Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అవ్వగారు-13

[ధనంజయ లక్ష్మీ రామకృష్ణగారు వ్రాసిన ‘మత్తె మూకజ్జి’ అనే కన్నడ నవలని ‘అవ్వగారు’ పేరుతో అనువదించి ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.]

[ఆత్రేయ పాఠశాల పనులని పర్యవేక్షించడానికి వెళుతుండగా భాగీరథమ్మగారు  ఎదురొస్తారు, దాంతో ఆవిడ తప్పుకుని పెరటి వైపు వెళ్ళిపోతారు. భాగీరథమ్మగారి గురించి చిన్నప్పుడు తన తల్లి చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటాడు ఆత్రేయ. ఊరివారంతా భాగీరథమ్మగారు ఎదురుపడడం మంచిది తప్పుకు తిరుగుతారని, వారికి ఆ బాధ తప్పించడానికి అసలు ఆవిడ ఇల్లు కదలడమే మానేసారని అర్థం చేసుకుంటాడు. మూఢాచారాల్ని కొనసాగించకుండా అడ్డుకోవడమే ఆధునికత అని అనుకుంటాడు. అన్నపూర్ణని కూడా బెంగుళూరు హాస్టల్‍లో చదివించాలన్న తన ఉద్దేశాన్ని అవ్వగారికి చెప్తాడు. ఆవిడ ఏర్పాట్లు చేయిస్తానంటారు. మర్నాడు స్నానాదికాలు పూర్తి చేసి నది దాటి పార్వతీపురం చేరుకుంటారు అవ్వగారు, ఆత్రేయ, భట్టుగారు. శివాలయంలో పూజ ప్రారంభించమంటే, పూజారి మొదలుపెట్టడు. కామధేనువు విగ్రహం, విరిగిపోయినదనీ, దాని పూజూర్హత లేదని అంటాడు. అవ్వగారు అది విరిగిన విగ్రహం కాదని, అది చెక్కిన విగ్రహం కాదని, ముక్కలుగా రూపొందించిన విగ్రహమని, పూజ చేయచ్చని చెప్తారు. పూజారి సంశయిస్తే, భట్టుగారి చేత పూజ చేయిస్తానని అంటారు అవ్వగారు. చివరికి అంగీకరించి పూజ పూర్తి చేస్తారు పూజారి. నందిని అంబారావం వినబడి బయటకు వస్తాడు ఆత్రేయ. అక్కడ కొందరు రిపోర్టర్లు చేరి ప్రశ్నలు వేస్తారు. వారు సంచలనం కోసం ప్రయత్నిస్తున్నరని గ్రహించిన ఊరిపెద్ద వారికి తగిన సమాధానాలు చెప్పి పంపుతాడు. పూజ పూర్తయ్యాకా, ఆత్రేయ అవ్వగారి దగ్గరకు వెళ్ళి ఇన్ని ఆవులు ఎక్కడ్నించి వస్తాయో చెప్పమంటాడు. అదొక రహస్యమని, దాన్ని ఎన్నడూ బహిర్గతం చేయనని చెప్తారు అవ్వగారు. – ఇక చదవండి.]

అధ్యాయం-23

పార్వతీపురం హైస్కూల్లో వంట చేసే వంటవాళ్ళొచ్చి గుడి అవతలివైపున పందిరి కింద టీ అంగడి పెట్టారు. అందరికీ కాఫీలూ టీలూ బిస్కెట్లూ సమోసాలూ అన్నీ అక్కడే.

నేను టీ తాగుతూ గుడి పరిసరాలని పరిశీలించాను. మేం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా?

నిన్నటిదాకా పాడుబడిన దేవాలయం. ఈ రోజు? జాతరలా జన సందోహం. అందరిలో నూతనోత్సాహం. అందరి ఆనందమూ అంబరాన్ని అంటుతోంది. గుడి చుట్టూ ఉన్న వీధులన్నిటిలోనూ రాత్రికి రాత్రే వెలిసిన అంగళ్ళు. అన్ని ఇళ్ళముందూ ఒక్కో టేబులో బెంచీనో వేసుకుని కొబ్బరికాయలు, అరటిపండ్లు, పూజసామగ్రి ముఖ్యంగా పూలూ తమలపాకులూ వక్కలూ సద్దిపెట్టారు. చూస్తూండగానే ఇళ్ళన్నీ అంగళ్ళుగా మారిపోయాయి.

ఇంక ఆడవాళ్ళకైతే క్షణం తీరికలేదు. రకరకాల పూలన్నింటినీ తీసుకువచ్చి గుట్టలు పోసుకున్నారు. అందరూ వేగంగా పూలమాలలు అల్లుతున్నారు. ఆ మాలలు అల్లుతున్నవాళ్ళందరూ ప్రౌఢలూ వృద్ధురాళ్ళే. బాలామణులూ యువతులూ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. అమ్మాయిల్లో పూలు అల్లే నైపుణ్యం తగ్గిపోతోంది. మా ఇంట్లోనే మీనాక్షికి అన్నీవచ్చుగానీ పూల మాలలు అల్లడం రాదు. ఎందుకు నేర్చుకోలేదంటే, “సమయమంతా చదువుకోవడానికే సరిపోతుంది. అవన్నీ నేర్చుకునేంత తీరికెక్కటుంటుంది?” అంటూ తన నవ్వులో కాస్త సిగ్గునీ కాస్త అపరాధబావననీ కలబోస్తూ తల దించుకుంది. మళ్ళీ మా చిన్నప్పటిలా వయసులో ఉన్న అమ్మాయిలు పూలు అల్లడం చూడాలంటే ఆలయం ఇలాగే కళకళలాడుతూ ఉండాలి. అప్పుడు గుడి చుట్టూ ఉన్న ఇళ్ళలో అమ్మాయిలంతా పూలల్లడం నేర్చుకోక తప్పదు. అవసరం, ఆదాయం ఈ రెండూ అన్నీ నేర్పిస్తాయి. అల్లేవాళ్ళు అల్లుతూంటే కొనుక్కునేవాళ్ళు కౌనుక్కుపోతున్నారు. అలా అంగళ్ళన్నింటినీ పరిశీలించుకుంటూ లోపలకి వెళ్ళాను.

గుడిలో పూలపరిమళాలు గుమ్మెత్తిపోతున్నాయి. అన్నీ సహజమైన పూలవాసనలే. నేను పని చేసే దేశంలో పూలు అమ్మడాలూ కొనడాలూ ఉండవు. పూలు లేనిచోట ప్రకృతి సహజమైన పరిమళాలెలా వస్తాయి? అన్నీ కృత్రిమ పరిమళాల పెర్ఫ్యూములే. ఇక్కడ అమ్మాయిలంటే కళాకాంతులుండే లైవ్ పెర్ఫార్మర్స్. కానీ అక్కడంతా పెర్ఫ్యూమర్సే.

ఆ పెర్ఫ్యూములని డబ్బిచ్చికొనుక్కోవడం ఊపిరితిత్తుల వ్యాధుల్ని ఉచితంగా తెచ్చుకోవడం. అదే వాళ్ళ పెర్ఫ్యూమింగ్ డెవలప్మెంట్. గుడిలోపలి గుబాళింపులు అందరినీ కస్తూరి పరిమళ గంధానందంలో ముంచెత్తుతున్నాయి. ఆ మంటపంలో మైసూరు చందనం సానపడుతున్నారేమో అది ఆలయ ప్రాంగణం నిండా చైతన్యాన్నీ ఉత్సాహాన్నీ నింపుతోంది. క్రమంగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. గుడి చుట్టూ సీరియల్ లైట్లు. తళతళా మెరిసిపోతున్నాయి. ఆ మెరుపుల్లో చూస్తుంటే ఆలయం వెండివెన్నెల్లో పాలపుంతలా కనిపిస్తోంది. తారాలోకంలా ఊహావిహారం చేస్తూండగానే నేను మళ్ళీ కస్యూమరింగ్ లైఫ్‌లో పర్ఫ్యూమింగ్ చెయ్యడానికి వెళ్ళక తప్పదనే విషయం గుర్తొచ్చింది.

ధనమూలమిదం జగత్. ఆ డబ్బవసరమే లేకపోతే నేనా దేశానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మనుషులు డబ్బు సంపాదించాల్సిందే. దానిని సద్వినియోగం చెయ్యాల్సిందే.

విద్య వినయాన్నిస్తుంది. వినయం యోగ్యతనిస్తుంది. ఆ యోగ్యతే ధనాన్నిస్తుంది. ఆ ధనాన్ని ధర్మకార్యాలకు మాత్రమే వినియోగించాలని చెబుతారు పెద్దలు. మా తోటి యువతరం బాగా చదువుకుని మంచి నైపుణ్యాలు సంపాదించి విదేశాలకు వెళ్ళి విరివిగా డబ్బు సంపాదించడం వరకూ పెద్దలు చెప్పినట్లే చేస్తోంది. కానీ ధర్మకార్యాల దగ్గరకి వచ్చేసరికి మాత్రం చేతులు ముడుచుకుని అక్కడే ఉండిపోయి ఇంకా ఇంకా డబ్బు కూడబెడుతూనే ఉంది. తేనెటీగలు కష్టపడి కూడబెట్టిన తేనె మనుషుల పాలవుతోంది. మనుషులు కూడబెట్టిన సొమ్మంతా ప్రాణం లేని వస్తువుల పాలవుతోంది. ప్రాణానికి హాయినివ్వని సుఖాలపాలవుతోంది. మనసుకు హాని కలిగించే సౌకర్యాలపాలవుతోంది. కాబట్టీ అది దాన ధర్మాల దాకా రాదు. అందుకే ప్రభుత్వం దానధర్మాలకి టాక్స్ రిడక్షన్లు పెట్టింది. తద్వారా కొంతైనా ప్రజల సొమ్ము పేదలకి లభిస్తుందనుకుంటే అదంతా రాజకీయ నాయకుల నైవేద్యానికే సరిపోతోంది.

నిన్నటిదాకా గుడిలోపలా బయటా డబ్బుతో ఏమాత్రం అవసరం ఉండేది కాదు. ఇప్పుడు గుడి చుట్టూ నాలుగువీధుల్లోనూ డబ్బు వరదై ప్రవహిస్తోంది. ఆ ధనంలో కొంతైనా ధర్మానికి ఉపయోగిస్తుందేమో అనుకుంటూ ఉంటే గుడి బయట మెట్లమీద బిచ్చగాళ్ళు గుర్తొచ్చారు.

వారిని చూసి, “వీళ్ళలో నిజంగానే పూటగడవని వాళ్ళెంతమందో బిచ్చమెత్తడాన్ని వృత్తిగా మార్చుకున్న వాళ్ళెంతమందో ఎవరికి తెలుసు?” అనే అనుమానం వ్యక్తం చేశారు భట్టుగారు. అప్పుడు అవ్వగారు చెప్పిన సమాధానం వింటే గానీ ధనం విలువేమిటో అర్థం కాదు. ఆవిడ, “నూటికి తొంభైతొమ్మిదిమంది మోసగాళ్ళే కావచ్చు. కానీ నిజంగా మన సహాయం అవసరమైన ఆ ఒక్కడికీ అన్యాయం జరగకూడదూ అంటే మనిషి తన దానప్రవృత్తిని వదులుకోకూడదు. నెలలకొద్దీ పడిన కష్టం, లెక్కలేనంత గడ్డీగాదం, చిట్టూ తౌడూ ఊకా అన్నీ పోతేగానీ నాలుగు బియ్యం గింజలు చేతికి రావు. ఈ గింజలకోసం అన్నింటినీ పోగొట్టుకుంటున్నామా లేదా? అలాగే ఒక్కరూపాయి సద్వినియోగం కావడం కోసం తొంభైతొమ్మిది రూపాయల్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడేవాడినే ధర్మాత్ముడంటారు. అలాగని డబ్బుని ఊరికే పంచడం కూడా మంచిది కాదు” అంటుంటే ఆవిడ మాటలద్వారా ఒక గొప్ప ఆర్ధిక తత్వం బోధపడింది.

అవ్వగారు గుడిలోనుండి ఎప్పుడు బయటకు వచ్చారో ఎప్పుడు నందిని దగ్గరకు వెళ్ళికూర్చున్నారో, నందినీ ఆవిడా ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారో తెలియదుగానీ ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. అలా అవ్వగారు ఆవు ముందు కూర్చోవడాన్ని చూసిన జనం ఆ పందిరి చుట్టూ గుమిగూడారు.

అక్కడికి వెళ్ళాలంటే వీధిలో వేసిన ముగ్గులన్నింటినీ దాటి వెళ్ళాలి. నేను ఆ ముగ్గుల్ని తొక్కకుండా వాటి మధ్యలో అతి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ నడుస్తూంటే ఒక బాలిక నన్నూ నా నడకనీ ముగ్గులు చెదిరిపోకుండా కాపాడటానికి పడుతున్న అవస్థల్నీ చూసి నవ్వుతోంది. తన దగ్గరకి వెళ్ళి ఎత్తుకుని బుగ్గమీద ముద్దుపెట్టుకోగానే ఏడుపు మొదలు పెట్టింది. వెంటనే తనని పక్కనున్న అంగడి దగ్గరకి తీసుకెళ్ళి ఒక రాగిలడ్డూ తీసిచ్చాను. దానివైపు చూడనైనా లేదు. వేరుశనగ పప్పుండలు తీసిచ్చాను. తీసుకోలేదు. నువ్వుల పట్టీ తీసిస్తే వెంటనే డబ్బామీద పెట్టేసింది. చివరికి ఏం కావాలని అడిగితే చాక్లెట్ చూపించింది. వెంటనే ఆ చాక్లెట్ కొనిచ్చాను.

“ఏం కావాలమ్మా?” అని నేను అడిగితేగానీ తనకేం కావాలో చెప్పని సంస్కారానికి ఆనందించాలో, బలాన్నిచ్చేవన్నీ పక్కన పడేసి పళ్ళు పుచ్చిపోయేలా చేసి ఆరోగ్యానికి హానికలిగించే చాక్లెట్లు అడిగినందుకు బాధపడాలో అర్థం కాలేదు. మా అమ్మాయికైతే ఇలా బలవర్ధకమైన చిరుతిళ్ళు దొరికే అవకాశం లేదు. అందుకే మేము స్వంతంగా ఇంట్లోనే తయారు చేసుకుంటాం. దగ్గరలో చిల్లర అంగళ్ళు ఉండవు కాబట్టీ చిరుతిళ్ళకోసం పేచీ పెట్టే అవకాశం లేదు..

అంతలోనే ఆ పాప తల్లి తన దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చింది. నా చేతిలోంచి పాపను తీసుకుని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది. నేను ముగ్గులు తొక్కకుండా నడుస్తున్నానుగానీ మరికాసేపటిలో రాత్రి జరిగే పూజలకి భక్తులంతా వస్తారు. ఆ తరువాత ముగ్గులూ ఉండవు వాటిని తొక్కుతున్నామనే అపరాధభావనా ఉండదు. అంతా తొడతొక్కిడే.

అంతలోనే టీవీ ఛానెల్లో న్యూస్ రావడం కనిపించింది. అక్కడే నిలబడి దాన్ని పూర్తిగా చూశాను. పార్వతీపురం ఆలయ వార్తలొస్తున్నాయిగానీ అందులో ఎలాంటి వివాస్పదమైన వ్యాఖ్యలుగానీ బైట్లుగానీ లేవు. అంటే ఊరిపెద్ద మాటలే కాదు, కవర్లు కూడా పనిచేసాయని అర్థమైంది. నిజానికి గుడిలో జరిగిందే ఒక గొప్ప సంచలనం. కనుక దాని పునరుద్ధరణ సమయంలో ప్రత్యేకంగా సంచలనం సృష్టించాల్సిన అవసరం ఆయా ఛానెళ్ళవారికి కనిపించి ఉండదు అనుకుంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకుని గుడిలోకి బయలుదేరాను..

నేను గుడిలోకి వెళ్ళేసరికి పురోహితులూ వారి పరివారజనులూ అందరూ కలిసి కలశాలని సిద్ధం చేస్తున్నారు. స్థానిక పురోహితుడికి తోడుగా భట్టుగారు కూడా మడి కట్టుకుని వారికి సహకరిస్తున్నారు. ఈలోగా ఒక భక్తుడు అతి పెద్ద రుద్రాక్షమాలని తీసుకుని వచ్చాడు. దానికి గంగాజలం సంప్రోక్షించి పరమశివుని మెడలో వేశారు. రుద్రాక్షహారం మెడలో పడగానే ధ్యానంలో నిమగ్నుడై ఉన్న శంకరుడు సత్య, శివ, సుందరస్వరూపుడిగా శాంతమూర్తిగా గోచరిస్తున్నాడు. ఈ పక్కన కామధేనువు విగ్రహం భక్తుల ఇష్టకామ్యార్థ సిద్ధిని కలిగిస్తూ ఆశీర్వదిస్తున్నట్లుంది.

అమ్మవారికి భక్తులు పట్టుచీరలు, ఆభరణాలు, పూలహారాలు సమర్పిస్తున్నారు.

శివపార్వతులను పూజించి వచ్చిన అనంతరం కామధేనువు విగ్రహం ముందు కూర్చుని ప్రతిష్ఠాపనోస్తవాన్ని వీక్షిస్తున్నారు. భట్టుగారు, పురోహితుడు వేదపండితులు ఋత్విక్కులు వేదమంత్రాలని ఉచ్చరిస్తున్నారు. ఒక బృందాన్నుండి మరొక బృందం అందుకుంటూ ఋక్కు పూర్తి కాగానే అందరూ పల్లవిని ఆలపిస్తూ ఉంటే వినడానికి వీనులవిందుగానూ మనసునీ ఆత్మనీ స్వఛ్ఛపరుస్తున్నట్లుగానూ ఆ ప్రదేశం అంతటినీ పునీతం చేస్తున్నట్లుగానూ అనిపిస్తోంది. పూజ పూర్తయింది. అంతలోనే భక్తులలో పురుషులందరినీ బయటకు వెళ్ళిపొమ్మని ఆదేశించారు రుత్విక్కులు.

అవ్వగారిని లోపలకు తీసుకువచ్చారు..

మేమంతా బయటకు వచ్చేశాము. మరికొంతసేపటికి పురోహితులు కూడా లింగభైరవి పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసి బయటకు వచ్చేశారు. లోపల స్త్రీలు మాత్రమే ఉన్నారు. అక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలను పురోహితులవారి భార్య పర్యవేక్షిస్తూండగా బైరవి పూజ ఆరంభమైంది. లోపలనుండి పురోహితులవారి భార్య చదువుతున్న మంత్రాలు వినిపిస్తున్నాయి. అంతవరకూ మంత్రాలనేవి పురుషుల నోటిలో తప్ప స్త్రీల గళంలో వినని నాకు వారి మంత్రోచ్చారణ అద్భుతంగా తోచింది. పురుషుల్లాగే స్త్రీలు కూడా మంత్రాలను చదువుతున్నారు. ఆ బృందగానం వినసొంపుగానూ ఉత్తేజభరితంగానూ ఉంది. వింటున్నకొద్దీ ఇంకా విందామనిపిస్తోంది. మంత్రోచ్చారణ క్రమంగా తారస్థాయినందుకుంటోంది. వేదఘోష గంగా ప్రవాహంలో శరావతీనది వరద వెల్లువలా సాగుతోంది. దానిస్థాయి పెరుగుతున్నకొద్దీ మంత్రోచ్చారణ మేఘగర్జనలా ధీరగంభీరంగా మారింది. లోపల గాలివాన కురుస్తున్నట్లుంది. బయట నిలబడిన మేమంతా వానలో తడిసిపోతున్న భావన. క్రమంగా ఆ భావనే భవమై శ్రీకరమై శుభకరమై మా చుట్టూ హిమపాతమై కురుస్తున్నట్లనిపిస్తోంది. మాకు తెలియకుండానే మా వెన్నులో చలిపుడుతోంది. మాకు తెలియకుండానే మా శరీరాలు వణికిపోతున్నాయి. మాకు తెలియకుండానే మేము వానలో తడవకుండా ఉండటానికి కనిపించిన చూరుకిందకి పరుగులు తీస్తున్నాం.

మంత్రోచ్చారణ సాగుతూనే ఉంది. అమ్మవారి శరణుఘోష చుట్టూ పిడుగులు పడుతున్నట్లుగా భయకంపితుల్ని చేస్తోంది. గుండెలు చిక్కబట్టుకుని చూరుకింద నిలబడి దిక్కుతోచనివారిలా దిక్కులు చూస్తున్నాం. అంతలోనే నందిని దిక్కులు పిక్కటిల్లేలా ఖణిల్లున రంకె వేసింది. ఆవు రంకెవేయడాన్ని చూసి చూరుకిందకి చేరిన పురుషపుంగవులంతా బిత్తరపోయారు.

ఆ బిత్తరపాటులో అందరూ తత్తరపడుతూండగానే శరణుఘోష సంపన్నమైంది.

గాలివాన వెలిసినట్లైంది. తెరిపిన పడ్డ మనసులతో బయటకు చూసిన మగవాళ్ళకి అక్కడ ఒక్కటంటే ఒక్క చినుక్కూడా పడలేదనే విషయం అర్థమైంది. దాంతో అందరికీ గుండెలు తేలికపడ్డాయి. అంతవరకూ మగమహారాజులందరినీ వదిలిపారిపోయిన ధైర్యం గుండెలు చిక్కబట్టుకుని మళ్ళీ బెరుకు బెరుగ్గా వారిలోకి రాసాగింది.

అమ్మని అమ్మలగన్న అమ్మ అనీ ముగురమ్మల మూలపుటమ్మనీ చాల పెద్దమ్మనీ ఎందుకంటారో అర్థమైంది. ఆడదాన్ని ఆదిపరాశక్తిగా ఎందుకు కొలుస్తారో అర్థమైంది. భక్తితోబాటు భయాన్ని కూడా ఎందుకు చేర్చారో అర్థమైంది. నాదానికిగల శక్తి ఎంతటి మహత్తరమైనదో అర్థమైంది. ఫలితంగా గుడిబయట నిలబడిన పురుషులందరిలోనూ స్త్రీలంటే చులకన భావం పోయి గౌరవభావం కలగసాగింది. భయంతో బాటుగా భక్తిభావం కూడా కలగసాగింది. అప్పటికి కాస్త తేరుకుని ఆకాశంలోకి చూస్తే గుడ్డిచుక్క మొలిచింది.

అధ్యాయం-24

ఉదయం కోడి కూయకముందే భక్తులందరూ తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. ఆ జనప్రవాహాన్ని చూస్తుంటే దసరాలలో తిరుపతి బ్రహ్మోత్సవాలు గుర్తొస్తున్నాయి. తిరుమల ఉన్నది కర్ణాటకలో కాకపోయినా బ్రహ్మోత్సవాలకి మాత్రం సగం కర్ణాటక తరలి వెళుతుంది.

ఉన్నట్లుండి సీత ఫోన్ చేసింది. నేను పలకరించగానే, “మనం ఇక్కడికి ఎందుకొచ్చాం?” అంటూ కసురుకుంది. ఉన్నట్లుండి కట్టుకున్న భార్య అంత తీక్షణంగా నిలదీస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు? నాలాగే బిక్కమొగం వేస్తారు. కానీ మన బిక్కమొగం వీడియో కాల్ చేస్తేగానీ కనపడదు కదా? అంచేత సీత తన ధోరణి కొనసాగించింది, “మనం ఐక్కడికొచ్చిన పనేమిటి? మీరు చేస్తున్నదేమిటి?”

దీనిక్కూడా సమాధానం నా ట్యూబులైటు బుర్రలో వెలగడం లేదు. అంతలోనే, “అది కూడా మర్చిపోయారా? మీలాంటివాడికి అంత పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో అంత పెద్ద పోస్టిచ్చిన వాణ్ణనాలి” అంటూ ఫైరింగ్ మొదలెట్టేసింది. దాంతో నేను తనకేం చెప్పాలో తోచక “పోన్లే సీతా, నా గురించి తెలియక ఇచ్చేసుంటారుగానీ ఇంకైనా విషయం చెప్పచ్చుగా?” అన్నాను బతిమాలుతున్నట్లుగా..

“అలా అన్నారు బాగుంది. మనం ఇక్కడికి వచ్చింది మీ అవ్వగారికి సహస్ర చంద్రదర్శనం చేయించడానికి. కానీ చేస్తున్నదేమిటి? పార్వతీపురంలో ఆలయ జీర్ణోద్ధరణ. మీరేమో ఆవిడకి ఏదో సర్‌ప్రైజింగ్‌గా జరిపిద్దామనుకున్నారు. కానీ ఆవిడ మొత్తం కర్ణాటక రాష్ట్రానికే పెద్ద సర్‌ప్రైజిచ్చారు. ముందు వెళ్ళి ఆవిడకి శుభాకాంక్షలు చెప్పండి. మీరిలా పుణ్యకార్యంలో పడి పురుషార్థాన్ని మర్చిపోతే ఎలా? అందుకే ఆవిడకి మా అందరి తరపునా శుభాకాంక్షలు చెప్పండి. ఈసారొచ్చినప్పుడు ఊళ్ళో అందరికీ మంచి పార్టీ ఇద్దాం” అంటూ ఫోన్ కట్ చేసింది. నేను ఫోన్ జేబులో పెట్టుకుని అవ్వగారికోసం చుట్టూ చూశాను. అవ్వగారు కనపడలేదుగానీ అన్నపూర్ణ కనపడింది.. ఆవిడెక్కడున్నారని అడిగాను. పాపం తను కూడా అవ్వగారి కోసమే వెతుకుతున్నానని చెప్పింది.

అంతలోనే మళ్ళీ ఫోన్ రింగైంది. సీతే మళ్ళీ పిలుస్తోంది. స్క్రీన్ స్వైప్ చేసి హలో అన్నాను. “మీ మతిమరుపు గురించి కసురుకోవడంలో పడి నేను అసలు విషయం మర్చిపోయాను. ఇంతకీ మనం బయలుదేరాల్సిందెప్పుడు?” అని అడిగింది.

అప్పుడుగానీ నాకు తిరుగుప్రయాణం గురించి గుర్తు రాలేదు. ఆలయం ఉత్సాహంలో పడి డేటు కూడా గుర్తురాలేదు. దాంతో డేటు చూశాను.. మేము వెనక్కి వెళ్ళడానికి మూడురోజులే ఉంది. అంటే రేపు సాయంత్రం బెంగుళూరు చేరుకోవాలి. అందుకే, “రేపు మధ్యాహ్నం ట్రైనుకి వచ్చేస్తాను” అని చెప్పాను.

“ఇంతకీ అవ్వగారికి బర్త్ డే విషెస్ చెప్పారా లేదా?” అని అడిగింది సీత.

“ఇంకా ఆవిడెక్కడున్నారో కనపడలేదు. కనపడగానే నువ్వు నాకు సర్‌ప్రైజిచ్చినట్లుగానే నేను కూడా ఆవిడకి సర్‌ప్రైజిస్తానుండు” అంటూ కట్ చేశాను.

అంతలోనే వెనకనించి “ఏం ప్రైజు ఆత్రేయా?” అన్న అవ్వగారి గొంతు వినిపించింది.

నేను నవ్వుతూ “ప్రైజు కాదు సర్‌ప్రైజ్”అన్నాను

అవ్వగారు నాకంటే బిగ్గరగా నవ్వుతూ, “ఆడవాళ్ళిస్తే ప్రైజు. నీలాంటి సార్లిస్తే సార్ ప్రైజ్ అంటారని నాకూ తెలుసుగానీ, ముందా ప్రైజేమిటో చెప్పు?”

“అదిప్పుడే చెప్పను సస్పెన్స్. ఇంతకీ ఈరోజు తిథేమిటి?” అని అడిగాను.

ఆవిడ నావైపు చూస్తూ, “ఈరోజు పౌర్ణమి. వైశాఖ పౌర్ణమి. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రోజు. ఆ విష్ణుమూర్తి నాకు ప్రీతిపాత్రమైన దేవుడు. ఆయనకి ప్రీతిపాత్రమైనవాడు శివుడు. ఆ శివుడి ఆలయానికి నిన్నే పునఃప్రతిష్ఠ జరిగింది గనుక ఈరోజు విష్ణుమూర్తి ఏదో ఒక రూపంలో దేవాధిదేవుడి దర్శనానికి వస్తారనుకున్నాను. కానీ వందలు వేల రూపాల్లో వస్తారని ఊహించలేదు. ఒకేసారి ఇంతమంది ఆదిలక్ష్ములనీ శ్రీమహావిష్ణువులనీ చూసే అదృష్టం అందరికీ దక్కదు. నాకు దక్కింది. జీవితంలో వెయ్యి పున్నముల్ని చూశాను. ఈ వెయ్యోపున్నమికి మీరు నన్ను సర్‌ప్రైజ్ చెయ్యాలనుకున్నారు. కానీ నేను పట్టపగలే సహస్రాధిక చంద్రదర్శనం చేస్తున్నాను. శివుడి తలమీద ఒక్క చంద్రుడే. కానీ పార్వతీపురం నిండా ఇప్పుడు మామకాని మామలే” అంటుంటే బిత్తరపోవడం నా వంతయింది. అవ్వగారు నవ్వుతూ “పద అసలైన విష్ణువెక్కడున్నాడో చూపిస్తాను.” అంటూ ఆవిడ ముందు నడుస్తుంటే నేను అనుసరిస్తున్నాను. జనాలని తప్పించుకుంటూ ముందుకు వెళుతూనే ఉన్నారు. ఆలయంలోకి వెళ్ళాక నేరుగా పరమేశ్వరుడి గర్భగుడి ముందు నిలబడ్డారు. పూజారిగారు, “ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రఃప్రచోదయాత్” అంటూ తీర్థమిచ్చారు. అవ్వ తీర్థం పుచ్చుకున్నాక పూజారిని, “మేము లోపలకి రావచ్చా పూజారిగారూ” అని అడిగారు.

పూజారిగారు “మీ గుడిలోకి మీరు రావడానికి అభ్యంతరం ఏముంటుంది రండి” అంటూ అడ్డంగా ఉన్న బల్లని పక్కకి జరిపారు. ఇద్దరం లోపలకి వెళ్ళాం. ఆవిడ నన్ను శివుడి విగ్రహం వెనుకవైపుకు తీసుకువెళ్ళారు..

విగ్రహం వెనుకభాగం చూపించారు. దాన్ని చూడగానే కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. అదసలు శివుడి విగ్రహమే కాదు. అక్కడున్నది విష్ణుమూర్తి. ఒకే శిలమీద ముందొకరినీ వెనక మరొకరినీ నాలుగు దిక్కులా నలుగురినీ చెక్కడం పెద్ద విషయం కాదు. విశేషం అసలే కాదు. మరి ఆ విగ్రహంలోని విశేషం ఏమిటి? నేను ఈ గుడిని చూడటానికి వచ్చినప్పుడు వెనుకభాగంలో శివుడి జటాజూటం తప్ప ఇంకేమీ లేదు. కానీ ఇప్పుడు విష్ణువు కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. శ్రీమహావిష్ణవునలా ధ్యానమూర్తిగా నేనెక్కడా చూడలేదు. ముందువైపునుండి పూజారిగారి మంత్రపుష్పం వినిపిస్తోంది

శివాయ విష్ణురూపాయ

శివరూపాయ విష్ణవే

శివస్య హృదయం విష్ణుః

విష్ణోశ్చ హృదయ శివః

అక్కడ కేవలం వినిపిస్తోంది.

ఇక్కడ నా కంటికి కనిపిస్తోంది.

అవ్వగారు చెప్పినట్లే నాకు విష్ణుమూర్తిని చూపిస్తానన్నారు. చూపించారు. అందుకే అబ్బురంగా అడిగాను, “ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నట్లు మీకెలా తెలిసింది అవ్వగారూ?”

“నందిని చెప్పింది”

ఇంక దానికెవరు చెప్పారు అనే ధైర్యం నాకు లేదు. ఎందుకంటే ఆ రహస్యం తనకి తెలిసినా ఎవరికీ చెప్పనని ముందే ప్రకటించారు కదా?

విష్ణుమూర్తికి కళ్ళుమూసుకుని నమస్కరించాను. స్వామి రూపాన్ని తలుచుకుంటూ కళ్ళు తెరిచాను. అక్కడ శివుడి జటాజూటం తప్ప విష్ణుమూర్తి జాడలెక్కడా లేవు. నేను కలలో ఉన్నానో మెలకువలో ఉన్నానో నాకే అర్థం కాలేదు. కళ్ళు నులుపుకుని మరోసారి చూశాను. విష్ణుమూర్తి లేడు. ఇందాకా ఎక్కడినుండి వచ్చాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇది విష్ణుమాయా లేక నా భ్రమా?

ఆంతలోనే “అవ్వగారూ ఆలయ ధర్మకర్త పిలుసున్నారట” అనే పూజారి పిలుపు వినపడింది. దాంతో విగ్రహం వెనుక వైపు నుండి బయటకు వచ్చాను. అవ్వగారి మాంత్రిక జగత్తులోనుండి బయటకు వచ్చాను. విష్ణుమాయలోంచీ శివలీలల్లోంచీ బయటకొచ్చాను. మళ్ళీ మనలోకంలోకి వచ్చిపడ్డాను.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version