[ధనంజయ లక్ష్మీ రామకృష్ణగారు వ్రాసిన ‘మత్తె మూకజ్జి’ అనే కన్నడ నవలని ‘అవ్వగారు’ పేరుతో అనువదించి ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.]
[మూకవ్వగారికి, తన మామగారికి అభిప్రాయభేదాలొందుకొచ్చాయో ఆత్రేయకి తెలియదు. ఇద్దరినీ అడగడు. ప్రదీప్‌కి ఫోన్ చేసి జారుడుబండా, ఉయ్యాల బల్లా గుర్తు చేస్తాడు. అవ్వగారు చెప్పిన దీపాల విశ్లేషణ ప్రదీప్‌తో పంచుకోవాలనుకుంటాడు. బెడ్ కాఫీ తాగుతూండగా, అటుగా వచ్చిన అతని మామగారు, మార్నింగ్ వాక్ చేసొద్దాం రండి అని పిలుస్తారు. ఇద్దరు నడుస్తూ ఊరు దాటుతారు. తన గత జీవితం గురించి అల్లుడికి చెప్పుకొస్తారు మామగారు. తన ఉద్యోగాలు, వ్యసనం, మళ్ళీ నిలదొక్కుకోడం అన్నీ చెప్తారు. తన వ్యసనాల వల్ల అవ్వగారికి తాను అంతగా నచ్చనని చెప్తారు. మాస్టరు గారి వచ్చి ఎదురుచూస్తున్నారన్న ఫోన్ రావడంతో ఇద్దరూ ఇల్లు చేరుతారు. అప్పటికే ఆయన వెళ్ళిపోతారు. స్నానం చేసి తయారై స్కూలుకి వెళ్తాడు ఆత్రేయ. బడిలో మైదానన్నంతా శుభ్రం చేస్తారు. ప్రదీప్ తెచ్చిన జారుడుబండా, ఉయ్యాల బల్లని పాతి, అవి కదిలిపోకుండా కాంక్రీట్ చప్టాలు కడతారు. ఇద్దరు పిల్లలు వాటికి కాపలాగా ఉంటారు. భూమి పూజ పూర్తవుతుంది. ఆ రాత్రి మాటల మధ్యలో దీపాల గురించి అవ్వగారు చెప్పిన మాటలన్నీ ప్రదీప్‌కి చెప్తాడు ఆత్రేయ. అవ్వగారు చెప్పినవన్నీ చరిత్ర వివరాలకు సరిపోతాయని అతడంటాడు. ఆ తర్వాత, ఆలయాల గురించి, విగ్రహాల పరిశోధన గురించి ఎన్నో వివరాలు ఆత్రేయకు చెప్తాడు ప్రదీప్. కాసేపటి సీత వచ్చి, త్వరగా పడుకోమని మర్నాడు బెంగుళూరు ప్రయాణానికి సిద్ధమవ్వాలని చెప్తుంది. మర్నాడు ఉదయం రేవు దాటి, అక్కడ్నించి టాక్సీలో రైల్వే స్టేషన్‌కి చేరుకుంటారు. రైలు సరైన సమయానికే వస్తుంది. భార్యాకూతురిని, అత్తగార్ని మామగార్ని రైలెక్కించి, వీడ్కోలు పలుకుతాడు ఆత్రేయ. శివమొగ వీధుల్లో నడుస్తుండగా, సరస్వతిపురం అనే బోర్డు కనిపిస్తుంది. సుశీలమ్మా గారు గుర్తొచ్చి, ఆవిడని పలకరిద్దామని అటువైపు వెళ్తాడు. నడుస్తుండగా, సుశీలమ్మగారి మరిది కారులో వస్తూ, ఆపి, ఆత్రేయని ఎక్కించుకుంటారు. ఆ సమయంలో సుశీలమ్మగారు ఇంట్లో ఉండరు. కూర్చోండి అని చెప్పి ఆయన లోపలికి వెళ్తారు. గోడ మీదున్న ఆవిడ కొడుకు, కోడళ్ళ ఫోటోలు చూడగానే ఆత్రేయ మనసు భారమవుతుంది. – ఇక చదవండి.]
అధ్యాయం-9
మావైపు పిన్నిగారిని పిన్నిగారనో చిన్నమ్మనో పిలిచే అలవాటు లేదు. అక్కా అని పిలుస్తారు. పిలుపులోనే తేడా ఉంటుందిగానీ వరసల్లో మాత్రం మార్పుండదు. నేను ఏం చెయ్యాలో తోచక కాలక్షేపం కోసం టైమ్స్ తిరగేస్తూండగా సుశీలమ్మగారు వచ్చారు. ఆవిడ రావడాన్ని గమనించి లేచి నిలబడ్డాను. కానీ ఆవిడ నన్ను గమనించలేదు. తిన్నగా లోపలకి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని ఆవిడ తోటికోడలు గుర్తించారు. అందుకే సుశీలమ్మగారి దగ్గరకు వెళ్ళి జమునాపురాన్నించీ ఆత్రేయ వచ్చాడని చెప్పారు. ఆవిడ బయటకు వచ్చారు.
నన్ను చూడగానే ఆవిడకి దుఃఖం పొంగుకొచ్చింది. కళ్ళు తడయ్యాయి. కానీ కళ్ళలో నీళ్ళు తిరగకుండా అదుపు చేసుకున్నారు. మామూలుగా పెద్దవాళ్ళకి చిన్నవారి ముందు తమ సుఖసంతోషాలనే తప్ప బాధల్నీ దుఃఖాల్నీ పంచుకోకూడదనే అభిప్రాయం ఉంటుంది. అందుకే ఆవిడ తనని తాను నిగ్రహించుకుంటూ వచ్చి నా పక్కన కూర్చున్నారు.
నా భుజం మీద చెయ్యేశారు. నా ముఖంలోకి వాత్సల్యపూరితంగా చూశారు. మా మూకవ్వగారి తరువాత అలా నవ్వడం వచ్చిన వ్యక్తి సుశీలమ్మగారే. ఆ నవ్వులోనే వంద కుశల ప్రశ్నలుంటాయి. వాటికి మన మనసే సమాధానం చెబుతుంది. అయినా సరే ఆప్యాయంగా నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, “మీరా బాగా అల్లరి చేస్తోందా?” అని అడిగారు. నేను తల ఊపాను.
“ఏమిటిలా చెప్పాపెట్టాకుండా?”
“మా అత్తమామల్నీ సీతనీ రైలెక్కించడానికి వచ్చాను. సరస్వతీమాత కొలువైన ఊరు కదా? మాతని చూడ్డానికి వచ్చాను”
నా మాటలు మా చిన్నక్కగారికి అర్థం కాలేదు. అందుకే, “ఈ ఊళ్ళో సరస్వతీదేవి గుడెక్కడుంది?” అని అడిగింది.
అంతలోనే బాబాయ్ గారొచ్చారు, “మన ఆత్రేయ చెప్పేది గుళ్ళో ఉండే సరస్వతీదేవి గురించి కాదు, మనింట్లో ఉండే సరస్వతీదేవి గురించి” అని చెప్పాక ఇప్పుడే వస్తాను అంటూ పెరట్లోకి వెళ్ళిపోయారు. ఆయన వెనకే చిన్నక్కగారు వంటింట్లోకి వెళ్ళారు.
సుశీలమ్మగారితో మాట్లాడుతూంటే బాధలో ఉన్న ఆవిడని నేను పలకరించడానికి వచ్చినట్లు లేదు, ఆవిడే నన్ను ఓదార్చడానికి వచ్చినట్లుంది. చాలామందికి వారివారి పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం తెలియదు. ఎవరొచ్చినా వాళ్ళముందు ఎంత గట్టిగా రోదిస్తే అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్లుగా భ్రమపడి వారి దుఃఖాన్ని వచ్చినవాళ్ళందరికీ పంచుతారు.
సుశీలమ్మగారు అవ్వగారి గురించీ భాగీరథమ్మగారి గురించీ అడిగారు. భట్టుగారికి ధైర్యం చెప్పమన్నారు.
మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగానే చిన్నక్కగారు భోజనానికి పిలిచారు. మంచి ఆకలిమీదున్నానేమో ఆవిడ కొసరి కొసరి వడ్డిస్తుంటే నేను కడుపునిండా తిన్నాను.
సుశీలమ్మగారింట్లో అందరూ అందరే. అతిథులొచ్చినప్పుడు మాత్రమే కాదు. అన్ని సమయాల్లోనూ అందరూ అందరితోనూ కలివిడిగా ఉంటారు. వారిది పెద్ద కుటుంబం. సుశీలమ్మగారు పెద్ద కోడలు. ఆవిడకి నలుగురు మరుదులూ ఇద్దరు ఆడబడుచులూ ఉన్నారు. అందరూ కలిసే ఉండేవారు. రెండేళ్ళక్రితం ఆవిడ రెండవ తోటికోడలికి క్యాన్సర్ వచ్చింది. బెంగుళూరు కిద్వాయ్ హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో ఉన్న తోటికోడలిని చూసుకోవడానికి సుశీలమ్మగారూ పెద్ద తోటికోడలూ ఇద్దరూ బెంగుళూరులో చిన్న గది అద్దెకి తీసుకుని అక్కడే ఉండిపోయారు. అన్నదమ్ములు అరమరికల్లేకుండా కలిసి ఉండటమే ఆశ్చర్యంగా చెప్పుకునే కాలంలో తోటికోడళ్ళు అక్కచెల్లెళ్ళకంటే ఎక్కువ అంత ఆత్మీయంగా ఉండటం గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవారు.
మనుషులన్నాక చిన్నా చితకా భేదాభిప్రాయాలుండటం సహజం. వాటిని పెద్దవి కాకుండా చూసుకోవలసిన బాధ్యత పెద్దలమీద ఉంటుంది. కానీ ఎక్కడలేని బింకాలూ పట్టుదలలూ పెద్దలకే ఉంటాయి. అలాంటి పెద్దలనీ లోకంపోకడ తెలియని పిల్లలనీ తెలిసీ తెలియనితనంతో మిడిసిపడే యువతరాన్నీ ఒకే ఇంట్లో ఒకే తాటిమీద నడిపించడం అంటే సర్కస్‌లో రింగ్ మాస్టర్ లాంటి పని. కేవలం రింగ్ మాస్టర్‌లా కాకుండా కేరింగ్ మాస్టర్‌లా జీవితాన్ని గడిపేంత దక్షత సుశీలమ్మగారిలాంటి వారిలో మాత్రమే చూడగలం. అలాంటివాళ్ళు ఊరికి ఇద్దరో ముగ్గురో ఉంటే చాలు ఆ ఊరు బాగుపడుతుంది.
ఆ ఇల్లు చాలా పాతకాలం నాటిది. దాన్ని కట్టి దాదాపు వందేళ్ళు దాటి ఉంటుంది. అయినా ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఈ మధ్యకాలంలో ఇలాంటి మండువాలోగిళ్ళు అరుదైపోయాయి. పెరట్లో పెద్ద కానుగచెట్టుంది. దాని కింద మంచం వేశారు. రాత్రంతా ప్రదీప్‌తో అవ్వగారి కల్పనల గురించి మాట్లాడుకుంటూ కూర్చోవడం తెల్లవారు జామున తొందరగా లేవడం దాదాపుగా గంటన్నరపైన నడవడం ఆపైన కడుపునిండా భోంచెయ్యడంతో ఎల్లడలేని అలసటా ఆవహించి కళ్ళు కూరుకొస్తున్నాయి. ఎవరూ వెళ్ళి పడుకోమని చెప్పకుండా మంచంమీద పడుకున్నాను.. ఇలా పడుకున్నానో లేదో అలా నిద్రపట్టేసింది. మెలకువ వచ్చేసరికి సూర్యుడు పడమటింటికి చేరుతున్నాడు.
దక్షిణం దారిలోంచి వెనక పెరట్లోకి వచ్చాను. అక్కడ పెద్ద అండాపొయ్యి ఉందని నాకు తెలుసు. ఈ గ్యాస్ స్టవ్వుల కాలంలో కూడా అండాపొయ్యిలు చూడాలంటే మా మలెనాడు ప్రాంతానికి రావలసిందే. పొయ్యికింద మంటలేదుగానీ అండాలో నీళ్ళుమాత్రం వేడిగానే ఉన్నాయి. ఆ వేణ్ణీళ్ళతో కాళ్ళూ చేతులూ కడుక్కోబోతూండగా బాబాయ్ గారు వచ్చారు. ఆయన చేతిలో కొత్త సబ్బుంది. దాని రేపర్ తీసి సబ్బుపెట్టెలో పెట్టారు. ముఖం కడుక్కోవడం పూర్తి కాగానే ఉతికి ఆరేసిన తువ్వాలందించారు. నేను ముఖం తుడుచుకున్నాకగానీ, “ఏం ఆత్రేయా ఎలా ఉన్నావు?” అనేమాట అడగలేదు నేను బాగున్నాను అన్నట్లు తల ఊపగానే, “మూకవ్వగారి ఆరోగ్యం బాగానే ఉందిగా?” అని ప్రశ్నించారుగానీ నేను సమాధానం చెప్పేలోపే “ఆవిడకేం క్రమశిక్షణతో గడిపే జీవితం. ఏ సమస్యా లేకుండా బతకడమెలాగో ఆవిడని చూసి నేర్చుకోవాలి” అన్నారు. నేను చిరునవ్వుతో సమాధానమిచ్చాను.
అర్థవంతమైన పలకరింపులూ అతిథిమర్యాదలూ ఎలా ఉండాలో తెలుసుకోవడానికైనా సరస్వతీపురానికి రావాలి. సుశీలమ్మగారింట్లో నాలుగైదురోజులుండాలి.
ఆ రాత్రికి పండగ వంట చేశారు. పల్లెటూళ్ళలో ఏ ఇంటికి వెళ్ళినా ఇదే ఆప్యాయతానురాగాలుంటాయి. స్థాయీ భేదాలన్నీ కేవలం ఆర్ధిక పరమైన హెచ్చుతగ్గులు మాత్రమే. ఎవరి శక్తిమేరకు వారు అతిథి సత్కారాలు చేస్తారు.
గొడ్లసావిట్లో ఆవులకి నీళ్ళుపెట్టి వచ్చారు సుశీలమ్మగారు. ఆ తరువాత నా దగ్గరకి వచ్చి కూర్చున్నారు. మెల్లగా మాట్లాడటం ఆరంభించారు. కష్టసుఖాలంటే కనురెప్పల్లాంటివి. అవి కలుసుకుంటే చీకటి విడిపోతే వెలుగు. కేవలం వెలుగుని మాత్రమే ఎంతసేపు చూడగలం? రెప్పవెయ్యకుండా ఎంతసేపు ఉండగలం? జరిగినవేవీ మరచిపోకూడదు. అలాగని పదేపదే తలుచుకోకూడదు. ఇలాంటివెన్నో మూకవ్వ దగ్గరే నేర్చుకున్నాను. ఆవిడ ఇక్కడికొచ్చారు. రెండురోజులున్నారు. అప్పుడే ఆవిడ నాకో సలహా ఇచ్చారు. అదృష్టం కొద్దీ మా అబ్బాయి శ్రీరంగనాథ భారతీయ పౌరసత్వం కలిగినవారినే పిల్లలకి న్యాయబద్ధమైన పెంపకందారులుగా నియమించాడు. తను చనిపోయిన రెండు నెలలకి ఆ పెంపకందారులు భారతదేశానికి వచ్చారు. వారొచ్చిన విషయం మాకెవరికీ తెలియదు. కానీ మూకవ్వగారికి తెలిసింది. అందుకే ఇక్కడికి వచ్చారు. మేమేం చెయ్యాలో చెప్పారు. ఆవిడ చెప్పినట్లే మేము బెంగుళూరు వెళ్ళాము. ఆ దంపతుల్ని కలిశాము. వాళ్ళు చాలా మంచివాళ్ళు. ప్రతిసంవత్సరం భారతదేశానికి వచ్చి కనీసం మూడు నెలలైన్నా ఉంటారట. ఈసారి వచ్చేప్పుడు పిల్లల్ని తమ వెంట తీసుకువస్తామన్నారు. ఈలోగా మీ వారసుల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వాళ్ళ దేశానికి రమ్మని ఆహ్వానించారు. దాంతో మా ఐదు కుటుంబాలూ వీసాలు సిద్ధం చేసుకున్నాం. వచ్చే నెల్లోనే అందరం కలిసి మా పిల్లల్ని చూడటానికి వెళుతున్నాం. మూకవ్వ సమయానికి తగిన సలహా ఇచ్చి ఉండకపోతే మాకీ అవకాశం వచ్చి ఉండేది కాదు” అంటుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అవ్వకి ఆ కేర్ టేకర్స్ గురించి ఎలా తెలిసిందో కనిపెట్టాలనే సంకల్పం కలిగింది నాకు.
సుశీలమ్మగారు చెప్పడం కొనసాగించారు, “మీరా పుట్టినప్పుడు నువ్వు సీతని కానుపు కోసం ఇక్కడికే ఎందుకు తీసుకొచ్చావో నాకిప్పుడర్థమైంది. మా అదృష్టం కొద్దీ ఆ పెంపకందారుల వివరం తెలిసింది. లేకపోతే మా వారసుల్ని కళ్ళారా చూసుకునే అవకాశం కూడా దక్కేది కాదు. మనవాళ్ళున్నారని తెలిసినా వారిని చూడలేని జీవితం కంటే నరకం ఎక్కడా ఉండదు. మా దూరపు బంధువులు వారి అమ్మాయిని అక్కడి పౌరసత్వం కలిగిన అబ్బాయికిచ్చి వివాహం చేశారు. ఆ దంపతులు వారి పిల్లలిద్దరికీ ఆ దేశపు పౌరసత్వాన్నే ఇప్పించారు. దురదృష్టవశాత్తూ ఆ భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలొచ్చి చివరికి విడాకుల దాకా వచ్చింది. తను భారతదేశానికి తిరిగి వచ్చేసింది. ఇప్పుడా అమ్మాయి అక్కడికి వెళ్ళడానికి లేదు. ఆమె పిల్లలు ఇక్కడికి రావడానికి లేదు. ఇప్పుడామె భర్త రెండో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పాపం ఈ అమ్మాయి భవిష్యత్తేం కావాలి? భవిష్యత్తులో ఆ పిల్లలకి కనీసం వారి తల్లెవరో తెలిసే అవకాశం కూడా ఉండదు” అంటూ ఆవిడ బాధపడుతూంటే ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఒకప్పుడు విదేశాలకి మన దేశం మీద మోజుండేది, ఎక్కడెక్కడివాళ్ళో ఈ దేశాన్ని వెతుక్కుంటూ వచ్చారు. దండయాత్రలు చేశారు. పరిపాలించారు ఇక్కడి మనుషులతో పాలల్లో నీళ్ళలా కలిసిపోయారు. కానీ ఇప్పుడు? విదేశాల మోజు క్రమంగా ఎక్కువౌతోంది. ఫారిన్ సంబంధం వస్తే చాలు అత్యుత్సాహంతో పెళ్ళి చేసి పంపిస్తారేగానీ అక్కడి సంస్కృతి ఏమిటి? అందులో మనమ్మాయి ఇమడగలదా లేదా? వివాహానికి సంబంధించి మన చట్టాలేమిటి? వాళ్ళచట్టాలేమిటి? భవిష్యత్తులో ఏదైనా తేడావస్తే మనమ్మాయికి భద్రత కల్పించడం ఎలా? ఆ విషయంలో అక్కడి చట్టాలేం చెబుతున్నాయి? ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోకుండానే పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే పరవాలేదు. ఏదైనా తేడా వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు?
సుశీలమ్మగారు నా భుజం మీద చెయ్యేశారు. “నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. కానీ ఫారిన్ కంట్రీసన్నీ ఊర్థ్వలోకాలనీ మనదేశం మాత్రమే అధోలోకంలో ఉందనీ చెప్పే చదువులు మారనంతకాలం ఇది ఇలాగే కొనసాగుతుందిగానీ పడుకో” అంటూ లేచి వెళ్ళారు. నేను పడుకునేలోపే రాగిచెంబులో నీళ్ళు తెచ్చి నా తలవైపున మంచం కింద పెట్టారు.
అధ్యాయం-10
సూర్యుడు తూర్పున ఉదయిస్తూ తన వెలుగురేకలతో నన్ను నిద్రలేపాడు. లేచీ లేవగానే లేత కిరణాలతో సుప్రభాతం పలికినందుకు ప్రత్యక్షనారాయణుడికి నమస్కరించాను. అలవాటు ప్రకారం సీతా అన్నాను. సీత రాలేదుగానీ చిన్నక్కగారు బెడ్ కాఫీ తీసుకువచ్చారు. ఇది నేను ఊహించలేదు. అందుకే కంగారుపడుతూ హడావిడిగా లేచి ఆవిడ చేతిలోంచి గ్లాసందుకున్నాను. ఆవిడ చిరునవ్వుతో, “మీ అలవాట్లన్నీ మాకు తెలుసు. అందుకే అండాలో వేపాకులు వేసి మరగకాచి సిద్ధంగా ఉంచాము” అన్నారు. నాకు ఏం మాట్లాడాలో తోచలేదు. అందుకే చిరునవ్వుతో సరిపెట్టాను. ఆవిడ వెళ్ళిపోయారు. నేను స్నానం చేసి వచ్చేసరికి నాకిష్టమైన దావణగెరె బెణ్ణెదోసె సిద్ధంగా ఉంది. వేడివేడి పప్పులపొడి మసాలా దోసెమీద వెన్నపూస వేశారు. అది దోసెమీదే కరిగి నెయ్యవుతుంది. నెయ్యిదోసెకీ వెన్నదోసెకీ రుచిలో చాలా తేడా ఉంటుంది. ఆ తేడా ఎక్కడినించీ వచ్చిందో ఇంతవరకూ ఏ సైంటిస్టూ కనిపెట్టలేకపోయాడు.
ఉదయం తొమ్మిది దాటితే పడవెళ్ళిపోతుంది. అందుకే అందరికీ వీడ్కోలు చెప్పి బయలు దేరాను.
సరస్వతీపురాన్నించీ బస్సు. బస్టాండు నించీ ఆటోలో శివమొగ్గ రేవు. అక్కడినుండి పడవలో జమునాపురం అక్కడినుండి రెండుకాళ్ళ బండిమీద ఇంటికి చేరాను. ప్రయాణించింది పన్నెండు కిలోమీటర్లే అయినా నాలుగు రకాల వాహనాలు మారాను. ఇల్లు చేరేసరికి మా అవ్వగారు గుడి అరుగుమీద కనిపించారు. నన్ను చూడగానే, “సుశీలమ్మ ఎలా ఉంది?” అని ఆడిగారు.
నేను కాస్త ఆశ్చర్యంగా చూస్తూ, “బాగానే ఉన్నారుగానీ, నేనక్కడికి వెళ్ళానని మీకెవరు చెప్పారు?” అని అడిగాను.
“వెర్రినాగన్నా, నిన్న రాత్రి ఇంటికి రాలేదంటే నువ్వు ఎక్కడికెళ్ళి ఉంటావో ఊహించలేనా?” అన్నారు.
“మీ ఊహలూ కల్పనలూ అన్నీ ఎలా నిజమౌతాయో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అయినా మీరు నాకు అన్నీ చెప్పారుగానీ అసలు విషయం మాత్రం చెప్పలేదు. పిల్లల పెంపకందార్ల గురించి మీరెలా తెలుసుకున్నారు? వాళ్ళకి కూడా తెలియని విషయం మీకెలా తెలిసింది? ఎక్కడికెళ్ళారు? ఏ పత్తేదారుని పట్టారు?” అంటూ ఒకేసారి బోలెడు ప్రశ్నలు గుప్పించాను.
అవ్వగారు నవ్వేశారు. “కొండ మన దగ్గరకి రాకపోతే మనమే కొండదగ్గరకి వెళ్ళాలి. మనవాళ్ళ రహస్యాల గురించి మనం పట్టించుకోకపోతే ఆ రహస్యాలే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మన శ్రీరంగనాథం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చెప్పాడు. కానీ సుశీలమ్మగారికి ఎందుకు చెప్పలేదనేది మాత్రం నాకు తెలియదు” అన్నారు.
“బహుశా సందర్భం వచ్చుండదు.”
“కాదు ఎంతైనా బాగా చదువ్వుకున్నవాళ్ళు కదా? అందుకే వాళ్ళకి నాలాగా ప్రతి చిన్న విషయం గురించీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉండదు. కూపీల్లాగే అలవాటూ ఉండదు. వాళ్ళు నీకక్కడ దావణగెరె వెన్నదోసె పెడితే నాకెందుకు? పెట్టకపోతే నాకెందుకు?” అంటూ సగంలో ఆపేసారు. నేను రెట్టించలేదు. ఆవిడ పూలు కట్టుకునే పనిని కొనసాగిస్తూనే అడిగారు, “ఇంతకీ వాళ్ళు అవేవో సీసాలో వాసాలో తెప్పించుకుంటామన్నారుగా వచ్చాయా?”
నేను నవ్వుతూ, “సీసాలూ వాసాలూ కాదు, వీసాలు. అవి వచ్చాయి. ఇంక వీళ్ళు వెళ్ళడమే తరువాయి” అన్నారు.
“ఐతే మనం కూడా వెళదాం”
“మీకు వీసా రాలేదుగా?”
“మనం వెళ్ళేచోటికి వీసాలక్కర్లేదు. ఆసక్తి ఉత్సాహం ఉంటే చాలు. రాత్రి అహల్యాశాపవిమోచనం నాటకం ఉంది. చాలా బాగుటుంది. మధ్యాహ్నం భోంచేసి కాసేపు నడుంవాల్చు. నాటకానికి వెళితే నిద్ర ఉండదు”
అవ్వగారికి నాటకాలంటే చాలా ఇష్టం. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు అహల్య పాఠం ఉండేది. అది గ్రాంధికభాషలో ఉండేది. అప్పట్లో పద్యాలన్నీ బట్టీపట్టడమే తప్ప దేని తాత్పర్యం ఏమిటో దేని భావం ఏమిటో అర్థమయ్యేది కాదు.. కానీ కథ మాత్రం గుర్తుంది. మనకి తెలిసిన కథలకీ అవ్వగారు చెప్పే కథలకీ చాలా తేడా ఉటుంది. అందుకే ఆవిడని అహల్య కథ చెప్పమని అడిగాను.
ఆవిడ నిట్టూరుస్తూ నవ్వారు. అలా నిట్టూర్పుల్లో కూడా నవ్వులు కురిపించడం గ్రామీణులకి వచ్చినంత బాగా నగరవాసులకి రాదు. ఆవిడ చెప్పడం ఆరంభించారు.
“మా అభిప్రాయాలకీ మాటలకీ విలువెక్కడుంది చెప్పు. అయినా అడిగింది నువ్వు కాబట్టీ చెబుతున్నాను. అహల్య గురించి చెప్పాలంటే నలుగురు పురుషుల తప్పుకు బలైన ఒక స్త్రీ. బ్రహ్మ మనసులో ఏముందో ఏమో మనకి తెలియదు. కానీ ఏడేడు లోకాల్లో ఎక్క్కడా లేని అతిలోక సౌందర్యవతిగా తనని సృష్టించాడు. అమ్మాయిని సృష్టించినప్పుడు తనని తగిన అబ్బాయిని కూడా సృష్టించాలి కదా? కానీ సృష్టించలేదు. పోనీ కనీసం తనకి తగిన వరుడెవరనేదైనా ఆమె నొసటన రాయాలా వద్దా? ఊహూ ఆపనీ చెయ్యలేదు. చివరికి జ్ఞానవృద్ధుడేకాదు వయోవృద్ధుడుకూడా అయిన గౌతమ మహర్షితో వివాహమయ్యేలా చేశాడు. సప్తర్షుల్లో ఒకడైన గౌతముడికి సాంసారిక జీవనంపట్ల ఆసక్తీ అనురక్తీ ఎలా ఉంటాయో నాకైతే అర్థం కాలేదు. ఎప్పుడూ ధ్యానంలో గడిపే ఆయన తన భార్య కోసం సమయాన్నెక్కడ కేటాయించగలడు? ఇంక ఆ ఇంద్రుడు పరమ చపల చిత్తుడు. ఆయన తన స్థాయిని మరిచిపోయి కేవలం కామానికే లొంగిపోతే అది ఎవరి తప్పు? ఇంద్రుడు గౌతముడి వేషంలో వస్తే పాపం అహల్యేం చేస్తుంది? ఆ మాయలాడి దగ్గరకి తీసుకున్నప్పుడు తన భర్తే మనసు మార్చుకుని వచ్చాడనుకోవడంలో తప్పేముంది? తన భర్తతో గడపడంలో తప్పేముంది? ఈసారి నిజంగానే గౌతముడొచ్చాడు. శాపం ఇచ్చాడు తప్పుచేసింది ఇంద్రుడైతే అతన్ని వదిలేసి అహల్యనెందుకు శపించాడో ఆయనకే తెలియాలి. అహల్యని శిలగా మారిపొమ్మని శాపం ఇచ్చాడు. నిజానికి అది శాపం కాదు. అహల్యకిచ్చిన వరం. బండరాయిలా బతికే ఆ మనసూ మమతా మానవతా లేని మోడు జీవితం కంటే గుండెలేని బండబతుకే మేలు. అప్పుడైనా ఆవిడని సుఖంగా ఉండనిచ్చారా? ఊహూ రాముడొచ్చి శాపవిమోచనం కల్పించి మళ్ళీ మొదటికి తీసుకొచ్చాడు. ఆయన్న్ పురుషోత్తముడిగా చెయ్యడానికి అహాల్యని మళ్ళీ మనిషిగా మార్చారే తప్ప పాపం ఆవిడకి ఒరిగిందేమిటి చెప్పు?” అనగానే నాకు మతిపోయింది. ఎందుకంటే అహల్య జీవితాన్నింత కొత్తకోణంలోంచి చూడటం చూపించడం కేవలం మా అవ్వగారికి తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదు.
చివరిగా అవ్వగారు తన తీర్పు ప్రకటించారు, “బ్రహ్మ, గౌతముడు, ఇంద్రుడు, రాముడు నలుగురిలో తనకి ఏ ఒక్కరూ తనకి న్యాయం చెయ్యలేదు.”
చిన్నతనంలోనే భర్తని పోగొట్టుకుని, శుభకార్యాలెన్ని జరిపించినా శుభానికి ఎదురెళ్ళలేని పరిస్థితిని అనుభవించి, సుఖసంతోషాలంటే ఏమిటో ఎలా ఉంటాయో కూడా చవిచూడని అవ్వగారికి అహల్య శిల్పంగానే ఉండిపోతే ఆమె జీవితాన్నెవరూ పట్టించుకోకపోయినా కనీసం ఆ అతిలోక సౌందర్యాన్నయినా పట్టించుకుంటుందనీ, దాన్ని చూసి లోకం ఆనందించేదనీ అనిపించడంలో ఆశ్చర్యం లేదు.
ఇప్పుడు నాక్కూడా అదే అనిపిస్తోంది. అహల్య శిల్పంగానే ఉండివుంటే మోనాలిసాని ఎవరూ పట్టించుకునేవారు కారు.
భోంచేసి పడుకున్నానేగానీ నిద్రపట్టలేదు మనసునిండా అవ్వగారి అహల్య విశ్లేషణలోని కొత్తకోణాలన్నీ పాత్రలుగా రూపుకట్టి కళ్ళముందు కదులుతూంటే నిద్రెలాపడుతుంది?
సాయంత్రందాకా అలాగే అటూ ఇటూ దొర్లుతూ గడిపాను. సాయంత్రం కాఫీ తాగాను. కాసేపు ఊరంతా తిరిగి వచ్చాను. ఆవుకి పాలుపితకబోతే అలవాటు లేని నన్ను చూసి అది తన్నేసింది. అంతలోనే పాలేరు వచ్చి పాలు పితికాడు. నేనా పాలు తీసికెళ్ళి డైరీలో పోసి వచ్చాను. రాత్రి భోజనం కాగానే చాపా దిండూ దుప్పటీ భుజాన వేసుకుని నాటకానికి బయలుదేరాము. నేను భాగీరథమ్మగారు, ఆవిడ పిల్లలు వాళ్ళ స్నేహితులు అదరం కలిసి నాటకం చూడటానికి బయలుదేరాము.
శరావతి నదీతీరంలో నాటకానికి వేదిక సిద్ధం చేశారు.
నా చిన్నతనంలో స్త్రీపాత్రలని కూడా పురుషులే పోషించేవారు క్రమంగా స్త్రీపాత్రలని స్త్రీలే పోషించడం మొదలైంది. ఈ మధ్యన యక్షగానంలో కూడా స్త్రీ పాత్రలని స్త్రీలే పోషించడం మొదలైందని విన్నాను. ఇది నిజంగా స్త్రీ సాధికారికతకు తిరుగులేని ఉదాహరణ. ఎందుకంటే యక్షగానంలో నర్తనం నాట్యంలోలాగా కోమలంగానూ సుకుమారంగానూ ఉండదు. చాలా కఠినంగా ఉంటుంది. ఈ నాటకంలో కూడా అహల్య పాత్రని అమ్మాయే పోషిస్తోందని విన్నాను. ఆ అమ్మాయి స్త్రీ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇందులో గౌతమ మహర్షిపాత్ర మాస్టారు వేస్తున్నారు. అహల్యపాత్రలో నటించడానికి శివమొగ్గనుండి రంగమంటప నట శిక్షణాలయాన్నుండి ఒక యువతిని పిలిపించారు. ఆ యువతి వయసు పాతిక ముప్ఫై సంవత్సరాల మధ్య ఉండచ్చు. కానీ చాలా అందంగా ఉంది. అహల్య పాత్రకోసం మేకప్ లేకపోయినా అహల్యంతటి సౌందర్యవంతురాలనే నమ్మకం కలుగుతోంది.
గణపతి స్తోత్రంతో నాటకం మొదలైంది.
బ్రహ్మదేవుడి పాత్రలో నటించాల్సిన నటుడు వచ్చినట్లు లేడు. అందుకే తిన్నగా గౌతమ మహర్షి ఆశ్రమం సీనుతోనే నాటకం మొదలు పెట్టారు. గౌతమ మహర్షి ధ్యానం చేస్తున్నాడు. అహల్య వచ్చింది. మనిషి ఇక్కడున్నా తన మనసెక్కడో ఉంది. దేన్నో చూస్తోంది. ఆవిడ చూస్తున్నది ఒక లేడిని. ఆ లేడి తన దగ్గరకు వచ్చింది. లేడిపాత్రలో నటిస్తున్నదెవరో కాదు, భూమిపూజ చేసినప్పటి లీడరే. తన ఫ్రెండ్సందరూ తలో ప్రాణిపాత్రలోనూ వేదికమీద జీవిస్తున్నారు.
ఆ ప్రాణులన్నింటితోనూ మమేకమైన అహల్య మనసు ఆనందోత్సాహాలతో పాటందుకుంది. నేను నాటకాన్ని కళ్ళతో చూస్తున్నా అవ్వగారి దృష్టితో అర్థం చేసుకోవడానికి ప్రయాత్నిస్తున్నాను. అందుకే కనిపిస్తున్న నాటకానికీ అనిపిస్తున్న నాటకానికీ మధ్యలో చాలా పరిణతి కనిపిస్తోంది. ఇంద్రుడి మాటల్లో ఒక రకమైన ఇంద్రజాలం ఉంది. సమ్మోహకత్వం ఉంది ఎదుటివారిని ఆకర్షించే గుణముంది. ఇన్ని ఉన్నా తనని తాను అదుపుచేసుకునే లక్షణం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. తను ఏం చేసినా అందులో తొంభైతొమ్మిది శాతం స్వార్థ ప్రయోజనాలకీ మిగిలిన ఒక్కాశాతమూ స్వర్గప్రయోజనానికీ తప్ప ఇతరుల ప్రయోజనానికి ఎంతమాత్రమూ ఉపయోగపడదు. అందుకే అహల్య గుణగణాలని కీర్తిస్తూ అతను చెప్పే ప్రతిమాటా ప్రేక్షకులచేత చప్పట్లు కొట్టిస్తోంది. అహల్యని పట్టడానికి ఇంద్రుడి మత్తెక్కించే మాటలూ, వేసే ఎత్తులూ, ఇంద్రుడు వేసే ప్రతి ఎత్తునీ చిత్తుచెసే అహల్య చాకచక్యమూ, తను పట్టబోయినప్పుడల్లా అహల్య వేసే ప్రశ్నలూ, వాటికి సమాధానం చెప్పలేక ఇంద్రుడు పడే పాట్లూ, చేసే ఫీట్లూ ఇలా దాదాపుగా అరగంటసేపు జరిగింది అహల్యని అంటుకోవడానికి ఇంద్రుడు చేసే ప్రయత్నాలని ఆమె అడ్డుకుంటున్న విధానం చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. ఎందుకంటే ఏ భార్యా తన భర్త దగ్గరకు వచ్చినప్పుడు ప్రశ్నలతో వేధించదు. పరీక్షలు పెట్టి సాధించదు. అయినా సరే అహల్య చెప్పే ప్రతి మాటా ప్రతి స్త్రీకీ ఒక రక్షణ కవచం లాంటిది. అందుకే వింటున్నకొద్దీ వినాలనిపిస్తున్నాయి. బహుశా ఇక్కడ నాటక రచయిత కొంచెం ఎక్కువ స్వేఛ్ఛ తీసుకున్నారనిపిస్తోంది. కానీ ఆ స్వేఛ్ఛ ఎక్కడా మితిమీరలేదు. అందుకే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గలేదు. ఒకవేళ ప్రేక్షకుల అవగాహనని మించిన స్వేఛ్ఛ తీసుకునివుంటే ప్రేక్షకులు అసహనానికి గురై లేచి వెళ్ళిపోయేవారు. కానీ ప్రతీ డైలాగుకీ చప్పట్లు పడుతున్నాయి.
అహల్యా ఇంద్రుల సంభాషణ అరగంటకు పైగా సాగింది.. ఏకంగా అంతసేపు కేవలం ఇద్దరే ఇద్దరు నటులు అంతమంది ప్రేక్షకులని మెప్పించాలంటే కేవలం సంభాషణల బలమో నటీనటుల చాకచక్యమో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కందించే బిల్డప్పులో ఉంటే సరిపోదు. అన్నీ కలగలిసి ఉండాలి. అప్పుడే సన్నివేశం రక్తికడుతుంది.
చివరికి భర్తరూపంలో వచ్చిన ఇంద్రుడికి కుటీర ప్రవేశం లభిస్తుంది. ఈలోగా గౌతమ మహర్షి వచ్చి ఇద్దరికీ శాపాలిస్తాడు. నాటకంలో అహల్య శాపానికిచ్చిన ప్రాధాన్యతని ఇంద్రుడికిచ్చిన శాపానికివ్వలేదు. శాపాలిచ్చిన గౌతమ మహర్షి తిన్నగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవడంతో తెరపడింది.
తెర లేచేసరికి అది దశరథుని రాజాస్థానం. విశ్వామిత్రుడొచ్చి రామ లక్ష్మణులని తన వెంట యాగరక్షణార్థమై పంపమని అడుగుతాడు. దశరథుడు ఒప్పుకోడు. విశ్వామిత్రుడికి ఆగ్రహం కలిగితే అంతా తల్లకిందులైపోతుంది. అందుకే దశరథుడిని రాముడే ఒప్పించాడు తరువాత విశ్వామిత్రులవారి వెంట బయలుదేరారు రామ లక్ష్మణులు. దారిలో గౌతమ మహర్షి ఆశ్రమం వస్తుంది.
రాముడి కాలు తగిలి అహల్య మళ్ళీ స్త్రీగా మారుతుంది. వెంటనే ప్రేక్షకులంతా రాముడికి జేజేలు పలికారు చప్పట్లు కొట్టారు. కొందరు ఈలలు కూడా వేశారు. నా మనసు కూడా ఆనందంతో గుండె పెంకులు ఎగిరిపోయేంత గట్టిగా ఈలేసింది.. ఎందుకంటే బండరాతికి మళ్ళీ ప్రాణం వచ్చింది అహల్యకి శాపవిమోచనం కలిగింది. మరీ ముఖ్యంగా ఆ శివమొగ్గ కళాకారిణి మళ్ళీ వేదిక మీదికొచ్చింది. తనకి మళ్ళీ నటించే అవకాశ్సమొచ్చింది. అహల్యకి జీవించే అవకాశమొచ్చింది. నాకు ఈ కథ గురించి మరోసారి మా అవ్వగారి దృష్టితో ఆలోచించే అవకాశమిచ్చింది.
ఈలోగా నాటకం ముగిసింది. కానీ అహల్యతోబాటు ఆ పాత్రని ధరించిన అమ్మాయి కూడా నన్ను వదిలిపెట్టలేదు. మా చిన్నప్పుడు నాటకమంటే రాత్రంతా ప్రదర్శిచేవారు. ఇప్పుడు అర్ధరాత్రికే ముగించేశారు. మక్తాయింపు పలికి తెరదించేసరికి ఒంటిగంట దాటింది .
సీతా మీరాలు లేకపోవడంవల్ల మేలే జరిగింది. సీత నగరంలో పుట్టిపెరిగింది కాబట్టీ పౌరాణిక నాటకాలపట్ల ఆసక్తి లేదు. మీరా అల్లరితో నాటకం చూడనిచ్చేది కాదు.
ఇంటికొచ్చి పడుకున్నా అహల్య పాత్రధారి మరపు రావడం లేదు. తను పదే పదే ఎందుకు గుర్తొస్తోందో కూడా అర్థం కావడంలేదు.
ఆ తరువాత తెల్లారేదాకా కాలేజీ రోజుల జ్ఞాపకాలే. ఆనాటి మధురోహల్లో తేలిపోతుంటే నిద్రెలా పడుతుంది? సూర్యుడికంటే ముందే లేచాను. అప్పటికే అవ్వగారు గుడి వెనుకనున్నతోటలోంచీ పూలు కోసుకొచ్చేశారు. భాగీరథమ్మగారు పాతకాలం కత్తిపీటతో కూరలు తరుగుతున్నారు. ఆవిడ కూరలు తరగడాన్ని చూస్తుంటే చాల విషయాలు తెలుస్తాయి. వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది ఆవిడ చూపులు. అవి కత్తిపీటమీదగానీ తరుగుతున్న కూరగాయలమీదగానీ ఉండవు. పొయ్యిమీద కాగౌతున్న పాలమీదో పొయ్యిలో ఉన్న కట్టెలమీదో పక్కనున్న మనుషులమీదో ఉంటాయి.. అంత పదునైన కత్తిపీట అంచుకు బొటనవేలు తగులుతుందిగానీ వేలుకి మాత్రం ఏమీ కాదు. అలా తరగడం ఆవిడలాంటి అతి కొద్దిమంది ప్రవీణులకి తప్ప అందరికీ సాధ్యం కాదు.
నేను బ్రష్ చేసుకుని వచ్చేసరికి కాఫీ సిద్ధంగా ఉంది. ఇత్తడి టంబ్లర్ ఇత్తడి బుడ్డిగ్లాసుల్లో భాగీరథమ్మగారిచ్చిన కాఫీ అందుకున్నాను. చేతులూ మూతులూ కాలే కాఫీని ఊదుకుంటూ తాగడం ఒక పెద్ద ఎడ్వంచర్‌లాంటిది. ఉత్తరభారతదేశంలో చాయ్ కప్పూ సాసర్లు లేదా భాండ్, కుల్హాడ్ లలాగే దక్షిణభారతదేశంలో కాఫీకీ టీకీ ఇత్తడి టంబ్లర్లూ బుడ్డిగ్లాసులు వాడతారు. సీత స్టీలు గ్లాసులూ టంబ్లర్లే తప్ప ఇత్తడివి వాడదు. భాగీరథమ్మగారు ఇచ్చిన కాఫీ తాగడం పూర్తి చేసి స్నానానికి వెళ్ళాను.
స్నానం చేశాక పంచె కట్టుకుని గుడికి వెళ్ళాను. అక్కడ జరిగే పూజలన్నింటిలోనూ పాలుపంచుకున్నాను. ఉదయంపూట దేవుడికి అభిషేకాలు, అర్చనలు, పూజలు, ధూపదీప నైవేద్యాలూ అన్నీ మనుషులకు జరిగినట్లే జరుగుతాయి. ఎందుకలా?
బహుశా దేవుడు కూడా మనిషేనేమో! మనిషి కూడా దేవుడేమో!! దేవుడికీ మనిషికీ తేడా లేదేమో!!! అందుకే ఈ మనిషి దేవుణ్ణికూడా మనిషిలాగానే భావించి తనని తాను తెలుకోవడానికి ప్రయత్నిస్తున్నాడేమో. అందుకే దేవుడిక్కూడా మనిషికి చేసే శైత్యోపచారాలన్నీ చేస్తున్నాడేమో. దేవుడిని పూజించినట్లే మనుషుల్లోని దేవుడిని కూడా ఆరాధిస్తున్నాడేమో!
ఇలా నాలో నేనే ఆలోచించుకుంటూ పూజ ముగించి ఇంటికొచ్చేసరికి ఫలహారం సిద్ధంగా ఉంది. ఫలహారం పూర్తి చేశాక ఏం చెయ్యాలో పాలుపోలేదు. అందుకే కాసేపు నడుద్దామని ఊరిలోకి వచ్చాను. అలా ముందుకు వెళుతున్నకొద్దీ శరావతి నది గట్టుకొచ్చాను. ఆ శరావతి పెళ్ళినడకలు నడుస్తూ వగలుపోతోంది. పడవ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆ పడవ అవతలివైపున ఉన్న పార్వతీపురానికి వెళుతోంది. దాన్ని చూడగానే నాకు గుడికి వెళ్ళాలనిపించింది. అందుకే మరో ఆలోచన లేకుండా వెళ్ళి పడవెక్కాను.
(ఇంకా ఉంది)
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి తెలుగు రచయిత, అనువాదకులు. ‘వలస దేవర’, ‘జంగమదేవర’, ‘అంతర్యామి’, ‘సాక్షాత్కారం’ వీరి నవలలు. ‘ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్’, ‘ఈ కథకి శిల్పం లేదు’ వీరి కథాసంపుటాలు. ప్రఖ్యాత తెలుగు కవుల సంపుటాలను కన్నడంలోకి అనువదించారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార నాటకం ‘గుళ్ళకాయజ్జి’, కేంద్ర సాహిత్య అకాడెమీ బాల సాహిత్య పురస్కారం పొందిన బోళువారు మహమ్మద్ కుణ్హి పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. వీరి నవలలకు, కథాసంపుటాలకు పలు పురస్కారాలు లభించాయి.
