Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అవ్వగారు-12

[ధనంజయ లక్ష్మీ రామకృష్ణగారు వ్రాసిన ‘మత్తె మూకజ్జి’ అనే కన్నడ నవలని ‘అవ్వగారు’ పేరుతో అనువదించి ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.]

[ఆత్రేయ గౌడగారింటి నుంచి వచ్చేసరికి, అవ్వగారు గాదెల లోంచి ధాన్యం తీయించి, బస్తాల్లో నింపించి, తనే దబ్బనం పురికోసా తీసుకుని కుడుతుంటారు. ఆ పని ముగించి ఆత్రేయని చూసి, ఎక్కడికెళ్ళారు అని అడుగుతారు. భట్టుగారిని తీసుకుని వేదపాఠశాల గురించి అడగటానికి గౌడగారి దగ్గరకు వెళ్ళినట్లు చెప్తాడు. ఆయన ఒప్పుకోలేదు కదా అని అడుగుతారు అవ్వగారు. ఒప్పుకున్నారని ఆత్రేయ చెప్పగానే, వాళ్ళ తమ్ముడొచ్చి ఒప్పించి ఉంటాడని అంటారు.  మీకెలా తెలుసని ఆత్రేయ అడిగితే, ఆయనకి ఏదైనా తమ్ముడొచ్చి చెప్తేగాని బుర్రకెక్కదని అంటారు. ఆ ధాన్యం బస్తాలని మర పట్టించి, బియ్యం బస్తాలను భట్టుగారింటికి పంపే ఏర్పాటు చేస్తాడు ఆత్రేయ. ఇంటికొచ్చి, స్నానం చేసేసరికి మీరా, సీత కనబడతారు. ఏంటి సడన్ సర్‌ప్రెజ్ అని అడిగితే, వెనకాల వచ్చిన అత్తగారు వాళ్ళ రాకకి కారణం వివరిస్తారు. కాసేపటికి ఆత్రేయ మేనమామ అక్కడికి వస్తారు. వెళ్ళి ఆయననని పలకరించాకా, ఆయన ఆత్రేయ అమ్మకి సంబంధించిన పొలం దస్తావేజులు సంచీలోంచి బయటకు తీసి ఇన్నాళ్ళూ తన అక్క సొమ్ముని అనుభవించినందుకు క్షమించమని అడుగుతారు. ఆత్రేయ ఆ కాయితాలని ఆయనకే ఇచ్చేసి, తనకి ఆ ఆస్తి మీద ఆసక్తి లేదని, ఆయనకి ముగ్గురు కూతుర్లున్నారనీ, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఉపయోగించుకోమని చెప్తాడు. మామయ్య కృతజ్ఞతలు చెప్తారు. మేనమామనీ, అత్తగారిని సీతని, మీరాని పడవ ఎక్కించి పంపించి ఇంటికొస్తాడు ఆత్రేయ. భాగీరథమ్మగారి పెద్దమ్మాయి మీనాక్షి పదవ తరగతిలో ఆ తాలూకాలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని తెలుస్తుంది. ఆమెని అభినందించి, తర్వాత ఏం చదువుదామని అనుకుంటున్నావని అడుగుతాడు. తాను హిస్టరీలో ఎం.ఎ. చేసి, లెక్చరర్ అవ్వాలని అనుకుంటున్నట్టు చెప్తుంది మీనాక్షి. బెంగుళూరు కాలేజీలో చేరాలనుకుంటున్నాననీ, అమ్మని ఒప్పించమని అడుగుతుంది. ఆత్రేయ భాగీరథమ్మగారితో మాట్లాడుతాడు. ఏం చేసినా మీనాక్షి నొచ్చుకోకుండా చెయ్యమని చెప్తారు అవ్వగారు. మర్నాడు ఉదయం పాలు పితికి క్యాన్‍లలో పోసుకుని డైరీలో ఇచ్చి రావడానికి ఆత్రేయ బయల్దేరుతుంటే తానూ వస్తానని బయల్దేరుతుంది మీనాక్షి. దారితో తన నేస్తం అన్నపూర్ణ గురించి చెప్తుంది. తనని చదివించే బాధ్యత తీసుకోమని అడుగుతుంది కూడా. అన్నపూర్ణ బెంగుళూరు వెళ్ళిపోతే, ఇంట్లో ఉన్న ఆమె తాతయ్యా, నాయనమ్మలను ఎవరు చూసుకుంటారని ప్రశ్నిస్తాడు ఆత్రేయ. అన్ని విషయాలు తాను చూసుకుంటానంటాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-21

నేను పాఠశాల పనులని పర్యవేక్షించడానికి వెళుతుండగా భాగీరథమ్మగారు ఎదురొచ్చారు. నేను రావడాన్ని గమనించిన వెంటనే వీధివైపునుండి ఇంట్లోకి వెళ్ళవలసినవారు పెరటివైపుగా వెళ్ళిపోయారు. ఆవిడలా తప్పించుకుపోవడం చూసి నాకు గతం గుర్తుకువచ్చింది. అమ్మ గుర్తొచ్చింది. భాగక్క గురించి అమ్మ నాకు చెప్పిన నిజాలు గుర్తొచ్చాయి.. దాంతో నాకు తెలియకుండానే నా కళ్ళు చెమ్మగిల్లాయి.

అమ్మంటే తీపి జ్ఞాపకం. చెరుకుగడలకా తీపెక్కడినించి వచ్చిందో అక్కడినుండే అమ్మ అనే మాటకి తియ్యందనంకూడా వచ్చింది. అమ్మంటే మమకారం. అమ్మంటే మమత్వం అమ్మంటే మానవత్వం. అమ్మంటే గౌరవంలేని మనుషులు ఎప్పటికీ మనుషులు కాలేరు. అలాంటి అమ్మని గుర్తు చేసుకోవడానికి మీనాక్షి కారణమైంది. ఎంతైనా మధుర మీనాక్షి కదా?

నాకు ఎప్పుడేమనిపించినా ముందుగా అమ్మకే చెప్పేవాడిని. బహుశా నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడనుకుంటాను, అందరూ మా భాగక్కగారి వెనుక ఆవిడ గురించి శకునపక్షి అంటూ చులకనగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒకసారి ఒకావిడ భాగీరథమ్మతల్లి ఎదుర్రావడంకంటే పిల్లెదుర్రావడమే మేలు అని తప్పుకుపోయింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆవిడ ఎదురొస్తే అపశకునం అని అందరూ తప్పుకుపోతూంటారు. అలాంటి అపశకున పక్షి మా భాగక్కగారిని శకునపక్షి అనడంతో నాకు చాలా బాధేసింది. అయినా అంతగా పట్టించుకోలేదు. ఒకసారి నేను బడికి వెళ్ళేటప్పుడు భాగక్క నీళ్ళబిందెతో నాకు ఎదురొచ్చారు. ఆరోజు మా స్నేహితుడు మామిడికాయలు కొయ్యడానికి చెట్టెక్కి పట్టుతప్పి కిందపడ్డాడు. వాడి కాలు విరిగింది. దాంతో భాగక్క గురించి ఆ అపశకున పక్షి చెప్పింది నిజమే అనిపించింది. కానీ ఆవిడ అపశకునమైతే ఆవిడని చూసింది నేను కాబట్టీ ఆ చెట్టెక్కి కాలు బిరగ్గొట్టుకోవలసింది నేనే కదా అనే ఆలోచన పుట్టలేదు.

అప్పటినుండి ఆవిడ ఎదురొస్తే నేను పక్కకి తప్పుకుపోవడం మొదలుపెట్టాను. ఈ విషయాన్ని మా అమ్మగారు గమనించారు..

అందుకే, ఒకరోజు సాయంత్రం బడినించి వచ్చాక నాకు చెగోడీలు పెట్టారు. నేను వెళ్ళి గుడి అరుగుమీద కూర్చుని తింటున్నాను. ఆ సమయంలో అమ్మకూడా వచ్చి నా పక్కన కూర్చున్నారు. నెమ్మదిగా నా తలమీద చెయ్యేసి జుట్టులోకి వేళ్ళు జొనిపి నిమురుతూ చెప్పడం మొదలుపెట్టారు “అమ్మంటే కేవలం కన్నతల్లి మాత్రమే కాదు. అక్క, పెద్దమ్మ, అవ్వ అత్త అందరూ అమ్మలే. కాబట్టీ మనం అందరినీ అమ్మల్లాగే చూడాలి. ఈలోకంలో అమ్మతనం లేని ఆడవాళ్ళెక్కడా ఉండరు. నాలాంటి వాళ్ళీమాట అనగానే కొంతమంది కుర్రాళ్ళు మరి భార్యల్ని కూడా తల్లిలాగే చూడమంటారా? అని వెక్కిరిస్తారు. నిజానికి భార్యలోకూడా తల్లిని చూడలేనివాడు ఎప్పటికీ మంచి తండ్రి కాలేడు” అనగానే అమ్మ నా ప్రవర్తన గురించే చెబుతున్నారని అర్థమైంది. అందుకే శ్రద్ధగా వినసాగాను.

ఆ రోజు భాగీరథమ్మగారి గురించి అమ్మ చెప్పిన ప్రతిమాటా చాలా విలువైనది. ఆ మాటలు విన్న తరువాతగానీ నాకు భాగీరథమ్మగారి గొప్పదనం ఆర్థం కాలేదు.

అమ్మకి చెప్పడం కొత్తకాదు, నాకు వినడం కొత్త కాదు. కానీ ఈ విధంగా ఒక వ్యక్తి గురించి నేను అపార్థం చేసుకోవడం, దానిని అమ్మ సరిదిద్దడానికి వారి గతాన్ని చెప్పాల్సి రావడం కొత్త. అందుకే అమ్మ తను చెప్పాలనుకుంటున్నదాన్ని చెప్పడంకోసం మాటలు తడుముకుంటున్నారు. తరవాత ఎక్కడి నుండి మొదలుపెట్టాలో ఒక నిర్ణయానికి వచ్చినదానిలాగా “ఆత్రేయా” అన్నారు.

నేను “ఊ” అన్నాను.

“మీ అవ్వాతాతలు తెలుసుగా? ఇద్దరూ ఇద్దరే. కానీ, ఆ ఇద్దరూ ఇద్దరు కాదు, ఒక్కరే అనే విషయం నాకప్పుడప్పుడే అర్థమౌతోంది. అప్పటికి మా పెళ్ళై రెండు సంవత్సరాలైంది. ఈ రెండేళ్ళలోనూ ఎప్పుడూ జరగని ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. శివమొగ్గలో ఒక శుభకార్యానికి వెళుతున్నారు. శుభకార్యానికి ఉత్త చేతులతో వెళ్ళకూడదు.. అందుకే ముందురోజు బొబ్బట్లు, అరిసెలూ చెగోడీలూ కారప్పూసా తయారు చేశారు. వెళ్ళేప్పుడు మన ఇంటినించి పాలు తీసుకువెళ్ళి ఇవ్వడం మన వంశాచారం. తెల్లవారుజామునే లేచి పాలు పితికి చిన్న క్యానులో పోసుకుని బయలుదేరారు. నది దాటి శివమొగ్గకి నడిచి వెళుతున్నారు. సగందారిలో ఒక తెల్ల జిల్లేడు పొద కనిపించింది. తెల్ల జిల్లేడు పూలు అర్కమహాగణపతికి ఇష్టమైన పూలు.. అందుకే ఆ పూలు కోసుకోవడానికి వెళ్ళారు మీ అవ్వగారు. నాలుగు పూలు కోసుకుని సంచిలో వేసుకుని వెనక్కి తిరగ్గానే పసిబిడ్డ ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు వినగానే ఆవిడ వెనక్కి వెళ్ళి చూసింది. ఆడపిల్ల. ఏ తల్లి కన్న బిడ్డో. ఏ కులమో ఏ మతమో తెలియదు. ముట్టుకోవచ్చో ముట్టుకోకూడదో తెలియదు.. ఎలా?

చూస్తూండగానే ఆ పిల్ల ఏడుపు తారస్థాయికి చేరింది మీ అవ్వగారిలోని తల్లి మనసు ఊరుకేలేదు. అందుకే ఆ పిల్లని ఎత్తుకోబోతుంటే మీ తాతగారు ఆవిడని ఎత్తుకోనివ్వలేదు. దాంతో అవ్వగారు, ఎందుకని అడిగారు. మనం ఎవరంటే వాళ్ళని ముట్తుకోకూడదు. వెనక్కి జరుగు. అన్నారు..

ఆ తరువాత ఆయనే ఆ అమ్మాయి ముందుకు వెళ్ళి గాయత్రీమంత్రాన్ని జపిస్తూ కాసిని పాలని పాపమీద చల్లారు. అనంతరం తనే ఎత్తుకుని మీ అవ్వగారి చేతికిస్తూ పసిబిడ్డలకి కులమత భేదాలుండవు. వాళ్ళు గాయత్రీమాత వరప్రసాదాలు. తనకి ముందు ఈ పాలు పట్టించు అంటూ పాల క్యాను ఆవిడ చేతికిచ్చారట” అనగానే నాకో అనుమానం వచ్చింది.

“అది కాదమ్మా, పసిపిల్లలు గాయత్రీ మాత వరప్రసాదమైనప్పుడు అవ్వగారిని ఎందుకు అడ్డుకున్నారు? క్షీరాభిషేకం ఎందుకు చేశారు?”

“ఎందుకంటే దేవుడి విగ్రహాన్ని ఎవరైనా తయారు చేయవచ్చు. కానీ ఆ విగ్రహానికి పూజలు చెయ్యడానికి ముందు ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి. అందుకే మీ తాతగారు ఆ పసిబిడ్డకి గాయత్రీమాత సాక్షిగా ప్రాణ ప్రతిష్ఠ చేశారన్నమాట”

నాకు ఆశ్చర్యం కలగలేదు. ఆనందం కలిగింది. మనిషి కూడా అన్నిరకాల జంతువుల్లాంటివాడే జంతువులకుండాల్సిన లక్షణాలన్నీ మనిషిక్కూడా ఉంటాయి. జంతువుల్లో ఒక్కొక్క జంతువుకీ ఒక్కొక్క గుణం ఉంటుంది.. కుక్కకి విశ్వాసం కోతికి చాపల్యం నక్కకి జిత్తులు ఇలా దేని లక్షణాలుంటాయి. ఆ లక్షణాలన్నీ కలగలిసిన జంతువు పేరే మనిషి. ఆ మనిషిని మనిషిగా మార్చేదే మానవత్వం. అందుకే లోకంలో ఎన్నిరకాల జంతువులున్నాయో మనుషుల్లో కూడా అన్నిరకాల ప్రవృత్తులున్నాయి. ఆయా జంతు ప్రవృత్తుల్ని అధిగమించి మానవ ప్రవృత్తిని ప్రదర్శించే స్థాయికి ఎదిగేంతవరకూ మనిషికూడా జంతువుతో సమానమే. ఆ పసిబిడ్డకి క్షీరాభిషేకం చేసి పాలు పట్టడంతో మా అవ్వాతాతలిద్దరూ విశ్వమానవులుగా రూపొందారు. అలాంటి విశ్వమానవుల వారసత్వం లభించడం నా అదృష్టం. కానీ అప్పట్లో నాకివన్నీ తెలియకపోవచ్చు. కానీ అమ్మ మాటల్లో ఏదో మర్మం ఉంది. అదేమిటో తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి ఏం అడగాలో తెలియదు. నేను అమ్మని ఏం అడగాలో ఎలా అడగాలో నిశ్చయించుకునేలోపే అమ్మగారే నన్ను ఒక ప్రశ్న అడిగారు, “వాళ్ళు వెళుతున్న శుభకార్యం ఏమిటో తెలుసా?”

నేను తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపాను.

“వాళ్ళు వెళుతున్నది నామకరణ మహోత్సవం. చేతిలో చూస్తే పసిగుడ్డు. పాలు పట్టి బిడ్డని ఊరుకోబెట్టగ్గానే ఆ పాపని ఏం చెయ్యాలి? అనే ప్రశ్న తలెత్తింది. మీ తాతగారు అడగ్గానే “ముందు స్నానం చేయించాలి” అన్నారు మీ బామ్మగారు. నదికి తీసుకువెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి నదీమతల్లి ఆశీస్సులందించి తను కట్టుకోవడానికి తెచ్చుకున్న మెత్తటి నూలుచీరలో పెట్టుకుని బయలుదేరారు. దారిలో రకరకాల అనుమానాలొచ్చాయి. వెళ్ళిన చోట నాలుగురకాల మనుషులుంటారు. నాలుగురకాల మాటలంటారు. ఎవరికి తోచిన ప్రశ్నలు వాళ్ళు లేవనెత్తుతారు. వాటన్నింటికీ సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితిని కొనితెచ్చుకోవడం కంటే నామకరణానికి వెళ్ళకుండా ఉండటమే మంచిదనిపించింది. అందుకే శుభకార్యానికి వెళ్ళకుండా వెనక్కి వచ్చేశారు.

అత్తమామల్ని చూడగానే ఎప్పటిలాగే నీళ్ళ చెంబుతో ఎదురెళ్ళాను. అత్తయ్యగారి చేతిలో పసిబిడ్డని చూడగానే బిత్తరపోయాను. మామగారు నా పరిస్థితిని అర్థం చేసుకుని నా చేతిలోని చెంబు తీసుకుని తను కాళ్ళు కడుక్కుంటున్నారు. ఉన్నట్లుండి బిడ్డ ఏడవడం మొదలుపెట్టింది. అత్తగారు ఆ బిడ్డని ఊరుకోబెట్టడానికి ఎంత ప్రయత్నించినా ఊరుకోవడం లేదు దాంతో బిడ్డని మీ తాతగారు అందుకున్నారు. ఆయన చేతిలోకి వెళ్ళగానే దాని ఏడుపు తారస్థాయిని అందుకుంది. ఇంకలాభం లేదనుకుని నేను ఆ బిడ్డని అందుకున్నాను. నేను ఎత్తుకున్న వెంటనే ఏడుపాపి బోసినవ్వులు చిందించడం మొదలు పెట్టింది.

మీ తాతగారు మీ అవ్వగారిని ఉద్దేశించి, చిరునవ్వుతో, “చూశావా కోడలుపిల్ల చేతిలోకి వెళ్ళగానే ఏడుపెలా ఆపేసిందో? పిల్లలు దేవుళ్ళు కదా, వాళ్ళని ఆడించడానికి అవ్వాతాతలు కావాలి. ఆకలి తీర్చడానికి అమ్మే కావాలి. అంటే అది మీ కోడలి చేతిలోనే పెరగాలని కోరుకుంటోందన్నమాట” అన్నారు.

“ఔను. దాని ముఖంలో అమ్మ పొత్తిళ్ళలోని ఆనందం కనిపిస్తోంది చూశారా?” అంటుంటే నాకు గొప్ప సంతోషం కలిగింది. అప్పుడు చూశాను ఆ పసిగుడ్డుని తీరైన కోల ముఖం తీర్చిదిద్దినట్లున్న కనుముక్కు తీరు. బంగారు మేనిరంగు. ముచ్చటైన నవ్వు. అలాంటి పిల్లని ఎవరైనా కళ్ళకద్దుకుని పెంచుకుంటారు.. పాపని నా చేతుల్లో వదిలేసి మీ అవ్వాతాతలు తిన్నగా మూకవ్వగారి దగ్గరకు వెళ్ళారు. ఆవిడని కూర్చోబెట్టుకుని జరిగిందంతా చెప్పారు.

ఆ బిడ్డ ఎవరికి పుట్టిందో తెలియదనగానే నాకు తెలియకుండానే నా చేతులు దానిని కింద పడుకోబెట్టేశాయి. నాకు తెలియకుండానే వెళ్ళి స్నానం చేసి బట్టమార్చుకుని వచ్చాను. నాకు తెలియకుండానే పూజగదిలోకి వెళ్ళి గంగాజలం తీసుకుని తలమీద చల్లుకున్నాను. ఇంత చేసినా ఆ బిడ్డ బోసినవ్వులు నన్ను దగ్గరకు రమ్మని పిలుస్తూనే ఉన్నాయి. మీ అమ్మమ్మగారింట్లో మడీ ఆచారాలెక్కువ. అందుకే నాక్కూడా ఆ లక్షణాలన్నీ వచ్చాయి మనింట్లో కూడా సంప్రదాయాలని పాటిస్తూంటారు. పద్ధతులు నిష్ఠగా పాటించే ఇంట్లో పుట్టి ఎవరికి పుట్టిందో తెలియని పిల్లని ఎలా ఆడించగలను? అయినా పసితనానికీ అమాయకత్వానికీ అందానికీ ఆకర్షణ ఎక్కువ. అందుకే వెళ్ళి తనకి కాస్త దూరంగా కూర్చుని ముట్టుకోకుండానే ఆడించడం మొదలు పెట్టాను. నిజానికి మనం పిల్లల్ని ఆడిస్తూ వాళ్ళు మనతో ఆడుకుంటున్నారనుకుంటాం. కానీ మనమే వాళ్ళతో ఆడుకుంటాం.

మీ అవ్వాతాతలు చెప్పినదంతా మూకవ్వగారెంతో శ్రద్ధగా విన్నారు. విన్న తరువాత నేరుగా వాళ్ళు తెచ్చిన తెల్లజిల్లేడు పూలు తీసుకుని పూజామందిరంలోకి వెళ్ళారు. ఆ పూలని అర్కమహాగణపతికి సమర్పించి వచ్చారు. బిడ్డకి అవతలివైపు కూర్చున్నారు. ఆ పసిబిడ్డకి ఉగ్గుగిన్నెతో పాలు తాగించారు. ఆ పాప తాగుతుంటే మూకవ్వగారి ముఖంలో కనిపించిన సంతృప్తి అంతా ఇంతా కాదు. ఆ పాప బోసినవ్వులకి తన బోసినవ్వులతో కలబోసుకున్నారు.

నేను ఆడిస్తున్నా కూడా బిడ్డని ముట్టుకోకపోవడం గమనించారు.. అందుకే నాకు పరిస్థితిని వివరించడం ప్రారంభించారు.

“చూడమ్మాయ్, మీది నూరుశాతం సాంప్రదాయిక వంశం. నిప్పుని కూడా గంగాజలంతో శుద్ధి చేస్తేగానీ అందుకోని నిష్ఠాగరిష్టులు మీవాళ్ళు. మా కుటుంబం కూడా మడికీ ఆచారాలకీ పెట్టింది పేరు. అందుకే మీవాళ్ళు నిన్ను మాయింటికిచ్చారు. సంతోషం” అంటుంటే ఆవిడ ఉన్నట్లుండి మా పూర్వాపరాల గురించి ఎందుకు చెబుతున్నారో అర్థం కాక నేను నిశ్శబ్దంగా వింటూ కూర్చున్నాను. ఆవిడ ఉన్నట్లుండి ఒక మాట అడిగారు “మనం ఆదర్శపురుషుడిగా పూజించే రాముడిదే వంశం?”

“క్షత్రియ వంశం”

“తను మనలా బ్రాహ్మణుడు కాదు. మనం జగద్గురువుగా భావించి పూజించే కృష్ణపరమాత్ముడిదే వంశం?”

“యదు వంశం”

“ఆయనా మనలా బ్రాహ్మణుడు కాడు. దేవాధి దేవుడూ అదిదేవుడూ ఎవరు?”

“పరమశివుడు. తల్లీ తండ్రీ లేనివాడు. కనుక ఆయనది ఏ వంశమో ఎవరూ చెప్పలేరు”

“మనవాళ్ళందరూ జపించే గాయత్రీ మంత్రానికి మూలపురుషుడెవరు?”

“విశ్వామిత్రుడు”

“ఆయన బ్రాహ్మణుడు కాడు. అంటే దేవుళ్ళకీ మహర్షులకీ ఎలాంటి భేదభావాలూ లేవనే కదా? మరి వారికి లేని తేడాలు మనం ఎందుకు చూపించాలి?” అని చెబుతూంటే నాకు తెలియకుండానే నేనా పసికందుని చేతుల్లోకి తీసుకున్నాను.

మూకవ్వగారు అభినందన పూర్వకంగా నా భుజం తట్టారు.

ఆ తరువాత, “దేవాధిదేవుడైన మహాదేవుడే తలమీద పెట్టుకున్న పవిత్రమైనది గంగ. పాపప్రక్షాళనం చేయడానికి భూమిపై ప్రవహించింది భాగీరథి. కాబట్టీ మనం ఈ బంగారు తల్లికి భాగీరథి అనే పేరుపెట్టుకుని పెంచుకుందాం” అన్నారు.

ఆ ఒక్కమాటతో దత్తత స్వీకారమూ నామకరణమూ కూడా జరిగిపోయాయి. ఆవిధంగా భాగీరథి మనింటి ఆడపిల్లైంది. తను చాలా తెలివైనది. వయసుతోబాటు తెలివితేటలు కూడా పెరుగుతూనే వచ్చాయి. కానీ తనకున్న ఏకైక శత్రువు అందం. ఆడదానికి అందాన్ని మించిన శత్రువు లేదు.

ఏడో తరగతినాటికే ఆమె అందం ఊళ్ళో చర్చనీయాంశంగా మారింది. ఒకటి రెండుసార్లు ఆమెను అపహరించే ప్రయత్నాలు కూడా జరిగాయి. దాంతో తను బయటకు వెళ్ళాలన్నా మగవాళ్ళతో మాట్లాడాలన్నా వీధిలోకి తలెత్తుకువెళ్ళాలన్నా సంకోచించేది. ఆ సంకోచమే పిరికితనంగానూ చివరికి భయంగానూ మారిపోయింది. దాన్ని పోగొట్టడానికి ఎంతోమంది ఎన్నోరకాలుగా ప్రయత్నించారు. కానీ ఆమెలో మార్పు రాలేదు. దాంతో అందరూ తనని వెక్కిరించేవారు అయినాసరే తనా వెక్కిరింతలనీ వెటకారాలనీ ఏమాత్రం పట్టించుకునేది కాదు. ఈలోగా మా అమ్మకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నేను గంగాపురం వెళ్ళాల్సి వచ్చింది. ఆరు నెలలు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. అప్పుడు నువ్వు కూడా నాతో అక్కడే ఉన్నావు.”

అనగానే అమ్మతో కలిసి గంగాపురం వెళ్ళడం లీలగా గుర్తొచ్చింది. గంగాపురంలో పలక తీసుకుని బడికెళ్ళడం. అక్కడి అయ్యవారు నన్నెంతో అభిమానంగా చూడటం. ఆ అభిమానమే నాలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం, అదే క్రమంగా నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి తొలిమెట్టు కావడం అన్నీ క్రమంగా గుర్తొచ్చాయి. అప్పటికి నా వయసు బహుశా నాలుగైదేళ్ళమధ్యన ఉండచ్చు. ఆ వయసులో నోటికి నేర్చుకున్న పద్యాలు, వచనాలు, కథలు జీవితాంతం గుర్తుండిపోతాయి. భర్తృహరి శ్లోకాలు, బసవన్న వచనాలు, ఆది కవి పంప రాసిన భారతంలోని కంఠస్త పద్యాలు ఇప్పటికీ నేను తడుముకోకుండా చెప్పగలను. అదీ గంగాపురానికీ నాకూ ఉన్న అనుబంధం.

అమ్మ చెప్పడం కొనసాగించింది, “మనం గంగాపురంలో ఉన్నప్పుడు మీ అక్క భాగీరథి అక్కడే మూకవ్వగారి దగ్గర ఉంది. అంతకు ముందు తనెప్పుడూ నా దగ్గరే ఉండేది. అవ్వగారి దగ్గర అంత చనువుగా ఉండేది కాదు. కానీ ఆ తరువాత అవ్వగారు ఆమెకి ఎంతో చేరువైపోయారు.

శృంగేరికి వెళ్ళినప్పుడు మీ బావగారి తల్లిదండ్రులు తనని చూసి ఎంతో ముచ్చటపడ్డారు. వాళ్ళు మన గురించి తెలుసుకుని వెతుక్కుంటూ జమునాపురం దాకా వచ్చారు. వాళ్ళ ఆసక్తిని చూసి మా అందరిలో వారిపట్ల కుతూహలం కలిగినమాట వాస్తవం. వాళ్ళు జాతకం అడిగారు. తనెప్పుడు పుట్టిందో ఎక్కడ పుట్టిందో మనకి తెలియదు. మనం తనని పెంచుకుంటున్నామంతే. అలాంటి భాగీరథికి జాతక చక్రం ఎక్కడనించి తేగలం? ఆమె పుట్టుక ఒక చిదంబర రహస్యం. మూకవ్వగారికి రహస్యాల్ని దాచుకునే అలవాటు లేదు. నిజం చెప్పడమే ఆవిడ అలవాటు. అందుకే వాళ్ళకి భాగీరథి జన్మరహస్యం గురించి వివరించారు. దాంతో వాళ్ళు వెనుకంజ వేసినా వాళ్ళబ్బాయి ఒప్పుకోలేదు. తనని తప్ప ఇంకెవరినీ పెళ్ళి చేసుకోనని పట్టుబట్టాడు. దాంతో పెద్దలకి ఇష్టం లేకపోయినా పెళ్ళి జరిపించక తప్పలేదు. వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలోనూ ఒక పెద్ద మలుపు. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అయితే అది రెండో జన్మలాంటిదే. అమ్మాయిలందరూ పుట్టింట్లో అందరికీ ఆనందాన్నిస్తారు. మెట్టినింట్లో అందరి ఆనందం కోసమే జీవిస్తారు. ఆ విధంగా ఇక్కడోసారీ అక్కడోసారీ రెండు కుటుంబాలకి వెలుగునిస్తుంది గనుకనే స్త్రీని దుహిత అంటారు. దుహిత అంటే రెండిళ్ళ హితాన్ని కోరేది అని అర్థం. కానీ భాగీరథి మూడు కుటుంబాలలో పుట్టింది. తను త్రిహిత. తను రెండవసారి కాన్పుకోసం ఇక్కడికి వచ్చింది. కానీ తన దురదృష్టం కొద్దీ వాళ్ళాయన కాశ్మీరులో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. దాంతో భాగీరథి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది.

అక్కడ అత్తారింట్లో మొదటినుండీ తనంటే అంత ప్రేమాదరాలు లేవు. కొడుక్కోసం తనని భరిస్తున్నట్లుగా ప్రవర్తించేవారు. ఇప్పుడు తమ కొడుకు మరణానికి భాగీరథి జాతకం సరైనది కాకపోవడమే అని ఆమెను నిందించడం మొదలుపెట్టారు. పుట్టుపూర్వోత్తరాలు తెలియనివాళ్ళని పెళ్ళిచేసుకున్నందుకే కొడుకు అకాలమరణం పాలయ్యాడని ప్రచారం చెయ్యడం మొదలుపెట్టారు. ఎద్దు ఈనిందంటే దూడని రాటకి కట్టెయ్యమనేవాళ్ళకి ఎవరెంత చెప్పినా అర్థం కాదు. అదీ కాకుండా భాగీరథికి పుట్టిన పిల్లలిద్దరూ ఆడపిల్లలే. ఒకవేళ మగపిల్లవాడొక్కడైనా పుట్టివుంటే వారసుడి కోసమైనా తనని చేరదీసేవారేమో.

కన్నవాత్సల్యం కంటే పెంచిన మమకారమే మనుషులను ఆత్మీయులుగా మారుస్తుంది. కాబట్టీ తన బాధ్యతని మేమే వహించాల్ని నిశ్చయించుకున్నాము. నువ్వప్పటికి చాలా చిన్నవాడివి. తను నీకు చదువు చెబుతూండేది. నీ వయసు పిల్లలు కొందరు నీతో ఆడుకోవడానికి వచ్చేవారు. నీతోబాటు వాళ్ళకీ చదువు చెబుతూండేది. వారిలో కాస్త జరుగుబాటుండేవాళ్ళు తృణమో పణమో ఇచ్చేవారు.

మీ బావ మిలటిరీలో పని చేసేవారు కదా? వారి సేవలకు ప్రభుత్వం చెల్లించిన ధనం పెద్ద మొత్తంలోనే వచ్చింది. ఈ విషయం తెలియగానే తన అత్తమామలు వెతుక్కుంటూ వచ్చారు. “మా ఇంటి కోడల్ని పుట్టింట్లో వదిలేస్తే మా పరువేంకావాలి?” అంటూ మొదలుపెట్టారు. కానీ అవ్వగారు వాళ్ళని దగ్గరకి రానివ్వలేదు. “కష్టాల్లో కానివాళ్ళు సుఖాల్లో అయినవాళ్ళెలా అవుతారు? భాగీరథి మాకు దేవుడిచ్చిన వరం. కాబట్టీ తనని మాతోనే ఉంచుకుంటాం. మాలోనే పెంచుకుంటాం. తనంతట తానుగా మీ ఇంటికి వస్తానంటే మాత్రం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తీసుకెళ్ళండి” అన్నారు కానీ భాగీరథి ఎక్కడికీ వెళ్ళడానికి ఇష్టపడలేదు.

“అందుకే అవ్వగారు తన గురించి చెప్పేటప్పిడల్లా అది మా ఇంటికి కూతురు కాదు, కొడుకు అంటారు” అమ్మ ఆ రోజెప్పుడో చెప్పిన మాటలు ఈరోజు నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి.

అప్పట్లో నాకు సదాచారానికీ మూఢాచారానికీ తేడా తెలిసేది కాదు. నేనంత మూర్ఖంగా ప్రవర్తించానన్న విషయం గుర్తొస్తే చాలు ఇప్పటికీ నామీద నాకే అసహ్యం కలుగుతూ ఉంటుంది.

కానీ తప్పదు. మనం ఎదుటివారిని క్షమించగల ఔదార్యాన్ని పోగొట్టుకుంటుంన్నాం. కనీసం మనల్నైనా మనం క్షమించుకోకపోతే ఎలా?

అయినా, ఆచారాలెందుకు?

సంప్రదాయాల్ని నిలబెట్టడానికి.

సంప్రదాయాలెందుకు?

సంస్కృతిని కొనసాగించడానికి.

సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఈ మూడింటిలోనూ, ఆచారాలు ఎ టు జడ్ ఇండివెడ్యువల్ బ్లడ్ గ్రూపుల్లాంటివి. సంప్రదాయాలు అన్ని గ్రూపులకీ పనికివచ్చే ఓ నెగెటివ్ గ్రూపు లాంటివి. మరి మన సంస్కృతి?

అది మన జాతి రక్తంలో ప్రవహించే డిఎన్ఏ లాంటిది. అందుకే పరాయి నాగరికతలు ఎన్ని దాడులు చేసినా మహోన్నతమైన ఆ సంస్కృతి మనలో ఇంకా కొనసాగుతూనే వస్తోంది.

ఇన్ని విషయాలు తెలిసి కూడా ఆవిడని అపశకునం అని భావించడం నా చిన్ననాటి చాపల్యం. కానీ ఇప్పుడు నాకా చాపల్యం లేదు. మరి ఆవిడ నన్నెందుకు తప్పించుకుపోయారు?

ఎందుకేమిటి? వేలవేల చాపల్యాలను చూసిన అనుభవంతో తప్పించలేని మూర్ఖులకు ఎదురు పడకుండా తప్పించుకోవడమే ఉత్తమం అనే నమ్మకం ఏర్పడి ఉంటుంది. ఆ నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు. మూఢాచారాల్ని కొనసాగించకుండా అడ్డుకోవడమే ఆధునికత. సంప్రదాయాల్లో మంచిని కొనసాగించడం కూడా ఆధునికతే. సంస్కృతిని నిలబెట్టుకోవడం మన బాధ్యత.

***

బడిలో పనులు వేగంగా సాగుతున్నాయి. అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చెయ్యగలమనే నమ్మకం కలిగింది. మాస్టారితో మాట్లాడి వెనుదిరిగి వస్తూండగా అవ్వగారు కనిపించారు ఇద్దరం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అదే సమయంలో గోడవతల పూలు కోస్తూ కనపడింది అన్నపూర్ణ. వెంటనే మీనాక్షి చెప్పిన మాట గుర్తొచ్చింది. అవ్వగారిని ఆ విషయం ఎలా కదిలించాలా అని ఆలోచిస్తూ, “ఆ అమ్మాయెవరో తెలుసా?” అన్నాను.

అవ్వగారు నవ్వుతూ, “నీకు తెలుసా?” అన్నారు.

మా కార్పొరేట్ కంపెనీల్లో ఎవరితో ఎలా మాట్లాడాలో ట్రైనింగిస్తారు. ఒకరితో మాట్లాడినట్లు మరొకరితో మాట్లాడితే మనస్పర్థలొచ్చే అవకాశాలుంటాయి. అందుకే ఆరునెల్లకోసారి ఆ ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేస్తూంటారు. ఇంతవరకూ అన్ని క్లాసుల్లోనూ మొదటి బహుమతి పొందినవాడిని నేనే. అలాంటి నేనే అవ్వగారితో మాట్లాడలేక బోర్లాపడుతూంటాను.

ఇంకావిడతో మాటాటలాడటం నావల్ల కాదు. అందుకే తిన్నగా విషయానికి వచ్చేస్తూ, “తను మన మీనాక్షి క్లాస్‌మేట్. తనకి కూడా మన మీనాక్షితోబాటు చదువుకోవాలనుంది. కానీ ఇంట్లో పెద్దవాళ్ళున్నారు. పెద్దవాళ్లని చూసుకోవడం కోసమని తనని చదువు మానిపించి ఇంట్లోనే ఉంచాలనుకుంటున్నారు.”

అవ్వగారు మరోసారి నవ్వారు, “వాడుత్త వెధవ. వాడికి బాగుపడ్డం రాదు. ఇంకొకళ్ళు బాగుపడుతుంటే చూడటం ఇష్టం లేదు.”

“అదేమిటవ్వగారూ, అంతమాటన్నారు? మీరెప్పుడూ ఎవరినీ పల్లెత్తుమాటనరు కదా”

“మనం అనము. వాళ్ళే అనిపించుకుంటారు. ఆ దుర్మార్గుడు ఒకప్పుడు మన భాగీరథిమీద కన్నేసినవాడు. అందుకే వాడంటే నాకు ఒళ్ళు మంట. వాడి కూతుర్ని నువ్వు చదివిస్తానంటే నేనొప్పుకోనని మీనాక్షి అనుమానం. అందుకే నీకు చెప్పింది. ఒకపని చెయ్యి. వాడి దగ్గరకు వెళ్ళి అన్నపూర్ణని నీ స్వంత ఖర్చుతో చదివిస్తానని చెప్పు. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్పు వాళ్ళనే వాడుకొమ్మను. డబ్బుకోసం గడ్డైనా తినేరకం వాడు. కనీసం ఈ వయసులో అయినా తల్లిదండ్రుల్ని బాధ్యతగా చూసుకుంటాడు. వాడేమైనా తోక జాడిస్తే దాన్ని కత్తిరించడం ఎలాగో నాకు తెలుసు” అన్నారు.

ఆవిడామాట అనగానే నాకు చాలా సంతోషం కలిగింది. “ఐతే స్నేహితురాళ్ళనిద్దరినీ ఒకే హాస్టల్లో చేరుద్దాం” అన్నాను.

అవ్వగారు తలూపారు.

అధ్యాయం-22

ఉదయం లేవగానే బెడ్ కాఫీ కోసం చూడకుండా నా దారిన నేను వెళ్ళి ముఖం కడుక్కుంటున్నాను. అవ్వగారు అక్కడికి వచ్చారు. “ఏం ఆత్రేయా ఇంకా మొహం కడుగుతూ కూర్చున్నావ్?” అన్నారు.

ఆవిడామాట అనగానే మేము పార్వతీపురం వెళ్ళాలనే విషయం గుర్తొచ్చింది. అప్పటికే ఆవిడ సిద్ధమై ఉన్నారు. ఎర్రటి నూలుచీర కట్టుకున్నారు. తలమీదుగా కొంగు తిప్పుకుని బొడ్లో దోపుకున్నారు. ఆవిడ నొసటన విభూతి ఉంది. అంటే పూజగదిలో శివుడికీ అమ్మవారికీ నమస్కరించుకుని గణపతి అనుమతి తీసుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ఆవిడ ముఖంలోని చిరునవ్వు త్రిమూర్తుల ఏకత్వాన్ని సూచిస్తోంది. అందుకే ఆవిడకి చేతులు జోడించాను.

“నమస్కారాలు తరవాత. అక్కడ భట్టుగారు అప్పుడే రేవుకెళ్ళిపోయారు” అన్నారు.

సరిగ్గా పదంటే పదే నిమిషాల్లో స్నానం కూడా పూర్తి చేసి పట్టుపంచె కట్టుకుని పైన జుబ్బా వేసుకుని బయలుదేరాను. అవ్వగారు వడివడిగా నడుస్తున్నారు. నేను వారిని అనుసరిస్తున్నాను.

అంతలోనే రేవునుండి నాదస్వరం వినిపించింది. దాన్నివింటూ, “మనకంటే మేళగాళ్ళే నయం. పదపద” అంటూ తొందరపెట్టారవ్వగారు.

ఇద్దరం కలిసి రేవు చేరాం. పడవలో ఎక్కగానే నాదస్వరం బృందం అవ్వగారికి నమస్కరించారు. మా ఊరి మేళగాళ్ళంటే శివమొగ్గ జిల్లాలోనే మంచి పేరుపొందిన వాద్యగాళ్ళు. వాళ్ళు భాగ్యదలక్ష్మీ బారమ్మా అంటూ కీర్తన ఆరంభిస్తే అందరూ తన్మయులైపోవలసింది. వన్స్ మోరంటూ చప్పట్లు కొట్టాల్సిందే. భీమ్ సేన్ జోషీగారి గొంతులో పలికేంత భావగాంభీర్యం సాక్సోఫోన్‌లో పలికించడం సామాన్యులకు సాధ్యం కాదుగానీ మావూరి మహదేవప్పకి మాత్రమే సాధ్యం. అవ్వగారిని చూడగానే మహాదేవప్పతో సహా అందరూ లేచి నిలబడ్డారు. డోలు సహకారం అందించే మిత్రుడు నాతో మాటలు కలిపాడు, “మా మహదేవప్పగారు వస్తే అందరూ లేచి నిలబడతారు. అవ్వగారొస్తే మాత్రం ఆయనే లేచి నిలబడతారు. అంత గౌరవం ఈ చుట్టుపక్కల మీ అవ్వగారికి తప్ప ఇంకెవరికీ లేదు” అంటుంటే నాకు పడవెక్కినట్లు కాదు ఏనుగెక్కినంత సంబరం కలిగింది. పడవ నది దాటేసరికి ఊరిపెద్ద కారుతో సహా సిద్ధంగా ఉన్నారు. అందరం కారెక్కి బయలుదేరాము. వెనక్కాల ఉన్న టెంపోలో వాద్యగాళ్ళెక్కారు. అందరం ఆలయం చేరుకున్నాం. అక్కడ కన్నడ వార్తాపత్రికల విలేకరులే కాదు, జాతీయస్థాయి ఆంగ్లపత్రికల వార్తాహారులు, రాష్ట్రీయ-జాతీయ స్థాయి టెలివిజన్ రిపోర్టర్లు సిద్ధంగా ఉన్నారు. వందల సంవత్సరాలుగా పాడుపడిన దేవాలయం రాత్రికి రాత్రే జాతీయ స్థాయిలో వార్తలకెక్కడం అందరికీ ఆశర్యాన్నీ ఆనందాన్నీ కూడా కలిగించింది.

అంతలోనే టీవీ న్యూస్ ఛానెల్ రిపోర్టర్లు, కెమెరామెన్, మైకుల్తో వచ్చి అవ్వగారి ముందు నిలబడ్డారు. మరోవైపు పత్రికా విలేకరులు స్క్రిబ్లింగ్ ప్యాడ్లూ పెన్నులూ పట్టుకుని రాసుకోవడానికి రెడీగా ఉన్నారు. అందరూ అవ్వగారినే ఆసక్తిగా గమనిస్తున్నారు. అవ్వగారు వాళ్ళెవరినీ పట్టించుకోకుండా గుడిలోకి వెళ్ళిపోతున్నారు. ఆవిడని చూసిన ఊరిపెద్ద, “అవ్వగారూ వాళ్ళో రెండు ఫోటోలు తీసుకుని ఒకటో రెండో ప్రశ్నలడుగుతారు. మీకోసమే పిలిపించాను” అన్నారు.

అవ్వగారు సమాధానం చెప్పకుండా, “ముందు పూజ తరవాతే ప్రసాదం. పదండి వెళదాం” అంటూ ముందుకు కదిలారు. రిపోర్టర్లూ విలేకరులూ వెంటపడుతున్నా అవ్వగారేమాత్రం పట్టించుకోకుండా లోపలకి వెళ్ళిపోయారు. వెంటనే పూజ ప్రారంభం చెయ్యమన్నారు భట్టుగారు. కానీ అక్కడి పురోహితుడు మాత్రం ఒప్పుకోలేదు. అవ్వగారినీ భట్టుగారినీ చూస్తూ, “అమ్మా మీ గురించి మా అందరికీ బాగా తెలుసు. మీరెంత గొప్పవారైనా కావచ్చు. మీకెంత పేరు ప్రతిష్ఠలైనా ఉండచ్చు. కానీ గుడన్నాక ఓ పద్ధతి ఓ సంప్రదాయం ఉంటుంది. శివాలయంలో శృంగి భృంగి ఉండచ్చు నందీశ్వరుడు కూడా ఉండచ్చు. కానీ అంతరాలయాల్లో కామధేనువు విగ్రహం లేదు. ఉండదు. ఉండకూడదు. అది ఆలయ నిర్మాణశాస్త్రానికే విరుద్ధం. అలాంటి శాస్తవిరుద్ధమైన పనులూ పూజలూ జరగడం వల్లే ఈ ఆలయం ఇంతకాలం పాడుపడింది. ఇప్పుడు మళ్ళీ దానికి ప్రాణ ప్రతిష్ఠచేసి పూజలు ప్రారంభించడం మంచిచి కాదు” అన్నారు.

అవ్వగారు ఆయన అభిప్రాయం కూడా నిజమేనన్నట్లు నవ్వారు. ఆ తరువాత మెల్లగా పురోహితుడివైపు చూస్తూ, “ఈ గుడిని పాడుపెట్టక ముందు ఎంతో వైభవోపేతంగా పూజలూ వ్రతాలతో నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఉండేదని శాసనాలు చెబుతున్నాయి. పరాయి పాలకులు ధ్వంసం చెయ్యక ముందు, ఆలయ సంపదలను దోచుకోకముందు అంత అంగరంగవైభోగంగా ఎందుకు సాగింది?” అని అడిగారు.

ఆవిడ మాటలు విన్న పురోహితుడికి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. అందుకే మౌనంగా విగ్రహాన్నే పరీక్షగా చూస్తూ, “అమ్మా మీరు పెద్దవారు. అన్నీ తెలిసినవారు. మీ మాటను కాదనేంత ధైర్యం మాకు లేదు. కానీ పూజ చేయడానికి విరిగిన విగ్రహం పనికిరాదు” అన్నారు.

అవ్వగారు సూటిగా పురోహితుడి కళ్ళలోకి చూస్తూ, “ఆ విగ్రహం పగిలిపోయిందని ఎవరు చెప్పారు? అది పగిలిపోలేదు. నిజానికా విగ్రహాన్ని చెక్కలేదు. రూపొందించారు. అంటే విగ్రహాన్ని కొన్ని భాగాలుగా విభజించి ఆయా భాగాలను అతికించి రూపొందించారు. దాన్ని తీసుకెళుతున్నప్పుడే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయాయి. కావడానికి అంతా నల్లరాయే అయినా, ఆ నలుపులో కూడా వేరువేరు ఛాయలు కనిపిస్తున్నాయి చూడండి,” అంటూ విగ్రహాన్ని అతికించిన భాగాలలోని వర్ణభేదాలని చూపించారు. ఆ భేదాన్ని గమనించిన పురోహితుడికి ఏం మాట్లాడాలో పాలుపోలేదు..

అవ్వగారు పురోహితుడికి చెప్పడం కొనసాగించారు, “కొంతకాలం పాడుబడటం కాలనిర్ణయం. ఇప్పుడు మళ్ళీ పూజలు ఆరంభం కావడం శివుడి ఆజ్ఞ. దాన్ని పాటిస్తే ఆలయం మళ్ళీ పూర్వంలాగే కళకళలాడుతుంది. అందుకే సాక్షాత్తూ ఆ నందినీ ధేనువే వచ్చి మీకు పునఃప్రతిష్ఠ చేసే అవకాశమిచ్చింది. కలిసి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవడం మంచిది కాదు. ఒకవేళ మీరు కాదంటే ఎలాగూ మా భట్టుగారు ఉండనే ఉన్నారు” ఆన్నారు.

అవ్వగారు చెప్పిన చివరి మాట వినగానే పురోహితుడు ఆలోచనలో పడ్డారు. అనంతరం ఆ ఊరిపెద్దవైపూ మావైపూ సాభిప్రాయంగా చూశారు. ఆ తరువాత వినాయకుడికి నమస్కరిస్తూ “ఓం గం గణపతయే నమః” అంటూ మొదలుపెట్టి మంత్రాలు చదవడం ప్రారంభించారు. అవ్వగారు కామధేనువు విగ్రహం ముందు నిలబడి దానికి నమస్కరించారు. పురోహితుడి మంత్రాలు వింటూ కళ్ళు మూసుకున్నారు. ఆవిడ అలా నిలబడ్డారంటే ధ్యానంలోకి వెళ్ళిపోయారని అర్థం. ఆ ధ్యానాన్ని భంగపరచడం ఇష్టం లేక నేను నేను కూడా మౌనంగా నిలబడిపోయాను. అంతలోనే బయటినుండి నందిని అంబారవం వినిపించింది. అది వినపడగానే నాకో చిలిపి ఆలోచన వచ్చింది. అవ్వగారు నా పక్కన ఉన్నప్పుడు నందిని నన్నేమీ అనలేదు. ఒకవేళ నేనొక్కడినే కనిపిస్తే దగ్గరకి రానిస్తుందో లేక మొదటిసారి వచ్చినప్పుడు కుమ్మడానికి ప్రయత్నించినట్లే మళ్ళీ పొడుస్తుందో చూడాలనేదే ఆ ఆలోచన.

నందినిని చూడటం కోసం బయటకి వచ్చాను. అది పందిరి కింద కాళ్ళు ముడుచుకుని పడుకుని వేల సంవత్సరాల సంస్కృతినీ తద్వారా రూపొందిన చరిత్రనీ క్రమంగా ఆ చరిత్రలోంచీ జారిపోతున్న భారతీయతనీ విదేశీయంగా మారిపోయిన స్వదేశీయతనీ నెమరువేసుకుంటోంది. నేను కొంచెం భయంగానే దగ్గరకెళ్ళి దాని వెన్ను నిమిరాను. నన్ను పట్టించుకోలేదు. దాంతో కాస్త ధైర్యం వచ్చి ముందువైపుకెళ్ళాను. నన్ను చూసింది. కానీ కొమ్ము విసరలేదు. దాంతో నాకు మరికొంత ధైర్యం వచ్చింది. ఆ పక్కనే ఉన్న జొన్న కంకుల్ని దాని నోటికి అందించాను. అది ఏమాత్రం సంకోచించకుండా అందుకుంది. ఇంక పూర్తిగా ధైర్యం వచ్చేసింది. దాని నొసలు నిమరసాగాను. అయినా ఏమీ అనలేదు.

అంతలోనే, “ఈ ఆవే కద్సార్ మొన్న మిమ్మల్ని కుమ్మింది?” అనే ప్రశ్న వినపడింది. వెనక్కి తిరిగి చూస్తే టీవీ న్యూస్ రిపోర్టర్.

అవ్వగారు తప్పించుకున్నారు. నేను దొరికిపోయాను.

నేను ఏం చెయ్యాలో తోచక, “ఔను” అంటూ పైకి లేచాను.

“ఇక్కడ గోశాల కట్టించాలనుకున్నారట?”

“ఔను”

“ఇక్కడ గోమాంసం తినడాన్ని నిషేధించారట?”

“గోశాలకీ గోమాంస భక్షణకీ సంబంధం ఏమిటి?

వెంటనే నేషనల్ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ ఇంగ్లీషులో అడిగాడు, “ఇక్కడ గోమాంసాన్ని తినడం నిషేధించిన మాట నిజమా కాదా?”

“తినడం తినకపోవడం వారివారి వ్యక్తిగత విషయాలు. ఇక్కడ మాంసాహారులూ ఉన్నారు. శాకాహారులూ ఉన్నారు. ఎవరింట్లో వాళ్ళు ఎవరికి నచ్చిన ఆహారం వాళ్ళు తింటున్నారు” అంటూండగానే నా అదృష్టం కొద్దీ పార్వతీపురం పెద్ద ఆక్కడికి వచ్చారు. నేనాయన్ని చూపించి, “మాది ఈ ప్రాంతం కాదు. ఇక్కడి విషయాలు నాకు తెలియవు. ఈయనే ఈ ఊరి పెద్ద. ఆయన్నడగండి. కావాలంటే ఆయన కన్నడంలో చెప్పినదాన్ని నేను ఇంగ్లీషులోకి అనువదించి చెబుతాను” అంటూ తప్పించుకున్నాను.

నన్నడిగినమాటే ఆయన్ని కూడా అడిగాడా రిపోర్టర్. దానికి ఊరిపెద్ద, “సార్ ఆకలి తీరాలంటే ఏదో ఒకటి తినాల్సార్. ఇలా మాటలతో కడుపులు నిండవు కదా. మీకు ఏ మాంసం కూర కావాలో చెప్పండి. సాయంత్రానికి ఏర్పాటు చేయిస్తాను మన శివమొగ్గలో కళ్యాణ్ బిర్యానీ చేసేవాళ్ళున్నారు. వాటిలో బిస్మిల్లా బిర్యానీ సెంటర్ జిల్లాలోనే ఫేమస్. ఆవుమాంసంతో అంతమంచి బిర్యానీ హైదరాబాద్ లోకూడా దొరకదని చెప్పుకుంటారు. కావాలంటే చెప్పండి. భోజనంలోకి ఎరేంజ్ చేయిస్తాను” అనగానే ఆ రిపోర్టర్ గతుక్కుమన్నాడు.

వెంటన తన తడబాటుని కప్పిపుచ్చుకుంటూ, “నేనవన్నీ తినను. కావాలంటే మా కెమారామేన్ తింటాడు. తనకి తెప్పించిపెట్టండి”

“అడిగింది మీరు. మీకు కావాలంటే తెప్పించిపెడతాను. అతనిక్కావాలంటే పందిమాంసం పులుసు పెట్టిస్తాను. ఏం కెమెరామేన్? తెప్పించమంటారా?” అని అడిగాడు.

ఆ కెమారా మేన్ ఆవుమాంసమేగానీ పంది మాంసం ముట్టుకోడు. ఆ విషయం ఊరిపెద్దకి బాగా తెలుసు. అందుకే వాళ్ళ ప్రశ్నలో వాళ్ళనే ఇరికించేసి తనదారిన తను లోపలకి వెళ్ళిపోయారు. నేను బతుకుజీవుడా అంటూ ఆయన్ని అనుసరించాను. వెనుకనుండి నందిని అంబారవం అందరినీ ప్రేమగా ఆశీర్వదిస్తోంది.

గుడిలో హోమాలూ పూజలూ పూర్తయ్యేసరికి భోజనాల వేళయింది. పాత్రికేయులకీ టీవీరిపోర్టర్లకీ భోజనాలు పెట్టించారు ఊరిపెద్ద. ఆ తరువాత వారికి కవర్లు కూడా ఇచ్చిపంపించారు. వాళ్ళు పెట్టినవన్నీ తింటారు. ఇచ్చినవన్నీ తీసుకుంటారు. కానీ చేసేపని మాత్రం ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళేం చేస్తారనేది న్యూస్ వచ్చాకగానీ తెలియదు. ఆ రిపోర్టర్ తెలివైనవాడైతే ఊరిపెద్దని వదిలి ఊళ్ళో అమాయకుల బైట్స్ తీసుకుని వాటికీ ఊరిపెద్ద మాటలకీ లింకుపెట్టి మంచి న్యూస్ ఐటం వండివార్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే అతను ఊళ్ళో ఎవరిబైట్సయినా తీసుకున్నాడేమో అని ఊరిపెద్దని విచారించాను. ఆయన తనవాళ్ళందరినీ పిలిచి కనుక్కున్నారు. వారికి తెలిసినంతవరకూ అలాంటిఏమీ జరగలేదని అర్థమైంది. దాంతో నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాను.

భోజనాలయ్యాక అవ్వగారికి కాస్త విశ్రాంతి దొరికింది. అప్పుడు మెల్లగా ఆవిడ దగ్గర చేరాను.

నా ముఖం చూడగానే నేను దేనిగురించో తెలుసుకోవాలనే కుతూహలంతో వచ్చానని కనిపెట్టేశారు. అందుకే, “ఏం ఆత్రేయా? ఏదో అడగటానికొచ్చినట్లున్నావు?” అన్నారు.

నేను వెంటనే, “ఈ ఆవులు ఎక్కడీనించి వస్తాయో చెప్పగలరా?” అని అడిగాను.

ఆవిడ వెంటనే ఫక్కున నవ్వారు. నేను బిత్తరపోయాను.

అందుకే నన్ను బుజ్జగిస్తూ, “అదో బ్రహ్మరహస్యం. దాని గురించి నాకు తెలుసు. కానీ ఎవరికీ చెప్పను. అది నాతోబాటు మట్టిలో కలిసిపోవలసిందే” అన్నారు.

నాకేం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాను. బహుశా నేను ఆవిడమీద అలిగాననుకున్నారో ఏమో అనునయిస్తున్నట్లుగా వివరించసాగారు, “ఆ రహస్యం గురించి నేను నీకు చెప్పినా నువ్వెవరికీ చెప్పవని నాకు తెలుసు. కొన్న శతాబ్దాలనుండి పార్వతీపురం ఆవులు ఎన్నెన్ని కష్టాలు అనుభవించి వాటి వంశాన్ని కాపాడుకుంటున్నాయో నాకు తెలుసు. ఈ నందిని ఉంది కదా, దాని పూర్వీకులందరూ త్యాగమూర్తులైన గోమాతలే. వాటి త్యాగాల గురించి తలుచుకుంటేనే గుండెలు జల్లుమంటాయి. ఈ నందిని తాతమ్మ మా అమ్మకి తెలుసు. దానిగురించి చెప్పమని అడిగాను. ఆవిడ చెప్పారు. కానీ ఆ రహస్యాన్ని మాత్రం ఎవరికీ చెప్పద్దని మాట తీసుకున్నారు. ఇప్పుడు నీ కుతూహలాన్ని తీర్చడానికి మా అమ్మకిచ్చిన మాట తప్పమంటావా చెప్పు” అని బేలగా ప్రశ్నించారు.

ఆవిడకీ చెప్పాలనే ఉంది. కానీ చెప్పలేని పరిస్థితి. నాకూ వినాలనే ఉంది కానీ అడగలేని పరిస్థితి. కొన్ని రహస్యాలని కాలానికే వదిలిపెట్టాలి. అందుకే నేనింకెప్పుడూ వాటి గురించి అవ్వగారిని అడగకూడదని తీర్మానించుకున్నాను.

(ఇంకా ఉంది)

Exit mobile version