[ధనంజయ లక్ష్మీ రామకృష్ణగారు వ్రాసిన ‘మత్తె మూకజ్జి’ అనే కన్నడ నవలని ‘అవ్వగారు’ పేరుతో అనువదించి ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.]
[సొంతూరికి వచ్చిన ఆనందంలో ఆత్రేయకి అక్కడ అన్నీ అందంగా కనబడతాయి. సూర్యోదయం, ప్రకృతి మునుపటి కంటే అందంగా ఉన్నట్టు బావిస్తాడు. శ్యామన్న మాస్టారు వచ్చి, బడి భవనానికి మరమ్మత్తులు చేయాల్సిన అవసరం గురించి ఆత్రేయతో మాట్లాడుతారు. ఆత్రేయ, శ్యామన్నగారు కలిసి మేస్త్రీ దగ్గరకు వెళ్తారు. బడి భవనానికి మరమత్తులు చేసి ఉపయోగం లేదని, కొత్త భవనం కట్టించాలని చెప్తాడు మేస్త్రీ. అందుకయ్యే ఖర్చును సుమారుగా అంచనావేస్తారు. ఊరి పెద్దమనిషి గౌడగారి వద్దకు వెళ్ళి వివరాలు చెప్తారు. ఆయన స్పష్టమైన హామీ ఇవ్వడు. ఊర్లోకి మరికొందరు పెద్దలు ఎంతో కొంత ఇస్తామంటారు. చివరికి గౌడగారు కూడా ఒప్పుకుని, పంచాయితీలో ఎన్ని నిధులుంటే, తానూ అంత మొత్తాన్ని ఇస్తానని చెప్తాడు. బడి భవనం ముందర చిన్న ఉద్యానవనం ఏర్పాటు చేయాలని తలుస్తారు. ఆ రాత్రి, తను తీసుకువచ్చిన దీపాలను తెచ్చి అవ్వగారికిస్తాడు ఆత్రేయ. ఆ దీపాల వెనుక ఉన్న చరిత్రని చెప్తారావిడ. అబ్బురపడతాడు ఆత్రేయ. మర్నాడు ఉదయం అవ్వగారికి చెప్పి బడి సామాన్లు కొనడానికి శివమొగ్గ బయల్దేరుతారు. వచ్చేటప్పుడు తన మామగారిని ఊరికి తీసుకురావాలని అనుకుంటాడు ఆత్రేయ. శ్యామన్న గారు, అప్పణ్ణ గారూ మార్కెట్ దగ్గర ఆగితే, ఆత్రేయ రైల్వే స్టేషన్‌కి వెళ్ళి అత్తమామలని స్వాగతిస్తాడు. ముగ్గురూ మాట్లాడుకుటూ ఇల్లు చేరుతారు. కాఫీలు తాగాకా, ఆత్రేయ మామగారు – భార్గవి పెళ్ళి విషయంలో అవ్వగారు తీసుకున్న నిర్ణయం సరికాదని అంటారు. దానికి సరైన పద్ధతిలో జవాబిస్తారు అవ్వగారు. ఇక ఆయనేమీ మాట్లాడకుంటా అక్కడ్నించి వెళ్ళిపోతారు. ఆత్రేయ బడికి వెళ్ళి మాస్టారుగారిని కలిసి ఉద్యానవనం గురించి ఎక్కడ ఉంటే బాగుంటుందో నిర్ణయించి, అందులో జారుడుబల్ల పెట్టిద్దామని అంటాడు. మిత్రుడు ప్రదీప్‌కి ఫోన్ చేసి జారుడుబండ, ఉయ్యాలబల్ల, బస్కీల దండీలూ తీసుకురమ్మని చెప్తాడు. పక్క ఊరి జనార్దన స్వామికి ఫోన్ చేసి శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతాడు ఆత్రేయ. సీత ఫోన్ చేసేసరికి ఇంటికి బయల్దేరి వెళ్తాడు ఆత్రేయ. రాత్రి భోం చేస్తుంటే, సీతనీ, మీరాని తమ వెంట ఊరికి తీసుకువెళ్తామని ఆత్రేయ అత్తగారు, అడుగుతుంది. అవ్వగారిని అడిగి చెప్తానంటాడు. – ఇక చదవండి.]
అధ్యాయం-7
మా మూకవ్వగారు పరుషంగా ఏమీ మాట్లాడలేదు. అయినా మామయ్యగారు ఎందుకంతగా ముఖం ముడుచుకోవలసి వచ్చింది? సాయంత్రం మీరా తగ్గించేంతవరకూ ఆ కోపం ఎందుకు కొనసాగింది? ఏదో వివాదాస్పదమైన విషయమే ఉంటుంది. అదేమిటో తెలుసుకోవాలన్ని కుతూహలమైతే కలిగిందిగానీ తెలుసుకోవలసినంత అవసరం ఏమీ లేదని కూడా అనిపించింది. అందుకే ఆ విషయం అక్కడితో వదిలేశాను ఈలోగా బడి గుర్తొచ్చింది. జారుడుబండా ఉయ్యాల బల్లా గుర్తొచ్చాయి. దాంతో ప్రదీప్‌కి ఫోన్ చేసి వాటి విషయం మరోసారి గుర్తు చేశాను.
ప్రదీపొస్తే మాట్లాడాల్సిన విషయాల్లో ముఖ్యమైనది అవ్వగారి దీపాల విశ్లేషణ. ఆవిడ దీపాల గురించి చెప్పిన చరిత్రంతా ప్రదీప్‌కి చెప్పాలి. అతనేం చెబుతాడో వినాలి. అతను చెప్పే చరిత్రకీ అవ్వగారు చెప్పిన విషయాలకీ పొంతన కుదురుతుందో లేదో చూడాలి. మనం మన పని హడావిడిలో ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యం కావు. అందుకే వీలైతే శంకుస్థాపన తరవాత ఒక రోజు ఇక్కడే ఉండేలా రమ్మని చెప్పాను. తను సరే అన్నాడు. అతను ఎప్పుడు వస్తాడో కనుక్కుని ఆనాటికి సీతనీ మీరానీ మామయ్యగారింటికి పంపాలి. అంతకంటే ముందు బ్యాంక్‌కి వెళ్ళి డబ్బు డ్రాచేసుకుని రావాలి ఎందుకైనా మంచిదని బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాను. ఉన్నడబ్బు నేను చెయ్యాల్సిన పనులకి సరిపోతుంది.
ఇన్ని పనులు చేసినా బెడ్ కాఫీ మాత్రం రాలేదు. బహుశా సీత ఆపనిలోనే ఉండివుంటుందనుకోగానే గాజుల గలగల వినిపించింది. ఫిల్టర్ కాఫీ కంటే సీత క్రమశిక్షణకి రుచెక్కువ. అందుకే ఇలా తలుచుకోగానే బెడ్ కాఫీతో ప్రత్యక్షమైపోతుంది.
కుడిచేత్తో కాఫీ కప్పు అందుకుని ఎడం చేత్తో తనని దగ్గరకి లాక్కున్నాను. దగ్గరకొచ్చినట్లే వచ్చి దూరంగా జరిగి ఛీ కంపు అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఎవరి నోటికంపు వారికి తెలియకుండా గొప్ప ఏర్పాటు చేసిందీ ప్రకృతి అనుకుంటూ కాఫీతాగడం మొదలుపెట్టాను. అంతలోనే మామయ్యగారు అటువైపొచ్చారు. నన్ను చూసి త్వరగా రెడీ అవ్వండల్లుడుగారూ అలా కాసేపు వాకింగ్‌కి వెళ్ళొద్దాం అన్నారు.
నేను రెడీ అయ్యేసరికే ఆయన షూస్ వేసుకుని సిద్ధంగా ఉన్నారు. నేను చెప్పులు కూడా లేకుండా ఉత్తకాళ్ళతోనే బయలుదేరాను.
ఇద్దరం నడక ప్రారంభించాం. తూర్పున కొబ్బరిచెట్ల వెనుక ఆకాశం ఎర్రబారుతోంది. సూర్యుడికి మేలుకొలుపు పాడటానికా అన్నట్లు కాకులు గూళ్ళలోంచి బయటికి వచ్చి కాకారవాలతో కర్ణకఠోరంగా కచ్చేరీ ప్రారంభించాయి. దాంతో ఏదో చెప్పబోయిన మామయ్యగారు మారు మాట్లాడకుండా కాకుల్ని చూసి నవ్వుకుంటూ ముందుకు నడిచారు. నేను నిశ్శబ్దంగా అనుసరించాను. ఊరు దాటుతున్నకొద్దీ కాకిగోల తగ్గింది. అడపాదడపా ఆవుల అంబారవాలూ ఉదయిస్తున్న సూర్యుడూ కూడబలుక్కున్నట్లుగా మాయమైపోతున్న చుక్కలూ చల్లదనాన్నిస్తూ వీస్తున్న పిల్లగాలులతో వాతావరనం ఆహ్లాదకరంగా ఉంది. ఉన్నట్లుండి మామయ్యగారు, “ఆత్రేయా నీకు కొన్ని విషయాలు తెలియవు. వాటిగురించి తెలుసుకుంటే మంచిది. అవి నాకు సంబంధించినవి. కాబట్టీ నాద్వారా తెలిస్తే ఇంకా మంచిది.” అన్నారు.
ఆయన ఏదో పెద్ద విషయమే చెప్పబోతున్నట్లున్నారు. అందుకే ఇంత బలమైన ఉపోద్ఘాతం అనుకుంటూ చెప్పమన్నట్లు తలూపాను.
మామయ్యగారు నడక కొనసాగిస్తూ, “ఈ విషయం ఎవరికీ చెప్పకుండా నాలోనే రహస్యంగా దాచుకొవాలనుకున్నాను. కానీ కొన్ని రహస్యాలు మనం చెప్పకపోయినా వాటంతట అవే తెలిసిపోతాయి. నిన్న అవ్వగారన్నమాటలు విన్నాక నీక్కూడా నా గురించి అనుమానమో ఆవిడ మాటల పట్ల కుతూహలమో కలిగి ఉంటుంది” అన్నారు.
ఆయన అనుమానం ఏమిటో నాకు అర్థమైంది. అందుకే, “చెప్పకూడదనుకున్న విషయాల్ని చెప్పకపోవడమే మంచిది. అవ్వ ఏదో అనుమానం కలిగేలా మాట్లాడారుకదాఅని సీత దగ్గర కూపీల్లాగే ప్రయత్నాలు చెయ్యను” అన్నాను.
ఆయన నవ్వేశారు. ఆ తరువాత మెల్లగా చెప్పడం ఆరంభించారు, “కొన్ని విషయాలు మనసులో పెట్టుకున్నకొద్దీ మనల్ని లోలోపలే కుళ్ళిపోయేలా చేస్తాయి. అలాగని వాటిని అరకొరగా చెప్పి వదిలేస్తే కొత్త అనుమానాలనీ సమస్యలనీ కొని తెస్తాయి. అందుకే కాస్త తీరిగ్గా మాట్లాడుకోవచ్చనే ఇలా తీసుకొచ్చాను. మేము బెంగుళూరు రావడానికి ముందు కొడగులో ఉండేవాళ్ళం. అక్కడ తపాలా కార్యాలయంలో నాన్నగారు పోస్టుమాస్టర్‌గా ఉండేవారు. నాకు చదువు అంతగా ఒంటబట్టలేదు. అందుకే కొడగులోని ఒక పెద్ద హోటల్లో మేనేజర్‌గా చేరాను. నమ్మకస్తుడిగా పేరు సంపాదించుకున్నాను. మా హోటల్ ఓనర్‌కి పెద్ద కాఫీ ఎస్టేటుంది. ఆ ఎస్టేటులో అన్ని సౌకర్యాలూ ఉండే గెస్ట్ హౌసుండేది. అందులో ఊరి పెద్దలందరూ కాలక్షేపానికి పేకాట ఆడేవాళ్ళు. పేకాట ఆడుకునేప్పుడు కాస్త ఉత్సాహంగా ఉండటానికి మద్యం సరఫరా అయ్యేది. మద్యం బాగా తలకెక్కినవారికి ఒంటిస్పృహే కాదు ఇంటిసృహ కూడా ఉండదు. అందుకే నేను అప్పుడప్పుడూ వాళ్ళని ఇంటిదగ్గర దిగబెట్టి వస్తూండేవాడిని. దాంతో నాకు చాలామంది పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఈలోగా హోటల్ యజమాని అనారోగ్యానికి గురయ్యారు. ఓనర్ అనారోగ్యమే వర్కర్స్‌కి ఆరోగ్యం.
నమ్మకస్తుడిని కాబట్టీ మేనేజ్‌మెంట్ పూర్తిగా నా చేతుల్లోకే వచ్చింది. టౌన్‌లో హోటల్నీ ఎస్టేట్‌లో గెస్ట్ హౌస్‌నీ చూసుకోవడంలో నాకు క్షణం తీరికుండేది కాదు. బాధ్యతలతోబాటు జీతం కూడా పెరిగింది. ఈలోగా మా నియోజకవర్గం ఎమ్మెల్యేకి మంత్రి పదవి వచ్చింది. ఆయన పేకాటకీ మద్యానికీ బానిస కాదుగానీ అమ్మాయిల పిచ్చెక్కువ.. దాంతో ఎస్టేటు క్రమంగా వేశ్యావాటికగా మారిపోయింది. ఈలోగా మా యజమానికి మాట పడిపోయింది. ఆయన భార్యకి భర్త మాటలతో పనిలేదు. ఇంటికొచ్చే మూటలతోనే పని. ఆవిడకి క్రమం తప్పకుండా రోజూ లెక్కలు చెబితే చాలు. అంతో ఇంతో లాభం చూపిస్తే చాలు. నిజానికి వ్యసనాలన్నింటినీ మించిన మహావ్యసనం పేరు సంపాదన. వారికి ఇద్దరు కూతుళ్ళు ఇద్దరూ స్థితిమంతులే. కాబట్టీ ఎలాంటి బాదరబందీ లేకుండా ఎవరింట్లోవారు హాయిగా గడుపుతున్నారు. దాంతో ఆ ఇంటికి నేనే పెద్ద దిక్కయ్యాను. అలాంటి సమయంలో మంత్రిగారిని కట్టడిచేసేంత ధైర్యం నాకు లేకపోయింది.. అందుకే ఆయన గెస్ట్ హౌస్‌లో ఏం చేసినా పట్టించుకునేవాడిని కాదు. ఆ విషయాన్ని మా ఓనర్ ఇంట్లో తెలియనిచ్చేవాడిని కాను.” అంటూ నా ముఖంలోకి చూశారు మామయ్య. ఆయన అనుమానం ఏమిటో నాకు తెలుసు. సంస్కారవంతులైనవారికి అలాంటి వ్యవహారాల గురించి వినడం కూడా ఇష్టం ఉండదు. కానీ నేను విదేశాలలో చూసిన దిగజారుడుతనంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ విషయం ఆయనకి కూడా తెలుసు. అయినా నా ముఖంంలోని భావాలని చదవడానికి ప్రయత్నించారు. నేను విదేశాలలో నేర్చుకున్న వ్యావహారిక విద్యల్లో మొదటిది మన ముఖంలోని భావాలను ఎదుటివారికి తెలియకుండా జాగ్రత్తపడటం. ఆ విషయం తెలియని మామయ్యగారు చెప్పడం కొనసాగించారు.
“కాలం గడుస్తున్నకొద్దీ హోటల్ వ్యాపారంలో లాభం పెరగడం మొదలైంది. అంతకాలం నీతీ నిజాయితీలనే నమ్ముకుని బతుకుతూ వచ్చిన నాలో కొద్దికొద్దిగా డబ్బాశ కలగసాగింది. ఆశ పెరుగుతున్నకొద్దీ ఆశయాలు ఆదర్శాలూ కరిగిపోవడం మొదలౌతుంది. అప్పటికి నా వయసింకా ఇరవై నాలుగేళ్ళే. ఆ వయసులో దేని ధ్యాస పడితే దాన్నే సాధించుకుంటూ వెళ్ళిపోతాం. ఎస్టేటులో ఒకరికి తెలియకుండా ఒకరు చాటుమాటు వ్యవహారాలు సాగిస్తూ ఉండేవారు. వారి రహస్యాలని కాపాడినందుకు ప్రతిఫలంగా కొందరు డబ్బిస్తే కొందరు ముద్దు ముచ్చటలు తీర్చడం అలవాటు చేశారు. అసలీ భూమిమీద ఎవరైనా ఏదైనా రహస్యాన్ని దాయగలిగారా? లేదు. కానీ ఎవరికివారే కళ్ళు మూసుకుని పాలుతాగే పిల్లుల్లా ప్రవర్తిస్తారు. నేనూ నా రహస్యం ఎవరికీ తెలియదనుకున్నానుగానీ మా నాన్నగారికి తెలిసిపోయింది. ఆయన మరో ఆలోచన లేకుండా నాకు వివాహం చేశారు. అప్పటికి మీ అత్తయ్య వయసు పదహారేళ్ళు. ఏమీ తెలియని అమాయకురాలు. అమాయకుల అమాయకత్వమే మోసగాళ్ళకి గొప్ప వరం. మీ అత్తయ్య రావడంతో బయటి తిరుగుళ్ళు మానేశానుగానీ పేకాట మాత్రం మానలేకపోయాను” అన్నంతవరకూ చెప్పి ఏదో సంకోచిస్తున్నట్లుగా కాస్త విరామం తీసుకున్నారు.
నాకో చిన్న అనుమానం వచ్చింది. అందుకే, “మీ పేకాట విషయం ఇంట్లో తెలియకుండా ఎలా కాపాడుకున్నారు?” అని అడిగాను.
ఆయన నవ్వుతూ, “నేనెంత కాపాడుకున్నా నాన్నగారికి తెలిసిపోయింది. ఆయనకి నాకంటే మీ అత్తయ్యగారంటేనే ఎక్కువ ప్రేమ అభిమానం. అందుకే నేను తనకి అన్యాయం చెయ్యడం ఆయనకి నచ్చలేదు. ఈలోగా ఆయన రిటైర్మెంట్ దగ్గరపడింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం తీసుకుని కొడగుకీ కోణంగితనానికీ టాటాచెప్పి బెంగుళూరు తీసుకొచ్చారు.
బెంగుళూరులో చిన్న హోటల్ ఆరంభించాను. వ్యసనాలకు స్వస్తి చెప్పి వ్యాపారంమీద దృష్టిపెట్టాను. నా గతానుభవాలన్నీ ఇక్కడ బాగా పనికి వచ్చాయి. క్రమంగా వ్యాపారం అభివృద్ధి చెందింది. ఈలోగా పాత మిత్రులు ఒక్కొక్క్కరే రావడం మొదలైంది. వాళ్ళవల్ల నష్టపోకుండా నన్నూ నా వ్యాపారాన్నీ కాపాడుకున్నాను. కానీ వ్యసనాలనుండి మాత్రం నన్నునేను కాపాడుకోలేకపోయాను. దానిగురించే మీ అవ్వగారు అలా అన్యాపదేశంగా మాట్లాడారు. నన్ను నేను సమర్థించుకోవడానికి నా దగ్గర ఎలాంటి వాదనా లేకపోయింది. అందుకే మౌనం వహించాను. మీకు పెళ్ళిచేసిన తరువాత రెండు వ్యసనాలను వదిలించుకున్నానుగానీ మూడోది మాత్రం నన్ను వదలనంటోంది. అదే పేకాట. కానీ అందులో కూడా క్రమశిక్షణ పాటిస్తున్నాను. రోజూ లాభంలో టెన్ పర్సెంట్ కంటే ఒక్కపైసాకూడా ఎక్కువ తీసుకోను” అంటూ నవ్వారు.
ఆయన చెప్పిన మాటల్లో క్రమశిక్షణ అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు. అందుకే నేను కూడా నవ్వేశాను. మా మామగారి కథ సినిమా కథలాగా బోలెడు ట్విస్టులు డ్రమేటిక్ సీన్లతో చాలా ఇంట్రెస్టింగా సాగింది.. మాటల్లో పడి మేము మా ఊరికి రెండు ప్రదక్షిణాలు పూర్తి చేసి ముచ్చటగా మూడో ప్రదక్షిణలో ఉన్నాం. ఈలోగా నాకు సీత ఫోన్ చేసింది. అదే సమయంలో అత్తయ్యగారు మామయ్యగారికి ఫోన్ చేశారు. దాంతో కథకి కామాపెట్టి ఇద్దరం ఇంటిదారి పట్టాం. మేమిద్దరం కలిసి వాకింగుకి వెళ్ళడం నవ్వుకుంటూ తిరిగిరావడం చూసిన సీత ముఖంలో ఆనందం అత్తయ్యగారి ముఖంలో ఆశ్చర్యం కనిపించాయి.
వాళ్ళిద్దరూ కలిసికట్టుగా ఫోన్ చెయ్యడానికి కారణం మా మాస్టారు. ఆయన మాకోసం కాసేపు ఎదురు చూశాక నన్ను స్కూలు దగ్గరకి రమ్మని చెప్పి వెళ్ళిపోయారట.
నేను స్నానం చేసి రెడీ అయ్యి స్కూలు దగ్గరకి బయలుదేరుతూంటే తను కూడా వస్తానని మారాం చేసింది మీరా. తనని ఒప్పించి మెప్పించి తనబారినుండి తప్పించుకురావడానికి రెండు మినపసున్నుండలూ నాలుగు బుడగలూ ఖర్చయ్యాయి. తనని ఇంట్లో దింపి స్కూలు దగ్గరికి వెళ్ళాను.
జారుడుబండా ఉయ్యాలబల్లల విషయం విద్యార్థులెవరో వాసన పట్టేశారు. అందుకే నాకంటే ముందే అక్కడ సిద్ధంగా ఉన్నారు. పిల్లలకి ఆటలంటే ఎంతిష్టమో పప్పుబెల్లాలంటే అంతకంటే ఇష్టం. అందుకే పిల్లలందరి ముఖాల్లోనూ ఆనందం తాండవిస్తోంది.
జేసీబీ వచ్చింది.. సరిగ్గా గంటసేపట్లో అక్కడికి మొక్కలూ పొదలూ రాళ్ళూ రప్పలూ అన్నింటినీ తవ్వేసింది. ఆ చెత్తంతా ట్రాక్టర్ తొట్టిలోకి ఎత్తిపోసింది. ఆ మట్టంతా తీసికెళ్ళి దూరంగా కుప్పవేసి వచ్చింది.
అంతలోనే ప్రదీప్ మినీలారీలో వచ్చాడు. అందులో జారుడు బండా ఉయ్యాల బల్లా ఉన్నాయి వాటిని దింపి మైదానంలో పాతారు.. అవి కదిలిపోకుండా ఉండటానికి కాంక్రీట్ చప్టాలు కట్టారు.
పిల్లలు ఆ బల్లదగ్గరకీ జారుడుబండ దగ్గరకీ వెళ్ళకుండా ఉండటానికి కాపలాగా ఇద్దరు లీడర్లని ఎంపిక చేశాం. పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టీ వాటిగురించి మనం మర్చిపోయి మన పనులు మనం చూసుకోవచ్చు.
జనార్దన స్వామి ముహూర్తం సమయం కంటే గంట ముందే వచ్చారు. కార్యక్రమానికి కావలసిన సరంజామా అంతా సరి చూసుకున్నారు. ఈలోగా స్కూల్లో వంట చేసే వెంకటమ్మగారు అందరికీ పులిహోర చక్కెరపొంగలి ప్రసాదంగా రవ్వకేసరి సిద్ధం చేశారు. ఎన్ని చేసినా పిల్లలకి మాత్రం మరమరాలు కొబ్బరి ముక్కలు బెల్లం ముక్కలూ గుల్ల శనగపప్పూ సాయిబాబా చక్కెర గుళికలూ కలిపిన ప్రసాదం దోసిట్లో నిండుగా పోస్తేనే తృప్తి.. వాళ్ళకి ఆ పప్పుబెల్లాలిచ్చే సంతృప్తిని పంచభక్ష్యపరమాన్నాలు కూడా ఇవ్వలేవు.
జనార్దనస్వామి పూజ ప్రారంభించేవేళకు ఊరి పెద్దలతోబాటు మా ఇంటి పెద్దలందరూ వచ్చారు. భూమిపూజ జరిపించారు జనార్దన స్వామి. నేను మాస్టారిని పూజచెయ్యమని చెప్పాను. అందరూ అంగీకరించారు. కానీ మాస్టారు మాత్రం ఒప్పుకోలేదు. నన్నూ సీతనీ కూర్చోబెట్టి పూజ చేయించారు. పూజ చేసినంతసేపూ మీరా మా మధ్యలో అన్నింటికీ అడ్డుతగులుతూనే ఉంది.
పూజ పూర్తయింది. పిల్లలందరికీ పప్పుబెల్లాలు పంచారు. ఆ తరువాత పిల్లలచేత పాటలు పాడించారు. వారి పాటలు వింటున్నకొద్దీ వినాలనిపించేలా ఉన్నాయి. పిల్లల పాటలకి స్వరాలూ రాగాలూ ఉండవు. వాళ్ళు పలికిందే స్వరం. తీసిందే రాగం. మధ్యాహ్నం భోజనాలవేళయింది. అందరూ ఇళ్ళకు వెళ్ళిపోయారు. నేనూ ప్రదీపూ అన్నీ సద్దేసి పంపించాము. దాంతో అందరికంటే వెనుక ఇంటికి బయలుదేరినవాళ్ళం మేమే. కొంతదూరం వెళ్ళాక ఎందుకో వెనక్కి తిరిగిచూస్తే ఇద్దరు పిల్లలు ఉయ్యాలబల్లకీ జారుడుబండకీ కాపలా ఉన్నారు. వాళ్ళు లీడర్లు కదా.., అందుకే అందరూ వెళ్ళిపోయినా వాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారు. మేము మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ పిల్లలని ఇంటికి వెళ్ళిపొమ్మన్నాము కానీ వాళ్ళు వినలేదు. చివరికి ఇద్దరూ ఆ రాత్రి పడుకునేవేళదాకా వంతులేసుకుని కాపలా కాసేలా ఒప్పించేసరికి మా ప్రదీప్ తల ప్రాణం తోకకి వచ్చింది.
ఆ పిల్లలకి అంతటి బాధ్యత ఎక్కడినించి వచ్చింది? క్రమశిక్షణలోంచి వచ్చింది. క్రమశిక్షణ అనేమాటని తలుచుకోగానే మా మామగారు తన పేకాటకి ఆనాటి లాభంలో కేవలం పదిశాతం మాత్రమే ఉపయోగించేలా పాటిస్తున్న క్రమశిక్షణ గుర్తొచ్చింది. ఆ వెంటనే నాకు నవ్వొచ్చింది.
నాలో నేనే నవ్వుకోవడం చూసి ప్రదీప్‌కి నవ్వొచ్చింది. ఎందుకు నవ్వావంటే “నీ నవ్వుకి కారణం ఏమిటో అంతు పట్టక” అన్నాడు. నేను మామయ్యగారి క్రమశిక్షణ గురించి చెప్పలేను కదా, అందుకే మాట మార్చి “వీళ్ళిద్దరినీ చూస్తుంటే నాకు మా అవ్వగారు చెప్పిన కథ గుర్తొచ్చింది. అందులో క్రమశిక్షణగల సైనికులకీ క్రమశిక్షణలేని సైనికులకీ తేడా గురించి చెప్పాలనిపిస్తోంది” అన్నాను.
ప్రదీప్ నావైపు ఉత్సాహంగా చూస్తూ, “అవ్వగారు చెప్పారంటే అందులో ఏదో ఒక లాజిక్కో మేజిక్కో ఉంటుంది. ఏమన్నారో చెప్పు” అన్నాడు.
“క్రమశిక్షణగల సైనికులు దేశంకోసం పనిచేస్తే-లేని సైనికులు జీతం కోసం పని చేస్తారట” ప్రదీప్ కూడా నవ్వేశాడు. “అంతేలే మాలో కూడా కొందరు స్టూడెంట్స్ కోసం పనిచేస్తే చాలామంది వాళ్ళ ఫ్యామిలీకోసం పనిచేస్తారు” అన్నాడు. ఇద్దరం నవ్వుకుంటూ ఇల్లు చేరాం.
ఆ రాత్రి భోజనాలయ్యాక నేనూ ప్రదీపూ గుడి అరుగుమీద చేరాం.
మాటల సందర్భంలో అవ్వగారు దీపాల గురించి చెప్పిన విషయాలన్నీ అతనికి చెప్పాను. వాటిని విని అతను ఆశ్చర్యపోయాడు. నావంక అనుమానంగా చూస్తూ,”ఇవన్నీ అవ్వగారే చెప్పారా లేక కొంచెం నీ స్వంత కవిత్వం కూడా చేర్చావా?” అని అడిగాడు.
నేను లేదని చెప్పగానే తను సమాధానం చెప్పడం ప్రారంభించాడు, “నేను చరిత్రోపన్యాసకుణ్ణి కాబట్టీ నేను ప్రతిదాన్నీ చారిత్రక దృక్పథంతోనే చూస్తాను. అందుకే నువ్వు చెప్పిన విషయాలన్నీ చదువులేని అవ్వగారు చెప్పారంటే ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆవిడ చెప్పిన ప్రతిమాటా చరిత్రకి చాలా దగ్గరగా ఉంది. అవన్నీ ఆవిడకి తెలిసే అవకాశంలేదు. అయినా ప్రతి మాటా చరిత్రని అనుసరించే చెప్పారు.
అధ్యాయం-8
ప్రదీప్ నాస్తికుడు. కానీ అందరితోనూ దేవుడు లేడని వాదించడంగానీ ఇతరుల చేత నమ్మించడానికి ప్రయత్నించడంగానీ చెయ్యడు. అతని దృష్టిలో దేవుడు ఉన్నాడా లేడా అనే విషయం గురించి చర్చించడం కంటే పనికిమాలిన పని మరొకటి లేదు. ఎదుటివాళ్ళ అలవాట్లని మాన్పించడం సాధ్యం కావచ్చుగానీ వారి నమ్మకాల్ని మార్చడం మాత్రం అసాధ్యం అనేది అతని అభిప్రాయం. అలాంటివాడు కూడా అవ్వ చెప్పిన విషయాలని వినగానే అంతగా అబ్బురపడ్డాడంటే ఖచ్చితంగా అతను చెప్పేది ఆ విగ్రహాల ఆరాధన గురించి కాదు, ఆ విగ్రహాల వెనుక దాగి ఉన్న జీవిత వాస్తవికత గురించే అయివుంటుంది. అందుకే అవ్వచెప్పిన కథవెనుక కథ గురించి ప్రదీప్ ద్వారా వింటే దాని విలువ ఎక్కువ.
ప్రదీప్ చెప్పడం ప్రారంభించాడు “చూడు ఆత్రేయా దేవుడి కథలు చెప్పడం వేరు. విగ్రహాల చరిత్రలు కనిపెట్టడం వేరు. అది ఆరాధన ఇది పరిశోధన. మా అమ్మ చిన్నప్పుడు చెప్పిన్న పురాణ కథల్లో దక్షప్రజాపతి ఎంత నిరంకుశమైన క్రమశిక్షణ కలవాడో అందరికీ తెలుసు. స్కంద పురాణంలో ఆయన గురించిన వివరాలన్నీ ఉంటాయి. కాశీవిశ్వనాథుడి దేవాలయం కట్టి ఎన్ని వేల సంవత్సరాలై ఉంటుందో ఊహించడం చాలా కష్టం. ఎందుకంటే అది ఎంతో మంది రాజులు చక్రవర్తులు పదే పదే పునరుద్ధరించాల్సి వచ్చిన ఆలయం. అలాంటి అత్యంత పురాతన ఆలయాల చరిత్ర శిలాశాసనాల చరిత్రకంటే పురాతనమై ఉంటుంది. కనుక దాని నిర్మాణం జరిగిన సంవత్సరాన్నీ కట్టించినవారి వివరాలనీ తెలుసుకోవడం అసాధ్యం. ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా మనవాళ్ళకి చరిత్రని గ్రంథస్థం చేసి రాసిపెట్టుకునే అలవాటు తక్కువే.
కాశీలో విశ్వనాథుడి ఆలయాన్ని ఎవరు కట్టించారో చెప్పడం కష్టమేగానీ దాన్ని ముందుగా ఎవరు పడగొట్టించారో చెప్పడం మాత్రం సులభం. ఆ ప్రయత్నాన్ని ఆరంభించినవాడు మహమ్మద్ గోరికి అనుచరుడు. తనే అనంతరకాలంలో బానిస వంశానికి నాంది పలికాడు. 1198లో చందారవర యుద్ధంలో కనోజుకు రాజైన జయచందుని ఓడించి అనంతరం దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. మన చరిత్రలు రాసేవారి గురించి నీకు తెలియనిదేమీ లేదు. ఆలయాలని పడగొట్టించడం లేదా కట్టించడం. ఈ రెండింటికే తప్ప ఇంక దేనికీ ప్రాధాన్యతనివ్వలేదు. కుతుబుద్దీన్ ఐబక్ తరువాత అంతటివాడు ఇల్తుమిష్. ఈయన పాలనలో గుజరాత్‌కి చెందిన వ్యాపారి ఈ ఆలయాన్ని మళ్ళీ కట్టించాడని చెబుతారు. కానీ దానికి బలమైన ఆధారాలు లభించలేదు. అయితే ఒకటి మాత్రం నిజం. గుడిని పునరుద్ధరించారు. ఆ తరువాత లోడి వంశస్తుల్లో సికందర్ లోడి దాన్ని మళ్ళీ పడగొట్టించాడు. ఇతను పడగొట్టించాడంటే అంతకు ముందు గుజరాతీ వ్యాపారి కాకపోయినా ఎవరో ఒకరు ఆ గుడిని పునర్నిర్మించి ఉండాలి కదా. అనంతరం అక్బర్ పరిపాల్లిస్తున్న కాలంలో లోడీ పడగొట్టించిన ఆలయాన్ని రాజమాన్ సింగ్ అనే రాజపుత్రుడు మళ్ళీ కట్టించాడని చెబుతారు. నా ఉద్దేశం ప్రకారం అవ్వగారు చెప్పిన క్రూరాత్ములంతా ఆలయాన్ని పడగొట్టించినవారే.
మూకవ్వగారు దీన్ని ఒక పరదేశి పడగొట్టించి మసీదు కట్టించాడని చెప్పారు కదా? ఆయనే ఔరంగజేబు. 1669లో విధ్వంసానికి గురైన ఈ ఆలయాన్ని మళ్ళీ కట్టించడానికి ప్రయత్నించినవారు మరాఠారాజైన మల్హర్ రావ్ కోల్కర్. కానీ ఆయన ప్రయత్నాలన్నీ లక్నో నవాబులు అడ్డుకోవడంతో విఫలమైంది. తరువాత ఒకటిరెండు దశాబ్దాల్లో జైపూర్ మహారాజు ప్రయత్నం కూడా వ్యర్థమైంది. వీటిగురించే అవ్వగారు విఫల ప్రయత్నాలని చెప్పారు.
అలాంటి కొన్ని ప్రయత్నాలు జరిగిన తరువాత మల్హరరావ్ హోల్కర్ కోడలైన అహల్యాబాయి హోల్కర్ ఇప్పుడున్న ఆలయం కట్టించారు. ఆ విధంగా వందల సంవత్సరాల కట్టడాలూ పడగొట్టడాల సుదీర్ఘమైన గొలుసు కట్టు నిర్మాణాలకి తెరపడింది.. అవ్వగారు చెప్పిన ఆ పుణ్యస్త్రీలలో ఒకరు అహల్యాబాయి హోల్కర్. అనంతర కాలంలో ఎంతోమంది ఈ ఆలయం అభివృద్ధికోసం దానధర్మాలు చేశారు. వారిలో ప్రముఖులు నాగపూర్ భోస్లే కుటుంబం, సిక్కురాజైన రంజిత్ సింగ్ ముఖ్యులు. ఇంత చేసినా ఆ ఆలయం పక్కనే మసీదు ఉంది. దానికి ఎవరూ ఎలాంటి హానీ తలపెట్టలేదు. అక్కడే కాదు దేశంలో చాలాచోట్ల ఆలయాల ఆవరణల్లో మసీదులు కనిస్తాయి. అవన్నీ దేవుడికి మతం లేదని నిరూపిస్తాయి. మతం కోస మనుషులని బలితీసుకోకూడదని బోధిస్తాయి”
ప్రదీప్ చెప్పే ప్రతి మాటా ఆలోచింపజేసేదే. నేను తను చెప్పిన చరిత్ర గురించి ఆలోచిస్తుంటే అతను నేను చెప్పిన అవ్వగారి కల్పనా సామర్థ్యం గురించి ఆలోచిస్తున్నట్లున్నాడు. అందుకే మరోసారి అవ్వగారు చెప్పిన ప్రతి విషయం గురించీ ఒకటికి రెండుసార్లు అడిగి అవన్నీ నిజమేనని నిర్ధారించుకున్నాడు. అందుకే ఆవిడ చెప్పిన ప్రతి కథ సమయం సందర్భం సన్నివేశం అన్నీ చరిత్రకి సరిపోలేలా ఉండటం అతనికి కూడా ఆశ్చర్యం కలిగించింది. అందుకే అవ్వగారు ఇంకేమైనా కథలుగానీ విశేషాలుగానీ చెప్పారా అని అడిగాడు.
నేను నవ్వుతూ, “ఉన్నాయి. అవన్నీ చెప్పడానికే నిన్ను పిలిపించాను. వీలైనప్పుడల్లా వాటి గురించి మాట్లాడుకుందాం” అనగానే అతను ఉత్సాహంగా, “అవ్వగారు చెప్పిన ప్రతి విషయాన్నీ వినాలి. ఆవిడ సామాన్యురాలు కాదు. ఆనాడు ఆ మూకాంబిక మూకాసురుణ్ణి చంపి లోకాన్ని రక్షించిందనేమాట నిజమో కాదో నాకు తెలీదు. ఈనాడు మీ మూకాంబిక తన కల్పనాశక్తితో చరిత్రని తిరగరాయించగలదని మాత్రం ఖచ్చితంంగా చెప్పాగలను” అంటుంటే నా గుండెలు గర్వంతో ఉప్పొంగాయి. ఎందుకంటే ప్రదీప్ వెల్లడించిన అభిప్రాయాలు, అవ్వగారి మాటల వెనుక ఏదో నిగూఢమైన చారిత్రక సత్యం దాగి ఉందనే నా నమ్మకాన్ని బలపరిచేలా ఉన్నాయి.
మేమింకా మాట్లాడుకుంటూ ఉండగానే సీత వచ్చింది. ఇద్దరికీ పాలు ఇచ్చింది. త్వరగా పడుకొమ్మనీ మరునాడు బెంగుళూరు ప్రయాణానికి సిద్ధం కావాలనీ చెప్పింది.
తిన్నగా వెళ్ళి పడుకున్నాం. కానీ నాకు నిద్రపట్టలేదు. అవ్వగారి గురించిన ఆలోచనలే మెదడునిండా శ్రావణమేఘాల్లా కమ్ముకున్నాయి. ఏ మేఘం ఎప్పుడు కురుస్తుందో చరిత్రలో ఏ కాలం ఎప్పుడు విరుస్తుందో ఎవరికి తెలుసు? అవ్వతో ప్రయాణమంటే కాలయంత్రంలో ప్రయాణించినట్లే.
ఈసారి మా భారతదేశ పర్యటన ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఎంతో ఉత్కంఠని కలిగిస్తోంది. చూస్తూండగానే కేవలం పదే పది రోజుల్లో సావిత్రి మరణం, గోమతీపురంలో అవ్వగారి సాహస గాథ, భార్గవి వివాహ నిర్ణయం, అవ్వగారి దీపాల చారిత్రక సాంస్కృతిక ప్రయాణం, దానికి ప్రదీప్ వాస్తవిక శోధన, మామయ్యగారి జీవిత సాధన, వీటన్నిటినీ మించింది బడిలో పిల్లల క్రమశిక్షణ. ఆ పిల్లలు ఎప్పుడు ఏ జోలపాట పాడారోగానీ నాకు తెలియకుండానే నిద్రపట్టేసింది. చాలా కాలం తరువాత ఆదమరచి నిద్రపోయాను.
***
తెల్లవారుజామున ఐదింటికి సీత బెడ్ కాఫీతో సుప్రభాతం పలికింది. ఎందుకోగానీ ఇకనుండి బెడ్ కాఫీ తాగకూడదనిపించింది. అదే విషయం సీతకి చెప్పాను. తను నవ్వింది, “మీ ఊరొచ్చి పదిరోజులు కూడా కాలేదు. అప్పుడే ఇంత మార్పా? ఐతే వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాకే కాఫీ” అంటూ నేను పైట పట్టుకు లాగుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. భర్తల క్రమశిక్షణ రహస్యం భార్యల చేతుల్లోనే దాగి ఉంటుంది.
నేను రెడీ అయి బయటకి వచ్చేసరికి సీత ఫిల్టర్ కాఫీకి భాగీరథమ్మగారి పులిహోర పోపు ఘుమఘుమలకి తోడయ్యాయి. వంటిల్లంతా గుమ్మెత్తిపోతోంది. నాకు కాఫీ ఇచ్చి సీత స్నానానికి వెళ్ళిపోయింది. ఎంతైనా వెళుతున్నది పుట్టింటికి కదా? ఆమాత్రం ఉత్సాహం సహజం. సీత వచ్చేవరకూ మీరాని లేపకూడదు. లేపితే ఇంక సైరన్ మోతే. అందుకే వెళ్ళి ప్రదీపుని లేపాను అందరం ఎంత త్వరగా రెడీ అయినా రేవు చేరేసరికి ఆరున్నర దాటింది.
పడవలో ప్రయాణం చేస్తున్నా యాత్రానందం కంటే ప్రదీప్‌తో మాటలానందమే ఎక్కువ. పడవ ఆ గట్టుకి ఎప్పుడు చేరిందో కూడా తెలియలేదు.
అక్కడినుండి టాక్సీ మాట్లాడుకుని తిన్నగా రైల్వేస్టేషన్‌కి వెళ్ళాము.. రైలు సరిగ్గా టైముకి రావడాన్ని చూసి ఆశ్చర్యం ప్రకటించింది సీత. “ఈమధ్యన ఇండియాలో కూడా రైళ్ళు టైముకే నడుస్తున్నాయమ్మా” అంటూ గట్టిగా నవ్వారు మామయ్య. ఆ నవ్వుల్ని ఆనందించేంత సమయం లేదు.. అందరూ ఎక్కి కూర్చోగానే రైలు కూతేసింది.
రైలు వెళ్ళిపోయింది. నేనూ ప్రదీపూ చేతులు ఊపుతూ వీడ్కోలు చెబుతూండగానే రైలు ప్లాట్‌ఫారం దాటి వెళ్ళిపోయింది. ఇద్దరం బయటికొచ్చి కాఫీలు తాగాక జారుడుబండకీ, ఉయ్యాలబల్లక్కీ డబ్బిస్తే తీసుకోలేదు. నేనెంత బలవంతంగా తన జేబులో పెట్టానో అతను అంతకంటే బలవంతంగా ఆ డబ్బు నా జేబులో కుక్కేసి అర్జంటు పని ఉందంటూ అటుగా వస్తున్న ఆటోని ఆపి హడావిడిగా వెళ్ళిపోయాడు.
చాలా కాలం నేను ఒంటరిగా శివమొగ్గ వీధుల్లో నడుస్తున్నాను. దారిలో సరస్వతీపురానికి దారి అనే బోర్డు కనిపించింది. దాన్ని చూడగానే సుశీలమ్మగారు గుర్తొచ్చారు. ఆ వెనువెంటనే ఆవిడని ఒకసారి పలకరించి వస్తే బాగుంటుందనిపించింది.
నా కాళ్ళు సరస్వతీపురంవైపు దారితీశాయి. కొబ్బరి చెట్లు వాటి మధ్యలో వక్క చెట్లు. ఆ చెట్లకింద పంటపొలాలు. నేలంతా ఆకుపచ్చని తివాచీ పరిచినట్లుంది. రోడ్డుకి ఒకవైపు తుంగానది ప్రవహిస్తోంది. ఈ తుంగమ్మ ఇక్కడినుండి హొయలుపోతూ వెళ్ళి కూడ్లి దగ్గర భద్రానదితో సంగస్తుంది. రెండూ కలిసి తుంగభద్రగా మారి సగం కర్ణాటక రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మారుస్తాయి. ఏ నదీప్రవాహాన్ని చూసినా దాని నడకలో నయగారాలూ గలగలల్లో నవరాగాలూ దాన్ని చూస్తున్న ప్రకృతి సరాగాలూ ఊహించుకుంటున్నకొద్దీ గుండెలు ఉప్పొంగేలా చేస్తాయి. నదీమతల్లులే కదా నాగరికతకి పట్టుకొమ్మలు? అలాంటి తుంగమ్మ ఒడ్డున నడుస్తూంటే దేశదేశాల సంస్కృతుల్లో అన్నీ నదీ ప్రవాహాలే. వేల సంవత్సరాల నుండి పరవళ్ళు తొక్కుతూ వచ్చి సాంస్కృతిక చరిత్రని గుసగుసలుగా వినిపిస్తూ కనిపించేందంతా చరిత్రా కాదు, వినిపించేదంతా సంస్కృతీ కాదని ఎలుగెత్తి చాటుతూ ఉంటాయి. మా తుంగమ్మతల్లి ప్రవాహం యక్షగానంలో చిందులు తొక్కుతుంది. ఉరకలు వేయిస్తుంది. అందుకే మనసు ఎప్పుడెప్పుడు ఇక్కడికొచ్చేద్దామా అని తొందరపడుతోంది.
తుంగమ్మ ఒడ్డున నడుస్తున్నంతసేపూ తెలియలేదుగానీ రోడ్డు నదిని గట్టుని దాటి వచ్చాక ఎండ వేడిమి స్పష్టంగా తెలుస్తోంది. అయినా అలసట లేదు. అలా ముందుకు వెళుతుంటే చెరుకు గానుగ కనిపించింది. కొత్త పెళ్ళికొడుకుల్లా అలంకరించిన జోడెద్దులు గానుగ ఆడుతున్నాయి. క్రషర్ల కాలంలో కూడా ఇక్కడ గానుగ కనిపించడాన్ని మించిన విచిత్రంగానీ అద్భుతంగానీ ఎక్కడుంటుంది? వాళ్ళు నా కోసమే గానుగాడిస్తున్నారేమే. చెరుకుల మధ్యలో రెండు పచ్చి మిరపకాయలు పెట్టి గానుగాడించి ఆ రసాన్ని గ్లాసులో పోసి ఇచ్చారు. అడక్కపోయినా అందరికీ ఇవ్వడమే రైతుబిడ్డల నైజం. ఎలాంటి లాభాపేక్షా లేకుండా బాటసారుల దాహార్తి తీర్చే సహృదయతే మన సస్కృతికి పెట్టని కిరీటం.
చెరుకురసం తాగి చల్లబడి మళ్ళీ రోడ్దెక్కాను. వెనకనించీ వచ్చిన ఆటో నన్ను చూసి ఆగింది. కానీ నేను ఎక్కలేదు. దాని డ్రైవర్ నవ్వుతూ చెయ్యూపుతూ వెళ్ళిపోయాడు. తన నవ్వులో ఉన్నది వెటకారమో నా నడకానందానికి ప్రోత్సాహమో అర్థం కాలేదు. అదేమిటో అర్థం కాకపోతే నాకొచ్చిన ఇబ్బందేమిటి అనుకుంటూ నడక కొనసాగించాను. నా దారిన నేను నడుస్తూండగా వెనకనించి ఒక కారు వచ్చి ఆగింది. లిఫ్ట్ వద్దు నేను నడుస్తాను అని డ్రైవర్‌కి చెబుతూంటే కారు వెనక సీట్లోంచి నవ్వులు వినిపించాయి. ఆ నవ్వుతున్నాయన సుశీలమ్మగారి మరిదిగారు. ఇంక కారెక్కక తప్పలేదు. పదే పది నిమిషాల్లో ఇల్లు చేరాము.
సుశీలమ్మగారు ఇంట్లో లేరు. బహుశా గుడికి వెళ్ళుంటారు కూర్చోండి అని చెప్పి లోపలకి వెళ్ళారాయన.. నేను కుర్చీలో కూర్చున్నాను. ఎదురుగా టీపాయ్ మీద ఇండియాటుడే ఔట్లుక్ పత్రికలు కనిపించాయి. గోడమీద ఆవిడ కొడుకు కోడళ్ళ ఫోటోలున్నాయి. మరోవైపున మనవళ్ళు మనవరాళ్ళ ఫోటోలు. వాటిని చూడగానే మనసులో శూన్యం నిండిపోయింది.
(ఇంకా ఉంది)
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి తెలుగు రచయిత, అనువాదకులు. ‘వలస దేవర’, ‘జంగమదేవర’, ‘అంతర్యామి’, ‘సాక్షాత్కారం’ వీరి నవలలు. ‘ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్’, ‘ఈ కథకి శిల్పం లేదు’ వీరి కథాసంపుటాలు. ప్రఖ్యాత తెలుగు కవుల సంపుటాలను కన్నడంలోకి అనువదించారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార నాటకం ‘గుళ్ళకాయజ్జి’, కేంద్ర సాహిత్య అకాడెమీ బాల సాహిత్య పురస్కారం పొందిన బోళువారు మహమ్మద్ కుణ్హి పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. వీరి నవలలకు, కథాసంపుటాలకు పలు పురస్కారాలు లభించాయి.
