Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అవ్వగారు-7

[ధనంజయ లక్ష్మీ రామకృష్ణగారు వ్రాసిన ‘మత్తె మూకజ్జి’ అనే కన్నడ నవలని ‘అవ్వగారు’ పేరుతో అనువదించి ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.]

[సరస్వతీపురం వెళ్ళిన ఆత్రేయ సుశీలమ్మగారింటికి వెళ్తాడు. ఆత్రేయని చూడగానే ఆవిడకి దుఃఖం కలుగుతుంది. కానీ కన్నీళ్ళను బయటకు రానీయకుండా నిగ్రహించుకుని వచ్చి, అతని పక్కన కూర్చుని పలకరిస్తారు. కుశల ప్రశ్నలు అయ్యాకా, సుశీలమ్మగారు అవ్వగారి గురించీ భాగీరథమ్మగారి గురించీ అడుగుతారు. భట్టుగారికి ధైర్యం చెప్పమంటారు. భోంచేసి కాసేపు నడుం వాలుస్తాడు ఆత్రేయ. సాయంత్రం స్నానం చేసి ఫ్రెష్ అయి కూర్చున్నాకా, ఆత్రేయ దగ్గరకొస్తారు సుశీలమ్మ. తన కొడుకు శ్రీరంగనాథ తన మనవల విషయంలో భారతీయ పౌరసత్వం ఉన్నవారినే న్యాయబద్ధమైన పెంపకందారుల్లా నియమించాడనీ, దాని వెనుక మూకవ్వగారి సలహా ఉందని చెప్తారు. ఆ రాత్రికి అక్కడే ఉండి పొద్దున్న బయల్దేరుతాడు ఆత్రేయ. ఇల్లు చేరేసరికి, అవ్వగారు కనబడి సుశీలమ్మ ఎలా ఉందని అడిగితే, ఆత్రేయ ఆశ్చర్యపోతాడు. తాను అక్కడికే వెళ్ళాలని ఎలా తెలిసిందని అడుగుతాడు. ఆవిడ నవ్వేస్తుంది. ఆ రాత్రి అవ్వగారితో కలిసి అహల్యాశాపవిమోచనం అనే నాటకం చూస్తాడు ఆత్రేయ. ఉదయం లేచి స్నానం చేసి గుడికి వెళ్ళొస్తాడు. అంతలో నది దాటి అవతలవైపున్న పార్వతీపురానికి వెళ్ళాలనిపించి, పడవెక్కుతాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-11

పార్వతీమాత గుడివల్లే ఆ ఊరికి పార్వతీపుర అనే పేరు వచ్చింది. కానీ ఊరికే పేరిచ్చిన పార్వతీదేవి గుడిలో మాత్రం పూజా పునస్కారాలు ఆగిపోయి దాదాపు మూడువందల సంవత్సరాలు దాటిపోయిందని చెప్పుకుంటారు. అందుక్కారణం ఏమై ఉంటుందో నాకు తెలియదు. ఊళ్ళోవాళ్ళు చెప్పే కట్టుకథల్లో వేటికీ సాక్ష్యాధారాల్లేవు. ఇంక దీనికి సమాధానం చెప్పగలవారు మా అవ్వగారు మాత్రమే. ఆవిడని తీసుకురాకుండా ఒక్కడినే ఎందుకొచ్చానో నాక్కూడా తెలియదు. శరావతి నది కులుకులూ ఉలుకులూ నన్ను పడవెక్కమన్నాయి. నేను ఎక్కాను. అంతే తప్ప వేరే కారణం లేదు, అయినా అమ్మగుడికి వచ్చేందుకు వేరే కారణాలు కావాలా?

గుడిలోకి అడుగుపెడుతుంటే అమ్మ ఒడిలోకి అడుగుపెడుతున్నట్లనిపించింది. అలా ఎందుకనిపించిందని ఎవరైనా అడిగితే నేను సమాధానం చెప్పలేను. నాకలా అనిపించింది అంతే.

గుడిలో అడుగుపెట్టగానే కనిపించింది అతి పెద్ద ఘంట. ఈ ఆలయం కట్టి దాదాపు ఏడెనిమిది వందల సంవత్సరాలై ఉండవచ్చు. ఆ రోజుల్లోనే అంత పెద్ద కంచుఘంటని అన్ని నగిషీలతో అంత ఎత్తున కట్టే లాఘవం వారికెలా వచ్చింది?. ఆశ్చర్యం ఏమిటంటే వందల సంవత్సరాలు దాటినా గంటకి కిలుం పట్టలేదు. దాన్ని చూడగానే నాకు ఆరేడువేల సంవత్సారాల క్రితమే ఇక్కడ ఇనుము వాడకం ఉధృతంగా ఉండేదని పుస్తకాల్లో చదువుకున్న విషయం గుర్తొచ్చింది. ఆ కాలంలోనే స్వచ్ఛమైన ఉక్కుని తయారు చేసిన మనం ఇప్పుడు ఇనుపఖనిజాన్ని అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నాం.

దేవాలయం చాలా పెద్దది లోపల వృత్తాకారంగా ఉంది. కుడివైపున శివుడి విగ్రహం ఉంది. శివుడికి లింగమేగానీ ఎక్కడా విగ్రహం ఉండదు. శివుడి విగ్రహం అంటే అది నటరాజు విగ్రహమో దక్షిణామూర్తి విగ్రహమో అయివుంటుందే తప్ప శివుడి నిజవిగ్రహమై ఉండదు. తిరుమలలో ఉన్నది కూడా ఈశ్వరుడి విగ్రహమే అని విన్నాను. వెంకటాద్రి అనే కొండమీద వెలిసిన ఈశ్వరుడి విగ్రహం కనుక ఆయన్ని వెంకటేశ్వరుడు అంటారని కూడా విన్నాను. ఈమధ్యన అక్కడక్కడా ధ్యానముద్రలో ఉన్న శివుడి విగ్రహాలు నెలకొల్పుతున్నారు. కానీ ఏడెనిమిది వందల సంవత్సరాల క్రితమే చెక్కిన అంత పెద్ద ఈశ్వరధ్యానమూర్తిని చూడటం ఇదే మొదటిసారి.

ఆ విగ్రహం మీద కట్టుకున్న సాలెగూళ్ళని తొలగించాను. ఆ ఆది గురువు ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. ఆ శాంతమూర్తిని చూస్తుంటే మనసుకి ఊరట కలుగుతోంది. అలా ఎంత సేపు చూస్తూ ఉండిపోయానో నాకే తెలియదు. శివుడంటే లయకారకుడు. ఉగ్రస్వరూపుడై ఉండాలి. కానీ ఇక్కడ శాంత స్ఫూర్తిగా దర్శనమిస్తున్నాడు. దాన్ని చెక్కిన శిల్పి ఎవరోగానీ గొప్ప శాంత స్వభావాన్ని విగ్రహం ముఖంలో ప్రతిక్షేపించాడు. శ్రావణబెళగొళలోని గోమఠేశ్వరుడు నుంచున్నాడు. ఈయన కూర్చున్నాడు అంతే తేడా. ముఖ కవళికల్లోనేగానీ ముఖవర్చస్సు షయంలో రెండూ రెండే. ఒకదాన్ని మించినది ఒకటిగా అనిపిస్తున్నాయి. వెంకటేశ్వరుడినీ గోమఠేశ్వరుడినీ ఈషా విగ్రహాలనీ తలుచుకుంటూ తలవంచి వందనాలర్పిస్తూ కళ్ళు మూసుకున్నాను. క్రమంగా మిగిలిన విగ్రహాలన్నీ వచ్చి ఇక్కడి శివుడి ధ్యానమూర్తిలో లీనమైపోయాయి. కళ్ళు తెరిచి చూస్తే శివుడి శాంత స్వరూపం మైమరిపించింది. ఆ ముఖారవిందాన్ని తీర్చిదిద్దడంలో శిల్పి తీసుకున్న కొలతలు చాలా నిర్దుష్టంగా ఉన్నాయి. కళ్ళు, కనుబొమ్మలు, ముక్కు, పెదవులు, చిబుకం వీటి కొలతల్లో ఏ మాత్రం తేడా వచ్చినా విగహం కేవలం రాతిబండగానే మిగిలిపోతుందిగానీ దేవతా విగ్రహం అనిపించుకోదు. ఇంక శివుడి జటాజూటాన్ని చెక్కడానికి కేవలం నైపుణ్యమో సహనమో ఉంటే సరిపోదు. అత్యున్నత స్థాయి కళాపిపాసా సౌందర్యాభిలాషా అనన్యమైన సచ్చిదానంద దర్శనమూ కావాలి.

శివుడి ముందు నందీశ్వరుడున్నాడు.

నంది మీద పేరుకున్న దుమ్ముని తుడుస్తున్నప్పుడు ఒక గమ్మత్తైన ఆలోచన వచ్చింది. ధ్యానమూర్తి ముఖవర్చస్సుని చూస్తుంటే గోమఠేశ్వరుడు మనసులోకి వచ్చాడంటే అందుకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఏమిటా కారణం? ఆయన మోక్షాన్ని పొందిన మొదటి తీర్థంకరుడు. ఆయన్ని బాహుబలి అంటారు. కానీ ఆయనకి గోమఠేశ్వరుడనే పేరెందుకు వచ్చింది? ఆయన ఆవుల మఠాన్ని స్థాపించారా? లేక ఆవులని పెంచారా? గోమాతని పూజించారా?

ఏమో ఎవరికి తెలుసు?

గోవులకీ గోమఠేశ్వరుడికీ గల సంబంధం గురించి ఆలోచించగానే వెనుకనుండి ఆవు అంబారవం వినిపించింది. వెనక్కి తిరిగి చూశాను. ఏమీ లేదు. ఆలోచనలు భ్రమల్లా కూడా మారతాయా అనే కొత్త అనుమానం కలిగింది. దాన్ని పట్టించుకోకుండా నందీశరుడిని శుభ్రం చేస్తూండగా మళ్ళీ అంబారవం వినిపించింది. మళ్ళీ వెనక్కి చూశాను. ఏమీ లేదు. గ్రామసీమల్లో అంబారవాలు వినిపించడంలో ఆశ్చర్యమేముంది? ఈమాత్రానికే ఏకంగా ఆలోచనలకీ భ్రమలకీ ముడిపెట్టేంతదూరం వెళ్ళిపోవాలా? అని నవ్వుకుంటూ నందిని శుభ్రం చేసే పనిని కొనసాగిస్తున్నాను. అలా శుభ్రపరుస్తూనే అసంకల్పితంగా వెనక్కి చూశాను. అక్కడ నిజంగానే ఒక ఆవు నిలబడి ఉంది. ఆ ఆవు తుంటిమీద త్రిశూలం పచ్చబొట్టు ఉంది. చూడటానికి చాలా అందంగా ఆరోగ్యంగా చలాకీగా కనిపిస్తోంది. అది నన్ను చూసి ఎద్దులా గుండెలదిరిపోయేంత తీవ్రధ్వనితో రంకెవేసింది. ఆ రంకె వినగానే వచ్చింది ఆవా ఎద్దా అనే అనుమానం వచ్చింది. చూస్తే పంచస్థన మండలమున్న అచ్చమైన ఆవే.. మరెందుకంత ఆగ్రహాన్ని ప్రదర్శిస్తోంది? ఆవుకు అంత ఆగ్రహం ఉండదు. మరి ఖళిల్లని ఎందుకు రంకెవేసింది?

బహుశా ఆలయానికీ దానికీ ఏదైనా సంబంధం ఉందేమో. అందుకే దానికంత కోపం వచ్చిందేమో.

అది ఒక్కసారిగా నామీదకి కొమ్ములు విసిరింది. అంటే అది నన్ను హెచ్చరిస్తోందని అర్థం. అది నన్ను హెచ్చరించేంత తప్పేం చేశానో తెలియక దానివైపు చూసి నమస్కరించాను. అది నా నమస్కారాన్నేమాత్రం పట్టించుకోకుండా ఒక్కసారిగా నామీదకి దూకింది. ఇది నేను ఊహించని పరిణామం. అందుకే అసంకల్పిత ప్రతీకార చర్యగా ఎగిరి వెనక్కి దూకి తప్పించుకున్నాను. బహుశ నేను తప్పించుకుంటానని ఆ ఆవు ఊహించినట్లు లేదు. అందుకే దానికి ఆగ్రహం ఎక్కువైంది. అందుకే ఈసారి పోట్లగిత్తలా కాలుదువ్వి నామీదకి లంఘించింది. నేను కూడా మరింత అప్రమత్తుడినై పక్కకి దూకాను. మూడవసారి మరో ప్రయత్నంగా నన్ను పొడిచింది. ఈసారి నేను తప్పించుకోవడం సాధ్యం కాలేదు. కానీ అదృష్టం కొద్దీ నేను వేసుకున్నది దళసరి జీన్స్ కావడంతో దాని పోటు నా పొట్టలోకి దిగలేదు. కానీ ఏదో అదృశ్యహస్తం అత్యంత బలంగా గుద్దినట్లైంది. నేనింక దానిని పట్టించుకోకుండా దానికి అందకుండా దూరంగా పరుగెత్తుకొచ్చాను పరుగు ఆపి వెనక్కి తిరిగి చూస్తే నేను ఆలయం బయట ఉన్నాను.

నేను బతుకుజీవుడా అనుకుంటూ ఆ ఆలయంలోకి తొంగి చూశాను. ఆవు కనపడ లేదు. అయినా నా అనుమానం తీరలేదు. అందుకే ఆవు ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా కనిపిస్తుదేమో అని అడుగులో అడుగు వేసుకుంటూ లోపలకి వెళుతున్నాను. ఒకవేళ ఆ ఆవుగనక కనిపిస్తే నా కాళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నా అదృష్టం కొద్దీ ఆవెక్కడా కనపడలేదు. నందీశ్వరుడిని శుభ్రం చేసే కార్యక్రమం సగంలో ఆగిపోయింది. అయినాసరే దానివైపు వెళ్ళడానికి ధైర్యం చాల్లేదు. అందుకే ఆ శివుడి ఆలయానికి వ్యతిరేకదిశలో ఉన్న ఆలయంలోకి వెళ్ళాను. అది పార్వతీదేవి గుడి. అదే ఆ గుడిలో ప్రధానాలయం. ఆ గుడిలో దాదాపు పన్నెండడుగుల ఎత్తున్న విగ్రహం కనిపించింది. అమ్మవారు. మహిషాసుర మర్దినిగా రౌద్ర మూర్తిరూపంలో వెలిసిందక్కడ. మహిషాసురుడి తలనుండి కారే రక్త ప్రవాహాన్ని కూడా మలిచారా ఆ మహాశిల్పి. ఇరవై చేతుల్లోనూ కత్తి గద విల్లు గద మొదలైన ఆయుధాలున్నాయి. ఆ రౌద్రస్వరూపిణి అయిన శక్తిమాతను చూస్తే ఎంతటి ధైర్యవంలకైనా గుండెలు గుబగుబలాడిపోవలసిందే.

అమ్మవారి ఇరవై చేతులకూ గాజులు, వాటి రూపకల్పన ఎంతో కళాత్మకతని కలిగి ఉన్నాయి. ఏగాజుకాగాజే విడివిడిగా చెక్కడం కంటే ఒకేలాంటి పదేసి గాజుల్ని అచ్చులో పోతపోసినట్లుగా చెక్కడం చాలా కష్టం. ఆ గాజులు శిల్పుల నైపుణ్యానికి కఠినాతి కఠిన పరీక్ష. ఇంక ముక్కుకు ముక్కెర, చెవులకు లోలాకులు, వేళ్ళకి ఉంగరాలు, దేని అందం దానిదే. అంత అందమైన డిజైన్లు ఈనాటి స్వర్ణకారులు కూడా రూపొందించలేరు. దేశంలో తయారయ్యే ఆభరణాలన్నింటి రోల్ మోడల్సూ హళేబీడు బేలూరుల్లో ఉన్న విగ్రహాలు, స్తంభాలమీద చెక్కిన డిజైన్లే. ఈ విగ్రహానికున్న ఆభరణాల డిజైన్లు చూస్తే స్వర్ణాభరణాల మాల్స్ వాళ్ళందరూ పార్వతీపురానికి క్యూ కడతారు. అంతందంగా ఉన్నాయి. మెడలో కాసులపేరు, వజ్రాల హారాలు, కంఠ హారాలు, ఒక్కొక్కటీ ఒక్కొక్క అద్భుతం. ఇంక చీర కుచ్చెళ్ళు, మడతలు, అంచులు మొదలైనవాటిలో ప్రతి చిన్న వస్త్రవిశేషాన్నీ చాలా స్పష్టంగా చెక్కారు. అన్నింటినీ కలిపి చూస్తే ఆ విగ్రహం ఒక కళావిలాసాన్ని పుక్కిట పట్టిన శిల్పసామ్రాట్టు పరికల్పనలకీ రచనకీ రసనకీ గొప్ప ఉదాహరణలు. మంచి కవులూ రచయితలెవరైనా దీనిని చూస్తే కేవలం ఆభరణాల తయారీ గురించే ఎన్నో పుస్తకాలు రాయవచ్చు. కొత్త డిజైన్ల కోసం అన్వేషించే స్వర్ణ వస్త్ర వ్యాపారులందరికీ ఈ విగ్రహం ఒక అందాలగని. కలకత్తాలోనే కాదు ఉత్తరభారతదేశంలో చెక్కిన దుర్గామాత విగ్రహాలకు సంబంధించిన ఫోటోలూ వీడియోలూ చూశాను. కానీ దక్షిణభారత దేశంలో ఇంత అద్భుతమైన విగ్రహాన్ని మాత్రం చూడలేదు. ఉత్తభారతంలో ఎక్కువ పాలరాతి విగ్రహాలే. కానీ ఇది నల్లరాతి విగ్రహం. నల్లరాతి విగ్రహానికి అభిషేకాలు చేసినకొద్దీ నునుపుదేలుతూ వస్తుంది. ఆ నునుపూ ఆ మెరుపూ మిగిలిన రాళ్ళలో ఉండవు.

భారతదేశంలో ఉన్నంతటి శిల్పకళావైభవం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. అది భారతీయులందరికీ గర్వకారణం. కానీ మన దురదృష్టం కొద్దీ విద్యావిధానం పూర్తిగా సాంకేతిక విజ్ఞానాన్నే ఆశ్రయించుకుని కొనసాగుతోంది. చరిత్రకీ సామాజిక శాస్త్రానికీ ఎలాంటి ప్రాధాన్యతా లేదు. దాంతో మనం ఏమిటో మన సంతానానికి తెలియకుండాపోతోంది. గుడంతా తిరిగి చూస్తే ఇలాంటి విగ్రహాలు మరికొన్ని కనిపించే అవకాశం ఉందనుకుంటూ పార్వతీమాత అంతరాలయంలోంచీ బయటికి వచ్చాను. ఆ పక్కన మూడువైపులా మూసివేసిన ఒక పెద్ద మంటపంలాంటి చావిడి కనిపించింది. అందులో ఏముందో చూద్దామని అటు అడుగు వెయ్యగానే ఆ ఆవు మళ్ళీ అడ్డం వచ్చి నిలబడింది. అంటే నాకు అటువైపు వెళ్ళే అవకాశం లేదని అర్థమైంది. అందుకే కిక్కురుమనకుండా వెనక్కి తిరిగాను.

గుడిలోండి బయటకు వచ్చి రెండుఫర్లాంగుల దూరం నడిచాక పంచాయితీ కార్యాలయం కనిపించింది దాని పక్కనే దేవాదాయ ధర్మాదాయశాఖ విభాగం కూడా ఉంది. నేరుగా అక్కడికి వెళ్ళాను. ఆ కార్యాలయంలో పని చేసే అధికారిని కలిశాను. నా గురించి వివరాలన్నీ తెలుసుకున్నాకగానీ ఆయన నాతో మాట్లాడటానికి అంగీకరించలేదు.

నేను ఎన్నారై అని తెలియగానే ఆ అధికారిలో అంతవరకూ ఉన్న ఉదాసీనభావం తగ్గి పోయి కొంత ఆసక్తి కలిగినట్లుంది. అందుకే, “మీకేం కావాలో చెప్పండి” అని అడిగారు. ఆలయంలో పూజలు జరగనప్పుడు దానికెందుకు తాళం వెయ్యలేదు అని అడిగాను. దానికి సమాధానంగా ఆయన చిన్నగా నవ్వి, “మీకక్కడ ఆవు కనిపించిందా? అది మీదకొచ్చిందా? మిమ్మల్ని కుమ్మడానికి కొమ్ములెగరేసిందా? దూడల్నేమైన ఆంటే తప్ప ఆవులెక్కడైనా ఊరికే కుమ్ముతాయా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ తరువాత చెప్పడం కొనసాగించారు, “మా తాత ముత్తాతల కాలం నించీ ఆ ఆవు వంశానికి చెందిన ఏదో ఒక ఆవు దేవాలయాన్ని కాపలా కాస్తూనే ఉంది. కాస్త జాగ్రత్తగా గమనించి చూస్తే దాని శరీరం మీద ఒక త్రిశూలం లాంటి మచ్చ కనిపిస్తుంది. అది మనుషులు వేసిన అచ్చుకాదు. ఆ వంశపు ఆవుల్లో ఆలయాన్ని కాపలాకాసే ఆవుకి మాత్రమే ఉంటుందా గుర్తు. అంటే అది ఆ ఆలయాన్ని చూసుకునే బాధ్యత నిర్వర్తిస్తుందని అర్థం. తనకి ఇష్టంలేనివారెవరినీ లోపలకి రానివ్వదు. తాళాన్ని చూస్తే శివాలెత్తినట్లు చిందులు తొక్కుతుంది. అందుకే ఆలయంలో ఎక్కడా తాళం కప్ప చిహ్నాలు కూడా కనపడవు. దానిముందు నిలబడే ధైర్యం ఎవ్వరికీ లేదు. మీకోవిషయం తెలుసా? గతంలో మహాశివభక్తుడొకాయన తన భక్త బృందంతో సహా ఇక్కడికి వచ్చి ఆ ఆవుని మంత్రమేసి మాయచేసి దానిని తీసుకువెళ్ళి శరావతి నదిని దాటించి దూరంగా వదిలిపెట్టి వచ్చారట. కానీ వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆలయంలో దానికంటే పెద్ద ఆవొకటి కనిపించిందట. అది ఎలాంటి మాయామంత్రాలకూ లొంగలేదట. దాంతో ఆ శివభక్తుల బృందం ఆ ఆవునికి నమస్కరించి దానికి పూజలు చేసి ప్రసన్నం చేసుకున్నారట. దానికి కూడా త్రిశూలం మచ్చ ఉంది. అంటే అది కూడా ఆ వంశానికి చెందిన ఆవే. అది అంతకాలం ఎక్కడ ఉందో ఎలా పెరిగిందో అక్కడికెలా వచ్చిందో ఎవరికీ అంతుపట్టలేదు. ఆ ఆవు ఆలయం పరిసరాల్లో పెరిగే గడ్డీగాదం తింటాయి. శరావతి నదిలో నీళ్ళు తాగి వస్తాయి. ఆ ఆవుని ఎవరూ ఏమీ అనరు ఎవరైనా ఆ గుడి తాళం వెయ్యాలని చూస్తే తనని కొమ్ములతో కుమ్మి తరిమేస్తాయి” అని చెబుతుంటే నాకు విస్మయం కలిగింది. ఇలా కూడా జరిగే అవకాశం ఉందా? అని ఆలోచించుకుంటూ, “గుడి ముయ్యనివ్వకపోతే దాన్ని తెరిచే ఉంచి దీపధూప నైవేద్యాలతో నిత్యపూజలూ సేవలూ కైంకర్యాలూ జరిపించవచ్చు కదా?” అని అడిగాను.

ఆ అధికారి నవ్వుతూ, “ఆ ఆవు ఆలయానికి తాళం వెయ్యనివ్వదు. ఎవరినీ లోపలకి రానివ్వదు పూజలు చెయ్యనివ్వదు. అంతే కాదు, ఎవరైనా గుడిముందు నిలబడి పూజలు చేసినా ఆ సంవత్సరం మేఘాలు వర్షించవు. పంటలు పండవు. పండిన పంటల్ని చేతికొచ్చేలోపే తెగుళ్ళో పురుగులో ఆశించి సర్వనాశనం చేస్తాయి వాటిబారినుండి తప్పించుకున్నా ఏనుగుల దాడినుండి ఏ పంటా తప్పించుకోలేదు. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎవరూ గుడివైపు తిరిగి పూజ కూడా చెయ్యరు” అని చెబుతుంటే నాకు నాకు నోట మాట రాలేదు

అంతలోనే ఒకావిడ గ్లాసునిండా మజ్జిగ తెచ్చిచ్చారు. ఆలయంలో ఎదురైన సంఘటనలూ అధికారి చెప్పిన వివరణలూ కలిసి నా నోరెండిపోయేలా చేశాయి. అందుకే గ్లాసుడు మజ్జిగా రెండేరెండు గుక్కల్లో తాగేసి అక్కడ పెట్టాను. ఆవిడ వెనక్కి వెళ్ళినట్లే వెళ్ళి రెండే రెండు నిమిషాల్లో మరోగ్లాసు మజ్జిగ తీసుకొచ్చింది. ఆవిడ సహృదయతకి కృతజ్ఞతలు చెబుచెప్పి ఈసారి మజ్జిగ రుచిని ఆస్వాదిస్తూ మెల్లగా తాగాను. అప్పటికే మధ్యాహ్నమైంది. అందుకే ఆ అధికారికి వీడ్కోలు చెప్పి వెనక్కి బయలుదేరాను.

నేను నది ఒడ్డుకు చేరేసరికి పడవ అప్పుడే బయలుదేరింది. పది పదిహేను మీటర్లు ముందుకెళ్ళిపోయింది. అయినా నన్ను చూడగానే పడవవాడు వెనక్కి తీసుకొచ్చాడు.

ఈసారి పడవ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నా గుడిలోని అనుభవాన్నే శ్వాసిస్తూ ఉండిపోవడంతో పడవ అవతలి ఒడ్డుకి ఎప్పుడు చేరిందో తెలియలేదు. పడవవాడు దిగమనేదాకా కూర్చున్నచోటే ఉండిపోయాను. లేను. నేను నాలో లేను. నేను ఎవరికీ కాను. ఎవరిలోనూ లేను. నేను నేనే కాను. ఇలా ఎన్నోరకాల భావనలు నాలో కావ్యరూపాన్ని సంతరించుకుంటూ ఉంటే నాకు ఒంటిమీద స్పృహ ఎలా ఉంటుంది. అందుకే పడవవాడు రెండోసారి పిలవగానే సిగ్గుపడుతూ లేచాను. అతనికి డబ్బులిస్తుంటే. “మీరు గుడిలోకి వెళ్ళారా?” అని అడిగాడు. నేను ఔనన్నట్లు తలాడించాను. అతను, “ఆ గుడిలోకి వెళ్ళొస్తే ఎంతవారికైనా ఇదే పరిస్థితి వస్తుంది బాబూ” అని చెబుతుంటే నేను చిరునవ్వుతో ముందుకు కదిలాను.

శరావతీ నదీమతల్లికి నమస్కరించి ఇంటికి వెళ్ళాను. నన్ను చూడగానే భాగీరథమ్మగారు, “స్కూలు దగ్గరా లేవు. గుడిదగ్గరా లేవు. ఎవరికీ చెప్పాపెట్టాకుండా ఎక్కడికెళ్ళావు తమ్ముడూ?” అని అడిగారు. ఆవిడ తమ్ముడూ అని అంత ఆప్యాయంగా పలికిన సంబోధనలోంచీ చిన్నప్పుడు నన్ను పెంచిన ఆత్మీయత అంతా తొంగిచూస్తోంది.

నేను సమాధానం చెప్పేలోగానే అక్కడికొచ్చారు అవ్వగారు.

అంతలోనే అక్కడికొచ్చిన అవ్వగారు మా భాగక్కగారిని చూసి నవ్వుతూ, “ఇంకెక్కడికి ఏ పార్వతీపురం గుడికో వెళ్ళొచ్చుంటాడు” అన్నాక నావైపు తిరిగి, “అంతేనా?” అని అడిగారు.

మనం చెప్పకపోయినా ఎవరు ఎక్కడికెళ్ళి ఉంటారో ఎందుకెళ్ళి ఉంటారో అవ్వగారు ఊహించినంత ఖచ్చితంగా ఎవ్వరూ ఊహించలేరు. నేను అవ్వగారివైపు తిరిగి, “ఔనవ్వగారూ, పార్వతీపురానికే వెళ్ళాను. ఆ గుడిని చూశాను. ఆ అద్భుతాల్ని చూశాను. ఆ దైవత్వాన్ని చూశాను. అది ఒక కళాభిరామం. సకల కళాభిరామం. మన శిల్పుల కళానైపుణ్యానికి పెట్టని కోట. అంత చక్కటి శివుడి ధ్యానమూర్తినిగానీ.., దుర్గమ్మ రౌద్రరూపాన్నిగానీ ఎక్కడా చూడలేదు. అక్కడి శిల్పసౌందర్యం చూడటానికి రెండు కళ్ళూ చాలవు” అన్నాను.

అవ్వగారు నవ్వుతూ, “మీ నాన్నగారికి ఆ గుడన్నా దాన్ని కాపలా కాసే అవులన్నా ఎంతో ఇష్టం. వీలైనప్పుడల్లా వెళ్ళివస్తూండేవారు. ఆయన తప్పితే ఇంకెవరూ వెళ్ళేవారు కారు. పూజా పునస్కారాలు లేని గుడి కదా? అమ్మవారు ఆగ్రహిస్తే ఏం జరుగుతుందో అనే భయం. ఆ ఆవు ఎప్పుడేం చేస్తుందో అనేది అంతకు మించిన భయం. కానీ మీ నాన్నగారికి మాత్రం ఆ గుడంటే చాలా ఇష్తం. ఆయన కొడుకువి కదా? నీకూ ఆమాత్రం ఇష్టం ఉండటంలో ఆశ్చర్యం లేదు. నేను కూడా చాలాకాలంగా ఆ గుడికి వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వెళ్ళేలోపు ఇద్దరం వెళ్ళొద్దాంగానీ వెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కునిరా భోంచేద్దుగాని” అన్నారు.

అధ్యాయం-12

అవ్వగారు తెల్లవారు జామున మూడుగంటలకి లేచి తొలికోడి కూసే దాకా ధ్యానం చేస్తారు. ఆ ధ్యానమే క్రమశిక్షణనీ ఆరోగ్యాన్నీ మనోబలాన్నీ ఇస్తుందని అందరూ అంటారు.

సామాన్యంగా ఎవరైనా ధ్యానం ఎందుకు చేస్తారు? చెడు ఆలోచనలను దగ్గరకి రానివ్వకుండా చెయ్యడానికీ మంచి ఆలోచనలకి దూరం కాకుండా ఉండటానికీ చేస్తారు.

అదీ నిజమే. కానీ నాకు అనిపిస్తున్నది మాత్రం వేరు. ధ్యానం అనే మాటలో రెండక్షరాలున్నాయి. వాటిలో ఒకటి ధీః అంటే బుద్ధి. రెండవది యానం అంటే ప్రయాణం. మనం మన మనసుకి ఎలాంటి కట్టుబాట్లూ ఆశలూ ఆశయాలూ లేకుండా స్వేఛ్ఛగా వదిపెట్టాలి. ఆ స్వేఛ్ఛలోకి ప్రయాణిస్తున్నకొద్దీ మనసుకి అన్ని పరిధిలనీ అధిగమించి ప్రయాణించడం అలవాటవుతుంది. బహుశా అవ్వగారి మనసు కూడా వర్తమానాన్ని దాటి గతంలోకీ భవిష్యత్తులోకీ ప్రయాణించేంత పరిణతిని పొందివుంటుంది. అందుకే ఆవిడ మనసు టైం మెషీన్‌లా మారి జరిగిందాన్ని జరిగినట్లుగా దర్శించి చెప్పగలుగుతున్నారేమో అనిపిస్తుంది.

టైం మెషీన్ అనేది ఒక ఊహ. ఒక కల్పన. ఒక సంభావ్యత. అంతేగానీ అది సాధ్యమో కాదో చెప్పడానికి సాక్ష్యాధారాల్లేవు. మనం సాక్ష్యాధారాలు చూపిచలేనంత మాత్రాన ఉన్నవన్నీ లేనట్లేనా? ఇదేనా ఆధునిక చింతన? అన్నీ అందరికీ తెలియడం. అన్నీ అందరికీ అర్థం కావడం. అన్నిటి గురించీ అందరూ చెప్పగలగడం ఎప్పటికైనా సాధ్యపడుతుందా? ఒకవేళ అదే సాధ్యమైతే మనుషులందరూ పనిముట్లుగా మారిపోరా? మనుషుల జీవితం యాంత్రికంగా మారిపోదా?

అవ్వగారు ధ్యానం చేసుకుంటున్నప్పుడు గమనించాను. ఆవిడ చేతిలో రుద్రాక్ష మాల ఉంటుంది. ఆవిడ వేళ్ళు కదలవు కానీ మాలకున్న పగడం మాత్రం క్రమంగా తన స్థానాన్ని మార్చుకుని తిరుగుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఒకసారి మీరు కదల్చకుండా ఆ మాల ఎలా కదులుతుంది? అని అడిగాను.

ఆవిడ వెంటనే చిన్నపిల్లాడిని అడిగినట్లుగా అడిగారు

“అన్నం పెడితే ఆవులు కాస్తావా?”

“ఊ కాస్తా”

“హోళిగలిస్తే కోతలు కోస్తావా?”

“ఊ కోస్తా?”

“పిల్లనిస్తే పండగ చేస్తావా?”

“ఊ చేస్తా”

“పులొస్తే పారిపోతావా?”

“ఊహూ దాన్ని చంపేసి దాని గోరు మెళ్ళో వేసుకుంటా”

అనగానే ఉఫ్ అంటూ కంట్లోకి ఊదారు. నాకు తెలియకుండానే కళ్ళు మూసుకున్నాను.

“చూశావా కళ్ళు మూసుకున్నావు? కంటి రెప్ప వెయ్యకుండా ఎవరూ ఎంతోసేపు చూడలేరు.. కానీ చూస్తున్నామనే భ్రమలో ఉంటారు. ధ్యానం చేస్తుంటే మనసు కూడా మనకి తెలియకుండానే కదులుతుంది. ఆ మనసే రుద్రాక్షమాలలోని పగడం. దాన్ని ధ్యానమే కదిలిస్తుంది. కానీ కన్ను చూడలేదు” అన్నారు.

ఆ తరువాత ఎన్నోసార్లు ధ్యానం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాను. ఆ విషయం అవ్వగారికి చెబితే ఆవిడ నవ్వేశారు.

“నువ్వు మనసు పెట్టి పని చేస్తున్నప్పుడు నీకు ఆ పని తప్ప ఇంకేదైనా గుర్తొస్తుందా?” అని అడిగారు.

నేను ఏమాత్రం తడుముకోకుండా “రాదు” అని చెప్పాను.

“అదే ధ్యానం” అన్నారావిడ. అంతే కాదు, చేస్తున్న పనిమీద ఏకాగ్రత కుదరనప్పుడు. లౌకిక సంబంధాలు, సుఖ దుఃఖాలూ కష్టనష్టాలూ మనల్ని ప్రబావితం చేసినప్పుడు వాటిని మనసులోకి రానివ్వకుండా ఉండటం కోసం చేసే సాధనే ధ్యానం. మనసుని ఏకాగ్రంగా పనిమీద కేంద్రీకరించినప్పుడు నువ్వు చేసే పని నీ జీతాన్ని నీ జీవితాన్ని మించి ఎంతోదూరం వెళ్ళిపోతుంది. నీ కృషి ఫలితం మీ యజమాని లాబాన్ని మించి ఎంతోమందికి ఎన్నోవిధాలుగా లాభం చేకూరుస్తుంది. అవునా?”

“ఔను”

“అదీ ధ్యానమే. ఏది మంచో ఏది చెడో ఎవరు చెప్పగలరు? నాకు మంచనిపించింది నీకు చెడుగానూ నీకు మంచనిపించింది నాకు చెడుగానూ కనిపించే అవకాశాలెప్పుడూ ఉంటాయి. ఎక్కువమందికి మంచనిపించే పనులు చేయించే ఇంధనమే ధ్యానం. అది నువ్వు చేస్తూనే ఉన్నావు. నీవల్ల ఎక్కువమందికి చెడు జరిగినప్పుడు దాన్ని నువ్వు గుర్తించకపోయినా నీ మనసు గుర్తిస్తుంది. కలవర పడుతుంది. నిన్ను కూడా కలవరపెడుతుంది. అప్పుడు నీ దృష్టి నీ పనిమీద నిలబడదు. దాన్ని మళ్ళీ నీలోకి తీసుకురావడానికీ నిన్ను మళ్ళీ నీలోకి తీసుకురావడానికీ నీ మనసు చేసే ప్రయాణమే ధ్యానం” అని చెప్పిన మాటలు నేనెప్పటికీ మరచిపోలేను. ఇదంతా ఏ ఆధ్యాత్మిక గురువు దగ్గర వేర్చుకున్నారని అడిగితే అంతకు మించిన పిచ్చిప్రశ్న ఉండబోదు.

***

అవ్వగారు ఎనభయ్యేళ్ళ వయసులో కూడా అందరికీ తల్లో నాలుకలా ఉంటూ ఊరందరి పనులూ స్వంతపనుల్లా చేసిపెట్టేంత శక్తీ సామర్థ్యాలు కలిగి ఉండటానికి కారణం ఆవిడలోని ధ్యాన చైతన్యమే అనిపిస్తుంది. అవ్వగారిని పార్వతీపురం తీసుకువెళ్ళి అక్కడి ఆలయం చూపించి ఆవిడ చెప్పే కథో కల్పనో చరిత్రో వినాలనే ఉత్సాహం క్రమంగా పెరుగుతోంది. కానీ ఆవిడ కనపడీతే కదా? ఆవిడని వెతుక్కుంటూ గుడి కెళ్ళాను. పొలానికెళ్ళాను. తోటంతా వెతికాను. ఎక్కడా కనపడలేదు. ఈలోగా మాస్టారితో మాట్లాడాల్సిన విషయాలు గుర్తొచ్చాయి. అటునించి అటే బడికి వెళ్ళాను. అక్కడ అవ్వగారు ఆడుకుంటున్నారు. పిల్లలతో కలిసి ఊర్మిళాదేవి నిద్ర గురించి పాట పాడుతున్నారు. ఆవిడ పాట వింటున్నకొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది. ఆ పాట వింటూ మైమరచిపోతున్నాను. ఊర్మిళాదేవి నిద్రలోంచి క్రమంగా వనవాసానికి వెళ్ళిపోతోంది. భరతుడు తను పాలిస్తున్న అయోధ్య తనదికాదనీ కేవలం రాముడి ప్రతినిధిగా పాలిస్తున్నాననీ తీర్పులు చెప్పేదీ నిర్ణయాలు ప్రకటించేదీ వాటిని అమలు చేసేదీ అంతా అన్నగారి పాదుకలేననీ నేను అన్నగారి ప్రతినిధినిమాత్రమేననీ చెబుతున్నాడు. పిల్లలు ఎంతో శ్రద్ధగా వింటున్నారు. నిజానికి అవన్నీ హళెగన్నడ గీతాలు. అంటే పాతకాలంనాటి పాటలు. వాటిలో చాలా పదాలకి అర్థాలు పెద్దలక్కూడా తెలియవు. కానీ పిల్లలు మాత్రం శ్రద్ధగా వింటున్నారు. అంత శ్రద్ధగా వినడానికి కారణం అవ్వగారి పాటలోని లయ. ఆవిడ గొంతులోని మార్దవం. దానికితోడు వయసు తెచ్చిన సన్నని కంపన. పాటలు చూపించినంత ప్రభావాన్ని మాటలూ పాఠాలూ చూపించలేవు.

అంతలోనే అక్కడికి వచ్చారు మాస్టారు. నావైపు చూస్తూ, “మూకవ్వలాంటివారు గురువులైతే మాలాంటివాళ్ళకి ఉద్యోగాలెక్కడొస్తాయి ఆత్రేయా” అన్నారు. ఆ మాటలు అవ్వగారి చెవినపడ్డాయి. వెంటనే ఆవిడ, “అలాగని చెప్పి పనంతా నా నెత్తిన తోసేసి మీరు మీ స్వంతపనులు చూసుకుందామనుకుంటున్నారా అదేం కుదరదు” అన్నారు.

ఆవిడలో అంతటి చమత్కార చాతుర్యం ఉందని ఊహించని నేను నోరువెళ్ళబెట్టుకుని చూస్తున్నాను.

మాస్టారికంటే గట్టిగా నవ్వారు పిల్లలు. నేను కూడా నవ్వులతో శ్రుతి కలిపాను. ఈలోగా పిల్లలంతా అటెన్షన్ లోకి వచ్చి గుడ్మాణింగ్ సార్ అంటూ మాస్టారికి అభివందనం చేశారు. అక్కడితో ఊరుకోలేదు. నాక్కూడా గుణ్మాణింగ్ చెప్పారు. అవ్వగారిక్కూడా గుడ్మాణింగ్ చెబుతారనుకున్నాను. కానీ ఆవిడకి మాత్రం అందరూ చేతులు జోడించి నమస్కరించారు. ఎందుకంటే ఆవిడని గౌరవించడానికి వారి దగ్గర మాటల్లేవు.

మాస్టారు నావైపు చిరునవ్వుతో చూశారు, “చూశావా ఆత్రేయా, అదీ మాలాంటి జీతం కోసం పనిచేసే మాస్టార్లకీ జ్ఞానం కోసం జీవించే గురువులకీ తేడా” అన్నారు. ఆ తరువాత మాటలు పొడిగించకుండా నన్ను లోపలకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. అంతవరకూ జరిగిన పని వివరాలు చెబుతూండగా అప్పన్నగారొచ్చారు. ఆయన కష్టజీవి. తెలివైనవాడు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పినపని చెప్పిన టైముకంటే ముందే పూర్తి చేసే సమయనిష్ఠ కలిగినవాడు. వేసవి శలవలు ముగిసేలోగా బడి పునర్నిర్మాణం పనులు చేస్తాననని మాట ఇచ్చారు.

అంతలోనే గంటమోగింది. పిల్లలందరూ చెట్లకింద వరుసలుగా కూర్చున్నారు. లీడర్ చెబుతుంటే పిల్లలు రాయడం మొదలు పెట్టారు. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో కన్నిపించే దృశ్యమే కావచ్చు. కానీ ఇక్కడ కనిపిస్తున్న దృశ్యంలో మాత్రం ఏదో భిన్నత్వం ఉంది. ఏదో చైతన్యం ఉంది. అందుక్కారణం క్లాసులో ఉన్నది టీచర్ కాకపోయినా. చెబుతున్నది లీడరే అయినా విద్యార్థులందరూ లీడర్ని కూడా ఉపాధ్యాయుడిలాగే గౌరవించడం ఆ క్రమశిక్షణని చూసినవారందరూ ఆ లీడర్‌కి బాగా ట్రైనింగిచ్చారనుకుంటారు. కానీ అక్కడ పిల్లలందరూ లీడర్లే. రోజుకో విద్యార్థి లీడర్‌గా ఉంటాడు. మాస్టారు ఇచ్చిన హోం వర్క్ చేయిస్తాడు. ఆవిధంగా విద్యార్థులందరిలోనూ లీడర్‌షిప్ క్వాలిటీస్‌తో బాటుగా నేర్చుకోవడం ద్వారా నేర్పడం ఎలాగో తెలుసుకుంటారు. అదే మా మాస్టారి ప్రత్యేకత. తను ఏం చెప్పాలో అదే చెబుతారు. పిల్లలు ఏం నేర్చుకోవాలో అది వాళ్ళంతట వాళ్ళే నేర్చుకోవడం ఎలాగే నేర్పుతారు. అప్పుడు పిల్లల్లోని సృజనాత్మక సామర్థ్యాలు మెరుగుపడతాయి.

“అయినా వేసవికాలం శలవులు కదా? మీ పిల్లలకి శలవులెందుకివ్వలేదు?” అని అడిగాను.

మాస్టారు నాకు సమాధానం చెప్పకుండా పిల్లలవైపు చూశారు. లీడర్ సారథ్యంలో బోధన కొనసాగుతోంది. ఎక్కడా ఎలాంటి సమస్యా లేదనిపించగానే ఆయన నావైపు తిరిగి చెప్పడం మొదలుపెట్టారు, “వీళ్ళంతా మా మంజేగౌడ సార్ స్టూడెంట్స్. ఆయన్ని శివమొగ్గనించీ ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేశారు. కాబట్టీ ఆయన ఇక్కడే ఇల్లు తీసుకుని ఉండాలి. కానీ ఆయన భార్య ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. డాక్టర్ల పర్యవేక్షణ అవసరం. మనూరి ఆరెంపీ డాక్టర్‌కీ ఆయుర్వేదం డాక్టర్‌కీ ఆ వైద్యం తెలియదు. కాబట్టీ శివమొగ్గ నించీ మకాం మార్చలేరు. అంత దూరాన్నించి ఇక్కడికి వచ్చేసరికే పుణ్యకాలం గడిచిపోతుంది. నాలుగక్షరాలు చెప్పేసరికి భోజనానికి బెల్లవుతుంది. మధ్యాహ్నం హడావిడిగా ఓ పాఠం అలా చెబుతారో లేదో ఇంటర్వెల్. ఆ వెంటనే ఆయన బయలుదేరక తప్పదు. దాంతో ఆ క్లాసు విద్యార్థులందరూ కాస్త వెనకబడటం సహజం. వాళ్ళంతా వచ్చే సంవత్సరం నా దగ్గరికొస్తారు. రేపు నా నా తరగతిలోకి రాబోయేవాళ్ళని నేనైనా సిద్ధం చేసుకోవాలి కదా? అందుకే ఈ సమ్మర్ స్పెషల్ క్లాసులు.” అంటూ పరిస్థితిని వివరించారు.

నేను సాలోచనగా చూస్తూ, “మంజేగౌడసార్ని వాళ్ళ శివమొగ్గకే బదిలీ చేయిస్తే సరిపోతుంది కద్సార్?”అని అడిగాను.

మాస్టారు వైరాగ్యంగా నవ్వుతూ, “ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అదేళ్ళూ పూర్తయ్యేదాకా అనుభవించక తప్పదు. ఇది మూడో సంవత్సరం. ఇంకో రెండేళ్ళు తంటాలుపడీతే బదిలీ కాలం వస్తుంది” అన్నారు. నాకు మా మాస్టారిలో ఆకర్షించే గుణం ఇదే. ఎదుటివారి సమస్యలకి పరిష్కారం వెతుకుతారే తప్ప తన సమస్యని మాత్రం ఎవరినెత్తిమీదా రుద్దరు.

అప్పన్న ఉన్నట్లుండి బిగ్గరగా నవ్వారు. ఆ నవ్వుకి కారణం తెలిసినవారిలా గుంభనంగా నవ్వుకుంటున్నారు మాస్టారు. నాకంతా అయోమయంగా తయారైంది. అప్పన్న, “మంజేగౌడగారు ట్రాన్స్‌ఫరవ్వడానికి మూడేళ్ళు పడుతుంది. ఆలోగా మాస్టారుగారు రిటైరైపోతార్లెండ్సార్” అన్నారు. దాంతో నాక్కూడా నవ్వొచ్చింది. నవ్వుతూనే, “అంటే ఒక తరం మారుతుందన్నమాట. కొత్త నీరు కొత్త విలువలు కొత్త చదులు కొత్త పాఠాలు..” ఆ తరువాత ఏం చెప్పాలో అర్థంకాక అర్ధోక్తిలోనే ఆపేశాను.

నా మాటల్ని అందుకున్నారు మాస్టారు, “ఔను అంతా కొత్తగానే ఉంది. ఇక్కడి విద్యార్థి ముఖం కూడా చూడని ఉపాధ్యాయులు పేపర్లు దిద్దుతారు. వాళ్ళు మార్కుల్నే తప్ప విద్యార్థుల్ని కొలవలేరు. అలాగే ఇక్కడి పనిచేసే ఉపాధ్యాయుడి పనితీరుని ఎక్కడో జిల్లా కేంద్రంలో కూర్చునే అధికారి కొలుస్తారు. ఆ అధికారికి ఎవరేం చెబుతున్నారో ఎవరేం చేస్తున్నారో తెలియదు. అయినా ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టీ ఎవరో ఒకరిన్ని ఎక్కడో ఒకచోటికి బదిలీ చేసి చేతులు దులుపుకుంటారు. వాళ్ళూ వాళ్ళపని చెయ్యాలిగా? మంజేగౌడగారి పరిస్థితినీ నా పరిస్థితినీ పట్టించుకునేదెవరు?”

నాకేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు.

కానీ మాస్టారు కొనసాగిస్తూనే ఉన్నారు, “మా బడులే కాదు మేం చెప్పే చదువులూ అలాగే ఉన్నాయి. మనకి చరిత్రని రాసుకునే అలవాటు లేదు. అంటే మనకి మన పని చెయ్యడమే తప్ప మన గురించి మనం సాధించిన విజయాల గురించీ చెప్పుకునే అలవాటు లేదు. మనకి సహాయం చేసినవారి ఔదార్యాన్ని మెచ్చుకుని కృతజ్ఞతని ప్రకటించే సంస్కృతి మనది. కానీ మన దేశంలోకి వచ్చినవాళ్ళకి వారి గొప్పలు చెప్పుకోవడమే తప్ప మన విజయాలని గుర్తించి గౌరవించే అలవాటూ లేదు. ఆ సంస్కారమూ లేదు. ఆంగ్లేయులు మనల్ని వదిలిపోయినా వారి జాడ్యాలు మాత్రం మనల్ని వదిలిపెట్టలేదు. మొఘలుల గురించి ముప్ఫైపేజీలుంటే మనవాళ్ళ గురించి మూడు పేజీలు కూడా ఉండవు. ఉన్నవాటిలో కూడా మొఘలులకీ ఆంగ్లేయులకీ కొమ్ముకాసినవాళ్ళ కథలే ఉంటాయి. మాటకి ముందు ముప్ఫైసార్లు ఆర్యులంటారు. వాళ్ళెక్కడినించో ఇక్కడికొచ్చారంటారు. వాళ్ళిక్కడికి రాకముందు ఇక్కడ మనుషులు లేరా? వాళ్ళని గౌరవ సూచకంగా ఆర్యులని పిలిచేవాళ్ళు కారా? సారుగార్లు సారుగార్లని వాళ్ళనీ.., సాబ్ సాబ్ అంటూ వీళ్ళనీ పిలుస్తారుగానీ ఆర్యా అంటూ ఎవరూ ఎవరినీ సంబోధించరు. సంబోధించనివ్వరు. అందుకే మౌర్యులు, గుప్తులు, పల్లవులు, చోళులు మొదలైనవారి గురించి ఎవరూ మాట్లాడరు. అశోకుడి గురించి అంతో ఇంతో చెప్పినా.., ‘బౌద్ధము స్వీకరించెను – చెట్లు నాటించెను’ అనే తప్ప ఆయన్ని ‘దేవానామ్ ప్రియ’ అని ఎందుకంటారో ఆ స్థాయిని అందుకోవడానికి ఆయన ఏం చేశారో ఎవరూ చెప్పరు. కానీ అలెగ్జాండర్ ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్‌ల గొప్పదనాన్ని గురించి చెవులు దిబ్బెళ్ళు వేసేలా ప్రచారం చేస్తారు. ఆ ప్రచారం చేసేవారెవరో బయటివారు కారు. మనవారే. కూర్చున్న కొమ్మనే నరుక్కునేవాడే కాళిదాసయ్యాడు కదా అని మన చరిత్ర కొమ్మలన్నీ మన చేతులతో మనమే నరికేసుకుంటున్నాం. మనం పుస్తకంలో ఉన్నదే చెప్పాలి. దానికి పూరకంగా ఏవైనా మంచి విషయాలు చెబితే వినేంత ఓపిక పిల్లలకి ఉండదనే సాకుతో వీళ్ళ అలసత్వాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు” అంటుంటే నాకెంతో ఆనందమూ ఆ వెనువెంటనే ఆవేదనా కలిగాయి.

మా మాస్టారు గణితశాస్త్రం చదువుకున్నవారు. అయినాసరే ఆయనకి చరిత్ర పట్లగల ఆసక్తి గొప్పది. అదే నా ఆనందం. ఇంక చాలామంది చరిత్రోపాధ్యాయులకి చర్రిత్రంటే యూరప్ ఖండం చరిత్రే చరిత్రే. వారి దృష్టిలో మనం చరిత్రహీనులం. నిజానికి వాళ్ళంతా మనదేశమ్మీదకి దండయాత్రలకొచ్చారే తప్ప మనం మన ఖండాన్నిదాటి ఎవరిమీదకీ యుద్ధానికి వెళ్ళలేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు దోచుకోవడానికి కావలసినంత సంపద మన దగ్గరుంది. అందుకో దోపిడీ యాత్రలు చేశారు. కానీ అప్పటికే మనం సంపన్నులం. కనుక పొట్టకూటి కోసమో సంపదల కోసమో విదేశాలపై దండయాత్రలు చేయాల్సిన అవసరం రాలేదు. అందుకే, “ఇదంతా కేవలం చరిత్ర విషయంలోనే జరిగిందా లేక మిగిలిన శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా జరిగిందా?” అని అడిగాను.

మాస్టారు నిర్వేదంగా నవ్వారు. ఆ తరువాత, “నువ్వు కూడా ఆల్గారిథమ్స్ గురించి చదివావుగా. అరబ్బు దేశస్థుడైన అల్-క్వారిజ్మి అనే గణిత విజ్ఞాని ఎనిమిదవ శతాబ్దంలో ఇక్కడికి వచ్చాడు. ఇక్కడి గణిత విజ్ఞాన శాస్త్రాలను అభ్యసించాడు. అనంతరం ‘హిసాబ్-అల్-హింద్’ అనే పుస్తకాన్ని రాశారు. దాన్ని పాశ్చాత్యులు తీసుకుని అల్గారిథమ్స్ అని పిలిచారు. దాన్నే ఇంగ్లీషువాళ్ళ దగ్గరనించి మళ్ళీ మనం నేర్చుకుంటున్నాం. అంటే మన పాఠాలు మనకే చెప్పి మనకి రావలసిన క్రెడిట్ వాళ్ళు పొందుతున్నారు. మన దగ్గర మొదలైన జ్ఞానం మళ్ళీ మన దగ్గరకే వచ్చింది. మన గణితపరిజ్ఞానంతో విస్తరించిన వాళ్ళే చివరికొచ్చేసరికి గణిత విజ్ఞానంలో మనమే శూన్యమని వెక్కిరించే స్థితికి తీసుకొచ్చారు. కానీ ఆ శూన్యాన్ని కనిపెట్టింది మనమే. ఆ సున్నే లేకపోతే దశాంశమానం లేదు. ఆ దశాంశమానం లేకపోతే మిలియన్లూ ట్రిలియన్లూ లేవు. రోమ్‌లో రోమన్‌లా ఉండాలంటారు. మనం ఆ రోమన్లలాగా కూడికలూ తీసివేతలూ రాకపోతే కనీసం నాలుగంకెలు కూడా నేర్చుకోలేనంత దీనమైన పరిస్థితుల్లో లేము. కానీ మన పిల్లలకి రోమన్ అంకెలు నేర్పడంలో చూపించిన శ్రద్ధ మన మాతృభాషలోని అంకెలని నేర్పడంలో చూపించడం లేదు. మన కన్నడిగులు కన్నడంలో అంకెలు రాయడం చూసి తెలుగువాళ్ళు తెలుగంకెలు నేర్చుకోనందుకు బాధపడ్డం నాకు తెలుసు. కానీ ఈమధ్య మనవాళ్ళు కూడా మన అంకెలని మరచిపోయే స్థితికి వస్తున్నారు. అలాగే దేన్నైనా సున్నతో భాగిస్తే వచ్చే విలువని ఇన్ఫెనిటివ్ అంటారు. దాన్నే మనవాళ్ళు గణిత పరిభాషలో అనంతం అనే పేరుతో పిలిచేవాళ్ళు. వేదగణితంలో ఆపస్తంభ సూత్రాలలో పైథాగరస్ సిద్ధాంతం ఉంది. మనకి చరిత్ర పేరుతో మనం సాధించిన విషయాలని ప్రచారం చేసుకునే అలవాటు లేదు. మాధవుడు, ఆర్యభట్టు, బ్రహ్మగుప్తుడు, భాస్కరుడు, పింగళుడు ఇలా ఎంతోమంది ఉన్నారు. ఎంతో గొప్ప సాధన చేశారు. కానీ వాటి గురించి ఎవరూ మాట్లాడరు. వాళ్ళ లెక్కంతా కాళిదాసంటే ఇండియన్ షేక్స్పియర్ అన్నట్లుంటుంది. కాళిదాసు ముందా షేక్స్పియర్ ముందా? షేక్స్పియర్ ఈజ్ లైక్ కాళిదాసా అని కదా చెప్పాల్సింది! ఒక్కొక్కసారి ఈ పాఠాలు చెప్పాల్సి వస్తున్నందుకు కలిగే నిర్వేదం అంతా ఇంతా కాదు” అంటూంటే మా మాస్టారి విశ్వరూపం కనిపించింది. ఆయన చెప్పిన మాటలన్నీ అక్షరసత్యాలు. మేము మా మాటల్లో పడి అప్పన్నగారిని పట్టించుకోలేదు. అయినా మాస్టారు చెబుతున్న మాటల్ని విస్మయంగా వింటూ ఉండిపోయారు. కాస్త విరామం దొరకగానే తనొచ్చిన పని చెప్పారు, ఎడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోయారు.

(ఇంకా ఉంది)

Exit mobile version