Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అవ్వగారు-14

[ధనంజయ లక్ష్మీ రామకృష్ణగారు వ్రాసిన ‘మత్తె మూకజ్జి’ అనే కన్నడ నవలని ‘అవ్వగారు’ పేరుతో అనువదించి ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.]

[పార్వతీపురం గుడి చుట్టూ సందడి మొదలవుతుంది. టీ అంగడి వెలుస్తుంది. గుడి చుట్టూ ఉన్న వీధుల్లో ఇళ్ళ ముందు రాత్రికి రాత్రే అంగళ్ళు వచ్చి, కొబ్బరికాయలు, అరటిపండ్లు, పూజసామగ్రి అమ్మకాలు మొదలవుతాయి. గుడి ముందు బిచ్చగాళ్ళూ చేరుతారు. ఆలయం వీధుల్లో వేసిన ముగ్గులను తొక్కకుండా జాగ్రత్తపడుతూ గుడికి చేరుకుంటాడు ఆత్రేయ. ఆలయం గురించి టీవీ ఛానెల్ లో కవరేజ్ వస్తుంది కానీ అందులో ఎలాంటి వివాస్పదమైన వ్యాఖ్యలుగానీ బైట్లుగానీ ఉండవు. భట్టుగారు, పురోహితుడు వేదపండితులు ఋత్విక్కులు వేదమంత్రాలని ఉచ్చరిస్తారు. ఆ పూజ అయ్యాక, మగవాళ్లందరినీ బయటకు పంపేస్తారు. ఆడవాళ్ళని మాత్రమే లోపల ఉంచి, వారితో లింగభైరవి పూజ చేయిస్తుంది పూజారి గారి భార్య. ఆ పూజ కూడా పూర్తయ్యేసరికి అక్కడున్న అందరిలో తన్మయత్వం కలుగుతుంది. మర్నాడు ఉదయం భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. సీత ఆత్రేయకి ఫోన్ చేసి, అవ్వగారి సహస్రచంద్రదర్శనం వేడుక గురించి గుర్తు చేస్తుంది. ఆవిడకి శుభాకాంక్షలు చెప్పమని చెప్తుంది. మళ్ళీ కొద్దిసేపటికే ఫోన్ చేసి తమ తిరుగుప్రయాణం తేదీ ఎప్పుడని అడుగుతుంది. ఇంకా మూడు రోజులుందని, మర్నాడు మధాహ్నం బయలుదేరుతానని చెప్తాడు ఆత్రేయ. అవ్వగారు కనబడగానే ఆవిడకి శుభాకాంక్షలు చెప్పబోతుంటే, ఆవిడ కల్పించుకుని శివుడి ప్రాశస్త్యాన్ని, ఆలయంలోని విగ్రహం వైపు తీసుకువెళ్ళి చూపిస్తే అక్కడ విష్ణువు కూర్చుని ధ్యానం చేసుకున్న మూర్తి కనబడుతుంది. ఆశ్చర్యపోతాడు ఆత్రేయ. కళ్ళు మూసుకుని నమస్కరించి, స్వామి రూపాన్ని తలచుకుంటూ కళ్ళు తెరిచేసరికి అక్కడ మళ్ళీ శివుడి జటాజూటమే కనిపిస్తుంది. అది విష్ణుమాయా లేక తన భ్రమా అన్న ఆలోచనలో పడతాడు. ఇంతలో పూజారి గారు పిలవడంతో ఈలోకంలోకి వస్తాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-25

వ్వగారు చెప్పింది ముమ్మాటికీ నిజం. మహాశివుడి ధ్యానమూర్తిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. వారందరూ విష్ణుస్వరూపులే. కానీ ఇప్పుడు సామాన్య మానవుల్లాగానూ మామూలు భక్తుల్లాగానూ కనిపిస్తున్నారు. పేదవారినుండి శ్రీమంతులదాకా అందరూ వారివారి తాహతుకు తగిన మేలు వస్త్రాలు ధరించి వస్తున్నారు. అమ్మాయిలు పరికిణీ ఓణీల్లో సీతాకోక చిలకల్లా కనిపిస్తున్నారు. నూనూగుమీసాల కుర్రాళ్ళు జుబ్బా పైజమాల్లో గండుతుమ్మెదల్లా అనిపిస్తున్నారు. కలిగిన వారింటి పట్టు చీరల్లో ఉడికిపోతూ కొంగుల్తో విసురుకుంటూ వారి దర్పాన్ని ప్రదర్షిస్తున్నారు. కొందరు మడత నలగని ఖాదీ బట్టలు కట్టుకుని చల్లగా మెల్లగా నడుస్తున్నారు.

విదేశాల్లో ఆ ఖాదీ బట్టల్ని కాస్ట్లీ డ్రెస్ మెటీరియల్స్‌గా భావించి ఎంతో ఖర్చుపెట్టి కొంటారు. కానీ, మనం మాత్రం మన బట్టల విలువ గుర్తించలేకపోతున్నాం. మన దేశానికి స్వాతంత్ర్య రావాడానికి జరిగిన ఉద్యమాలలో విదేశీవస్త్ర బహిష్కరణ చాలా ప్రధానమైనది. ఒకప్పుడు విదేశీ వస్త్రాలని ఎక్కడికక్కడ తగలబెట్టడం ద్వారా విదేశీ పాలకుల వెన్నుల్లో దడపుట్టించాము. ఇప్పుడు మన బళ్ళారిలో తయారైన జీన్సు గుడ్డలనే బెంగుళూరు మాల్స్‌లో విదేశీ బ్రాండ్లతో అమ్ముతుంటే ఎగబడి కొనుక్కుంటున్నాం. మనవారి వ్యవహారాలన్నీ గమనిస్తూంటే మన స్వేచ్ఛని పోగొట్టుకోవడానికే స్వాతంత్ర్యం సంపాదించుకున్నామేమో అనిపిస్తుంది. అప్పట్లో విదేశీయులొచ్చి మన స్వాతంత్య్రాన్ని కొల్లగొట్టారు. ఇప్పుడు ఇప్పుడు సేచ్ఛని చేజేతులా మంగళ హారతులిచ్చిమరీ విదేశీయుల కంపెనీలకి సమర్పించుకుంటున్నాం.

సంస్కృతం అంటే మనదేశంలో సామాన్యులకి తెలిసింది కేవలం అర్థం కాని మంత్రాలని మాత్రమే. మనం దాన్ని మృతభాషగా పరిగణిస్తున్నాం. అందుకే సంస్కృతభాషాధ్యయనం జర్మనీలో సాగుతున్నంత లోతుగా ఇక్కడ సాగడం లేదు. ఇలాగే ముందుకుసాగితే కొంతకాలానికి జర్మనీయే సంస్కృతానికి చిరునామాగా మారిపోయినా ఆశ్చర్యం లేదు.

భారతీయులందరూ మేలుకోవలసిన తరుణమిది. ఆలస్యం అమృతం విషం. కాలం గడుస్తున్నకొద్దీ సంస్కృతి మనకిచ్చిన సకల సంపదలనీ పోగొట్టుకుని మనం సంస్కృతిహీనులం చరిత్రహీనులం అయిపోతాము. ఇప్పటికే వలసపాలకులు మన దేశాన్ని చరిత్రహీనులుగా మార్చివేశారు. మేము వచ్చి చెప్పేంతవరకూ మీరిక్కడున్న విషయం మీకే తెలియదని బుకాయిస్తున్నారు.. ఇప్పటికే మన వస్త్రధారణారీతిని పోగొట్టుకున్నాం. పండగలకో దైవదర్శనాలకి వచ్చినప్పుడో మాత్రమే పంచలు కడుతున్నాం. అదీ ఎందుకు, అరకొర ఆధునిక దుస్తులతో ఆలయాల్లోకి రానివ్వడం లేదు గనుక. ఈ గుడి దాటి బయటకు వెళితే గ్రామసీమల్లో కూడా అందరూ సౌకర్యంగా ఉంటుందనే సాకుతో టీషర్టులూ ప్యాంట్లతో తిరిగేస్తున్నారు. ఏం చేస్తాం కాలాయ తస్మై నమః. ఇప్పుడు మాత్రం ఈ గుడి ఆవరణలో తిరుగుతుంటే ఎప్పుడెప్పుడు వెనక్కి వచ్చి స్వదేశంలోనే స్థిరపడిపోదామా అనిపిస్తోంది.

అయితే ఒక్కవిషయం మాత్రం ఒప్పుకోక తప్పదు విదేశాలలో మనవాళ్ళు సంపాదించిన ధనాన్ని ఇక్కడ పెట్టుబడీగా పెడుతున్నారు. తద్వారా మన దేశ సంపదని పెంచుతున్నారు వారి కుటుంబాలు సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాయి. నాలాగే ఆలోచించేవాళ్ళు ఈ గుళ్ళోనూ ఊళ్ళలోనూ తప్పకుండా ఉంటారు. అలాంటివారి కోసం అన్వేషించాలి. వాళ్ళందరినీ కలుపుకుని పని చేయాలి. అందుకు ఏం చెయ్యాలో ఆలోచించాలి.

ఉన్నట్లుండి గుడిలో కోలాహలం మొదలైంది. మంత్రాలు చదువుతున్న పురోహితులు కూడా మంత్రాలు చదువుతూనే జరుగుతున్నదాన్ని కుతూహలంగా చూస్తున్నారు దాదాపుగా అరడజను మంది బౌన్సర్లు చేతుల్లో తుపాకులు పట్టుకుని లోపలకి దూసుకు వచ్చారు. అక్కడున్న భక్తులని బలవంతంగా పక్కకి గెంటేస్తున్నారు. రెండే రెండు నిమిషాల్లో శివుడి గర్భాలయనికి మ్ముందు ఖాళీ ఏర్పడింది. చూస్తూండాగానే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గుడిలోకి వచ్చారు. ఆయన వెనుకే వచ్చిన గ్రామ పెద్ద మంత్రిగారి పేరుమీద అభిషేకం చేయించమని ఆదేశించారు. వెంటనే జరుగుతున్న పూజలన్నీ ఆగిపోయాయి. అభిషేకం ఆరంభమైంది.

ఈ సన్నివేశాన్ని చూస్తుంటే వందల ఏళ్ళక్రితం గుడిలో పూజలు ఆగిపోక ముందు పాళేగాళ్ళు పూజలు చేయించడానికి వచ్చినప్పుడు ఇలాగే ఉండేదేమో అప్పటి భటుల చేతులో బల్లాలూ కత్తులూ ఉండేవి ఇప్పటి భటుల జేబుల్లో తుపాకులున్నాయి. రాచరికపు దాష్ణీకంలో మాత్రం ఎటువంటి తేడాలూ లేవు. అవే వందిమాగధ గణాలు అవే అవగుణాలు. అవే లక్షణాలు. అదే దాష్ణీకం. ఏవీ మారలేదు.

ఆదునిక తుపాకులు పట్టుకొస్తే ఆధునికులైపోతారా? ప్రవర్తనా నియమావళిని అనుసరించాల్సిన అవసరం లేదా? అందులోనూ ప్రజాప్రతినిధులంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సమాజానికి క్రమశిక్షణ నేర్పాల్సినవాళ్ళే పద్ధతీ పాడూ లేకుండా ప్రవర్తిస్తే ఎలా?

శివుడికి అభిషేకం తరువాత బిల్వపత్రార్చన. తరువాత పార్వతీదేవికి కుంకుమార్చన.. కామధేనువుకి క్షీరాభిషేకం. వచ్చింది మంత్రిగారు కదా? ఆయన్ని మెప్పించడమే ముఖ్యం. అందుకే ముందు వెనుకలు ఆలోచించకుండా ఆయన గొప్పదనాన్ని చాటించడానికీ ఆయన కంట్లో పడటానికీ లెక్కలేనన్ని సర్కస్సులు చేస్తారు. లేకపోతే పాలిచ్చే ఆవుకు పాలాభిషేకాలెందుకు. నాకెందుకోగానీ చదువుతున్న మంత్రాలకూ జరుగుతున్న తంతుకూ పొంతన లేదనిపిస్తోంది. దానికి తోడు టీవీ న్యూస్ రిపోర్టర్ల హడావిడి. చూస్తూండగానే ఆలయంలో పూజ కాస్తా జాతరలా మారిపోయింది. దాంతో అక్కడ జరుగుతున్నది పూజో సినిమా షూటింగో అర్థం కాలేదు. మరో పదినిమిషాల తరవాత జడివానలా వచ్చిన మంత్రిగారి గణాలన్నీ సుడిగాలిలా వెళ్ళిపోయాయి. సరిగ్గా రెండేరెండు నిమిషాల్లో ఆలయం మళ్ళీ తన సహజమైన భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. అంతవరకూ ఉక్కపోసిన ప్రాంగణాన్ని ఒక్కసారిగా చల్లదనం ఆవహించింది.

మళ్ళీ పూజలూ అభిషేకాలూ ఊపందుకున్నాయి. మధ్యాహ్నం నైవేద్యం వేళవరకూ ఇసక వేస్తే రాలనంతమంది భక్తులతో ఆలయం కిటకిటలాడిపోయింది. నైవేద్యం వేళకి అందరినీ బయటకు పంపించేశారు. అక్కడినుండి అన్నదానం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళాము.

ఊరిపెద్ద ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతోంది. ఆయన నన్ను చూడగానే భోజనాలకు ఇంటికి వెళదాం రమ్మని పిలిచారు. “మీకోసం మడిగా వండించి పెట్టాం రండి ఆత్రేయా” అంటూ ఆహ్వానిస్తుంటే, నాకు చిన్ననాడు చదువుకున్న మాట గుర్తొచ్చింది. జాతరలలో అంటూ ముట్టూ ఉండదు. అక్కడ కులమతాల వ్యత్యాసం ఉండదు. ఆచార వ్యవహారాలన్నీ ఇండ్లకు మాత్రమే మరిమితం. అంతమందితో కలిసి భోజనం చేసే అవకాశం ఎప్పుడో గానీ రాదు. ఏ మ్యారేజ్ రిసెప్షన్‌కో వెళితే తప్ప ఇంత సందడి ఉండదు. దానికి మనం పిలిచినవాళ్ళు మాత్రమే వస్తారు. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే కదా? అందుకే ఇక్కడ పిలుపులూ- పులపరాలూ, అలకలూ-అలరింపులూ ఏవీ ఉండవు. అందుకే నేను తిన్నగా వెళ్ళి భక్తుల వరసలో నిలబడ్డాను. విధిలేని పరిస్థితుల్లో ఆయన కూడా వచ్చి నా వెనుక నిలబడ్డారు. వెజిటబుల్ బిర్యానీ కూర్మా మంచినీళ్ళగ్లాసూ తీసుకుని ఒక వారగా నిలబడి తినడం ఆరంభించాం. అవ్వగారెక్కడ? అని అడిగారు ఊరి పెద్ద. ఆవిడకి ఈ రోజు ఉపవాసం, రాత్రి ఫలహారం చేస్తారని చెప్పాను. ఆయన ఏదో చెప్పబోయారు. అంతలోనే ఎవరో వచ్చి ఆయన్ని పలకరించారు. మరొకాయనొచ్చి నమస్కారం చెప్పి వెళ్ళాడు. ఆ తరవాత అప్రకటిత సభాపర్వం ఆరంభమైంది. క్రమంగా అది పొగడ్తలకి దారితీసింది. అప్పుడుగానీ ఊరిపెద్ద అయినవాడు జనం మధ్య భోజనం చెయ్యడంలోని స్వారస్యం అర్థం కాలేదు.

ఆ రోజు సాయంత్రం నందిని దగ్గరకు వెళ్ళేసరికి అవ్వగారు అక్కడే కూర్చుని దాని యోగక్షేమాలు విచారిస్తున్నారు. నేను ఆవిడ కన్నుల్లో నందినిపట్ల గల ఆత్మీయతని చూసి ఆనందించాలో నందిని కన్నుల్లో అవ్వగారిపట్ల వ్యక్తమౌతున్న అభిమానానికి అబ్బురపడాలో అర్థం కాక తబ్బిబ్బవుతుండగా అటువైపు వచ్చారు ఊరి పెద్ద. తిన్నగా ఆవిడదగ్గరకు వెళ్ళి, “ఈ రోజు మీ ఆత్రేయ చేసినపని వల్ల ఈ పరిసర గ్రామాల్లో నాకున్న పలుకుబడెంతో అర్థమైంది. తను జనజాతరలో తినడమే కాకుండా నేను కూడా తినేలా చేశాడు. దాంతో ప్రజలందరూ నా చుట్తూ మూగిపోయారు తెలుసా?” అంటూంటే అవ్వగారు నవ్వేశారు.

“రాజులెప్పుడూ రాజమందిరాల్లో వెండికంచాల్లో పంచభక్ష్యపరమాన్నాలతో భోజనాలు చేస్తారని పుస్తకాల్లో రాసుకుంటారుగానీ, వాళ్ళకి తిండికంటే ఆరోగ్యమే ముఖ్యం. శరీర దారుఢ్యమే ముఖ్యం. లేకపోతే వాళ్ళు యుద్ధాలు చెయ్యలేరు. అతిగా తింటే ఒళ్ళొస్తుంది. తినపోతే బలం పెరగదు. అందుకే గొప్పగొప్పరాజులెవరూ నరం లేని నాలుక పెరక్కుండా కట్టడి చేసి కండబలం పెంచుకుంటూ ఉంటారు. ఈ గుడి కట్టించిన రాజు నువ్వులని పిడికిట్లో పిండి ఆ నూనెని అన్నంలో కలుపుకుని తినేవారు. అదీ కండబలం అంటే. జాతరలూ పూజలూ పునస్కారాలూ జరిగినప్పుడల్లా ప్రజలతో కలిసే భోజనం చేసేవారు” అవ్వగారు చెబుతూండగానే ఆవిడని అంబా అని పిలిచింది నందిని. వెంటనే మాటలు ఆపేసి దానివైపుకు తిరిగిగారు అవ్వగారు.

నందిని అవ్వగారి వైపే తదేకంగా చూస్తోంది. అవ్వగారు దాని కళ్ళలోకి తన నిశిత దృష్తిని ప్రసరింపజేస్తున్నారు. ఆ దృష్టికి ఏం గోచరించిందో ఎమోగానీ అవ్వగారి కన్నుల్లో నీళ్ళు తిరిగాయి. దాని నొసటన తన చేతితో ప్రేమగా రాస్తూ “నందినీ, వందల సంవత్సరాలు శివయ్యనీ శివమ్మనీ కంటికి రెప్పలా కాపాడుకున్నావు. నువ్వు లేకపోతే ఈరోజు ఇక్కడి ప్రజలకు నీ గురించీ కామధేనువు గురించీ ఆలయ స్రాశస్త్యం గురించీ తెలిసేది కాదు. కుంఫిణీ వాళ్ళు వారి భాషలో రాయించుకున్న అబద్ధాలే నిజాలుగా చెలామణీ అవుతూ ఉండేవి. ఇప్పుడా సమస్య లేదు. ఇక్కడి ప్రజలందరికీ ఆలయం గురించి తెలిసింది. దాన్ని కాపాడుకోవలసిన అవసరం గురించి తెలిసింది. ఇన్ని తెలిసేలా చేసిన నీకు మేమందరం ఋణపడి ఉంటాము. ఆ ఋణాన్ని తీర్చడం మా మనుషులవల్ల కానిపని. మా అసమర్థతని గ్రహించి మాపై ఆగ్రహించకుండా మాకు సెలవిప్పించు” అన్నారు.

నందిని మెల్లగా అవ్వగారివైపు చూసింది.

అలా తదేక దీక్షతో చూస్తూండగానే ఆకాశంలో ఉరుములూ మెరుపులూ ఆరంభమయ్యాయి. కానీ ఎక్కడా మబ్బుల్లేవు. చల్లగాలి లేదు. వానొచ్చే వాతావరణం లేదు. కానీ ఆకాశం మెరుస్తోంది. ఉరుముతోంది.

చూస్తూండగానే నందిని మెల్లగా కళ్ళు మూసుకుంది. ఆ వెనువెంటనే దాని కపాలాన్ని చీల్చుకుంటూ వెలువడిన దివ్యజ్యోత్స్న నేరుగా వెళ్ళి ఆకాశంలోని మెరుపుల్లో చేరిపోయింది.

నందిని దేహం ఆనందినిలా ఉంది. కూర్చున్నది కూర్చున్నట్లే ఉంది. చూస్తుంటే ఒక మహర్షి ధ్యానముద్రలో ఉన్నట్లే అనిపిస్తోంది. కానీ అందరి కళ్ళముందూ గోమాత తన స్వస్థాననికి చేరుకుంది. కళ్ళముందే నందిని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయినా ఎవరికీ నమ్మకం కలగడం లేదు. నందినితో పరిచయం ఉన్నవారు, చూసినవారు, విన్నవారు, దానిగురించి ఏమాత్రం తెలియనివారు ఇలా అందరినీ దుఃఖం ఆవహించింది. ఆ వెనువెంటనే ఆ ప్రదేశమంతా రోదనలతో నిండిపోయింది.

అధ్యాయం-26

అవ్వగారికి సహస్రచంద్రదర్శనం చేయించడానికి వచ్చాను. కానీ నాకే భారతీయ సాంస్కృతిక దర్శనం అయింది. అవ్వగారి ఔన్నత్యం ముందు చరిత్రే చిన్నబోయింది. చరిత్ర రాసుకోవడానికీ రాయించుకోవడానికీ చాలా తేడా ఉంటుంది. చరిత్ర విషయంలో మాత్రం మన దృక్పథం వేరు. పేరు కోసమో గౌరవ మర్యాదల కోసమో జీవించడం మన సంస్కృతి కాదు. ఎవరికివారే వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవడమే. అవ్వగారికీ త్రిశూలం గుర్తున్న ఆవులకీ మధ్యగల బాంధవ్యం గురించి నేను ఏం చెప్పినా అది కల్పితమే అవుతుంది. చూడటానికీ దర్శించడానికీ చాలా తేడా ఉంది. మనం చూసేది నిజం మనకి దర్శనమిచ్చేది సత్యం. ఆ సత్యానికి ఏ పరిమితులూ లేవు. నిజానికి చాలా పరిమితులుంటాయి. వాటన్నిటినీ సంతృప్తి పరిస్తేగానీ భౌతిక దృష్టిగల విజ్ఞానులు వాటిని నిజాలని అంగీకరించరు. సత్యం అలా కాదు. అది ఉండేది. ఉంది. ఉంటుంది. ఎవరు ఏం కనిపెట్టినా ఆ ఉన్నదాంట్లోంచి కనిపెట్టాల్సిందే.

నందినికి కపాల మోక్షం కలగడం సత్యం. అది నిజమా కాదా అని ఆలోచిస్తున్న నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. నాది భ్రమ అనుకున్నా ఒకే సమయంలో అంతమంది ఒకే భ్రమకి లోను కావడానికి కారణం మాస్ హిస్టీరియాలాంటిదేదో అయివుంటుదనిపించింది. అంటే ఒకరు కనిపించిందనగానే అందరికీ కనిపించినట్లనిపిస్తుంది. ఒకరు వినిపించిందనగానే అందరికీ వినిపించిందనిపిస్తుంది. మనకి అనిపించడానికీ అది నిజమే అయివుండటానికీ మధ్య విశ్వాసం అనే పారదర్శకమైన తెర ఉంటుంది. తన మేధస్సుని మించినది ఏదీ లేదని విర్రవీగిన మనిషి చేతుల్లోనే కృత్రిమ మేధస్సు వికసించింది. దాని వికాసం మనిషి కంటే వేగవంతంగా మారిపోతోంది. ఆ తరువాత మాస్ హిస్టీరియాకి కూడా క్లాస్ రీజనింగ్స్ వస్తాయి. ఫలితంగా కృతానికీ కృతకానికీ తేడా లేకుండా పోతుంది.

మా స్కూలు మాస్టారి దగ్గరకి వెళుతూ ఆలోచించుకుంటూ నడుస్తున్నాను.

నడక ఎక్కడ మొదలౌతుంది?

మనం నుంచున్నచోటునుండే మొదలౌతుంది. నా నడక మా మాస్టారితోనూ మా పాఠశాల గదుల పునర్నిర్మాణంతోనూ ఆరంభమౌతోంది. దారిలో మాస్టారు కనిపించారు. మొత్తం ఎంత ఖర్చవుతుందో లెక్క చెప్పారు. అంత డబ్బు నేను తెచ్చుకోలేదు. లోకల్ ఎక్కౌంట్‌లో కూడా లేదు.. కాబట్టీ నేను వెళ్ళి ఉద్యోగంలో జాయినవ్వగానే ఆయనకి పంపిస్తానని చెప్పాను. ఆయన సంతోషంగా నా రెండు చేతులూ పట్టుకుని దగ్గరకి తీసుకున్నారు. ఆ చేతుల్లోని వాత్సల్యాన్ని మించిన చల్లదనం హిమాలయాల్లో కూడా ఉండదు. ఒకానొక మహర్షి చేతుల్ని స్పర్శిస్తున్న అనుభవం.

మాస్టారు నాతో అడుగులు వేస్తూ గోడమీద నామఫలకం చెక్కిస్తాననీ దానిమీద నా పేరు వెయ్యడానికి అనుమతించమనీ కోరారు. నేను నిస్సంకోచంగా వద్దని చెప్పాను.

నందిని నిజమో సత్యమో నేను చెప్పలేను. కానీ నా నడక ఇక్కడే ఆరంభం కావడం నిజం. ఆ నిజాన్ని సత్యంగా మార్చడానికి చరిత్ర సరిపోకపోవచ్చు. సంస్కృతి సంస్కారాలు అవసరం కావచ్చు. ముందుగా ఆ రెండూ సంపాదించుకోవాలి. లేకపోతే రాజుల సొమ్ము రాళ్ళపాలు అనే సామెతని మరోసారి నిజం చేయడం తప్ప సాధించగలిగేది ఏదీ ఉండదు.

నా మాటలు విని మాస్టారు ఎంతో సంతోషించారు. అందుకే అభినందన పూర్వకంగా నా భుజాన్ని తడుతూ “అవ్వగారి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్నావన్నమాట” అన్నారు. నాకేం మాట్లాడాలో తోచలేదు.

అంతలోనే భట్టుగారు హడావిడిగా వచ్చారక్కడికి. “ఆత్రేయా, వెంటనే అవ్వగారిని తీసుకుని రా. చాలా అర్జంటు” అని చెప్పి ఎంత హడావిడిగా వచ్చారో అంతకంటే హడావిడిగా వెళ్ళిపోయారు. ఆయనలోని వేగిరపాటుని చూడగానే, “ముందు అవ్వగారిని తీసుకు వెళ్ళు ఆత్రేయా” అని చెప్పి రేవుకి వెళ్ళిపోయారు మాస్టారు.

నేను ఇంటికెళ్ళేసరికి అవ్వగారు, పార్వతీపురంలో జరిగినదంతా భాగీరథక్కగారికి వివరిస్తున్నారు. నేను వెళ్ళగానే అవ్వగారిని నాతో రమ్మని పిలిచాను. ఆవిడ అనుమానంగా చూస్తూ పైకి లేచారు. ఆవిడ నడక చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే నేను ఆవిడ చెయ్యిపట్టుకుని వేగంగా భట్టుగారింటికి తీసుకు వెళ్ళాను.

భట్టుగారి ఇంటి అరుగుమీద కాషాయాంబరధారి అయిన ఒక సన్యాసి కనిపించారు. ఇంతపొడుగు గడ్డం నొసటికీ భుజాలకీ ఛాతీకీ ముంజేతులకీ విభూతి పిండికట్లు పెట్టుకుని ఉన్నారు. చూస్తుంటే ఆయన ఎవరోగానీ గొప్పశివభక్తుడిలా కనిపిస్తున్నారు. ఆయన మాటకి ముందొకసారీ వెనకొకసారీ శివనామాన్నో పంచాక్షరీ మంత్రాన్నో పలుకుతున్నారు.

ఆయన ముఖంలోకి కళ్ళలోకీ గుచ్చి గుచ్చి చూశారు అవ్వగారు. ఆవిడంత నిశితంగా పరిశీలిస్తున్నారంటే ఆ శివభక్తుడి గురించి ఆయనకి తెలిసినవాటితోబాటు తెలియని విషయాలు కూడా అవ్వగారికి తెలుసని అర్థం. నేను ఊహించినట్లుగానే చాలా పరిచయస్థుడిని పలకరించినట్లు, “ఏం శేఖరం బాగున్నావా?” అన్నారు.

శేఖరం అనే ఆ శివభక్తుడు అవ్వగారికి నమస్కరించారు.

అవ్వగారు, “ఇలా వేళకాని వేళ ఇంత ధైర్యంగా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావంటే ఏదో విశేషమే ఉంటుంది. చెప్పు” అన్నారు.

శేఖరం చెప్పడం ఆరంభించారు, “అర్జునుడు వినగలడే తప్ప కృష్ణపరమాత్ముడికి చెప్పగలిగిందేముంది? విన్నవన్నీ నిజాలు కావచ్చు. కాకపోవచ్చు. నేను చెప్పేవన్నీ మీరు నమ్మచ్చు. నమ్మకపోవచ్చు. కానీ చెప్పడం నా ధర్మం. అందుకే చెబుతున్నాను. సావిత్రి మీకు కావలసిన మనిషి. కాబట్టీ తనగురించి చెడుచెప్పి మిమ్మల్ని నమ్మించడం అసంభవం. అందుకే నిజం మాత్రమే చెబుతాను. సావిత్రికి ఎముకలు బలహీనంగానూ పెళుసుగానూ ఉండటంతో ఒక్కసారి కుప్పకూలిపోయింది. ఆ తరువాత తను మంచం మీంచి పైకి లేవలేకపోయింది. కాలం గడుస్తున్నకొద్దీ ఆ ఎముకల బలహీనతకి నరాల బలహీనత తోడయింది. అయినాసరే పెదవులపై చిరునవ్వు మాత్రం చెదిరేది కాదు. ఎముకలూ నరాలూ బలహీన పడ్డాయని వచ్చే ఆలోచనల్ని ఆపుకోలేదు కదా? ఆలోచనలు ఎక్కువై మెదడులో స్థలం తక్కువై క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణించసాగింది. క్రమంగా భౌతికంలో జీవించడం తగ్గించి ఆధ్యాత్మికంలో జీవిస్తున్నాననుకుంటూ భ్రమల్లోకి వెళ్ళిపోయింది. మొదట్లో ఆ విషయం మాకు అర్థం కాలేదు.. ఆమె మాటల్ని బాధతో గతితప్పిన మతిలేని మాటల్లా భావించాం. అది మా తప్పు. తప్పెవరిదైనా ఫలితం అనుభవించింది మాత్రం తనే. చివరికి కదల్లేని సావిత్రిని గదిలో బంధించేంత మూర్ఖంగా మారిపోయాం” అన్నాక ఏం చెప్పాలో పాలుపోనివాడిలా తల వంచుకున్నాడు. కంట్లోంచి రెండు కన్నీటిబొట్లు నేలరాలాయి. ఆయన తనలో తానే గొణుక్కుంటున్నట్లుగా “శివార్పణం” అన్నాడు.

అవ్వగారు అనునయిస్తున్నట్లుగా అన్నారు, “శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు. మీరు బంధించామని అనుకున్నారుగానీ సావిత్రే మీ అందరినీ మీ మీ భ్రమల్లో బంధించింది. ఆ విషయం ముందే గ్రహిస్తే ఎముకల బలహీనతనాడే పరిష్కారం కోసం వెతికేవారు. దాన్ని గుర్తించలేకపోవడం జరిగిన తప్పేగానీ చేసిన తప్పుకాదు. చేసిన తప్పైతే నువ్విలా వెనక్కి తిరిగి వచ్చి ఇన్ని వివరణలిచ్చే అవకాశమే ఉండదు. ఇంతకీ భార్గవి విషయంలో మీ అభిప్రాయం ఏమిటో చెప్పారు కారు” అంటూ నేరుగా అసలు విషయానికి వచ్చారు.

శేఖరం దీర్ఘంగా నిట్టూర్చాడు. “సావిత్రికి ఏమీ తెలియదని అందరం అనుకునేవారంగానీ ఆమెకి తెలియంది లేదు. తనకి భార్గవి ప్రేమగురించి తెలుసు. మా తమ్ముడికి తనపై మనసున్న సంగతికూడా తెలుసు. అందుకే ఒకరోజు నన్ను తన గదిలోకి పిలిచింది. అప్పటికే ఆ గదిలోకి వెళ్ళడానికి అందరూ ముక్కు మూసుకునే పరిస్థితి వచ్చింది. అయినాసరే పిలిచింది సావిత్రి. తను నాలో సగభాగం. తను పిలిచాక నేను కాదనలేను”

అవ్వగారు సూటిగా తన కళ్ళలోకే చూస్తూ, “అవన్నీ సరేగానీ అసలు సంగతి చెప్పండి” అన్నారు.

శేఖరం కొనసాగించారు, “మీ తమ్ముడూ మా చెల్లెలు భార్గవీ ఒకరినొకరు ఇష్టపడుతున్నారనీ ప్రేమించుకుంటున్నారనీ పెద్దలకు భయపడి ఆ విషయం ఎవరికీ చెప్పడం లేదనీ నాకు తెలుసు. పిల్లల మనసెరిగి ప్రవర్తిస్తేనే మన పెద్దరికం నిలబెట్టుకోగలం. లేకపోతే వారు తిరుగుబాటు చేస్తారు. లేదా మనల్ని తిరస్కరిస్తారు. కనుక వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసి మన పెద్దరైకం నిలబెట్టుకోవాలి. రేపు నేను ఉండచ్చు ఉండకపోవచ్చు. నేను లేకపోయినా మీరు దగ్గరుండి వాళ్ళకి పెళ్ళి జరిపిస్తానని మాట ఇవ్వండి” అంటూ చేతిలో చెయ్యివేయించుకుని మాట తీసుకుంది. రానురానూ తన శరీరం తనకి సహకరించడం మానేసింది. తిండి కూడా సరిగా తినేది కాదు. మరికొన్ని రోజులకి మాట కూడా పడిపోయింది. దాంతో అంతవరకూ సావిత్రి అరుపులతో దద్దరిల్లిపోయిన ఆ గదిలో మౌనం తాండవించసాగింది. ఎన్ని అతిధ్వనులనైనా వినగలంగానీ మౌనాన్ని మాత్రం వినలేము. వింటూ సహించలేము. అందుకే ఆ గదిలోని నిశ్శబ్దాన్ని నేను భరించలేకపోయేవాడిని. ఒకరోజు నేను లోపలకి వెళ్ళి మంచం పట్టిమీద కూర్చున్నాను. అలికిడికి అతి మెల్లగా కళ్ళు తెరిచింది సావిత్రి. తన సర్వశక్తులనీ కూడదీసుకుంటూ “ఏమండీ” అంది. అలాంటి పరిస్థితుల్లో ఎంతో సంకల్పబలం ఉంటేగానీ గొంతులోంచి మాట బయటకి రాదు. అంత కష్టానికి ఓర్చుకుంటూ పిలుస్తోందంటే తను చెప్పాలనుకున్నది ఎంతో ముఖ్యమైన విషయమై ఉంటుంది. అందుకే నేను చెవులు రిక్కించి వింటున్నాను.

“నన్ను ఉరి తీయండి” అంటూ ఏడుస్తోంది. కళ్ళవెంట ధారాపాతంగా నీళ్ళు కారిపోతున్నాయి. ఆ కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకుపోతున్నాను. ప్రాణం పొయ్యలేనివారికి ప్రాణాలు తీసే హక్కులేదు. అందులోనూ కట్టుకున్న భార్య ప్రాణాలు తీసేంత కిరాతకుడీని కాను. కాలేను. ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఎలాంటి ఫలితం లేదు. ఎవరూ ఏమీ చెయ్యలేనప్పుడు, ఏదీ మన చేతుల్లో లేనప్పుడు ఎవరైనా ఏం చేస్తారు?”

శేఖరం అడిగింది ప్రశ్నైనా అది సమాధానం కోసం వేసిన ప్రశ్నకాదు. జవాబు చెప్పడం కోసం సాగించే సంసిద్ధత. అందుకే అవ్వగారు ఏమీ మాట్లాడలేదు. కానీ నాకు మాత్రం లోపల రక్తం ఉడికిపోతోంది. అవకాశం ఉంటే శేఖర్ గొంతు పిసికేద్దామన్నంత ఆగ్రహావేశాలతో గుండెలు రగిలిపోతున్నాయి. అయినా సరే అతి కష్టం మీద నన్ను నేను అదుపు చేసుకుంటున్నాను.

శేఖరం చెప్పడం కొనసాగించాడు, “నాలో నాకు లెక్కలేనన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. తనని ఏదైనా పెద్దాసుపత్రికి తీసుకువెళ్ళి వైద్యం చేయించినా ఉపయోగం లేదని డాక్టర్ ఖచ్చితంగా చెప్పారు. అయినా ఆశ తీరక వేరే డాక్టర్ని పిలిపించాను. ఆయన కూడా అదే మాటన్నారు. ఇంక లాభం లేదని బెంగుళూరు నించి ఎముకలు, నరాల స్పెషలిస్టులని కూడా తీసుకొచ్చి చూపించాను. వాళ్ళని మా మారుమూల గ్రామానికి రప్పించడంకోసం ఎన్ని కష్టాలు పడ్డానో ఎంతమంది కాళ్ళు పట్టుకున్నానో నాకు తెలుసు. వాళ్ళు కూడా వచ్చి పెదవి విరిచారు. దాంతో ఏమీ చెయ్యలేని పరిస్థితి. బతికించే అవకాశం లేనంతమాత్రాన తనకున్న జీవించే హక్కుని కాలరాయడం అమానుషం. అలాగని ఆమె పడుతున్న బాధల్ని చూడలేను. చూసికూడా భరించలేను. వాటిని తగ్గించలేను. సావిత్రంటే తన భర్త ప్రాణాలకోసం సాక్షాత్తూ యముడినే నిరుత్తరుణ్ణి చేసిన మహా పతివ్రత. యముడిని తన తార్కిక జ్ఞానంతో మెప్పించి ‘సుపుత్ర ప్రాప్తిరస్తు’ అనే వరం పొందింది. భర్తలేకుండా సంతానం కలగదు కాబట్టీ యమధర్మరాకుకి సావిత్రి భర్త సత్యవంతుడి ప్రాణాలను తిరిగివ్వక తప్పలేదు. అలాంటి సావిత్రి కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. దానిని చూడలేను. ఆ సావిత్రిలాగే నాక్కూడా భార్య ప్రాణాలను తిరిగి తెచ్చుకునే అవకాశముంటే? నాక్కూడా తనలాగే తపోశక్తి ఉంటే? నేను కూడా అంతటి భక్తుడినే అయివుంటే? ఊహించుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ జరగదు. ఇది సత్యకాలం కాదు. అసలు సత్యానికి కాలం కానేకాదు. అందుకే.. అందుకే..” ఆ తరువాత ఏం జరిగిందో చెప్పలేక కుప్పకూలిపోయాడు.

అవ్వగారు ఆయన్ని లేపి కూర్చోబెట్టారు. ఆయన తలమీద చెయ్యి వేశారు. అమృత తుల్యమైన ఆ స్పర్శతో శేఖరంగారి ముఖం తేటబడింది. ఊరట లభించగానే చెప్పడం కొనసాగించాడు, “ఆ రోజు ఆ పని చేసింది నేనే అని అందరూ ఊహించే ఉంటారు. కానీ తాము గ్రహించిన విషయాన్ని ఎవ్వరూ బయటపెట్టలేదు. అయినా నా భయం నాకుంది. అందుకే అవసరమైనప్పుడు మాత్రమే కనిపించేవాడిని తప్ప నా అంతట నేనుగా ఎవరి ముందుకీ వచ్చేవాడిని కాను. అవ్వగారు పోలీసు కంప్లైంటివ్వద్దని చెప్పాక నాకు కాస్త ధైర్యం వచ్చింది. మనుషుల మధ్య తిరుగుతున్నా మనుషుల్లో మనిషిగా మసల లేకపోతున్నాను. అందుకే ఊరొదిలి వెళ్ళిపోయాను. రాఘవేంద్రస్వామి మఠానికి వెళ్ళాను. బసవకళ్యాణ్ వెళ్ళి బసవన్నని దర్శించుకుని వచ్చాను. కానీ మామూలు మనిషిని కాలేకపోతున్నాను. అదంత సులభం కాదని ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది. సావిత్రి శారీరక బాధల్ని చూడలేక ఆ బాధలనుండి తప్పించగలిగానే కానీ, నా మనసు వేస్తున్న ప్రశ్నల్లో దేనికీ సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. నేను లేకపోయినా మా పిల్లల్ని చూసుకోవడానికి మా తమ్ముడూ భార్గవీ ఉన్నారు. వాళ్ళకి సరైన దారి చూపించడానికి పెద్దలున్నారు. ఎలాంటి సమస్యలొచ్చినా పరిష్కరించడానికి మీరున్నారు. మామయ్యగారున్నారు. కనుక నేను లేకపోయినా పరవాలేదు. నాలోని అపరాధభావాన్ని జయించలేకపోతున్నాను. అంతర్మధనాన్ని ఆపలేకపోతున్నాను. నేను ఉన్నంతకాలం నేను చేసిన పాపం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అలాగని తనకి ఉరేసినంత సులభంగా నా ప్రాణాలు తీసుకోలేను. ఇప్పటికే పత్నీహత్యాపాతకాన్ని మోసుకుంటూ తిరుగుతున్నాను. ఆత్మహత్య చేసుకుంటే నాకింక పుట్టగతులుండవు. నా జీవితం నాకు నరకంగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో నేనిక్కడే ఉంటే నా బాధ క్షణక్షణానికీ పెరిగేదేగానీ తగ్గేది కాదు. నేను కుమిలిపోతున్నకొద్దీ నా చుట్టూ ఉండేవాళ్ళకి మనశ్శాంతిగానీ ప్రశాంతతగానీ ఉండదు. అందుకే నేనా విశ్వనాథుడి దగ్గరకు వెళ్ళిపోవాలని తీర్మానించుకున్నాను. సన్యాసం తీసుకోవడానిక్కూడా తల్లి అనుమతి కావాలి. మా కుటుంబానికి అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఆ మూకాంబికాదేవే. అందుకే ఇక్కడికి వచ్చేముందు కొల్లూరు వెళ్ళి ఆ తల్లిని దర్శించుకుని వచ్చాను. అయినా నాకు తృప్తి కలగలేదు. నేను ఎలాంటి శంకలూ అనుమానాలూ ఆవేదనలూ లేకుండా కాశీ వెళ్ళాలంటే నాకు అభయం కావాలి. ఆ అభయాన్నివ్వగలిగింది కేవలం మీరు మాత్రమే. మీ చల్లని చేతి స్పర్శతో నాలో చైతన్యం ప్రవేశించింది. ఊరటే కాదు ధైర్యం కూడా లభించింది. ఓం నమఃశివాయ” అంటూ లేచి అవ్వగారి పాదాలకు నమస్కరించారు. అవ్వగారు ఏదో చెప్పబోయేంతలోనే ఆయన వడివడిగా అడుగులు వేసుకుంటూ రేవు దారిలో వెళ్ళిపోయారు.

ఆయనలా వెళ్ళిపోతుంటే అవ్వగారు ఆయన్ని ఆపుతారని భావించాను. కానీ ఆయన్ని వెనక్కి పిలవలేదు. ఆయన వైపునుండి ఆలోచిస్తే ఆయన నిర్ణయం సరైనదే కావచ్చు. కానీ తన సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మాత్రం ఆయన తీసుకున్నది అర్థరహితమైన నిర్ణయంలా అనిపించింది నాకు. అలాంటి అర్థం లేని నిర్ణయాన్ని అవ్వగారెందుకు సమర్థిస్తున్నారో అర్థం కాలేదు నాకు. అందుకే ఆయన వెళ్లడానికి అనుమతి ఎందుకిచ్చారని అడిగాను.

అవ్వగారు సమాధానం ఇవ్వకుండా నన్ను అక్కడినుండి బయటకు తీసుకొచ్చారు. గుడి అరుగుమీద కూర్చోబెట్టారు. ఆ తరువాత చెప్పడం ఆరంభించారు, “ఆత్రేయా, ఆయన్ని వెళ్ళనివ్వడమే మంచిది. సన్యాసం తీసుకోవడం ద్వారా తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఒకవేళ తను ఇక్కడే ఉంటే ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు ఏవో వంకలు పెట్టి సూటిపోటి మాటలనకుండా పోరు.”

“అలాగని సమస్యలనించీ పారిపోయేవారెప్పటికీ సన్యాసులు కాలేరు” అంటూ నా అసహనాన్ని ప్రదర్శించాను.

అవ్వగారు తన సహజమైన చిరునవ్వుతో సమాధానం చెప్పడం కొనసాగించారు, “ప్రతి పనికీ సమయం సందర్భం ఉంటాయి. అవి ఆ సమయ సందర్భాలకు మాత్రమే పరిమితం. వాటి గురించి తెలియనివారికి శేఖరం చేసిన పని హత్యలాగే అనిపిస్తుంది. అది నిజం కూడా. వాళ్ళింట్లో పెద్దలందరికీ జరిగిందేమిటో తెలుసు. కానీ భార్గవికి తెలియదు రేపెప్పుడైనా ఆ విషయం బయట పడితే? తన అక్కని బావే చంపాడని తెలిస్తే? ఆమె పరిస్థితేమౌతుందో ఆలోచించావా? రేపు పిల్లలకి తన తండ్రే కన్నతల్లిని చంపిన హంతకుడని తలిస్తే వారి పరిస్థితేం కావాలి? మనుషులున్నారంటే వారి గతం కూడా వారితోనే ఉంటుంది. మనుషులన్నాక అలకలో కోపతాపాలో ఆవేశకావేషాలో రాక తప్పదు. వాటికి లోబడిన మెదడు తర్కబద్ధంగా ఆలోచించినా ఆలోచించకపోయినా నరం లేని నాలుకని అదుపు చేయలేదు. అది అసంకల్పితంగానో అప్రమేయంగానో తెలియకుండానే నిజాన్ని బయట పెట్టేస్తుంది. నిజానికి సత్యమేమిటో మనసుకి తెలుసు. కానీ దానికి మాటలు రావు. కాబట్టీ శేఖరం అప్పుడు చేసినపని ఆ సందర్భానికి సరైనది. ఇప్పుడు చేస్తున్న పని ఈ సందర్భానికి తగినది” అంటుంటే నేను వేరు వేరు సందర్భాలలో చదివిన మానసిక శాస్త్ర విషయాలన్నీ మనసులో గిర్రున తిరిగాయి.

అవ్వలంటే గొప్ప మానసిక శాస్త్రవేత్తలు. ఏ శాస్త్రాలూ చదవకుండానే వారికా శాస్త్రపరిజ్ఞానం ఎలా అబ్బింది? ఆలోచిస్తే శాస్త్రాల్లోని థియరీ అంతా పుస్తకాలకే పరిమితమనీ.. దానికి సంబంధించిన ప్రాక్టికల్స్ మన చుట్టూ ఉన్న సమాజంలోనే నిరంతరం జరుగుతూనే ఉంటాయనీ. వాటిని నిశితంగా పరిశీలించే అవ్వగారిలాంటివారికంటే గొప్ప సైకాలజిస్టులు ఎక్కడా ఉండరనీ అర్థమౌతుంది.

***

జమునాపురంలో చివరి రోజు.

మధ్యాహ్నం బయలుదేరుతున్నాను. ఈ విషయం తెలిసిన మాస్టారొచ్చి నన్ను ఫలహారానికి ఆహ్వానించారు. అందుకే నేను త్వరగా సిద్ధమై వెళ్ళాను. నాకు దోసెలంటే ఇష్టమని ఆవిడకి ముందే తెలుసు. అందులోనూ కాలీదోసెలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మేమంతా ఆవిడచేతి కాలీదోసెలు చట్నీలు తినడానికి పోటీలు పడేవాళ్ళం. మాస్టారి తల్లిగారు, “ఇదేమైనా ఇల్లా? దోసెలంగడా?” అని వెక్కిరించేవారు. అయినా మేం ఏమాత్రం సిగ్గుపడకుండా తినేసేవాళ్ళం. అప్పట్లో నేను కాలీదోసెల్లో పుదీనా చెట్నీ వేసుకుని తినేవాడిని. అందుకే ఆవిడ నాకోసం ప్రత్యేకంగా పుదీనా చెట్నీ చేశారు. దాన్ని తింటున్నకొద్దీ మనసు బాల్యంలోకి వెళ్ళిపోతోంది. ఆవిడకి కృతజ్ఞతలు చెప్పుకుని బయలుదేరుతుంటే మాస్టారు ఒక కవరు తెచ్చి నా జేబులో పెట్టారు. “ఇందులో ఒక ఉత్తరం ఉంది. దాన్ని ఇక్కడ చదవద్దు నువ్వు కార్యస్థానం చేరుకున్న తరువాత చదువు” అన్నారు.

నేను అలాగే అన్నట్లు తల ఊపాను. అయినా ఆయన ఆగలేదు, “గుర్తుందిగా, నువ్వక్కడికి చేరేలోపు ఈ ఉత్తరం చదవకూడదు” అని మరోసారి హెచ్చరించారు. నేను ఈసారి తల ఊపడంతోబాటు, “చదవను లెండి మాస్టారూ” అన్నాను.

అంతలోనే మేడంగారు, “మీ విద్యార్థులమీద మీకే నమ్మకం లేకపోతే ఎలా?” అంటూ మేలమాడారు. మాస్టారు మొహమాటంతో కూడిన సిగ్గుతో గుభనంగా నవ్వుతూ చూస్తుంటే నా ముఖంలోకి కూడా నవ్వు చేరింది. ఇద్దరినీ దగ్గరకి రమ్మని గురుదంపతులకు పాదాభివందనం చేశాను.

ఇంటికి వచ్చి ప్రయాణానికి అన్నీ సర్దుకునేసరికి మధ్యాహ్నం భోజనం వేళయింది. భోజనం చేస్తుంటే అవ్వగారు, “ఇప్పుడు వెళుతున్నందుకు కలుగుతున్న బాధకంటే మరో రెండేళ్ళలో తిరిగొచ్చేస్తావనే అభిప్రాయమే ఎక్కువ ఆనందాన్నిస్తోంది.. వీలైనపుడు ఫోన్ చేస్తూ ఉండు. అక్కడ మీ స్నేహితులందరినీ అడిగానని చెప్పు. మరీ ముఖ్యంగా మైకేల్నీ చింగ్ మింగ్‌నీ నేను ఎప్పటికీ మర్చిపోనని చెప్పు. వాళ్ళిద్దరికీ మన సంస్కృతిపట్ల గల గౌరవానికి నా కృతజ్ఞతలు చెప్పు. వీలైతే నీతోబాటు ఇక్కడికి తీసుకురా. వాళ్ళకి మన మలనాడులాంటి ప్రదేశాలు ఉంటాయో లేదో. ఇటో ఊరూ అటో యేరూ ఆ మధ్యలో నదీ ఇవన్నీ ఇక్కడ తప్ప ఇంకెక్కడైనా ఉంటాయో లేదో నాకు తెలియదు. ముఖ్యంగా హంపీలో సప్తస్వర మంటపం, హళేబీడు, బేలూరుల్లో శిల్ప సంపదా శ్రావణబెళగొళ కొండమీద అరవై అడుగుల గోమఠేశ్వరుడు ఇలాంటివన్నీ మనవాళ్ళు తప్ప ప్రపంచంలో ఇంకెక్కడైనా ఎవరైనా నిర్మించారా? లేదు కదా? అలాంటి అద్భుతాలని మిత్రులకి చూపించకపోతే స్నేహానికి అర్థం ఏమిటి చెప్పు” అంటుంటే వీసాలు దొరక్క వాళ్ళు రాలేకపోయిన సంగతి గుర్తొచ్చింది. ఇప్పుడు అవ్వగారు నాకు చెప్పిన మాటల్నే ఒకప్పుడు నేను వాళ్ళకి చెప్పి ఊరించాను. వాళ్ళు తప్పకుండా వస్తామని మాట కూడా ఇచ్చారు. ఈసారి వాళ్ళని తప్పకుండా తీసుకొస్తానని అవ్వగారికి చెప్పాను. ఆవిడ నావైపు వాత్సల్యంతో చూస్తూ “వెరీ గుడ్” అన్నారు.

అవ్వగారి నోట నేను విన్న మొదటి ఇంగ్లీషు పదబంధం అదే. వెరీగుడ్!

ఈలోగా నాకు వీడ్కోలు చెప్పడానికి భాగక్కగారు, మీనా, అన్నపూర్ణ, మేస్టారు, రామప్ప, చిన్న గౌడ, అందరూ రేవుదాకా వచ్చారు. అందరికీ వీడ్కోలు చెప్పి పడవెక్కాను. వచ్చినప్పుడూ అదే పడవ. వెళ్ళేప్పుడూ అదే పడవ. పడవ మారలేదుగానీ పరిస్థితులు మారాయి. పరిస్థితులంటే కాలప్రవాహం లాంటివి. నదినీటిలాగే ఒక్కక్షణం కూడా ఒక చోట నిలబడలేవు. పల్లాల లోతులు కొలుచుకుంటూ వచ్చే వాగులనీ వంకలనీ కలుపుకుంటూ ముందుకు సాగిపోతూనే ఉంటుంది. జీవితం కూడా అంతే. కాల ప్రవాహంలో సాగిపోవలసిందే.

ప్రయాణాలూ రవాణాలూ తప్పవు. నది దాటి ఆవలి తీరం చేరగానే జమునాపురానికీ నాకూ మధ్య అంతకు ముందులేని కొత్త ఆత్మీయానుబంధాలేవో ముడిపడినట్లనిపించింది.

***

నేను మా ఆఫీసు పనుల్లో పడి ఉత్తరం మాట మర్చిపోయాను. వీకెండ్లో శనివారం నిద్రలేవగానే అవ్వగారినుండి ఫోనొచ్చింది. ఆవిడతో మాట్లాడుతుంటే మాస్టారు గుర్తొచ్చారు. ఆ వెనుకే ఆయన రాసిన ఉత్తరం గుర్తొచ్చింది. మాట్లాడటం పూర్తికాగానే నేను చేసిన మొదటిపని ఉత్తరం కోసం వెతకడం. అది ఎక్కడుందో కనపడలేదు. అంతలోనే దేనికోసం వెతుక్కుంటున్నారంటూ సీత వచ్చింది. నేను సమాధానం చెప్పకుండా, “నా చొక్కా జేబులో ఒక ఉత్తరం ఉండాలి చూశావా?” అని అడిగాను. తను తల అడ్డంగా ఊపింది.

మాస్టారు ఆయన ఉత్తరంలో ఏం రాసుంటారో ఊహించడానికి ప్రయత్నం చేసినా ఫలితం లేదు. వారు ఏం రాసినా చాలా ముఖ్యమైన విషయమై ఉంటుంది. ఏమిటా విషయం? ఆయనకి నా దగ్గర ఎలాంటి మొహమాటాలూ దాపరికాలూ లేవు. కాబట్టీ బడి పునర్నిర్మాణానికైన ఖర్చుల గురించి ఉత్తరం రాసే అవకాశం లేదు. అయినా ఆయన అక్కడ ఇబ్బంది పడకూడదంటే ఇవ్వాల్సిన మొత్తాన్ని వెంటనే పంపిస్తే నాకు మర్యాద దక్కుతుంది. అందుకే మొత్తం లెక్కచూసి ఆయనకివ్వాల్సిన మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేశాను. అక్కడితో నా బరువు తీరిందిగానీ బాధ తీరలేదు. అది తీరాలంటే మాస్టారి ఉత్తరం దొరకాలి. పొరపాటున బీరువాలో పెట్టి మర్చిపోయానేమో అనే అనుమానం వచ్చి బీరువా సొరుగులన్నీ వెతుకుతోంది సీత. అప్పుడు ఉన్నట్లుండి సుడిగాలిలా లోపలకి వచ్చింది మీరా. “ఇదిగో నాన్నా ఇందులో ఏముందో చూపిస్తా రా” అంటూ నన్ను తీసుకెళ్ళి తన పుస్తకాల మధ్యన దాచి ఉంచిన కవర్ తీసిచ్చింది. అది మా మాస్టారు రాసిన ఉత్తరమే. దాన్ని చూడగానే నాకు ప్రాణం లేచివచ్చినట్లనిపించింది. వెంటనే దాన్ని ఆత్రంగా చింపి చదవడం మొదలుపెట్టాను.

“ఆత్రేయా, ఉన్నఊరూ కన్నతల్లీ స్వర్గంతో సమానం. ఆ రెండింటినీ వదులుకోవడానికి మనసు రాదు. అందుకే ఆ ఊళ్ళో ఉండటానికి, మనిషి ఇల్లు కట్టుకుంటాడు. మనం కట్టేవన్నీ మనుషులు కట్టగలిగే ఇళ్ళు. కానీ మనం కట్టని దేవాలయం ఒకటుంది. అదే మన దేహం.

చిన్నప్పుడు నేను నీకో బసవన్న వచనం నేర్పాను గుర్తుందా?

ఉళ్ళవరు శివాలయ మాడువరు

నానేను మాడలి బడవనయ్యా

ఎన్న కాలే కంభ, దేహవే దేగుల

శిరవే హొన్న కలశవయ్యా

కూడల సంగమ దేవా కేళయ్యా

స్థావరక్కళివుంటు జంగమక్కళివిల్ల

శ్రీమంతులు శివాలయాలు కడతారు.

నిరుపేదని.. నేనేం కట్టగలను

నా కాళ్ళే స్తంభాలు. దేహమే దేవాలయం

శిరస్సే స్వర్ణ కలశం

ఓ కూడల సంగమదేవా వినవయ్యా

స్థావరాలు అంతమౌతాయి. జంగమాలు కొనసాగుతాయి.

స్థావర జంగమాల్లో దేహం స్థావరం. ఆత్మ జంగమం.

కాలప్రవాహంలో స్థావరాలు కొట్టుకుపోతాయి. ఈ విషయం బయట తిరిగే నేను సులభంగా అర్థం చేసుకోగలను. కానీ ఇల్లే స్వర్గంలా భావించే విశాలాక్షికి అంత సులభంగా అర్థం కాదు. తను ముందే అమాయకురాలు. ఆ అమాయకత్వమే తనకి వరమూ శాపమూ కూడా. శాపాన్ని కూడా వరంగా మార్చగల అవ్వగారుండగా నాకేభయమూ లేదు. అలాగని కట్టుకున్న భార్యని వదిలేసి వెళ్ళిపోవడానికి ఎవరికైనా ఎలా మనసొప్పుతుంది చెప్పు. కానీ వెళ్ళక తప్పదు. నేను వెళ్ళడానికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా క్యాన్సర్ మాత్రం నన్ను నిర్మొహమాటంగా తీసుకెళ్ళిపోతుంది. దానికి వైద్యం చేయిస్తే నెలో పదిహేనురోజులో ఎక్కువ బతకచ్చు. అంతమాత్రందానికి లక్షలు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకోవడం కంటే ఆ డబ్బేదో తనకే మిగల్చడం మంచిదనేది నా ఉద్దేశం. అందుకే నా బ్యాంక్ ఎక్కౌంట్‌ని జాయింట్ ఎక్కౌంటుగా మార్చాను. నేను లేకపోయినా తను ధైర్యంగా జీవించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను.

ఆత్రేయా,

నేనిదంతా ఎందుకు రాస్తున్నానో నాకే తెలియదు. నేను ఆరేడు నెలలకంటే బతకననే నిజం నాకు మాత్రమే తెలుసు. నిజం నిప్పులాంటిది కదా? అందుకే గుండెల్ని కాల్చేస్తోంది.. ఎవరో ఒకరికి నా బాధ వెళ్ళబోసుకుంటే తప్ప శాంతి లభించదనిపిస్తోంది. అందుకే నీకీ ఉత్తరం రాస్తున్నాను. ఈ ఉత్తరం రాస్తుంటే నా మనసెందుకో కాస్త తేలికపడినట్లనిపిస్తోంది.

ఆత్రేయా,

నా మనసు తేలికపడుతోందంటే ఈ ఉత్తరం ద్వారా నీ మనసుకి భారం పెంచుతున్నానని అర్థం. అయినా తప్పడం లేదు.. కనీసం నాకోసమైనా ఇక్కడికి వస్తావనే ఆశతో రాస్తున్నాను.

నువ్వొచ్చేసరికి నాకు సంబంధించినంతవరకూ స్థావరం ఉండదు.. జంగమం కనపడదు.”

ఆ తరువాత నాలుగైదు వాక్యాలు రాశారుగానీ వాటిని కొట్టేసారు. అదికూడా గుర్తుపట్టడానికి అవకాశం లేనంత చిత్తుగా కొట్టేశారు. ఆ అక్షరాల్ని గుర్తుపట్టాలని చేసిన ప్రయత్నాలేవీ నెరవేరలేదు. కానీ కళ్ళలో మాత్రం నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి.

దాంతో మొత్తం అలుక్కుపోయింది.

ఖాళీలుంటాయి. ఖాళీలుండాలి. మనుషుల్లోనూ మనసుల్లోనూ ఉండాల్సినవి ఖాళీలే. ఆ ఖాళీలు లేకపోతే ఊపిరి తీసుకోవడానికి స్థలం ఉండదు. అలాంటి ఖాళీల్ని పూరించడమే జీవితం. నా జీవితానికి సంబంధించిన ఖాళీలన్నీ జమునాపురంలోనే ఉన్నాయి. వాటిని పూరించడానికే్ మాస్టారు నాకీ ఉత్తరం రాశారు.

స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టిలో ఖాళీల్ని పూరించగలిగేది శూన్యం కాదు. చైతన్యం. ఆ చైతన్యం ఒకరిస్తే అందుకునేది కాదు. దాన్ని ఎవరికి వారే చేదుకోవాలి.

బహుశా నా దారి నేనే వెతుక్కోవాలని చెప్పడానికే రాసిందాన్ని కొట్టేశారేమో..

శుభం.

(సమాప్తం)

Exit mobile version