Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అవ్వగారు-3

[ధనంజయ లక్ష్మీ రామకృష్ణగారు వ్రాసిన ‘మత్తె మూకజ్జి’ అనే కన్నడ నవలని ‘అవ్వగారు’ పేరుతో అనువదించి ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.]

[చాలా రోజుల తర్వాత విదేశాల నుంచి స్వదేశానికి భార్య సీతతోనూ, కూతురు మీరా తోనూ వస్తాడు కథకుడు. ఈసారి రాకకి కారణం ఆయన అవ్వ మూకవ్వగారి సహస్రచంద్రదర్శనం వేడుకలు. విమానంలో బెంగుళూరు, అక్కడి రైల్లో శివమొగ్గ, అక్కడి నుంచి పడవలో జమునాపురం చేరుతారు. ఈ ప్రయాణంలో ఎన్నో స్మృతులు అతనిలో మేల్కొంటాయి. తల్లిదండ్రులు గతించడం, మూకవ్వగారి నిర్వహణాసామర్థ్యం గురించి తలచుకుంటాడు. ఎంతో నైపుణ్యంగా తన మేనమామ నుంచి తనకి రావల్సిన ఆస్తిని సాధించి, తన విదేశీ చదువుకి డబ్బు ఏర్పాటు చేసిన వైనం గుర్తొస్తుంది. జెట్‌లాగ్ వల్ల కథకుడికి రాత్రి నిద్రపట్టదు. తెల్లారి ఆలస్యంగా లేస్తాడు. అప్పటికే సీత, మీరా ఫలహారం చేసి స్థానికంగా జరుగుతున్న సంతకి  వెళ్తారు. కథకుడు తయారై భాగీరథమ్మ గారింటికి వెళ్తాడు. ఉన్నత విద్య కోసం విదేశాలకి వెళ్ళి, అక్కడే ఉండిపోయిన వారిని గుర్తుచేస్తూ, నువ్వెప్పుడు వచ్చేస్తావని ఆవిడ అడుగుతుంది. ఇంటికి వచ్చాకా, మూకవ్వగారి చరిత్ర జ్ఞానాన్ని ప్రదర్శించిన ఓ ఘటన గురించి గుర్తుచేసుకుంటాడు కథకుడు. ఆ సాయంత్రం పెరట్లో ఆవులను శుభ్రం చేయడానికి పూనుకుంటారు కథకుడు, సీతా, మీరా. ఇంతలో భట్టు గారు పరిగెత్తుకుంటూ వచ్చి అరుస్తూ ఏదో చెప్పబోతారు. మూకవ్వగారికి పిలుస్తారు. జపం చేసుకుంటున్న మూకవ్వగారి చెయ్యి పట్టుకుని కదిపి, భట్టుగారొచ్చారని చెప్తాడు కథకుడు. తన కూతురు సావిత్రి ఆత్మహత్య చేసుకుందని ఏడుస్తూ చెప్తాడాయన. చిన్నప్పడు, సావిత్రి కథకుడికి సహపాఠి. పదో తరగతి వరకు చదివించి ఆపేస్తారు. సావిత్రికి పెళ్ళి చేసి పంపేస్తారు. చలాకీగా ఉండే సావిత్రికి ఎముకల వ్యాధి సోకి, చిన్న వయసులోనే కాళ్ళు చచ్చుబడిపోతాయి. కూతురు ఆత్మహత్య చేసుకుందన్న వార్త వినగానే భట్టుగారి కుటుంబమంతా నిర్ఘాంతపోతారు. చేష్ఠలుడిగి ఏం చేయాలో తెలియక రోదిస్తూ ఉండిపోతారు. కథకుడే కారు తెప్పించి, డ్రైవరుని ఏర్పాటు చేసి, వాళ్ళని సావిత్రి వాళ్ళ ఊరికి పంపుతాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-3

నిజానికి సావిత్రి మరణం నాకు శరాఘాతమే. అయినా ఆ విషయం ఎవరికీ చెప్పుకోలేను. నేను ఎందుకు ధ్యానం చేస్తానో తెలియకుండానే ఇంతగా చెలరేగిపోయింది సీత. ఒకవేళ ఆ ధ్యానం మొదలవ్వడానికి కారణం సావిత్రి జ్ఞాపకాలనుండి తప్పించుకోవడమే అనే విషయం తెలిస్తే? ఇల్లుపీకి పందిరేస్తుంది. భూమ్యాకాశాల్ని ఏకం చేస్తుంది. సీతంటే ఆవేశం ముందు. ఆలోచన తరువాత.

అవ్వగారంటే ముందు ఆలోచన తరవాత అవగాహనా ఆపైనే ఏదైనా. ఆ విషయంలో అవ్వగారిని గజగమన అనవచ్చు. గజగమనమంటే సూక్ష్మదృష్టితో పరిశీలిస్తూ సన్న సూదినైనా తొండంతో తీస్తూ ఎంత మెల్లగా మాట్లాడినా చేటంత చెవులతో పెద్దగా వింటూ విశ్లేషిస్తూ విమర్శిస్తూ ముందుకు సాగుతుంది. అష్టలక్ష్ముల్లోని గజలక్ష్మి ఇంకెవరో కాదు మా మూకవ్వగారే. అంటే ఆవిడ లావుగా ఉంటుందని కాదు, ఆవిడకి ఆవేశం లేదు ఆగ్రహం రాదు. కాబట్టీ ముందస్తు పరిష్కారం లేకుండా ఏ సమస్యా తన ముందుకు రాదు. అందుకే తన తోడబుట్టిన అన్నగారు, మా నాన్నగారు. ఇలా అయినవాళ్ళందరినీ పోగొట్టుకున్నా దేనికీ చలించకుండా చలనశీలతే తన ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఆవిడది ఎప్పుడూ హిందోళరాగమే. కనుక ఆవిడకి ఉదయించడం మాత్రమే తెలుసు.

అందుకే సహస్ర చంద్రోదయం చూడబోతోంది. దాన్ని దగ్గరుండి జరిపించాల్సింది భట్టుగారే. కానీ వారిని అడిగే పరిస్థితి లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో దాని గురించి మాట్లాడటం సమంజసం కాదు. ప్రస్తుతం దాని గురించి మర్చిపోవడమే మంచిదనుకుంటూ అవ్వగారివైపు చూశాను. ఆవిడ, “నాతో ఏమైనా పనుందా?”అని అడిగారు.

“మీరేం చెబితే అది వినడమే నాపని”

“ఐతే పిండివడియాలు పెడతావా?”

“ఎందుకు పెట్టను?”

“అంటే నీకింకా బాల్య చేష్ఠలు పోలేదా?”

“మీకే పోనివి నాకెలా పోతాయి?”

“ఐతే మెట్లెక్కకుండా డాబా మీదకి రా”

“సరే మీరు మెట్లెక్కండి”

అవ్వ చెప్పిన మాట మా సీతకి వినిపించింది. “మెట్లెక్కకుండా డాబామీదకెలా వెళ్తారో? ఆవిడో చిత్రం-ఈయనో విచిత్రం” అంటూ వెక్కిరింతగా నవ్వింది.

నేనా నవ్వుల్ని పట్టించుకోకుండా పెరట్లోకి వెళ్ళి కిటికీ పట్టుకుని పైకెక్కి జామచెట్టు కొమ్మని అందుకున్నాను. దాని ఊతంతో చేవైన కొమ్మ ని చేరుకున్నాను.

“ఏమిటా చెట్లెక్కడం? ఇంకా కోతి బుద్ధులు పోలేదా? మీ బరువుకి కొమ్మెలా ఊగుతోందో చూశారా? త్వరగా దిగండి” అంటూ సీత అరుస్తుంటే మీరా బయటకి వచ్చింది. తనని కూడా చెట్టెక్కించమని సీతని సతాయించడం మొదలు పెట్టింది. సీతకి నేను భర్తనేగానీ సరైన మొగుడుమాత్రం మీనాయే. సీత విషయంలో నేను చెయ్యలేని పనులన్నీ మీరా చేసి చూపిస్తుంది. అందుకే తనకి బహుమానంగా నాలుగు దోర జామపళ్ళు కోసి కింద పడేశాను. ఆ చెట్టు జామకాయలు చాలా మధురమైనవి. ఎంతటివారినైనా క్షణంలో మరిపిస్తాయి. మురిపిస్తాయి. ఆ జామపళ్ళ పుణ్యమా అని కాయలు తినడంలో పడి చెట్టెక్కడం మాట మర్చిపోయింది మీరా. ఆ అదును చూసుకుని నేను పైకొమ్మ పట్టుకుని వెళ్ళాడుతూ వెళ్ళి డాబా మీద దిగాను.

అవ్వగారు అటువైపునుండి వడియాలు పెడుతుంటే నేను ఇటువైపు నుండి పెట్టడం ప్రారంభించాను. నేను వడియాలు పెట్టడం చూసి మురిపెంగా నవ్వారు. సాక్షాత్తూ ఆ మూకాంబికాదేవే ముసలివేషం వేసుకొచ్చి బోసినవ్వుతో నన్ను ఆశీర్వదిస్తున్నట్లుందా నవ్వు. ఆ నవ్వుని కొనసాగిస్తూనే అన్నారు, “చంద్రుడు రోజూ వస్తాడు. పోతాడు. ఆయనకి వెన్నెలైనా ఒకటే చీకటైనా ఒకటే. ఆయన పదహారు కళలూ మనకే గానీ ఆయనక్కాదు. చంద్రుడెప్పుడూ శివాభరణమే. ఏ మనిషికైనా చంద్రుడిని చూడ్డమే ఓ పండగ. ఆ పండగ రోజూ చేసుకుంటూనే ఉన్నాను. నాలాంటిదానికి చంద్రుడిని చూసిన పండగంటూ వేరే చెయ్యాల్సిన అవసరం లేదు. అయినా మనింట్లో ఏ పండగా భట్టుగారు లేకుండా జరగదు” అన్నారు.

నేను మరచిపోవాలనుకున్నదే అవ్వగారు మరచిపొమ్మంటున్నారు. అందుకే నేను మౌనంగా వడియాలు పెట్టడంలో నిమగ్నమైపోయాను.

అవ్వగారు మళ్ళీ గొంతు సవరించుకున్నారు. నన్ను సావిత్రిని చూడటానికి వెళ్ళమంటారేమో అని భయపడ్డాను. అవ్వగారెప్పుడూ ఇంతే. నేనేది వద్దనుకుని భయపడుతూ ఉంటానో దాంతోనే మొదలెడతారు.

“సావిత్రి బంగారంలాంటి పిల్ల. మనింట్లో మనిషిలా తిరిగింది. మన తల్లో నాలుకలా పెరిగింది. కానీ ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతుందని మాత్రం ఎవ్వరం ఊహించలేదు. పోనీ ఓసారి వెళ్ళి చూసి రాకూడదూ?”

నేనేం మాట్లాడలేదు. నా మౌనాన్ని అర్ధాంగీకారంగా తీసుకుని ఆవిడ అభిప్రాయాన్ని నా తలమీద రుద్దే అలవాటు అవ్వగారికి లేదు. అందుకే మాట మార్చారు, “ఓ పని చెయ్యి. ఇందాకా సీత వాళ్ళూరికి వెళ్ళాలనుకుంటున్నట్లు చెప్పింది, లేకలేక వచ్చింది. పుట్టింటికి ఒంటరిగా పంపించడం మర్యాద కాదు. నువ్వే వెళ్ళి దింపేసి రా”

నేను వెళతానన్నట్లు తల ఊపాను.

ఆ తరువాత ఏం మాట్లాడాలో తోచలేదు.

ఆవిడ వడియాల చీర గాలికెగిరిపోకుండా బరువు పెట్టడానికి తగిన రాళ్ళకోసం చూస్తున్నారు. పిట్టగోడవారగా ఉన్న ఇటుకలని తీసుకొచ్చి నాలుగు మూలలా పెట్టాను. ఇంక పక్షులు రాకుండా వాటికి కాపలా కాయాలి. పైన ఎండ ఎక్కువౌతోంది. అందుకే జామచెట్టు నీడలోకి వెళ్ళి నేను మడికాళ్ళేసుక్కూర్చున్నాను. అవ్వగారు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చారు. ఏమిటా కూర్చోవడం అన్నట్లు చూశారు. నేను మడికాళ్ళు తీసేసి కాళ్ళు బార్లా చాపుకుని కూర్చున్నాను. ఆవిడ కోపంగా చూశారు. దానర్థం బాసింపట్టేసుకుని కూర్చోమని అర్థం. నేను కాళ్ళని ముడవటానికి కూడదీసుకునే లోపే ఆవిడ పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. ఆవిడలా పద్మాసనం వెయ్యడానికి నేను ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అదీ ఆవిడకీ మనకీ తేడా.

మా అమ్మకి భట్టుగారంటే చాలా గౌరవం. ఆయన మాకు ఎంతో సహాయం చేశారని చెప్పేది. అదే విషయం అవ్వగారిని అడిగాను.

అవ్వగారు మెల్లగా చెప్పడం మొదలు పెట్టారు. “మా నాన్నగారి పేరు శ్రీరంగ భట్టు. ఊళ్ళో పెద్దరికం-ఇంట్లో పేదరికం. బయట అందరికీ తల్లో నాలుక. ఇంట్లో మాత్రం ఆ నాలుకని తడపడానికి గుక్కెడు చల్లక్కూడా కరువే. ఎవరినీ చెయ్యిజాపి సహాయం అడిగినవాళ్ళు కాదు. పేరు మాత్రం శ్రీరంగ భట్టు. అంటే సంపదలతో తులతూగేవాడని అర్థం. ఇంక మీ ముత్తాత ఆత్మాభిమానంగలవారు. ఎవరి ముందూ చేయి చాచడంగానీ పరిస్థితులకి తలవంచడం గానీ చేసేవారు కాదు. ఉన్న ఐదారెకరాల చేనులో ఏడాదికోసారి రాగులు పండేవి. నీటి సౌకర్యం ఉన్న అరెకరం పొలంలో ఏడాదికి రెండుసార్లు ధాన్యం పండించేవారు. దాంతో ఉన్నంతలో హాయిగా బతికేవాళ్ళం. కానీ సామాన్య ప్రజలు సంతోషంగా బతకడం ప్రభుత్వాలకో రాజులకో మాత్రమే కాదు, కాలానిక్కూడా ఇష్టం ఉండదు. అందుకే కరువులు రప్పించి పరీక్షలు పెడుతుంది. అలాంటి కరువుల్లో అతిపెద్ద కరువు ఏడేళ్ళ కరువు. అందులో చివరి మూడేళ్ళూ ఊళ్ళన్నీ నీళ్ళు లేక పంటలు పండక వ్యవసాయం మానేసి ఇతర పనుల మీద పడ్డారు. మా ఈశాన్యం బావిలో కూడా ఇంటికేగానీ పంటకి కావలసినన్ని నీళ్ళూరడం లేదు. దాంతో మా నాన్నగారు మునియమ్మగారింట్లో లెక్కలు చూసే పనికి కుదురుకున్నారు.

మునియమ్మ చాలా గట్టిది. కంచుకంఠం. నేరుగా గుండెల్లోకే పొడిచేంత తీక్షణమైన చూపు. అందులో చురుకుదనం కరుకుదనం సరిసమానంగా ఉంటాయి. శివమొగ్గలో మిలటరీ హోటల్ నడిపేది. ఆ రోజుల్లోనే మనూళ్ళో మేడకట్టిన మొనగత్తె. అలాంటి మనిషిదగ్గర పని చెయ్యడం చాలా కష్టం. అయినా కష్టపడకుండా ఆదాయం ఎలా వస్తుందనుకున్నారు. ఆవిడిచ్చే జీతం ఖర్చులకీ దాచుకున్న రాగులు తిండికీ ఉపయోగపడుతున్నాయి. ఇంట్లో రాగిముద్దేగానీ అన్నం ఉడకడం లేదు. మొండిదైనా బండదైనా మునియమ్మ మనసు చాలా గొప్పది. అందుకే నెల తిరగ్గానే జీతం చేతిలో పెట్టేది. అరవై రూపాయల జీతం. ఆ కాలంలో అది తాసిల్దారు జీతంతో సమానం.

ఆ రోజుల్లో బొంబాయినుండి వచ్చేసరుకులు నేరుగా ఉడుపిలో దిగేవి. మన శివమొగ్గకి కావలసిన దినవెచ్చాలూ సామాన్లూ అన్నీ ఉడిపి నుండే వచ్చేవి. మా నాన్నగారికి అన్నిపనులూ వచ్చు. అందుకే సకలవిద్యాప్రవీణుడనేవారంతా. మునియమ్మగారి కారు కూడా ఆయనే నడిపేవారు. సంతరోజున ఆ కారులోనే ఇంటికి కావలసినవన్నీ తెచ్చేవారు.

కాలం గడుస్తోంది. గడిచే కాలాన్ని గడుస్తున్నట్లుగా గడవనివ్వకపోవడమేగా విధిరాతంటే.

ఆ మునియమ్మగారి భర్త మందబుద్ధి. ఒకటి చెబితే ఇంకొకటి చేసుకొచ్చేవాడు. అందుకే ఆయన్ని దండగ పిండం అని చెప్పుకునేవారు. అలాంటి పనికిమాలినవాడి పెళ్ళాం పురుడు పోసుకుందంటే వాడు పిల్లల్ని కనే పనికి తప్ప ఇంకెందుకూ పనికిరాని గాడిదని చెప్పుకుంటారెక్కడైనా. కానీ ఇక్కడ మాత్రం మునియమ్మగారికి పుట్టింది శ్రీరంగ భట్టుగారికే అని చెవులు కొరుక్కోవడం మొదలు పెట్టారు.

మా నాన్న అందగాడు. తెలివైనవాడు. వ్యవహార జ్ఞానం కలిగినవాడు. మునియమ్మ కూడా రంగుతక్కువైనా కళైన ముఖం. సౌష్టవమైన శరీరం. గొప్ప తెలివైనది కాకపోయినా నోరెట్టుకు పడిపోయే ధైర్యమున్న మనిషి. వ్యవహార జ్ఞానం తక్కువైనా మొండితనంతో గెలుచుకొస్తుంది. అలాంటి మునియమ్మ పిల్లల్ని కంటే దండగపిండానిక్కంటుందా లేక మేధావికి కంటుందా? అనే ప్రశ్నలేసుకుని వాళ్ళే సమాధానం చెప్పేసుకుని వాళ్ళే మునియమ్మ కొడుక్కి మా నాన్నే తండ్రని ప్రచారం చేసేవాళ్ళు.

మునియమ్మ మా నాన్నవైపు ఆకర్షించబడి వుంటే అందులో ఆవిడ తప్పేమీ లేదనిపిస్తుంది నాక్కూడా. ఆవిడ కొడుక్కి మాదప్ప అని పేరు పెట్టుకుంది. మాదప్ప పెరుగుతున్నకొద్దీ తనకి మా నాన్న పోలికలు స్పష్టంగా కనిపించసాగాయి. దాంతో మునియమ్మ గురించీ మునియమ్మ మొగుడిగురించీ చెప్పుకోవడం మానేసి మా నాన్నగురించే చెప్పుకోవడం ఎక్కువైంది. ఫలితంగా ఆయనకి మనస్తాపం కలిగింది. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. మునియమ్మగారు కూడా ఉండమని బలవంత పెట్టలేదు. గౌరవమర్యాలు మనకైనా ఒకటే వాళ్ళకైనా ఒకటే కదా?

ఉద్యోగం మానేసిన తరువాత సంసారం మళ్ళీ ఒడిదుడుకుల్లో పడింది. చెడి అయినవాళ్ళింటికి వెళ్ళకూడదంటారు. అందుకే మా నాన్నగారు మన భట్టుగారి తండ్రి శేషాద్రి భట్టుగారింటికి వెళ్ళలేదు. ఆయన అయినవాళ్ళింటికి వెళ్ళి దేహీ అంటూ చేయిచాచరనే విషయం శేషాద్రి భట్టుగారికి తెలుసు. అందుకే వాళ్ళ అత్తగారింటివైపునుండి నరుక్కొద్దామనుకున్నారు. ఆయన అత్తగారికి అందరూ కూతుళ్ళే. కొడుకుల్లేరు. వారసుల్లేని ఇల్లు. కానీ ఊరి చుట్టూ పొలాలూ బావులూ ఏటా రెండు దిగుబళ్ళు మూడు ఫలసాయాల వ్యసాయం. వాటన్నిటినీ తనొక్కడే చూసుకోలేడు. తనకి సహాయం చేయగల సమర్థులెవరైనా కావాలి. అదీ అక్కడి పరిస్థితి.

ఇక్కటి పరిస్థితి ఏమిటంటే..

మునియమ్మ అందరికీ మొండిఘటమే కావచ్చు. కానీ మాకు మాత్రం మంచి స్నేహితురాలు. మా అమ్మగారికైతే ఆత్మబంధువులాంటివారు. ఇద్దరూ ప్రాణస్నేహితులు. ఏ విషయంలోనూ అరమరికలుండేవి కావు. అప్పట్లో కాఫీ కూడా సప్తవ్యసనాల్లో ఒకటిగా చెప్పుకునేవారు. అందుకే సదాచార సంపన్నుల ఇండ్లలో కాఫీలు నిషిద్ధం. కానీ మా అమ్మకి కాఫీ అంటే ప్రాణం. అటు సూర్యుడు ఉదయించేవేళకి ఇటు మునియమ్మగారి ఇంటినుండి చెంబుడు వేడివేడి కాఫీ వచ్చేసేది. అమ్మ దినచర్యలన్నీ ఆవిడ కాఫీతోనే ఆరంభమయ్యేవి. మునియమ్మగారి ఇంటికెళ్ళిందంటే చాలు బన్నులు పైటకొంగులో కట్టుకొచ్చేది. వాటిని అటకమీద దాచుకుని చాలా ఇష్టంగా తినేది. ఆ బన్నుల్ని రోగిష్టి తిండి అనేవారు. మొన్న భట్టుగారింటికి చుట్టాలొచ్చినప్పుడు అలాంటి బన్నుల్నే సగానికి కోసి పచ్చికూరలు పెట్టి పిజ్జాలో బర్గర్లో తెచ్చారు. ఆ రోగిష్టి తిండినే ఈ బలిష్టులంతా తిని రోగిష్టులుగా మారుతున్నారు” అంటుంటే నాకు నవ్వాగలేదు. ఆ బర్గర్లు తెప్పించింది నేనే. మీరాకి బర్గర్లంటే చాలా ఇష్టం. తన కోసం ప్రత్యేకంగా శివమొగ్గనుండి తెప్పించక తప్పలేదు. అవ్వగారు చెప్పడం కొనసాగిస్తున్నారు.

“రోగాలంటే గుర్తొచ్చింది. మా అమ్మా మునియమ్మా అంత స్నేహంగా కలిసిపోవడం చూసి దేవుడికి కన్నుకుట్టిందనుకుంటాను. అందుకే మాదయ్యకి తలా తోకా తెలియని కొత్తరోగాన్ని తెచ్చిపెట్టాడు. జమునాపురం మహావైద్యగాడంటే మా ఊరి నాటువైద్యుడే. ఆయనొచ్చాడు. పసర్లిచ్చాడు. మారెమ్మొచ్చింది. మంత్రాలేసింది. బాబా వచ్చాడు. తాయెత్తులు కట్టాడు. గుళ్ళో పూజలూ ఇంట్లో వ్రతాలూ చేసింది. అయినా తగ్గలేదు. దాంతో బెంగుళూరు పెద్దాసుపత్రికి తీసుకెళ్ళింది. ఆరు నెలలైనా తిరిగి రాలేదు. మా నాన్న ఉద్యోగం చేసినా చెయ్యకపోయినా మునియమ్మ జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇల్లుగడపడానికిమాత్రం తగిన సహాయం అందిస్తూ ఉండేది.

ఇప్పుడావిడ లేదు. మాకు సహాయం చేసేంతవారెవరూ లేరు. ఎవరినడిగినా మీకేం తక్కువ స్వామీ మీకు సహాయం చేసేంతవాళ్ళమా అని మెరమెచ్చుమాటలు చెప్పి తప్పించుకునేవారు. ఎండిపోయిన పొలాలు నీళ్ళు లేని బావి ధాన్యం లేని ఇల్లు. అప్పటికే మా నాన్నగారికీ మునియమ్మకీ మధ్యగల సంబంధం ఊరంతా తెలిసిపోయింది. ఆయన్ని స్త్రీలోలుడనీ కులం చెడ్డవాడనీ చెప్పుకోవడం మొదలైంది. ఇంక ఊళ్ళో ఉండటం సాధ్యం కాదని తీర్మానించుకున్నారు. బెంగుళూరులో ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఇక్కడి పరిస్థితి మన భట్టుగారి తండ్రి శేషాద్రి భట్టుగారికి తెలిసింది. అయినవాళ్ళు ఊరొదిలి పోవడాన్ని ఎవరు మాత్రం సహించగలరు? అందులోనూ శేషాద్రి భట్టుగారిలాంటి సహృదయులు అస్సలు సహించలేరు. అందుకే తిన్నగా మా ఇంటికే వచ్చారు. మా నాన్నగారిని కూర్చోబెట్టుకున్నారు. ఆయనకి ధైర్యం చెబుతున్నట్లుగా భుజం మీద చెయ్యేశారు. ఆ తరువాత మాట్లాడటం మొదలు పెట్టారు, “ఊరొదిలి నగరానికి పోయేంత అవసరం ఏముంది. మేమింతమందిమి ఉన్నాం. మిమ్మల్ని చూసుకోలేమనుకున్నావా? అవసరానికి పనికిరాని స్నేహాలెందుకు? బంధుత్వాలెందుకు? మా అత్తారింటి గురించి నీకూ తెలిసే ఉంటుంది. వాళ్ళకి పొలాలున్నాయి. నీటి సౌకర్యాలున్నాయి. మోసం లేకుండా వ్యవసాయం చేసేవాళ్ళే లేరు. ఇక్కడ మన జమునాపురంలో మంచివానలు పడేంతవరకూ పొలాలన్నీ బీడు పెట్టాల్సిందే. ఇళ్ళన్నీ పాడు పెట్టాల్సిందే. అలా జరక్కూడదంటే ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండక తప్పదు. నిన్నేమీ ఊరికే చెయ్యమనడం లేదు. పంటలో నీవంతు నీకొస్తుంది. నీవల్ల కావలసిన సహాయం మాకొస్తుంది. ఇందులో జాలిపడ్డాలూ దయచూపించడాలూ ఏవీ ఉండవు. మీ వంతు ఎంతకావాలో మీరు చేసే పనినిబట్టి మీరే నిర్ణయించుకోండి” అన్నారు.

ఆయనొచ్చేంతవరకూ బెంగుళూరెళదాం. నగరం చూద్దాం. కెంపెగౌడు గురించి తెలుసుకుందాం. రైళ్ళెక్కి తిరుగుదాం. బొగ్గుబస్సులెక్కుదాం అనుకుంటూ గంతులేసిన నాకు ఇక్కడే ఉండక తప్పని పరిస్థితొచ్చేసరికి ఉత్సాహమంతా నీరుకారిపోయింది.

శేషాద్రి భట్టుగారి మాటలు విన్నాక మా నాన్నగారికి అంతూ దరీ తెలియని నగరానికి వెళ్ళి బాధలు పడ్డం కంటే ఇక్కడే ఉండి కుటుంబాన్ని నిలబెట్టుకోవడమే మంచిదనిపించింది. అందుకే శేషాద్రి భట్టుగారి ప్రతిపాదనకి అంగీకారం తెలిపారు. వారి అత్తారి ఊరికి వెళ్ళి జీతానికి కుదురుకున్నారు.

నాన్నగారు నెలకో పక్షానికో ఓసారి వచ్చేవారు. వచ్చేటప్పుడు నెలకి సరిపడా సరుకులూ వెచ్చాలూ తెచ్చిపెట్టేవారు. ఆయనుండే రెండుమూడురోజులూ మాకు పండగలా గడిచేది. నాన్న తెచ్చిన కూరగాయలు వారం పదిరోజులుండేవి. అవి ఖర్చైపోయినా దుంపలుండేవి ఇంక రాగి ముద్దలూ చిత్రాన్నాలూ పొంగళ్ళూ మామూలే. ఇంట్లో ఎంత పేదరికం అనుభవించినా దేవుడి దయవల్ల పస్తులుండే పరిస్థితి మాత్రం ఎప్పుడూ రాలేదు.

ఇంట్లో పేదరికం. బయట నాన్నగురించి చెవులు కొరుక్కోవడాలూ సంప్రదాయాలు మంటకలిసిపోయాయనే ఆరోపణలూ వీటన్నిటివల్లా చుట్టుపక్కల ఊళ్ళలో పెళ్ళిళ్ళ పేరయ్యలుకూడా నాకు సంబంధాలు చూడలేదు. దాంతో నేను హాయిగా కాలం గడిపేసేదాన్ని.

ఉన్నట్లుండి శేషాద్రిభట్టుగారు నాకో సంబంధం తీసుకొచ్చారు. అది మనకి చాలా దూరపు సంబంధం. అయినా తీసుకొచ్చింది మా కుటుంబానికి అన్నదాత. కాబట్టీ కాదనే ధైర్యం ఎవరికీ లేకపోయింది. శేషాద్రిభట్టుగారే ఖర్చులు పెట్టుకుని నాకు పెళ్ళి జరిపించారు. రెండేళ్ళు బాగానే గడిచింది. నా సంతోషాన్ని చూసి ఆ దేవుడికి నామీదకన్నుకుట్టి మావారిమీద ప్రేమపుట్టి ఆయన్ని తన దగ్గరకి తీసుకెళ్ళిపోయాడు.

పేదరికంతో తీసుకుంటున్నప్పుడూ, దారికానక చేతులాడక చీకటి నిండిన భవిష్యత్తులో తడుముకుంటున్నప్పుడూ అక్కరకు రాని చుట్టాలందరూ మావారు పోగానే మా ఇంటికొచ్చారు. తలగీసి బొట్టుతీసి గాజులు పగలగొట్టాలంటూ శాస్త్రాలు చెప్పారు. ఆచారాలు పాటించకపోతే అనర్థాలు తప్పవని బెదిరించారు. కానీ మానాన్నమాత్రం దేనికీ ఒప్పుకోలేదు. ఆ సమయంలో నాన్నకి తోడుగా నిలబడ్డవ్యక్తి శేషాద్రి భట్టుగారే.

శరీరానికి ఏ గాయమైనా ఎల్లకాలం ఉండదు. కొన్నాళ్ళకి మానిపోతుంది. మందులు వేసినా వేయకపోయినా గాయాలు మాన్పే గుణం కాలానికుంది. ఆ కాలమే నా మనసుకైన గాయాన్ని మాన్పి కాస్తో కూస్తో ధైర్యాన్ని కూడగట్టుకునేలా చేసింది.

మీ తాతయ్య పేరు తన్నణ్ణ. తనకి పన్నెండేళ్ళ వయసొచ్చేదాకా ఇక్కడే చదివాడు. తను చాలా చలాకీ అయినవాడు. మనూళ్ళో చదువు ఇప్పటికీ అంతంత మాత్రమే. అలాంటిది ఆ రోజుల్లో ఎంతమాత్రం ఉండేదో ఊహించు. పై చదువుల కోసం శివమొగ్గలో చేర్చారు. ఊరినుండి పట్నానికి వెళ్ళగానే వాడి అల్లరి తగ్గి ఆలోచన పెరిగింది. బాగా చదుకున్నాడు. చివరికి మనూళ్ళోనే ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆయనకి ఉద్యోగం రావడంతో మన పరిస్థితి క్రమంగా కుదుటపడటం ప్రారంభించింది. ఆ కాలంలో కులాలకి ప్రాధాన్యత ఎక్కువగా ఉండేదని అందరూ చెప్పుకుంటారుగానీ మునియమ్మదేకులం మనదేకులం? స్నేహాలకీ సంబంధాలకీ అప్పుడూ కులం లేదు. ఇప్పుడూ కులం లేదు. చెడుని వ్యతిరేకించడంలో అప్పుడూ పట్టింపుల్లేవు. ఇప్పుడూ పట్టింపుల్లేవు. అప్పట్లో తేడాలు ఇళ్ళలో ఉండేవిగానీ మనసుల్లో ఉండేవి కావు. ఇప్పుడు ఇళ్ళలో లేవుగానీ మనసుల్లో ఉంటున్నాయి” అంటుంటే అవ్వగారి లోకజ్ఞతకి నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక వాట్సప్పుల్లాంటి యాపులు పెరిగాక కులాలవారీగా గ్రూపులు పెట్టుకుంటున్నారు. ఒక కులంవారిపై మరొక కులంవాళ్ళు దుమ్మెత్తి పోసుకుటున్నారు. ఇంక గొప్పలు చెప్పుకోవడంలో అయితే వాళ్ళకి వాళ్ళే సాటి. వాళ్ళకి ఎవరూ రాలేరు పోటీ. ఇవన్నీ అవ్వగారికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఆవిడ ఊహకందనిది కాదు అందుకే ఆధునికుల కుల జాడ్యాలని గురించి అంత స్పష్టంగా చెప్పగలిగారు. అందుకే ఆవిడని అభినందించాలనిపించింది. కానీ ఆవిడ దృష్టిని పక్కకి మళ్ళించడం సరికాదనిపించింది. అందుకే శ్రద్ధగా వినడం కొనసాగించాను.

“శేషాద్రి భట్టుగారి సహృదయత మనింటిలో మనుషుల్నీ నిలబెట్టింది-మనసుల్నీ నిలబెట్టింది” అన్నారు అవ్వగారు.

నిజమే. శేషాద్రిభట్టుగారి గురించి వింటున్నకొద్దీ నాలో భట్టుగారిపైనా వారి పెద్దలపైనా గౌరవం రెట్టింపైంది.

ఆయనొక్కరే కాదు, ఆ మునియమ్మగారు తక్కువ తిన్నారా? ఆ రోజుల్లోనే ఇక్కడ ఊళ్ళో ఉంటూ అక్కడ పట్నంలో హోటలు నడిపి గెలుచుకురావడం, మానవ సంబంధాల్ని పెంచుకోవడం, మానవత్వాన్ని పంచుకోవడం అన్నీ విచిత్రాలే. విస్మయాలే. ఆవిడ వల్ల మాకు దగ్గరి బంధువులు దూరమైనమాట నిజమే కావచ్చు. కానీ శేషాద్రి భట్టుగారిలాంటి ఆత్మబంధువులు ఆ ఖాళీని ప్రేమానుబంధాలతో పూరించారు. విచిత్రమేమిటంటే మాకు దూరమైనవాళ్ళకి కూడా మా మూకవ్వగారంటే గౌరవం చూపిస్తారు. ఆవిడ ఏదైనా చెబితే తప్పకుండా ఆచరిస్తారు. అందుకే ఆవిడకి అజాతశత్రువు అనే మాట పూర్తిగా నప్పుతుంది.

ఈలోగా మీరా పైకి వచ్చింది. వచ్చీరాగానే ఒక వడియాన్ని పైకి తియ్యాలని ప్రయత్నించింది. పిండి చేతికి అంటుకుపోయింది. దాన్ని అలాగే నోట్లో పెట్టుకుంది. బహుశా కారంగా అనిపించినట్లనిపించి ఉంటుంది. ఏడుస్తూ దిగిపోసాగింది. నేనూ అవ్వగారూ పైనే ఉన్నసంగతి అప్పటిక్కూడా గమనించలేదు. నేను వెళ్ళి తనని ఎత్తుకుని కిందికి తీసికెళుతూంటే చేతులకంటిన పిండంతా నా బుగ్గలకి పూసింది. నేను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నకొద్దీ తనింకా పట్టుదలగా పూసేసింది. అంతలోనే అటుగా వచ్చిన సీత నా ముఖం చూసి ఒకటే నవ్వు. మీరాకి ముఖం కడగమంటే పనుందంటూ తప్పించుకుని లోపలకి వెళ్ళిపోయింది. దాంతో నేనే నీళ్ళతొట్టిదగ్గరకి తీసుకువెళ్ళి తన ముఖం కడిగాను. నేను ముఖం కడుక్కుంటూంటే తను నాకు సహాయం చేసింది. లోపలకి వెళ్ళి తువ్వాలు తీసుకుని మీరాకి తుడిచాను. నేనూ తుడుచుకుంటూ సీత దగ్గరకి వెళ్ళాను. తను కూరలు తరగడంలో బిజీగా ఉంది. మీరాని తన దగ్గర దింపి వాళ్ళ పుట్టింటికి నేను కూడా వస్తున్న విషయం చెప్పాను. సీత సంతోషంగా, “మీర్రారనుకున్నాను. అందుకే ఒక్కదాన్నే వెళతానని అవ్వగారికి చెప్పాను. ఆవిడ మీ చెవిలో ఊది ఉంటారు. మీరొచ్చి నా చెవిలో ఊత్తున్నారు. పోన్లెండి అందరం కలిసి వెళితే అమ్మా నాన్నా సంతోషిస్తారు” అంది.

అంతలోనే పైనుండి అవ్వగారి పిలుపు వినిపించింది. దాంతో మీరాని అక్కడే వదిలేసి నేను డాబామీదకెళ్ళాను. నన్ను వడియాలకి కాపలా కూర్చోమని చెప్పి కీందికెళ్ళిపోయారావిడ. వడియాలకి కాపలా కాయడంకంటే విసిగించే పని ఇంకొకటి ఉండదు, ఆ విసుగుని జయించడానికి ఒకే ఒక్క మార్గముంది. అదే పుస్తకం. అందుకే ఏదైనా తెచ్చుకుని చదువుకుంటే బాగుంటుందనిపించింది. అలోగా పది పుస్తకాల పెట్టు మీరా వచ్చింది. పిల్లల్ని ఎంత ప్రేమగా ఆడిస్తే పెద్దలకి అంత ఎక్కువ జ్ఞానం పెరుగుతుంది.

మా చిన్నప్పుడు చదువుద్వారా అబ్బిన జ్ఞానం కంటే ఆటలద్వారా పెరిగిన తెలివే మాలో చురుకుదనాన్ని పెంచిందని ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది. మీరాని ఆడిస్తుంటే కొత్త ఆటలు, కొత్త మాటలు, కొత్త వ్యక్తీకరణలూ అలవాటవుతున్నాయి. కొత్త భాష కూడా పుట్టుకొచ్చేస్తోంది. అందుకే పుస్తకం ఆలోచన వాయిదా వేసి మీరాతో ఆటల్లో పడిపోయాను. మధ్యాహ్నం భోజనాలు కూడా డాబామీదే. చెట్టునీడలో ఆడుకుంటూ భోజనం చేస్తుంటే ఆ ఆనందమే వేరు. భోంచేశాక నిద్రపోయింది మీరా. తనని తీసుకెళ్ళి కింద పడుకోబెట్టి వచ్చాను. వడియాల కాపలాకి తోడుగా పుస్తకం తెచ్చుకున్నానీసారి.

నాలుగయ్యేసరికి కిందనుండి అవ్వగారు పైకొచ్చారు. వడియాలు సగం ఎండాయి. ఇంకోరోజు ఎండితే గానీ ఊడిరావు. అందుకే చీరని తను ఒకవైపు పట్టుకుని రెండోవైపు నన్ను పట్టుకొమ్మన్నారు. ఇద్దరం కలిసి కిందకి తీసుకొచ్చి ఒక మూలగా మడిచి పెట్టాం.

అధ్యాయం-4

సావిత్రి దహన సంస్కారాలు పూర్తి చేసుకుని వచ్చారు భట్టుగారు. ఆ విషయం అవ్వగారికి తెలిసింది. వెంటనే నన్ను పిలిపించారు. అప్పటికి నేను స్నానానికి వెళుతున్నాను. ఆవిడ వచ్చి నా చేతిలోని తువ్వాలు లాక్కుంటూ, “వచ్చాక మళ్ళీ స్నానం చెయ్యాల్సొస్తుంది. వెంటవెంటనే స్నానాలు చేస్తే జలుబుచేస్తుంది. పద వెళ్ళి ఆయన్ని పలకరించుకుని వచ్చాక స్నానం చేద్దుగానిలే” అంటూ చెయ్యి పట్టుకుని లాక్కుపోయారు.

అవ్వగారి చెయ్యిపట్టుకుని నడుస్తుంటే దాన్ని వదిలించుకోవాలని అనిపించలేదు. ఆవిడ వెంట నడిచే అవకాశం రావడమే అపురూపం. మొహమాటంతోనో సిగ్గుతోనే చెయ్యి వదిలేస్తే అపూర్వమైన అనుభూతులన్నీ చెల్లాచెదురైపోతాయి. అందుకే ఆవిడ వెనకే ఆవిడంత మెల్లగా నడుస్తున్నాను. బహుశా ఆవిడక్కూడా నా చెయ్యిపట్టుకుని నడిపిస్తున్నప్పుడు అలాంటి అనుభవమే కలుగుతున్నట్లుంది. అందుకే నా చెయ్యి వదలకుండా నడిపిస్తున్నారు.

భట్టుగారిల్లొచ్చింది. ఇల్లు చాలా చిన్నది.

ఇల్లెంత పెద్దది? అనే ప్రశ్నకంటే ఆ ఇంట్లో ఉండేవాళ్ళ మనసెంత పెద్దది? అనే ప్రశ్నకే ప్రాధాన్యత ఎక్కువని నమ్మే వ్యక్తులే నేటి సమాజానికి ఆధార స్తంభాలు. అలాంటి వ్యక్తులుండే ఇల్లు చిన్నదైనా అది పుష్పక విమానం లాంటిది. ఎంతమందొచ్చినా ఇంకొంతమందికి చోటుంటుంది. భట్టుగారి తల్లి అరోగ్యం అంతంత మాత్రమే. ఆవిడ మా అవ్వలా నిండు కుండకాదు. అలాగని ఓటికుండా కాదు. అతిగా మాట్లాడరు. భట్టుగారి భార్యని కూతురి మరణం బాగా కృంగదీసిందేమో బాగా చిక్కిశల్యమైపోయారు. సావిత్రి చెల్లెలు భార్గవి కూడా అక్కడే ఉంది. వాడిపోయిన కలువపూవులా ఉందామె ముఖం. చూస్తుంటే ఈ మూడురోజులుగానూ ఎవరూ ఏమీ ఎంగిలిపడినట్లు లేదు. నలుగురూ నాలుగు మూలలా నిస్తేజంగా కూర్చుని ఉన్నారు. ఎవరినెలా పలకరించాలో నాకు అర్థం కాలేదు. అందుకే నిలబడ్డచోటే నిలబడి ఉండిపోయాను.

మూకవ్వగారు తిన్నగా భట్టుగారి తల్లిదగ్గరకు వెళ్ళారు. ఆవిడ మా అవ్వగారికంటే మూడునాలుగేళ్ళు పెద్దవారై ఉంటారు. అయినా పెద్దరికం చూపించరు. ఆవిడ మా మూకవ్వని మూకీ అనిపిపుస్తారు. “వచ్చావా మూకీ? రా! నువ్వక్కడికి కూడా వస్తావనుకున్నాను. పోనీలే ఇక్కడికైనా వచ్చావు. అంతే చాలు” అనేలోపే ఆవిడకి దుఃఖం ముంచుకొచ్చేసింది.

వెంటనే అవ్వగారు ఎదురు ప్రశ్నించారు, “ఎవరైనా ఎవరికైనా ఎంతవరకూ తోడుగా వస్తారు? నాలాంటివాళ్ళొచ్చినా చెయ్యగలిగిందేముంది? ఊరుకాని ఊరు మనుషులు, కాని మనుషులు. మనల్ని ఊరు పొమ్మంటుంది. కాడు రమ్మంటుంది. అయినా మనం మాత్రం ఎక్కడికీ కదలం. సావిత్రినెవరు పిలిచారోగానీ వాళ్ళకి మనసులేదు. బుద్ధీజ్ఞానాలసలే లేవు. వాళ్ళు చేసిన తప్పుకి మనం ఏడవటంలో అర్థం లేదు”

“ఏడవకేం చెయ్యమంటావు మూకీ? నా అంత దురదృష్టవంతురాల్లేదు. నన్ను తీసికెళ్ళడం మానేసి దాన్ని తీసుకుపోయాడు. నేను ఎక్కడ కాలుపెడితే అక్కడ దరిద్రమే. సిరిసంపదలతో తులతూగే ఇల్లు మాది. నేను కాలుపెట్టగానే గుర్రబ్బండ్లు పాడి పశువులు పంట పొలాలు అన్నీ పోయాయి. దానం చేసిన ఎముకల్లేని చేతులే దయాదాక్షిణ్యాలకోసం దేబిరిస్తున్నాయి” అంటూ ఆవిడ అవ్వగారి ఒళ్ళో పడుకుని విలపిస్తుంటే చూడలేకపోతున్నాను.

అవ్వగారు చాలా సేపు మౌనంగా ఉండిపోయారు. తల్లడిల్లే హృదయాన్ని ఊరడించడానికి మౌనాన్ని మించిన భాషలేదు. అందుకే ఆవిడని అలాగే ఒళ్ళో పడుకోబెట్టుకుని భట్టుగారి భార్యవైపు తిరిగి, “ఈ మూడురోజులనుండి ఏమీ తిన్నట్టు లేదు. పాలో పండో తెచ్చిపెట్టు” అన్నారు. ఆవిడ లోపలకి వెళ్ళి ఆరటిపళ్ళు పాలు తెచ్చిపెట్టారు. తను కూడా అవ్వగారి పక్కనే కూర్చున్నారు. ఆవిడ తలమీద చెయ్యేసి ఆప్యాయంగా నిమిరారు. పెద్దావిడకి రెండరటిపళ్ళు చిన్న పిల్లలకి తినిపించినట్లు తినిపించారు ఆ తరువాత పాలు తాగించి తనే నోరు తుడిచారు. అంతలోనే భార్గవి కూడా వచ్చి తల్లిపక్కనే కూర్చుంది. మూడు తరాల ప్రతినిధులూ మూడుపక్కలా కూర్చుంటే వారి మధ్య మూకవ్వగారు నిజంగానే మూకాంబికలా కనిపిస్తున్నారు.

ఆత్మీయతకి ప్రాణం పోస్తే అది మా అవ్వగారిలాగే ఉంటుంది.

ముందుగా భార్గవిని అక్కడి విషయాలు అడిగారు. ఆ తరువాత ఆమెను దగ్గరకు తీసుకున్నారు “చూడమ్మాయ్ నీకిన్నాళ్ళూ నీ బాధ్యతే ఉండేది. ఇప్పుడు మీ అక్క బాధ్యతా నువ్వే తీసుకోవాలి. మీ అమ్మానాన్నలకి వెన్నెముకలా ఉండాలి. మీ బామ్మగారిని కన్నబిడ్డలా చూసుకోవాలి. వాళ్ళకి నువ్వే ధైర్యం” అని చెప్పి భార్గవి వెన్ను తట్టారు.

భట్టుగారు మాత్రం కూర్చున్నచోటే ఉన్నారు. అందుకే అవ్వగారు తనే లేచి ఆయన దగ్గరకు వెళ్ళారు. ఆయనేం మాట్లాడలేదు. అవ్వగారుకూడా మౌనంగానే నిలబడ్డారు. తరువాత, “ఏదైనా కావాలంటే భార్గవికి చెప్పి పంపించండి. దేనికీ మొహమాట పడకండి. ఈ సమయంలో అయినా పెద్దాయన శేషాద్రిభట్టుగారి ఋణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి” అంటూ చీర కొంగుకి ముడివేకొచ్చిన మూటవిప్పి అందులో మడతపెట్టిన నోట్ల కట్టని తీసి ఆయన పక్కన పెట్టి బయలుదేరరారు.

నేను వెళ్ళొస్తానన్నట్లు చెయ్యూపబోతుంటే అవ్వగారు నా చెయ్యి పట్టుకుని వారిస్తూ నన్ను బయటికి తీసుకొచ్చారు.

ఇద్దరం వస్తూంటే చెప్పడం ప్రారంభించారు, “ఏదైనా అశుభం జరిగిందీ అంటే అది ఏదో ఒక శుభానికి దారితీస్తుంది. సావిత్రి ఆత్మహత్య చేసుకున్నందుకు బాధగానే ఉన్నా, తను అనుభవిస్తున్న నరక యాతనని నించీ బయటపడింది. అంతే చాలు. కానీ సావిత్రి సమస్య తీరినందుకు ఆనందించాలో తన సంతానాన్ని అనాథలుగా చేసినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం ఆ పిల్లలకిప్పుడు అమ్మకావాలి.”

ఆశ్చర్యం. అవ్వగారంటే ఆధునిక దృక్పథం కలిగిన సనాతనురాలు. అలాంటి అవ్వగారు కూడా సావిత్రి పిల్లల కోసం మరో అమ్మాయి జీవితాన్ని బలిచెయ్యాలని చూస్తున్నారు. ఇది నేను ఊహించలేని విషయం. అందుకే కాస్త విసురుగానే అన్నాను, “మీకింకా పాతకాలం బుద్ధులు పోలేదు. సావిత్రి పిల్లల సమస్యకి పరిష్కారం సవతి తల్లిని తెచ్చిపెట్టడం కాదు. ప్రతి సమస్యకీ ఎన్నో పరిష్కారాలుంటాయి. మంచి పరిష్కారం గురించి ఆలోచించాలేగానీ మన పరిష్కారం మరొకరికి సమస్యలు సృష్టించకూడదు”

అవ్వగారు ఏమీ మాట్లాడకుండా నన్ను తీసుకువెళ్ళి అరుగుమీద కూర్చోబెట్టారు. తను కూడా నా పక్కన కూర్చున్నారు. భుజం మీద చెయ్యేశారు, “సమస్యలుగానీ పరిష్కారాలుగానీ మన చేతుల్లో ఉండవు. మనమే వాటి చేతుల్లో ఉంటాం. అయినా తగిన పరిష్కారం లేకుండా ఏ సమస్యా పుట్టదు. సావిత్రి చెల్లెలు భార్గవి. సావిత్రి మరిది మల్లికార్జున. ఇద్దరూ ఈడూజోడూ బాగుంటారు. ఇద్దరూ మనసుపడ్డవారేగానీ మనసుని బైటపెట్టినవారు కారు. ఈ విషయాన్ని సావిత్రి గమనించింది. నాకు చెప్పింది. బావగారికిచ్చి రెండో పెళ్ళి చేసినా మల్లికార్జునకిచ్చి మొదటి పెళ్ళి చేసినా పెద్ద తేడా ఏముండదు. భార్గవైతే తన పిలలకి ఏలోటూ రాకుండా చూసుకుంటుందనేది నామాట కాదు. సావిత్రి నమ్మకం. అది నిలబడాలంటే ఎవరో ఒకరు విషయాన్ని కదిలించాలి” అంటుంటే నాకు నోట మాట పెగల్లేదు.

అవ్వగారు తన మాటలు కొనసాగించారు, “పెళ్ళివిషయాలు మాట్లాడటానికిది సమయం కాదు. పెద్ద కర్మపూర్తయ్యేవరకూ శుభకార్యం మాటెత్తకూడదు. మూడో మాసికంలోపు చెల్లెలికి శుభం జరిగితే అక్క ఆత్మకి సంతోషం కలుగుతుంది” అంటూ తన మాటలు ముగించారు.

అవ్వగారి ఆలోచనలంటే అమృతభాండాలే అనే నా అభిప్రాయం మరోసారి బలపడింది.

***

ఉన్నట్లుండి “గోమతీపురానికి వెళదాం పద” అన్నారు అవ్వగారు. ఆవిడ ఏదైనా అనుకున్నారంటే అది వెంటనే జరిగిపోవాలి. గోమతీపురానికి వెళ్ళాలంటే పదిహేనూళ్ళు దాటి వెళ్ళాలి. ఆ మట్టిరోడ్డు నిండా గోతులూ గొప్పులూ సగందారిలో బండలు పరిచి అదే రోడ్డంటారు. ఆ బండలమీద అరగంట ప్రయాణం చేస్తే ఐదురోజులు విశ్రాంతి తీసుకున్నా ఏ వెన్నుపూసో కలుక్కుమంటూనే ఉంటుంది. అందుకే అందరూ పడవ ప్రయాణమే చేస్తారు. మేమూ పడవలోనే వెళ్ళాలని తీర్మానించుకున్నాం. మేము వెళ్తున్న విషయం సీతకి చెప్పి బయలుదేరాం.

కాలువ ఒడ్డుకు చేరుకున్నాం. అప్పటికే భట్టుగారక్కడ మాకోసం ఎదురు చూస్తున్నారు. తీరంలో తెప్ప సిద్ధంగా ఉంది. గుండ్రటి తెప్పలు నడపడానికెంతో నైపుణ్యం ఉండాలి. అందులో పడిపోకుండా ఎక్కడానికీ దిగడానికీ అంతకంటే ఎక్కువ నైపుణ్యం ఉండాలి. అవ్వగారు ఎక్కడానికి ఇబ్బందిపడతారేమో అని అనుమానించాను. కానీ ఆవిడ సునాయాసంగా ఎక్కేశారు. నేనే బ్యాలెన్స్ కాసుకోలేక తూలి పడబోయాను. అవ్వగారు పడీ పడీ నవ్వారు. తెప్పవాడు బయట పడకుండా లోలోపలే నవ్వుకుంటున్నాడు. నేను మాత్రం ఏడవలేక నవ్వుతున్నాను. భట్టుగారు మాత్రం ఏ ప్రతిక్రియా లేకుండా గుంభనంగా ఉండిపోయారు.

నేను తెప్పమీద ఎక్కడం ఇది రెండోసారి. మొదటిసారికూడా గోమతీపురానికే వెళ్ళాం. నేను ఆరోక్లాసు చదువుతున్నప్పుడు ఆ వూళ్ళో ‘కృష్ణార్జునకలగ’ అనే యక్షగానం చూడటానికి తీసికెళ్ళారు. కృష్ణార్జునులు స్నేహితులు కదా? వాళ్ళకి యుద్ధం ఎందుకొచ్చిందనేది నా అనుమానం.. ఆ కృష్ణార్జున కలగ చూస్తే అర్థమౌతుందనుకున్నానుగానీ అక్షరమ్ముక్క అర్థమైతే ఒట్టు. అది నాలుగొందల యేళ్ళనాటి భాష. నాలాంటి ఆరోక్లాసువాళ్ళకి అర్థం కాదు. ఆ తరువాత డాక్టర్ రాజ్ కుమార్ కృష్ణార్జున యుద్ధం సినిమా చూశాక గానీ విషయం అర్థం కాలేదు.

తెప్పదిగి ఊళ్ళోకి బయలుదేరాం. ఊరుకాని ఊరైనా అక్కడ అందరూ మా మూకవ్వగారినీ భట్టుగారినీ చూసి గౌరవంగా నమస్కరిస్తున్నారు. ఇదేనా రావడం అంటూ పలకరిస్తున్నారు. అదే మా జమునాపురంలో అయితే అవ్వగారి ముందు అందరూ నక్కవినయాలు ప్రదర్శిస్తూ ఉంటారు. భట్టుగారికి ఉత్తుత్తి నమస్కారాలు పెడుతూంటారు. అవసరానికి మాత్రం ఎవరూ పలకరు.

శివాలయం దాటితే గౌడగారిల్లు. మావూరి చుట్టుపక్కల ఎక్కడా అంత పెద్ద మండువాలోగిలి చూడలేదు. ప్రహరీగోడ దాటి లోపల అడుగుపెట్టేలోపే అక్కడ కూర్చున పాలేరు పరిగెత్తుకుంటూ లోపలకి వెళ్ళాడు. మరో రెండునిమిషాల్లో గౌడగారు కండువా సద్దుకుంటూ హడావిడిగా బయటికొచ్చారు. వచ్చీరాగానే అవ్వగారి కాళ్ళకి పాదాభివందనం చేశారు. భట్టుగారిని హృదయానికి హత్తుకున్నారు. ఇద్దరినీ తీసుకువెళ్ళి కుర్చీల్లో కూర్చోబెట్టారు. తనుమాత్రం నిలబడే ఉన్నారు. విచారగ్రస్తుడై, “అమ్మా మీరు మా ఇంటికి రావడం మాకు గౌరవమేగానీ ఇలా రావడం మాత్రం బాధాకరం. సావిత్రి గురించి తెలిసింది. తను అంతపని చేసుండకూడదు. కానీ తను అనుభవించిన బాధలు నేను కూడా చూశాను. అంత బాధపడుతూ జీవించడం ఎంతకష్టమో అనుభవించేవాళ్ళకేగానీ మనకి అర్థం కాదు. మీరు మా కుటుంబానికీ మా ఊరికీ చేసిన మేలు మేం ఎప్పటికీ మరచిపొలేము. మేం చెయ్యగలిగిందేమైనా ఉంటే చెప్పండి. తప్పకుండా చేస్తాం” అన్నారు.

అవ్వగారు విషయం చెప్పాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారని గౌడగారికి అర్థమైంది. అందుకే, “ఈరోజూ రేపూ పొలం పనుల్లో తీరిక లేదు. ఎల్లుండి నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దామనుకున్నాను. మా అదృష్టం కొద్దీ మీరే వచ్చారు. వచ్చిన పనేమిటో నిస్సంకోచంగా చెప్పండి” అన్నారు.

అవ్వగారు మెల్లగా గొంతు సవరించుకుంటున్నట్లు దగ్గారు. ఆ తరువాత, “సావిత్రి వెళ్ళిపోయింది. పిల్లలు అనాథలయ్యారు. వారి ఆలనా పాలనా చూడటానికి ఆడమనిషి కావాలి. సావిత్రి మరిది మల్లికార్జున మీకూ తెలుసుగా?”

“ఎందుకు తెలీదమ్మా, చాలా మంచికుర్రాడు. తెలివైనవాడు”

“తనకి భార్గవిచ్చి చేస్తే సావిత్రి పిల్లల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటుంది”

“కానీ మల్లికార్జునకంటే భార్గవే ఎక్కువ చదుకున్నట్లుంది కదా?”

“పిల్లాడికంటే వయసెక్కువైతే వరహీనంగానీ చదువెక్కువైతే ఏ సమస్యా లేదు కదా?”

“అలాగని కాదు, మన భార్గవి తనకంటే తక్కువ చదివిన కుర్రాడితో పెళ్ళికి ఒప్పుకుందా అని?”

“మనసులు కలిశాక చదువులతో పనేముంది గౌడగారూ?” అన్నారు అవ్వగారు. ఆవిడ మాటలకు భట్టుగారు మద్దతు ప్రకటిస్తున్నట్లుగా నవ్వారు.

గౌడగారు, భట్టుగారివైపు తిరిగి, “భట్టుగారూ మీరేమీ అనుకోకుండా అమ్మాయి పెళ్ళి ఖర్చులు పెట్టుకునే అవకాశం నాకిప్పించండి. ఆ పెళ్ళిద్వారా అయినా మీ ఋణం కొంతైనా తీర్చుకుంటాను. దయచేసి కాదనకండి” అన్నారు. వారి మాటలు వింటుంటే నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. మనుషుల్లో స్వార్థం తప్ప ఇంకేమీ మిగలడం లేదని బాధపడే మానవతావాదులందరికీ మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి ఈ ముగ్గురినీ ఉదాహరణలుగా చూపించవచ్చు.

అంతవరకూ గౌడగారు ఏమంటారో ఏమో అనే సందిగ్ధంలో పడి కొట్టుమిట్టాడుతున్న భట్టుగారి ముఖంలో ఆందోళన మాయమై ప్రసన్నత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

వచ్చినపని పూర్తయినందుకు చాలా సంతోషం కలిగింది. మా అవ్వగారన్నా భట్టుగారన్నా ఆమాత్రం గౌరవమర్యాదలుండటం సహజం. కానీ ఎంత గొప్ప మనసున్నవారైనా ఏకంగా పెళ్ళి ఖర్చంతా తలమీద వేసుకోవడం ఎంత ఆనందాన్నిస్తోందో అంతకు మించిన ఆశ్చర్యం కలిగిస్తోంది.

అవ్వగారొచ్చిన విషయం తెలియగానే ఊళ్ళోని మనుషులు వారి తోటల్లో పండిన కూరగాయలు ఆకుకూరలు, కొబ్బరిబోండాలు, పచ్చి అనపకాయలు తీసుకొచ్చి పెడుతుంటే గౌడగారి జీతగాళ్ళు వాటన్నింటినీ కలిపి రెండు మూటలుగా కట్టారు. మా అవ్వగారు, భట్టుగారు లేచి నిలబడ్డారు. అవ్వగారు ముందు నడుస్తుంటే వెనక గౌడగారు, భట్టుగారిని పెళ్ళికి ఏమేం కావాలో అడుగుతుంటే భట్టుగారు చెబుతున్నవన్నీ ఆ వెనుకనున్న గుమాస్తా రాసుకుంటున్నాడు. ఆ వెనక జీతగాళ్ళు మూటలు మోసుకొస్తున్నారు. అందరికీ వెనకగా అబ్బురపడుతూ అడుగులేస్తున్నాను నేను. అందరం రేవు చేరుకున్నాం.

మేం వచ్చిన తెప్ప అక్కడే ఉంది. అంటే తెప్పవాడికి వేరే గిరాకీలు రాలేదో లేక వీరికోసమే ఆగాడో అర్థం కాలేదు. మూటల్ని తెప్పలో పెట్టించి అందరూ ఎక్కి కూర్చున్నాక తెప్పవాడికి డబ్బులిచ్చారు గౌడ.

అంటే గౌడగారి టిప్పుకోసం తెప్పవాడు ఆగాడని అర్థమైంది.

తెప్ప బయలుదేరింది. అంతవరకూ నాలో పెరుగుతూ వస్తున్న కుతూహలాన్ని అవ్వగారు గమనిస్తూనే ఉన్నారు. అందుకే నావైపు మురిపెంగా చూస్తూ, “గోమతీపురానికీ జమునాపురానికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరముండేది. అందుకే నిన్ను ఇక్కడికి రానిచ్చేవాళ్ళం కాదు. ఓసారి నిన్ను యక్షగానానికి తీసుకొచ్చినందుకుగాను మీ నాన్నగారిని ఊళ్ళో అందరూ తప్పులు పట్టారు. ఇంకెప్పుడూ అక్కడికి వెళ్ళద్దని హెచ్చరించారు.

పదేళ్ళక్రితం గోమతీపురంలో ఎవరికో ప్లేగువ్యాధి సోకింది. అది ఒకరినుండి ఒకరికి పాకుతూ ఊరందరినీ వ్యాధిగ్రస్తులుగా మార్చేసింది. ఆ రోజుల్లో పరిసర ప్రాంతాల్లోని ఏ గ్రామస్తులూ ఇక్కడికి వచ్చేవారు కారు. ఈ వూరివారిని వాళ్ళ ఊళ్ళకి రానిచ్చేవారు కారు. ఆవిధంగా గోమతీపురం ఏకాకిగా మారింది. అక్కడి ప్రజలకి దైవభక్తి ఎక్కువ. అందుకే యక్షగానాలూ పౌరాణిక నాటకాలూ భాగవతాలూ ఎక్కువ. అలాంటి ఊరి మధ్యలో ఉండే శివాలయం పూజారి ప్లేగుబారిన పడి శివార్పణమయ్యారు. ఆలయంలో పూజలు లేకపోవడంతో మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. అలాంటి సమయంలో విషయం భట్టుగారికి తెలిసింది. ఆయన వచ్చి నాకు చెప్పారు. ఏవో మాటపట్టింపులు వచ్చి మాట్లాడుకోనంత మాత్రాన సాటి గ్రామస్థులు అంటువ్యాధిబారిన పడి మరణిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి మనసొప్పలేదు. అందుకే భట్టుగారూ నేనూ అక్కడికి బయలుదేరాము. మనూరి నాటు వైద్యుడు కూడా మా వెంట వచ్చారు.

గోమతీపురంలో వ్యాధిబారిన పడ్డవాళ్ళు ఊరిలోనూ లేనివాళ్ళు ఊరి బయట గుడిసెల్లోనూ ఉన్నారు. మాకూ ఓ గుడిసెలో వసతి కల్పించారు. రెండుమూడు నెలలు మా ముగ్గురికీ అదే నివాసం. భట్టుగారు వెళ్ళి గుడిలో పూజలు చేసేవారు. వైద్యుడు చేతులకీ ముక్కుకీ గుడ్డలు కట్టుకుని వైద్యం చేయడానికి వెళ్ళేవారు” అని చెబుతూంటే నాకో అనుమానం వచ్చింది.

“భట్టుగారు పూజలు చేస్తారు. వైద్యుడు వైద్యం చేస్తారు. అక్కడ ఉండటం ప్రమాదమని తెలిసినా వాళ్ళిద్దరికీ తప్పదు. కానీ మీరు, అందరికంటే పెద్దవారు. అంటువ్యాధులు పెద్దవారికీ పిల్లలకీ త్వరగా సోకుతాయని తెలిసి కూడా మీరెందుకు వెళ్ళారు?” అని కాస్త కోపంగానే అడిగాను.

నా ఉద్దేశాన్ని గమనించిన భట్టుగారు కల్పించుకుంటూ, “చూడు ఆత్రేయా, నీకీమాత్రం కోపం రావడం సహజం. నీ కోపం ఆవిడపట్లగల ప్రేమని సూచిస్తుంది. అలాగే ఆవిడ రాక సాటి మనుషులపట్ల ఆవిడలో ఉండే కరుణా కటాక్షాలని సూచిస్తుంది. ఆవిడ ఉంటే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం లేకపోతే మనూరి నాటు వైద్యుడు ఇంత దూరం వచ్చేవారు కారు. నేనూ ఆవిడ మాట కాదనలేక వచ్చానుగానీ లేకపోతే నా అంతట నేను వచ్చేవాడిని కాదు. మా ఇద్దరికే కాదు, ఊరి ప్రజలంతా ఊరొదిలిపోకుండా అక్కడే ఉండేలా ధైర్యం చెప్పింది కూడా ఆవిడే. మరీ ముఖ్యంగా గౌడుగారి భార్య నిండి గర్భిణి. ఆవిడకి తోడుగా ఎవరూ లేరు. ఒకవేళ మూకవ్వగారే లేకపోతే ఆవిడ బతికి బట్టకట్టేదే కాదు. అవ్వగారికి తెలియని విద్యలేదు. ఆ కొల్లూరి మూకాంబికాదేవి దయవల్ల ఆవిడ ఏదైనా ఒక్కసారి చూస్తే చాలు. నిర్భయంగా చేసి చూపించగల సామర్థ్యం అబ్బింది. చివరికి గౌడగారి భార్యకి కానుపు చేయడానికి మంత్రసాని లేదు. మీ అవ్వగారే ఆ బాధ్యతల్ని స్వీకరించి విజయవంతంగా ప్రసవం చేయించారు. అంటురోగం చుట్టుముట్టినా తల్లీ బిడ్డలు ఎలాంటి హానీ జరక్కుండా బయట పడ్డారంటే అది మీ అవ్వగారి చేతి చలవే. గౌడుగారి భార్యకు మాత్రమే కాదు. ఊళ్ళో స్త్రీలందరికీ పెద్దదిక్కుగా నిలబడింది మీ అవ్వగారే. అందుకే ఆవిడ వచ్చారని తెలియగానే ఊరు ఊరంతా తరలి వచ్చింది” అంటూ జరిగిందంతా వివరంగా చెప్పారు భట్టుగారు.

అయినాసరే నా కోపం తగ్గలేదు.

అంతవరకూ అన్నీ మౌనంగా వింటున్న తెప్పవాడు కల్పించుకుంటూ, “అదో మహమ్మారంట స్వామీ. అలాంటిలాంటిది కాదు. అదొచ్చినప్పుడు మా ఆవిడకూడా ఒళ్ళు తెలియకుండా పడిపోయింది. అంతే కాదు ఆరోగానికి మందులేదని తెలిసి ఆ భయంతోనే మనోవ్యాధి పట్టుకుంది. పసర్లూ పొడులూ మందులూ మూలికలూ గాయాల్నీరోగాల్నేగానీ మనోవ్యాధిని తగ్గించలేవు. కానీ అమ్మగారి మాటే అమృతంలా పని చేసింది. మీ అవ్వగారే లేకపోతే మా ఆవిడ మాకు దక్కేదే కాదు స్వామీ” అంటుంటే నాకు నోటమాట రాలేదు. డెబ్భై యేళ్ళ వయసులో కూడా కరోనాకి ఏమాత్రమూ తీసిపోని మహమ్మారిని అంత ధైర్యంగా ఎదిరించి నిలబడ్డారంటే మా అవ్వగారూ, భట్టుగారూ మావూరి నాటువైద్యుడూ సామాన్యులు కారు.

మాటలమధ్యలోనే తెప్ప రేవుని చేరుకుంది. అందరం తెప్పవాడికి కృతజ్ఞతలు చెప్పే లోపే అతను మరో మనిషిని పిలుచుకొచ్చాడు. ఇద్దరూ కలిసి మూటల్ని మోసుకుని వెళ్ళిపోయారు.

అయినా నాకో అనుమానం అలాగే మిగిలిపోయింది. అందుకే భట్టుగారిని, “మీరు గోమతీపురంలో ఆలయం కోసం మా అమ్మవారి గుడిని వదిలేసి వెళితే ఇక్కడి పూజాదికాలకి ఎలా?”

వెంటనే అవ్వగారు అందుకున్నారు, “మన అమ్మవారి పూజలు చెయ్యడానికి భార్గవి లేదా? వాళ్ళమ్మ లేదా? వాళ్ళత్తగారు లేరా? మూకాంబికాదేవిని ముగురమ్మల మూలపుటమ్మ అని ఎందుకంటారు? ఈ ముగ్గురమ్మలూ పూజలు చేసినందుకే” అంటూంటే నాకు నవ్వొచ్చింది కానీ నవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురూ మూకాంబికాదేవిని త్రికరణశుద్ధిగా పూజించినందుకే భార్గవి వివాహానికి కావలసిన అవసరాలన్నీ వాటికవే తీరుతున్నాయి. అమ్మవారు గుర్తురాగానే నేను మా మూకవ్వకోసం తీసుకొచ్చిన దీపపు సెమ్మెలు గుర్తొచ్చాయి. రేపైనా వాటిని చూపించి వాటిగురించి ఆవిడ ఏం చెబుతారో వినాలి.

(ఇంకా ఉంది)

Exit mobile version