలాన్ని వ్యాతిరేకించేవారూ సమర్థించేవారూ ఇలా అందరితోనూ సందర్శనలు (ఇంటర్వ్యూలు) ప్రసారం చేసేవారు. ఆ విధంగా ఆ సాహితీవేత్తకు సంబంధించిన సాహిత్య సింహావలోకనం జరిగేది. అంతే కాదు, కొత్త పుస్తకం విడుదల కాగానే ఈటీవీ న్యూస్ ఛానెల్లో ఆ పుస్తకాలన్నీ సమీక్షించడానికి అరగంటా, వాటిల్లో ఉత్తమ గ్రంథం గురించి చర్చించడానికి అరగంటా కేటాయించేవారు. ఆ ఈటీవీ మన తెలుగువాళ్ళదే. కానీ ఇక్కడ మాత్రం సాహిత్యం అనే మాట ఈటీవీలో వినిపించదు. ఈనాడులో కనిపించదు. అది కూడా మన ప్రత్యేకతే.
***
తెలుగులో పుస్తకాలకి పేరడీల్లాంటివి వచ్చాయిగానీ ఏ పుస్తకానికీ కొనసాగింపులు వచ్చినట్లు కనపడదు. నిజానికి సాహిత్యమంటేనే కొనసాగింపు. ఎందుకంటే ఏ భావమూ హఠాత్తుగా ఆకాశంలోంచి ఊడిపడదు. దానికి ఎక్కడో ఒకచోట ఏదో ఒక మూలం ఉండే వుంటుంది. ఆ మూలాల గురించి తవ్విపోయడమే విమర్శగా పరిగణించబడుతోందిక్కడ. దాన్ని కొనసాగించడమే సాహిత్యవారసత్వంగా గౌరవాన్ని పొందుతోందక్కడ. ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కన్నడ నవలల్లో ఈ ‘అవ్వగారు’ కూడా ఒకటి. ఈ అవ్వగారు శివరామ కారంత్ గారి మూకజ్జియ కనసుగళు నవలకి కొనసాగింపు. కేవలం కొనసాగింపు మాత్రమే. అవ్వగారి పేరూ నైజం పాత్ర చిత్రణం మూకజ్జిలాగే ఉంటాయిగానీ ఆ మూకజ్జి వేరు – ఈ అవ్వగారు వేరు.
ఈ మూకజ్జి పాత్రని తీర్చిదిద్దడంలో ధనుంజయ లక్ష్మీ రామకృష్ణగారి నైపుణ్యం అభినందనీయం. ఈ పుస్తకాన్ని చూశాక మనకి మళ్ళీ విశ్వనాథ సత్యనారాయణగారే గుర్తొస్తారు. ఆయన చెప్పిన పద్యమే గుర్తొస్తుంది.
“మరల నిదేల రామాయణం బన్నచో, నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ
తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచి బ్రదుకులు తనివి గాన
చేసిన సంసారమే చేయు చున్నది, తనదైన అనుభూతి తనది గాన
తలచిన రామునే తలచెదనేనును, నా భక్తి రచనలు నావి గాన
కవి ప్రతిభలోన నుండును గావ్యగత శతాంశములయందు తొంబదియైన పాళ్ళు
ప్రాగ్వి పశ్చిన్మతంబున రసము వేయిరెట్లు గొప్పది నవకథా దృతిని మించి”
మన ధనుంజయని విశ్వనాథవారితో పోల్చడం కాదుగానీ, ‘మూకజ్జియ కనసుగళు’ కొనసాగింపు విషయంలో ఆయన చెప్పే సమాధానం కూడా ఇంచుమించు పై పద్యంలాగే ఉంటుంది. ఆ విషయాన్ని నవలలోని ప్రతి సన్నివేశమూ చాటి చెబుతూనే ఉంటుంది.
రచయిత ప్రతిభల్లో కొత్తవస్తువుల్ని తీసుకుని కొత్తగా చెప్పడం ఒకటి. పాతదాన్నే కొత్తగా కొనసాగించి తనని తాను నిరూపించుకోవడం మరొకటి. ఈ రెండవ పద్ధతి తెలుగులో ఎక్కడా జరిగినట్లు కనపడదు. కానీ కన్నడంలో కొనసాగుతోంది. అందుకే ఆ కొనసాగింపులోని ప్రతిభాపాటవాల్ని మన తెలుగువారికి పరిచయం చెయ్యడం కోసమే ‘మత్తె మూకజ్జి’ అనే కన్నడ నవలని ‘అవ్వగారు’ పేరుతో అనువదించాను. ఇలాంటి ప్రయోగాలు తెలుగులో కూడా జరగాలని మనసారా కోరుకుంటూ..
బుధజన విధేయుడు
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి తెలుగు రచయిత, అనువాదకులు. ‘వలస దేవర’, ‘జంగమదేవర’, ‘అంతర్యామి’, ‘సాక్షాత్కారం’ వీరి నవలలు. ‘ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్’, ‘ఈ కథకి శిల్పం లేదు’ వీరి కథాసంపుటాలు. ప్రఖ్యాత తెలుగు కవుల సంపుటాలను కన్నడంలోకి అనువదించారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార నాటకం ‘గుళ్ళకాయజ్జి’, కేంద్ర సాహిత్య అకాడెమీ బాల సాహిత్య పురస్కారం పొందిన బోళువారు మహమ్మద్ కుణ్హి పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. వీరి నవలలకు, కథాసంపుటాలకు పలు పురస్కారాలు లభించాయి.
