[ధనంజయ లక్ష్మీ రామకృష్ణగారు వ్రాసిన ‘మత్తె మూకజ్జి’ అనే కన్నడ నవలని ‘అవ్వగారు’ పేరుతో అనువదించి ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.]
[బడిలో పూల మొక్కలు నాటిద్దామని అనుకుని సరస్వతీపురం నుంచి తెప్పిస్తానంటాడు ఆత్రేయ. ఆ ఖర్చు తాను పెట్టుకుంటానంటారు మాస్టారుగారు. బడిపిల్లలందరికీ ఒక పూట గ్లాసుడు పాలు ఇప్పించే ఏర్పాటు చేద్దామంటాడు. వెంకమ్మగారికి నాలుగు దేశీ ఆవులు కొనిస్తే, ఆ పని పూర్తవుతుందని అంటారు మాస్టారుగారు. ఇంటికెళ్ళేసరికి అవ్వగారు ఊరగాయ కలుపుతూంటారు. అక్కడ చేరిన అందరూ, ఊరగాయని జాడీలలోకి ఎత్తుకుని వెళ్తారు. ఆ తర్వాత అవ్వగారు గౌడ గారి గురించి, భట్టు గారి గురించి మరికొన్ని విషయాలు చెప్తారు. గౌడగారు పతనమైన సంగతి గ్రహించినా, ఊరి పెద్దలు ఏమీ అనరు. దాంతో ఒకరోజు అవ్వగారే వాళ్ళింటికి వెళ్ళి అతని తండ్రిని కలుస్తారు. పెద్దగౌడగారికి ప్రసాదమిచ్చి తిరిగి వచ్చేస్తారామె. చెప్పకుండానే విషయం అర్థమవుతుందాయనకి. కొడుకుని అదుపులో పెడతాడు. మర్నాడు భట్టుగారితోను, అవ్వగారితోను కలిసి పార్వతీపురం గుడికి వెళ్తాడు ఆత్రేయ. గుడి దగ్గరకు చేరగానే, అంతకు ముందు ఆత్రేయని అడ్డగించిన ఆవు ఎదురవుతుంది. అవ్వగారు, దానికి నమస్కరించి, నొసటన చేత్తో నిమిరగానే, ఆవు శాంతించి, అవ్వగారి వెంట నడుస్తుంది. ఆత్రేయ లోపలికి అడుగుపెట్టబోతుంటే, ఆ ఆవు మళ్ళీ అడ్డగిస్తుంది. అవ్వగారు ఉచ్చస్వరంలో, నందినీ అని అంటారు. దాంతో అది వెనక్కి తగ్గి, వాళ్ళని లోపలికి అనుమతిస్తుంది. ఆ ఆవు పేరు మీకెలా తెలుసని ఆత్రేయ అడిగితే, ఆవిడ ఎన్నో వివరాలు చెప్తారు. ముగ్గురూ కలిసి ఆలయాన్ని శుభ్రం చేస్తారు. కాసేపటి తర్వాత ఆ గుడి పూజారి రంగనాథస్వామి గారు, ఆయన భార్య, మరికొందరు గ్రామస్థులు వచ్చి గుడిని శుభ్రం చేసే కార్యక్రమంలో భాగమవుతారు. గుడి శుభ్రమయ్యాకా, అవ్వగారు నందిని తీసుకెళ్ళి నదిలో స్నానం చేయిస్తారు. స్నానం పూర్తయ్యాకా ఆ ఆవు పరుగులు తీస్తూ ఉరవతల ఉన్న రాళ్ళగుట్ట దగ్గరకు వెళ్ళి ఆగుతుంది. అవ్వగారు అక్కడికి రావడంతో, ఆవిడ వెనక నడుస్తూ మళ్ళీ గుడివద్దకు చేరుతుంది ఆవు. ఆ రాత్రి రంగనాథస్వామి గారింట భోజనం చేసి అక్కడే విశ్రమిస్తారు. – ఇక చదవండి.]
అధ్యాయం-15
అవ్వగారు పడుకునే సమయం దాటిపోయింది. అలాంటప్పుడు ఆవిడని గుడి గురించి అడగటం భావ్యం కాదని పడుకున్నాను. కానీ నిద్రపడితే కదా?
ఈ గుడిని ఎవరు కట్టించి ఉంటారు? దాని చరిత్రేమిటి? ఆ ఆలయంలో పూజలెందుకాగిపోయాయి? నందిని వంశ చరిత్రేమిటి? ఎంత వశిష్ఠ గోత్రమైతే మాత్రం అవ్వగారు చెప్పిన మాటకల్లా నందిని ఎందుకు తలూపింది?
అన్నీ ప్రశ్నలే. వాటికి సమాధానాలు లభిస్తేగానీ నిద్రపట్టదు.
రంగనాథస్వామిగారు అక్కడే కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారు. నేను కదిలితే చాలు మంచినీళ్ళు కావాలా? మజ్జిగ కావాలా? వేడి వేడి బాదంపాలు తెమ్మంటారా? అంటూ మొహమాట పెట్టేస్తున్నారు. దాంతో నేను ముఖానికి తువ్వాలు కప్పుకుని కదలకుండా పడుకున్నాను. క్రమంగా సద్దుమణిగింది. అంటే రంగనాథస్వామిగారూ ఆయన భార్యా కూడా నిద్రపోయి ఉంటారని అర్థమైంది. అయినాసరే నాకు లేవడానికి ధైర్యం చాలక అలాగే పడుకుని ఉన్నాను.
కొంతసేపటికి ఎవరో వచ్చి నా పక్కన కూర్చున్నట్లనిపించింది. చూస్తే అవ్వగారు.
“ఏం ఆత్రేయా నిద్రపట్టడం లేదా?”
“మీరుకూడా పడుకోలేదుగా?”
“ఎలా పడుకుంటాను? నా మెదడంతా తేనెతుట్టెలా మారిపోయింది. లెక్కల్లేనన్ని భావనలు ఒక్కసారిగా నామీద దాడి చేస్తున్నాయి”
“ఆ తేనెటీగలు సేకరించిన తేనెని రుచి చూడటానికే నేను ఉవ్విళ్ళూరుతున్నాను అవ్వగారూ. ముందు ఈ గుడి కథేమిటో చెప్పండి”
“ఐతే విను” అంటూ అవ్వగారు గొంతు సవరించుకున్నారు, “చూడు ఆత్రేయా, అన్నీ మనవే. కానీ ఏదీ మనది కాదు. అందరూ మనవాళ్ళే కానీ మనవాళ్ళెవరూ లేరు. లోకం అంతా మనలోనే ఉంది. మనలో లేనిది లోకంలో ఎక్కడా లేదు. కాలం మన చేతిలో లేదు. కానీ మనిషి తలుచుకుంటే కాలాన్ని దాటి వెళ్ళగలడు. దాదాపు ఐదొందల సంవత్సరాల క్రితం ఈ ఊరు ఇలా లేదు. ఈ మనుషులు ఇలా లేరు. శరావతమ్మ మాత్రం ఇలాగే ఉండేది. అందులోని నీళ్ళింతగా కలుషితం కాలేదు. కనుక ఆ నీళ్ళు తాగిన మనుషులు కూడా కలుషితం కాలేదు. అప్పట్లో ఒక పాళెగాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. తను రాజ ప్రతినిధిగా పాలన సాగించేవాడు. ఇది అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ మళెనాడే. వానలకి కొదవలేదు. పాళెగాళ్ళ కాలంలో గుర్రాలవాళ్ళొచ్చేవాళ్ళు. ఇక్కడి పంటలు తీసుకుని గుర్రాలిచ్చిపోయేవాళ్ళు. అవి యవనాశ్వాలు. పరుగందుకుంటే అడ్డూ ఆపూ ఉండదు. తరువాత తెల్లవాళ్ళొచ్చారు. ఇక్కడి పంటలు తీసుకుని తుపాకులిచ్చిపోయేవాళ్ళు. రకరకాల మనుషులు రకరకాల భాషలు రకరకాల సంప్రదాయాలూ రకరకాల దేవతలు రకరకాల పూజావిధానాలు అన్నీ కలగలసి ఉండేవి. ఈ ప్రాంతంలో శిల్పకారులెక్కువుండేవారు. శిల్పి అంటే అనవసరమైనవన్నీ తొలగించేవాడని అర్థం” అంటుంటే శిల్పి అనే పదానికి అర్థం కాకుండా దాని పరమార్థాన్ని వివరిస్తున్నట్లనిపించింది నాకు.
అవ్వగారు ఏదో ట్రాన్స్‌లో ఉన్నవారిలా చెప్పుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో ఆవిడ ఏకాగ్రతకి భంగం కలిగిస్తే ఆవిడ భావనాలోకం నుండి మన లోకానికి వచ్చేస్తారు. కనుక అనుమానాలొచ్చినా అర్థం కాకపోయినా అన్నీ ఆ తరువాతే అడగాలిగానీ ఇప్పుడు కాదు.
అవ్వగారి ఊహావిహారం కొనసాగుతూనే ఉంది, “ఇక్కడ అన్నీ ఉన్నాయిగానీ విగ్రహం చెక్కడానికి అనువైన బండలు మాత్రం దొరకవు. వాటిని చాలా దూరప్రాంతాలనించి తెప్పించేవారు. ఆ విగ్రహం సామాన్యమైనది కాదు. ఒక మహాశిల్పి కన్న కలకి ప్రతిరూపం. ఆ సౌందర్యం ఒక్కసారిగా వచ్చింది కాదు. పదకొండుసార్లు అమూర్తంగా అరూపంగా ముక్కలయ్యాకగానీ పన్నెండో విగ్రహానికి రూపకల్పన జరగలేదు. ఆ విగ్రహం పూర్తి చెయ్యడానికి ఏడేళ్ళు పట్టింది. దాన్ని సంవత్సర కాలం సానపడితేగానీ ఈ నునుపుదనం రాలేదు. దాన్ని ముట్టుకుంటే పసివాడి బుగ్గని నిమిరినట్లే ఉంటుంది.
అప్పట్లో ఇక్కడి గోశాల అతి పెద్దది. శరావతమ్మ నీటిజాలులాగే ఇక్కడి గోక్షీరం కూడా ప్రవహించేదని చెప్పుకునేవారు. ఇది దాదాపు పదివేల ఆవులుండే ఊరు. ఆకాలంలోనే పదివేల ఆవులుండేవంటే ఈ ఊరెంత పెద్దదో ఊహించుకోవచ్చు. అంత గొప్ప గోసంపద. ఒకప్పుడు అంటే, స్వర్గంలో స్థిరపడక ముందు, కామధేనువు ఈ ఊళ్ళోనే ఉండేదని చెప్పుకునేవారు. దూడలు కడుపుండా పాలు తాగేంతవరకూ ఆవులకు పాలు పితికేవారు కారు. కాశీ కాశీ కాశీ అని మూడుసార్లు పలికితే చాలు, ఎంత మొండి ఆవైనా కుదురుగా నిలబడి పాలిచ్చేదట. అలాంటిచోట పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పాలకోవా, నేతి మిఠాయిలకి కొరతేముంటుంది.
శరావతమ్మ ఒడ్డున ఎంతదూరం వెళ్ళినా పచ్చికే. ఆవుల ఆహారానికి కొరతే లేదు.
ఈ ఊరిలో వందకుపైగా ఆవుల వైద్యశాలలూ ప్రసూతి కేంద్రాలూ ఉండేవి. కృష్ణాష్టమికి ఆవుల అలంకరణల్లో పోటీలుండేవి. ఏ ఊళ్ళో అయితే ఆవుల అలంకరణలో పోటీలుంటాయో ఆ ఊళ్ళో ఎద్దుల పరుగుపందాలు కూడా ఉంటాయి. ఇక్కడ సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి పండగలకి అంటే ఏడాదికి నాలుగుసార్లు ఎద్దుల పరుగు పందాలు జరిగేవి. ఇక్కడ ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యులకంటే రెట్టింపు ఆవులూ ఎడ్లూ ఉండేవి. అంటే ప్రతి ఇంటికీ రెండు కుటుంబాలు.. ఒకటి మనుషుల కుటుంబం. ఇంకొకటి ఆవుల కుటుంబం. ఇక్కడ అమ్మా ఆవూ ఒకటే.
ఎవరైనా సుఖసంతోషాలతో ఉంటే వారిమధ్య తంపులుపెట్టే తగవుల మారులు కూడా ఉంటారు. అలాగే ఏ ఊరైనా సమృద్ధిగా ఉంటే దాడి చెయ్యడానికీ నాశనం చెయ్యడానికీ విదేశీయులు సిద్ధంగా ఉంటారు.
ఈ ఊరి గోసంపదే కాదు సైనిక సంపద కూడా గొప్పదే. ఇక్కడి సైనికులు వీరాధివీరులు. అరివీర భయంకరులు. వారికి వెనుకనుండో చాటునుండో దూరంగా ఉండో యుద్ధం చెయ్యడం చేతకాదు. శత్రువు ఎలాంటివాడైనా ఎంతటివాడైనా ఎదురుబొదురుగా నిలబడి పోరాడటం మాత్రమే తెలుసు.
కానీ ఈ ఊరిమీదకి దండెత్తివచ్చినవారి దగ్గర సరికొత్త ఆయుధాలున్నాయి. తుపాకులు ఇక్కడ కూర్చుని ఎక్కడో ఉన్నవాడిని కూల్చేస్తాయి. ఫిరంగులు పాతికతాళ్ళ దూరంలోని కోటగోడల్ని కూడా పేల్చేస్తాయి.
సిరి సంపదలతో తులతూగే ఈ రాజ్యం మీద శత్రురాజుల కన్నుపడింది. ఓ హెచ్చరిక లేదు. ఓ రాయబారం లేదు. కనీసం వర్తమానమైనా లేదు. ఉన్నట్లుండి హఠాత్తుగా పిడుగులు పడినట్లు దాడులు ప్రారంభమయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక కత్తులూ కఠార్లూ బాణాలూ అగ్ని అస్త్రాలూ ప్రయోగించి పోరాడుతూనే ఉన్నారు. పగలు గడిచేసరికి ఎంతో సైన్యనష్టం, జననష్టం, జంతు నష్టం జరిగేది. జరిగిన నష్టాన్ని పూరించలేకపోయినా రాత్రి సమయాలలో మరునాటి యుద్ధంలో మరింత నష్టం జరగకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకుని శత్రువ్యూహాలకు తగిన ప్రతివ్యూహాలను పన్నేవారు. మరునాటి యుద్ధానికి ఏర్పాట్లు చేసుకునేవారు.
కానీ శత్రుమూకలు అలా కాదు. రాత్రివేళల్లో ఆలయాలు ధ్వంసం చేసేవారు. పంటలు తగలబెట్టేవారు. ఊళ్ళమీద పడి స్త్రీలను చెరబట్టేవారు.
శత్రువులు యుద్ధంచేసి గెలవడం మీద కన్నా మన ఆస్తులకి నష్టం కలిగించడం ద్వారా ఆర్ధిక సామాజిక నైతిక మూలాలని దెబ్బతియ్యడం ద్వారా పరోక్ష యుద్ధం చేసేవారు. అలాంటి యుద్ధం గురించి మనవాళ్ళకి తెలియదు. అది తెలుసుకునేలోపే యుద్ధం ముగిసిపోయింది. శత్రువులు రాజుని ప్రజల కళ్ళ ముందే బహిరంగప్రదేశంలో పరమ కిరాతకంగా అంతం చేసేవారు. తద్వారా స్థానిక వీరుల గుండెల్లో ధైర్యం నీరు కారిపోయేది. సాహసం తిరుగుబాటుకు ముందే మట్టికరిచేది. ఆ విధంగా రాజుని తన కన్నకొడుకు కళ్ళముందే హతమార్చారు.
మనకి పరాక్రమం అంటే పరులని కూడా స్వంతవారిగా మార్చుకుని వారి మనసులని గెలుచుకోవడం. కానీ వారికి పరాక్రమం అంటే పరుల్ని అంతం చేయడం. అంటే శత్రుశేషం లేకుండా చెయ్యడం. శత్రువే లేకుండా పోయాక గెలుపుకు అర్థం ఏముంటుంది?
రాజు ఓడిపోయినా ఆ రాజు నియమించిన పాళెగాళ్ళు ఓడిపోలేదు. ఓటమి అంగీకరించలేదు. వారంతా కలిసికట్టుగా శత్రువులని ఓడించేవరకూ నిద్రపోకూడదని ప్రతిజ్ఞ చేసారు.
కానీ వారి దగ్గర మందుగుండు సామగ్రి అంతా ఖాళీ అయిపోయింది. కత్తులూ కఠార్లతో ప్రత్యక్ష యుద్ధం చేసే పరిస్థితి లేకపోవడంతో అడవుల్లో కొండజాతి వీరులతో కలసి పరోక్షయుద్ధం ప్రారంభించారు.
అంతకంటే ముందు రాణిగారినీ రాకుమారుడినీ తీసుకొచ్చి రహస్య స్థావరంలో దాచిపెట్టారు.
యుద్ధం ఎంతోకాలం కొనసాగలేదు వీరాధివీరులంతా వెన్నుపోట్లకు గురయ్యారు. సామాన్య సైనికుల్లో చాలామంది యుద్ధమాలిన్యాల ద్వారా ప్రబలిన అంటువ్యాధుల పాలయ్యారు. మిగిలినవారు ఆకలిమంటలతో రగులుతూ శత్రువులతో ఎలా పోరాడగలరు? విజయం ఎలా సాధించగలరు చివరికి పాళెగాళ్ళ తిరుగుబాటు కూడా విఫలమైపోయింది.
గెలిచిన వెంటనే విజేతలు చేయాల్సినపని పునర్నిర్మాణం. మళ్ళీ ఊళ్ళనీ పట్టణాలనీ నిర్మించుకోవడం ప్రజలు నిర్భయంగా బతకడానికి తగిన సౌకర్యాలు కలిగించడం. విజాతీయులు స్థానికుల్ని ఓడించినప్పుడు చేసే మొదటి పని స్థానికుల మతం మార్చడం ద్వారా వారిని పాలకుల మతస్థులుగా మార్చడం. మతం మార్చుకుని పాలకుల కొమ్ముకాసేవారికి అధికారాలను కట్టబెట్టడం. తద్వారా స్థానికుల అస్తిత్వాన్ని కాలరాయడం.
వారి అకృత్యాలబారిన పడి ఎందరో ప్రజలు వారి ఉనికి కోల్పోయారు. చివరికి వారు రాణిగారినీ రాజకుమారుడినీ కూడా వదిలి పెట్టలేదు.
ఇంక పార్వతీపురం విషయానికొస్తే ఇక్కడి ప్రజలకు కూడా ఊరు వదిలి వెళ్ళిపోక తప్పని పరిస్థితి ఎదురైంది. స్థానిక ప్రజలకి ఆ చుట్టుపక్కల ఉన్న అరణ్యాలలో జీవించడానికి అనువైన ప్రదేశాల గురించి తెలుసు. అందుకే రాత్రికి రాత్రే ఇళ్ళూ వాకిళ్ళూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వీలయినన్ని ఆవుల్ని కూడా వారితో తోలుకెళ్ళారు. అయినాసరే అనన్యసామాన్యమైన గోసంపద కలిగిన ఈ ఊరిలో దిక్కూదివాణం లేని ఆవులెన్నో మిగిలిపోయాయి.
వాటిలో పాలిచ్చే ఆవులనించీ పాలు పిండుకు తాగారు. పాలివ్వని ఆవుల్ని వండుకు తిన్నారు.
ఊళ్ళోని ఆవుల్లో ఒక ఆవుకి మాత్రం త్రిశూలం పుట్టుమచ్చ ఉండేది. అది తన సంతానంతో సహా అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలోనే తిరుగుతూ ఉండేది.
ఇక్కడ ఊరిలో పరదేశీయుల పాలన స్థిరపడింది. ఏ రాజ్యమైనా నిలబడాల్సింది ప్రజలతోనే. ప్రజల్లేని రాజ్యం ఎక్కడా ఉండదు. అందుకే పరాయిరాజులు స్థానికులతో సత్సంబంధాలను పెంపొందించుకోవడం ప్రారంభించారు. క్రమంగా ఇష్టంలేనివారిని బలవంతంగా మతం మార్చే పద్ధతికి స్వస్తిపలికి ఎవరి జీవితాన్ని వారు జీవించడానికి ఆవకాశమిచ్చారు. దాంతో అడవుల్లోకి పారిపోయి గూడాలు ఏర్పరచుకున్న స్థానికులు ఒక్కొక్కరుగా మళ్ళీ వారి వారి నివాసాలకు వెనుదిరిగి రావడం మొదలుపెట్టారు.
ఊరు మళ్ళీ ఊరుగా మారసాగింది. అయినాసరే ప్రజల్లో ఎవరికీ పాలకుల్ని ఎదిరించే ధైర్యసాహసాలుండేవి కావు. పరిపాలన కోసం పరుగులెత్తేవారికి ప్రజల అవసరాలతోగానీ వారి ఆభివృద్ధితోగానీ పని ఉండదు. వేసినంత పన్ను కడితే చాలు. చెప్పిన పని చేస్తే చాలు. రాజుకి వ్యతిరేకంగా జనాల్ని కూడగట్టకుండా ఉంటే చాలు. అది వారి స్వార్థం. ఉన్న ఊరూ కన్నతల్లీ స్వర్గంతో సమానం కాబట్టీ పుట్టిన ఊరిలోనే జీవించే అవకాశం పొందడమే స్థానికుల జీవన పరమార్థం.
ఈలోగా అక్కడి పాలకుల్లో మూర్ఖుడైన ఒక తొత్తు ఇక్కడికి వచ్చాడు. గుడిలో దేవుడికి అలంకరించే స్వర్ణాభరణాల గురించి తెలుసుకున్నాడు. అందరూ వద్దన్నా వినకుండా అభరణాల గదిని తెరిచాడు. అందులోని ఆభరణాలన్నింటినీ మూటకట్టుకున్నాడు. వెనుదిరిగాడు. సరిగ్గా అదే సమయంలో ఒక ఆవు శరవేగంగా వచ్చి ఆ తొత్తు కడుపులో తన కొమ్ములతో కుమ్మేసింది. ఆ విదేశీ పాలకుడు అక్కడికక్కడే రక్తం కక్కుకుని చచ్చాడు. సరిగ్గా రెండే రెండు నిమిషాల్లో ఆ పాలకుడి సేవకులందరినీ కుమ్మడం ప్రారంభించింది. దాని ఆగ్రహానికి ఎదురు నిలబడ లేక ఆ సేవకులంతా దిక్కుకి ఒకరుగా పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు” అవ్వగారు మాట్లాడుతూండగానే వెనకనించి ఏదో సద్దు వినిపించింది. దాంతో అవ్వగారు తన ధ్యాన సమాధికి భంగం కలిగింది. వెంటనే మాట మార్చి మా మీరా అల్లరి గురించి ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఆవిడ తాళానికి తగినట్టుగా నేను మాట్లాడటం మొదలుపెట్టాను.
వచ్చినావిడ రంగనాథస్వామిగారి భార్య. రాగానే లైటు వేసింది. నా మంచం మీద అవ్వగారిని చూసింది. ఏమైనా కావాలా అని అడిగింది. అవ్వగారు కాసిని మజ్జిగ ఇమ్మన్నారు. ఆవిడ ఇద్దరికీ మజ్జిగ ఇచ్చి, ఆ మజ్జిగతోబాటే ఇంక పడుకొమ్మనే ఉచిత సలహా కూడా ఇచ్చి వెళ్ళిపోయారు.
అధ్యాయం-16
అతిథిమర్యాదల్లో ఉత్సాహం మంచిదేగానీ అత్యుత్సాహం పనికిరాదు. అంత అర్ధరాత్రివేళ మాకా మజ్జిగ అవసరమా? నాకు సంబంధించినంత వరకూ రంగనాథస్వామిగారి అతిథి మర్యాదలు ఒక గొప్ప అవకాశాన్ని పాడుచేశాయి.
ఆవిడింకాసేపు రాకుండా ఉంటే అవ్వగారు ఆ విగ్రహం కథ పూర్తిగా చెప్పేవారు. తరవాతేమైందో తెలుసుకోవాలనే ఉత్కంఠ నాలో క్షణక్షణానికీ పెరిగిపోతోంది. అది పెరిగి పెద్దై నిధిని కాపాడే నాగుపాములా బుసలు కొడుతోంది. అందుకే ఆగలేకపోతున్నాను. అవ్వగారు అన్నీ చెప్పారుగానీ ఆ విదేశీయులు చేసిన దురాగతాలలో దుష్టమైనదాని గురించి దాచిపెట్టారు. బహుశా దానిగురించి చెబితే ఆవుని అమ్మలా చూసుకునేవాళ్ళందరినీ బాధపెట్టినట్లవుతుందనుకుని దాచి ఉంటారు.
కానీ ఆ కథ వివరాలు చెబుతున్నప్పుడు అవ్వగారు మనలోకంలో లేరు. ఇదీ అని చెప్పలేని కల్పనాలోకంలో ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పటి సామ్యవాద చరిత్రకారుల్లా నిజాల్ని ఎందుకు దాస్తారు? వక్రీకరణలకి గురౌతున్న చరిత్రని మళ్ళీ సరైన దారిలో పెట్టడానికి మా అవ్వగారు కూడా ఒక గొప్ప ఆధారం కదా? మరి ఆవిడ జరిగింది జరిగినట్లుగా ఎందుకు చెప్పలేదు?
అవ్వగారు చెప్పిందాని గురించి ఆలోచిస్తుంటే చిన్నప్పుడెప్పుడో కంఠస్థం చేసిన సంస్కృత శ్లోకం గుర్తొచ్చింది.
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
నబ్రూయాత్ సత్యమప్రియం
ప్రియంచ నానృతం బ్రూయాత్
ఏష ధర్మస్సనాతనః
సత్యం శాశ్వతమైనది. అందులో మార్పుండదు. కానీ మాట మనసుకు తగిలేది కనుక మాటలని సందర్భానుసారంగా ఉపయోగించాలి. ఎదుటివారిని బాధపెట్టే మాటలు మాట్లాడకూడదు. అలాగని ఎదుటివారికి ఆనందం కలిగించడం కోసం అబద్ధాలు కూడా చెప్పకూడదు. నిజమే అవ్వగారు చెప్పకుండా దాచిన రహస్యాలన్నీ మనకి తెలిసినవే. ఆవుల్ని వాళ్ళు ప్రియంగా వండుకుతింటారని చెబితే ఆవుని తల్లిలా పూజించేవాళ్ళ మనసు బాధపడుతుంది. తినడం వాళ్ళ పద్ధతి. పూజించడం వీళ్ళ పద్ధతి.
ఎవరి పద్ధతి వాళ్ళది. వాటి గురించి అవగాహన పెంచేలా మాట్లాడాలాలే తప్ప ఆవేశాలు కలిగించేలా మాట్లాడకూడదు. అందుకే అవ్వగారు యుద్ధం తరవాత జరిగిన విధ్వంసం గురించి చాలా తక్కువ చెప్పారు. ఒకవేళ వాటి గురించి తెలుసుకోవాలంటే నెట్లో కొడితే చాలు. లెక్కలేనంత సమాచారం లభిస్తుంది. ఈ జాలజ్ఞానానికి మెదడేగానీ మనసుండదు. కానీ మనిషిమీద మెదడు కంటే మనసు చూపే ప్రభావమే ఎక్కువ.
సత్యం గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. అవ్వగారు చెప్పకుండా దాచిన విషయం గురించి ఆలోచిస్తున్నకొద్దీ అవగాహనా పరిధి దానికదే విస్తృతమౌతోంది.
మూకవ్వగారికి మనవడిని కావడం నాకు గర్వకారణం. నా అనుమానాన్ని నివృత్తి చేసుకునే అంతర శోధనలో సత్యం ఆవిష్కరించబడిన ఆనందం మనసుకు ఊరట కలిగింది.
ఆహార చక్రంలో ప్రాణులన్నీ ఒకదానికొకటి ఆహారంగా సృష్టించబడ్డమాట సత్యం. కానీ మనిషి తప్ప మరే జంతువూ అన్ని జంతువులనీ ఆహారంగా స్వీకరించదు. కాబట్టీ మనిషిని మించిన క్రూర జంతువు మరొకటి ఉండదు. ఆ క్రూరజంతువు తన క్రౌర్యాన్ని వదిలించుకోవడానికి జంతులక్షణాలన్నింటినీ దాటుకుంటూ వచ్చాడు. అవన్నీ దాటినందుకు గుర్తుగా జంతువులన్నింటినీ కూడా దైవంతో సమానంగా పూజించాడు. మనకి దేవుడు కాని మనిషి లేడు. మనిషికాని దేవుడూ లేడు. అన్నింటికీ దైవత్వం ఉంది. చివరికి నిద్రకి కూడా దైవత్వం ఉంది. ఒకవేళ నిద్రాదేవే లేకపోతే రాముడి వనవాసం పూర్తయ్యేవరకూ లక్ష్మణుడు నిద్ర లేకుండా పధ్నాలుగు సంవత్సరాలు కాపలా కాసే పరిస్థితి ఉండేది కాదు. ఊర్మిళాదేవి లక్ష్మణుడి నిద్రను కూడా తనే తీసుకోగలిగి ఉండేది కాదు. లక్ష్మణస్వామి ఊర్మిళాదేవిల దాంపత్యంలో నిద్రకుండే దైవత్వం నిర్వహించిన పాత్ర చాలా ప్రధానమైనది. ప్రపంచ సాహిత్యంలో నిద్రాదేవి ప్రాధాన్యతని ఎలుగెత్తి చాటిన అపురూప దంపతులు లక్ష్మణస్వామీ ఊర్మిళా మాతలు. ఆ పుణ్యదంపతుల్ని తలుచుకోగానే నిద్రాదేవి నన్ను కూడా ఆవహించింది.
అంత మత్తుగా నిద్రపోయి ఎన్నేళ్ళైందో గుర్తు లేదుగానీ, భట్టుగారొచ్చి నిద్రలేపేవరకూ మెలకువ రాలేదు.
లేవగానే శరావతి నదికి వెళ్ళి స్నానం చెయ్యాలనిపించింది. భట్టుగారు కూడా నాతో రావడానికి సిద్ధమయ్యారు. ఇద్దరం దంతధావనానికి వేపపుల్లలు విరుచుకుని నములుకుంటూ బయలుదేరాం. మన బ్రష్ మనమే తయారు చేసుకోవడం. తద్వారా మన ఆరోగ్యాన్ని మనమే చూసుకోవడం ఎంతో ఆత్మబలాన్నిస్తాయి. ఆత్మగౌరవాన్ని కలిగిస్తాయి. కానీ మనకి కెమికల్ పేస్టూ ప్లాస్టిక్ బ్రష్షూ అవి చాలక పెర్ఫ్యూమ్డ్ మౌత్ ఫ్రెషనర్లూ. ఆర్టీఫీషియల్ ఆర్ట్ గ్యాలరీలా మారిపోతోంది జీవితం. వేప్పుల్లతో బ్రషింగ్ పూర్తయ్యాక దాన్నే నిలువునా రెండుగా చీల్చి టంగ్ క్లీనర్లుగా వాడుకోవడం ఎంత బాగుంటుందో.
మేము దంత ధావనం చేస్తూనే మధ్య మధ్య మాట్లాడుకుంటూ ముందుకు సాగుతున్నాం.
ఈరోజు పార్వతీపురానికీ మాకూ తప్ప ఇంకెవరికీ ఇంత అబ్బురంగా తెల్లవారి ఉండదు.
ఇద్దరం ముఖాలు కడుక్కున్నాం. నదీమతల్లికి నమస్కరించాం. సంధ్యవార్చుకున్నాం. సూర్యుడికి అర్ఘ్యమిచ్చాం. ఆ తరువాత గట్టుమీదకొచ్చాం. చేతి సంచుల్లో తెచ్చుకున్న పంచెలు కట్టుకున్నాం.
గ్రామసీమల్లోని ఉదయాలు ఎంత అందంగా ఉంటాయో అనుభవిస్తూ ఆ అనుభవం ఇచ్చిన అనుభూతుల్ని మనసులో పదిలపరచుకుంటూ వెనక్కి బయలుదేరాం. అప్పటికే జనం గుడిముందుకు చేరుకుంటున్నారు ఇంక మాదే ఆలస్యం అనుకుంటూ వడివడిగా అడుగులేసుకుంటూ రంగనాథస్వామి గారింటికి చేరుకున్నాం. అప్పటికే అందరూ మాకోసం ఎదురు చూస్తున్నారు. లోపలకి రాగానే మాకు వేడి వేడి కాఫీలిచ్చారు. అంతలోనే ఊరిపెద్దల్లో ఒకాయనొచ్చి అవ్వగారిని రావలసిందిగా ఆహ్వానించి వెళ్ళాడు. రంగనాథస్వామిగారి భార్య పదే పది నిమిషాల్లో శిరా, ఉప్పిట్టు చేసిపెడతాను ఉండమని బలవంతం చేశారు. ఆవిడమాట కాదనలేక మేము ముళ్ళమీద కూర్చున్నట్లు కూర్చున్నాం. అంతలోనే ఇంకో పెద్దమనిషి వచ్చి మమ్మల్ని వెంటనే బయలుదేరి రావలసిందిగా ఆహ్వానించాడు. అంతే కాదు. మమ్మల్ని వెంటబెట్టుకుని వెళ్ళడం కోసం అక్కడే నిలబడ్డాడు. దాంతో అవ్వగారు లేచారు. ఆవిడ వెనుక మేం కూడా బయలుదేరాం.
మేం వెళ్ళేసరికి గుడిముందు జనం గుంపుగా నిలబడి ఉన్నారు. వాళ్ళు గుడిలోకి వెళ్ళకుండా బయటే ఎందుకు నిలబడ్డారనుకుంటూ ముందుకొస్తుంటే జనాలు మాకు దారి వదిలారు. చూస్తే ఆలయ సింహద్వారం ముందు అడ్డంగా నిలబడి ఉంది నందిని. లోపలకి వెళ్ళాలని ప్రయత్నించేవాళ్ళందరి మీదా కొమ్ము విసురుతోంది.
నిన్నటి మహావీర మల్లులు కూడా దానిని అదుపు చేసేందుకు ప్రయత్నించకుండా దూరంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు.
నందిని మళ్ళీ గుడిలోకి వెళ్ళకుండా అందరినీ అడ్డుకుంటోందని తెలిసిన ఊరి పెద్ద కూడా వచ్చారక్కడికి.
అవ్వగారిని చూడగానే నందిని దారి వదిలింది.
ఆవిడ ఏదో ఆలోచిస్తూ గుడిలోకి నడిచారు. గుడి ప్రాంగణమంతా కలియజూశారు. ఖాళీ మంటపం దగ్గర ఆగారు.
నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు నందిని నామీదకి కొమ్ము విసిరిన ప్రదేశం ఆ ఖాళీ మంటపమే. ఆ విషయాన్ని ఆవ్వగారికి చెప్పాలని దగ్గరకెళ్ళాను. కానీ అవ్వగారి దృష్టి పరిసరాలమీద లేదు. అంటే ఆవిడ శూన్యాన్ని దాటి కాలంలోకి చూస్తున్నారు. అటువంటి సమయంలో ఆవిడ ఏకాగ్రతకి భంగం కలిగించకూడదు. ఆవిడ ఆ ఖాళీ మంటపాన్నే చూస్తూ చెప్పడం ఆరంభించారు, “ఈ మంటపంలో ఒకప్పుడు కామధేనువు ఉండేది.”
వెంటనే ఊరిపెద్ద ఉత్సాహాన్ని తట్టుకోలేక, “ఇప్పుడెక్కడుంది?’ అని అడిగారు. దాంతో అవ్వగారి ఏకాగ్రత దెబ్బతింది. అందుకే మామూలు స్వరంతో, “ఇంకెక్కడుంది స్వర్గానికి వెళ్ళిపోయింది” అన్నారు.
ఊరి పెద్ద ఉత్సాహమంతా నీరు కారిపోయింది.
అవ్వగారు ఆ మంటపాన్నీ దాని స్తంభాలమీద చెక్కిన శిల్పకళాకృతులనీ పరిశీలించాక నందిని వైపు తిరిగారు. నందినిని చూస్తుంటే ఆవిడ కళ్ళలోకి వెలుగొచ్చింది.
అంతలోనే ఊరి పెద్ద ఆవిడని ఏదో అడగబోతుంటే నేను వారించాను. అవ్వగారు నందిని నుదుటిమీద చెయ్యివేసి నిమిరారు. ఆ తరువాత ఏదో అర్థమైనవారిలా ఊరిపెద్దవైపు చూశారు.
“నిన్న నందిని వెళ్ళిన రాళ్ళగుట్ట కేవలం రాళ్ళగుట్ట కాదు. దానికింద గొయ్యి ఉండేది. ఈ మంటపంలో ఉండాల్సిన కామధేనువు శిల్పాన్ని తీసుకెళ్ళి ఆ గోతిలో పారేశారు. దానిమీద రాళ్ళు పడేశారు. అది రాళ్ళగుట్ట కాదు. అవన్నీ మన చరిత్రని మంటకలపడానికి చేసిన ప్రయత్నాలు. వెళ్ళండి ఆ రాళ్ళగుట్టని తవ్వండి” అన్నారు. వెంటనే అందరూ ఆ రాళ్ళగుట్ట దగ్గరకి చేరారు.
అది దాదాపు పదిహేనడుగుల ఎత్తు పాతికడుగుల వైశాల్యంలో విస్తరించిన గుట్ట. ఆ గుడ్డలోని రాళ్ళన్నింటినీ ఏరడం అంటే వారం పదిరోజుల పని. అందుకే ఊరి పెద్ద తన జెసిబిని తెప్పించాడు. రెండేరెండు గంటల్లో గుట్టమీది రాళ్ళన్నీ పక్కన మరో పెద్ద గుట్టగా పోసిందా జేసీబీ. క్రమంగా రాళ్ళస్థానంలో విరిగిపోయిన స్తంభాలు, చిన్న చిన్న శిల్పాలు బయట పడుతున్నాయి. మధ్యాహ్నం వేళకి దాదాపుగా పాతిక శిల్పాలు బయటపడ్డాయి. జెసిబితో తవ్వడం మానేసి గునపాలు, పారలతో తవ్వడం మొదలు పెట్టారు. పారకి ఒక నున్నటి బండ తగిలింది.
అవ్వగారు తవ్వకం ఆపమన్నారు. ఆ తరువాత అక్కడ పని చేస్తున్నవాళ్ళకి ఒక విషయం చెప్పారు, “శిల్పం చెక్కడం అంటే బండరాయిలోని అనవసరమైన భాగాల్ని తొలగించడం. ఇప్పుడు ఆ శిల్పం చెక్కిన శిల్పి ఎంత జాగ్రత్తగా ఆ శిల్పాన్ని మలిచాడో మీరు అంతకంటే జాగ్రత్తగా దాన్ని దెబ్బతినకుండా బయటకి తియ్యాలి. గునపాలు పక్కన పెట్టి పారలతోనే మట్టిని తొలగించాలి” అంటూ ఎంత సున్నితంగా తవ్వాలో తనే స్వయంగా తవ్వి చూపించారు. దాంతో అందరూ అతి జాగ్రత్తగా పారలతో మట్టిని తొలగించడం ప్రారంభించారు. గొయ్యి ఏర్పడుతున్నకొద్దీ విగ్రహం బయటికొస్తోంది.
అక్కడ పని చేస్తున్నవాళ్ళకోసం పక్కనే ఉన్న చెట్టుకింద వంట చేయిస్తున్నారు ఊరి పెద్ద.
భోజనాలవేళకి చిత్రాన్నం, చక్కెరపొంగలి, పెరుగన్నం సిద్ధమైంది. అందరినీ భోజనాలకు పిలిచాడు ఊరి పెద్ద.
రంగనాథస్వామి వచ్చి ఆవ్వగారినీ నన్నూ భట్టుగారినీ ఇంటికి తీసుకెళ్ళారు. ముగ్గురం వెళ్ళి భోజనాలకి కూర్చున్నాం. అన్నం తింటున్నా అవ్వగారి మనసు మాత్రం కామధేనువు విగ్రహం మీదే ఉంది. నా మనసేమో అవ్వగారు చెప్పబోయే చరిత్రమీద ఉంది. భట్టుగారు రంగనాథస్వామిగారితో మాట్లాడుతున్నారు. భోజనాలు పూర్తి చేశాక కాసేపు విశ్రమించమన్నారు రంగనాథస్వామి దంపతులు. అవ్వగారు చిరునవ్వుతో వారి అభ్యర్థనని తోసిపుచ్చారు. వాళ్ళిచ్చిన తమలపాకులకి సున్నం రాసి కాస్త వక్కపొడీ లవంగం యాలకుల గింజలూ వేసి చిలకలు చుట్టిచ్చారు నాకు. అవ్వగారు అందంగా చిలకలు చుడుతుంటే ఆ దంపతులు అబ్బురంగా చూశారు.
తాంబూల సేవనం కాగానే అందరం మళ్ళీ గుట్టదగ్గరకి బయలుదేరాం. అక్కడ పనిచేస్తున్నవాళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహంలో ఎవరైనా కొంచెం గట్టిగా కొడితే విగ్రహం పాడైపోతుందనేది నా ఆందోళన. అందుకే అందరికంటే ముందే అక్కడికి చేరుకున్నాను. అదృష్టవశాత్తూ అక్కడ పని మొదలుపెట్టలేదు. ఊరిపెద్ద అవ్వగారికి ఎదురు వెళ్ళాడు, “అందరికీ తొందరగా విగ్రహాన్ని చూడాలనే ఆత్రుతేగానీ ఎవరికీ ఆలోచన ఉండదు. అందుకే వాళ్ళు పని మొదలు పెడతామన్నా నేనే వద్దన్నాను” అన్నారు.
అవ్వగారు నవ్వారు. ఆవిడని చూడగానే అందరూ పారలూ పలుగులూ పుచ్చుకుని పనిలోకి దిగారు. దాదాపు రెండు గంటలు కష్టపడ్డాక విగ్రహం చుట్టూ పెద్ద గొయ్యి తవ్వగలిగారు. విగ్రహం ముక్కలు ముక్కలుగా ఉంది. పిల్లలాడుకునే బిల్డింగ్ బాక్సుల్లా దేనికదే విడివిడిగా ఉన్నాయి. వాటిని జోడిస్తేగానీ కామధేనువు విగ్రహం పూర్తి కాదు. ఆ భాగాల్లో దేనికీ ఎలాంటి దెబ్బా తగలకుండా వెలికి తీసినందుకు అందరినీ అభినందించారు అవ్వగారు.
ఈలోగా ఊరిపెద్ద అక్కడున్న చిన్న చిన్న విగ్రహాలన్నింటినీ ట్రాక్టరులో గుడికి తరలించారు.
ఇప్పుడు కామధేనువు విగ్రహం శిలలని గుడి దగ్గరకి తీసుకువెళ్ళాలి.
భట్టుగారు అబ్బురంగా చూస్తూ, “ఇంత పెద్ద పెద్ద భాగాల్ని అమ్మవారి గుడి దగ్గరనించి ఇంత దూరం ఎలా తీసుకొచ్చారో తలుచుకుంటూనే ఆశ్చర్యంగా ఉంది” అన్నారు.
ఆయన మాటలకి అవ్వగారేం సమాధానం ఇస్తారో వినాలని అవ్వగారివైపే సాభిప్రాయంగా చూస్తున్నాను.
“దాన్ని వాళ్ళు తీసుకురాలేదు. ఏనుగులచేత తోయించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు దీన్ని తోసుకుంటూనే దొర్లించుకుంటూనే తీసుకెళ్ళకూడదు. వాళ్ళకి విగ్రహం ముక్కలైపోయినా బాధలేదు. కానీ మనకి ఆ విగ్రహం దేవుడితో సమానం. కాబట్టీ ఏభాగానికీ ఏమాత్రం దెబ్బ తగలకుండా తీసుకెళ్ళాలి” అన్నారు అవ్వగారు.
ఆవిడ మాటలకి తగినట్లే పెద్ద క్రేన్ వచ్చిందక్కడికి. చిన్న లారీ కూడా వచ్చింది. లారీ తొట్టి కిందభాగంలో టార్పాలిన్ పట్టలు పరిచి ఉన్నాయి. నలుగురు పనివాళ్ళొచ్చి విగ్రహభాగాలకి తాళ్ళు కట్టారు. క్రేన్ మెల్లగా పైకిలేస్తుంటే భట్టుగారు హరహర మహాదేవ అని అరిచారు. వెంటనే అక్కడ చేరిన జనం అందరూ శంభోశంకర అంటూ పలికారు. భక్తి పారవశ్యంతో చేస్తున్న ఆ శివనామస్మరణ నేపథ్యంలో విగ్రహం మెల్లగా పైకి లేచింది. మరో అరగంటలో విగ్రహం గుడిముందుకు చేరింది. దాన్ని చూడగానే నందిని ఆనందం అంతా ఇంతా కాదు. అది ఆ శకలాలని వదిలిపెట్టడం లేదు.
ఊరిపెద్ద భట్టుగారిని దగ్గరకి పిలిచి, “వందల సంవత్సరాలుగా పూజా పునస్కారాలు లేని గుడికి మంచిరోజులొచ్చాయి. సాక్షాత్తూ ఆ కొల్లూరు మూకాంబికాదేవే తన ప్రతినిధిగా మన మూకవ్వగారిని పంపించారు. ఆలయానికి పూర్వకళ వచ్చేలా చేశారు. మంచి ముహూర్తం చూడండి భట్టుగారూ ఆలయంలో పూజాదికాలు మళ్ళీ ఆరంభిద్దాం” అన్నారు.
భట్టుగారు లెక్కలువేసి, “చైత్రశుద్ధ దశమి శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉంది. పూజలు ప్రారంభించడానికి చాలా మంచిరోజు. అదీ కాకుండా శ్రీరామ నవమికి మరుసటిరోజు కాబట్టీ రాములవారి కరుణా కటాక్షాలు కూడా లభిస్తాయి” అని చెప్పారు.
“ఏమంటారు?” అన్నట్లు అవ్వగారివైపు సాభిప్రాయంగా చూశారు ఊరి పెద్ద.
“అనడానికేముంది? శుభస్య శీఘ్రం. ఎవరు కట్టారో ఎప్పుడు కట్టారో తెలియని గుడిని శతాబ్దాల తరువాత మళ్ళీ తెరిపించే అవకాశం కలిగింది మనకి. అంతకంటే అదృష్టం ఏం కావాలి? కానీ ఈ పార్వతీపురం శివాలయానికి ఎంత ప్రసిద్ధమో గోశాలకి అంతకంటే ప్రసిద్ధం. ఇక్కడే వేలాది ఆవులు అసువులు బాసాయి. ఆకలి తీర్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆశలు రేకెత్తిస్తున్నాయి. అమ్మలాంటి ఆవుకోసం, సాక్షాత్తూ మన నందిని ఆశీస్సులకోసం, ఈ ఊరి సౌభాగ్యం కోసం ఇక్కడ పెద్ద గోశాలని నిర్మించి గోసంతతి పెంపొందింపజేయాలి” అంటుంటే నందిని వచ్చి అవ్వగారి పక్కన నిలబడింది.
అవ్వగారి మాటలు పూర్తయ్యే లోపే అందుకున్నారు ఊరి పెద్ద, “అది మీ కోరిక మాత్రమే కాదు అవ్వగారూ, ఆ కామధేనువూ ఈ నందినీమాతా కూడా అదే కోరుకుంటున్నాయి. కాదనడానికి మేమెవరం? గుడిలో పూజలు ప్రారంభించినరోజే గోశాలని కూడా ఆరంభిద్దాం” అనగానే ఊళ్ళో జరుగుబాటుండే పెద్దలు ఒక్కొక్కరుగా ముందుకొచ్చారు. చూస్తూండగానే దాదాపు నూటయాభై మంది పేర్లిచ్చారు.
ఈలోగా భట్టుగారికి ఫోనొచ్చింది. భట్టుగారింటికి సావిత్రి అత్తమామలు వచ్చారు. కనుక వెంటనే బయలుదేరాలి. అవ్వగారు ఊరి పెద్దకు చెప్పి బయలుదేరుతుంటే ఆయనా మరికొంత మంది పెద్దలూ మా వెంట రేవుదాకా వచ్చారు. మేము వెళ్ళేసరికి పడవ సిద్ధంగా ఉంది. అందరికీ వీడ్కోలు చెప్పి బయలుదేరాం.
(ఇంకా ఉంది)
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి తెలుగు రచయిత, అనువాదకులు. ‘వలస దేవర’, ‘జంగమదేవర’, ‘అంతర్యామి’, ‘సాక్షాత్కారం’ వీరి నవలలు. ‘ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్’, ‘ఈ కథకి శిల్పం లేదు’ వీరి కథాసంపుటాలు. ప్రఖ్యాత తెలుగు కవుల సంపుటాలను కన్నడంలోకి అనువదించారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార నాటకం ‘గుళ్ళకాయజ్జి’, కేంద్ర సాహిత్య అకాడెమీ బాల సాహిత్య పురస్కారం పొందిన బోళువారు మహమ్మద్ కుణ్హి పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. వీరి నవలలకు, కథాసంపుటాలకు పలు పురస్కారాలు లభించాయి.
