Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అవ్వగారు-11

[ధనంజయ లక్ష్మీ రామకృష్ణగారు వ్రాసిన ‘మత్తె మూకజ్జి’ అనే కన్నడ నవలని ‘అవ్వగారు’ పేరుతో అనువదించి ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.]

[జమునాపురానికి తిరిగి వస్తూ, మాట్లాడుకుంటూ నడుస్తారు ఆత్రేయ, అవ్వగారు. ఆవిడ మంచిమార్గంలో నడవడం గురించి చెప్పుకొస్తారు. అవ్వగారు గుడికి వెళ్ళగా, ఆత్రేయ అరుగు మీద కూర్చుని ధ్యానం చేస్తాడు. తర్వాత భట్టుగారింటికి వెళ్తాడు. అక్కడ సావిత్రి అత్తగారు వచ్చి ఉంటారు. ఆవిడ భార్గవిని సావిత్రితో పోల్చి మాట్లాడుతారు. భార్గవి పెళ్ళికి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు భట్టుగారు. వివాహం జమునాపురంలోనే జరపాలని నిర్ణయిస్తారు. అయితే, భట్టుగారు దేనికో మథనపడుతున్న విషయం ఆత్రేయ గుర్తిస్తాడు. ఓ సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళి, అలా బడి దాకా వెళ్ళొద్దామంటూ ఆయనను బయల్దేరదీస్తాడు. వేద పాఠశాలని ప్రారంభిద్దామన్న సూచన చేస్తాడు ఆత్రేయ. ఆయన సరేనంటారు. ఇద్దరు కలిసి ఊరిపెద్ద గౌడగారింటికి వెళ్ళి తమ ఆలోచన చెప్తారు. అందరికీ వేదం నేర్పడమన్న ఆలోచన విని ముందు ఆయన విరుచుకుపడతారు. కానీ, ఆయన తమ్ముడు ఆయనకు నచ్చజెప్పి, వేదపాఠశాల స్థాపించేందుకు ఒప్పిస్తాడు. ఏర్పాట్లు జరుగుతాయి. – ఇక చదవండి.]

అధ్యాయం-19

అవ్వగారు గాదెలోంచి ధాన్యం తీయిస్తున్నారు. ఆరు బస్తాలనిండా ధాన్యం నింపారు. పాలేరు వచ్చి కుడతాననన్నా వినకుండా తనే దబ్బనం పురికోసా తీసుకుని కుట్టడం ఆరంభించారు. ఆవిడ కుడుతుంటే ఫోటో తీశాను.

ఆవిడ చూడలేదు కాబట్టీ సరిపోయింది. చూస్తే నా దగ్గరకొచ్చి సెల్లులోని ఫోటోలనీ చూపించమనేవారు. తన ఫోటో సరిగ్గా రాకపోతే దగ్గరుండి డీలిట్ చేసేదాకా ఒప్పుకునేవారు కారు.

నేను సెల్లు తీసి జేబులో పెట్టుకున్నాక ఆవిడ దగ్గరకి వెళ్ళాను.

“ఏం ఆత్రేయా, ఎక్కడికెళ్ళావు?” అని అడిగారు.

నేను భట్టుగారిని తీసుకుని వేదపాఠశాల గురించి అడగటానికి గౌడగారి దగ్గరకు వెళ్ళినట్లు చెప్పాను.

“ఆయన ఒప్పుకోలేదు కదూ?” అని అడిగాను.

“లేదు ఒప్పుకున్నారు”

“అంటే వాళ్ళ తమ్ముడొచ్చి ఒప్పించి ఉంటారు”

“మీకెలా తెలుసు?”

“ఆయనకి మంచి రాజకీయనాయకుడిక్కావలసిన లక్షణాలున్నీ ఉన్నాయిగానీ వాటిని ఉపయోగించుకోవడం ఎలాగో తమ్ముడు చెబితేగానీ బుర్రకెక్కదు. మన భట్టుగారి అదృష్టంకొద్దీ సమయానికి తమ్ముడొచ్చి ఉంటారు.”

అంటుంటే వ్యక్తుల పట్ల ఆవిడకున్న అవగాహన, వారి ప్రవర్తనలని విశ్లేషించడం ద్వారా వారి నిర్ణయాలని సైతం అంచనా వెయ్యడం చూస్తుంటే ఆవిడలో గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త కనిపిస్తోంది. మనుషులను అంత ఖచ్చితంగా అంచనావేయడం సామాజిక శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసిన మనోవిజ్ఞానికి మాత్రమే సాధ్యం.

అవ్వగారు నవ్వుతూ, “మన భట్టుగారింట్లో పెళ్ళికదా కనీసం బియ్యమైనా లేకపోతే ఎలా? అందుకే మరపట్టించుకురమ్మని పంపిస్తున్నాను” అని చెప్పారు.

నాకా సౌజన్యాన్ని చూసి ముచ్చటేసింది. అందుకే అభినందన పూర్వకంగా అన్నాను, “మన భట్టుగారు అదృష్టవంతులు.”

అవ్వగారు మళ్ళీ నవ్వారు, “ఆయన కాదు, మనం అదృష్టవంతులం. అలాంటి సజ్జనుడికి సహాయం చేసే అవకాశం లభించింది” అన్నారు.

నాకేం మాట్లాడాలో తోచలేదు. అందుకే నిలువుగా తలాడించాను.

అవ్వగారు ఒక అనుమానం వెలిబుచ్చారు, “మన చుట్టుపక్కల గ్రామాలన్నిటిలోనూ కలిసి తమ పిల్లలకి వేదం నేర్పించాలనే ఆసక్తి కలిగినవారి సంఖ్య చేతి వేళ్ళని దాటదు. వచ్చే ఐదారుమందికోసం భట్టుగారు తన సమయాన్ని వృథా చేసుకోవలసి వస్తుంది. అయినా వేదానికి అంటూ-ముట్టూ, మడీ మైలా ఉండవు. వేదం అంటే హోమంలోని అగ్నిలాంటిది. కాబట్టీ కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాకుండా అందరికీ నేర్పిస్తే బాగుంటుంది.”

ఆవిడ సలహా విన్నాక నాకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ఆవిడ అత్యంత సనాతమైన ఆధునికురాలు. మన వర్ణవ్యవస్థ గురించి అవ్వగారి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఇదే మంచి సమయం అనిపించింది. అందుకే, “అందరూ అన్నీ నేర్చుకోవడం మంచిది కాదు, నాకు సరిపోని వేదాన్ని నేర్చుకున్నందువల్లే చెడిపోయానని గౌడగారు కూడా అన్నారు తెలుసా?” అని అడిగాను.

అవ్వగారు నావంక భావరహితంగా చూశారు, “ఆయన ఊరి సర్పంచై ఊరిని పరిపాలిస్తున్నారు. అలాగని ఆయనేమైనా సూర్యవంశ క్షత్రియుడా చంద్రవంశ క్షత్రియుడా? ఆయన ఎంతోమంది ఆడవాళ్ళని ప్రలోభపెట్టో భయపెట్టో లోబరుచుకున్నారు. ఆయా స్త్రీలలో చాలా మంది తల్లులయ్యారు. వారు కన్నది భర్త బిడ్డనా? గౌడ బిడ్డనా? లేక తన బిడ్డనా? ఇద్దరు కలిసి చేసిన పనిలో లాభాన్ని ఇద్దరూ సమానంగా పంచుకోవాలి. అంటే పుట్టే బిడ్డమీద ఇద్దరికీ సమానమైన అధికారం ఉండాలి. కానీ బిడ్డని బళ్ళో వేసేప్పుడు మాత్రం తండ్రి పేరే రాస్తారు. ఆ తల్లి కన్నబిడ్డకి తండ్రి ఎవరు? ఆమెని కట్టుకున్న భర్తా? లేక ధర్మపన్నాలు వల్లించే గౌడగారా? ఇద్దరూ అబద్ధమే. అమ్మే నిజం. కానీ అబద్ధాలే వంశాల్నీ వంగడాల్నీ అధికరాల్నీ స్వంతం చేసుకుంటున్నాయి. అంటే అబద్ధాన్నే ‘నిజం’గా చెలామణీ చేసినంతకాలం నిజాలన్నీ అబద్ధాలుగా మారిపోతాయి. కనుక అబద్ధాలనీ నిజాలనీ నమ్మకూడదు. సత్యాన్ని అన్వేషించాలి. ఆ సత్యాన్ని గ్రహించలేనివాళ్ళంతా దశరథులో ధృతరాష్ట్రులో అవుతారు. రామాయణ మహాభారతాలు చెప్పే సత్యాలను ఎవరూ అర్థం చేసుకోరు. కానీ వాటి గురించి అందరూ మాట్లాడతారు. అడ్డంగా వాదిస్తారు. కానీ ఎవరూ ఆచరణలో పెట్టే ప్రయత్నం చెయ్యరు. ఆ ప్రయత్నం చేస్తే వాళ్ళకి అసలైన వర్ణాలు నాలుక్కాదు రెండే అని తెలుస్తుంది. ఒకటి మంచి, రెండోది చెడు. ఈ రెండూ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. కాబట్టీ మనిషికి వర్ణం ఒకటే మనిషి మనిషిగా మారడం ముఖ్యం. మనిషిగా పెరగడం ముఖ్యం. మనిషిగా మసలడం ముఖ్యం వీటిని కాదని ఎవరెన్ని చెప్పినా అన్నీ గాలిని పిడికిట్లో బంధించినట్లే. మనిషిగా మారడానికి ప్రయత్నించే మనుషులంరందరూ సవర్ణులే. సగోత్రీకులే. ఆ పని చెయ్యనివారందరూ దాయాదులే వివర్ణులే” అంటుంటే నాకు దిమ్మతిరిగిపోయింది. “ఆత్రేయా నీకు తెలియంది కాదు, వర్ణం అంటే రంగు. చక్రంలో అన్ని రంగులూ గీసి దాన్ని వేగంగా తిప్పితే కనిపించేదొకటే రంగు. అదే తెలుపు. ఆ రంగులని గుర్తించాలంటే వెలుగుండాలి. ఆ వెలుగిచ్చే సూర్యుడొక్కడే. సూర్యుడంటే ప్రత్యక్ష నారాయణుడు” అంటుంటే నేను అబ్బురపోయాను. ఆ అబ్బురపాటుని కప్పిపుచ్చుకుంటూ, “మీరు న్యూటన్ వర్ణచక్రం గురించీ కాంతి విశ్లేషణ గురించీ ఎలా తెలుసుకున్నారు?” అని అడిగాను.

ఆమాట అడగ్గానే అవ్వగారు ఇంటిమీద పెంకులెగిరిపోయేంత గట్టిగా నవ్వారు. ఆవిడంతగా నవ్వడం నేనే కాదు భాగీరథమ్మగారు కూడా ఎప్పుడూ విన్నట్లు లేరు. అందుకే కంగారుగా బయటికి వచ్చారు.

అవ్వగారు అతి కష్టమ్మీద నవ్వాపుకుంటూ, “నువ్వే” అన్నారు.

బిత్తరపోయాను. ఆ తత్తరపాటులో ఆవిడని ఏమడగాలో కూడా బోధపడక అలాగే చూస్తూ ఉండిపోయాను.

అవ్వగారి నవ్వు పూర్తిగా అదుపులోకి రావడానికి దాదాపు అరనిమిషం పట్టింది. నవ్వుల్లోంచి తేరుకున్నాక నెమ్మదిగా చెప్పడం ప్రారంభించారు, “నీ చిన్నప్పుడు మీ మాస్టారు చెప్పారని చక్రం మీద రంగులేసి దాన్ని వేగంగా తిప్పి చూపించావు. ఆకాశంలో ఇంద్రధనస్సు విరిసినప్పుడు కాంతిలోని రంగుల గురించి చెప్పావు. నువ్వు చదువుకున్నవి పాఠాలు కదా, మార్కులు రాగానే మర్చిపోయుంటావు. కానీ నేను నీ దగ్గర విన్నది పాఠం కాదు కదా? అందుకే రంగుల్ని చూసినప్పుడల్లా నిన్నూ, సూర్యనమస్కారాలు చేసినప్పుడల్లా నువ్వు చెప్పిన కాంతి విశేషాలనీ గుర్తుచేసుకుంటూనే ఉంటాను” అని చెబుతుంటే నాలాంటి మూర్ఖులు చదువుకునే మార్కుల చదువులకీ అవ్వగారిలాంటి అమ్మలందరూ చదువుకునే జీవిత పాఠాలకీ ఉండే తేడా ఏమిటో అర్థం కాసాగింది.

అవ్వగారు చెబుతూనే ఉన్నారు, “లోకంలో అన్ని మతాలవారికీ కులాలవారికీ జాతులవారికీ ఒక్కడే దేవుడు. ఆ దేవుడే సత్యం, అది నిత్యం, నిరంతరం, మనుషులు కల్పించుకున్న దేవుళ్ళందరూ మనుషుల్లాగే ఉంటారు. చేపల దేవుళ్ళ అవతారాలన్నీ చేపలే అయివుంటాయి. జంతువుల దేవతలన్నీ జంతువులే అయివుంటాయి. కానీ మీ మేధావులంతా భూమికంటే ముందు నీళ్ళూ ఆ నీళ్ళలో చేపలూ పుట్టాయనీ, ఆ విషయం చెప్పడానికే విష్ణుమూర్తి మీనావతారం ఎత్తాడనీ, తరవాత భూమి పుట్టిందనీ ఆ భూమిమీదా నీళ్ళలోనూ తిరగడానికి వీలుగా కప్పలూ మొసళ్ళూ తాబేళ్ళూ పుట్టాయనీ, అందుకే ఆయన కూర్మావతారం ఎత్తారనీ, మొసలిబారినుండి ఏనుగుని రక్షించడానికి విష్ణుమూర్తి పరుగు పరుగున వచ్చాడనీ. ఆ తరువాత మనిషీ జంతువూ కలిసిన నరసింహావతారంగానూ ఆ తరువ్వాత పూర్తి మానవుడుగా వామనుడు జన్మించాడంటారు.. అదంతా జీవ పరిణామక్రమం అంటూ పాఠాలు చెబుతారు. విద్యార్థులం కదా, నోరు మెదపకుండా వింటారు. దేవుణ్ణి ఎవరెలా ఊహించుకుంటే అలా ఉంటాడు. అందుకే మనపెద్దవాళ్ళు మనుషుల్లో ఉండే మానవత్వాన్ని దైవత్వం అన్నారు. మనవాళ్ళు మన వేదాలు చదవరు అందుకే అర్థం చేసుకోలేరు. మన సాంస్కృతిక నాదాలని వినరు. అందుకే ఆస్వాదించలేరు” అంటూ ముగించారు.

ఇంక నాకు మాటల్లేవు. అలాంటి మాటల్లేని పరిస్థితులు భాగీరథమ్మగారికి లెక్కలేనన్నిసార్లు వచ్చుంటాయి. అందుకే నాలా ఆశ్చర్యపోయి నోరు వెళ్ళబెట్టకుండా వెళ్ళి వంటపనిలో మునిగిపోయారు.

పాలేరు కూడా ఇవన్నీ మామూలే అన్నట్లుగా ధాన్యం బస్తాల్ని భుజానికెత్తమని సైగ చేశాడు.

నేను ధాన్యం బస్తాలు అతని భుజానికెత్తుతూంటే తను వాటిని తీసుకెళ్ళి బండిలో వేస్తున్నాడు. బస్తాలన్నీ వెయ్యడం పూర్తయ్యాక అవ్వగారు ధాన్యం ఆడించడానికి బయలుదేరబోతుంటే నేను అడ్డం పడ్డాను. “ఈ మాత్రానికి మీరు వెళ్ళడం ఎందుకు? నేను వెళ్ళి మరపట్టించుకు వస్తాను” అని చెప్పి బండెక్కి బయలుదేరాను. ధాన్యంమిల్లు దాదాపు నాలుగు కిలోమీటర్లుంటుంది. చుట్టూ చెట్లు బండిబాటనిండా చెట్లు రాల్చిన ఆకులు. ఆ ఆకులమీద బండి వెళుతుంటే దాని చక్రాలకింద పండూ ఎండూ కాని ఆకులు పచ్చిగా చేసే సద్దు లయబద్ధమైన సంగీతంలా వినిపిస్తోంది. దానికి తోడు ఎడ్ల మెడల్లో మువ్వల నాదం. నడుస్తున్న ఎడ్ల కాళ్ళకింద నలిగే ఆకుల వాద్యం అంతా కలిసి గాలి పాడుతున్న ప్రకృతి గీతానికి నేపథ్య సంగీతంలా వినిపిస్తోంది.

గాలిపాట వింటూ చూస్తుంటే ధాన్యం మిల్లు వేరే ఏదో లోకంలో ఉన్నట్లూ ఆ బండి నన్నాలోకంలోకి తీసుకుపోతున్నట్లూ అనిపిస్తోంది. ఆ పాటకి తగినట్లుగా బండి కుదుపులు మూవింగ్ ఛైర్లో కూర్చుని రోమింగ్ యూనివర్స్‌ని చూస్తున్నట్లనిపించింది. ఆ అనుభవం కోసంమే మా స్నేహితులందరం ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్ళాం. బిర్లా మందిర్ దగ్గరే ఉన్న ప్లానెటోరియం చూశాం. ఆ ఆనందం మళ్ళీ అనుభవంలోకి వస్తోంది. ఒకప్పుడు భాష ప్రాతిపదికగా రాష్ట్రాలు రాష్ట్రాలు ఏర్పడటానికి కారణం ఆంధ్రప్రదేశ్. కేవలం యాస ప్రాతిపదికగా చేసిన ఉద్యమం ద్వారా ఏర్పడిన ఏకైక రాష్ట్రం తెలంగాణా. భాషంటే కేవలం భావ వినిమయానికి పనికొచ్చే పనిముట్టు కాదు. అది జాతి జీవనాడి. ఇలా ఆలోచించుకుంటుంటే హఠాత్తుగా అవ్వగారు గుర్తొచ్చారు. వేదాలతో మొదలు పెట్టి వర్ణవిశ్లేషణ చేసి చివరికి సూర్యకాంతిలోకి తీసుకొచ్చి వదిలిపెట్టారు. వర్ణం అంటే అక్షరం కూడా. ఆ అక్షరం నాదంలోంచి పుట్టింది. అది ప్రణవనాదం. రాస్తే అక్షరం – తీస్తే రాగం. రెండూ నాశనం లేనివే. ప్రణవంతో ప్రారంభమైన అక్షర వర్ణయానం పదాలుగా పాదాలుగా భావనలను విన్యసింపజేస్తుంది. అక్షర విస్తరణా మానవ విస్తరణా రెండూ ఒకటే.

అవ్వగారి వర్ణం తెలుపునీ వెలుగునీ సూర్యుడినీ దాటి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళింది. నా వర్ణయానం ‘ఓమిత్యేకాక్షరం బ్రహ్మ’ అనే ఏకాత్మతాభావాన్ని మనసులో నింపుతోంది.. ఓంకారాన్నుండి నాలోకి నన్ను విస్తరించుకొమ్మంటోంది.

ఆ విస్తరణలో మెదడుని రాటుదేల్చే శాస్త్రాలు మనసుకు చైతన్యాన్నిచ్చే సృజన. రెండూ నిరంతరం విస్తరిస్తూనే ఉంటాయి. ఏవైనా రెండే. ఒకటి ఆడ-ఒకటి మగ. అక్షరాల్లో కూడా కులాలుంటాయని విన్నాను. ఇంగ్లీషువాళ్ళు చెప్పుకునేప్పుడు వాటిని వేరియేషన్స్ అంటారు. మనకి చెప్పేప్పుడు మాత్రం ‘కులాలు’ అంటారు. యూరోపియన్ల కులాలకీ మన వృత్తులకీ తేడా ఉంది. గత వెయ్యేళ్ళుగా మనకి పనికొచ్చే చదువులేవీ మనం చదువుకోలేదు. మనం పాలకులకి పనికొచ్చే చదువులే చదువుతున్నాం. వాళ్ళు వదిలిపెట్టి పోయినా వాళ్ళ భాషనీ భావాల్నీ పట్టుకుని వేళ్ళాడుతున్నాం. నేను చదువుకున్న భాషా చదువూ రెండూ వాళ్ళకి ఊడిగం చెయ్యడానికీ వాళ్ల సంపదలని పెంచడానికీ మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ చూస్తే ఇంకా మనవాళ్ళు విదేశీయులు పెట్టిన పుల్లల్నే బాణాల్లా మార్చుకుని ఊళ్ళంటినీ సం’కుల’సమరక్షేత్రాలుగా మార్చేస్తున్నాయి. కెరీర్ గైడెన్స్‌లో చెప్పే మొదటి మాట ‘ప్రయత్నం’. వాళ్ళు చెప్పే ప్రయత్నం వాళ్ళ సంస్థలకీ ఆ సంస్థ పెరుగుదలకీ పనికొస్తుంది. కానీ ప్రయత్నం అనేదెప్పుడూ సమాజానికి ఉపయోగించేదిగా ఉండాలి. మాస్టారి ప్రయత్నం నాకు మా బడిని బాగుచేసే అవకాశమిచ్చింది. అవ్వగారి ప్రయత్నం పార్వతీపురంలో గుడిని నిలబెట్టే అవకాశం కల్పించింది మరి నా ప్రయత్నం? నేనే ప్రయత్నంచెయ్యాలో ఎందుకాప్రయత్నం చెయ్యాలో నిర్ధారించుకోవాలి. ఇలా నిర్ణయించుకోగానే నా మనసునిండా అవ్వగారే నిండిపోయారు. “పరవాలేదు నీకూ నాలా ఆలోచించడం వచ్చేసిందే” అంటూ భుజం తట్టినట్లనిపించింది..

చూస్తూండగానే బండి మిల్లు చేరుకుంది.

***

బియ్యం ఇంటికి రాగానే మా ఇంట్లో మూడు బస్తాలూ భట్టుగారింట్లో మూడు బస్తాలూ దింపించారు అవ్వగారు.

ధాన్యం మిల్లులో తౌడూ దారిలో దుమ్మూ ధూళీ పడి ఒళ్ళంతా చిరాగుగా ఉంది. దాంతో నేను స్నానానికి వెళ్ళాను. స్నానం పూర్తి చేసి బయటకు వచ్చానో లేదో మీరా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చుట్టేసింది.

కూతురు హఠాద్దర్శనం నాకు విస్మయం కంటే ఆనందాన్నే ఇచ్చింది. ఆ వెనక సీత. వచ్చి తల తుడవడం ఆరంభించడంతో నా ఆనందం రెట్టింపైంది. తలస్నానం చేశాక ఎవరితల వాళ్ళు తుడుచుకుంటే అందులో ఏ స్వారస్యం ఉండదు. భర్త తల భార్య తుడుస్తుంటే రాజాధిరాజైనంత సంతోషం అది అనుభవించాలేగానీ మాటల్తో చెప్పకూడదు. చెప్పినా అర్థం కాదు.

“ఏంటీ సడెన్ సర్ప్రైజ్?” అంటే సీత నవ్వుతూ, “ఇదంతా మా ఆడాళ్ళ గొడవలెండి మీకర్థం కాదు” అంది.

“పోనీ తమరి రాకకు కారణం ఏమిటో అదైనా చెబుతారా?” అంటుంటే, “ఇందులో అర్థం కావడానికేముంది? అల్లుడు కాదు, కూతురి మొగుడు. అత్త కాదు మామగారి పెళ్ళాం” అంటూ అత్తగారి గొంతు వినపడింది.

అవిడ వివరణ నా గందరగోళాన్ని రెట్టింపు చేసింది.

“అత్తయ్యగారూ మీరైనా సామెతలూ పొడుపు కథలూ మానేసి తిన్నగా ప్రతిపదార్థాలో భావార్థాలో చెప్పచ్చుగా?” అన్నాను నవ్వుతూ.

“అదీ అలా అడగండి చెబుతాను” అంటూ చెప్పడం మొదలు పెట్టారు అత్తయ్యగారు, “అల్లుడుగారూ, మా ఆడబడుచుగారమ్మాయి పెద్దమనిషైంది. తనకి పెద్దమనుషులం మేమే కదా? అంచేత కుటుంబ సమేతంగా వచ్చి బట్టలు పెట్టాలి. అందుకే వచ్చాం” అని చెప్పారు.

అత్తయ్యగారు మెత్తగా కనిపిస్తారు. కానీ కనిపించేంత అమాయకురాలేమీ కాదు. ఎప్పుడు ఏ రహస్యాన్ని ఎంత రసస్ఫోరకంగా చెప్పాలో ఆవిడకి బాగా తెలుసు. అందుకే మామగారికి సంబంధించిన సీక్రెట్ ఒకటి బయటపెడుతూ, “ఆత్రేయా, మీ మామయ్యగారు మీతో ఏదో విషయం మాట్లాడాలట. కాఫీ తాగేసి ఇద్దరూ గుడి అరుగుమీద కూర్చుని మాట్లాడుకోండి” అంటూ లోపలకి వెళ్ళి కాఫీ తీసుకొచ్చారు. అత్తయ్యగారు చెప్పినట్లే గుమ్మెత్తిపోయే పొగలు కక్కుతున్న కాఫీ తాగి ఆ ఉత్సాహంతో బయటికి బయలుదేరాను. వెళ్ళి అరుగుమీద కూర్చున్నాను.

మరికాసేపట్లో అక్కడికి వచ్చినాయన మా మామగారు కాదు. మా మేనమామగారు. ఆయన్నెప్పుడో పెళ్ళిలో చూశాను. ఆ తరువాత చూడటం ఇదే. ఆయన మా అమ్మగారు పుట్టిన ఎనిమిదేళ్ళకి పుట్టారు. అయినాసరే అమ్మకంటే పెద్దవాడిలా కనిపించేవారు. అప్పట్లో మా నాన్నగారికీ వాళ్ళకీ మధ్య ఏవో చిన్నచిన్న గొడవలు ఆరంభమై అవే చినికి చినికి గాలివానలుగామారి రాకపోకలు ఆగిపోయాయి. నా పెళ్ళికైనా రావడానిక్కారణం మేనమామగా బట్టలు పెట్టే సంప్రదాయాన్ని నిలబెట్టుకోవడమే తప్ప, బంధుత్వాన్ని నిలబెట్టుకోవడం కాదు. అలాంటి మేనమామగారికి నాతో మాట్లాడేంత పనేముంటుదబ్బా అనుకుకుంటూ వినడానికి సిద్ధంగా కూర్చున్నాను.

ఆయన కూడా పక్కనే కూర్చున్నారు. కానీ మాటలు ఎలా కలపాలో తెలియక హస్తసాముద్రికం చెప్పేవాడిలాగా చేతుల్లోని రేఖల్ని పరిశీలించుకుంటూ కూర్చున్నారు.

ఆయన చెప్పాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నట్లున్నారు. అందుకే చెప్పడానికి సందేహిస్తున్నారు. ఇలాంటి సమయంలో నేనే చొరవతీసుకోవాలి. మెల్లగా ఆయన చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. ఆ చేతిని సున్నితంగా గా నిమురుతూ, “చెప్పండి మామయ్యా” అన్నాను.

నా మాటలకి ఆయనకి కాస్త ధైర్యం వచ్చింది. తను చెప్పబోయేదానికి ఉపోద్ఘాతంగా, “ఆత్రేయా అపార్థం చేసుకోనంటే ఒక విషయం చెబుతాను” అన్నారు. నేనేమీ మాట్లాడకుండా “చెప్పండి” అన్నట్లు ప్రోత్సాహ పూర్వకంగా చూశాను.

మా మేనమామగారు మెల్లగా చెప్పడం మొదలుపెట్టారు – “మీ అమ్మా నేనూ ఎంతో ఆత్మీయంగా పెరిగాము. తను నన్ను అక్కలా కాకుండా అమ్మలా చూసుకునేది. మీ నాన్నగారు కూడా బాగానే చూసుకునేవారుగానీ ఏదో అప్పట్లో అలా జరిగిపోయింది. అవన్నీ ఇప్పుడెందుకుగానీ మీ అమ్మ కాలం చేసిన సమయంలో మాకు సరిగ్గా జరుగుబాటు కూడా ఉండేది కాదు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు. జరక్కపోతే వడ్డీగాడని వెక్కిరిస్తారు. నేను వడ్డీకి ఆశపడి ఓ ఛిట్‌ఫండ్ కంపెనీలో పెట్టుబడి పెట్టాను. రాచపీనుగ ఒంటరిగా పోదంటారు. నేను జమునాపురంలో కూడా కొంతమంది చేత డబ్బులు కట్టించాను” అంటూ చెబుతుండగా నేను మధ్యలో కలగజేసుకుంటూ అన్నాను, “అందులో అవ్వగారు కూడా ఒక చీటీ కట్తినట్లున్నారుగా?”

మా మేనమామగారు నిర్వేదంగా నవ్వుతూ “ఆవిడ కట్టింది వడ్డీకోసం కాదు. నన్ను ప్రోత్సహించడం కోసం. నిజానికావిడ ఈ ఛిట్‌ఫండ్స్ పని మంచిది కాదని ముందే హెచ్చరించారు.. కానీ నేను వినలేదు. అందుకే నలుగురితో నారాయణా అంటూ చీటీ కట్టడానికి సిద్ధమయ్యారు. చివరికి అవ్వగారు చెప్పినట్లే ఆ ఛిట్‌ఫండ్ కంపెనీ రాత్రికి రాత్రే పెట్టేబేడా సద్దేసుకుంది. దాంతో నాకు జమునాపురం రావడానికి ముఖం చెల్లలేదు.”

“అలాగని డబ్బులు కట్టినవాళ్ళు ఊరుకోరు కదా? కట్టించింది మీరే కాబట్టీ వాళ్ళ డబ్బులు మీరే ఇవ్వాలంటూ ఇంటిమీదకి రాలేదా?”

“వచ్చినప్పుడల్లా వాళ్ళకి రేపోమాపో ఇస్తానంటూ మొదలుపెట్టి నోటికి ఏం వస్తే అది చెప్పి పంపేవాడిని. ఈలోగా ఒక పెద్దాయన అవ్వగారి పొలంలో ఫాక్టరీ కడతామంటూ వచ్చారు. అవ్వగారు ఊహించినదానికంటే రెట్టింపు రేటిచ్చి కొనుక్కుంటామన్నారు. అయినా ఆవ్వగారు అమ్మడానికి ఒప్పుకోకపోతే గౌడగారింటికి పిలిపించి రెట్టింపు కాకుండా రెండింతల మొత్తం ఇస్తామని బేరంపెట్టారు. దాంతో అవ్వగారు ఒప్పుకోక తప్పలేదు. పొలం అమ్మిన మొత్తంలోంచి నేను తీర్చాల్సిన చీటీల మొత్తన్ని వడ్డీ లేకుండా అసలు మొత్తం తీర్చేశారు. దాంతో జమునాపురంలో తలెత్తుకునే పరిస్థితి వచ్చినా మీ ఇంటిముందు తల దించక తప్పని పరిస్థితి ఏర్పడింది” అన్నారు.

నేను వెంటనే, “తల ఎత్తుకు తిరిగేలా చేసిన అవ్వగారి ముందు తలవంచడంలో తప్పేమీ లేదు. అయినా ఆవిడ అపార్థం చేసుకునేవారైతే అసలు మీ అప్పులు తీర్చేవారే కాదు” అంటూండగానే అడ్డుపడ్డారు మా మేనమామ “ఆవిడ అపార్థం చేసుకోరనేమాట నిజమే. కానీ నేను నా పరిస్థితిని అర్థం చేసుకోవాలిగా. అందుకే ఆవిడ ముందుకు రావడానికి నాకు ముఖం చెల్లేది కాదు.”

నేను సాలోచనగా చూస్తూ, “అదీ నిజమే అనుకోండి” అంటూ తలూపాను.

“తరువాత మళ్ళీ వ్యవసాయంలో పుంజుకున్నాను. క్రమంగా స్థిరపడ్డాను. నేనీరోజు స్థిరపడటానికి దోహదం చేసినవాటిలో మీ అమ్మ పసుపుకుంకాలకిచ్చిన పొలం మీదొచ్చిన ఫలసాయం కూడా ఉంది. ఇన్నేళ్ళుగా నేను తిన్న లాభానికి లెక్కల్లు కట్టివ్వడం నా వల్ల కాదు. అలాగని నీకు రావలసిన మీ అమ్మ పసుపుకుంకాల పొలాన్ని ఇంకా అనుభవించడం భావ్యం కాదు. అందుకే దాన్ని నీ పేరుమీద రాయించి తీసుకొచ్చాను” అంటూ అంగీకింద దాచుకొచ్చిన పత్రాలని తీసి చూపించారు.

పొలం పత్రాలు చూశాను. ఎనిమిది పేజీలున్నాయి. చదవడానికి రెండు నిమిషాలు కూడా పట్టదు. కానీ నాకు చదవాలనిపించలేదు. మావయ్యగారు ఆడపిల్లల తండ్రి. రేపువాళ్ళ పెళ్ళిళ్ళకి ఇది ఆదుకుంటుంది. అందుకే, “ఇన్నాళ్ళూ కాపాడారు. ఇకముందు కూడా దీన్ని మీరే కాపాడండి. ఈరోజు బాగున్నారు. సంతోషం. నేనెలాగూ వ్యవసాయం చేయించలేను. మీకు ముగ్గురమ్మాయిలున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళ బాధ్యత మీమీదుంది. ఎప్పుడే అవసరం వస్తుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టీ ఇది మీ పేరుమీదే ఉండనివ్వండి, నాకంతగా కావాలంటే నేనే అడుగుతాను” అన్నాను.

నేనా మాట అనగానే, “మూకవ్వగారి మనవడనిపించుకున్నావు” అంటూ నా చేతులు పట్టుకున్నారు.

నా జీవితంలో ఇంతకంటే గొప్ప ప్రశంస నెప్పటికీ పొందలేను.

అధ్యాయం-20

సూర్యాస్తమయాలెప్పుడూ గుబులు కలిగిస్తాయి. ఆ గుబులు ఎందుకు పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఆ గుబులుకి కారణం బహుశా పగలు గడిచిపోయిందనే బాధ కావచ్చు. పగలంతా పని చేసి వచ్చిన శ్రమవల్ల కలిగిన అలసట కావచ్చు. లేదా రాత్రి వచ్చి చీకట్లో ముంచేస్తుందనే భయం కావచ్చు.. సాయం సంధ్యాకాలం గుబులెత్తిస్తూ గుయ్యారంలోకి తీసుకువెళితే, ఉదయ సంధ్య చైతన్యంతో ముందుకొచ్చి ఉత్సాహాన్ని నింపుతుంది. కావడానికి రెండూ సంధ్యలే. కానీ రెండింటిలో ఎంత తేడా?

పడమటి కొండల్లోకి దిగుతున్న సూర్యుడికి స్వాగతం పలుకుతున్నట్లుగా చెరువులో నీళ్ళు బంగారం రంగులో లెక్కలేనన్ని ఆభరణాలు అలంకరించుకుని ఆనందిస్తోంది.

మనం సూర్యుడు పుట్టాడు, ములిగాడు అని చెప్పుకుంటూ ఉదయం సుప్రభాతాలూ సాయంత్రం పవళింపు సేవలూ చేస్తాంగానీ, లేచేదీ మనమే పడుకునేదీ మనమే. చీకటిలోకి మునిగేదీ మనమే, పగటిలోకి తేలేదీ మనమే. గతించినవారి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడానికి వాళ్ళని సూర్యుడిలోనో చుక్కల్లోనో వెతుక్కుంటాం. వారిని కూడా చుక్కల్లో చేర్చి వారిని ఆరాధిస్తాం.

మా మామగారినీ మేనమామగారినీ మీరానీ అందరినీ పడవెక్కించి వెనక్కి వస్తున్నాను. దారిలో చెరువు అందాలూ చెట్ల హుందాతనాలూ ఆ వెనక తలెత్తుకుని నిలబడి ఆకాశాన్ని చుంబిస్తున్న పర్వత శ్రేణీ అన్నింటినీ కనులారా చూసుకుంటూ నడుస్తున్నాను. ఎంత చూసినా కళ్ళు నిండుతున్నాయేగానీ మనసు నిండటం లేదు. ఇంటికొచ్చేసరికి మనసు నిండే మాటొకటి నాకోసం ఎదురు చూస్తోంది

అవ్వగారు అరుగుమీద కూర్చున్నారు. భాగీరథమ్మగారు ఎదురొచ్చి మైసూర్ పాక్ నోట్లో పెట్టారు. ఆ తరువాత తియ్యటి వార్త చెప్పారు. వాళ్ళ పెద్దమ్మాయి మీనాక్షి పదవ తరగతిలో తాలూకాలోనే ప్రథమస్థానంలో నిలబడిందట. ఏకంగా తాలూకా స్థాయిలోనే మొదటి స్థానం సాధించడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎక్కడో జమునాపురంలాంటి మారుమూల గ్రామంలో నివసిస్తూ, ఇంటిపనులూ వంటపనుల్లో తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ పాఠ్యపుస్తకాలు తప్ప ఇంకేమీ కొనివ్వలేని పరిస్థితుల్లో లెక్కలేనన్ని ప్రైవేటు స్కూళ్ళూ, అవి చేసే మాయలూ మర్మాలూ, ఉత్తమ ఉపాధ్యాయుల పర్యవేక్షణా కలిగిన వాతావరణంలో చదువుకునే ప్రైవేటు విద్యార్థులందరినీ అధిగమించి మొదటి స్థానంలోకి రావడమంటే సామాన్యమైన విషయం కాదు. మిగిలిన విద్యార్థులకి చదువే ప్రధాన బాధ్యత. పాపం మీనాక్షికి చదువుకంటే బాధ్యతల బరువే ఎక్కువ. అన్ని భాధ్యతల్ని నెరవేరుస్తూనే ర్యాంక్ తెచ్చుకుంది. అదీ మీనాక్షి తాలూకా స్థాయి ఫస్ట్ ర్యాంక్ ప్రత్యేకత.

అంతలోనే లోపలకి వచ్చింది మీనాక్షి. తనని అభినందిస్తూ కరచాలనం చేశాను. ఆ చేతిని వదలకుండా అలాగే ఆమెని బయటకు తీసుకువచ్చి అరుగుమీద కూర్చోబెట్టాను. చక్కగా పద్మాసనం వేసుకుని కూర్చుంది. తనని అలా చూస్తుంటే జ్ఞాన సరస్వతే మా ఇంటి అరుగుమీదకొచ్చి కూర్చున్నట్లనిపించింది. వెంటనే సెల్ తీసి మీనా ఫోటో తీసుకున్నాను. ఆ తరువాత నేను కూడా తన పక్కన కూర్చున్నాను.

“తాలూకా లెవల్లో ఫస్ట్ ప్లేస్ తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. కానీ నువ్వు సాధించావు. కాబట్టీ ఇప్పుడు నువ్వు ఏ గ్రూపులో చేరాలనే నిర్ణయం మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది”అన్నాను

తను వెంటనే ఏమాత్రం తడుముకోకుండా, “హిస్టరీలో ఎమ్మే చదివి లెక్చరర్ ఆవ్వాలనుకుంటున్నాను” అని చెప్పింది. తను చెప్పింది వినగానే నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇంత మంచి ర్యాంకు తెచ్చుకున్న విద్యార్థుల్లో ఎవర్ని కదిలించినా ఇంజనీరింగో మెడిసినో అంటారే తప్ప చరిత్ర చదువుకుంటానని ఎవ్వరూ చెప్పరు. విద్యార్థులు చరిత్ర, భాషల మాటెత్తకుండానే చదువులు ముగించేలా పెంచుతున్నాం మనం. విదేశాలకి ఊడిగం చేయించడానికీ వారి సంపదని పెంపొందించడానికే మన పిల్లలని చదివిస్తున్నాం. అంతే తప్ప వారిని ఉత్తమ పౌరులుగా రూపొందించడం మీద ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. అందుకే మీనాక్షి సమాధానం వినగానే నాకు సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. అందుకే తనని ఆభినందిస్తూ, “మంచి ఆలోచనమ్మా. మరి ఏ కాలేజీలో చేరతావు?” అని అడిగాను..

“బెంగుళూరు మహారాణి కాలేజ్.”

“అక్కడే ఎందుకు?”

“చరిత్ర అధ్యయనంలో దాన్ని మించిన కాలేజీ మన కర్ణాటకలో ఎక్కడా లేదు.”

“మరీ విషయం మీ అమ్మగారితో మాట్లాడావా?”

“తల్లులకి కూతుళ్ళు చెబితే అర్థం కాదు. మీలాంటి చదువుకున్నవాళ్ళెవరైనా చెబితే బాగా ఆర్థమౌతుంది. అమ్మ ఇప్పటికే నన్నుకూడా మీలాగే సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా చేసి అమెరికా పంపించాలని కోరుకుంటున్నారు” అని చెబుతుంటే నాకు ఆశ్చర్యమనిపించింది. ‘ఈ లోకరీతే అంత. మనం వదిలించుకు రావాలనుకున్నవాటినే మనవాళ్ళు తగిలించుకోవాలని ప్రయత్నిస్తూంటారు’ అనుకుంటూ మీనాక్షిని లోపలకి తీసుకెళ్ళాను. అవ్వగారు మామిడికాయ తొక్కలు తీస్తుంటే భాగీరథమ్మగారు తరుగుతున్నారు. నేను వెళ్ళి వాళ్ళముందు కూర్చున్నాను. మీనాక్షి వచ్చి నా పక్కన కూర్చుంది.

నేను రెండు మామిడి ముక్కలు తీసుకున్నాను. ఆ తరువాత ఉపోద్ఘాతమంతా, “భాగక్కా, మైసూరు పాక్ పెట్టి నోరు తీపిచేశారు. ఇప్పుడేం చేస్తారు?”

అవ్వగారు నవ్వుతూ, “మామిడికాయల పచ్చడి చేస్తుంది. నోరు పుల్లగా చేస్తుంది” అన్నారు.

ఆవిడ హాస్యాలాడటం పరాచికాలాడటం వంటివి ఎప్పుడోగానీ చూడని మీనాక్షి గట్టిగా నవ్వింది. పెద్దవాళ్ళముందు అంత గట్టిగా నవ్వకూడదు అన్నట్లు మందలింపుగా చూశారు భాగీరథమ్మగారు.

అవ్వగారు మాత్రం, “అబ్బా నవ్వితే ఇంతందంగా ఉంటావని నాకు తెలియదు. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండు” అన్నారు.. ఆవిడామాట అనగానే ఠక్కున మీనాక్షి నవ్వాగిపోయింది.

నేను భాగీరథమ్మగారివైపు చూస్తూ, “అక్కా తన భవిష్యత్తు గురించి మీరేం ఆలోచిస్తున్నారు?” అని అడిగాను.

“భవిష్యత్తు గురించి ఆలోచించడానికి కొన్ని అర్హతలుండాలి. అవి నాకు లేవని నీకూ తెలుసు. మీ అవ్వగారు సావిత్రిని శివమొగ్గ పంపి చదివించమన్నారు. భట్టుగారొప్పుకోలేదు. పెళ్ళి చేసి పంపారు. ఒకవేళ శివమొగ్గ పంపిస్తే తనింకా బతికే ఉండేదేమో. మడీ దడీ ఎండా కొండా అనుకుంటూ కూర్చుంటే ఏ ప్రయాణమూ సాగదు” అన్నారావిడ.

ఆవిడ ప్రతిస్పందన సానుకూలంగానే అనిపించడంతో నేను మధ్యలో కలగజేసుకుంటూ అన్నాను, “అది కూడా నిజమే. మీనాక్షి చాలా తెలివైనది. దానికి తగిన చదువులు చదివితే తను పైకొస్తుంది.”

“అందుకే తను కూడా నీలాగే చదువుకుని నీలాగే పైకి వస్తే బాగుంటుందనుకుంటున్నాను”

“నా చదువుకీ తన ఆసక్తికీ చాలా దూరం ఉంది. నా చదువుకన్నా నా ఉద్యోగంకన్నా నా జీతంకన్నా తన జీవితం గొప్పది. తన జీవిత లక్ష్యం ఇంకా గొప్పది.. నేను చదువుకుంటున్నప్పుడు నా భవిష్యత్తు పట్ల నాకంత స్పష్టత ఉడేది కాదు. కానీ తనకి చాలా స్పష్టత ఉంది. కనుక తనలాంటివారిని నాలాగా ధనం సంపాదించే చదువులు కాక సంస్కృతి అనే ఇంధనం సంపాదించుకునే చదువులు చదివించడమే మంచిదనిపిస్తోంది.”

భాగీరథమ్మగారు ఆలోచనలో పడ్డారు. కానీ అవ్వగారు ఏ ఆలోచనా చెయ్యకుండానే తన అభిప్రాయాన్ని ప్రకటించారు, “చూడమ్మా భాగీరథీ, మన ఆత్రేయ చెప్పాడంటే అన్నీ ఆలోచించే చెప్పుంటాడు. మనం అక్కడా ఇక్కడా విన్న మాటల కంటే ఆత్రేయ అనుభవంతో చెప్పేమాటలు వింటే మంచిది. తనెక్కడికి పంఫమంటే అక్కడికి పంపు. ఏం చదివించమంటే అదే చదివించు. కానీ ఒక్కమాట మరచిపోవద్దు. చదివించేది నువ్వు. సలహా ఇచ్చేది ఆత్రేయ. కానీ చదవాల్సింది మన మీనాక్షి. కాబట్టీ మీ ఇద్దరూ కలిసి తన అభిప్రాయం తెలుసుకుని, తనేం కోరుకుంటే అది చెయ్యాలి. ఒకవేళ తను కోరుకున్నది మీరు కాదంటే, ఎందుక్కాదంటున్నారో తనకి అర్థమయ్యేలా వివరించండి. నొప్పించకుండా ఒప్పించండి” అని మాకు చెప్పాక మీనాక్షివైపు తిరిగారు, “ఏమ్మా మన ఆత్రేయ చెప్పే చదువు నీకిష్టమేనా?” అని అడిగారు.

మీనాక్షి చిరునవ్వుతో తల ఊపింది.

మానవ సంబంధాలను విరిచేయడం సులభం. సరిచేయడం కష్టం. కానీ అవ్వగారికి మాత్రం సరిచేయడం మంచినీళ్ళు తాగినంత సులభం.

***

తెల్లవారుజామునే నిద్రలేచాను.

ఎప్పటిలాగే అవ్వగారు ధ్యానం చేసుకుంటున్నారు. పెరట్లోకి వచ్చి చూస్తే పాలేరు దూళ్ళపాకలు శుభ్రం చేసి ఆవులకి కుడితిపెట్టి అవి తాగుతుంటే పాలేరు కర్రావుకీ మీనాక్షి మచ్చలావుకీ పాలు పితుకుతున్నారు. నేను తెల్లావు దగ్గరకి వెళ్ళి పాలు పితకడం ఆరంభించాను. నాకీ సమయంలో మా పెరడే గోకులంలాగానూ పాలేరు గోవుల గోపన్నలాగానూ, మీనాక్షి గోపికలాగానూ కనిపిస్తున్నారు. నేను మా పెరటిలో భాగవతాన్ని వీక్షిస్తున్నాను. ఆ కాలంలో కూడా పాల డైరీలుండేవి. పాలని కడవల్లో నింపి నగరాలకి పంపి విక్రయించేవారు. నేటి డైరీలకీ నాటి పాలకేంద్రాలకీ తేడా ఒకటే, అవన్నీ తాజా పాలు. కానీ మనం తాజాగా కొనుక్కునేపాకెట్లలో ఉండేది నిలవపాలు. అందులో మీగడా వెన్నా సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఏవీ లేకపోతే ఒక రేటు. చిక్కగా ఉంటే ఇంకో రేటు. వెన్నుంటే మరో రేటు.. మీగడకూడా ఉంటే రేటే రేటు. అన్నింటికీ రేటింగ్సే. ఆధునికత అంటే రేటింగ్సూ గ్రేడింగ్సే.

ఒకప్పుడు సత్యయుగం. ఆనక త్రేతాయుగం, తరువాత ద్వాపరయుగం ఇప్పుడు నడిచేది కలియుగం అంటాం మనం. కానీ అబద్ధాల్ని నిజాలుగా మార్కెట్ చేసే వాణిజ్యయుగం అంటారు వాళ్ళు. ఈ మధ్యన మనవాళ్ళంతా వాళ్ళ వెంటే పడుతున్నారు. మీనాక్షిలాంటి అతికొద్దిమంది తప్ప.

పాలు పితుకుతూనే మీనాక్షివైపు చూశాను తను కూడా నావైపు చూసింది. ఆమె చూపుల్లో నాకేదో రహస్య సందేశం కనిపించింది. అంటే తను దేనిగురించో నాతో మాట్లాడాలనుకుంటోంది.

పాలు పితకడం పూర్తి చేసి రెండు క్యాన్లలో నింపాము. వాటిని తీసుకెళ్ళి డైరీలో పోసి రావాలి. మామూలుగా పాలేరే ఆ రెండు క్యాన్లనీ తీసికెళ్ళేవాడు. కానీ ఈ రోజు నేను బయలుదేరాను. నా వెంట మీనాక్షి కూడా నాతో వస్తానంది. ఒకరికి ఇద్దరం తోడవ్వడంతో ఏదో పనుందని వంకెట్టి పాలేరు ఇంటికెళ్ళిపోయాడు.

నేనూ మీనాక్షీ నడుస్తున్నాం. దారిలో తనే మాట్లాడటం మొదలుపెట్టింది.

“నేను మీకో విషయం చెప్పాలి”

“కొంపతీసి హిస్టరీని తీసికెళ్ళి హిస్టరీలో కలిపేసి గ్రూపు మార్చేద్దామనుకుంటున్నావా ఏమిటి?” అంటూ నవ్వాను.

తను కూడా నవ్వేస్తూ చెప్పడం కొనసాగించింది, “ఇది నాకు సంబంధించిన విషయం కాదు. మా క్లాసులో అన్నపూర్ణ అనే అమ్మాయుంది. నాకంటే తెలివైనది. మన శివమొగ్గ జిల్లాలో ఫస్ట్ రావలసింది. కానీ మన తాలూకాలో సెకండ్ వచ్చింది”

“అద్భుతం. అంటే తాలూకా స్థాయిలో మొదటి రెండు స్థానాలూ జమునాపురానికే వచ్చాయన్నమాట. లేక లేక ఈ ఊరొచ్చినందుకు మీరిద్దరూ నేను ఊహించలేని బహుమతిలిచ్చారు. తనకి నా తరపున అభినందనలు చెప్పు”

“కేవలం అభినందనలు చెబితే సరిపోదు.”

“ఏవైనా సలహాలూ సూచనలూ కావాలా?”

“చదువుకునే అవకాశం ఉంటే తప్ప తనకి మీ సలహాలూ సూచనలూ అవసరం ఉండవు”

“నేనేం చెయ్యాలో సూటిగా చెప్పమ్మా.”

“తనని చదివించాలి.”

“అంటే?”

“నిన్న సాయంత్రం తను నన్ను కలిలిసింది. తనకి చదువుకోవాలని ఉందని చెప్పింది.”

“తన తల్లిదండ్రులకి చెప్పాల్సిన విషయం నీకెందుకు చెప్పింది.”

 “తనకి తల్లి లేదు.”

“మరి తండ్రి?”

“ఉన్నా ఉపయోగం లేదు, పెంచుతున్న తాతా అవ్వగార్లకి ఆరోగ్యం అంతంత మాత్రమే. పైగా చదివించే స్తోమత కూడా లేదు”

“స్కాలర్‌షిప్ రాదా?”

“అది ఫీజుల విషయంలో ఉపయోగిస్తుందిగానీ మహానగరంలో ఉండటానికి సరిపోదు”

“మరి వాళ్ళ పెద్దలు ఆమెని బెంగుళూరు పంపడానికి ఒప్పుకుంటారా?”

“ఒప్పుకోరు. మీరే ఒప్పించాలి. తను చదువుకోవడానికయ్యే ఖర్చంతా వాళ్ళు భరించలేరు. అందుకే మీ సహాయం కోరుతున్నాను” అంది.

మా మధ్య ఇలాంటి సంభాషణ జరిగే అవకాశం ఉందని నేను ఏమాత్రం ఊహించలేదు. అందుకే ఏం చెప్పాలో పాలుపోక సాలోచనగా నడుచుకుంటూ వెళుతున్నాను. మీనాక్షి నన్ను అనుసరిస్తూనే మెల్లగా చెప్పడం మొదలుపెట్టింది, “నా చదువుకి సహాయం చెయ్యమని అడగటంలో అర్థముంది. కానీ నా స్నేహితురాల్ని చదివించమని కోరడంలో అర్థం లేదు. అయినా మిమ్మల్ని తప్ప ఇంకెవరినీ అడగలేను. మీ ఋణం ఉంచుకోదు. ఉద్యోగం రాగానే అప్పు తీర్చేస్తుంది. ఒకవేళ తను తీర్చకపోతే నేను తీరుస్తాను” అంటుంటే నాకు ఏం మాట్లాడాలో పాలుపోలేదు తను నా మౌనాన్ని నా అసమ్మతిగా భావించి ఉంటుంది.. అందుకే బాధ్యత తనమీద వేసుకోవడానికి సిద్ధపడింది.

నేను ఆలోచిస్తున్నది వేరు. అందుకే, “చూడమ్మా మీనాక్షీ, నేను ఆలోచిస్తున్నది తన చదువు గురించిగానీ తనకి సహాయం చెయ్యడం గురించిగానీ కాదు. ఒకవేళ అన్నపూర్ణ పైచదువుల కోసం బెంగుళూరు వెళ్ళిపోతే ఆ పెద్దవాళ్ళిద్దరినీ చూసుకునేదెవరు?” అని అడిగాను.

మీనాక్షి వెంటనే సమాధానం చెప్పలేదు. కాసేపు ఆలోచించుకున్న తరువాత మెల్లగా, “నేను దాని చదువు గురించే ఆలోచించానుగానీ ఆ పెద్దవాళ్ళ గురించి ఆలోచించలేదు. ఒకవేళ అది నాతోబాటు బెంగుళూరు వస్తే పెద్దవాళ్ళని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. దానిగురించి మేమిద్దరం కలిసి చర్చించుకోవాలి” అంది.

“తనకి చదువు చెప్పించడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. ఖర్చు విషయం నేను చూసుకుంటాను. ఇంక పెద్దవాళ్ళ గురించి చర్చించుకోవలసింది మీరు కాదు. అవ్వగారిలాంటి పెద్దవాళ్ళు మాత్రమే చెయ్యదగిన పని అది. ఆవిడకి అన్నపూర్ణ తాత, బామ్మగార్ల గురించి తెలుసా?”

“తెలుసుగానీ. వాళ్ళమధ్య మాటల్లేవు”

“మన మధ్య కూడా మాటల్లేవు. కానీ ఇప్పుడు ఇన్ని విషయాలు మాట్లాడుకున్నామా లేదా? అవసరం అన్నీ సమకూరుస్తుంది. అలాంటిది నాలుగు మాటలు పలికించలేదా? దానిగురించి నేను చూసుకుంటాను” అన్నాను.

మీనాక్షి నావైపు విస్మయంగా చూస్తోంది. నేను కూడా తన ముఖాన్ని ఒకింత విస్మయంగా చూస్తున్నాను. అప్పుడే తూరుపు కొండెక్కుతున్న వెలుగురేకలు మా ఇద్దరినీ మరింత విస్మయంగా చూస్తున్నాయి. మనసుతో చూడాలేగానీ ఈలోకంలో విస్మయం కానిదేముంది? నా విస్మయానికి కారణం మీనాక్షిలోని స్నేహభావం. మరా ఉషాకిరణాల విస్మయం ఎందుకు?

ఊహించుకునేలోపే పాలడిపో వచ్చేసింది. మేము పాలు కొలుస్తూండగానే ఉత్తర దిక్కునుండి హారన్ వినిపించింది. అది పాల లారీ హారన్. ఆ హారన్ సౌండులో, ‘అన్నపూర్ణ అవ్వాతాతలకీ మీ అవ్వగారికీ మాటల్లేవు కదరా ఆత్రేయా, వాళ్ళని కలపడం డైలాగులు కొట్టినంత సులభం కాదు’ అనే వెక్కిరింత వినిపిస్తోంది.

(ఇంకా ఉంది)

Exit mobile version