Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అవ్వగారు-10

[ధనంజయ లక్ష్మీ రామకృష్ణగారు వ్రాసిన ‘మత్తె మూకజ్జి’ అనే కన్నడ నవలని ‘అవ్వగారు’ పేరుతో అనువదించి ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.]

[ఆ రాత్రి నిద్ర పట్టకపోవడంతో, పార్వతీపురం ఆలయం గురించి అవ్వగారిని అడిగి అన్ని వివరాలు తెలుసుకుంటాడు ఆత్రేయ. ఇదంతా చెబుతున్నప్పుడు మధ్యలో చెబుతున్నప్పుడు రంగనాథస్వామిగారి భార్య వచ్చి, లైట్ వేసి, మజ్జిగ తెచ్చిచ్చి, ఇక పడుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇది అవ్వగారికి కథాప్రవాహానికి అడ్డు అవుతుంది. ఆవిడ అక్కడితో ఆపేస్తారు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలనే ఉత్కంఠ ఆత్రేయలో పెరిగిపోతుంది. కానీ అవ్వగారు ఇక ఆపేస్తారు. తర్వాత ఆత్రేయకి గాఢ నిద్ర పడుతుంది. ఉదయం భట్టుగారొచ్చి నిద్ర లేపుతారు. ఇద్దరూ వేపపుల్లలతో దంతధావనం శరవాతి నదిలో స్నానం చేసి, అక్కడే సంధ్యావందనం చేసి వస్తారు. తర్వాత గుడిలోకి వెళ్తారు. సింహద్వారం వద్ద నందిని అడ్డంగా ఉండి ఎవరినీ లోపలికి రానీయదు. అవ్వగారిని, ఆత్రేయని, భట్టుగారిని మాత్రం అనుమతిస్తుంది. ఆవిడ గుడి అంతా తిరుగుతూ ఒక ఖాళీ మండపం దగ్గర ఆగి, అక్కడ ఒకప్పుడు కామధేవును విగ్రహం ఉండేదని చెప్తారు. కాసేపాగి బయటకొచ్చి, అక్కడున్న ఊరిపెద్దతో, క్రితం రోజున నందిని వెళ్ళిన రాళ్ళగుట్ట క్రింద గొయ్యి ఉందని, ఆ గొయ్యిలో కామధేనువు శిల్పం ఉంటుందని, దాన్ని వెలికితీయించమని చెప్తారు. ఆయన వెంటనే ఏర్పాట్లు చేయిస్తారు. సాయంత్రానికి కామధేనువు శిల్పాన్ని గుర్తిస్తారు. అది విడి భాగాలుగా ఉంటుంది. వాటిని జాగ్రత్తగా, ఓ ట్రాక్టరులో ఆలయ ప్రాంగణానికి తరలిస్తారు. వచ్చే శ్రీరామనవమినాటికి శిల్పాన్ని ప్రతిష్ఠించి, ఆలయంలో తిరిగి పూజలు మొదలుపెట్టాలని, గుడికి అనుబంధంగా గోశాలని కూడా ప్రారంభించాలని నిర్ణయిస్తారు. అందరికి వీడ్కోలు చెప్పి అవ్వగారు, భట్టుగారితో కలిసి ఆత్రేయ పడవలో బయల్దేరుతాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-17

రావతీనదిలో కాళ్ళూ చేతులూ కడుక్కుని జమునాపురానికి నడక ప్రారంభించాం. మూకవ్వగారంటే ఒక అద్భుతం. అలాంటి అద్భుతం వెంట నడుస్తుంటే ఎవరికైనా గుండెలు ఉప్పొంగడం సహజం.

మడి, గుడి, బడి, ఈ మూడే ఏ ఊరికైనా జీవడాడులు. మడిలేకపోతే పంటలు లేవు. బడి లేకపోతే చదువు లేదు. గుడి లేకపోతే క్రమశిక్షణా సత్ప్రవర్తనా ఉండవు. జమునాపురంలో మూడింటికీ మూలస్తంభం అవ్వగారే. అవ్వగారి వల్ల ఇకనుండి పార్వతీపురం ఆలయంలో కూడా జేగంటలు మోగుతాయి. అక్కడ మళ్ళీ గోశాల దినదిన ప్రవర్ధమానమౌతుంది.

అవ్వగారు నడుస్తూనే మాట్లాడుతున్నారు, “చూడు ఆత్రేయా, రేపు మనం ఉండచ్చు ఉండకపోవచ్చు. మనం లేకపోయినా మన గురించి చెప్పుకునేవాళ్ళుండచ్చు ఉండకపోవచ్చు. కానీ మనం ఉండమనేది మాత్రం సత్యం. కనుక రేపు మన గురించి చెప్పుకునేవాళ్ళ కోసం కాకుండా ఈ రోజు మనవల్ల లాభం పొందేవాళ్ళకోసం బతకాలి” అంటుంటే ఉన్నట్లుండి ఈ వేదాంతం ఎందుకు ఆరంభించారో అర్థం కాక ఆవిడ చెబుతున్న మాటలు వింటూ వాటి గురించి ఆలోచిస్తూ అవ్వగారిని అనుసరిస్తున్నాను. ఆవిడ కొనసాగిస్తున్నారు, “చదువు లేకపోయినా గొప్పవాళ్ళైనవారుండవచ్చు. అలాగని మనిషి ఎదగడానికి అవిద్యనీ నిరక్షరాస్యతనీ అర్హతలుగా పరిగణించలేము. పొలాలకంటే ఇంటి స్థలాల విలువే ఎక్కువ కావచ్చు. అలాగని ఇంటి స్థలాలు కడుపు నింపలేవు కదా? గుడి కూడా అంతే అది మనుషులను కలిపే మానవత్వపు ఒడి. ఆ ఒడిని కాపాడటానికి నందిని వంశం వందల సంవత్సరాల నుండి కృషి చేస్తోంది. ఈ నందిని వశిష్ఠమహర్షి మాహర్షి ఆశ్రమంలో ఉండే ఆ నందినేనా? అంటూ ప్రశ్నించుకోవడం మొదలుపెడితే సమాధానాలు ఎప్పటికీ దొరకవు. ప్రశ్నించడం మంచిదే కావచ్చు. కానీ ప్రశ్నించడం మాత్రమే మంచిదనుకోకూడదు. కాబట్టి మనసులో ఎప్పుడూ ప్రశ్నని దాచుకోకూడదు. సమాధానాన్ని వెతకడం మానకూడదు. నందిని ప్రశ్నించుకోలేదు. సమాధానం కోసం వెతికింది. దానికి నీలో తగిన సమాధానం కనిపించింది. అందుకే నువ్వు తనకి తగిన సమాధానం అవునో కాదో పరీక్షించడానికి కొమ్ము విసిరింది. అయినా నువ్వు వెనక్కి తగ్గలేదు. ఇకముందు కూడా నువ్వు ఏ విషయంలోనూ వెనక్కి చూడకూడదు. వెనుకంజ వెయ్యకూడదు. మన దేవుళ్ళే కాదు, దెయ్యాలు కూడా అదే చెబుతాయి వెనక్కి తిరిగావో తల వెయ్యి చెక్కలైపోతుంది జాగ్రత్త అనే నిబంధన పెడతాయి. చెడుగా ప్రవర్తించినా మంచినే గెలిపిస్తాయి” అంటూండగానే ఊరొచ్చేసింది.

అవ్వగారి మాటలు అమృత వాక్కుల్లా వినిపిస్తున్నాయి. దేశాలెన్నో తిరిగాను. ఎన్నో రకాల మనుషుల్ని చూశాను. కానీ మన సనాతన ధర్మంలోని ఔన్నత్యాన్ని మాత్రం ఎక్కడా చూడలేదు. సనాతనం ఎన్నటికీ సనూతనమే అని చెప్పడానికి అవ్వగారు నిలువెత్తు ఉదాహరణగా కనిపిస్తున్నారు.

అవ్వగారూ భట్టుగారూ నేరుగా గుడిలోకి వెళ్ళారు. నేను అరుగుమీద కూర్చున్నాను. అవ్వగారిలాగే ధ్యానం చేయడం మొదలుపెట్టాను.

ఆవిడ చెప్పిన మాటలు మనసులో సుళ్ళు తిరుగుతుంటే ఆలోచనలు ధ్యానానికి ఎందుకు లొంగుతాయి? నేను విదేశీ ఉద్యోగస్తుడిని. చాలా దేశాల్లో భారతీయుల్ని చూశాను. వారిలో అందరికీ భారతదేశం అంటే ప్రేమ గౌరవాభిమానాలున్నాయి. మన పెద్దవాళ్ళు చెప్పినట్లే సంఘటితంగానే ఎదుగుతున్నారు. భారత జాతీయతలోని గొప్పదనాన్ని నిలబెడుతున్నారు. వాటిని ముందుతరాలకు కొనసాగించడానికి ఎన్నోరకాలుగా ప్రయత్నిస్తున్నారు.

కానీ ఇక్కడ?

లెక్కలేనన్ని ఎగుడు దిగుళ్ళు. అభిప్రాయ భేదాలు.. ఎంతసేపూ అంధానుకరణమే ఈ దేశ సంస్కృతిలోని గొప్పదనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. చెయ్యనివ్వరు. అయినాసరే మన సంస్కృతినీ అందులోని సహజీవన సౌందర్యాన్నీ నిలబెట్టాలని కోరుకునేవాళ్ళింకా ఉన్నారు. నాలాంటివాళ్ళని ఎంతోమందిని కూడగట్టే అవకాశం నా చేతిలో ఉంది. అందుకు కావలసినంత సమయమూ ఉంది. సంపాదనా ఉంది. ఆ రెండూ సద్వినియోగం చేసుకోవాలంటే ఇంకా రెండేళ్ళు పడుతుంది. అప్పటికిగానీ మా కంపెనీతో నేను చేసుకున్న ఒప్పందం పూర్తి కాదు. ఆ ఒప్పందాన్ని కొనసాగించడానికి ఒప్పుకోకూడదు. విదేశానికి చెల్లు చీటీ ఇచ్చి ఇక్కడికి తిరిగి రావాలి. ఇక్కడి మట్టిలో మళ్ళీ పుట్టాలి. మోసులెత్తాలి. మానవ్వాలి. మానవుడిగా మారాలి. నాలాంటివాళ్ళందరినీ కూడగట్టాలి. నాకా అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

కానీ అవ్వగారికి? ఆవిడలాంటివారింకెవ్వరూ ఉండరు. ఆవిడ తప్ప.

అందుకే ఆవిడ తనలాంటివారిని కూడగట్టుకోవాలని కోరుకునే అవకాశం లేదు. ఆవిడ కూడా పార్వతీపురం గుడిలోని నందిని లాగే అద్వితీయురాలు.

అవ్వగారు, భట్టుగారు బయటికి వచ్చారు. భట్టుగారు మా ఇద్దరినీ త్వరగా రమ్మని చెప్పి అటునించటే ఇంటికి వెళ్ళిపోయారు మేము ఇంటికి వెళ్ళాం. నేను స్నానం చేసి బట్టలు మార్చుకుని భట్టుగారింటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. అవ్వగారు మాత్రం భాగీరథమ్మగారికి పార్వతీపురం ముచ్చట్లు చెబుతున్నారు.

సావిత్రి తల్లిదండ్రులతో మాట్లాడాల్సిన పెద్దమనిషి అవ్వగారే. ఆవిడ స్నానం కూడా చెయ్యకుండా కబుర్లు చెబుతూంటే నాకేం చెయ్యాలో తోచలేదు.

“భట్టుగారింటికి వెళదాం రండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది” అన్నాను

అవ్వగారు సమాధానం చెప్పలేదు సరికదా కనీసం నావైపు తిరిగి కూడా చూడలేదు. దాంతో మరోసారి పిలిచాను.

ఈసారి భాగీరథమ్మగారు పలికారు. “మేమెందుకుగానీ నువ్వెళ్ళిరా ఆత్రేయా” అన్నారు.

నేను మారు మాట్లాడకుండా భట్టుగారింటికి దారితీశాను. సావిత్రి మరణం తరువాత ఆయన ముఖం కళ తప్పింది. ఇప్పుడు భార్గవి వివాహంతో మళ్ళీ కాస్త ఉత్సాహం వస్తుంది.

భట్టుగారిల్లు చేరాను. లోపల సావిత్రి అత్తగారు కూర్చుని ఉన్నారు. ఆవిడ పెదాలపై చిరునవ్వు ఎప్పుడూ చెదరదు. ఎంత బాధలో ఉన్నవారికైనా ఆవిడలాంటివారిని చూస్తే చాలు మనసు తేలికపడుతుంది. ఆవిడని చూస్తి నమస్కరించాను.

భట్టుగారు నన్నావిడకి పరిచయం చేశారు. మలెనాడు కన్నడభాషలోని సొగసే వేరు. అందుకోనూ ఆ భాష ఆవిడలాంటివారి స్వరంలో వింటున్నకొద్దీ వినాలనిపిస్తుంది. ఆవిడతోబాటు సావిత్రి పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు భార్గవితో మాట్లాడుతున్నారు.

సావిత్రి అత్తగారు భార్గవిని సావిత్రితో పోల్చిమాట్లాడుతున్నారు. మామూలుగా అయితే ఒకరితో మరొకరిని పోల్చడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎవరి వ్యక్తిత్వం వారిది ఎవరి జీవితం వారిది. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నమైనది. కనుక పరిస్థితికి తగినట్లు మాట్లాడే కళని కూడా అలవోకగా ప్రదర్శిస్తున్నారావిడ. భార్గవి తప్ప ఇంకెవరూ సావిత్రిలేని లోటును పూడ్చలేరని తెలియజేయడమే ఆ మాటల ఉద్దేశం. భార్గవికీ, పిల్లలకీ మధ్య ఉన్న ఆత్మీయతనీ చూస్తుంటే ఆవిడ ప్రతి మాటా నిజమే అనిపిస్తుంది.

భట్టుగారికి ముహూర్తాలు పెట్టడంలో ఎంతో అనుభవం ఉంది. అందుకే వేరే పురోహితుడిని పిలవలేదు. ఆయనే పంచాంగం చూసి ఒఅక ముహూర్తాన్ని నిశ్చయించారు. సావిత్రి అత్తగారు కూడా సంతోషంగా అంగీకరించారు. లాంఛనాలు పెట్టుపోతల గురించి ఏమైనా మాట్లాడతారేమో అనుకున్నానుగానీ ఆవిడ వాటి మాటే ఎత్తలేదు. కానీ సావిత్రి నగానట్రా అన్నీ భార్గవికే అని చెప్పడం మరచిపోలేదు. అందరూ కలసి వివాహం జమునాపురంలోనే జరపాలని నిశ్చయించారు. చివరిగా సావిత్రి అత్తగారు పిల్లల్ని కొన్నాళ్ళు ఇక్కడే ఉంచుకొమ్మని అభ్యర్ధించారు.

దానికి భట్టుగారు ఆనందంగా అంగీకరించారు.

అధ్యాయం-18

భట్టుగారు దేనిగురించో మథనపడుతున్నారు. బాధపడుతుఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భార్గవి పెళ్ళి చెయ్యడం వారి తలకు మించిన భారమే కావచ్చు. కానీ ఆ అమ్మాయి పెళ్ళి బాధ్యతంతా గోమతీపురం ఊరిపెద్ద తీసుకున్నారు. కాబట్టీ ఆయన ఆలోచిస్తున్నది కూతురి పెళ్ళి గురించి కాదు. అంత పెద్ద బాధ్యత చాలా సులభంగా పరిష్కారమైనందుకు ఆయన ఆనందించాలి. కానీ ఎవరైనా పలకరించినప్పుడు మాత్రమే ముఖానికి నవ్వు పులుముకుంటున్నారుగానీ మిగిలినప్పుడంతా విచారంగానే ఉంటున్నారు.

తన సమస్యేమిటో తెలియడానికి ఆయన ఎవరికైనా ఏదైనా చెబితే కదా? ఊహూ, ఆయన నోరు తెరిచి ఎవరినీ ఏమీ అడగరు.

అడక్కుండా అమ్మైనా పెట్టదంటారు. కారణం లేకుండా డబ్బులిస్తే ఆయన తీసుకోరు. అందుకో కారణం కల్పించుకోవాలి. జీవించడమంటే వెళ్ళి బస్టాండులో కూర్చోవడంలాంటిది. మనం వెళ్ళాల్సిన ఊరికి చాలా బస్సులుంటాయి. ఏ బస్సొస్తే అది ఎక్కాలి. అంతేగానీ ఇంట్లో కూర్చుంటే బస్సు ఇంటికి రాదు అందుకే బస్టాండుకి బయలుదేరాలని నిర్ణయించుకున్నాను. నేరుగా భట్టుగారింటీకి వెళ్ళాను.

ఆయన ఆరుబయట మంచం వేసుకుని కూర్చున్నారు. “ఏం ఆత్రేయా? ఏమీ తోచడం లేదా?” అని అడిగారు. నేను ఔనన్నట్లు తలూపాను. సావ్విత్రి పిల్లలని ఆడిస్తోంది భార్గవి. నేను వాళ్ళనే చూస్తూ, “భార్గవికీ పిల్లలకీ మంచి స్నేహం కుదిరింది”అన్నాను.

“ఔను.. వరసకి పిన్నే అయినా తను వాళ్ళకి స్నేహితురాల్లా ఉంటుంది” అని చెప్పాక, “రా ఇలా కూర్చో” అంటూ మంచం మీద మడతలుపడ్డ దుప్పటిని సవరదీశారు.

నేను కూర్చోకుండా, “మీకు ఓపికుంటే ఓసారి అలా స్కూలుదాకా వెళ్ళొద్దాం” అన్నాను. ఆయన మారు మాట్లాడకుండా లేచి వెళ్ళి తన అరిగిపోయిన పాత చెప్పులు వేసుకుని బయలుదేరారు.

ఇద్దరం కలిసి బడిదగ్గరకి వెళ్ళాం. అరుగుమీద కూర్చున్నాం. నేను ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా నేరుగా విషయానికొచ్చాను, “మీరు వేదం నేర్చుకున్నారు. మీ ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది. మీ గొంతులో వేదం రాగయుక్తంగా పలుకుతుంది. ఈ పరిసరాల్లో మీ అంతబాగా నాలుగు వేదాలూ నేర్చుకున్న వారెవ్వరూ లేరు. అనాదినుండి వేదం కేవలం బ్రాహ్మణులకి మాత్రమే పరిమితమైనది కాదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎవరికైనా నేర్పవచ్చు. ఆసక్తి కలిగినవారికి వేదం నేర్పుతానంటే కనీసం ఇరవై ముప్పైమందిని చేర్చే బాధ్యత నాది” అన్నాను. భట్టుగారు వెంటనే అందుకున్నారు, “చాలా మంచి ఆలోచన. ఏ విద్య అయినా ఎంత ఎక్కువమందికి నేర్పితే అంత ఎక్కువ పెరుగుతుంది” అంటూ తన సమ్మతిని తెలియజేశారు.

“ఐతే పదండి” అంటూ నేను పైకి లేచాను. ఆయనకూడా పైకి లేచారు. నేను ముందు నడుస్తుంటే ఎక్కడికి ఎందుకు అనకుండా ఆయన వెంట వస్తున్నారు. నేను తిన్నగా గౌడగారింటికి వెళ్ళాను. ఆయన కుర్చీలో కూర్చుని సిగరెట్టు కాలుస్తున్నారు. ఇద్దరు అరుగుమీదా నలుగురు చప్టామీదా కూర్చుని ఉనారు. వారి మధ్య లోకాభిరామాయణం సాగుతోంది..

నన్ను చూడగానే దమ్ములాగి పొగని చక్రంలా వదిలారు. దాన్ని చూడగానే అరుగుమీద కూర్చున ఒకాయన, “అయ్యగారు పొగదండేసి ఆహ్వానం పలుకుతున్నారు మీకు. రండి రండి” అన్నాడు.

“నీ మొహం. పొగడదండేసి పిలవాల్సినవాళ్ళని పొగదండేసి పిలుస్తున్నానంటే. విన్నవాళ్ళు నవ్విపోతారు. ఆత్రేయ నాకే కాదు మన ఊరికి కూడా ఆప్తుడే” అన్నాక నావైపు తిరిగి, “ఏం ఆత్రేయా ఇంత దూరం వచ్చావంటే ఏదో పెద్ద పనే అయివుంటుంది “అన్నారు.

“ఔన్సార్. పెద్ద పనే. మన ఊళ్ళో వేదపాఠశాల ప్రారంభించాలనేది నా కోరిక. నేర్పడానికి మన భట్టుగారు సిద్ధంగా ఉన్నారు. మీరూ వేదం నేర్చినవారే. కనుక భట్టుగారి మంత్రపఠనం ఎంత ఉత్తమంగా ఉంటుందో మీకు ఒకరు చెప్పాల్సిన పనిలేదు” అనగానే గౌడగారు కాలుస్తున్న సిగరెట్టుని కిందపారేసి కాలికింద నలిపేశారు. ఆ తరువాత నావైపు తీక్షణంగా చూస్తూ, “ఎవరు ఏపని చెయ్యాలో వాళ్ళు ఆపనే చెయ్యాలి. అంతేగానీ అందరూ అన్నింటికీ పనికిరారు. నువ్వు దేశం వదిలిపోయి ఆదర్శాలూ అభ్యుదయాలూ అంటూ అడ్డమైన అనాచారాలన్నీ నేర్చుకొచ్చినట్లున్నావు. వేదాల్లాంటివి ఎవరు పడితే వాళ్ళు నేర్చుకోకూడదు. నేను భ్రష్టుపట్టిపోవడానిక్కారణం ఏమిటి? గౌడనై ఉండీ గౌడరికం మానేసి వేదాలు నేర్చుకోవడమే అని అందరూ చెప్పుకోవడం వినలేదా?” అని నాకు అక్షింతలేశాక భట్టుగారివైపు తిరిగారు, “అతనేదో కుర్రాడు. ఉడుకురక్తం మీరైనా ఆలోచించాలి కదా? అది మానేసి తగుదునమ్మా అంటూ అతని వెనక్కాల వచ్చేస్తే ఎలా?” అంటూ అగ్గిమీద గుగ్గిలమైపోయారు.

ఆయనంత తీవ్రంగా స్పందిస్తారని నేను ఊహించలేదు. అందుకే మిగిలినవాళ్ళతోబాటు నేను కూడా అవాక్కై నిలబడ్డాను. అంతలోనే నా అదృష్టం కొద్దీ ఆయన తమ్ముడుగారొచ్చారక్కడికి. అన్నగారి ఆగ్రహానికి కారణం తెలుసుకున్నాడు, “అన్నయ్యా మీరు చెడిపోవడానికి కారణం వేదం కాదు. వేదం నేర్చుకోవడం వల్ల ఎవరూ చెడిపోరు. ఇతర కులస్థులు వేదం నేర్చుకుంటే చెడిపోయేట్లయితే వేద పాఠశాలల్లో అందరికీ సమానావకాశాలు ఎందుకు కల్పిస్తున్నారు? అయినా మీరు చెడిపోయారని ఎవ్వరన్నారు? ఒకవేళ ఆ మాటే నిజమైతే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయి మీకు ఎక్కడినించొచ్చింది? ఇప్పుడు మీరుగనుక వేదపాఠశాలని ప్రోత్సహించారంటే పార్టీలో మీ పేరు ప్రతిష్ఠలు ఒక్కసారిగా రెట్టింపవుతాయి” అంటూ ఇంకా చెబుతూనే ఉన్నారు.

కానీ పార్టీలో పేరు ప్రతిష్థలు రెట్టింపవుతాయనగానే ఆయన గౌడగారి స్వరం మారిపోయింది. తనమాటలని తనే ఎంతో అందంగా ఖండించుకుంటూ చెప్పడం మొదలుపెట్టారు, “సరే ఆత్రేయా, నువ్వు మంచిపని చేస్తానంటే నేను అడ్డుపుల్ల వేశాననే మాట పడటం నాకిష్టం లేదు. అయినా మనది అందరూ అనుకుంటున్నట్లు కుల వ్యవస్థ కాదు. వర్ణ వ్యవస్థ. ప్రపంచంలోని ఏ సామాజిక వ్యవస్థలో అయినా ఈ నాలుగు వర్ణాలూ ఉండక తప్పదు. మంత్రిత్వానికి కావలసిన తెలివితేటలు, ప్రజలని పాలించేంత బలం, దేశాన్ని నడిపించే సంపద, సమాజానికి కావలసిన శ్రామిక శక్తి ఈ నాలుగూ నాలుగు స్తంభాల్లాంటివి.. సమాజం అనే గుడైనా బడైనా ఇల్లైనా కార్యాలయమైనా ఆ నాలుగు స్తంభాలపైనా నిలబడతాయి. నిలబడేది. వేదాలంటే జ్ఞానభాండాగారాలు. వాటిని ఎంత ఎక్కువమంది నేర్చుకుంటే అంత మంచిది. అసలు కులం అంటే వంశం అని మాత్రమే. క్యాస్టిజం అనేది యూరోపియన్లు మన మధ్య చిచ్చురేపడానికి ఉపయోగించిన అస్త్రం. వారి మాయమాటలు నమ్మి మనం కులం అనేది జన్మతో వస్తుందనే దురభిప్రాయంలో పడిపోయాం. కులాల కుమ్ములాటల్లో పడిపోయాం. మన దేశంలో కులాలన్నీ వృత్తులనుబట్టి ఏర్పడినవేగానీ జన్మతః వచ్చినవి కావు. గాయత్రీమంత్రం సృష్టికర్త విశ్వామిత్రుడు. బ్రాహ్మణుడు కాదు. క్షత్రియుడు. మనేదేశ పాలకుల్లో క్షత్రియులెంతమంది? మన కర్ణాటకలో గౌడరికం నిర్వహించేవారందరూ గౌడలేగానీ క్షత్రియులు కారు. వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఖండాలు దాటి ఊపుకుంటూ వస్తే తప్పుకాదుగానీ ఇక్కడి వైశ్యులు వ్యాపారాలు చేస్తే తప్పా? అయినా మనదేశంలో ప్రతి కులంలోనూ వ్యాపారాలు చేసేవాళ్ళున్నారు. లేకపోతే వైశ్యులుకాని కులస్థులకి శెట్టి అనే ఇంటిపేరెందుకొస్తుంది? పెద్దవాళ్ళు ఆలోచించకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తే అందరూ అదే నిజమనుకుని ఆలోచించడమే మర్చిపోతారు. అలా మర్చిపోయేలా చెయ్యడమే విదేశీ పాలన. మర్చిపోయిన వాటన్నింటినీ గుర్తు చేసుకుని వాటిలోని మంచిని వర్తమానానికీ భవిష్యత్తుకీ తగినట్లు మలుచుకోవలసి ఉంటుంది. ఇంక శ్రామికులు అన్ని కులాల్లోనూ ఉన్నారు. వర్ణవ్యవస్థ పుట్టుకతో వచ్చేది కాదని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణలెక్కడ ఉన్నాయి? ఆత్రేయా నీ ఆలోచన నాకు బాగా నచ్చింది. ఏదో నేను చెడిపోయానని అందరూ చెవులు కొరుక్కుంటున్నారనే బాధతో కాదన్నానేగానీ నీ ఆలోచన చాలా మంచిది. దానికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది” అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. భట్టుగారూ నేనూ కూడా జతకలిపాము.

రాజకీయ నాయకుడికి కావలసిన లక్షణాలన్నీ గౌడగారిలో ఉన్నాయి. అందుక్కావలసిన స్ఫూర్తి మాత్రం చిన్నగౌడలో ఉంది. గౌడగారు రాముడు కాకపోయినా చిన్నగౌడగారు మాత్రం లక్ష్మణస్వామే. గౌడగారి మాటలు క్షణక్షణానికీ రంగులు మారడం నాకు నచ్చకపోయినా చివరికి ఆయన మా దారికే రావడం మాత్రం మాకు చాలా సంతోషం కలిగించింది.

తరువాత అందరం కలిసి వేదపాఠశాల గురించి చర్చలు మొదలుపెట్టాం. దాదాపు గంటన్నరసేపు సుదీర్ఘమైన చర్చ జరిగింది. చివరికి అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రతి శుక్రవారం సాయంత్రమూ ఆదివారం ఉదయమూ భట్టుగారు గుడి ఆవరణలోనే వేదం నేర్పుతారు. ఫీజు జరుగుబాటు ఉండటం లేకపోవడం అనే రెండు అంశాలమీద ఆధారపడి ఉంటుంది. పేదవారికి యాభైరూపాయలు మిగిలినవారికి వందరూపాయలు.

చుట్టు పక్కల గ్రామాలన్నింటిలోనూ వేదపాఠశాల గురించి బాగా ప్రచారం చెయ్యాలి. వీలైనంత ఎక్కువమంది విద్యార్థుల్ని చేర్చాలి. ప్రతి నెలా బాగా నేర్చుకున్నవారికి గౌడగారి తరపున నూటపదహార్లు బహుమానంతో బాటుగా ఏటా వార్షికోత్సవానికి రెండువేలు, ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకి వెయ్యి, ఏడువందల యాభై, ఐదువందలు బహుమతులిస్తారు అని కూడా నిర్ణయించారు. అన్నీ పూర్తయ్యాక మమ్మల్ని సాగనంపుతూ భట్టుగారితో, “చిన్నప్పుడు నేర్చుకున్న మంత్రాల్లో సగం మర్చిపోయాను. నాక్కూడా మళ్ళీ నేర్పిస్తారా భట్టుగారూ?” అన్నారు.

భట్టుగారితోబాటు అక్కడున్న అందరూ బిగ్గరగా నవ్వారు.

(ఇంకా ఉంది)

Exit mobile version