Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆయుర్వేద మార్తాండుడు పండిత దీవి గోపాలాచార్యులు-3

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘ఆయుర్వేద మార్తాండుడు పండిత దీవి గోపాలాచార్యులు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది మూడవ భాగం.]

పనప్పాకం అనంతాచార్లుగారితో పరిచయం

పనప్పాకం అనంతాచార్యులుగారు 1885లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్ స్థాపించడం కోసం బొంబాయిలో సమావేశం అయిన 72 మంది దేశీయ ప్రముఖులలో ఒకరు. ఆ తరువాత ఆరేళ్ళకు ఆ సంస్థకు అధ్యక్షుడైన తొలి దకిణాది నాయకుడు కూడా ఆయనే!

శ్రీ అనంతాచార్యులు మద్రాసులో స్థిరపడిన తెలుగువాడు. తమిళ, ఆంధ్ర ప్రజల మధ్య సాంఘిక, సాంస్కృతిక సేతువుగా పని చేశారు.

‘అనంతాచార్యులు’ అనే ఆయన తెలుగు పేరు తమిళుల ఉచ్చారణలో ‘ఆనందాచార్యులు’గా మారిపోయింది. చిత్తూరు జిల్లా కట్టమంచి గ్రామంలో జన్మించారాయన. చిన్నతనంలో ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. పట్టభద్రుడు కాకముందే కొంత కాలం మద్రాసులోని పచ్చియప్ప పాఠశాలలో టీచర్‌గా పని చేశారు. 1860 లో ఆయన న్యాయశాస్త్ర పట్టభదులు అయ్యారు.

అచిరకాలంలోనే న్యాయవాదిగా ఎదిగారు. మద్రాసు నేటివ్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా, ట్రిప్లికేన్‌ లిటరరీ అసోసియేషన్‌ అధ్యక్షుడుగా, ‘మద్రాసు మహాజన సభ’ సభ్యుడుగా నానా ముఖాలుగా జాతీయోద్యమ ఆరంభ వికాసాలకు ప్రేరకు డయ్యారు. వీరరాఘవాచారియర్‌, రంగయ్య నాయుడు, హిందూ సంపాదకులు సుబ్రహ్మణ్య అయ్యర్‌ ప్రభృతులు ఆయన సన్నిహితులు.

సురేంద్రనాథ్‌ బెనర్జీతో చేయి కలిపి నాటి ఐ.సి.ఎస్‌. పరీక్షలు ఇంగ్లండ్‌లోనే కాక, ఇండియాలో కూడా జరుపుతూ ఉండాలని ఆందోళన చేశారు. 1885 నుంచి 1904 వరకూ మద్రాసు తరపున ఆయన ‘సుప్రీమ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’లో సభ్యులుగా పనిచేశారు. నిర్మొహమాటంగా ప్రభుత్వ విధానాలను విమర్శించే వారు. ప్రజల హక్కుల్ని నిర్భయంగా సమర్థించేవారు.

గోపాలాచార్యులవారు ఈ పనప్పాకం వారికి అత్యంత సన్నిహితులయ్యారు. ఒక విధంగా ఆయన మార్గదర్శకుడుగా, ప్రేరకుడుగా యువకుడైన గోపాలాచార్యులవారి ఆలోచనలను అమితంగా ప్రభావితం చేశారు.

తెలుగువాడైన అనంతాచార్యులవారు సంతకం చేసేప్పుడు ఇంగ్లీషులో వ్రాసినా ‘అనంతాచార్లు’ అనే తెలుగుదనం ఉట్టిపడేలా వ్రాసేవారు. అనంతాచార్యులతో సాన్నిహిత్యాన్ని చాటుకుంటూ గోపాలాచార్యులవారు కూడా అప్పటి నుండీ ‘గోపాలాచార్లు’ అని వ్రాసుకోవటం మొదలు పెట్టారు.

వేటూరి ప్రభాకరశాస్త్రిగారిని వెంటబెట్టుకుని తీసుకువెళ్లి అనంతాచార్యుల వారికి పరిచయం చేసింది గోపాలాచార్యుల వారే నని వేటూరి వారు పేర్కొన్నట్టు మణిమంజరి పత్రికలో ఉంది.

ప్రతీ యేడూ గోపాలాచార్యులవారి మేడ మీద నవరాత్రులలో గానసభలు జరిగేవని వాటికి అనంతాచార్యులవారు అధ్యక్షత వహించేవారని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు వ్రాసినట్టు కూడా మణిమంజరి పేర్కొంది!

బాల్యమిత్రుడు నాగేశ్వరరావు పంతులుగారు

బందరులో చదువుకునే నాటి నుండీ ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు దేశోద్ధారక, విశ్వదాతగా ప్రసిద్ధులైన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారితో గోపాలాచార్యులవారికి స్నేహం ఉండేది. వీరి ఔషధాల ప్రకటనలు ఆంధ్రపత్రికలో విడవకుండా వచ్చేవి. నాగేశ్వరరావు పంతులుగారు గోపాలాచార్యులవారితో అనేక వ్యాసాలు వ్రాయించి ఆంధ్రపత్రిక ప్రత్యేక సంచికలలో ప్రచురించేవారు. జాతీయోద్యమ స్ఫూర్తి ఆ బాల్యమిత్రులిద్దరికీ సమానమే!

బందరులో ఏర్పడిన చిన్ననాటి చెలిమి మద్రాసులో కూడా కొనసాగింది. ఆంధ్రపత్రిక ఆఫీసుకు దగ్గరలోనే గోపాలాచార్యులవారి ఆయుర్వేదాశ్రమం ఉండేది.

డా. డి.వి.ఏ. ఆచార్య వ్రాసిన ‘పండిత గోపాలాచార్య’ గ్రంథంలో గోపాలాచార్యులవారి మరణానికి కొద్ది రోజులముందు బాల్యమిత్రుడు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారితో పండిట్‌జీ తీయించుకున్న ఫోటో ప్రచురించి, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను ఇలా పేర్కొన్నారు:

“1920 సంవత్సరం వచ్చింది. ఒకరోజు పండిట్‌జీ అస్వస్థతతో పడకకుర్చీలో కూర్చున్నారు. ఇంతలో పండిట్‌జీ బాల్యస్నేహితులైన కాశీనాథుని నాగేశ్వర రావు పంతులుగారు విచ్చేశారు. కొంత సంభాషణ జరిగిన తరువాత పంతులుగారు తానొక తొందరపని మీద నగరాంతరం పోవాలని పలికారు. పండిట్‌జీ గద్గదంగా అన్నారు: “నాగేశ్వరరావు! వెళ్లవద్దు, నీవు తిరిగి వచ్చేసరికి నేను కనబడను” అని!

పంతులుగారు కంటతడిపెట్టి పండిట్‌జీని ఓదార్చారు. వారు గోపాలాచార్యులవారి మాటలను సర్వసామాన్యమైన అస్వస్థుని దీనాలాపములుగా వ్యాఖ్యానించుకొన్నారు. నగరాంతరం వెళ్లడం తప్పనిసరి అయ్యింది. పండిట్‌జీ మాటల్లోని అంతరార్థం పంతులుగారికి బోధపడలేదు.

రౌద్రినామ సంవత్సరం భాద్రపద బహుళ పాడ్యమీ బుధవారం 29-8-1920 పండిట్ జీ నిర్యాణ దినం ఆచార్య తిరుమల రామచంద్ర ఇలా వ్రాశారు

తెలుగు వారి ప్రాతఃస్మరణీయులు ఆచార్య తిరుమల రామచంద్ర తన ‘హంపీ నుండి హరప్పా దాకా’ గ్రంథంలో గోపాలాచార్యులవారు శంకుస్థాపన చేసిన లాహోరు ఆయుర్వేద కళాశాల గురించి ఇలా వ్రాశారు.

“గోపాలాచార్యుల వారి శిష్యులకు ఆయన ఆయుర్వేదాన్ని ఉద్ధరించడానికి అవతరించిన ధన్వంతరే! నిజానికి ఇది చాలవరకు సహేతుకమే. ఆయన ఉద్యమించక పోయి ఉంటే ఆయుర్వేదం బ్రిటిష్‌వారి కాలంలో అంతరించిపోయేదే.

శిష్యులు ఆయనను ఎంతగా గౌరవించేవారో తలచుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది.

నేను 1939లో లాహోరు వెళ్లాను. ఒకనాడు ఊరు చూస్తూ దయానంద్‌ ఆయుర్వేదిక్‌ కాలేజ్‌ అనే నామఫలకం చూచి ఆగాను. ఆవరణ ద్వారం మీద “ఫౌండేషన్‌ స్టోన్‌ లెయిడ్‌ బై వైద్యరత్న పండిట్‌ డి. గోపాలాచార్య” అని చెక్కిన చలువరాతి బండ ఉంది. దానిని చూస్తూ ఒక తెలుగువాడు, నేను చిన్ననాడు దర్శించిన తెలుగువాడు ఇంత దూరాన ఉన్న ఆయుర్వేద కళాశాల భవనానికి శంకుస్థాపన చేయడమా – అని ఆశ్చర్యానందాలతో అల్లాగే నిలుచున్నాను.

భవనం లోపలి నుంచి ఒక సమున్నత శరీరుడయిన స్ఫురద్రూపి పంజాబీ తలపాగాతో పైజామా అచ్‌కన్‌లతో వచ్చి, నన్ను చూచి “క్యా దేఖ్‌ రహే హై?” అని ప్రశ్నించారు. “ఈ శంకుస్థాపన చేసిన మహనీయుడు నా ప్రాంతం వాడు. ఆనందంతో ఆయన పవిత్ర నామధేయం చూస్తున్నాను” అన్నాను వినయంతో.

“ఓహ్‌! అయితే తమరు మా గురువుగారి ప్రాంతంవారు. లోపలికి దయచేయండి” అంటూ తలపాగా తీసి నా ముందు పెట్టి, వంగి నమస్కరించారు. ఆయన మద్రాసు ఆయుర్వేద కళాశాల చివరి బృందంవారు. పేరు డాక్టర్‌ మెహతా. వేటూరి శంకర శాస్త్రిగారి సహాధ్యాయులు. అంతటిది వాళ్ల గురుభక్తి!

ఆంధ్ర విద్యానిధి ప్రకటన

1917 మార్చి 12 ఆంధ్రపత్రికలో ఒక వాణిజ్య ప్రకటన వచ్చింది:

“మన పురోభివృద్ధికి విద్యావ్యాపనం ముఖ్యమైన సాధనము. సకల దానములందును విద్యాదానముత్తమమైన దానము. ఈ యుత్తమ దానమును చేయుటకు సంవత్సరాది పండుగ సమీపించు చున్నది. ఆ పుణ్యదినమునందు దేశబాంధవులందఱును ఆంధ్ర విద్యానిధికి చందాల నిచ్చుటకునకును చందాలు పోగుచేయుటకును ప్రార్థితులు. సంవత్సరమునకొక రూపాయి నిచ్చెడివారు సభ్యులుగా జేరగలరు, కాని, యథాశక్తిని ఆంధ్రులందరు ఈ విద్యానిధికి సహాయము చేసిన వారి పేరులు ఆంధ్రపత్రికాముఖమున ప్రచిరింపబదును.” ఇదీ ఆ ప్రకటన.

బి యన్ శర్మ అధ్యక్షులు, సహకార్యదర్శులుగా పండిత డి గోపాలాచార్యులు, వే. రామదాసు, కాశీనాథుని నాగేశ్వరరావు ఈ ప్రకటనను విడుదల చేశారు.

తన వైద్యకళాశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా విద్య చెప్పటమే కాకుండా అదనంగా తన లేబరేటరీ ఆదాయంలో ప్రతి విద్యార్థికి 10 రూపాయల చొప్పున ఉపకారవేతనంగా ఇచ్చి చదువు చెప్పిన ఆ విద్యాదాత విద్య నేర్చుకోవటానికి విద్యార్థికి ఆర్థిక సామాజిక అంశాలు అడ్డు రాకూడదనే భావన ఈ పత్రికా ప్రకటనలో కనిపిస్తుంది.

ఆ విశాల వక్షస్థలానికి పతకాలే అలంకారం!

మైసూరు ప్రభుత్వ ఆసుపత్రి వారిచే క్రియాపథంలో యోగ్యతాపత్రం పొందారు.

5వ జార్జి చక్రవర్తి కాలంలో బ్రిటిష్ రాణికి విజయవంతంగా చికిత్స చేసినందుకు, భారత వైస్రాయి గౌరవపూర్వకంగా ఇచ్చిన వైద్య రత్న బిరుదుతో కూడిన సనద్.

1904లో బొంబాయి వస్తు ప్రదర్శనలో హైమాదిపానకము ఇంకా మరికొన్ని ఔషధాలను ప్రదర్శించి స్వర్ణపతకాన్ని పొందారు.
ప్లేగు మందులకోసం శ్రీ గద్వాల సంస్థానం వారిచే ఒక పసిడిపతకం, పారితోషికం పొందారు.
1905-బనారసు ప్రదర్శనంలో బంగారు పతకం, మొదటి తరగతి యోగ్యతాపత్రం పొందారు.
1906- కలకత్తా నగరంలో ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్
1907- నాసిక్ లో ఆయుర్వేద మార్తాండ బిరుదు సత్కారం.
1907- కలకత్తాలో భిషఙ్ఞ్మణి బిరుదు సత్కారం
1909- కేరళ ఆయుర్వేద సమాజం 7వ సదస్సుకు కొల్లంగోడులో అధ్యక్షత
1913- 5వ జార్జి సార్వభౌముడు కాలంలో భారత ఆంగ్లేయ ప్రభుత్వం వైశ్రాయిగారితో వైద్యరత్న బిరుదు సత్కారం అందించింది.
1913- బొంబాయిలో జరిగిన నిఖిల భారత వర్షీయాయుర్వేద మహసమ్మేళనానికి అధ్యక్షత,
1917- హరిద్వార్‌లో ఋషికుల బ్రహ్మచర్యాశ్రయంలో జరిగిన ఆయుర్వేద వైద్య మహాసమ్మేళనానికి, బెజవాడలో జరిగిన ప్రధమాయుర్వేద వైద్యసమ్మేళనానికి అధ్యక్షత,
1918- తెనాలి గుంటూరు మండల ప్రాధమికాయుర్వేద యూనాని వైద్యసమ్మేళనానికి అధ్యక్షత,
1918-లాహోరులో నిఖిల భారత వర్షీయాయుర్వేద నవమ వైద్య మహాసమ్మేళనానికి అధ్యక్షత,
1919 తిరువనంతపురం ద్వితీయ ద్రావిడాయుర్వేద వైద్య సమ్మేళనానికి అగ్రాసనాధిపత్యం అలంకరించారు.
1920 వైఖానస మహాజనసభ పండితసత్కారం చేసింది.
కృష్ణామండల అర్చకమహాసభకు ఆయన అధ్యక్షత వహించారు.
అఖిలభారత ఆయుర్వేద విద్యాపీఠం అధ్యక్షుడు
మైసూరు ప్రెసిడెన్సీ, పంజాబ్ డి.ఏ.వి. కాలేజ్, అలహాబాద్ ఆయుర్వేద మహామండలి, ఢిల్లీ యునానీ తిబ్బు కళాశాల గ్రంథాలయం, ఆయుర్వేద విద్యత్ పరీక్ష, శ్రీ సయాజీ ఆయుర్వేద విద్యాపీఠం వంటి సంస్థలకు సభ్యత్వం.

వారు వ్రాసిన రసప్రదీపిక వైద్య గ్రంథం ముఖచిత్రం పైన గ్రంథరచయితగా తన పేరుకు ముందు విశేషణాలను ఇలా పేర్కొన్నారాయన:

“చెన్నపురి ఆయుర్వేద కాలేజ్‌ ప్రిన్సిపాలును, చెన్నపురి ధర్మ ఆయుర్వేద వైద్యశాలా ప్రధాన చికిత్సకులును, ఆయుర్వేద విద్యాపీఠ సభానాయకులును, పరీక్షకులును మరియయు మైనూరు దొరతనము వారియొక్కయు, పంజాబు డి. ఏ. వి. కాలేజి వారి యొక్కయు, ఆయుర్వేద విద్వత్పరీక్షకులును, డిల్లీ ఆయుర్వేద యూనాని తిబి కాలేజియొక్క పఠన గ్రంథ నియమన సభా సభ్యులును, ఆయుర్వేద విద్వత్పరీక్షకులును, శ్రీ సయాజీ ఆయుర్వేద విద్యాపీఠ సభ్యులును, చరక సుశ్రుత మాధవనిదానాది గ్రంథములకు వ్యాఖ్యాన కర్తలును, కేరళ ఆయుర్వేద సమాజ సప్తమ మహాసమ్మేళనాధ్యక్షులును, బొంబాయి అఖిల భారత వర్షీయ ఆయుర్వేద మహాసమ్మేళనాధ్యక్షులును, భరత ఖండమందలి దేశీయ మహాసభానుబంధంగా జరిగిన మహావస్తు ప్రదర్శనమునను ననేక స్వర్ణపతకులను బొందినట్టి, శ్రీమత్పంచమ జార్జి సార్వభుమునిచే ప్రదత్తమగు వైద్యరత్న బిరుదావళీ విరాజమానులగు ఆయుర్వేద మార్తాండ, భిషఙ్ఞ్మణి పండిత డి గోపాలాచార్యులు. ఎ.వి.ఎస్”

నిజానికి ఆయన విజయాలు ఇంకా ఇన్ని ఉన్నాయి. వాటినన్నింటినీ పేర్కొంటే పేజీ నిండిపోతుంది. అయితే, అవి రాసుకోవటం వలన ఆయనకు అదనంగా వచ్చే భుజకీర్తులు ఏమీ ఉండకపోవచ్చు. కానీ, ఒక కొత్త పాఠకుడికి దాని విలువ తెలియాలంటే ఈ మాత్రం పరిచయం చేసుకోకతప్పదు.

ఆయుర్వేద పునరుద్ధరణ కమిటీ

1919లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం దేశీయ వైద్య విధానం గురించి సూచనలు చేయవలసిందిగా డా|| కోమను నాయర్ అధ్యక్షతన ఒక కమీటీనీ వేసింది.

ఆ కమిటీ కొన్ని మందుల్ని గవర్నమెంటు ఆసుపత్రుల్లో ఇచ్చి చూసి ఔషధాలు బాగానే పనిచేస్తున్నాయి గానీ, ఈ శాస్త్రానికి శాస్త్రబద్ధత లేదని నివేదిక ఇచ్చింది. దాంతో దేశాభిమానులైన శాసనసభ్యులు అలజడి చేశారు.

అప్పుడు రాష్ట్రప్రభుత్వం 1921లో సర్ ఉస్మాన్ గారి అధ్యక్షతన కెప్టెన్ జి. శ్రీనివాసమూర్తిగారు కార్యదర్శిగా ఆచంట లక్ష్మీపతి గారు సభ్యుడుగా మరొక కమిటీని నియమించారు.

ఈ ముగ్గురి కమిటీ దేశం అంతా తిరిగింది. వైద్య సంస్థల్ని ఫార్మశీల్ని ఆసుపత్రుల్ని సందర్శించింది. ప్రజల అభిప్రాయాలు సేకరించింది. దేశీయ వైద్యుల నుండి కైఫీయత్తులు తీసుకుంది. ప్రాంతాల వారిగా అధ్యయనం చేసి, దేశీయ వైద్యాన్ని ప్రోత్సహిస్తే గ్రామీణ పేదలకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందని, ఆయుర్వేద వైద్యులకు రిజిస్ట్రేషన్ ఇస్తే నాణ్యమైన వైద్యం అందే వీలౌతుందని, దేశీయ వైద్యకళాశాలను ప్రభుత్వమే స్థాపించి అందులో సిద్ధ యునాని కూడా శాఖలుగా ఏర్పాటు చేయాలని, శాస్త్రీయమైన రీతిలో వైద్య విద్య బోధించాలని, శస్త్ర చికిత్సలు, ప్రసూతి వైద్యం లాంటివి ఆంగ్లవైద్య విధానాన్నే అనుసరించేలా తర్ఫీదు ఇవ్వాలని, ఉస్మాన్ కమిటీ తన నివేదికలో సూచించింది. అలా కమిటీని ఆచంట లక్ష్మీపతిగారు ప్రభావితం చేశారంటే ఇంకా బావుంటుంది.

ఈ విధంగా ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించినా ప్రజానుకూలతను కూడా సముపార్జించుకోవటానికి ప్రజల్లోకి ఆయుర్వేదాన్ని తీసుకువెళ్లే ఉద్యమాన్ని కొనసాగించాలని ఆయుర్వేద ఉద్యమకారులు భావించారు.,

గోపాలాచార్యులవారు సాధించిన ఆయుర్వేద ప్రగతి

జాతీయోద్యమ ఫలితంగాను, ఆనాటి కాంగ్రెస్ సంస్థ కార్యకలాపాల వలననూ దేశీయ వైద్య ఉద్ధరణ ఉద్యమం కూడా సమాంతరంగా నడిచింది. జాతీయ నాయకులు ఈ విషయానిక్కూడా ప్రాధాన్యత నివ్వటం మొదలు పెట్టారు. ముఖ్యంగా తిలక్ ఆయుర్వేద ప్రగతి కోసం జాతీయ స్థాయిలో నిలబడిన వ్యక్తి. అప్పటికింకా భారతదేశ రాజకీయ ముఖచిత్రం పైన మహాత్మా గాంధీ ముద్ర పడలేదు. ఆయన సౌతాఫ్రికాలోనే ఉన్నారు.

ఆనాటి కాంగ్రెస్ నాయకులతో వ్యక్తిగత సాన్నిహిత్యం ఏర్పడటంతో పండిత గోపాలాచార్యులవారు దేశీ వైద్య పరిరక్షణ డిమాండుని గట్టిగా దేశం అంతా వినిపించేలా చేశారు.

తెలుగు నేలకు పరిమితమై పరిశీలిస్తే దేశీయ సంచలనానికి ప్రబోధితులై అఖండ కృషి సల్పిన అంధ్ర ఆయుర్వేద ప్రముఖులు అనేకులున్నారు. అన్నింటికన్నా ప్రముఖంగా చెప్పుకోదగిన విజయం దేశీయ వైద్య విధానానికి ప్రభుత్వతోడ్పాటు లభించటం.

ఆయుర్వేదం అంటే కంటకింపుగా ఉన్న బ్రిటిష్ వాళ్లకు కళ్ళు తెరిపించి ప్లేగు వ్యాధిని అదుపు చేయటంలో ఆయుర్వేదమే మిన్నగా పనిచేసిందని గోపాలాచార్యులవారు నిరూపించటం, వైశ్రాయి, బ్రిటన్ మహారాజు సహా అందరూ అంగీకరించటంతో బ్రిటిష్ అధికార్లు తల ఒగ్గక తప్పలేదు.

బజారు వైద్యులని హేళన చేసిన వారే వైద్యరత్న అని సనదులిచ్చి దణ్ణం పెట్టక తప్పలేదు. పాశ్చాత్య పద్ధతిలో ఆయుర్వేద జెషథాలకు మోతాదులను సిద్ధాంతీకరించారు.

1919లో శ్రీ ధన్వంతరి పక్షపత్రికను స్థాపించారు

నిజానికి 1892లోనే ఆయుర్వేద ప్రచారోద్యమం మొదలయ్యింది పువ్వాడ వారు అనేక ప్రాచీన గ్రంథాల్ని అచ్చు వేశారు. ఎర్రావారు వస్తుగుణదీపికను తెచ్చారు. విజయనగరం రాజావారు వైదిక శబ్దసింధు, సింహారావు గజపతి నహాయోగానందామృత కల్పవల్లి, కార్వేటి నగరం చరక సూత్రస్థానం ఆంధ్రీకరణ, ఇలాంటివన్నీ వైద్యసేవాదృక్పథంతోనే వచ్చాయి.

నూజివీడు జమీదారుగారి ప్రోత్సాహంతో చివుకుల సత్యనారాయణ శాస్త్రిగారు రసరత్నసముచ్ఛయం, ఆంధ్రా ఆయుర్వేద ఫార్మశీవారి చక్రదత్త, వేటూరి వారి వస్తుగుణదీపిక జనసామాన్యంలోకి బాగా వెళ్లాయి. ఆయుర్వేద వైద్యులు కానివారు కూడా వస్తుగుణదీపికని ఉత్సాహంగా కొని పదిలపరచుకున్నారు. శ్రీపాదవారి చరకసంహిత, ముక్కామల వెంకటశాస్త్రిగారి భావప్రకాశ, త్రిదోష సర్వస్వం, వల్లూరి వారి కౌమారభృత్య తంత్రం, ప్రతివాది భయంకర కృష్ణమాచార్యులవారి శారీరం లాంటి రచనలు తెలుగులో కొల్లలుగా వెలువడ్డాయి. వావిళ్ళవారు లోలంబరాజీయం, వృక్షాయుర్వేదం లాంటి అనేక గ్రంథాలకు వ్యాఖ్యానం వ్రాయించి తక్కువ ధరలకే అందించారు.

ఆంధ్ర వైద్యసమ్మేళన ప్రత్యేక సంచికలు, ధన్వంతరిసుధ, కుమార మిత్ర, ఆయుర్వేద కళ లాంటి పత్రికలు వచ్చాయి.

దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి అమృతాంజనం ఆ రోజున దేశంలోనే అత్యధికంగా అమ్ముడు పోయిన ఔషధం. కాగా, తరువాతి స్థానం కేసరి కుటీరం వారి ‘లోధ్ర’ ఔషధాన్ని చెప్పుకోవాలి. ‘లోధ్ర’ ఔషధం స్త్రీల గర్భాశయ పోషకంగా గొప్పగా పనిచేసిందా రోజుల్లో! అనేక స్త్రీలవ్యాధులకు నివారకం కూడా!

నోరి రామశాస్త్రిగారి క్షీరవర్థని కూడా బాగా ప్రసిద్ధి పొందింది. బరంపురంలో బి కె గుప్తాగారు గుప్తా ఆయుర్వేద నిలయం పెట్టి శాండో లేహ్యం పేరుతో బలవర్థక ఔషధాన్ని ప్రచారంలోకి తెచ్చారు.

కోరంగిలో పొన్నాడవారు, చింతలూరులో ద్విభాష్యం వారు, బెజవాడలో శ్రీపాద వారు, నోరివారు, ఏలూరులో శ్రీకృష్ణా ఆయుర్వేద ఫార్మశీ, భీమవరంలో సంజీవని, ముక్త్యాలలో ఆర్షరసాయన శాల ప్రసిద్ధిపొందిన ఆయుర్వేద ఫార్మశీలు ఆనాడు. జమ్మివారి లివర్ క్యూర్ పిల్లల లివర్ వ్యాధులకు పెట్టింది పేరుగా ఉండేది. అప్పారావుగారి ఔషధం టాన్సిల్సు తగ్గించటానికి పేరుపడ్డది. రమణక్కపేట అమృతభల్లాతక అవలేహ్యం చాలా పేర్గాంచింది.

ఇదంతా దీవి గోపాలాచార్యులవారి చలవే! ఆయన ఆ స్థాయిలో పూనుకుని ఉండకపోతే ఆంగ్లేయులు ఆయుర్వేదాన్ని నల్లిని నలిపినట్టు నలిపేసేవారు. ఆ ప్రమాదం రాకుండా కాపాడిన ఆ మహనీయునికి జాతి ఎంతగానో ఋణపడిఉంది.

ఆయన మరణించినప్పుడు సంతాపకంగా ఆంధ్రపత్రికలో బి. డి. ప్రసాదరావు అనే కవి వ్రాసిన ఈ పద్యం స్మరణీయం:

“ఆయుర్వేదము నుద్ధరించుటకునై యాంధ్ర ప్రపంచ౦బునం
డేయూవిర్భవమొంది జీర్ణదశలో నే మాలనోయున్న
యాయుర్వేదదము నుద్ధరించి నిజశిష్య శ్రేణి విఝ్యాతిమై
యీ యాంధ్రోర్విని మించఁజేసిన సుతుండేగెన్ దివిన్ జూడగన్”

పానగల్లు రాజా కృషి

గోపాలాచార్యులవారి ప్రేరణతో రాజకీయంగా ఎక్కువ స్పందించిన ఇద్దరు ప్రముఖుల్ని తప్పక స్మరించుకోవాలి ఒకరు పానగల్లు రాజా పానుగంటి రామారాయణింగారు, రెండవవారు శ్రీ ఎ.ఎస్. కృష్ణారావు. ఈ ఇద్దరూ శాసనసభల్లో దేశీయ వైద్యం గురించి పదేపదే మాట్లాడి ప్రభుత్వాన్ని ఆయుర్వేద వ్యతిరేకత లోంచి బైటకు తేవటంలో ముఖ్యపాత్ర పోషించారు.

1901లో గోపాలాచార్యులవారు మద్రాసులో స్థాపించిన ఆయుర్వేద కళాశాలను ఆయన అనంతరం 1927 దాకా ఆచంట లక్ష్మీపతిగారు నిర్వహించగా పానగల్లు రాజా ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వకళాశాలగా నడపటం ప్రారంభించారు.

ఇదే దారిలో బెజవాడలో నోరి రామశాస్త్రిగారు, రామమోహన ధర్మవైద్యశాల సంఘం వారు, గుంటూరు రంగాచార్యులవారు ఆయుర్వేద కళాశాలలు ప్రారంభించారు. పానగల్లు రాజా వారిని కూడా ప్రోత్సహించారు

పానగల్లురాజా విగ్రహం (వికిపీడియా సౌజన్యం)

పానగల్ రాజాగా ప్రసిద్ధి చెందిన సర్ పానుగంటి రామారాయణింగారు (జూలై 9, 1866 – డిసెంబరు 16, 1928), శ్రీకాళహస్తి జమిందారు, జస్టిస్ పార్టీ నాయకుడు, జూలై 11, 1921 నుండి డిసెంబరు 3, 1926 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేశారు. చెన్నైలో పానగల్లు పార్కు, అందులో ఆయన విగ్రహాన్ని ఇప్పటికీ చూడవచ్చు.

పానగల్లురాజా పదారణాల తెలుగు బిడ్డ. శ్రీకాళహస్తిలో జన్మించాడు. మద్రాసులో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము, ద్రవిడ భాషలలో పట్టాలు పొందాడు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు. జస్టిస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. 1925 నుండి 1928 వరకు ఆ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు.

జస్టిస్ పార్టీ అంటే బ్రిటిష్ అనుకూలురైన జమీందార్ల పార్టీ. కానీ, పానగల్లు రాజా స్వయంగా సంస్కృత పండితుడు కావటాన ఆయుర్వేదం పట్ల ఆయనకు సదభిప్రాయం ఉంది. అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ఆయుర్వేదానికి ఎంతో ఉపకరించింది.

వైద్య చరిత్రకారుడిగా పరిశోధనలు

భారతదేశంలో ఒకప్పుడు చరక విద్యాపీఠం, సుశ్రుతవిద్యాపీఠం, అగస్త్య విద్యాపీఠం లాంటివి బలంగా పనిచేసేవని వాటి వివరాలను వెల్లడి చేశారు గోపాలాచార్యులవారు.

దక్షిణభారత ఆయుర్వేద ప్రచారసభలో ఈ విషయాలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు.

శ్రీలంకలో అరుదైన ఔషధ మొక్కలు సంధానకరణి, సవర్ణ్యకరణి, సంజీవకరణి ఉన్నాయని వాటి గురించి వెల్లడి చేశారు.

అలాగే కేరళ అష్టవైద్య సంప్రదాయం, కర్ణాటక వైద్యులు ఉగ్రాదిత్య, మంగరాజ, అభినవచంద్ర, సింహదత్త, చంద్రరాజరామచంద్ర, దేవేంద్రముని, నృసింహభట్ట రచించిన పూజ్యపాదీయం, ఖగేంద్ర మణిదర్పణం, మదనతిలక, అశ్వవైద్యం వంటి గ్రంథాలను వెలుగులోకి తెచ్చారు. సారార్ధ సంగ్రహం, భేషజ మంజూష, సరసంక్షేపక, భేషజ కల్ప, యోగశతక, సరస్వతి నిఘంటువు, యోరత్నాకర గ్రంథాలు దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా ఉండేవని వాటి గురించి ప్రస్తావించారు.

అనేక రాతి శాసనాలు, రాగి పలకల శాసనాలను పరిశీలించి, ప్రాచీన ఆసుపత్రుల ఉనికిని నిరూపించారు.

చింగలపట్టు జిల్లా తిరుముక్కూడల శాసనం (1067 AD, చేరచోళ మహారాజు)

కాకతి రుద్రమ మాల్కాపురం శాసనం: ప్రసూతి, సాధారణ ఆసుపత్రుల స్థాపన, పాలనాధికారుల వైద్య పరిరక్షణ.

అక్కలపూడి శాసనం: కొరుకొండ సింఘయనాయకుడిచే ప్రసిద్ధ వైద్యుడు పరహితాచార్యునికి గ్రామదానం.

కాలవచేరు శాసనం: పాము కాట్ల నివారణలో నిపుణులైన పరహిత వైద్య కుటుంబం చేసిన సేవల వివరణ.

వెంకటేశ్వర ఆలయానికి అనుబంధ కళాశాలకు చెందిన 15 మంచాల ఆసుపత్రి వివరాలు.

నందలూరు శాసనం: ప్లేగు మహమ్మారి కారణంగా గ్రామ జనాభా మార్పును లిఖించిన వైద్య చరిత్రను లోకానికి చాటారు.

కె యన్ కేసరి వేరు కుంపటి

ఆయుర్వేద వైద్యరంగం, పత్రికారంగం, దానధర్మాలలో ఒక విశిష్ట ముద్ర వేసిన పేరు – కేసరి. ‘కేసరి కుటీరం’ అనే ప్రసిద్ధ ఆయుర్వేద ఔషధ నిర్మాణ సంస్థ అధినేత.

ఆయన అసలు పేరు కోట నరసింహం. అయితే ఆయుర్వేద ఔషధాల తయారీ వ్యాపారాన్ని ‘కేసరి కుటీరం’ పేరుతో ప్రారంభించినప్పటి నుండి ఆయన్ని అందరూ ‘కేసరి’ అనే పిలిచారు. అలా ఆయన కె.యన్. కేసరి అయ్యారు. ఆయన ప్రధానంగా వైద్యులు, వ్యాపార దక్షులు, పత్రికా రచయిత, సంపాదకులు మరియు గొప్ప వితరణశీలి.

1899లో చెన్నపట్నంలో ‘కేసరికుటీరం’ పేరుతో కొన్ని చారుత్రక పరిస్థితుల్లో ఒక ఆయుర్వేద ఔషధాల తయారీ సంస్థను ప్రారంభించారు. ముఖ్యంగా స్త్రీల వ్యాధుల కోసం లోధ్ర ఔషధాలు తయారు చేశారు. ఒక్క లోధ్ర ఔషధం తోనే ఆయన గొప్ప ధనికులయ్యారంటే ఆశ్చర్యం కాదు. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి అమృతాంజనంతో పోటీపడి అమ్మకాలు జరిపింది లోధ్ర.

కేసరి గారి ఆలోచనల్లో ఎంతటి దాతృత్వం వున్నదో అంతటి వ్యాపార దృక్పథం ఉండేది. ఆయన గుర్రాల వ్యాపారం కూడా చేసేవారట! అయితే తన సంపదను కేసరిగారు మహిళాభ్యుదయం, జాతీయోద్యమాల కోసం ఎక్కువగా వినియోగించారు.

‘గృహలక్ష్మి’ మాసపత్రికను ప్రారంభించి, ప్రతీ ఏడాది ప్రసిద్ధ స్త్రీమూర్తులను స్వర్ణకంకణాలతో సన్మానించేవారు. స్థానాపతి రుక్మిణమ్మ, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ లాంటి ప్రసిద్ధ రచయిత్రులు ఈ కంకణ సత్కారం పొందిన వారిలో ఉన్నారు.

తన చిన్ననాటి విశేషాలను ‘ముచ్చట్లు’ పేరుతో గృహలక్ష్మి, ఆంధ్రజ్యోతి మాసపత్రికల్లో ధారావాహికగా ప్రచురించి 1953లో పుస్తక రూపంలో తెచ్చారు. దాని రెండో ముద్రణ సుమారు అర్ధశతాబ్దం తర్వాత కేసరి కుటీరం శతజయంతి సందర్భంలో విడుదల అయ్యింది. ఆయన ఆనాటి నాటి తెలుగు వారి జీవితాన్ని అందులో వివరంగా చిత్రించగలిగారు.

కేసరి గారికి ఆయుర్వేదం మీద మంచి పట్టు ఉంది. దాన్ని సొమ్ము చెయ్యాలనే ఆలోచనలు కూడా మెండుగా ఉన్నాయి. మంచి సమయం కోసం ఎదురు చూస్తుండగా అప్పుడే మద్రాసులో అడుగిడిన దీవి గోపాలాచార్యులవారు ఎదురయ్యారు.

గోపాలాచార్యులవారు 1872లోనూ, కేసరి గారు 1875లోనూ జన్మించారు. మూడేళ్లు గోపాలాచార్యులవారే పెద్ద. కానీ, గోపాలాచార్యుల వారికన్నా ముందే పొట్ట చేతపట్టుకుని మద్రాసు వచ్చి ఉపాథి వెదుక్కొంటున్నారు కేసరి. గోపాలాచార్యులవారు అప్పటికే ప్రసిద్ది పొంది, ప్లేగు నివారకుడిగా ముద్ర పడిన వ్యక్తి.

కన్యకాపరమేశ్వరి దేవస్థాన వైశ్యప్రముఖులకు గోపాలాచార్యులవారిని పరిచయం చేసింది కేసరి గారే! ఆ తరువాత గోపాలాచార్యులవారు వారిచేత ఆయుర్వేద కళాశాల పెట్టించే దాకా చేసిన కృషి అంతా మనకు తెలిసిందే!

గోపాలాచార్యులవారికి సహాయకుడిగా కేసరి పనిచేశారు. తన వైద్య పరిజ్ఞానాన్ని అనుభవాన్ని ఆ నీడలో తనను ఎంతగానో మెరుగుపరచు కున్నారాయన.

ప్లేగు వ్యాధి బెంగళూరు, పూనే లాంటి నగరాల్లో మాటిమాటికీ తిరగబెడ్తుండటంతో గోపాలాచార్యులవారి మద్రాస్ ఆయుర్వేద ల్యాబొరేటరీలో (1908) ‘ఆయుర్వేద మరణ రోగ (ప్లేగ్) మిశ్రమం’ అనే ఔషధాన్ని కొత్తగా తయారు చేశారు.

తెలుగు ప్రాంతాల్లోనే కాకుండా, ప్లేగు పీడిత ప్రాంతాల్లో, దేశం నలుమూలలా అమ్మకాలను విస్తృత పరచాలనేది కేసరిగారి ఆకాంక్ష. ప్రజలు మహమ్మారి బారిన పడి కష్టాల్లో ఉన్నప్పుడు వాణిజ్యపరంగా ఆలోచించటం, డబ్బు చేసుకోవాలని చూడటం సబబు కాదనేది గోపాలాచార్యులవారి తలంపు. బహుశా ఆ ఇద్దరు ప్రాణమిత్రులకూ మార్కెటింగ్ స్ట్రాటజీ విషయంలోనే పొసగక పోయి ఉండాలి. స్నేహపూర్వకంగా విడిపోతేనే మంచిదనే అభిప్రాయానికి ఇద్దరూ వచ్చారు.

గోపాలాచార్యులవారు తన దారిలో తన పని చేసుకుపోసాగారు. కె.యన్. కేసరి గారు మాత్రం స్వంతంగా ‘కేసరి కుటీరం’ పేరుతో స్వంత ఔషధ నిర్మాణ సంస్థను ప్రారంభించారు.

నారాయణ మొదలి వీధిలో ‘కేసరి కుటీరం ఆయుర్వేద ఔషధశాల’ ప్రారంభమై వ్యాపారం అభివృద్ధి చెందింది. ఆయన మిత్రుల సహాయం, వ్యాపార దక్షతతో వ్యవహారంలో విజయం సాధించారు. వ్యాపారం కోసం ప్రచారం చేయడంలో ఆ రోజుల్లో ఆయనకు ఆయనే సాటి. అది ప్రత్యక్షంగానూ, పరోక్షంగ అకూడా ఆయుర్వేదాభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది. గోపాలాచార్యులవారు నాగేశ్వరరావు పంతులుగారి ఆంధ్రపత్రికలోనూ, కేసరి గారు మద్రాసులోని ఎ.సి. పార్ధసారధినాయుడు గారి పత్రికలోనూ ప్రకటనలు ఇచ్చేవారు.

స్త్రీ వ్యాధులకు తయారు చేసిన ‘లోధ్ర’ ఔషధం కేసరిగారి విశేష సంపాదనకు కారణమయ్యింది. తన సంపాదనలోంచి కేసరి గారు కొంత మొత్తాన్ని కేటాయించి స్త్రీల అభ్యుదయం కోసం 1928లో ‘గృహలక్ష్మి’ మాసపత్రికను ప్రారంభించారు. దాన్ని ముద్రించటం కోసం ‘లోధ్ర ముద్రాలయం’ ప్రారంభించారు. ఈ పత్రికను అనేక కాలం ఆండ్ర శేషగిరి రావుగారు సంపాదకులు నిర్వర్తించారు.

20వ శతాబ్దపు తొలిపాదంలో ఆయుర్వేద ప్రశస్తికి కారకులుగా ముగ్గురు పేర్లను తప్పక తలచుకుంటారు ఎవరైనా.. మొదటి వారు పండిత దీవి గోపాలాచార్యులు, రెండవ వారు డా. ఆచంట లక్ష్మీపతి, మూడవ వారు డా. కె. యన్. కేసరి.

ఆచంట లక్ష్మీపతిగారు ఓ ఆయుర్వేద దీక్షితుడు

20వ శతాబ్దపు మొదటి సగం దక్షిణ భారత వైద్యచరిత్రలో ఆచంట లక్ష్మీపతి (1880–1966) మరియు దీవి గోపాలాచార్యులు (1872–1947) అనే రెండు పేర్లు విడదీయరానివి. ఒకరు పాశ్చాత్య వైద్య విద్యలో పట్టభద్రుడై, తరువాత ఆయుర్వేద పునరుద్ధరణ కర్తగా మారిన ఆధునిక సంస్కర్త; మరొకరు సంస్కృత పాండిత్యం, తాళపత్రగ్రంథ సంపాదన, వ్యాఖ్యాన సంప్రదాయాల ద్వారా ఆయుర్వేదానికి చరిత్రాత్మక లోతును ఇచ్చిన పండితుడు. వీరిద్దరి గురు–శిష్య సంబంధం కేవలం విద్యాపరమైనది కాదు, సాంప్రదాయ ఆధునిక సమన్వయానికి ప్రతీక.

ఆచంట లక్ష్మీపతి జీవితం ఒక వైద్యుని వ్యక్తిగత విజయగాథ మాత్రమే కాదు, ఆధునిక భారత వైద్యపునరుజ్జీవన యాత్రలో ఒక కీలక అధ్యాయం. ఆయన్ని అర్థం చేసుకోవాలంటే దీవి గోపాలాచార్యుల వలయం, వారి శ్రద్ధ, వారి సహవాసం గుర్తు చేసుకోవాలి.

గోపాలాచార్యులవారి ఆకస్మిక మరణం తరువాత వారి స్థానాన్ని భర్తీ చేయటానికి ప్రయత్నించిన మరో సౌజన్యమూర్తి ఆచంట లక్ష్మీపతిగారు. స్వతహాగా అల్లోపతి వైద్యుడై ఉండి ఆయుర్వేద ప్రసస్తిని తెలుసుకుని గోపాలాచార్యుల వారిని ఆశ్రయించి ఆయుర్వేదం నేర్చుకుని దాని ఉద్ధరణకు సమాయత్తమయ్యారు.

1918లో మెడికల్ రిజిష్ట్రేషన్ చట్టాన్ని తెచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. ఈ రిజిష్ట్రేషన్ పరిథిలోకి ఆయుర్వేద వైద్యుల్ని రాకుండా కట్టడి చేసింది ఈ విధానానికి నిరసనగా తన పేరుని మెడికల్ లిస్టులోంచి తనే తొలగించుకున్నారు.

గోపాలాచార్యులవారే తన అంతేవాసిగా లక్ష్మీపతిగారిని ఎంపిక చేసి తన బాధ్యతల్ని వహించవలసిందని చెప్పారు. కళాశాల ఫార్మశీ, గ్రంథ ప్రచురణలు కొనసాగించారు. ఆయుర్వేద ఉద్యమానికి నాయకత్వం వహించి నడిపించారు.

ఆచంట లక్ష్మీపతి గారి కాలానికి మహాత్మాగాంధీ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు తీసుకోవటంతో దేశీయ వైద్య విధానం, శాకాహార ప్రాధాన్యం, శరీర పరిశుభ్రత, ఆయుర్వేదంలో చెప్పిన ఆచార వ్యవహారాల ప్రచారాన్ని ఆయన కూడా కొనసాగించారు. లక్ష్మీపతిగారిని సబర్మతి ఆశ్రమానికి పిలిపించుకుని దేశీయ వైద్య విధాన పునరుద్ధరణ గురించిన సమాచారాన్ని తెలుసుకున్నారు. జాతీయోద్యమంలో భాగంగా ఆయుర్వేద ప్రగతిని కూడా ప్రచారం చేయాల్సిన ఆవశ్యకతను ఆయన గుర్తించారు.

గాంధీజీ రాక తర్వాత జాతీయోద్యమంలో ఆంధ్రులు చురుకైన పాత్ర పోషించారు. హిందీ ప్రచారం, ఖద్దరు ప్రచారాలతో పాటూ దేశీయ వైద్య ప్రచారం కూడా ఆంధ్రులు ఇష్టంగా చేశారు. ఊరూరా ఆయుర్వేద సమ్మేళనాలు జరిగాయి. ప్రజల్లో ఆయుర్వేదం పట్ల నమ్మకం గౌరవం పెంపొందాయి.

కాంగ్రెస్ నాయకత్వంలో స్థానిక ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు అనేక మున్సిపల్ డిస్పెన్సరీల్లో ఆయుర్వేద వైద్యుల్నే నియమించి దేశీయత పట్ల తమ అనురక్తిని చాటుకున్నారు.

1917లో గోపాలాచార్యులవారు బెజవాడలో ఆంధ్ర రాష్ట్రీయ ఆయుర్వేద వైద్య సమ్మేళనం ప్రారంభించారు. తరువాత జరిగిన సభలన్నీ లక్ష్మీపతిగారి నేతృత్వంలో జరిగాయి. నోరి రామశాస్త్రిగారు, ప్రతివాద భయంకర కృష్ణమాచార్యులవారు, కవిరాజ కృష్ణమోహన్ ప్రభృతులు లక్ష్మీపతిగారికి తోడుగా నిలిచారు.

1933లో బికనీరులో జరిగిన సమ్మేళనానికి లక్ష్మీపతిగారు అధ్యక్షత వహించారు.

లక్ష్మీపతి గారు పశ్చిమ గోదావరి జిల్లా మాదవవరం గ్రామంలో జన్మించారు. తండ్రి రామయ్య, తల్లి జనకమ్మ సాదాసీదా కుటుంబానికి చెందినవారు. ఆయన తాత సుబ్బరాయుడు సంస్కృత పాండిత్యంలో ప్రసిద్ధి చెందారు. ఆ సంప్రదాయం వల్లనే ఆయన మనసులో శాస్త్రవినం పట్ల ఆసక్తి పెరిగింది. చిన్ననాటి నుంచే “వ్యవసాయాన్నీ, వైద్యాన్నీ కలిపి నేర్చుకోవాలి” అన్న సమగ్ర దృష్టి పెంచుకున్నారు.

ఆయనకు పాఠశాల దశలో గురువుగా ఉన్నవారు కందుకూరి వీరేశలింగం పంతులుగారు. సామాజిక సంస్కరణల ఆవేశం, విద్యా విస్తరణలో ఆచరించిన ధర్మబోధ, లక్ష్మీపతిగారిపై లోతైన ముద్ర వేశాయి. ఎఫ్.ఏ. పూర్తిచేసిన తర్వాత, కొంతకాలం దావులూరి ఉమామహేశ్వరరావు అనే అధికారి వద్ద క్లర్క్‌గా పనిచేశారు. ఆయన మద్రాసుకు బదిలీ అవగానే, లక్ష్మీపతిగారు అక్కడికి వెళ్లి చదువు కొనసాగించారు. 1904లో బి.ఏ. పూర్తి చేసి, స్కాలర్‌షిప్ సహాయంతో ఎం.బి.బి.ఎస్.(1909) పట్టా సాధించారు. తెలుగు వారిలో యంబీబియస్ పట్టాపొందిన రెండవ వ్యక్తి ఆయనే!

అలోపతి వైద్యంలో శిక్షణ పొందినా, ఆయన మనసు భారతీయ సంప్రదాయ వైద్యపద్ధతి ఆయుర్వేదం వైపు మళ్లింది. దీనికి కారణం ఆయన జిజ్ఞాస, అలాగే భారతీయ సాంస్కృతిక మూలాలపై గాఢ విశ్వాసం.

మద్రాసులో ఆయుర్వేద కళాశాలను స్థాపించిన దీవి గోపాలాచార్యులవారి వద్ద ఆయన శిష్యరికం చేశారు. ఆయుర్వేదం కేవలం మూలికల వైద్యం కాదు, అది జీవన శాస్త్రమనే భావాన్ని ఆయన లోతుగా గ్రహించారు.

పండిత దీవి గోపాలాచార్యులవారి మరణం తరువాత ఆయన బాధ్యతలన్నీ తన భుజాలమీద వేసుకున్నారు. 1920లో మద్రాసు ఆయుర్వేద కళాశాలకు ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. విద్యార్థులకు ఆధునిక శిక్షణతోపాటు భారతీయ వైద్యశాస్త్రం గొప్పతనాన్ని వివరించి బోధించారు. ఈ విధంగా అలోపతి–ఆయుర్వేదాల మధ్య వంతెన వేసిన ప్రథములు ఆయనే. ఆయన శ్రద్ధ వల్ల జర్మనీ, అమెరికా వంటి దేశాల నుండి విద్యార్థులు ఆయుర్వేదాన్ని నేర్చుకోవడానికి వచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయుర్వేదాన్ని పరిచయం చేసిన వైద్యవిద్యావేత్త ఆయనే!

ఆయన కేవలం వైద్యచికిత్సకే పరిమితం కాలేదు; రచయిత, పరిశోధకుడు, సంపాదకుడిగా కూడా వెలుగొందారు. ధన్వంతరి (తెలుగు పత్రిక), ఆంధ్ర మెడికల్ జర్నల్ (ఇంగ్లీష్) లకు సంపాదకులుగా వ్యవహరించారు.

6కి పైబడిన గ్రంథాలు వ్రాశారు. ఆయుర్వేద విన సర్వస్వము, ఆయుర్వేద శిక్ష, వనౌషధ వినం, భారతీయ వినం, దర్శనములు వంటి గ్రంథాలు ఆయుర్వేదాన్ని ప్రజలకు సులభంగా చేరువచేశాయి. ఇంగ్లీషులో కూడా అనేక పుస్తకాలు వ్రాసి విదేశీ పాఠకులను ఆకట్టుకున్నారు. వాటిలో కొన్ని ఆర్కయివ్సులో దొరుకుతున్నాయి చూడవచ్చు.

మొదటి భార్య సీతమ్మ అకాలమరణం చెందిన తరువాత ఆయన రుక్మిణమ్మను వివాహం చేసుకున్నారు. రుక్మిణమ్మ ఉప్పు సత్యాగ్రహ సమయంలో మద్రాసులో అరెస్టయిన తొలి మహిళ. స్వాతంత్ర్యం తరువాత మద్రాస్ రాష్ట్రానికి ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. దంపతులు ఇద్దరూ ఆరోగ్యరంగానికి విశేషమైన సేవలను అందించారు.

లక్ష్మీపతిగారు అఖిల భారత ఆయుర్వేద వైద్య సమాజం అధ్యక్షుడుగా, ఆంధ్ర ఆయుర్వేద బోర్డు అధ్యక్షుడుగా, ఆంధ్ర సాహిత్య పరిషత్తు (మద్రాసు) కార్యదర్శిగా పనిచేశారు.

గోపాలాచార్యులవారు ఆరంభించిన ఆయుర్వేదప్రచారోద్యమాన్ని ఆయన ఆగకుండా కొనసాగించారు.

ఆయన కృషిని గౌరవిస్తూ చెన్నైలో అనేక వైద్యసంస్థలకు ఆయన పేరు పెట్టి గౌరవించారు. ఆచంట లక్ష్మీపతి యూనిట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్, వి.హెచ్.ఎస్., చెన్నై, ఆచంట లక్ష్మీపతి న్యూరో సర్జికల్ సెంటర్, వి.హెచ్.ఎస్., చెన్నై లాంటి అనేక సంస్థలున్నాయి. విజయవాడ నోరి రామశాస్త్రి ఆయుర్వేద కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రికి డా. ఆచంట లక్ష్మీపతి పేరును పెట్టి ఆయన్ను గౌరవించారు.

ఆయన ఆత్మకథ ‘స్వీయచరిత్ర’ ఒక వైద్యశాస్త్రజ్ఞుని ఆత్మవిమర్శ మాత్రమకాక, భారతీయ వైద్యపరంపరపై అచంచలమైన విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం.

దీవి దేశికాచార్యులవారే వారసులు

గోపాలాచార్యులవారి చిన్నతమ్ముడు దేశికాచార్యులు. అన్నగారి కళాశాలలోనే ఆయుర్వేదం చదువుకున్నారు. ఆయుర్వేద మార్తాండ అని బిరుదు పొందారు. పండిత దీవి గోపాలాచార్యులవారి కుమారుడు, అల్లుడూ కూడా చిన్నవయసులోనే చనిపోవటంతో ఈ దేశికాచార్యులవారే గోపాలాచార్యులవారికి చేదోడువాదోదుగా ఉన్నారు. ఆచంట లక్ష్మీపతి గారి తరువాత ఆయన నిర్వహించిన బాధ్యతలను కూడా దేశికాచార్యులవారే నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌గా కూడా వ్యవహరించారు.

ఆచంట లక్ష్మీపతిగారు జీవించి ఉన్నప్పుడే పార్మసీ నిర్వహణాబాధ్యతల్ని దేశికాచార్యులవారే వహించారు.

చెన్నపట్టణం 1926 జనవరి 25 ఆంధ్రపత్రికలో ఒక ప్రకటన దేశికాచార్యులవారి పేరుతో వెలువడింది. ఇది ఉచిత ఆయుర్వేద శిబిర నిర్వహణకు సంబంధించినది:

వైద్యరత్న పండిత, డి. గోపాలాచార్యులవారి అయుర్వేద ఆశ్రమము పోస్టు బాక్సు నం 287 మద్రాసు ఉచితము.. సలహా ఉచితము..
డాక్టరు ఏ. కనకరత్నము ఏ. ఎమ్‌. ఏ. సి, (హానరరి డిమాన్‌‘స్ట్రేటర్ ఇన్ అనాటమీ, గవర్నమెంటు ఇండియన్ మెడిసిన్ స్కూల్, మద్రాసు, శ్రీయుత డి. గోపాలాచార్యులవారి శిష్యుడు)
వారు రోగులను పరిక్షించి సలహా ఉచితముగా నిచ్చెదరు,
సలహా నిచ్చుకాలము ఉదయం 7 గం-10 గంటలవరకు 151 గోవిందప్పనాయక వీధి
సాయంత్రము 5 గం-7 గంటలవరకు 188 (బ్రాడ్వే, మధ్రాను,)
క్యాటలాగు కావలసినవారు వ్రాసిన ఉచితముగా పంపబడును,
డి దేశికాచార్యులు
(గతించిన పండితులుగారి సోదరుడు మేనేజింగు ప్రొప్రైటర్)

ఈ ప్రకటనను బట్టి ఆచంట లక్ష్మీపతిగారు జీవించి ఉన్న కాలంలో ఫార్మశీ వ్యవహారాలు దేశికాచార్యులవారే పర్యవేక్షించే వారని అర్థం అవుతోంది.

ఆయన ఇద్దరు కుమారుల్లో పెద్దకుమారుడికి గోపాలాచార్యులు అనే పేరు పెట్టుకున్నారు. రెండో కుమారుడు శ్రీనివాసన్.

దేశికాచార్యులు 1954లో మరణించారు. 10 నవంబర్ 1954 ఆంధ్రపత్రికలో ఆ సోదరులిద్దరూ తమ తండ్రి దేశికాచార్యుల మరణానికి చింతిస్తూ సంతాప సందేశాలను పంపిన శ్రేయోభిలాషులందరికీ కృతఙ్ఞతలు తెలుపుకుంటూ ఒక ప్రకటన ఇచ్చారు.

చివరగా ఒక మాట

డా లక్ష్మీపతి గారన్నట్టు, “అందరికీ దీర్ఘాయువు కలిగే సదుపాయం బోధించే శ్రీ గోపాలాచార్యులవారు తాను మాత్రం అకాల మృత్యువుకు బలి అయ్యారు”. ఏ అవయవం మీద కణితి వస్తే ప్రమాదకరమైనదని ఆయుర్వేద సంహితల్లో పేర్కొన్నారో ఆ అవయవం పైనే తనకు కణితి వచ్చిందని తన మరణం తధ్యమని ఆయన ముందుగానే ప్రకటించారు. తన చిన్ననాటి స్నేహితుడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు తన ఇంటికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని చెప్పారు కూడా! ఇంకా ఎక్కువ సమయం లేదు, విడిచి వెళ్ళవద్దన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు!

29-09-1920న పండిత దీవి గోపాలాచార్యులవారు వైకుంఠ యాత్ర చేశారు. బహుముఖీనమైన వ్యక్తిత్వం కలిగిన ఒక మహనీయుని జీవితాన్ని కేవలం ఆయుర్వేద వైద్యుడనే కోణం లోంచి మాత్రమే విశ్లేషించటం, దేశం కోసం జాతి కోసం స్వాతంత్ర్యం కోసం ఆయన పడిన శ్రమ, తపన దీక్షల్ని పట్టించుకోకపోవటం ఆ మహనీయుడికి అన్యాయం చేయటమే అవుతుంది.

సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన తెలుగుబిడ్డ అనంతాచార్లుగారికి గోపాలాచార్యులవారు ప్రీతిపాత్రుడు.

గోపాలాచార్యులవారు స్వతహాగా మితవాది. కానీ ఆనాటి కాంగ్రెసులో అతివాదులుగా పేరుపడిన లాలాలజపతిరాయ్, బాలగంగాధర తిలక్ బిపిన్ చంద్రపాల్ లాల్-బాల్-పాల్ త్రయానికి ఆయన సన్నిహితుడు.

నోరున్న ఆ ముగ్గురిచేత దేశీయతలో భాగంగా దేశీయ వైద్యవిధానాన్ని దేశభక్తితో కూడుకున్న కార్యంగా ప్రచారం చేయించ గలిగారాయన. కాంగ్రెస్ కార్యకలాపాల్లో దేశీయ వైద్య పరిరక్షణ కూడా ఒకటి. బ్రిటిష్ ప్రభుత్వం ఆయుర్వేదానికి సముచిత స్థానం ఇవ్వటానికి తలఒగ్గిందంటే జాతీయోద్యమం గొంతెత్తటమే ముఖ్య కారణం.

మద్రాసులో సాహితీ సాంస్కృతిక జాతీయోద్యమ రంగాలన్నింటా గోపాలాచార్యుల పాత్ర ఉంది. ప్రకాశం గారితో ప్రారంభించి జాతీయ నాయకులందరితోనూ ఆయనకు సాన్నిహిత్యం ఉంది.

ఆయుర్వేదాన్ని ఆ రోజున ఆయన బతికించారు కాబట్టే ఇవ్వాళ నాబోటి ఆయుర్వేద వైద్యులు ఆయుర్వేదాన్ని వృత్తిగా చేసుకుని జీవిక కొనసాగించగలుగుతున్నాము. దేశీయతనీ దేశీయ వైద్యాన్నీ కాపాడిన ఆ సంరక్షకుడికి ఈ రచన ఒక నివాళిగా సమర్పిస్తున్నాను.

ఆయన మరణించిన 105 యేళ్ల తరువాత ఆయన జన్మస్థలిలో వారి విగ్రహ ప్రతిష్ఠాపన జరగటం విశేషం, ఆలస్యం అయితేనేం అసలంటూ పని జరిగింది. దివి మణిదీపాలు, దీపస్తంభాలు, తేజోమూర్తులూ అయిన ప్రముఖుల జ్ఞాపకాలను ఇలా విగ్రహాల రూపంలో పదిలపరచి, ఆ మహనీయుల స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న మాన్యులు మండలి బుద్ధప్రసాద్ గారికి ఒక ఆయుర్వేద వైద్యుడిగా వందనాలు చెప్పుకుంటున్నాను.

భారతీయత అంతా భారతీయ వైద్యంలోనే ఇమిడి ఉంది. భారతీయుల జీవన విధానం ఆయుర్వేదాన్ని అనుసరించి రూపొందింది. ఈ రోజున మన కట్టూ బొట్టూ, నడక, నడత, తిండీ తిప్పలన్నీ ఆయుర్వేదాన్ని అనుసరించే రూపొందాయి. మనలో కొందరు అప్పుడప్పుడూ విదేశీ వ్యామోహం ప్రదర్శించినా మన జీవాణువులు ఆయుర్వేదాన్ని మాత్రమే అనుసరించగలుగుతాయి.

ఆయుర్వేద మార్తాండుడు పండిత దీవి గోపాలాచార్యుల వారి స్ఫూర్తి కొనసాగాలని ఆశిద్దాం!

(సమాప్తం)

Exit mobile version