Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అవ్వగారు-8

[ధనంజయ లక్ష్మీ రామకృష్ణగారు వ్రాసిన ‘మత్తె మూకజ్జి’ అనే కన్నడ నవలని ‘అవ్వగారు’ పేరుతో అనువదించి ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.]

[పార్వతీపురానికి వెళ్ళిన ఆత్రేయ అక్కడి పార్వతీమాత గుడికి వెళ్తాడు. ఆ గుడిలో పూజా పునస్కారాలు ఆగిపోయి దాదాపు మూడు వందల ఏళ్ళు గడిచాయని చెప్పుకుంటుంటారు. కారణమేమిటో ఆత్రేయకి తెలియదు. గుడిలోకి అడుగుపెట్టగానే ఓ భారీ కంచు గంట కననపడుతుంది. దాన్ని చూసి అబ్బురపడతాడు. లోపల శివుడి విగ్రహం ఉంటుంది. విగ్రహం మీద ఉన్న సాలెగూళ్ళని తొలగించి, ఆ లయకారుడిని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడికి ఓ ఆవు వచ్చి పెద్దగా రంకె వేస్తుంది. ఆత్రేయ మీదకి కొమ్ములు విసురుతుంది. పొట్టలో పొడువబోతుంది. ఆలయం బయటకు పరుగెత్తుకు వస్తాడు ఆత్రేయ. శివుడి గుడికి ఎదురుగా ఉన్న పార్వతీమాత ఆలయానికి వెళ్తాడు. అమ్మవారి రౌద్రమూర్తిగా రూపంలో దాదాపు పన్నెండు అడుగుల ఎత్తైన విగ్రహం ఉంటుంది. అత్యద్భుతమైన శిల్పకళ ఉట్టిపడుతూంటుందా విగ్రహంలో. ఇంకో మండపం వైపు అడుగులు వేస్తుంటే, ఆవు వచ్చి మళ్ళీ అడ్డగిస్తుంది. బయటకు వచ్చేసి, పంచాయతీ కార్యాలయానికి వెళ్తాడు. అక్కడున్న అధికారితో మాట్లాడుతాడు. ఆయన ఆ ఆవు గురించి చెప్తాడు. తర్వాత నది దాటి ఇల్లు చేరుతాడు ఆత్రేయ. అవ్వగారు ఆ గుడి గురించి చెప్పి, మనిద్దరం మరోసారి వెళ్ళొద్దాం అంటారు. మర్నాడు ఉదయం ఆత్రేయ నిద్ర లేచేసరికి అవ్వగారు ఇంట్లో ఉండరు. ఊర్లోకి వెళ్ళి చూస్తే, బడిలో పిల్లలకి రామాయణం కథలు చెప్తూంటారామె. ఇంతలో మాస్టారు గారొచ్చి పలకరిస్తారు. నేటి విద్యావిధానం గురించి మాట్లాడుకుంటారు మాస్టారుగారు, ఆత్రేయ. కాసేపటికి మేస్త్రీ అప్పన్న వచ్చి ఎడ్వాన్స్ తీసుకుని వెళ్తాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-13

రస్వతీపురంలో ఒక మంచి నర్సరీ ఉంది. అక్కడినుండి మామిడి, సపోటా, జామ సీతాఫలం లాంటి పండ్ల మొక్కలు, రంగురంగుల గులాబీలు, మందారాలు, సంపంగి మొదలైన పూలమొక్కలు తెప్పిద్దామన్నాను. మాస్టారు అన్నింటికీ ఒప్పుకున్నారుగానీ సంపంగి మాత్రం వద్దన్నారు. ఆ వాసనకి పాములొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టీ పిల్లలు తిరిగే చోట అలాంటి మొక్కలు పెంచడం మంచిది కాదని చెప్పారు. తరువాత మేస్త్రీ అప్పన్నగారికీ ఆయనతోబాటు పనిచేసే కూలీలకీ ఉజ్జాయింపుగా ఎంత ఖర్చవుతుందని అడిగాను.

మాస్టారు నవ్వేస్తూ, “పైసా కూడా ఖర్చు కాదు” అన్నారు. ఆయనకి నేను అడిగింది సరిగ్గా అర్థమైందో కాలేదో అనే అనుమానంతో “అదేంట్సార్ ఎవరూ ఉత్తిపుణ్యానికి పని చెయ్యరు కదా?” అన్నాను.

ఆయన చిరునవ్వుని కొనసాగిస్తూనే “అప్పన్నని అడిగితే బడికీ గుడికీ డబ్బులడక్కూడదన్నాడు. తను మేస్త్రీ కాబట్టీ జరుగుబాటుకి ఇబ్బంది ఉండదు. కానీ దినసరి కూలీలకి డబ్బులివ్వకపోతే రోజు గడవదు. కాబట్టీ వాళ్ళకూలి నేను పెట్టుకుంటాను” అన్నారు.

నేను వద్దన్నాను. కానీ ఆయన, “మా స్కూలు అభివృద్ధి కోసం నువ్వు చేస్తున్నదానితో పోలిస్తే నేనిచ్చేదసలు డబ్బేకాదు. ఏదో ఉడతాభక్తిగా నా వంతు సహాయం నన్ను కూడా చెయ్యనివ్వు ఆత్రేయా” అన్నారు. వారి మాటలకు నా దగ్గర సమాధానం లేదు. అందుకే ఊరుకున్నాను.

పార్వతీపురంలో ఆవుని చూసినప్పటినుండి నా మనసులో ఇదమిత్థంగా చెప్పలేని ఆలోచనలేవో సుళ్ళు తిరగడం మొదలుపెట్టాయి. ఇప్పుడు మాస్టారితో మాట్లాడుతూండగా ఆ ఆలోచనలన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. ఇక్కడ చదివే పిల్లలకి మంచి పోషక విలువలుండే ఆహారం లభించదు. పాలు సంపూర్ణాహారం. కాబట్టీ పిల్లలందరికీ ఒకపూటైనా గ్లాసెడు పాలిచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది నాకు. ఇదే విషయం మాస్టారికి చెప్పాను.

ఆయనకూడా సాలోచనగా తల పంకిస్తూ, “ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. మన బడిలో వంటేచేసే వెంకటమ్మగారికి ఆవుల్ని పెంచడంలో మంచి అనుభవం ఉంది. ఆవిడకి నాలుగావులు కొనిస్తే పాల సంగతి తను చూసుకుంటారు. ఒకవేళ ఆవుల్ని కొనాలనే ఆలోచన ఉంటే మాత్రం జర్సి హాల్స్టీన్ లాంటి విదేశీ ఆవులు వద్దు. మన ప్రాంతాల్లో పుట్టిపెరిగిన నాటు ఆవులు తీసుకో. ఇక్కడి పిల్లలకి ఇక్కడి ఆవుల పాలు పనిచేసినంత ప్రభావయుతంగా విదేశీ ఆవుల పాలు పనిచెయ్యవు” అన్నారు. నేను వెంటనే మంచి ఆవుల గురించి కనుక్కోమని చెప్పాను.

స్వదేశానికీ విదేశానికీ తేడా ఒకటే, స్వదేశంలో మనం జీవిస్తాం. జీవించడానికి కావలసిన మానసిక శారీరక అవసరాలన్నీ తీర్చుకోవడానికి తగిన వాతావరణం, తగినన్ని సౌకర్యాలు మన చుట్టూ ఉంటాయి. అదే విదేశాలకి వెళితే మన లక్ష్యం జీవించడం కాదు. సంపాదించడం మాత్రమే. మనం వెళ్ళింది సంపాదించడానికే కాబట్టీ మన దృష్టి సంపాదనమీద తప్ప ఇంక దేనిమీదకీ వెళ్ళదు. అంతే కాదు మనం చేసే ఆలోచనలు మన వ్యక్తిగత జీవితం కూడా మనం పనిచేసే సంస్థ అభివృద్ధికే ఉపయోగించేందుకు తగిన పరిస్థితులు మన చుట్టూ ఉండేలా చూసుకోవడంలో మనలాగే మన సంస్థకూడా కావలసినంత ప్రాధాన్యతనిస్తుంది.

అక్కడివాళ్ళంతా అక్కడి జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తారు. మనం బలవంతంగా అనుభవిస్తాం. అది మన జీవితం కాదు కాబట్టీ మనకి తగిన జీవితానికి తగిన జీవులను వెతుక్కోవడంతోనే కాలం గడిచిపోతుంది. స్వదేశంలో మన కన్నడిగుల మధ్య రామరావణయుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అదే విదేశాల్లో అయితే అందరూ ఒకే చేతి వేళ్ళలా కలిసి పిడికిలి బిగించి మరీ ఐకమత్యాన్ని చాటుకుంటారు. ఎందుకు? మన జీవితం లేని చోట కనీసం కనీసం మనమైనా కలిసుండకపోతే ఎలా? మన అస్తిత్వాన్ని మనం చాటిచెప్పుకోకపోతే ఎలా? అక్కడి స్థానికుల దాష్ణీకాన్నుండి తప్పించుకోవడానికైనా మన ఐకమత్యాన్ని చాటుకోక తప్పదు. అక్కడ మనవాళ్ళపై చూపించినంతటి ఆసక్తిని అక్కడి స్థానికులపై చూపించడం సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళగురించి మనకి తెలియనివ్వరు. వాళ్ళని వాళ్ళు గోప్యంగానే ఉంచుకుంటారు.

నాతోబాటు పనిచేసే అక్కడి స్థానికుల్లో అలెక్స్ అందరికంటే ఎక్కువ దగ్గరైనవాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వు కూడా చాలా భోళాగా ఉంటుంది. ఆ నవ్వే నన్నతనికి దగ్గర చేసింది. ఎందుకంటే అక్కడివారి నవ్వు కూడా వారి భాషలాగే గొంతులోంచి వస్తుందిగానీ గుండెల్లోంచి రాదు. కానీ అలెక్స్ అలా కాదు. మనస్ఫూర్తిగా నవ్వుతాడు. తను ఎప్పటిలా కాకుండా ఏదో బాధలో ఉన్నట్లనిపించడంతో, “మన సంతోషాన్ని మాత్రమే ఇతరులతో పంచుకోవాలి, బాధల్ని కాదు అనే భావనా దాని ఆచరణా మంచిదేగానీ, అన్నింటినీ దాచుకోకూడదు. మరీ ముఖ్యంగా సమస్యలని దాచుకున్నకొద్దీ అవి కోతిపుండు బ్రహ్మరాక్షసిలా మారిపోతాయి” అని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశానుగానీ అతన్ని చెప్పమని బలవంతపెట్టలేదు.

తను కూడా సాలోచనగా నావైపు చూశాడుగానీ విషయం మాత్రం బయటపెట్టలేదు. ఆ రాత్రే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అలెక్స్ గుర్తొచ్చినప్పుడల్లా తన పరిస్థితి తెలిసికూడా అతనికేమీ సహాయం చేయలేకపోయానే అనే వేదన నా మనసుని కలచివేస్తూనే ఉంటుంది.

పుస్తకాలు చదువుకున్నవాళకీ జీవితాన్ని చదువుకున్నవాళ్ళకీ ముఖ్యమైన తేడా అదే. ఒకవేళ నా స్థానంలో అవ్వగారుంటే అలెక్స్ స్వేఛ్ఛకి అతి ప్రాధాన్యతనిచ్చి అతని గురించి తెలుసుకోకుండా ఉంరుకుంటారా? తన సమస్యేమిటో అడిగి తెలుసుకునేవారు. చెప్పకపోతే ఎవరో ఒకరిద్వారా ఏదో ఒకవిధంగా తెలుసుకుని ఉండేవారు. వెంటనే ఆ సమస్యని పరిష్కరించుకునే మార్గం చెప్పేవారు. లేదా తనే దగ్గరుండి పరిష్కరించేవారు. బహుశా అలెక్స్ బంధువర్గంలో మా మూకవ్వగారిలాంటివారు ఎవరూ లేరేమో! ఉంటే తను మా మధ్యన తిరుగుతూ నవ్వులు పంచుతూనే ఉండేవాడు.

రెండేళ్ళక్రితం నవ్వులన్నింటినీ మూటకట్టుకుని వెళ్ళిపోయిన మిత్రుడిని తలుచుకుంటూ మాస్టారి దగ్గర వీడ్కోలు తీసుకుని ఇంటికి బయలుదేరాను.

ఇంటికి వెళ్ళేసరికి అవ్వగారు మామిడి ముక్కల ఊరగాయ పెట్టడానికి ఏర్పాట్లలో ఉన్నారు. ఉసిరి, నిమ్మ, పండుమిరప, వంకాయ, మునక్కాయ ఇలా అన్నిరకాల ఊరగాయలూ పెడతారు. ఊళ్ళో ఎవరు ఊరగాయ పెట్టుకోవాలన్నా అన్నీ తీసుకొచ్చి ఆవిడ ముందు పెడతారు.

ముక్కలు కోసి, ఎండబెట్టి, కారం పొడికొట్టి, నూనె గానుగాడించుకొచ్చి, ఉప్పుతో సహా అన్నీ తీసుకొచ్చి అవ్వగారిస్తారు. ఆవిడ వాటన్నింటినీ సమపాళ్ళలో కలుపుతారు. ఆ పని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. పాళ్ళు మారకుండా వేసుకోవచ్చు. కానీ వాళ్ళు వేసుకుంటే అన్నీ సమపాళ్ళలో కుదిరిన ఊరగాయ సిద్ధమౌతుందిగానీ దానికి రుచి రాదు. ఆ రుచి అవ్వగారి చేతిలోనే ఉందనేది అందరి నమ్మకం. ఈసారి ధర్మేగౌడగారింటినించీ ఊరగాయ సామగ్రంతా సర్వసన్నద్ధంగా ఉంది. గౌడగారి ఊరగాయంటే అందులో అంతా పటాటోపం తప్ప ఊరూ ఉండదు కాయా ఉండదు. ఊరేసిన మామిడి ముక్కలు మొయ్యడానికి ఒకరు. ఉప్పు తేవడానికి ఇంకొకరు. కారంపొడి మరొకరూ ఇలా నాలుగు రకాలు తేవడానికి నలభై మందొస్తారు. ఇక్కడ కాకుండా ఇంకెక్కడికైనా వెళితే వాళ్ళందూ ఈపాటికి గౌడగారి గొప్పదనం గురించి సామూహిక గేయ శిక్షణా కార్యక్రమం ఆరంభించేవారే. కానీ అక్కడున్నది అవ్వగారు. ధర్మేగౌడగారి పేరులో తప్ప ధర్మమూ గౌడరికమూ ఇంకెక్కడా లేవని అవ్వగారికి బాగా తెలుసు. ఆయన గొప్పలన్నీ ఊరంత పెద్ద బుడగైతే దాన్ని చిటికెలో పేల్చగల సూదిలాంటివారావిడ. అందుకే అందరూ మౌనంగా నిలబడి చూస్తున్నారే తప్ప ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. అవ్వగారు ఊరగాయ కలపగానే భజనపరులంతా ఊరగాయని జాడీలకెత్తుకుని అవ్వగారికి నమస్కరించి వెళ్ళిపోయారు.

నేను ఆవిడని చూసి అభినందనపూరకంగా నవ్వుతూ, “ఇచ్చట ఊరగాయలు కలపబడును – అనే బోర్డు పెట్టి బెంగుళూరులో అంగడి తెరిస్తే ఏడాదిలోపే మీరు కోటీశ్వరులైపోతారు” అన్నాను.

అవ్వగారు, “ఎంత పెద్ద బెంగుళూరైనా మన జమునాపురానికి సాటి రాదు” అనే ఒక్కమాటతో నా పొగడ్తని కొట్టిపారేశారు.

కానీ తన మాటల్ని మాత్రం కొనసాగించారు, “ఈ గౌడగారూ మన భట్టుగారూ ఇంచుమించు ఒకే ఈడువాళ్ళు. మీ తాతగారు వాళ్ళింటికి వెళ్ళి పాఠాలు చెప్పి వచ్చేవారు. గౌడ ఉచ్చారణలోని స్పష్టత చూసి ముచ్చటపడి మీ తాతగారు తనకి వేదమంత్రాలు కూడా నేర్పేవారు. వేదమంత్రాలు పలికే నోటితో మాంసం తినకూడదని ఆయన పూర్తి శాకాహారిగా మారిపోయారు. ఆయన మద్యమాంసాలు ముట్టరు. వాటి వాసన కూడా పట్టదు. ఆయన గొంతువిప్పి వేదం చదువుతుంటే జమునాపురం అంతా భక్తిభావంతో పులకించిపోయేది. ఆయన ఊరికి గౌడగారే అయినా మనింటికి మాత్రం మంచి మిత్రుడు. ప్రతిరోజూ మనింటికి రాకుండా గడిచేది కాదు. అంతే కాదు, ఏరోజూ వట్టి చేతులతో వచ్చేవారు కాదు. పండో కాయో ఆకుకూరలో గుమ్మడికాయలో తీసుకుని వచ్చేవారు. వద్దన్నా వినేవారు కాదు. మమ్మల్ని మీరు ఋణగ్రస్తుల్ని చేస్తున్నారనేవారు మీ తాతగారు. ఆయన గట్టిగా ‘నవ్వుతూ లేదు స్వామీ జన్మజన్మాల ఋణం తీర్చుకోకపోతే ఎలా?’ అని ఎదురు ప్రశ్నించేవారు.”

అవ్వగారి మాటల్లో ఋణం తీర్చుకోవడం అనేది నాకు ఆసక్తి కలిగించింది, “జన్మజన్మాల ఋణం తీర్చుకోవాలంటే అసలు జన్మలంటూ ఉండాలి కదా?” అన్నాను.

“ఈ జన్మల్లాంటివన్నీ మనం మళ్ళీ పుడతామా లేదా? వచ్చే జన్మలో మనిషిగా పుడతామా లేక జంతువుగా పుడతామా? ఇలాంటి గురించి ఆలోచిస్తూ బుర్ర పాడుచేసుకోవడానికి కనిపెట్టినవి కావు. ఏమీ ఆశించకుండానే ఎదుటివారికి సహాయం చెయ్యడానికి పురికొల్పడానికి పనికొస్తాయి. తప్పులు చెయ్యకుండా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి పనికొస్తాయి” అన్నారు అవ్వగారు. ఆవిడంత గొప్ప సామాజిక విశ్లేషకురాలు ఇంకెవ్వరూ లేరు. అందుకే సమాజానికి క్రమశిక్షణా నైతిక ప్రవర్తనలు జన్మ-కర్మ సిద్ధాంతాలు ఎలా పనికి వస్తాయో ఒక్కమాటలో సూటిగా చెప్పగలిగారు.

నేను ఆవిడవైపు అభినందన పూర్వకంగా చూశాను. అలా చూసినప్పుడు ఎంతటివారైనా మాట్లాడుతున్న విషయంలోంచి క్రమంగా స్వోత్కర్షలోకి వెళ్ళిపోతారు. కానీ అవ్వగారు మాత్రం పట్టించుకోరు. “గౌడగారినేమో జమునాపురం బడి చదువు పూర్తికాగానే తీసుకెళ్ళి శివమొగ్గ కాలేజీలో చేర్చారు. కానీ మన భట్టుని మాత్రం మడి ఆచారం, పూజలూ పునస్కారాలూ అంటూ ఊరు దాటనివ్వలేదు” అన్నారు.

నాకో చిన్న అనుమానం వచ్చింది. అది తప్పని నాకూ తెలుసు. అయినాసరే అవ్వగారేం చెబుతారో విందామనే ఉద్దేశంతో అడిగాను, “అంత మంచి మనసున్న గౌడగారు ఊరగాయ కలిపించుకోవడానికి మనుషుల్ని పంపారుగానీ ఆయనెందుకు రాలేదు?”

“రావడానికాయనెక్కడున్నారు? నేను చెబుతున్నది ధర్మేగౌడ గురించి కాదు. వాళ్ళన్నగారి గురించి. ఆయనతో బాటుగానే మనూరి గౌడరికం కూడా గోడమీది పిల్లిలా మారిపోయిందిగానీ చెప్పేది పూర్తిగా విను” అంటూ చెప్పడం కొనసాగించారు.

“కాలేజీల్లో చదువులు నేర్చుకునే అవకాశంతోబాటుగా అన్నిరకాల వ్యసనాలనీ నేర్చుకునే అవకాశాలు కూడా లెక్కలేనన్ని ఉంటాయి. కాలేజీ చదువు పూర్తి చేసుకుని జమునాపురానికి వచ్చేసరికి ధూమపానం మద్యపానాలతోబాటు జూదం కూడా నేర్చుకుని వచ్చారు. ఒక సందర్భంలో మీ తాతగారు వెళ్ళి గౌడగారికి నాలుగు మంచిమాటలు చెప్పి నలభై చెడ్డమాటలు విని వచ్చారు. ఆయన ఏమన్నారో ఈయన ఏమి విన్నారో తెలియదుగానీ అంతవరకూ కొనసాగిన రుణానుబంధం కాస్తా వ్యసనాల దారుణానుబంధానికి బలైపోయింది. అప్పటినుండి గౌడగారి తమ్ములుంగారే కాదు గౌడగారు కూడా ఇటువైపు రావడం మానేశారు. అది మీ నాన్నగారు పుట్టినప్పుడు మీ తాతగారు గుడిలో పూజలు చేయిస్తూ ఉండేవారు. గౌడగారూ ఈయనగారూ మాట్లాడుకోవడం మానేసినా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మాత్రం మానలేదు. మీ తాతగారిలో, తన శిష్యుడీవిధంగా పాడైపోతున్నాడనే బాధ నానాటికీ పెరగసాగింది.

ఇటునించి నరకడం సాధ్యం కానప్పుడు అటునించి నరుక్కురావాలి. అందుకే తిన్నగా వెళ్ళి పెద్దగౌడగారిని కలిశాడు. కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్ళి చెయ్యమని సలహా ఇచ్చారు. ఆయన మీ తాతగారి మాటని ఎప్పుడూ జవదాటినాడు కాదు. వెంటనే వివాహం జరిపించారు పెద్దాయన..

ఆవిడని చూశావుగా, చూడాగానే రెండు చేతులూ ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది. అందానికి అందం. గుణానికి గుణం. వాటికి వినయ విధేయతలు అదనం. కొత్తాపాతా లేకుండా అందరినీ పలకరిస్తుంది. అందరినీ ఒకేలా గౌరవిస్తుంది. ఆవిడని బాధపెట్టడం ఇష్టంలేక గౌడగారు పొగా మద్యం తాగడం మానేశారు. పేకాటకోసం శివమొగ్గ వెళ్ళడం కూడా మానేసి గౌడమ్మతోడిదే లోకంగా ఉండేవారు. ఈలోగా పంచాయితీ ఎన్నికలొచ్చాయి. గౌడని పోటీచెయ్యమని చుట్తూ ఉండే భజనపరులందరూ బాగా పురెక్కించారు. ఆయన పోటీ చేశారు. పోటీలో గెలిచి పంచాయితీ సభ్యుడయ్యారు. ఇంట్లో గౌడమ్మకి నెలలు నిండి కానుపుకోసం పుట్టింటికి వెళ్ళింది. అక్కడ బంగారంలాంటి కొడుక్కి జన్మనిచ్చి తను మాత్రం తనువు చాలించింది.

అప్పటికే ధర్మేగౌడకి వివాహమైంది. ఆయన భార్యే పిల్లాడిని కన్న కొడుకులా చూసుకోవడం మొదలుపెట్టింది.

కట్టుకున్న భార్య లేకపోయినా పిల్లవాడి బాధ్యతయినా ఆయన్ని అదుపులో ఉంచుతుందనునేవాళ్ళంతా. కానీ ఏదీ మనం అనుకున్నట్లు జరగదు కదా? గౌడగారికి భార్యపోయిందనే వంకదొరికింది. దాంతో మళ్ళీ నెమ్మదిగా తాగడం మొదలుపెట్టాడు. ఈసారి తాగుడు మరో కొత్త వ్యసనానికి దారితీసింది. క్రమంగా స్త్రీలోలుడిగా మారాడు. వ్యవసాయం చూసుకోవడానికి తమ్ముడున్నాడు. లెక్కలు చూసుకోవడానికి గుమాస్తా ఉన్నాడు. కొడుకుని చూసుకోవడానికి మరదలుంది. ఇంక మీటింగుల సాకుతో టౌనుకెళ్ళిరావడానికి కారొకటే తక్కువ. అందుకే కారు కొనుక్కుని ఊళ్ళు తిరగడం మొదలుపెట్టాడు. గౌడగారి మరదలు చిన్నమ్మ. బంగారంలాంటి మనిషి. గౌడగార్లిద్దరూ మనింటికి రాకపోయినా చిన్నమ్మ మాత్రం అప్పుడప్పుడూ మనింటికి వస్తూండేది. అందుకే గౌడగారింట్లో ప్రతి చిన్న విషయమూ నాకు తెలిసేది.

ఎలాంటి గౌడగారెలా తయారయ్యారో ఊహించుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. ఎంత చదువు చదివినా ఎంత జ్ఞానం పెంచుకున్నా చెడు అలవాట్లని దూరంగా పెట్టకపోతే తనతోబాటు తనని నమ్ముకున్నవాళ్ళు కూడా చెడిపోతారనడానికి గౌడగారిని మించిన ఉదాహరణ మరొకటి లేదు. గౌడగారింట్లో గౌడరికం అలా అఘోరిస్తుంటే మనింట్లో సమస్యలు మనకి పరీక్షలు పెడుతున్నాయి. మన భాగీరథి భర్త సైన్యంలో పనిచేసేవాడు. కాశ్మీరులో సరిహద్దు భద్రతాదళంలో వేశారు. భారతదేశానికి తలలాంటిది కాశ్మీరు. ఆ తలలో పేలలాంటివి అక్కడి పరిస్థితులు. యుద్ధాలుండవన్నమాటేగానీ దాడులు-ప్రతిదాడులు మాత్రం ఆగవు. ఒకసారి జరిగిన కాల్పుల్లో భాగీరథి భర్త తుపాకీ గుళ్ళకి బలైపోయాడు. అంతవరకూ భద్రంగా ఆనందంగా గడిచిన జీవితం ఒక్క తుపాకీ గుండుతో అనాథగా మారిపోయింది. కావడానికి చిన్నవయసే అయినా ఇద్దరు పిల్లల తల్లి. తనిప్పుడే ఇంత ముచ్చటగొలిపేలా ఉందంటే అప్పట్లో ఎంత ఆకర్షణీయంగా ఉండేదో ఊహించు. అలాంటి తనకి అయినవాళ్ళెవరి ఆసరా లభించలేదు. మీ నాన్నగారికి తను తోడబుట్టిన చెల్లెలికంటే ఎక్కువ. అందుకే తీసుకొచ్చి మనింట్లో పెట్టుకున్నాడు. ఇక్కడ తనజీవితం సురక్షితంగా సాగేది మీ నాన్న ఉన్నంతకాలం ఈ ఇంట్లో అన్నీ సజావుగా సాగిపోతూండేవి.. కానీ ఆ దేవుడు మీ అమ్మానాన్నలిద్దరినీ తన దగ్గరకి రప్పించుకున్నాడు. దాంతో మన ఇంటికి మగదిక్కనేది లేకుండా పోయింది. ఇంట్లో ఉన్నది ఒక బామ్మగారు,, ఒక వితంతువు ఇద్దరు ఆడపిల్లలు మాత్రమే.

గౌడగారిగురించి తెలుసుగా? ఆడవాసన తగిలితే చాలు అన్నీ మర్చిపోయి వెంటపడతాడు. భాగీరథి అందం ఆయన్నెంతో ఆకర్షించింది. అందుకే తనపై ఒక కన్నేసి ఉంచాడు. కానీ మీ నాన్నభయంతో ఎప్పటికప్పుడు వెనకంజవేస్తూ ఉండేవాడు. నేను లేని సమయం చూసుకుని ఒకసారి తాగిన మైకంలో అదుపుతప్పి ఏకంగా ఇంట్లోకే వచ్చాడని తెలిసింది.

మీ అమ్మానాన్నలున్నప్పుడు మన ఇంటిముందునుండి వెళ్ళేవాళ్ళకి లోపలకి కన్నెత్తి చూసేంత ధైర్యం కూడా ఉండేది కాదు. అలాంటిది మన ఇంట్లోకే వచ్చేంత ధైర్యం చేశాడంటే తనని వదిలిపెట్టకూడదు.

మనింటికి మన సంప్రదాయాలూ ఆచార వ్యవహారాలే కాపలా. వాటిని నిలబెట్టేవారు లేరనేదే ఆ తిరుగుబోతు గౌడకున్న ధైర్యం.

నేను నేరుగా గౌడగారింటికి వెళ్ళాను. మనింటిని కాపలా కాయడానికి మన గౌరవ మర్యాదల్లున్నాయి.. అలాగే గౌడగారింటిక్ని కాపలా కాయడానికి వేటకుక్కలున్నాయి. ఆ వేటకుక్కల్ని చూసి భయపడే గ్రామస్తులెవరూ గౌడగారింటివైపుక్కూడా వెళ్ళేవారు కారు అందుకే గౌడగారింటిముందుండే వీధిలో జనసంచారం ఉండదు ఒకవేళ ఎవరైనా అనుమతి తీసుకుని గౌడగారింట్లోకి వెళ్ళాలంటే ముందు గుమాస్తా అనుమతి తీసుకోవాలి. ఆయన ఒప్పుకుంటే పాలేళ్ళొచ్చి వేటకుక్కల్ని అదుపు చేస్తారు. అప్పుడుగానీ ఎవరూ లోపలకి వెళ్ళే అవకాశం ఉండదు. గౌడగారిల్లంటే అంత కట్టుదిట్టంగా ఉంటుంది. అందుకే అందరూ భయపడతారు. నేను కూడా భయపడితే ఇంక ఊళ్ళోని ఆడవాళ్ళకి ఎలాంటి భద్రతా ఉండదు. అందుకే తిన్నగా గౌడగరింటికి బయలుదేరాను. నేను వస్తుంటే గుమాస్తా అనుమతి తీసుకొమ్మనడం మర్చిపోయాడు. పాలేళ్ళు కుక్కల్ని అదుపు చెయ్యడం మర్చిపోయి నోరు వెళ్ళబెట్టుకుని చూస్తూండిపోయాడు. సింహాల్లా మొరుగుతూ మీదకి దూకాల్సిన కుక్కలు నా ముందుకొచ్చి లోపలకి దారిచూపించాయి. నేనలా లోపలకి రావడం చూసి అందరూ బిత్తరపోయారు. నేరుగా గౌడగారి తండ్రిగారి గదిలోకి వెళ్ళాను. నేను ఇంట్లోకి రావడం చూసి పెద్ద గౌడగారు, “మీరెందుకమ్మా ఇంతదూరం రావడం, ఒక్కమాట చెప్పి పంపిస్తే నేనే వచ్చేవాడిని కదా?” అంటూ తనే ఎదురొచ్చారు. నేనేమీ మాట్లాడలేదు. క్షేమ సమాచారాలు విచారించి నేను తీసుకువెళ్ళిన అమ్మవారి ప్రసాదం ఆయన చేతిలోపెట్టి వెనక్కి తిరిగి వచ్చేశాను” అన్నారు.

నేను ఆశ్చర్యపోతూ అడిగాను, “ఇంతకీ మీరు వెళ్ళిందెందుకు? ప్రసాదం ఇవ్వడానికా లేక కొడుకుని అదుపులో పెట్టుకొమ్మని చెప్పడానికా?”

అవ్వగారు నవ్వేశారు. కొంతమందికి ఏదీ చెప్పనవసరం లేదు. కొంతమంది ఎన్ని చెప్పినా అర్థం కాదు. ధర్మేగౌడ అన్నగారికి ఎన్ని చెప్పిన ఆర్థం కాదు. వాళ్ళ నాన్నగారికి ఏదీ చెప్పకపోయినా అంతా అర్థమైపోతుంది. అందుకే ఆయన అర్థం చేసుకున్నారు. ధర్మేగౌడ అన్నగారిని అదుపులో పెట్టడానికి ఆయనేం చేశారో మనకి అనవసరం. ఆయన కొడుకు అదుపులో ఉన్నాడా లేదా అన్నదానితోనే మనకి అవసరం అప్పటినుండి ఇప్పటివరకూ ధర్మేగౌడ అన్నగారే కాదు, గౌడగారింటి మగానుభావులెవరూ మన వీధిలోకి రాలేదు. అదికదా అవ్వగారి కార్యదక్షతంటే. కర్ర విరగలేదు పాము చావలేదు కానీ గౌడగారి కొడుగ్గారు మాత్రం మరోసారి మా ఇంటివైపు కన్నెత్తి చూడలేదు.

నాకు చిన్నగౌడ బాగు – పెద్దగౌడ ఓగు అన్నంతవరకే తెలుసు. కానీ ఎందుకలా అంటారనే ఆసక్తిగానీ వారిగురించి తెలుసుకోవలసిన అవసరంగానీ కలగలేదు. ఇప్పుడు ఊరగాయ పుణ్యమా అని అన్నగారి అసలు రంగు బయట పడింది. చిన్నప్పుడు ఏం చదివామన్నది కాదు, దానినుండి ఏం నేర్చుకున్నామనేది చాలా ముఖ్యం. వేదం కూడా నేర్చుకున్న వినయ విధేయతలున్న పిల్లవాడు పెద్దయ్యాక పోరంబోకులా తయారయ్యాడంటే ఎవరైనా నమ్మగలరా? అయినా మనం నమ్మినవన్నీ నమ్మినట్లుగా లేకపోవడం కూడా జీవితంలో ఒక భాగమే కదా?

అధ్యాయం-14

తెల్లవారుజామున ఐదింటికి మెలకువ వచ్చింది. అప్పటికే అవ్వగారు ధ్యానంలో ఉన్నారు. లైటు వేసుకోలేదు. బయటినుండి వచ్చే పున్నమి వెలుగు లోపలికొచ్చేసరికి మసకబారిపోయింది. అక్కడ ఎవరో ఉన్నట్లు లీలగా తెలుస్తోంది. కానీ ఆకారమే తప్ప వ్యక్తిని గుర్తుపట్టే ఆవకాశం లేదు. ఆవిడ మా అవ్వగారిలా కాదు, శివుడో బుద్ధుడో మహావీరుడో వచ్చి అక్కడ ధ్యానముద్రలో కూర్చున్నట్లనిపిస్తోంది. నాకెందుకోగానీ ఆవిడ ధ్యానాన్ని భంగపరచాలనే ఒక చిలిపి కోరిక పుట్టింది.. అందుకే తువ్వాలు తెచ్చి ఆవిడమీదకి విసిరాను. కదల్లేదు. ముఖం మీద పడేలా రెండు నీటి చుక్కలు వేశాను. కదల్లేదు. భుజంమీద మెల్లగా తట్టాను. కదల్లేదు.

ధ్యానంలో ఎంతలోతుగా వెళ్ళినా ఇంతగా స్పర్శజ్ఞానం కూడా లేకుండాపోతుందా?

ఆవిడ ధ్యానాన్నుండి బయటకు వచ్చేవరకూ మనం ఆగాల్సిందే తప్ప, మనకోసం ఆవిడ ధ్యానముద్రని వీడరని చాలా స్పష్టంగా అర్థమైన తొలి సందర్భమది. వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చాను. భాగీరథమ్మగారు కాఫీ తీసుకొచ్చారు. ఈలోగా ఆత్రేయా అనే పిలుపు వినపడింది. కాఫీ టంబ్లర్ తోనే గదిలోకి వెళ్ళాను లైటేశాను. ఆవిడ పక్కకి వెళ్ళి కూర్చున్నాను. ఆవిడ నా చేతిని తన చేతిలోకి తీసుకున్నారు. “సూర్యుడు తూరుపింట్లోంచి చల్లగా బయటికొస్తాడు. క్రమంగా వేడెక్కుతూ వచ్చి మధ్యాహ్నానికి నడినెత్తిమీదకెక్కి నిప్పులు చెరుగుతాడు. అక్కడినుండి మెల్లగా పడమటింటికి బయలుదేరతాడు. చీకటిపడేవేళకి పూర్తిగా చల్లారిపోతాడు. మన జీవితం కూడా అంతే బాల్యంతో మొదలై బాల్యంతోనే ముగుస్తుంది. అందుకే వయసుమళ్ళిన పెద్దవాళ్ళందరిలోనూ బాల్యచాపల్యాలూ పిల్ల చేష్ఠలూ కనిపిస్తాయి. బాల్యచేష్ఠలంటే కల్మషం లేని స్వచ్ఛతకి నిదర్శనాలు. నీ పేరు ఆత్రేయ. అంటే అత్రి మహర్షి కుమారుడు. అంతే కాదు, ఆత్రేయ అంటే స్వచ్ఛత. అందుకే నీలో ఆ స్వచ్ఛత ఇంకా అలాగే మిగిలి ఉంది.. అందుకే బాల్యచాపల్యంతో చిలిపి చేష్ఠలు కూడా చేస్తున్నావు. అది నీకు పేరుతో వచ్చిన సహజ గుణం” అన్నాక నాకు ఒక చిరునవ్వు బహుమతిగా ప్రసాదించారు.

ధ్యానం చేస్తే ఇంతటి భాషా పరిజ్ఞానం, సమన్వయ సామర్థ్యం, సమయానుకూల స్పందనలన్నీ వాటంతట అవే వస్తాయా? అని అబ్బురపడుతుంటే ఆవిడ మళ్ళీ నవ్వారు. ఎందుకు నవ్వారా అని చూసుకుంటే నా చేతిలో ఉన్న టంబ్లర్ లోని కాఫీ కూడా నాలాగే చప్పగా చల్లారిపోయింది.

ఆ తరువాత స్నానానికి వెళ్ళాను. అండాలో నీళ్ళు కాగుతున్నాయి. ఆ నీళ్ళలో వేపాకు ఉడుకుతోంది.. ఆ వేపాకులోంచి ఔషథగుణాలన్నీ నీటిలో కలుస్తున్నాయి. ఆ నీటితో స్నానం చేసేప్పుడు శీకాయపొడినే వాడాలి. అప్పుడా ఔషథగుణాలన్నీ కలిసి చర్మరోగాలని తగ్గిస్తాయి. దాని బదులుగా సుగంధపరిమళ సోపుల్ని వాడితే ఆ ఔషథగుణాలన్నీపోయి రసాయనాలు చర్మాన్ని తోమేస్తాయి. దాంతో శరీరం తళతళా మెరవచ్చు. కాలం గడుస్తున్నకొద్దీ బొల్లి మచ్చలు పెరిగి శరీరం తెల్లగా పాలిపోవచ్చు అనుకుంటూ నాలో నేనే నవ్వుకుంటూ స్నానం ముగించి బయటకు వచ్చాను.

దేవుడికి దణ్ణంపెట్టుకుని వచ్చి కాసేపు నేను కూడా ధ్యానం చెయ్యడానికి పద్మాసనంలో స్థిరంగా కూర్చున్నాను. నా మనసుకూడా శివాలయంమీదే స్థిరంగా లగ్నమై ఉంది. దాంతో నాలోంచి వచ్చే ఆలోచనలన్నింటినీ ఖండించడం మొదలుపెట్టాను. ఎంత ఎక్కువ ఖండిస్తే అంత ఎక్కువ ఆలోచనలు ఆలయం చుట్టూ పరుగులు పెడుతున్నాయి. అన్నీ ఎలక్ట్రాన్స్ లాగా నా చుట్టూ పరుగెడుతూ నన్ను పార్వతీపురంమీదే నిలబెడుతూంటే ధ్యానం ఎలా సాగుతుంది? అలా ఎంత సేపు కూర్చున్నానో నాకే తెలియదు. చివరికి మనసుని తప్పించడం సాధ్యం కాక పద్మాసనం సడలిస్తూ కళ్ళు తెరిచాను.

ఎదురుగా అవ్వగారు. నా కళ్ళలోకే చూస్తున్నారు.

నేను పూర్తిగా కళ్ళు తెరవగానే, “మన భట్టుగారింట్లో సూతకం ముగిసింది కదా. ఆయన్ని కూడా మనతోబాటు పార్వతీపురం గుడికి రమ్మన్నాను. పరవాలేదుగా” అన్నారు.

నేను సంతోషంగా తలాడించాను. కానీ ఇది నేను ఊహించలేదు. అవ్వగారిని గుడికి తీసుకువెళ్ళేప్పుడు మా ప్రదీపుని తోడుగా తీసుకువెళదామనుకున్నాను. కానీ అవ్వగారు ఇలా హఠాత్తుగా ప్రయాణం పెట్టారు. వెంటనే ప్రదీపుకి ఫోన్ చేశాను. తను బెంగుళూరులో ఉన్నాననీ అవ్వగారిని నిరాశ పరచకుండా మీరు వెళ్ళండి. తరవాత మనం కలిసినప్పుడు దాని గురించి మాట్లాడుకోవచ్చన్నాడు. తన సలహా నాకూ నచ్చింది. ఈలోగా భాగీరథమ్మగారు పిలవడంతో వంటింట్లోకి వెళ్ళాను.

ఆవిడ ఫలహారానికి రాగిరొట్టెలు చేశారు. రెట్టెలో పచ్చిచింతకాయ పచ్చడి నంజుకుని తింటుంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక రొట్టె తింటే కడుపు నిండిపోతుంది.. అయినా సరే ఆ రొట్టె రుచికి దాసోహమైపోయి ఇంకోరొట్టె లాగించేశాను. దానికితోడు జీడిపప్పులేసిన సగ్గుబియ్యం పాయసం. పూర్తయ్యేసరికి భుక్తాయాసం మొదలైంది. తియ్యగా తేనుస్తూ పైకి లేచాను. చేతులు కడుక్కుని భాగీరథమ్మగారు కట్టిచ్చిన క్యారియర్ తీసుకుని అవ్వగారి కోసం చూస్తే ఆవిడ కనిపించలేదు.

అవ్వగారు కనిపించలేదు. అంటే ఆవిడ గుడి దగ్గర ఉన్నారని అర్థం. క్యారియర్ తీసుకుని తిన్నగా గుడికి వెళ్ళాను. అనుకున్నట్లుగానే అవ్వగారు అక్కడ ప్రదక్షిణాలు పూర్తి చేసి హుండీలో డబ్బు వేసి బయటికొచ్చి గుడికి దణ్ణంపెట్టుకున్నారు. పెద్దవాళ్ళంతే. గుడిలో దేవుడికి పూజలు చేసి వచ్చాక గుడికి కూడా నమస్కరిస్తేగానీ వెనక్కి రారు.

నన్ను చూడగానే అవ్వగారు ముందుకు దారి తీశారు. దారిలో భట్టుగారు కలిశారు. ముగ్గురం కలిసి రేవు చేరుకున్నాం. పడవ అవతలివైపున ఉంది.

అవ్వగారు, భట్టుగారూ గట్టుమీంచే నదీమతల్లికి నమస్కరించారు. తరువాత నీటిలోకి దిగారు. కాళ్ళూచేతులూ ముఖం కడుక్కున్నారు. నదినీళ్ళు తలమీద చల్లుకున్నారు. వాళ్ళిద్దరినీ చూస్తూ నేనూ కాళ్ళూ చేతులూ కడుక్కున్నాను. తరువాత అవ్వగారి ముందు తలవంచాను. ఆవిడ ఆశీర్వచన మంత్రం చెబుతూ నా తలమీద నీళ్ళు చల్లారు.

అవ్వగారు ఉన్నట్లుండి, “వీలైనప్పుడు మనిద్దరం ఓసారి అంబుతీర్థానికి వళ్ళొద్దాం” అన్నారు. అంబుతీర్థమంటే శరావతీ నది జన్మస్థానం. అక్కడినుండి అది అడవుల్లో లెక్కలేనన్ని ఔషధగుణాలున్న వృక్షాలన్నింటిగుండా ప్రవహిస్తుంది. ఆ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదంటారు. ఈ శరావతి గురించి తెలిసినవాళ్ళంతా దీని చివర్లో ఏర్పడే జోగ్ జలపాతం చూడాలని పరితపిస్తారు. కానీ అవ్వగారు మాత్రం తీర్థహళ్ళి వెళ్ళి అక్కడినుండి అంబుతీర్థానికి ప్రయాణించాలని కోరుతున్నారు.

“తప్పకుండా వెళదాం అవ్వగారూ” అన్నాను.

భట్టుగారు బిగ్గరగా నవ్వుతూ, “అది అంబుతీర్థం ఆత్రేయా. అక్కడికి వెళ్ళినదాకా ఉండి ఆ తీర్థం ఎక్కడ ఉందో కనిపెట్టడం ఎవరివల్లా కాదు. మనం జన్మస్థలాలనుకున్నవేవీ నదుల జన్మస్థలాలు కావు. ఈ నదులన్నీ మబ్బుల్లో పుడతాయి. మళ్ళీ మబ్బుల్లోనే కలుస్తాయి. ఎక్కడ కురిసిన వాన ఎక్కడ ప్రవాహంగా రూపొందుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే ఋషిమూలం నదిమూలం కనిపెట్టడం అసాధ్యమని చెబుతారు” అన్నారు.

నేను నిజమే కదా అనుకున్నాను.

ఈలోగా పడవ వచ్చింది. ముగ్గురం ఎక్కి కూర్చున్నాం. పావుగంట ప్రయాణించి అవతలిగట్టుకు చేరుకున్నాం. పడవ దిగగానే నేలకి నమస్కరించారు అవ్వగారు. గుడి దగ్గరకు చేరాము. కుడివైపునుండి లోపలకు వెళ్ళాం. ఎదురుగా ఆవు. దాన్ని చూడగానే నా గుండెలు రైలింజన్లా దడదడా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. నాకు అడుగు ముందుకు పడ్డంలేదు. భట్టుగారు ఒక్కొక్క అడుగూ అతి జాగ్రత్తగా వేస్తూ అవ్వగారిని అనుసరిస్తూ ముందుకు కదులుతున్నారు. కానీ అవ్వగారు మాత్రం ధైర్యంగా ముందుకు వెళుతున్నారు. ఆవు ముందుకు వెళ్ళి దానికి నమస్కారం చేసి దాని నొసటన చేత్తో ఆప్యాయంగా నిమిరారు. ఆ స్పర్శలో ఆవుకి ఏ కన్నపేగు కదిలిందో ఏమోగానీ అవ్వగారికి దారి వదిలింది. అంతే కాదు, ఆవిడ వెనుకే నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతోంది. నేనొక్కడినీ వచ్చినప్పుడు ఆగ్రహించిన నందీశ్వర్రుడిలా కొమ్ములు విసిరింది. ఇప్పుడు చూస్తే అవ్వగారి పెంపుడు ఆవులా ఆవిడని అనుసరిస్తోంది. దానికీ ఆవిడకీగల అనుబంధం ఎప్పటిదో ఏమోగానీ ఇప్పటిది మాత్రం అయివుండదు. ఆవిడ గుడి లోపలకి వెళ్ళి మమ్మల్ని కూడా రమ్మన్నట్లుగా సైగ చేశారు.

భట్టుగారు కొద్దిగా జంకుతూనే అడుగులో అడుగేసుకుంటూ ముందుకు వెళ్ళారు. నాలుగడుగులు వేశాక ఆయనకి కూడా కాస్త ధైర్యం వచ్చినట్లుంది. గబగబా లోపలకి వెళ్ళిపోయారు. నాకు మాత్రం కుమ్మడానికొచ్చిన కోపిష్టిగావే కనిపిస్తోంది. అందుకే ధైర్యం చాలడం లేదు..

అవ్వగారు, “ఏం భయంలేదులే. రా ఆత్రేయా” అని పిలుస్తుంటే విధిలేని పరిస్థితుల్లో అడుగు ముందుకు వేశాను అంతే ఆవు ఒక్కసారిగా తలెగరేసింది. దాంతో వెన్నులో వణుకు మొదలైంది. అవ్వగారు ఆవుని మందలింపుగా చూస్తూ ఉచ్చస్వరంలో, “నందినీ” అన్నారు.

ఆ మాట వినపడగానే మంత్రముగ్ధురాలైనట్లు వెనక్కి తగ్గిందా ఆవు. నేను ధైర్యంగా లోపలకి వెళ్ళాను. గుడిలోపలకి రాగానే చేత్తో బూజు దులపడం ఆరంభించారు భట్టుగారు. నేను కూడా ఆయనకి సహాయం చేస్తూ, “అవ్వగారూ, ఆ ఆవు పేరు మీకెలా తెలుసు? మీరు పిలవగానే అది ఎందుకు దారిచ్చింది? చూస్తుంటే అంతా ఆశ్చర్యంగా ఉంది” అన్నాను.

అవ్వగారు, “నందిని అనేది దాని పేరు అవునో కాదో నాకూ తెలీదు. కానీ, మేము వశిష్ఠగోత్రీకులం. వశిష్ఠమహర్షి పెంచుకునే ఆవుపేరు నందిని. కోరిన కోరికలు తీరుస్తుంది. అందుకే నిన్ను లోపలకి రానిమ్మని కోరుకోవడం కోసం నందినీ అని పిలిచాను. అది నా పిలుపు ఆలకించింది. ఇందులో అంతగా ఆశ్చర్యపోవడానికేముంది?” అంటూ చులాగ్గా సమాధానం చెబుతూంటే నా ఆశ్చర్యం ద్విగుణీకృతమైంది. కానీ దాన్నెలా వ్యక్తం చెయ్యాలో తెలియక నా సంభ్రమాన్ని నాలోనే దాచుకుని బూజు దులపడం కొనసాగిస్తూ చుట్టూ పరికించాను. అంతా దుమ్ముకొట్టుకుపోయి ఉంది. దాన్ని ఉత్త చేతులతో శుభ్రం చెయ్యడం సాధ్యం కాదు.

శుభ్రం చెయ్యడానికి కావలసిన చేటలూ చీపుళ్ళూ కడగటానికి బిందెలూ చెంబులూ అడగటం కోసం దేవాదాయ శాఖవారి కార్యాలయానికి వెళ్ళాను. నన్ను చూసిన రంగనాథస్వామిగారు నవ్వుతూ, “ఏం మళ్ళీ వచ్చారు?” అని అడిగారు. నేను గుడి శుభ్రం చెయ్యడానికి వచ్చామని చెప్పగానే ఆయన పైకి నవ్వడం మానేసి లోపల్లోపలే నవ్వుకోవడం మొదలు పెట్టారు. పైకి మాత్రం నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళి తన భార్యకి చెప్పి నాకు కావలసినవన్నీ ఇప్పించారు. వాటిని మోసుకుంటూ వస్తుంటే నాకు ఎదురొచ్చారు భట్టుగారు. సగం వస్తువులు తీసుకుని నాకు భారం తగ్గించారు. ముగ్గురం లోపలకి వెళ్ళి ఆలయాన్ని శుభ్రం చెయ్యడం ఆరంభించాం.

పని మధ్యలో ఆటవిడుపుగా మాటలు కలుపుతూ, “అన్నీ సరేగానీ మీ నందిని ఏమైంది అవ్వగారూ?” అని అడిగాను.

“అందరికీ ఆకలి తీర్చేవారికి కూడా ఆకలుంటుందిగా? అందుకే మేతకి వెళ్ళింది”

“అంటే మనం ఇక్కడ ఉండటానికి అనుమతిచ్చినట్లేగా?”

నా ప్రశ్నకి అవ్వగారు సమాధానం చెప్పలేదు. భట్టుగారు చెప్పారు, “అది వచ్చి కుమ్మేంతవరకూ మనకి అనుమతి లభించినట్లే”

ఆయనలా అన్నారో లేదో ఇలా వచ్చి సింహద్వారం ముందు నిలబడింది ఆవు. దాన్ని చూడగానే అవ్వగారికి ఏదో అనుమానం వచ్చి బయటికి వెళ్ళారు. దానికి అవతలివైపున ఎవరో నిలబడి ఉన్నారు. ఎవరో చూద్దామని బయటికి వచ్చాను. అక్కడ ఆలయ పర్యవేక్షణాధికారి రంగనాథస్వామీ ఆయన భార్యా నిలబడి భయంగానూ వింతగానూ చూస్తున్నారు.

అవ్వగారు బయటికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెబుతున్నారు. అయినా వాళ్ళిద్దరూ ముందడుగు వేసే సాహసం చెయ్యలేదు. దాంతో అవ్వగారు నందినిని అడ్డుతొలగమని చెప్పారు. అయినా అది కదలలేదు. దాంతో తనే దాని ముందుకు వెళ్ళి దాని నొసటన తన చేత్తే ప్రేమగా నిమిరారు. ఆవిడ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నదానిలా పక్కకి తొలగి దారి వదిలింది నందిని. రంగనాథస్వామీ ఆయన భార్యా భయపడుతూనే లోపలకి వచ్చారు.

లోపలకి రాగానే ఆయన అన్నది ఒకటే మాట, “జమునాపురం మూకవ్వగారి గురించి చెప్పుకోవడమూ వినడమే తప్ప చూడటం ఇదే మొదటిసారి. ఈ ఆవు ఇలా దారివ్వడం కూడా ఇదే మొదటిసారి. వందల సంవత్సరాలనాటి చరిత్రని తిరగరాశారంటే మీరు సామాన్యులు కాదు అవ్వగారూ” అంటూ రంగనాథస్వామి దంపతులిద్దరూ అవ్వగారికి పాదాభివందనం చేశారు. ఆ తరువాత వాళ్ళు కూడా గుడిని శుభ్రం చేయడంలో సహాయం చెయ్యసాగారు. ఎంత పనిలో ఉన్నా వారి దృష్టిమాత్రం నందిని మీదే ఉంది.

నందిని కూడా ఎంత శాంత గంభీరంగా నిలబడి వున్నా మా మీద ఓ కన్నేసి ఉంచింది. అయినా రంగనాథస్వామి దంపతుల కళ్ళలోనూ నందిని కళ్ళలోనూ ఒకవిధమైన ప్రసన్నత గోచరిస్తోంది. కొంతసేపటికి రంగనాథస్వామిగారికి కూడా ఆ ఆవు గుడి శుభ్రం చేసేవారినేమీ అనదు అనేంత ధైర్యం వచ్చింది. దాంతో బయటకి వెళ్ళి ఆ చుట్టుపక్కల కనిపించినవారందరినీ పిలుచుకువచ్చారు. గుడిని శుభ్రంచేసే పనిలో అందరూ తలో చెయ్యీ వెయ్యడం ప్రారంభించారు.

శతాబ్దాల తరబడి పేరుకుపోయిన దుమ్ముని వదల్చడం అంత సులభం కాదు. ఎవరి శక్తిమేరకి వారు పని చేస్తున్నారు. ఆవు గుడిలోకి వెళ్ళనిస్తోందనే వార్త ఒకరినుండి ఒకరికి పాకిపోతోంది. గుడిని బయటినుండే తప్ప లోపలకు వెళ్ళి చూసే అవకాశం లభించలేదని మధనపడే భక్తులు కొందరూ.. ఆ విచిత్రం చూడాలనే ఉత్సాహంతో కొందరూ.. అదంతా నిజమో కాదో తేల్చుకోవాలని కొందరూ.. ఇలా ఎవరి ఆసక్తిమేరకి వాళ్ళుగా ఒక్కొక్కరే గుడికి రావడం ప్రారంభించారు.

అవ్వగారు నందినిని తీసుకువెళ్ళి శరావతి నదిలో స్నానం చేయించారు. అది బుద్ధిమంతుడైన ఉత్తమ విద్యార్థిలా అవ్వగారు చెప్పినట్టల్లా వింది. అల్లరీ హడావిడీ లేకుండా స్నానం చేసింది.

స్నానం పూర్తవ్వగానే నందినిలోకి ఎక్కడలేని ఉత్సాహమూ ప్రవేశించింది. ఆ ఉత్సాహంతో పరుగులు పెట్టడం ప్రారంభించింది. పోట్లగిత్తలతో పోటీపడి వాటి పొగరణిచే అనుభం కలిగిన యువకులు నలుగురైదుగురున్నారక్కడ. వాళ్ళంతా నందిని వెంట పడ్డారు. కానీ అది వారెవ్వరికీ దొరకలేదు. ఊరవతల ఉన్న రాళ్ళగుట్టదగ్గరకి వెళ్ళి అక్కడ గస పోసుకుంటూ నిలబడింది. దాంతో యువకులు దాని దగ్గరకొచ్చారు. వారిని చూడగానే మళ్ళీ పరుగందుకుంది నందిని. అది రాళ్ళగుట్ట చుట్టూ పరిగెత్తడం చూసి అటు కొందరూ ఇటుకొందరూ చేరి దానిని పట్టుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళమీదకి కొమ్ము విసిరింది. వారిని కుమ్మడానికి రెండడుగులు వెనక్కి వేసి వారి మీదకి దూకడానికి సిద్ధమైంది. అదిగానీ మీదకి దూకిందంటే ఎంత గొప్ప జెట్టీలైనా తట్టుకోలేరని వారికి తెలుసు. అందుకే దానికి అందకుండా వెనక్కి తగ్గారు. వారు వెనక్కి తగ్గడాన్ని చూసి నందిని కూడా వెనక్కి తగ్గింది.. వారు దగ్గరకొస్తున్నా బెదిరించలేదు. వారొచ్చి తనని పట్టుకుంటున్నా పట్టించుకోలేదు. దాంతో వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే బామ్మగారు వస్తూ కనిపించారు. ఆవిడని చూడగానే నందిని వెనక్కి తగ్గడానికి కారణం ఏమిటో వాళ్ళకి బోధపడింది.

ఆ తరువాత అవ్వగారు ముందు నడుస్తుంటే వెనక ఠీవిగా అడుగులో అడుగేసుకుంటూ వస్తోంది నందిని.

ఆలయం ముందున్న చావడినే దానికి కొట్టంగా సిద్ధం చేశారు. దాన్ని కట్టడానికి పలుపుని కూడా తీసుకొచ్చారు. దాన్ని మెడలో పూలహారంలా అలంకరించుకుంది. అక్కడ వేసిన పచ్చిగడ్డిని తినడం ప్రారంభించింది.

ఊరందరికీ గొప్ప ఊరటనిచ్చిన సన్నివేశమది. దేవుడి ఆవు పేరు నందిని అనీ. అది అవ్వగారి మాట వింటుందనీ, ఆవిడ ఏం చెబితే అది చేస్తుందనీ చెప్పుకోవడం మొదలుపెట్టారు.

రంగనాథస్వామి వచ్చి మమ్మల్ని ఆ రాత్రికి వాళ్ళింట్లోనే ఆతిథ్యం స్వీకరించమని అడిగారు. అవ్వగారు భట్టుగారివైపు చూశారు. ఆయన నావైపు చూశారు. నేను తలూపాను. రంగనాథస్వామిగారు సంతోషంగా వాళ్ళింట్లో ఉండటానికి తగిన ఏర్పాట్లు చెయ్యమని వారి భార్యకి చెప్పారు. ఆవిడ ఆనందంగా ఇంటికి వెళ్ళారు..

ఈలోగా పార్వతీపురం ఊరిపెద్ద అక్కడికి వచ్చారు. నేరుగా అవ్వగారి దగ్గరకి వచ్చి ఆవిడ పాదాలకు నమస్కరించారు. ఆయనా అవ్వగారూ అంతకు ముందే బాగా పరిచయస్థుల్లాగా మాట్లాడుకుంటున్నారు. వారి మాటల్నిబట్టి ఊరిపెద్ద ఎన్నోసార్లు అవ్వగారిని ఆలయానికి రమ్మని ఆహ్వానించారనీ, ఆవిడ తన పనుల ఒత్తిడివల్ల రాలేకపోయారనీ అర్థమైంది. వచ్చీరాగానే ఎవ్వరికీ లొంగని నందినిని ప్రేమతో లోబరుచుకుని దానిని ఆత్మీయస్నేహితురాలిగా మార్చుకోవడాన్ని చూసిన ఊరిపెద్ద ఆశ్చర్యం ప్రకటించారు.

నేనీలోగా సమయం చూసుకుని భాగీరథమ్మగారికి ఫోను చేస్తి ఇక్కడ జరిగిందంతా వివరించి, రాత్రి ఇంటికి రావడం లేదని చెప్పాను.

గ్రామస్తులందరూ తలో చెయ్యీ వేసి గుడిని కడిగి ముగ్గులేసి పూజలు చేయడానికి అనుకూలంగా సిద్ధం చేశారు.

అప్పటికి రాత్రి భోజనాల సమయం అయింది..

రంగనాథస్వామి భార్యవచ్చి భోజనాలకి పిలిచాకగానీ మేము మధ్యాహ్నం తినడానికి తెచ్చుకున్న రాగిరొట్టెలు అలాగే ఉన్నాయనే విషయం గుర్తు రాలేదు. అవ్వగారికి ఆ విషయం గుర్తు చెయ్యగానే ఆవిడ ఆ రొట్టెలని తీసుకెళ్ళి నందినికి పెట్టారు. అది ఎంతో ఇష్టంగా తినడం చూసి ఆందరూ ఆనందించారు. ఆ తరువాత అవ్వగారు అందరివైపూ చూస్తూ జనాంతికంగా, “ఆవు ఇష్టంగా తిందికదా అని అందరూ మిగిలిపోయిన రాగిరొట్టెలన్నీ తెచ్చి దానికి పెట్టకండి. అజీర్తి చేస్తుంది. అది ఆలయాన్ని కాపాడే క్షేత్రపాలకురాలు. కనుక దానిని జాగ్రత్తగా చూసుకోవడం మనందరి బాధ్యత” అని చెప్పారు.

అలాగేనంటూ అందరూ తలూపారు.

ఈలోగా రంగనాథస్వామిగారితోబాటు ఊరిపెద్ద కూడా వచ్చి అవ్వగారిని ఆహ్వానించడంతో ఆలస్యం చెయ్యకుండా అందరం రంగనాథస్వామిగారింటికి వెళ్ళాం. భోజనాలు పూర్తి చేసి బయటకి వచ్చేసరికి అక్కడ కూడా జనం గుమిగూడి ఉన్నారు. వారిలోంచి ఎవరో ఒకరు రావడం అవ్వగారిని ఏదో ఒకటి అడగటం ఆవిడ చెప్పింది విని వెళ్ళడం. పదింటివరకూ ఇలాగే గడిచింది. చివరికి ఆ ఊరి పెద్ద వచ్చి “అవ్వగారిని పడుకోనివ్వరా?” అంటూ కాస్త గట్టిగా మందలిస్తేగానీ జనం అక్కడినుండి వెళ్ళలేదు.

(ఇంకా ఉంది)

Exit mobile version