[ధనంజయ లక్ష్మీ రామకృష్ణగారు వ్రాసిన ‘మత్తె మూకజ్జి’ అనే కన్నడ నవలని ‘అవ్వగారు’ పేరుతో అనువదించి ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.]
[సావిత్రి మరణం గురించి ఆలోచిస్తాడు కథకుడు ఆత్రేయ. తన చిన్ననాటి నేస్తురాలు అనుభావించిన కష్టాలకు బాధపడతాడు. అవ్వగారితో కలిసి మేడ మీద పిండి వడియాలు పెడతాడు. మాటల సందర్భంలో తనికి సహస్రచంద్ర దర్శనం వేడుక ప్రత్యేకంగా చేయనవసరం లేదని చెప్తారు అవ్వగారు. ఒకసారి సావిత్రి వాళ్ళింటికి వెళ్ళి రమ్మంటారు. తరువాత తన తండ్రిగారి గురించి, భట్టుగారి తాత, తండ్రుల గురించి, అప్పటి నుంచి కొనసాగుతున్న బంధం గురించి ఆత్రేయకి వివరిస్తారు. భట్టుగారి తండ్రిగారు తనకి పెళ్ళి సంబంధం తేవడం, రెండేళ్ళకే భర్త చనిపోయి, వైధవ్యంతో పుట్టింటికి చేరటం గురించి వివరంగా చెప్తారావిడ. తర్వాత వడియాలకి కాపలా ఉండమని ఆత్రేయకి చెప్పి ఆవిడ క్రిందకి దిగుతారు. కూతురితో కాసేపు ఆడుకుని, కాసేపు పుస్తకాలు చదువుకుని కాలక్షేపం చేస్తాడు ఆత్రేయ. సాయంత్రానికి వడియాలను క్రిందకి తీసుకొస్తారు. సావిత్రి అంత్యక్రియలు పూర్తి చేసుకుని వస్తారు భట్టుగారు. ఆత్రేయని వెంటబెట్టుకుని వాళ్ళింటికి వెళ్తారు అవ్వగారు. భట్టుగారిని పలకరించలేక, వారి తల్లిగారిని పలకరిస్తారు. మనవరాలు చనిపోయినందుకు ఆవిడ చాలా దుఃఖంలో ఉంటారు. సావిత్రి తల్లినీ, చెల్లి భార్గవిని ఓదారుస్తారు అవ్వగారు. అక్క బిడ్డలని చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని భార్గవికి చెప్తారు. అది విన్న ఆత్రేయ అపార్థం చేసుకుంటాడు. తిరిగి వస్తుంటే, అదే మాట అవ్వగారిని అడిగితే, ఆవిడ వివరిస్తారు, భార్గవీ, సావిత్రి మరిది మల్లికార్జున ఒకరినొకరు ఇష్టపడ్డారనీ, వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయించమనడం తన ఉద్దేశమని చెప్తారు. ఓ రోజు భట్టుగారితో కలిసి తెప్ప ఎక్కి నదిని దాటి గోమతీపురం వెళ్తారు అవ్వగారూ, ఆత్రేయ. గౌడగారింటికి వెళ్ళి, భార్గవి, మల్లికార్జునల వివాహం గురించి ప్రస్తావిస్తారు. ఆయనెంతో సంతోషించి, పెళ్ళి ఖర్చంతా తాను పెట్టుకుంటానంటారు. గుమాస్తా వచ్చి, ఏమేం కావాలో రాసుకుంటాడు. తిరుగు ప్రయాణంలో గోమతీపురంలో అవ్వగారికీ, భట్టుగారికి ఎందుకు అంత ఆదరణ ఉందో ఆత్రేయకి చెప్తారావిడ. – ఇక చదవండి.]
అధ్యాయం-5
సూర్యుడు లోకమంతా ఒకేలా ఉదయిస్తాడు. కానీ జమునాపురంలో సూర్యోదయం మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఎందుకలా?
మనసు తేలిగ్గా సంతోషంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు అన్నీ అందంగానే కనిపిస్తాయి. ఆ మనసుకి ఆనందాన్నిచ్చేదే పుట్టిపెరిగిన ఊరు. ఆ ఊళ్ళో అన్నీ అద్భుతంగానే ఉంటాయి. పడుకునే కిటికీలోంచి బయటకి చూశాను. ఈనాటి సూర్యుడికి కిటికీ ఫ్రేం కట్టి చూపిస్తుంటే మబ్బులు బంగారం రంగులద్దుకున్నాయి. కిరణాలు ఆ మబ్బుల్ని చీల్చుకుంటూ ఫ్రేములోకి వచ్చేసి దాని అంచులని స్వర్ణకాంతులతో మెరిసేలా చేస్తున్నాయి. సూర్యుడికి శుభోదయం చెప్పేసి మళ్ళీ ముసుకేసుకున్నాను. మీరా గాఢనిద్రలో ఉన్నట్లుంది. తనమీద చెయ్యేస్తే ఆ చేతుల్లోంచీ గుండెల్లోకి చైతన్యం ప్రవహిస్తుంది. ఆ చైతన్యమే లేకపోతే జీవితానికి ఏ స్వారస్యమూ ఉండదు.
నేనిలా ముసుగేశానో లేదో అలా కాఫీ తీసుకుని ప్రత్యక్షమైంది సీత. తను అందించిన కాఫీని గబగబా ఊదుకుంటూ తాగేస్తున్నాను. అంత హడావిడి ఎందుకంటే బెడ్ కాఫీ తాగుతున్న విషయం తెలిస్తే అవ్వగారికి కోపం వస్తుంది. తెల్లారకుండానే ఆవిడకి కోపం తెప్పించడం నాకిష్టం ఉండదు.
“అంత హడావిడిగా తాగితే మూతి కాలుతుంది. మీ అవ్వగారు అరగంటదాకా రారు. నింపాదిగా తాగండి” ధైర్యం చెప్పింది సీత.
దాంతో ధైర్యం వచ్చింది. “ఈమాట ముందే చెప్పచ్చుగా” అంటూ కాఫీ రుచిని ఆనందంగా ఆస్వాదించడం ఆరంభించాను. తాగడం పూర్తవ్వగానే సీత కాఫీ కప్పు తీసుకుని వెళ్ళిపోయింది. నేను మళ్ళీ ముసుగెట్టుకున్నాను.
నిద్ర పట్టీపట్టకుండా పడుతున్న సమయంలో అవ్వగారొచ్చారు. ఆవిడ వస్తున్నరంటే ఎవరో ఒకరిని వెంటపెట్టుకుని వస్తారు. లేదా ఎవరో ఒకరు ఆవిడని వెతుక్కుంటూ వస్తారు. ఇప్పుడు కిటికీలో సూర్యుడు పైకెళ్లిపోయాడు. కిటికీ చట్రంలోకి అవ్వగారొచ్చారు. ఆవిడ వెనకే మా శ్యామన్న మాస్టారు కనిపించారు. వెంటనే లేచి స్నానాల గదిలో దూరాను.
బయట మాస్టారూ అవ్వగారూ మాట్లాడుకోవడం వినిపిస్తూనే ఉంది. త్వరగా స్నానం పూర్తి చేసుకుని బట్టలేసుకుని బయటకొచ్చాను. తిన్నగా వెళ్ళి మాస్టారికి పాదాభివందనం చేశాను.
ఆయన నన్ను పైకి లేపి నిలబెడుతూ, “ఆత్రేయా నువ్వు బడి దగ్గరకి రాలేదు. అందుకే నేనే ఇక్కడికి వచ్చాను. కొండ మనదగ్గరకి రాకపోతే మనమే కొండదగ్గరకి వెళ్ళక తప్పదు కదా?” అన్నారు నవ్వుతూ. నాకెందుకో చివుక్కుమనిపించింది. ప్రతీసారీ రాగానే ఆయన దగ్గరకి వెళ్ళేవాడిని. ఈసారి అలా కుదరలేదు. సావిత్రి మరణం అందరితోబాటు నన్ను కూడా బాకా కృంగదీసింది. ఆ విషయం మాస్టారిక్కూడా తెలుసు. అందుకే ఆయనే వచ్చారు. ఆయనొచ్చేంతవరకూ నేను ఆలస్యం చేసి ఉండకూడదు. మా ఊళ్ళో ఇంతమంది విద్యావంతులున్నారంటే అందుకు కారణం ఆయన శ్రమా ఆయన ప్రోత్సాహాలే. స్కూలు చదువైపోయినా ఊళ్ళోని ప్రతి విద్యార్థినీ పలకరిస్తారు. వారి ఉన్నత చదువుల గురించి ఆరాతీస్తారు. వారికి అవసరమైన సలహాలిస్తారు. అందుకే అందరికీ ఆయనంటే చాలా గౌరవం. నేను కూడా వచ్చిన ప్రతిసారీ స్కూలుకి అవసరమైనది ఏదో ఒకటి అమర్చిపెడుతూ ఉంటాను. ఈసారి స్కూలుకి ఏది ఇవ్వాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు అదే అడుగుదామనేలోగా సీత కాఫీ తీసుకొచ్చింది.
మా ఇంట్లో కాఫీ ఇంకా పాతకాలం పద్ధతిలోనే చిన్న ఇత్తడి గ్లాసులో పోసి దాన్ని వెడల్పైన టంబ్లర్లో పెట్టి ఇస్తారు.
శ్యామన్న మాస్టారు కాఫీ తాగే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. మూతి కాలుతున్నా సరే టంబ్లర్లో పోసుకుని గ్లాసుతో చల్లార్చుకోరు. ఇత్తడి టంబ్లర్లోని గ్లాసుని అలాగే ఉంచుతారు. దాని వేడి చేతికి తగలకుండా భుజమ్మీదున్న కండువా తీసుకుని టంబ్లర్‌ని దాంట్లో చుట్టి, దానిలో ఉన్న గ్లాసుని జారిపోకుండా చూసుకుంటూ నోటితో కాఫీని పీలుస్తారు. అలా పీలుస్తుంటే వచ్చే శబ్దమూ గ్లాసు టంబ్లర్లోంచీ కిందపడకుండా ఉండటానికి చేసే విన్యాసాలూ మాకు అలవాటే. కానీ కొత్తగా చూసేవరికి నవ్వు తెప్పిస్తాయి. అలాగని మాస్టారి ముందు నవ్వి ఆయన్ని చులకల చేయడం తనకి ఇష్టంలేదు. అందుకే లోపలకి వెళ్ళిపోయింది. చివరికి కాఫీ తాగడం పూర్తయ్యింది. అవ్వగారు ఆయన చేతుల్లోని గ్లాసూ టంబ్లర్లని అందుకుని అరుగుమీద పెట్టారు.
మాస్టారు నా భుజమ్మీద చెయ్యేశారు, “ఈసారి వానలు గట్టిగానే కురిశాయి. ఆ వానలకి మిద్దె కారడం మొదలైంది. దాన్ని రిపేరు చేయించాలి. కాస్త ఎక్కువే ఖర్చవుతుంది” అన్నారు.
“చేయిద్దాం మాస్టారూ, మీరు ఖర్చు గురించి ఆలోచించకండి. అంతా నేను చూసుకుంటాను. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు. పదండి మేస్త్రీ దగ్గరకు వెళదాం” అన్నాను. ఆయన ముందు దారితీశారు. నేను ఆయన్ని అనుసరిస్తూండగా, “కాలం చాలా వేగంగా మారిపోతోంది ఆత్రేయా. ఆధునికత పేరుతో ఆచారాల్ని వాళ్ళిష్టమొచ్చినట్లు మార్చేస్తూ, అడ్డమైన వేషాలూ వేస్తున్నారు. విదేశాలనించి వచ్చిన ఒక మహానుభావుడికి అక్కడి గ్రీన్ కార్డ్ దొరికిందట. ఆయన దాన్ని చెప్పుకుని గొప్పలు పోతుంటే అందరూ పెళ్ళికొచ్చామనే జ్ఞానం లేకుండా ఆయనతో ఫోటోలు దిగడానికి పోటీలు పడ్డారు. తనకి పుట్టబోయే పిల్లలకి ఆ దేశపు పౌరసత్వం లభిస్తుందనేది ఆయన ఆనందం. అయినా అందరూ అక్కడి జాతీయత కోసం ఎగబుడుతుంటే మీరాకి భారతదేశపు పౌరసత్వమే లభించాలని నువ్వెందుకు కోరుకున్నావు?” అని అడిగారు..
నాలో మన జాతీయతను వదులుకునేవాళ్ళంటే అసంతృప్తీ అసహనమూ కొద్దిపాటి ఆవేశమూ కూడా ఉన్నాయి. మా మీరాని భారతీయురాలిగానే పెంచుతున్నందుకు అక్కడున్న మనవాళ్ళు నన్నూ సీతనీ కూడా వెక్కిరించడం వెటకరించడం గుర్తొచ్చింది. అందుకే, “మాస్టారూ, అక్కడి జాతీయతని పొందితే కలిగే లాభాలు మూడు. ఆ ఖండంలోని వివిధ దేశాలను వీసా లేకుండానే చూసిరావచ్చు. అక్కడ చదువుకోవడానికి వచ్చే విదేశీయులు కట్టే ఫీజులో ఇరవైశాతం కంటే కట్టాల్సిన అవసరం ఉండదు. సౌకర్యాల విషయంలో స్వజాతీయులకే ప్రాధాన్యత ఎక్కువ. మూడవది, అక్కడి ప్రభుత్వం ఉచిత భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది”
“ఇక్కడ కూడా బడిలో భోజనాలు పెడుతూనే ఉన్నారుగా?”
“ఇక్కడుండే పేదలు వారి పిల్లలకి పుష్టికరమైన ఆహారం పెట్టే ఆవకాశం లేదు. అందుకే ఒకపూటైనా మంచి భోజనం పెట్టాలనే లక్ష్యంతో భోజన పథకం ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వం బాధ్యతతో చేసేది. అది ప్రజలు తమ బాధ్యతనుండి తప్పించుకోవడానికి చేసేది. ఆ రెండింటికీ చాలా తేడా ఉంది. అయినా అక్కడే ఉండి అక్కడి పౌరులుగా జీవించాల్సిన అవసరం ఏముందో నాకిప్పటికీ అర్థం కాలేదు. అక్కడివాళ్ళిక్కడికొచ్చి ఇక్కడి పౌరసత్వం తీసుకుని ఇక్కడే జీవించడానికి ఏమాత్రం ఇష్టపడనప్పుడు మనం అక్కడికెళ్ళి అక్కడే ఉండిపోవాలనుకోవడంలో ఏమాత్రం అర్థం లేదు. ఒకవేళ కొంతమంది వెనక్కి రాక తప్పని పరిస్థితులు వస్తే పిల్లల్ని అక్కడే కని వాళ్ళకి అక్కడి పౌరసత్వం తీసుకున్నాకే ఇక్కడికి వస్తారు. అలా చేస్తే వాళ్ళు పెద్దయ్యాక ఆ దేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడటం సులభమౌతుంది”
మాస్టారు వ్యంగ్యంగా పెదవి విరుస్తూ “అలాంటివాళ్ళని చూసే చింత చచ్చినా పులుపు చావలేదనే సామెత పుట్టింది” అన్నారు.
“సరిగ్గా చెప్పారు మాస్టారూ. వారి పులుపూ పులపరాలవల్ల సంభవించే నష్టం అపారమైనది. వాళ్ళు మళ్ళీ ఆ దేశానికి వెళ్ళలేకపోతే ఇక్కడి అవకాశాల్ని చేజార్చుకోవలసి వస్తుంది. వారికి సైన్యంలో ప్రవేశం లభించదు. అంటే దేశాన్ని కాపాడుకునే అవకాశం కోల్ఫోతారు. ఐయ్యేయెస్ ఐపీయెస్ ఉద్యోగాలు లభించవు. తద్వారా ప్రజలకు ప్రభుత్వ పరంగా సేవచేసే అధికారం ఉండదు. ప్రభుత్వ విద్యా వైద్యాల మాట మరచిపోవలసిందే. డిఆర్ డి లాంటి దేశప్రయోజనాలకై కృష్టి చేసే సంస్థల్లో ఉద్యాగాలు రావు.”
“అంటే పెద్దల దురాలోచనలు పిల్లల్ని రెంటికీ చెడ్డ రేవళ్ళుగా మారుస్తున్నాయంటావు. అయినా నాకో అనుమానం, మనం ఆంగ్లమాతని నువ్వే మా అమ్మ నువ్వు తప్ప మాకు దిక్కులేదు అని దేబిరించినంత మాత్రం చేత ఆ ఆంగ్లమాత మనల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటుందా? అదే మన అమ్మయితే? కష్టానికీ నష్టానికీ కాపాడుతుంది. ఇక్కడినుండి వెళ్ళి అక్కడ కూరుకుపోతే మాతృభాష కూడా భూస్థాపితం అయిపోతుంది. మన సంస్కృతి సంప్రదాయాలు మట్టికొట్టుకుపోతాయి. ఇలాంటి సంధికాలంలో మీ మీరాని భారతీయురాలిగా జన్మనివ్వడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. ఇవన్నీ సరేగానీ నువ్విక్కడికి వచ్చేదెప్పుడు?”
“ఇంకా రెండేళ్ళు పడుతుంది మాస్టారూ”
మాటల్లోపడి మేస్త్రీ ఇల్లు దాటిపోతుంటే మాస్టారు ఆపారు.
మేస్త్రీ భార్య మమ్మల్ని అరుగుమీద కూర్చోమని చూపిస్తూ, “రండి మాస్టారూ రండి బాబుగారూ, సీతా మీరా ఎలా ఉన్నారు? మా ఇంటికి ఒకసారి తీసురండి” అంటూ భర్తని పిలుస్తూ, “ఇదిగో మాస్టారూ ఆత్రేయగారూ వచ్చారు” అంది.
“ఉండండి నేనే వస్తాను”అంటూ పెరట్లోకి వెళ్ళాను. మేస్త్రీ అప్పణ్ణ గడ్డపార తిరగేసి పాతి దాని మొనతో కొబ్బరికాయలు వలుస్తున్నారు. నన్ను చూడగానే పంచె కిందకి వదిలి ఒక అంచుతో నుదుటికి పట్టిన చెమటని తుడుచుకుంటూ వచ్చి,”ఏం ఆత్రేయా ఎప్పుడొచ్చారు?”అని అడిగాడు.
నేను నవ్వుతూ, “ఇదిగో ఇప్పుడే వస్తున్నానుగానీ మన మేస్టారు బడిలో మిద్దంతా కారుతోందంటేనూ, దాని గురించి మాట్లాడదామని వచ్చాము” అని చెప్పాను.
అప్పణ్ణ పెదవి విరుస్తూ, “దానికెన్ని రిపేర్లు చేసినా ముసల్దానికి దసరా పండగ చేసినట్లే సారూ. ఇప్పుడెలాగూ శలవులే కాబట్టీ దాన్ని పడగొట్టి కొత్తగా కట్టుకోవడం మంచిది. కావాలంటే కొంతకాలం స్కూలు పంచాయితీ ఆఫీసులో పెట్టుకోవచ్చు. పదండి మేష్టారినడుగుదాం” అంటూ బయటికొచ్చాడు.
అప్పణ్ణ చెప్పింది వినగానే, “కొత్త బిల్డింగంటే మాటలా? ఐదు గదుల డాబా వెయ్యాలంటే ఎంత ఖర్చో నీకు తెలియందేముంది?” అన్నారు.
నేను కల్పించుకుంటూ, “ముందు పాఠశాల నిధులెంతున్నాయో తెలిస్తే కొంత పంచాయితీ వాళ్ళని అడగచ్చు” అన్నాను.
“ముప్ఫైవేలున్నాయి”
“నిర్మాణానికి ఎంత మొత్తం కావాలి?”
“నాలుగైదు లక్షలైనా కావాలి. సిమెంటు ఇసక తలుపులూ కిటికీలూ కొనుక్కోవాలి. ఇటికలు మన ఇటికల భాస్కరప్ప సమకూరుస్తానని మాట ఇచ్చారు”
మాస్టారి మాటలు వినగానే అప్పణ్ణకి కాస్త ధైర్యం వచ్చింది. అందుకే, “కూలి డబ్బులకి అందరూ తలో చెయ్యీ వేస్తే సరిపోతుంది. పునాదులు తవ్వడం మొదలు పెడితే రెండుమూడు నెలల్లో కట్టుకోవచ్చు. వెళ్ళి మన ఊరి గౌడగారిని ఓ మాట అడిగొద్దాం” అంటూ బట్టలు మార్చుకోవడానికి లోపలకి వెళ్ళారు.
మేస్టారు నావైపు చూస్తూ, “ఆత్రేయా నీకు పుట్టిన ఊరిమీద మమకారం ఎక్కువేగానీ దానికోసం తలకు మించిన భారాన్ని పెట్టుకోవద్దు” అన్నారు.
“మీరేం ఆలోచించకండి మాస్టారూ, నాకిప్పుడు ఖర్చులూ లేవు మీదపడేన్ని అవసరాలూ లేవు. ముందు మన బడికి బిల్డింగ్ ముఖ్యం. దాని పని చూశాక మిగిలిన పనులు చేసుకోవచ్చు” అంటూండగానే అప్పణ్ణ చొక్కా వేసుకుని వచ్చారు. ముగ్గురం కలిసి ఊరి గౌడగారింటికి బయలుదేరాం.
గౌడగారంటే మావూరి గౌడగారిలాగే ఉండాలి. ఆయనది కంచుకంఠం అనుకుంటారుగానీ బొంగురుగొంతు. ఇంట్లో అందరూ ఉప్పుడు బియ్యపు అన్నం తింటున్నా ఆయనకి మాత్రం సన్నబియ్యపన్నం తప్ప తినరు.
ఆయన తన పాత రాజదూత్ మీద తప్ప బయటకు రారు. అదైతే ఆయనకంటే ముందే ఆయన రాక గురించి చాటింపేస్తూ ఉంటుంది. మేము వాళ్ళింటికి వెళ్ళేలోపే ఆయన పొలానికెళ్ళిపోయారు. దాంతో మేము కూడా పొలానికి బయలుదేరాం.
గౌడగారిది దాదాపు రెండొందల ఎకరాల విశాలమైన భూమి. దాన్ని వాళ్ళ తమ్ముడు హనుమేగౌడ చూసుకుంటారు. వాళ్ళబ్బాయి బెంగుళూరులో ఉద్యోగం. నాకంటే చిన్నవాడే. ఆరోజు గౌడగారు వాళ్ళ పొలంలో బోరు వేయిస్తున్నారు. మేం వెళ్ళేసరికే ఎనిమిది వందల అడుగుల లోతు దిగింది. అయినా నీళ్ళు పడలేదు.
ముగ్గురం గౌడగారికి నమస్కరించాం.
అక్కడి బోరు శబ్దంలో కూడా గౌడగారి బొంగురు గొంతు స్పష్టంగా వినిపిస్తూనే ఉంది, “ఏం ఆత్రేయా ఎప్పుడొచ్చావు? సీతెలా ఉంది? మీరా ఏం చేస్తోంది?” అంటూ కుశల ప్రశ్నలు వేశాక, “ఏకంగా మేస్టారినీ మేస్త్రీనీ కూడా వెంటబెట్టుకు వచ్చావంటే ఏదో విశేషమే అయివుంటుంది” అంటూ అర్ధోక్తిలో ఆపారు. ఆయనంతే. విషయాలు తప్ప ఇతరాలు మాట్లాడరు. అందుకే ఆయనకీ అవ్వగారికీ అంత స్నేహం కుదర లేదు. అవ్వగారికి అన్నీ కావాలి. ఈయనకి వ్యవహారం తప్ప ఇంకేమీ అక్కరలేదు. అందుకే భాగీరథమ్మగారు ఈయన్ని చపల గౌడయ్య అంటారు.
భాగీరథమ్మగారి భర్త యుద్ధంలో వీరస్వర్గం అలంకరించిన సైనికుడు. ఆయన చనిపోయినప్పటినుండి ఈయన కన్ను ఆవిడమీదే. ఈ విషయాన్ని మా అవ్వగారు ముందే గమనించి ఆయన్ని అటువైపు రాకుండా కట్టడి చేశారు. అందుకే ఆవిడంటే ఈయనకి గుర్రు.
ఊళ్ళోని బడి, గుడి, పంచాయితీ కార్యాలయం, పాలడైరీ, పోస్టాఫీసు అన్నీ ఆయన స్థలాల్లోనే ఉన్నాయి. అందువల్ల ఎవరూ ఆయనకి ఎదురు తిరిగి మాట్లాడరు. ఆయన చపల చిత్తాన్ని ఎవ్వరూ ఒప్పుకోరు. అయినా ఆయనకి చుట్టుపక్కల ఊళ్ళలో చాలా సంబంధాలున్నాయి. ఊరిపెద్దలు ఎంతమందితో తిరిగినా దానిగురించి వారి మగతనం గొప్పదని చెప్పుకుంటారే తప్ప ఎవరూ తప్పులు పట్టరు. సామాన్యులెవరైనా అలాంటి సంబంధాలజోలికి వెళితే నువ్వేమైనా ఊరిపెద్దగౌడవా? అని వెక్కిరిస్తారు. లేనివాళ్ళు చేసే తప్పులన్నీ ఉన్నవాళ్ళు చేస్తే ఒప్పులుగా చెలామణీ అయిపోతాయి. అంతేకాదు, గౌడగారిలాంటివాళ్ళ స్త్రీలోలత్వాన్ని ఆయన మీసానికీ మగతనానికీ ఉదాహరణగా చెప్పుకుంటారు. అలాంటివాళ్ళు ఎంత ఎక్కువమందితో తిరిగితే అంత గొప్పవాళ్ళని చెప్పుకుంటారు.
గౌడగారు విషయం ఏమిటో త్వరగా చెప్పమన్నట్లుగా చూశారు, ఈ గౌడలింతే ఉల్లిపాయంత పనికి ఊరంత దీర్ఘం తీస్తారు. అయినా ఆయన సహాయం కోసం వచ్చినప్పుడు ఆయన తప్పులెంచకూడదు. అందుకే నేరుగా విషయంలోకి వచ్చాను, “బడి మిద్దె పాతబడిపోయింది. పగుళ్ళు తీసి వర్షానికి కారుతోంది. దాన్ని రిపేరు చేయించడం గురించి మీ సలహా అడగటానికి వచ్చాం” అని చెప్పాను.
ఆయన వెంటనే ఏమాత్రం తడుముకోకుండా, “ఇదేనండీ ఈ మాస్టర్లతో వచ్చిన సమస్య. ఏదైనా ప్రాబ్లం వస్తే ముందుగా చెప్పాల్సింది ఊళ్ళో ఉండేవాడికా? ఊరికి వచ్చిపోయేవాడికా? నేను కాదంటే వేరేవాళ్ళ దగ్గరకెళ్ళచ్చుగానీ పైవాళ్ళచేత నన్ను కాదనిపిస్తే ఎలా?” అన్నాడు.
వెంటనే మేస్టారు తడబడిపోతూ, “అలాంటిదేం లేదు గౌడగారూ, ఆత్రేయ ఆసక్తితో అడిగితే ఏదో మాటవరసకి చెప్పానంతే. తను వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాడు. అంతేగానీ నా అంతట నేనేమీ చెప్పలేదు. అయినా మీకు చెప్పకుండా నేను ఎప్పుడైనా ఏ పనైనా చేశానా చెప్పండి. నాకే కాదు, ఊళ్ళో ఎవరికీ అంత ధైర్యం లేదు. మీరు సహాయం చెయ్యకపోతే అసలు ఈ ఊరికి బడంటూ ఉండేదా చెప్పండి” అంటూ ఎదురు ప్రశ్నించారు.
గౌడగారు మేస్టారి మాటలకి మెత్తబడ్డట్లే కనిపించినా ఆయనతో కాకుండా నాతో చెప్పడం మొదలుపెట్టారు, “ఊళ్ళో ఎవరికేం కావాలన్నా నేనే సహాయం చెయ్యాలి. బడి కావాలంటే స్థలమిచ్చాను. అది చాలక రిపేర్లు కూడా నేనే చేయించాలంటే ఎలా? అయినా ఇంతదూరం వచ్చారు. బోరులోనీళ్ళు పడితే చూద్దాం ఏం చెయ్యాలో” అన్నారు.
అక్కడ నీళ్ళు పడ్డమూ జరగదు ఆయన మాకు సాయపడ్డమూ జరగదు. ఇదంతా జరిగేపని కాదనుకుంటూ గౌడగారి దగ్గర శలవు తీసుకుని వెనక్కి బయలుదేరాం. బడికి భవనంతోబాటు దాని ముందున్న ఖాళీ స్థలంలో ఒక ఉద్యానవనం కూడా నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అందుకు మేస్టారూ మేస్త్రీ కూడా ఒప్పుకున్నారు. దాంతో ఆ సాయంత్రం దాకా ఊళ్ళో అందరితోనూ బడిగురించీ ఉద్యానవనం గురించీ చర్చించడంతోనే సరిపోయింది. ఊరంతా తలో చెయ్యీ వేస్తున్నప్పుడు తనేమీ చెయ్యకపోతే బాగుండదనుకున్న గౌడ సాయంత్రం మమ్మల్ని ఇంటికీ పిలిపించాడు. పంచాయితీలో బడినిధులు ఎంతుంటే అంత నేను కూడా ఇస్తానని చెప్పి పంపించాడు. ఆయనకి కృతజ్ఞతలు చెప్పి ఇల్లు చేరేసరికి రాత్రి భోజనాలవేళయింది.
రాత్రి భోజనాలు చేశాక నాకు దీపాలు గుర్తొచ్చాయి. వాటిని తీసుకొచ్చి మా అవ్వగారి చేతిలో పెట్టాను. వాటిని తీసుకోగానే అటూ ఇటూ తిప్పి చూశారు. వాటిలో ఏం కనిపించిందో ఏమోగానీ దీపాల చారిత్రక ఐతిహాసిక విశేషాలని గుర్తు చేసుకుంటున్నట్లుగా కాసేపు కళ్లు మూసుకున్నారు. కాసేపు అలాగే ధ్యానముద్రలో గడిపాక మెల్లగా కళ్ళు తెరిచారు.
“ఇవి సామాన్యమైన దీపాలు కావు. కాశీనగరాన్ని పరమశివుడు పరిపాలించేవారు. దివోదాసనే భక్తుడు బ్రహ్మకోసం తపస్సు చేస్తే ఆయన్ని కాశీరాజుగా చేస్తానని మాట ఇస్తాడు బ్రహ్మదేవుడు. ఆయన మాట నిలబెట్టడం కోసం కాశీవిశ్వేశ్వరుడు కాశీనగరాన్ని వదిలి వెళ్ళిపోతారు. ఈ విషయం తెలియని పార్వతీమాత కనీసం కంటిరెప్పయినా వెయ్యకుండా ఆయన కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. అందుకే అక్కడ కొలువైన శక్తి స్వరూపానికి విశాలాక్షి అనే పేరు వచ్చింది. ఆనాడు దివోదాసు వెలిగించిన దీపాలివే” అంటూ ఆరంభించారు. నేనూ సీతా అబ్బురంగా వింటున్నాం. దేనిగురించైనా మనకి తెలిసిన విషయాలకంటే అవ్వగారు తెలియజేసే విశేషాలు చాలా అసక్తికరంగా ఉంటాయి.
అవ్వగారు తన ఐతిహాసిక ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు, “దక్షపుత్రికగా జన్మించిన సతీదేవి మహాశివుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. దక్షుడు యాగం చేసేప్పుడు శివుడిని అవమానించడానికే అలా చేశాడనే విషయం తెలియని సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళి తండ్రి చేసే శివనిందని సహించలేక ఆత్మదహనం చేసుకుంది. ఈ విషయం తెలిసిన శివుడు సతీదేవి దేహాన్ని చేత ధరించి తాండవనృత్యం చేస్తూంటే ఆ ప్రళయతాండవానికి లోకాలన్నీ అల్లకల్లోలమైపోయాయి. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడం ద్వారా సృష్టిని కాపాడారు. సుదర్శన చక్రంతో ముక్కలైన యాభైఒక్క భాగాలలో చెవిభాగం కాశీలో పడింది. అదే మణికర్ణికా ఘట్టం. అక్కడి నీటితో ఈ దీపాలని వెలిగించింది గంగాదేవి. అప్పటినుండి అవి అలా వెలుగుతూనే ఉండేవి. యవనులు మనదేశానికి వచ్చినప్పుడు వారిలో ఒక ధూర్తుడు ఈ దీపాలను తస్కరించాడు. తను విశ్వనాథుడి మందిరం ముందుకు రాగానే విరుచుకుపడిపోయాడు. తన చేతిలోని దీపాలు వెళ్ళి మట్టిలో పడి కూరుకుపోయాయి. శంకరాచార్యులవారు అక్కడికి వెళ్లినప్పుడు వారి పాదాలు ముందుకు కదలలేదు. దాంతో అనుమానం వచ్చిన ఆదిశంకరాచార్యులవారు అక్కడి నేలను తవ్వితే ఈ దీపాలు కనిపించాయి. వీటిని తీసుకువెళ్ళి విశ్వనాథుడి గుడిలో పెట్టి నేతితో దీపం పెట్టారు. అనంతర కాలంలో జౌన్‌పూర్‌కి చెందిన సుల్తానులు ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఒక మసీదు నిర్మించారు. ఆ సమయంలో గంగ పెట్టిన విశాలాక్షమ్మ దీపాలు మళ్ళీ గంగపాలయ్యాయి. కొంతకాలం తరువాత ఆ మసీదు పక్కనే మళ్ళీ ఆలయం కట్టించారు. ఈలోగా ఒక మహారాణికి దీపాలు కల్లోకి వచ్చాయి. ఆ కలలో దీపపు సెమ్మెలు గంగలో ఉన్నట్లు కనిపించాయి. ఫలితంగా ఆ మహారాణి కాశీలోని ఘట్టాలన్నింటిలోనూ స్నానం చేయసాగింది. మణికర్ణికా ఘట్టంలో ఈ దీపపు సెమ్మెలు దొరికాయి. వాటిని తీసుకొస్తున్నప్పుడు ఒక విదేశీయుడు మహారాణిని అంతం చేసి వాటిని వారి దేశానికి తీసుకుపోయాడు. దానిని నువ్వు కొనుక్కొచ్చి నా చేతిలో పెట్టావు” అంటూ అవ్వగారు కళ్ళు తెరిచి చూసేసరికి సీత, మీరా నిద్రపోయారు. నన్ను కూడా పడుకొమ్మని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయారు అవ్వగారు. నేను కూడా దుప్పటి కప్పుకున్నానుగానీ అవ్వగారు చెప్పిన దీపాల చరిత్రే కళ్ళలో పడుతుంటే సెల్లందుకుని నెట్లో వెతికాను. అందులోని వివరాలకీ మా మూకవ్వ చెప్పిన వివరాలకీ చాలా దగ్గరి పోలికలున్నాయి. కానీ ఆవిడ కాశీ వెళ్ళలేదనీ, దాని గురించి తనకే వివరాలూ తెలియవనీ నాకు తెలుసు. తను శివైక్యం చెందేలోపు ఒక్కసారైనా కాశీ వెళ్ళాలనేది ఆవిడ చిరకాల వాంఛ. ఆ విషయం నాతో ఎన్నోసార్లు చెప్పారు కూడా. ఆవిడ చెప్పేవి పురాణగాథలైతే ఎవరిద్వారనైనా విని ఉండవచ్చు. పురాగాథలై ఉంటే ఏ యక్షగానాల్లోనో నాటకాల్లోనో చూసి ఉండచ్చు. కానీ ఆవిడకి జ్ఞానవాపి మసీదుతో సహా ఈ చారిత్రకమైన వివరాలన్నీ ఎలా తెలిశాయి? భారతదేశంలో పౌరాణికమైన ప్రాధాన్యత కలిగిన ఆలయాలన్నింటికీ దగ్గరలోనో ఆలయ ప్రాంగణంలోనో మసీదులుండటం అవి మత సామరస్యానికి ప్రతీకలుగా పేరొందడం అందరికీ తెలిసిందే. కానీ జమునాపురంలో ఉంటూ శివమొగ్గ జిల్లా దాటి వెళ్ళని అవ్వగారికి ఈ విషయాలు తెలిసే అవకాశం లేదు. ఆవిడ కల్పనన్నీ చాలావరకూ సత్యాధారితాలై ఉంటాయి. ఆవిడకా విషయపరిజ్ఞానం ఎలా కలిగిందో నూటకటోసారి కనుక్కోవాలి. ఆవిడ నూటొకటోసారి కూడా ఎప్పటిలాగే నవ్వేసి అంతా అమ్మదయ అంటే మాత్రం నేనేమీ చెయ్యలేను.
ఇంతకీ నిజంగానే గంగాదేవి నీటితో ఈ దీపాల్ని వెలిగించి ఉంటుందా? విశాలాక్షి కనురెప్ప వెయ్యకుండా ఎదురు చూసి ఉంటుందా? పరమశివుడు నిజంగానే కాశీనగరాన్ని పరిపాలించి ఉంటారా? అనుమానాలూ ఆలోచనల్లోనే ఎప్పుడు నిద్రపట్టిందో నాకే తెలియదు.
అధ్యాయం-6
మా పెరట్లోనూ గుడి ఆవరణలోనూ మల్లి మందారం జాజి సంపంగి మాలతి నందివర్థనం మొదలైన ఎన్నో పూలమొక్కలున్నాయి. అన్నిరకాల పూలున్నా శివలింగానికి మాత్రం తెల్ల జిల్లేడుపూలు కోసుకొచ్చి పెడతారు. విష్ణుమూర్తి విగ్రహానికి తులసి ఆకులతో మాల కడతారు. కాడలతో కలువపూలు కోసుకొస్తారు. తామరతూడు బెండులా ఉంటుంది. దాన్ని చర్మాన్ని అరంగుళం అటూ అరంగుళం ఇటూ విరుస్తూ వస్తే తామర తూడే రెండుగా విడిపోయి తామరతూడుహరంలా తయారౌతుంది. అప్పుడా తామరపూవు, తూడు హారానికి అమర్చిన పతకంలా మారిపోతుంది. ఆ హారాన్ని తీసుకెళ్ళి గడపకి కడితే దానంత అందం ఏ పూలహారానికీ రాదు. అవ్వగారుగానీ భాగీరథమ్మగారుగానీ ఇంటికీ గడపలకే తప్ప గుడికీ ఇంట్లో దేవుడి గూటికీ అలంకరణలు చెయ్యడానికి పనికిరారు. అలాగని వాళ్ళు పూజలు చేస్తామంటే కాదనేవారెవరూ లేరు. పూజకి అలంకరణలు చేయకపోవడం వారి స్వయం నియంత్రణ. అంతే. పూలు కోసుకురావడం వరకే అవ్వగారి వంతు. అలంకరణంతా భట్టుగారి వంతు.
జమునాపురంలో మొక్కలు చెట్లు పూలు పళ్ళు ఆకులు లతలు ఎక్కడెక్కడ ఉంటాయో.. ఆవులు గేదెలు మేకలూ గొర్రెలూ ఎక్కడెక్కడ మేస్తూంటాయో.. ఏ కొంటె కోణంగి ఏ కోమలాంగి వెంటపడి వేధిస్తూంటాడో.. ఏ బావిలో ఎన్ని మట్ల నీళ్ళుంటాయో.. ఏ పొలంలో ఎన్నిపుట్ల వడ్లు పండుతాయో అన్నీ మా అవ్వగారికి ఎప్పటికప్పుడు సవివరంగా తెలుస్తూంటాయి. ఎవరైనా కాస్త గట్టిగా ఊపిరి పీల్చినా పీల్చకపోయినా ఆవిడకి తెలియక తప్పదు. అదీ అవ్వగారి ప్రత్యేకత. అన్ని తెలిసినావిడకి బడిలో భూమిపూజ జరగబోతోందనే విషయం ఏ గౌడగారో మేస్టారో వచ్చి చెబితేగానీ తెలియదా?
ఆవిడకి తెలిసినా అన్నింటికీ ముందుకి రారు. తెలిసివ విషయం చెప్పరు. మనం చెబుతామా లేదా అని ఎదురు చూస్తారు. చెబితే సంతోషిస్తారు. చెప్పకపోతే బాధపడరు. మేమింతదూరం వచ్చింది ఆవిడని సంతోషపెట్టడానికే కదా? అందుకే నిద్ర లేవగానే మూకవ్వగారికి మేము బడి రిపేర్లకోసం సామాన్లు తీసుకురావడానికి శివమొగ్గ వెళుతున్నామని చెప్పాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని ఆశీర్వదించారు. కానీ నేను బడి సామాన్ల వంకన శివమొగ్గ వెళుతున్నది మా మామగారిని తీసుకురావడానికని ఆవిడకి తెలియదు. రాగానే సర్‌ప్రైజ్ చేద్దామనేది నా ఉద్దేశం. అందుకే అవ్వగారికీ విషయం చెప్పలేదు.
సీత తండ్రికి అంటే మా మామయ్యగారికి బెంగుళూరులో పెద్ద హోటలుంది. మా అత్తయ్యగారు గృహిణి. వారికి సిరిసంపదలకేమీ లోటులేదు. కానీ వారికి మా అవ్వగారంటే అంత గౌరవం లేదు. ఆవిడ చేసే పనులన్నీ అర్థం లేని పనులని భావించేవారిలో మొదటివారాయన. మొదట్లో అవ్వగారి అంతర దృష్టి గురించి చెప్పి చూశాను. కానీ కేవలం లాభనష్టాల బేరీజులతోనే కాలం గడిపేవారికి అంతరంగాలూ ఆత్మప్రబోధాలూ ఉండవు. అలాంటివారికి గుణపాఠాలే తప్ప మామూలు పాఠాలు పనికిరావు. అయినా ఆయన అవ్వగారిని గౌరవించినంతమాత్రాన ఒరిగేదీ మర్యాద ఇవ్వనంతమాత్రాన కరిగేదీ ఏదీ లేదు. అందుకే ఆయన అభిప్రాయాల్ని అంతగా పట్టించుకునేవాడిని కాదు. సీతకూడా ఈరోజు తెల్లవారుజామునే లేచి అన్నీ ఇంటిపనులూ వంటపనులూ శరవేగంతో పూర్తి చేస్తోంది. ఆ వేగంలో పడి నా బెడ్ కాఫీ మరచిపోయింది. లోపలకి వెళ్ళేలోగా అవ్వగారు కనిపించారక్కడ. దాంతో బుద్ధిమంతుడిలా వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చాను. కాఫీ అవ్వగారే ఇచ్చారు.
స్నానాదికాలు ముగించుకుని సిద్ధమై వచ్చేసరికి జీడిపప్పు కిస్‌మిస్ పళ్ళు సేమియాలూ వేసిన సగ్గుబియ్యం పాయసం చేసి పెట్టింది. పాయసం పని పట్టి బట్టలు వేసుకునేంతలో భాగీరథమ్మగారు, “మాస్టారొచ్చారు ఆత్రేయా” అని చెప్పారు. హడావిడిగా బట్టలు వేసుకుని బయటికొచ్చాను. ఆలోగా అటునుండి మేస్త్రీ అప్పణ్ణకూడా వచ్చారు. ముగ్గురం కలిసి రేవుకెళ్ళాం. తెప్పవాడికి మేము వస్తున్న విషయం ముందే చెప్పినట్లున్నారు. అందుకే అతను కూడా సిద్ధంగా ఉన్నాడు. ముగ్గురం తెప్పమీద ప్రయాణించి అవతలి గట్టుకి చేరుకున్నాం. టాక్సీ మాట్లాడుకుని రైల్వేస్టేషన్‌కి వెళుతుంటే శ్యామణ్ణ మాస్టారూ అప్పణ్ణగారూ మార్కెట్ దగ్గర దిగిపోయారు. నేను రైల్వేస్టేషన్‌కి వెళ్ళాను. దాదాపు పావుగంట ఎదురు చూడాల్సి వచ్చింది. రైలు రాగానే ఏసీ బోగీ దగ్గరకు వెళుతుంటే వారు ఎదురొచ్చారు. అత్తమామలకి సగౌరవంగా నమస్కరించాను. ఆయనా ప్రతినమస్కారం చేశారు. బాగున్నారా? అన్నారు. నేను తలూపాను. ఆ తరవాత మాటలు కరువయ్యాయి.
ఆయన స్నేహితుల పిల్లలంతా విదేశాల్లోనే స్థిరపడ్డారు. వారిలాగే నేనుకూడా అక్కడే ఉండిపోవాలనేది ఆయన కోరిక. కానీ నాకది ఎంతమాత్రం ఇష్టం లేదు. ఆయన నాకెన్నిసార్లు చెప్పినా నేను మాత్రం అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకున్నాను. ఆ విషయం నేను చెప్పకపోయినా సీత చెప్పకుండా ఉండదు. ఇప్పుడాయన నన్ను వెనక్కి రావద్దని చెప్పలేరు. అక్కడే ఉండమని బలవంత పెట్టలేరు. అయినా ఎన్నోసార్లు ఆస్తులు కొనాల్సిందిక్కడ కాదు, అక్కడ అని రకరకాలుగా చెప్పడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నేను మాత్రం ఇక్కడైనా అక్కడైనా ఆస్తులు ఎంత కూడబెట్టినా మనందరం వెళ్ళాల్సిన చోటికి మాత్రం ఏ ఆస్తులూ రావు. కనుక సమాజాన్నించి సంపాదించుకున్న ఆస్తుల్లోంచీ కొంతైనా సమాజానికి తిరిగివ్వాలి. మనం ఇస్తామో లేదో అనే అనుమానంతోనే ప్రభుత్వాలు పన్నులరూపంలో రాబట్టుకుంటాయి. ఆ టాక్సులెగ్గొట్టడానికి ప్రయత్నించేవారి కోసం పన్ను మినహాయింపులు కూడా ఇస్తాయి. ఎన్ని చేసినా లావాదేవీలు మాత్రం వైట్‌లో కంటే బ్లాక్ లోనే ఎక్కువ జరుగుతూంటాయి. ఈ విషయాలన్నీ ఆయనకి నేను చెప్పాల్సిన పనిలేదు. అన్నీ ఆయనకి తెలిసినవే. తెలిసినవారికి చెప్పడం అంటే చెవిటివాడి ముందు శంఖం ఊదడం లాంటిది. అదే అన్నీ తెలుసనుకునే మామయ్యగారికీ ఏమీ తెలియదని మనం భావించే మూకవ్వగారికీ మధ్యగల తేడా.
నాలాగే మా మామయ్యగారు కూడా మితభాషి. అందుకే మాటల్లేకుండా నడుస్తున్నాం. ఇలా మౌనంగా నడవడం అందరికీ ఇష్టముండదు. అందుకే, “ఏం అల్లుడుగారూ, బాగా చిక్కినట్లున్నారు. మా అమ్మాయి సరిగా వండి పెట్టడం లేదా ఏమిటి?” అన్నారు నవ్వుతూ.
నేనుకూడా నవ్వేస్తూ, “అలాంటిదేమీ లేదత్తయ్యగారూ, ఈమధ్య రోజూ వ్యాయామం చేసి బరువు తగ్గించుకున్నాను. అంతే. సీతవంట గురించి మీకు తెలియందేముంది? మీరొస్తున్నారని వంటపనుల్లో ఇల్లు పీకి పందిరేస్తోందక్కడ. మనం వెళ్ళేసరికి విందుభోజనం సిద్ధంగా ఉంటుంది” అన్నాను. నేనంత ధారాళంగా మాట్లాడగలనని నాక్కూడా తెలియదు. అత్తయ్యగారు మాటల్ని పేర్చడంలోనూ ఎదుటివారితో మాట్లాడించడంలోనూ దిట్ట. అలా మాటల్లోనే ముగ్గురం కారెక్కాం. స్టేషన్నుండి రేవుకీ, రేవునుండి ఊళ్ళొకీ వచ్చాం. ఇంటికి అల్లంతదూరంలోనే మమ్మల్ని గమనించి పరిగెత్తుకొచ్చింది మీరా. అత్తయ్యగారు ఎత్తుకోవదానికి చేతులు చాపారు. కానీ మీరా వచ్చి నా చెయ్యిపట్టుకుని ఎత్తుకోమని గొడవచెయ్యడం ప్రారంభించింది. దాంతో ఎత్తుకోక తప్పలేదు.
ఇదంతా చూస్తున్న మామయ్యగారు, “తనకే కాదు, పిల్లలెవరికైనా అమ్మానాన్నల తరవాతే ఎవరైనా” అన్నారు.
వెంటనే అత్తయ్యగారు, “అల్లుడుగారూ మీ మామయ్య మాట్లాడారు. ఇంక ముత్యాలేరుకోవడమే తరువాయి” అంటూ నవ్వుతుంటే నేనూ జతకలిపానుగానీ ఆవిడ వేసిన చెణుక్కి సమాధానమివ్వకుండా చిరునవ్వుతో సరిపెట్టాను. అందుకే ఆవిడ, “దొందూ దొందే” అని ముక్తాయించారు. వెంటనే మీరా కూడా దొందూ దొందే దొందూ దొందే అంటూ అమ్మమ్మగారి రాగం అందుకుంది. అప్పుడు నవ్వారు మా మామగారు. సీత ఎదురొచ్చి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చింది. స్నానానికి వేణ్ణీళ్ళు సిద్ధం చేశానని చెప్పింది. ముందు కాఫీలు తాగమంటూ ముగ్గురికీ కాఫీలు తెచ్చింది. వెంటనే మీరా, “దొందూ దొందే దొందూ దొందే” అంటూ నా చేతిలో కాఫీని లాక్కుంటూవుంటే దాన్నించీ తప్పించుకోవడానికి పడరాని పాట్లు పడుతూంటే అవ్వగారొచ్చి కాపాడారు.
అవ్వగారు పనుంది రమ్మన్నట్లు సైగ చెయ్యగానే ఆవిడని మీరాకి చూపించాను. వెంటనే అల్లరి మానేసి బుద్ధిమంతురాల్లా చేతులు కట్టుకుని నిలబడింది. అవ్వగారిని చూస్తే మీరాక్కూడా గౌరవమే.
అవ్వగారు నన్ను తీసుకెళ్ళి గుడి అరుగుమీద కూర్చోబెట్టారు. మా అత్తయ్యగారు స్నానానికి వెళ్ళారు. మామయ్యగారు మా దగ్గరకి వచ్చి అవ్వగారిని యోగక్షేమాలు విచారించాక, “సావిత్రి విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం గురించి మరోసారి ఆలోచించుకోవడం మంచిదేమో. జరిగింది మామూలు మరణం కాదు. ఆత్మహత్య. ఎంత రోగిష్టి మనిషైనా ఆత్మహత్య చేసుకుందంటే అది ఖచ్చితంగా ఇతరులు బాధపెట్టడం వల్లే జరుగుతుంది. లేకపోతే ఇన్నాళ్ళూ లేనిది ఇప్పుడే హఠాత్తుగా ఎందుకు ఇంతపని చేసుకుంటుంది? కేసుపెడితే ఈపాటికి అందరూ పోలీస్ సెల్లో ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళింటికి వెళ్ళడమే తప్పు. పైగా ఇంతజరిగింతరవాత కూడా భట్టుగారి చిన్నమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ చిన్నబ్బాయికి కట్టబెడుతున్నారంటే దాన్నెలా అర్థం చేసుకోవాలో ఎవరికీ అర్థం కాదు. తెలిసి తెలిసీ సింహం గుహలోకి ఆవుని పంపిస్తానంటే ఎలా? కేసు పెట్టకపోతే పోయారుగానీ ఆ చిన్నమ్మాయి గొంతు కొయ్యకండి” అన్నారు.
ఆయనంత నిక్కచ్చిగా సూటిగా ఆరోపణలకి దిగుతారని నేను ఊహించలేదు. బహుశా మా అవ్వగారు కూడా ఊహించి వుండరు. ఊహించని పరీక్షలెదురైనప్పుడు సమాధానం రాయలేక పెన్ను కోసమో పేపర్ల కోసమో వెతుక్కుంటున్నట్లు నటిస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అవ్వగారు అందరిలాంటి మనిషి కాదు. అందుకే ఆవిడ చిరునవ్వుతో, “మీకు సావిత్రిపట్లగల సానుభూతి గొప్పది. సాటి మనిషి అంతపని చేసుకున్నప్పుడు మీవంటి సహృదయులకి ఆమాత్రం సహానుభూతి కలగడం సామాన్యం. కానీ అక్కడి పరిస్థితుల గురించి ఇక్కడున్న మనం ఎలా చెప్పగలం? ఎవరో చెప్పిన మాటల్ని పట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సావిత్రిది ఆత్మహత్యనేమాట ఎంత నిజమో తను శారీరక బాధలని అనుభవించలేకే లోకంలోంచీ వెళ్ళిపోయిందనేమాటా అంతే నిజం. సావిత్రికా ఇంట్లో ఎలాంటి సమస్యలూ రాలేదు. వచ్చిన సమస్యలన్నీ ఆరోగ్య సమస్యలే. లేచి కూర్చోలేని భార్య ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు భర్తకి రెండో పెళ్ళి చెయ్యకుండా ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకున్నారు. అది వారి సహృదయత. మనం దానిని గుర్తించి గౌరవించాలి. కాబట్టీ మీరీ విషయం గురించి ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. అయినా ఒకరిని వేలెత్తి చూపించేప్పుడు మూడువేళ్ళు మనవైపే చూపిస్తాయని మర్చిపోకూడదు” అంటుంటే ఆయన నొసటన చెమటలు పట్టాయి. అవ్వగారు మాట్లాడుతున్నది తనతో కాదన్నట్లుగా బయటికి చూస్తూ కూర్చున్నారు. కాసేపటి తరువాత మెల్లగా లేచి వెళ్ళిపోయారు.
అవ్వగారు ఎంతో సున్నితమనస్కురాలిగా కనిపిస్తారు. కానీ అవసరమైనప్పుడు అంతకంటే ఎక్కువ కఠినంగా కూడా ప్రవర్తించగలరు. కటువుగా మాట్లాడగలరు. అలా తన స్వభావానికి విరుద్ధంగా ఏదైనా చెయ్యక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు మరోమాట లేకుండా కూర్చున్నచోటే ధ్యానంలోకి వెళ్ళిపోతారు.
నేను అవ్వగారి పక్కనే ఉన్నా ఒంటరిగా మిగిలిపోయాను. దాంతో ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి. అప్పన్న, మాస్టారు బడికి వచ్చుంటారనే ఉద్దేశంతో బడివైపుకి బయలుదేరాను. నా అదృష్టం కొద్దీ ఇద్దరూ అక్కడే ఉన్నారు. కట్టడానికి కావలసిన ఇనుము, ఇటుకలు, ఇసుక, సిమెంటు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ముందర ఖాళీస్థలంలో రకరకాల పిచ్చిమొక్కలు మొలిచాయి. వాటిని చూపిస్తూ “ఇక్కడ ఉద్యానవనం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది?” అన్నాను..
మాస్టారు సంతోషంగా చూశారు. “చాలా మంచి ఆలోచన. పనిలో పనిగా ఇందులోనే జారుడు బండ ఉయ్యాలబల్ల, ఏర్పాటు చేస్తే పిల్లలు హాయిగా ఆడుకుంటారు. మన రామన్నకి చెబితే జేసీబీ పంపిస్తాడు. ఒక్కపూటలో మొక్కలన్నీ పీకేసి నేలంతా చదును చేస్తుంది” అన్నారు. నేను వెంటనే శివమొగ్గలో ఉండే మా మిత్రుడు ప్రదీప్‌కి ఫోన్ చేశాను. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేప్పుడు జారుడుబండ, ఉయ్యాలబల్ల, బస్కీల దండీలూ తీసుకురమ్మని చెప్పాను. ఆ తరువాత పక్కూరి జనార్దనస్వామికి ఫోన్ చేసి శంకుస్థాపన కార్యక్రమం జరిపించాల్సిందిగా కోరాను. ఆయన అంగీకరించారు. ఆ వెంటనే కావలసిన వస్తువుల పట్టీని మెసేజ్ చేశారు.
మేస్టారి ముఖంలో జీవకళ ఉట్టిపడుతోంది. ఉత్సాహం ఉరకలేస్తోంది. ఎన్నోయేళ్ళుగా జరగని పని ఇప్పుడు జరగబోతూండటమే ఆ ఆనందానికి కారణం. ఆయన కావడానికి అంత పెద్దవారైనా మనసు మాత్రం పసిపిల్లాడిలాగే ఉంటుంది. పిల్లలకి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులందరూ ఆయనలా ఉండరు. ఉండలేరు. ఎందుకంటే పిల్లల్లో పిల్లల్లా కలిసిపోవడం పెద్దవాళ్ళందరికీ సాధ్యం కాదు. కేవలం మనసులో బాల్యాన్ని నింపుకున్నవారికి మాత్రమే సాధ్యం. అంటే మా మాస్టారులాంటివారికి మాత్రమే సాధ్యం.
మా చిన్నప్పుడు నాకు చదువుమీద అంత ఆసక్తి ఉండేది కాదు. ఒకసారి పాఠం నేర్చుకోలేదని కబెత్తంతో వీపు చిట్లగొట్టారు. ఆయన ఆపని చేస్తారని ముందే ఊహించి చొక్కాలోపల బనీను బదులుగా బాలభటసంఘం కాకీ చొక్కా వేసుకొచ్చాను కాబట్టీ బతికిపోయాను. లేకపోతే వీపంతా వాతలు తేలి ఉండేది. ఈ తెలివేదో మీద పాఠంమీద పెట్టుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటాను. అప్పట్లో మాత్రం మాస్టారు కొట్టిన దెబ్బలకి మరునాడు బడి ఎగ్గొట్టాను. ఆ మర్నాడు ఆయనే ఇంటికి వచ్చారు. నాకిష్టమైన నూపప్పు ఉండలు, చెగోడీలు తెచ్చారు. మా విద్యార్థుల్లో ఎవరికి ఏది ఇష్టమో తెలిసింది వాళ్ళ తల్లులకి మాత్రమే అనుకుంటాము. కానీ మా మాస్టారిక్కూడా తెలుసు. అందుకే నాకిష్టమైనవి తీసుకొచ్చి నన్ను మెప్పించి బడికి వెళ్ళేందుకు ఒప్పించి తనవెంట బడికి తీసుకువెళ్ళారు.
కొంతమంది ఉపాధ్యాయుల్ని చూస్తే తల్లీతండ్రీ గురువూ దైవంతో సమానమని ఎందుకంటారో అర్థమౌతుంది. కానీ మా మాస్టారిని చూశాక తల్లి, తండ్రి ఇద్దరి బాధ్యతానెరవేర్చేవాడే గురువు అనే కొత్త నిర్వచనం పుట్టింది. మా ఊళ్ళో చాలామంది ఫీజులు కట్టలేక కాలేజీల్లో చేర్చేవాళ్ళు కాదు. వ్యవసాయానికో కూలికో పంపించేవారు. అలాంటివారిలో కొందరు తెలివైన విద్యార్థులు కూడా ఉండేవారు. తెలివైన విద్యార్థుల చదువు అలా అర్ధాంతరంగా ఆగిపోవడం ఆయనకి నచ్చేది కాదు అందుకే ఆయన విద్యార్థులకి కాలేజీ ఫీజులు కట్టేవారు. అలా ఫీజులు కట్టి చదివించినవారిలో చాలా మంది ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. అయినాసరే వాళ్ళెవరూ పాఠశాల అభివృద్ధికి ఏమాత్రం సహాయం చెయ్యలేదని ఆయనకి మనసులో కొరతగా ఉండేది. కానీ అడక్కుండా అమ్మైనా పెట్టదు. ఇంక పిల్లలెలా పెడతారు?
మనుషులు రానురానూ చెడిపోతున్నట్లుగా కనిపించేమాట వాస్తవమే కావచ్చు. కానీ అందరూ చెడిపోవడంలేదు. ఇతరులకు ఏదోవిధంగా సహాయం చేసే అవకాశం లభిస్తే సహకరించడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. కానీ పూనుకునే చొరవ ఉండేవాళ్ళే లేరు. ఎవరైనా పూనుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే వారికి సహకరించడానికి చాలామందే ఉన్నారు. మనుషులు చెడిపోతున్నారని బాధపడుతూ కూర్చోవడం కంటే బాగుపడే అవకాశం ఇవ్వడానికి ఏదో ఒక పనికి పూనుకునే ప్రతి ఒక్కడూ ఉత్తమ విద్యార్థే. ఈ స్కూల్లో చదివినంతకాలం ఉత్త విద్యార్థిగా ఉన్న నేను, పై చదువులు చదివి విదేశాలకు వెళ్ళి అంతో ఇంతో సంపాదించుకొచ్చాక మళ్ళీ ఈ పాఠశాలలో ఉత్తమ పూర్వవిద్యార్థిగా మారిపోయాను. అందుకు అవకాశం ఇచ్చినందుకు మేస్టారికి నేనెప్పటికీ కృతజ్ఞుడినై ఉండాలి. అందుకే బడికి ఐదు గదులు, నాలుగు బాలుర మరుగుదొడ్లు రెండు బాలికల మరుగుదొడ్లు కట్టించాలని నిర్ణయించుకున్నాను. మాస్టారికోసం ఒక గది కట్టించాలనేది నా కోరిక. కానీ మాస్టారు ఒప్పుకోలేదు.
అక్కడ మాటలతోనూ, పాత జ్ఞాపకాలతోనూ, దారిలో వస్తూపోతూ ఉండేవారి పలకరింపులతోనూ కాలం ఎంత వేగంగా గడిచిపోయిందో నాకే తెలియదు. చూస్తూండగానే పొద్దు పడమటికి దిగింది. ఇంకా అక్కడే ఉంటే ఇంట్లో సీత కారాలూ మిరియాలూ నూరే అవకాశం ఉంది. భార్యల కోపానికి గురవ్వడం భర్తల ఆరోగ్యానికి హానికరం. అందుకే మాస్టారికి వీడ్కోలు చెప్పి ఇంటికి బయలుదేరాను.
ఇంటికి వెళ్ళేసరికి మా అత్తయ్యగారు మీరాతో పులిజూదం ఆడుతున్నారు. మీరా పోత పోస్తుంటే ఆవిడే పావుల్ని కదిలిస్తున్నారు. పిల్లలకి ఎన్ని పావుల్ని చంపితే అంత ఆనందం. ఆ ఆనందాన్ని పావుల్ని బతికించడం మీదకి మళ్ళించాలి. అందుకే నేను వెళ్ళి ఆటలో కూర్చున్నాను. అత్తయ్యగారు చంపిన పావులన్నింటినీ నేను బతికించడం మొదలుపెట్టాను. ఆవిడవన్నీ పట్నం ఎత్తులైతే నావి ఏకంగా సీమ ఎత్తులు. ఒక్కొక్క పావునీ బతికించి గళ్ళలో కూర్చోబెడుతూంటే మీరా చప్పట్లతో ఆనందాన్ని ప్రకటిస్తోంది. నాకా పులిజూదం అంత బాగా వచ్చని మా అత్తయ్యగారికి తెలియదు. అందుకే మొదట్లో మామూలుగా తీసుకున్నా క్రమంగా ఆవిడలో కూడా పట్టుదల పెరగసాగింది. ఆ పట్టులో పడి సీత ఇచ్చిన కాఫీ మాట మర్చిపోయారు. నేను కాఫీ తాగడం పూర్తి చేసినా ఆవిడ గ్లాసు అలాగే ఉంది. ఇంతవరకూ తన పోత తనే పోసుకున్న మీరా ఇప్పుడు ఇద్దరిపోతలూ తనే పోస్తోంది. మేమిద్దరం పావులని కదిలించడం ఎత్తులు వెయ్యడంలోనే మునిగిపోయాం. ఈలోగా గవ్వలు దూరంగా పడ్డంతో వాటి లాక్కునే ప్రయత్నంలో మీరా చెయ్యి తగిలి గ్లాసు కిందపడింది. కాఫీ ఒలికిపోయింది. పులిజూదం గళ్ళన్నీ చెరిగిపోయాయి. ముందే ఓడిపోతున్నాననే ఉక్రోషం. దానికితోడు గళ్ళమీద కాఫీ పడ్డంతో మీరావైపు కొరకొరా చూస్తూ కాఫీగ్లాసు తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయారు అత్తయ్య. తను కావాలని చెయ్యకపోయినా పొరపాటున చెయ్యితగిలినా తప్పు తప్పే. అందుకే తన తప్పు తెలుసుకున్న మీరా వెళ్ళి చీపురు కట్ట తెచ్చింది. నేనా చీపురు కట్ట పక్కన పెట్టి పాత గుడ్డ తెచ్చి దాన్ని తుడుస్తుంటే మీరా నాకు సహాయం సహాయం చేసింది. నేను వంకరటింకరగా తుడుస్తుంటే తను అడ్డదిడ్డంగా గుడ్డని పట్టుకులాగుతోంది. ఈలోగా అత్తయ్యగారొచ్చి నా చేతిలోని గుడ్డని లాక్కుని మా ఇద్దరినీ బయటకు తరిమేశారు. మేం పులిజూదం మానేసి బయటికొచ్చాం. మీరా మనసంతా ఆటమీదే ఉంది. అందుకే నన్ను ఆడుకుందాం రమ్మన్ని లాగుతోంది. ఏం ఆడాలో నాకు అర్థం కాలేదు.
ఔట్ డోర్ గేమ్స్ లో నాకు వచ్చింది క్రికెట్టొకటే. కానీ అవ్వగారింట్లో బాలూ బ్యాటూ లేవు. కానీపెరట్లోని వెదురు కర్రల్ని చూడగానే గూటీబిళ్ళ గుర్తొచ్చింది. వెంటనే వెళ్ళి కత్తి తీసుకొచ్చాను. బిళ్ళా కర్రా చెక్కాను. ఇద్దరం గూటీబిళ్ళమొదలెట్టాం. మామయ్యగారికింకా బామ్మగారి మాటలమీద కోపం పోయినట్లు లేదు. అందుకే ఇంకా పరిసరాల్ని పట్టించుకోకుండా పుస్తకంలో దూరిపోయారు.
పుస్తకంలోని గొప్పదనం అదే. ఆ పుస్తకంలో తలదూర్చేంతవరకూ పుస్తకం మన చేతుల్లో ఉంటుంది. దాన్ని చదువుతున్నకొద్దీ మనం పుస్తకం చేతుల్లోకి వెళిపోతాం. పుస్తకానికి లొంగిపోయినా ఆయన ముఖం మాత్రం ధుమధుమలాడూతూనే ఉంది.
మీరాకి గూటీలాఠీని సరిగ్గా పట్టుకోవడం రాలేదు. దానితో బిళ్ళని కొట్టే చాకచక్యం రావాలంటే తనింకా చాలా పెద్దవ్వాలి. పిల్లల దృష్టిలో పిల్లలంత పెద్దవాళ్ళెవరూ ఉండదు. అందుకే బిళ్ళ వెయ్యమంటే వినకుండా కర్రతీసుకుని కొట్టడానికి తయారైంది. తన బలాన్నంతా ఉపయోగించి నేను వేసిన బిళ్ళని కొట్టింది. తను ఉపయోగించిన బలానికి కర్ర బిళ్ళకి తగల్లేదు సరికదా కర్రే బిళ్ళగా మారి తన చేతుల్లోంచి పట్టుజారి తిన్నగా వెళ్ళి మామ్మయ్యగారి తలకి తగిలింది. దెబ్బతో ఆయన పుస్తకంలోంచి తిన్నగా భూమ్మీదకొచ్చేశారు. ఆ కర్రవిసిరిందెవరా అని కోపంగా చూశారు.
అక్కడ బిక్కమొగం వేసుకుని చూస్తున్న కనిపించింది మీరా. దాంతో తనని ఏమీ అనలేరు. అప్పటికే పుస్తకం పక్కన పడేసి కుర్చీలోంచి విసురుగా లేచారు. అందుకే అదే విసురులో తిన్నగా మీరా దగ్గరకెళ్ళి తనని ఎత్తుకుని బుగ్గమీద ముద్దుపెట్టుకోక తప్పలేదు. పెద్దల కోపతాపాలు తగ్గించడానికి పిల్లలే దివ్యౌషథం. ఒక్కముద్దుతో ఆయన ధుమధుమలన్నీ గాలికెగిరిపోయాయి.
ఆ రోజు రాత్రి భోజనాలప్పుడు సీతా మీరాల్ని తన వెంట పంపించమని అడిగారు అత్తయ్యగారు. ఆవిడ ఆ మాట అడగ్గానే నాకు మా అవ్వగారు గుర్తొచ్చారు. ఆవిడని పార్వతీపురానికి తీసుకువెళ్ళి అక్కడి పాడుపడిన దేవాలయాన్ని చూపించాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. కానీ సమయం కలిసిరాలేదు. ఒకవేళ సీత మీరాల్ని కూడా తీసుకువెళితే వాళ్ళు అవ్వగారినీ నన్నూ మాట్లాడుకోనివ్వరు. వాళ్ళిద్దరూ లేనప్పుడు మేమిద్దరమే వెళ్ళడం మంచిదనేది నా అభిప్రాయం. నేను కోరుకున్నదే అత్తగారు అడిగారు. అందుకే వాళ్ళని పంపడానికి నేను వెంటనే ఒప్పుకున్నాను. కానీ ఎప్పుడు పంపాలనే విషయమ్మీద మాత్రం స్పష్టత రాలేదు. అందుకే మూకవ్వగారితో మాట్లాడి చెబుతానన్నాను.
(ఇంకా ఉంది)
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి తెలుగు రచయిత, అనువాదకులు. ‘వలస దేవర’, ‘జంగమదేవర’, ‘అంతర్యామి’, ‘సాక్షాత్కారం’ వీరి నవలలు. ‘ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్’, ‘ఈ కథకి శిల్పం లేదు’ వీరి కథాసంపుటాలు. ప్రఖ్యాత తెలుగు కవుల సంపుటాలను కన్నడంలోకి అనువదించారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార నాటకం ‘గుళ్ళకాయజ్జి’, కేంద్ర సాహిత్య అకాడెమీ బాల సాహిత్య పురస్కారం పొందిన బోళువారు మహమ్మద్ కుణ్హి పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. వీరి నవలలకు, కథాసంపుటాలకు పలు పురస్కారాలు లభించాయి.
