Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అయ్యలరాజు రామభద్రుడి రామాభ్యుదయం

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘అయ్యలరాజు రామభద్రుడి రామాభ్యుదయం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

కడప దగ్గర తిప్పలూరు అనే ఊరుంది. అష్టదిగ్గజ కవులకు దత్తమైన అగ్రహారంగా 26 ఆగష్టు 1527న వ్రాసిన ఓ శిలాశాసనం చెప్తోంది. కాబట్టి అష్టదిగ్గజాలున్నారు. వాళ్లంతా తెలుగు వారేనా? లేక సంస్కృత, కన్నడ, తమిళ మళయాళ భాషలవారు కూడా వారిలో ఉన్నారా? కేవలం కవులేనా లేక వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని దిగ్గజాలన్నారా..? అనే సందేహాలు నేటికీ ఉన్నాయి.

అష్ట దిగ్గజాలంటే ఎనిమిది దిక్కుల్లో ఉన్న గజాలని! రాజ్యం మొత్తం మీద ఎన్నదగిన వ్యక్తులని!

1938లో పురావస్తుశాఖవారు సౌతిండియా యాన్యువల్ రిపోర్టులో ఈ అష్టదిగ్గజాలంతా కవులే నని, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, ధూర్జటి, మాదయగారి మల్లన, పింగళి సూరన, రామరాజ భూషణుడు, తెనాలి రామకృష్ణుడు వీళ్లే అష్టదిగ్గజాలని ఉంది. ప్రచారంలో ఉన్న కథనాన్నే ఈ పురావస్తు శాఖ ప్రచురించింది గానీ, అందుకు తగిన సాక్ష్యాలేమీ ఇవ్వలేదు.

అష్టదిగ్గజాల్లో అయ్యలరాజు రామభద్రకవి ఒకడు కానేకాదని వేటురివారూ, అష్టదిగ్గజాలంటే కేవలం కవులేనా? ఇతర రంగాల్లో దిగ్గజాలు ఉండరా? అని పింగళి లక్ష్మీకాంతంగారూ ప్రశ్నించారు. ఇతర భాషా పండితుల్ని మహా కవుల్ని రాయలు నిరాకరించి కేవలం తెలుగు కవులకే పట్టం కట్టాడనటాన్ని పింగళివారు ఆమోదించలేదు. అష్టదిగ్గజాల గురించి తెలుగువారిలోనే ప్రచారం ఉంది ఇతర భాషా సాహిత్యాల్లో వాళ్ల ప్రస్తావన లేదు. తెలుగు వారికే పరిమితమైన సాంప్రదాయం ఇది. విజయనగర సామ్రాజ్యానంతరం కూడా ఈ సాంప్రదాయం ఆంధ్రదేశంలో కొనసాగింది. ఆంధ్రరాజులైన తంజావూరు నాయక రాజులు, తరువాతి కాలంలో పెద్దాపురం, కార్వేటినగరం, గద్వాల లాంటి సంస్థానాలు ఈ సాహితీ సాంప్రదాయాన్ని కొనసాగించాయి. కాబట్టి, తెలుగువారికే ఈ దిగ్గజాలు సొంతం.

మనం ఎరిగిన ఈ 8 మంది తెలుగు కవుల్లో కేవలం ముగ్గురు మాత్రమే కృష్ణదేవరాయలకు పరిచయస్థులు. రాయలకన్నా ముందు, తరువాత అధికారంలో ఉన్న ప్రభువులు తమని ‘రాయ’ అనే పిలుచుకున్నారు. కానీ, రాయలు అనగానే కృష్ణదేవరాయలే గుర్తుకొస్తాడు. వివిధ రాయప్రభువుల కాలాలలోని కవులంతా కలిసిపోయి కృష్ణదేవరాయని సమకాలికులై పోయారు. కృష్ణదేవరాయల్ని మన తెలుగు చరిత్రకారులు ఆంధ్రభోజుడన్నారు. ఒరియా వారికి కృష్ణదేవరాయలు పెద్ద విలన్. ఒరియా చరిత్రకారులు రాయలవారి చరిత్రను ఆ దృష్టితోనే వ్రాశారు. ఒక్కోసారి చరిత్ర ఇలా ఒక నమ్మకంగా మారిపోతుంది. అష్టదిగ్గజాలు ఇలాంటి ఒక నమ్మకమే!

ఒంటిమిట్ట వాసి

రామభద్రకవి ఒంటిమిట్టలో పుట్టి పెరిగాడు. తండ్రి అయ్యలరాజు నారాయణరాజు. ఒంటిమిట్ట రామాలయంలో పోతనభాగవత ప్రవచనం చెప్తు, “పలికించెడివాడు రామభద్రుడట” అనే పద్యం చదువుతుండగా కొడుకు పుట్టాడని కబురొచ్చిందట. అందుకని, రామభద్రుడనే పేరు పెట్టుకున్నాడట తండ్రి. రామభద్రుడు ఎక్కడా తన గోత్రం చెప్పుకోలేదు. హంసవింశతి కర్త అయ్యలరాజు నారాయణామాత్యుడ, రెట్టమత శాస్త్రకర్త అయ్యల భాస్కర కవి వీళ్లు తిప్పమకవి, రామభద్రకవి తమ పూర్వులని పేర్కొన్నారు. వాళ్లు కౌండిన్యసగోత్రీకులు కాబట్టి, రామభద్ర కవి కూడా కౌండిన్యస గోత్రీకుడే! ఆరువేలనియోగి. ఆపస్తంభసూత్రుడు. తిప్పయ్య మనీషికి మునిమనుమడు. పర్వతమంత్రికి మనుమడు. అక్కయామాత్యుడికి పుత్రుడు, పరవస్తు ముమ్మడి వరదాచార్యుడి శిష్యుడు.

ఇదిలా ఉండగా, సకలకథాసార సంగ్రహంలో రామభద్రుడు కాశ్యపస గోత్రుడని ఉంది. దీన్ని బట్టి కృష్ణదేవరాయలు కోరిన రామభద్రుడు మన రామభద్రుడు ఒకరు కాకపోవచ్చుననే సందేహం చాలా మందిలో ఉంది.

అయ్యలరాజు రామభద్రుడు, పుత్తేటి రామభద్రుడు అని ఇద్దరు కవులున్నారు. ఈ ఇద్దరూ ఒక్కరే అని గణపవరపు వేంకటకవి ఆంధ్రప్రయోగరత్నాకరంలో పేర్కొన్నాడు. అయ్యలరాజు అతని ఇంటి పేరు కాదనీ, అది వ్యక్తి పేరని ఈ అయ్యలరాజు అనే వ్యక్తి తిప్పయ మనీషికి తండ్రి లేక తాత కావచ్చుననీ, ఆయన కూడా కవేనని ఆయన్ని బట్టే అయ్యలరాజు వంశనామం ఏర్పడిందని చెప్తారు. ఆరువేల నియోగుల్లో వ్యక్తినామాలు వంశనామాలుగా మారాయి. గంగనామాత్యుడి వంశీకులు గంగరాజు వారుగా, సీతనామాత్యుడి వంశీకులు సితంరాజువారుగా మారటం ఇలాంటిదే! అయితే ఈ వంశమూలపురుషుడైన అయ్యలరాజుగారి అసలు ఇంటిపేరు తెలీదు. బహుశా పుత్తేటి కావచ్చు. “లింగమకుంట తిమ్మకవి తన సులక్షణసారములో రామాభ్యుదయకర్త పుత్తేటి రామభద్రయ్య యని వ్రాసి యుండెనట” అని చాగంటి శేషయ్యగారు ఆంధ్ర కవితరంగిణిలో అన్నారు.

రాయలవారి దర్శనం

రామభద్రకవి కృష్ణదేవరాయల దర్శనార్థం హంపీ విజయనగరం వెళ్ళాడు. అప్పుడతను సుమారు 20 యేళ్ళ కుర్రాడు. ఊరి బైట ఓ గురుకులం ఉంది. ఫలానా ఇతివృత్తం మీద పద్యం రాయమని గురువు శిష్యులకు హోంవర్క్ ఇచ్చాడు. ఆ కుర్రాళ్లు ఆరుబయట కూర్చుని పద్యం వ్రాయటానికి తంటాలు పడుతున్నారు. చలికి వణుకుతూ రామభద్రుడు ఆ దారినే పోతున్నాడు. ఎవరివని అడిగితే, తాను కవినన్నాడు. వాళ్లు చలిమంట వేసి, కప్పుకునేందుకు దుప్పటి ఇచ్చి, తినేందుకు ఇంత ఆహారం ఇచ్చారు. అందుకు కృతఙ్ఞతగా వాళ్లు కోరినట్టు పద్యాలు చెప్పి సహకరించాడట రామభద్రకవి. నేరుగా కృష్ణదేవరాయలే తనను పిలిపించాడని ఘనంగా రామభద్రకవి వ్రాసుకున్నాడుగాని, రాయలవారి తొలి దర్శనం దక్కటానికి రామభద్రుడు అన్ని అవస్థలూ పడే ఉంటాడు.

“‘రామాభ్యుదయము’ రచనాకాలము 1555 ప్రాంతము. అప్పటికి అయ్యలరాజు రామభద్రుడు ఏబదియైదేండ్ల వాడని అనుకొన్నను, శ్రీకృష్ణదేవరాయల ప్రాభవకాలాంతము (1524) నాటికి నుమారు పాతికేండ్లవాడే అగును” అని వీరేశలింగంగారి అభిప్రాయం.

1515-24 మధ్య కాలంలో రాయలు మరణించేవరకూ భువనవిజయనభ ఒక వెలుగు వెలిగింది. రామరాజభూషణుడు, పింగళి నూరన, కందుకూరి రుద్రయ్య అప్పటికి పదేళ్ళ వయసు వారైతే రామభద్రకవి 20 యేళ్ళ వాడు. వీళ్లంతా దిగ్గజాలయ్యే అవకాశమే లేదు.

సకలకథాసారసంగ్రహం కథ

రాయలవారు ఆముక్తమాల్యదలో, శ్రుతిపురాణోపసంహితలేర్చి కూర్చితి/సకలకథాసారా సంగ్రహంబు అని చెప్పుకున్నాడు.

సకలకథాసారనంగ్రహం పేరుతో ఒక అముద్రిత గ్రంథం మద్రాసు ప్రాచ్యలిఖిత పున్తకభాండాగారంలో ఉందని చెప్తారు, అది కాగితాలమీద ఎత్తిరాసిన గ్రంథం. అందులో “రామభద్రప్రణీతం”అని, రాయలవారే తన గ్రంథాన్ని తెలుగు చెయ్యమని కోరినట్టు కవి అందులో వ్రాశాడు.

ఇట్లు కీర్తివిస్తారదురంధరుండగు కృష్ణరాయనరపాలాఖండలుండు నన్ను బిలిచి, శ్రీమత్సీతారమణచరణకమల పరిచరణాయ మాన మానసుండవు, బహువిధ కవితా చమత్కార ధుర్యుండవు, సకలపురాణేతిహాస ప్రబంధరచనాధ్యక్షుండవు, మన్మనోరథ కార్య నిర్వాహకుండ వగుటంజేసి పురాతన మహాకవి విరచిత ప్రబంధంబు లన్వేషించి భగవద్భక్తి నిష్ఠాగరిష్ఠులగు రాజశ్రేష్ఠుల వృత్తంబులు ప్రసిద్ధంబు లగునట్టుగా ప్రశస్త కథలు విన్యస్తంబుగా యెలకూచి సాహిత్య లక్షణ చిత్రకవిత్వ ప్రభావం బొక్కచోటం గనుపడ రచియింప వలయునని మఱియు నిట్లనియె..”అంటూ, “అతిమధుర రసాయన ద్రాక్షాపాకంబుగా శృంగార రసయుక్తం బగునట్లు సకల కథాసార సంగ్రహంబు గ్రంథ విస్తారంబు గాకుండునట్లుగా రచియింపుమని యుపన్యసించి..” తాను సంస్కృతంలో వ్రాసిన సకలకథాసార సంగ్రహం గ్రంథాన్ని తెలుగు చెయ్యవలసిందిగా రాయలవారు ఒక రోజు రామభద్రకవిని పిలిచి చెప్పాడట.

ఎలకూచి బాలసరస్వతి సాహిత్య లక్షణమైన చిత్రకవిత్వ ప్రభావం కనిపించేలా తియ్యని ద్రాక్షాపాకంలా నీ అనువాదం ఉండాలి. అతి విస్తారంగా సాగతీసి విసిగించకూడదని దీని భావం. ఒక సీనియర్ రచయిత జూనియర్ రచయితకు సహజంగా చేసే ఉపదేశంలా ఇది కనిపిస్తుంది. కానీ, యెలకూచి సాహిత్యలక్షణ చిత్రకవిత్వ ప్రభావం అని రాయలవారన్నారనటమే విచిత్రం. యెలకూచి బాలసరస్వతి

రాయల వారికి కనీసం వందేళ్ల తరువాతి వాడు. తన తరువాతి పుట్టబోయే ఫలానావాడి కవిత్వంలా ఉండాలని రాయలు ఎలా కోరతాడు?

దీన్ని మరోలా సమర్థించవచ్చు:

తెలుగులో ఎల.. అనే మాటకి అనేక అర్థాలున్నాయి. ‘ఎల’=సాక్ష్యం. ససాక్ష్యంగా, ఆధారాలలో నమ్మశక్యంగా చెప్పాలని ఒక అర్థం. ‘ఎల’=స్వల్పం లేదా సంక్షిప్తం. అల్పాక్షరాల్లో అనల్పార్థం వచ్చేలా వ్రాయమనే సూచన కావచ్చు. ‘ఎల’=లేత, తాజా అని కూడా! సమకాలీన సమాజానికి అన్వయిస్తూ తాజా సమాచారం మేళవిస్తూ చెప్పాలనేది తాత్పర్యం కావచ్చు. కూచి అంటే శిఖరం. ఎలకూచి అంటే సంక్షిప్తంగా, తాజాగా క్లుప్తంగా, అత్యున్నతంగా చెప్పటం అని అర్థం. ఇద్దరు కవుల ధీరగంభీర సంభాషణం ఇలానే ఉంటుంది. ఎలకూచి బాలసరస్వతి అనే వెంకటకృష్ణయ్య ఇంటిపేరు ‘ఎలకూచి’ అంటే ఏ అర్థం ఉన్నదో ఇక్కడా ఎలకూచి అంటే ఆ అర్థాన్నే అన్వయించాలి. ఎలకూచి అనగానే బాలసరస్వతికి ఆపాదించి రామభద్రుడు అబద్ధం ఆడాడనటం తొందరపాటే!

“నన్నయ తిక్కనాదికవినాథులు చెప్పినయట్లు చెప్పలే
కున్న దదుత్తరాంధ్రకవు లూరకయుండిరె తోచినట్లు ని
త్యోన్నతబుద్ధి గబ్బములు యోజ రచింపక యందు జ్ఞానసం
పన్నులకావ్యముల్ హరిసమర్పణమై జెలువొందు నెందునన్”

ఇక్కడ ఉత్తరాంధ్ర కవులంటే నన్నయ తిక్కనాదులకు తరువాతి తరం కవులని! తరువాతి కవులు ఆ మహాకవులంత ప్రతిభా సంపన్నులు కాకపోయినా యథాశక్తి కవితావ్యాసంగం చేశారంటాడు. ఇది వినయపూర్వకంగా చెప్పుకున్నమాట.

ఇంతకీ మద్రాసులోనో తంజావూరులోనో దొరికిన ప్రతిలో అన్నీ కాపీ పద్యాలే ఎక్కువని ఇది ఏమాత్రం కవిత్వం తెలియని వాడు వ్రాసిందేనని, ఇందులో గొప్పగా చెప్పుకోదగింది కూడా ఏమీ లేదని బ్రౌన్ వ్యాఖ్యానించాడు. చాగంటి శేషయ్యగారు సకలకథాసారసంగ్రహకర్త అయ్యలరాజు రామభద్రుడు కానే కాదని సోదాహరణంగా వివరించారు. ఒకవేళ దీని కర్త రామభద్రుడు కాకపోతే, ఆయన్ని రాయలవారు ఎలకూచిలా వ్రాయమనటమూ, రామభద్రుడు దిగ్గజాల్లో ఒకడు కావటమూ అసత్యాలే అవుతాయి. ఆ మాటలు రామాభ్యుదయంలో రామభద్రుడు చెప్పుకున్నవి కాదు. మనమే ఆయన్ని అష్టదిగ్గజకవిగా అపార్థం చేసుకున్నాం.

ఒంటిమిట్ట రఘువీర శతకం

ఒంటిమిట్ట రఘురాముని స్తుతిస్తూ వ్రాసిన “రఘువీరశతకం” ఎవరి రచన? అనే విషయం మీద నిర్థారణ జరగలేదు. వంగూరి సుబ్బారావు ప్రభృతులు అయ్యలరాజు త్రిపురాంతక కవి అనే అయ్యలరాజు తిమ్మయ్య(రామభద్రుని ముత్తాత) వ్రాశాడని భావించారు. కాశీనాథుని నాగేశ్వరరావు అయ్యలరాజు రామభద్రుడే వ్రాశాడన్నారు.

రామాభ్యుదయంలో ఆశ్వాసాంతగద్యలో “ఇది శ్రీమదొంటిమెట్ట రఘువీర శతక నిర్మాణ కర్మఠ జగదేక ధుర్యాయ్యలరాజు తిప్పయ మనీషి, పర్వతాభిధానపౌత్త్రాక్కయార్యపుత్ర పరిశీలిత సమిద్ధరామానుజసిద్ధాంతమర్మ ముమ్మడి వరదాచార్య కటాక్షవీక్షా పాత్రతహృదయపద్మాధిష్టిత శ్రీరామభద్ర రామభద్రకవి ప్రణీతంబయిన..” అని ఇందులో ఉంది.

“శీమదొంటిమెట్టరఘువీరశతకనిర్యాణకర్మఠ జగదేకఖ్యాతిధుర్యవిశేషణయు” అనేది తాతగారయిన అయ్యలరాజు తిప్పయ్యని ఉద్దేశించి చేసిన స్తుతి. “పరిశీలిత సమిద్ధ రామానుజ సిద్ధాంత మర్మ” అనేది తన గురువు ముమ్మడి వరదాచార్యకు వాడిన విశేషణం. తిప్పయ్య గారి మనుమడు, ముమ్మడి వరదా చార్య శిష్యుడూ అయిన రామభద్రకవి ఈ శతక కర్తే! ఇందులో సందేహం లేదని ఎక్కువ మంది పండితుల అభిప్రాయం. అయితే, తంజావూరు సరస్వతీ గ్రంథాలయంలో దొరికిన ప్రతిలో:

“అతుల ప్రౌఢిమమీఱు రాయకవి యయ్యల్రాజు సత్పుత్రు డం
చితభక్తిన్ త్రిపురాంతకుండు రచియించెన్ తెన్గు పద్యంబులన్
శతకం బొక్కటి, దీని నీవు విని యాచంద్రార్కమై నిల్పు ప
ర్వత కన్యానుత! ఒంటిమిట్ట రఘువీరా! జానకీనాయకా!”

అనే పద్యాన్ని బట్టి ఈ శతకాన్ని ముత్తాత తిమ్మయ్యే వ్రాసి ఉంటాడని వావిళ్ళవారు భావించారు. పండితారాధ్యుల వారు తంజావూరు ప్రతి నమ్మకమైంది కాదన్నారు. మనం ఎవరి పక్షం వహించాలి?

“ఆ కర్ణాటక మండలాధిపతిచే నాస్థాన మధ్యంబులో నా కావ్యంబులు మెచ్చజేసితివి నానారాజులుం జూడగా” అని చెప్పుకోవటం వలన రఘువీర శతక కవి విజయనగర ప్రభువు ఆశ్రితుడనేది స్పష్టం. ఆ ప్రభువు ఎవరు? రఘువీర శతకాన్ని పోతనలాగే రాజులకు అంకితం ఇవ్వకపోవటం ‘రాజవిరక్తి’ వలన కావచ్చునని కొందరు వ్రాశారు.

ఈ శతకంలో వీరవైష్ణవం పాలెక్కువ. “నీ పాదోదక మక్షులం దలముకొంటిన్, గొంటి నాలోనికిన్, నీ పళ్ళెంబు ప్రసాదముం గుడిచితిన్ నీ పేరునుం బెట్టితిన్, నీ పెన్ముద్రలు దాల్చితిన్ భుజములన్” అనటం వలన చక్రాంకితాలు వేయించుకుని వైష్ణవం పుచ్చుకున్నాడని. తాతాచార్యుల ముద్రలు ధరించాడనీ అర్థం అవుతోంది. దేవుడికన్నా దేవుడి నామం మహిమ కలదనే నామసిద్ధాంతం ఛాయలు, రామనామం జపిస్తే ఛండాలుడికీ మోక్షం పునర్జన్మలుండవు.. లాంటి సిద్ధాంతాలు ఇందులో కనిపిస్తాయి. కర్మబంధాల్ని తెంచేందుకే రామనామ జపం అంటాడీ కవి. ముత్తాత కాలంలో కన్నా ఈ సిద్ధాంతాలు మనవడి కాలంలోనే ఎక్కువ ప్రబలంగా ఉండటాన, ముత్తాత కాలానికన్నా రామభద్రుడి కాలానికి వీరవైష్ణవం ఎక్కువ ప్రబలి ఉండటాన, మునిమనవడైన రామభద్రుడు అధిక వీరవైష్ణవ భావావేశం ఉన్నవాడు కావటాన ఒంటిమిట్ట రఘువీర శతకం రచన మన రామభద్రుడి రచన అయ్యేందుకే ఎక్కువ అవకాశం ఉంది.

రామాభ్యుదయం రచన

‘రామాభ్యుదయము’ ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధం. ఇందులో 1800కి పైగా పద్యాలున్నాయి. 1530 లో రచించిన కావ్యం అని మల్లంపల్లి వారు, 1550లలో రచించి ఉండవచ్చని చాగంటి శేషయ్య ప్రభృతులు భావించారు. కృతిస్వీకారం చేసిన గొబ్బూరి నరసరాజు కాలాన్ని బట్టి 1550కే ఎక్కువ అనుకూలత ఉంది.

గొబ్బూరి నరసరాజు అళియరామరాజుకి మేనల్లుడు. కృష్ణరాయలు 1524లో మరణిస్తే, ఆయన కుమార్తె భర్త అయిన అళియరామరాజు రాజ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. “ముప్రత్రయాభావన్య అల్లసాని పెద్దనార్యశిష్యేణ భట్టుమూర్తి మహాకవినా విరచితే వనుచరిత్రే” అంటూ అల్లసాని పెద్దన శిష్యుడు, ఆయన మనుమరాలి భర్త భట్టుమూర్తి మాత్రం అళియరామరాజుని అంటిపెట్టుకుని ఉన్నాడని, అతనే రామరాజ భూషణుడయ్యాడని ప్రసిద్ధి. 1565లో తల్లికోటయుద్ధం విజయనగర సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసింది. ఆ యుద్ధంలో రామరాజు మరణించాడు. అళియ రామరాజు మరణం తరువాత కూడా అయ్యలరాజు రామభద్ర కవి మరో 15 యేళ్లపాటు అంటే, 1580 దాకా జీవించి ఉన్నాడని భావిస్తున్నారు.

రామాభ్యుదయం ప్రౌఢిమ అలంకారాలతో, యమకానుప్రాసలతో, పదగుంభనాలతో వికసితంగా కనిపిస్తుంది. ఆతుకూరి మొల్ల వ్రాశిన రామాయణం అప్పటికే వెలువడింది. మొల్ల, రామభద్ర కవి ఇద్దరూ కడప దగ్గరి వారే! కలుసుకునే అవకాశం వచ్చి ఉంటే రాయలవారూ, కవయిత్రి మొల్ల, రామభద్రకవీ ఒకరి కొకరు తారసపడగలిగినంత సమకాలికులు. ఆ సమయానికి 1440లలో జన్మించిన మొల్ల వృద్ధురాలు. 1490లలో పుట్టిన రాయలు మధ్యవయస్కుడు, 1500లలో పుట్టిన అయ్యలరాజు రామభద్రుడు నవయువకుడు. మొల్లరామాయణం గురించి రాయలవారికి, రామభద్రకవికీ తెలుసా అనే ప్రశ్నకి మన దగ్గర ఏ సమాధానమూ లేదు. మొల్ల కవయిత్రిది భక్తితత్త్వమే కానీ, వీరవైష్ణవ మార్గాన ఆమె రామాయణ రచన చెయ్యలేదు. రామానుజ ధర్మాలని అందులో చొప్పించి వీరవైష్ణవ ప్రచారానికి పూనుకున్నవాళ్ళకి ఆరోజుల్లో ఎక్కువ ఆదరణ ఉండేది. రామభద్రకవి ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్త పడినట్టు కనిపిస్తుంది.

భాగవతం వ్రాసిన పోతన, రామాయణం వ్రాసిన మొల్ల తమ కృతిని రాజులకు అంకితం ఇవ్వటానికి ఇష్టపడక రాముడికే ఇచ్చుకున్నారు. కానీ, రామభద్రకవి ఉదరపోషణకు రాజాశ్రయం కోరక తప్పలేదు. మడిమాన్యాలు, అగ్రహారాలు, అక్షరానికో లక్ష వరహాలూ కొలిచి ఉదారంగా ఇచ్చారనేది ఒక భ్రమ. రాయల తరువాత రాజ్యాని కొచ్చిన ప్రభువులు నిరంతర సంగ్రామాలతో తలమునకలయ్యారు. కవిత్వం ఎవడిక్కావాలన్నట్టుగా ఉన్నది నాటి పరిస్థితి. కృతి స్వీకర్త కోసం రామభద్రుడు వెదకులాడక తప్పలేదు.

ఆ కాలం రాజకీయ పరిస్థితులు

రాయలవారి పిలుపు, అనువాద అవకాశం దొరకటంతో ఆదరణ దొరికిందన్నది నిజమైతే, ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడ లేదు. తాను ఆ రచన పూర్తి చెయ్యక మునుపే రాయలవారు దివికేగారు. రామభద్రకవి బజార్నపడాల్సి వచ్చింది! అష్టదిగ్గజ కవి అనే హోదా ఆయనకు ఒరిగించిందేమీ లేదు. పేదరికం వెన్నాడింది. బహుసంతానవతుడు కాబట్టి ఈయన్ని పిల్లల రామభద్రుడనే వాళ్లట.

“జీవిక గడవక రామభద్రకవి యందందుదిరిగి గుత్తియప్పలరాజు మొదలైనవారి నాశ్రయించి వారిమీద జాటుపద్యములను జెప్పుచు, గొంతకాలము జీవనముచేసి, కడపట కృష్ణదేవరాయని యల్లుడయిన రామరాజుయొక్క మేనల్లుడగు గొబ్బూరి నరసరాజువద్ద జేరి తాను తరువాత రచియించిన రామాభ్యుదయము నారాజున కంకితము చేసెను” అని వీరేశలింగంగారు వ్రాశారు. రాజమనోజా! విద్యా! భోజా! దీనార్థికల్పభూజా! రిపుసంభాజా! వైభవవజితబి డౌజా! రవితేజ! గుత్తి యప్పలరాజా! అనే చాటువు ఇందుకు సాక్ష్యం.

రాయల మరణానంతరం పెదతిరుమలయ్యదేవ మహారాయలు రాజ్యానికి వారసుడైన చిన వేంకటపతి రాయల్ని హత్యచేసి, సింహాసనం అధిష్ఠించాడు. అళియరామరాజు అతని దౌష్ఠ్యాల్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అంతఃపురంలో అంతఃకలహాలు ముదిరాయి. అళియరామరాజు అడ్డు తొలగించటానికి పెదతిరుమలయ్య ఆదిల్షాను సైన్యసమేతంగా ఆహ్వానించాడని, రామరాయలు అతనికి పెద్ద మొత్తంలో డబ్బిచ్చి వెనక్కి పంపేశాడని ఓ కథనం ఉంది. చివరికి, ఈ సుల్తాను రాజధానిలోకి రావడానికి పెదతిరుమలయ్యే కారకుడన్న సంగతి బైటపడటంతో సిగ్గుపడి, భయపడి, అవమానపడి అతను ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆ తరువాత సదాశివరాయల్ని సింహాసనం ఎక్కించి, తాను రాజప్రతినిధిగా పాలనాపగ్గాలు చేపట్టాడు అళియరామరాజు.

“నవనియంతయు రామరాజ్యంబుజేసె, తనగుణంబులు కవికల్పితములు గాఁగ
నలవియె రచింపసత్కావ్యములనువెలయ,భూమినొక రాజమాత్రుండె రామవిభుఁడు”

“ఆ పటుకీర్తి రామవసుధాధిపచంద్రుఁడు కృష్ణరాయ ధా
త్రీపతిసార్వభౌమదుహితృప్రియుఁడై వితతపతాపనం
తాసిత శత్రుఁడై యల సదాశివరాయ నిరంతరాయ వి
ద్యాపుర రాజ్యలక్ష్మికి నిదానము దానయి మించె నెంతయున్”

శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన రామరాయలు మహాపరాక్రమంతో శత్రువుల్ని సంతపింపజేసి, సదాశివరాయల నిరంతరాయమైన విజయనగర సామ్రాజ్యానికి నిదానమయ్యాడని వ్రాశాడు రామభద్రుడు.

అళియరామరాయలు 1543లో సలకరాజు చిన తిరుమలరాజును నంహరించి, సదాశివరాయలికి పట్లాభిషేకం చేశాడు. తాను రాజప్రతినిధిగా నిలవటం చరిత్ర ప్రసిధ్ధే. ఈ కథంతా రామాభ్యుదయంలో ఉండటాన 1543 తరువాతే రామాభ్యుదయ రచన జరిగి ఉండాలి. 1565 అళియరాజు మరణం గురించి లేదు కాబట్టి 1543-65 మధ్య అంటే సగటున 1550లలో ఈ కావ్యరచన జరిగి ఉండాలి.

కృతిస్వీకర్త నరసరాజు

రాయల తరువాత రాజ్యానికి అళియరామరాజే దిక్కయ్యాడు. రాజ్యాన్ని నిలబెట్టటం, సుల్తాన్లని ఎదుర్కోవటం లాంటి ప్రాధమ్యాల్లో సంగీత సాహిత్య పోషణ చివరి ప్రాధమ్యం అయ్యింది. రామభద్రుడు కృతిస్వీకర్తలకోసం వెదకులాటకు ఇదీ అసలు కారణం. ఎవరూ ప్రశాంతంగా లేని పరిస్థితి. చివరికి ఆ అల్లుడు (అళియ)రామరాజుగారి మేనల్లుడు గొబ్బూరి నరసరాజు రామభద్రుణ్ణి ఆదరించాడు. రామాభ్యుదయం కృతి స్వీకరించాడు. అళియరామరాజే రాజ్యాన్ని ఏలుతున్న కాలం కాబట్టి అతని బంధువర్గంలో బలవంతులకు ప్రాధాన్యత ఘనంగానే ఉండే అవకాశం ఉంది. రామభద్రుడు కష్టాలు అప్పటికి గానీ కొలిక్కి వచ్చి ఉండవు.

“సతతసపాదబరీదా
దితురుష్కాధిపశరణ్య దివ్యాంఘ్రి సము
న్నత కర్ణాటస్థాపన
చతురాళియ రామరాజజామాతృమణీ
అళియరామరాజు జామాతృమణి”,

అనటం వలన నరసరాజు అళియ రామరాజుకి అల్లుడా మేనల్లుడా అనే సందేహం ఉంది. ఈ నరసరాజు కోనేటి తిమ్మరాజు కూతురుని ప్రేమించి పెళ్ళాడాడని ఓ కథనం కూడా ఉంది. ప్రేమవివాహాలు, దానికి అంగీకార తృణీకారాలు సహజం. బహుభార్యావ్రతం అమల్లో ఉన్న ఆరోజుల్లో రామరాజు తన మేనల్లుడికి తన కూతుర్నో, తన సోదరుని కూతుర్నో ఇచ్చి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసి ఉంటాడని, ఆ విధంగా మేనల్లుడే అల్లుడయ్యాడనీ భావించవచ్చు. రామాభ్యుదయం కృతి స్వీకార సమయానికి నరసరాజు కర్నూలు దుర్గానికి పాలకుడిగా ఉన్నాడు.

“నరసరాజు ప్రేమించిన యువతి తండ్రి కోనేటి తిమ్మరాజు అళియరామరాజుకు సవతి పెదతండ్రి మనుమడు. ఈతిమ్మరాజు సోదరుడైన రంగపరాజు సాంబోపాఖ్యాన కృతికర్త, ఈతిమ్మరాజు కుమారుండగు రామరాజు తెనాలి అన్నయ కృత సుదక్షిణాపరిణయ కృతిభర్త కాశ్రయదాత” అని చాగంటి శేషయ్య గారు ఆంధ్రకవితరంగిణిలో వివరించారు.

ఈ నరసరాజు తెలుగు చోడుల సంతతివాడంటూ, అతని వంశమూలాలను రామభద్రకవి వివరంగా పేర్కొన్నాడు:

ఆ రఘుపతి వంశసుధా/నీరధికిఁ గరికాలచోళనృపచంద్రుఁడు దు/ర్వారశరభిన్నవిమతా/కారుఁ డుదారుండు జనించె గలియుగ వేళన్గొబ్బూరు వంశానికి కరికాల చోళుడు మూలపురుషుడని, కాలక్రమంలో వీళ్లు చోడశబ్దాన్ని వదిలి రాజశబ్దాన్నే స్వీకరించినట్టు కనిపిస్తోందని చాగంటి శేషయ్యగారి భావన.

అళియరామరాజు తండ్రి ఆరవీటి తిమ్మరాజు సాళువనరసింహరాయల సేనాధిపతిగా ఉన్నత స్థితిలో ఉన్నాడు. తిమ్మరాజుకి ముగ్గురు కొడుకులు, మొదటివాడు రామరాజు, రెండవవాడు వెంకటాద్రిరాజు, మూడవ వాడు తిమ్మరాజు. రామరాజు శౌర్యప్రతాపాలకు, మేథాశక్తికీ మెచ్చే, రాయలవారు అతన్ని అతన అల్లుడిగా చేసుకున్నారు. అప్పటినుండీ ఆరవీటి రామరాజు అళియ (అల్లుడు) రామరాజుగా ప్రసిద్ధుడయ్యాడు.

“రామక్షోణివిభుండు కృష్ణమనుజేంద్ర గ్రామణిన్‌ భీమసం
గ్రామేంద్రాత్మజుఁ బెద్ద తిమ్మవిభుని న్రాచూరి తిమ్మాధిపున్‌
శ్రీమంతుం బినకొండ భూవరవరున్‌ శ్రీరంగరాజన్యను
త్రాముం గాంచెఁ గుమారరత్నముల మందారోపమోదారులన్‌.”

ఇందులో పెద్ద తిమ్మన కొడుకైన రాచూరి తిమ్మాధిపుడు అనటం, అలాగే “రాచూరి తిమ్మవిభుని క/రాచూరిం దెగి నిరంతరము సమరమృగీ/లోచనల మదనశాస్త్రా/లోచనలందవిలి వర్తిలు దురభియాతుల్‌” అనటం, అలాగే చిన తిమ్మాధిపుడు 1550వ నంవత్సరంలో రాచూరు దుర్గాన్ని గెల్చుకుని, రాచూరితిమ్మఠాజుగా ప్రసిద్దుడైన చరిత్రకు ఒక సాక్ష్యంగా కనిపిస్తుంది. దీన్ని బట్టికూడా రామాభ్యుదయం రచన 1550 ప్రాంతాల్లో జరిగిందని గట్టిగా నమ్మవచ్చు.

రామభద్రుడు వీరవైష్ణవుడు

రామభద్రుడు రామానుజమత సిద్ధాంతానుసారి! కరడుగట్టిన వైష్ణవుడు. రామాభ్యుదయంలో ఇష్టదేవతాస్తుతి చేసేప్పుడు తిరుపతి వేంకటేశ్వరునికి, అలమేలు మంగకు, విష్ణుపంచాయుధికి. అనంతుడికి. గరుత్మంతుడికి, ఆంజనేయుడికి, విష్వక్సేనుడికి, సరన్వతికి మాత్రమే స్తుతులు వ్రాశాడు. త్రిమూర్తుల ప్రస్తావన లేదు. ఆయన దృష్టిలో విష్ణువు త్రీమూర్తివిలాసవర్తి, లక్మీదేవి త్రిలోకమాత. రాజగురువు తాతాచార్యుల ప్రభావం విష్ణుభక్తుల మీద నేరుగా ప్రసరించిన కాలం అది. ప్రభువు కన్నా వైష్ణవులకు తాతాచార్యులవారే ఎక్కువ. ఆయన గీసిన గీటుని రాయలుగానీ, అళియరామరాజు గానీ, తదనంతర విజయనగర ప్రభువులుగానీ దాటక పోవటం చరిత్ర!

తెలుగువాడిగా పుట్టటం తపఃఫలం అని చెప్పుకున్న అప్పయ్యదీక్షితులవారు రామభద్రుడికి ఇంచుమించు సమకాలికుడు. కంచి, జింజి, చిదంబరంలలో అయన ప్రసిద్ధుడు. పరమ శైవుడు. ఆయన మహాశివుడిని త్రిమూర్తి విలాసవర్తిగా భావించినవాడు. శైవ వైష్ణవ విభేదాలు పతాకస్థాయిలో ఉన్నకాలం అది! శైవులను ద్వితీయ శ్రేణులుగా చేయాలనే తాతాచార్యుల ప్రయత్నాలపై శైవులు తిరుగుబాటు ప్రకటించిన కాలం. సుల్తానుల బెడద బైటనుండీ, మత వైషమ్యాలు లోపల నుండీ ఇలా జడ కట్టుకుని దాడి చేస్తుంటే అళియ రామరాజు ఉక్కిరిబిక్కిరైన కాలం అది!

రామాభ్యుదయంలో రామభక్తి

“కానక గన్న సంతానంబు గావున గానక గన్న సంతానమాయె
నరయ గోత్ర నిధానమై తోచుగావున నరయ గోత్ర నిధానమయ్యె నేడు
ద్విజకులాదరణ వర్ధిష్ణుడు గావున ద్విజ కులాదరణ వర్ధిష్ణుఁడయ్యె
వివిధాగమాంత సంవేద్యుండుగావిన వివిధాగమాంత సంవేద్యుఁడయ్యెఁ
గటగటా దాశరథి సముత్కట కరీంద్ర
కట కలిత దాన ధారార్ధ్ర కటక మార్గ
గామి, యెటు సంచరించు, నుత్కట కరీంద్ర
కటకలిత దాన ధారార్ధ్ర కటకతటుల..”

ఈ పద్యంలో ముందు భాగం తరువాతి భాగం ఒకలానే కనిపిస్తూ అర్థభేదంకలిగి ఉన్నాయి.

“కానక గన్న సంతానంబు గావున గానక గన్న సంతానమాయె”= కలుగక కలుగక కలిగిన సంతానం కానల (అడవుల) కోసం కన్నట్టయ్యింది.

“గోత్ర నిధానమై తోచుగావున నరయ గోత్ర నిధానమయ్యె నేడు”= గోత్రం అంటే వంశం, గోత్రం అంటే నేల, గోత్రం అంటే కొండ, గోత్రభిత్తు అంటే కొండల రెక్కల్ని ఛేదించిన ఇంద్రుడు అని! గోత్రనిధానం అంటే వంశానికి మూలం అనుకున్నది కొండల్లో నివాసం అయ్యింది. నిధానం అంటే, నివాసం, నిక్షేపం, దాచుకున్నదని. గోత్ర నిధానం అంటే వంశప్రతిష్ఠ. వంశానికి పేరు తెస్తాడనుకున్న వాడు ఇలా గోత్ర నిధానంలో అంటే కొండలు కోనల్లో జీవించాల్సి వచ్చిందని!

“ద్విజకులాదరణ వర్ధిష్ణుడు గావున ద్విజ కులాదరణ వర్ధిష్ణుఁడయ్యె” ఉపనయనం జరగటం, విద్యారంభం ద్వారా మనిషి మనీషిగా మరో జన్మ ఎత్తినట్టే కాబట్టి ఙ్ఞానులంతా ద్విజులే! ద్విజ అంటే రెండు సార్లు పుట్టేదని. మొదట అండంలోంచి తరువాత గుడ్డులోంచి రెండుసార్లు పుడతాయి కాబట్టి పాములు, పక్షులు ద్విజులే! అలాగే పాలపళ్ళు రాలిపోయి కొత్త పళ్ళు పుడతాయి కాబట్టి మన దంతాలు కూడా ద్విజులే! ద్విజకులాదరన వర్ధిష్ణుడు అంటే వేద విదులను ఙ్ఞాన వంతులను పోషించవలసిన వాడు ఇలా ఇతర అడవుల్లో పక్షులు పాములతో తిరుగుతూ వాటి ఉద్ధారకుడయ్యాడు.

వివిధాగమాంత సంవేద్యుండు గావిన వివిధాగమాంత సంవేద్యుఁడయ్యెఁ”= ఆగమాలు వేద వేదాం ఙ్ఞాన శాస్త్రాలు. అగమం అంటే వృక్షం, పర్వతం. ఆగమాల ద్వారా తెలియాల్సిన వాడు అగమాల అడవులు పర్వతాల ద్వారా తెలియాల్సినవాడయ్యాడు.

మదగజాల మదంతో తడిసిన రాజధాని నగరంలో తిరిగే వాడు ఆ మదజలంతో తడిసిన కొండవాలుల్లో తిరుగుతున్నాడు. కటకటా దాశరధి.. అంటూ రాముడు అరణ్యాలకు బయల్దేరినప్పుడు దుఃఖిస్తూ దశరధుడి నోట వెలువడ్డ పలుకులివి. రామాభ్యుదయంలో ఇలాంటి చిత్రకవిత్వం అనేక సందర్భాల్లో కనిపిస్తుంది.

రాయలవారు “పురాతన మహాకవి విరచిత ప్రబంధంబు లన్వేషించి భగవద్భక్తి నిష్ఠాగరిష్ఠులగు రాజశ్రేష్ఠుల వృత్తంబులు ప్రసిద్ధంబు లగునట్టుగా ప్రశస్త కథలు విన్యస్తంబుగా యెలకూచి సాహిత్య లక్షణ చిత్రకవిత్వ ప్రభావం బొక్కచోటం గనుపడ రచియింప వలయు” అని చెప్పిన సలహాని రామభద్రుడు రామాభ్యుదయంలో నూరుశాతం పాటించాడు.

కవితా చమత్కృతిని ప్రదర్శించటానికి, కవిగా తన ప్రతిభని చాటటానికి రామాయణాన్ని ప్రబంధంగా వ్రాయటం ఒక అవసరంగా ఆయన భావించాడు. కావ్యలక్షణాలు వ్యాకరణ, అలంకార శాస్త్రాంశాలు పుష్కలంగా ఉండేందుకోసం ఆయన రామాయణాన్ని స్వతంత్ర కావ్యంగా రచించేందుకు పూనుకున్నాడు. రామాయణంలో నీతిని, షట్చక్రవర్తుల వైభవాన్ని, దశరధుని పుట్టుక నుండి జరిగిన ముఖ్య ఘట్టాలనీ, పుత్రకామేష్ఠిలో వ్యాకరణాంశాల్ని రామాభ్యుదయంలో వివరించాడు రామభద్రకవి. శూర్ఫణఖ ముక్కు చెవులు కోయటం ద్వారా రాముడు ఆమెకు శాప విమోచనం కలిగించిన కథ, రావణ పూర్వజన్మ విశేషాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ విద్యలో రామరాజభూషణుడు ప్రసిద్ధుడు. అయితే కొన్ని పద్యాల్ని పోల్చి చూసినప్పుడు రామభద్రుడు రామరాజభూషణుడి తలదన్నినవాడనే ప్రశస్తి కూడా ఉంది. ఈ తలదన్నటం అనే మాటకి రామభద్రకవి తన ఎడమకాలితో రామరాజభూషణుడి కిరీటాన్ని తన్నాడనే కథ జనంలో పుట్టిందని చాగంటి శేషయ్యగారు వివరించారు.

“మెఱుఁగు తఱిత్రాడు పెనకువ మించి మొగులు
చాలు కవ్వపుమల మరుచ్చయము చేత
భ్రమణ మొందించి నూత్నమౌ నమృత మౌర
వినుకడలిఁ గల్గజేసెఁ బ్రావృణ్మురారి”

అంటూ మురారి ప్రశస్తిని చాటుతాడు.

హనుమంతుడు సీతమ్మకి శ్రీరాముని ముద్రిక ఇవ్వటం లాంటి సన్నివేశాల్లో నాటకీయత సృష్టించటానికి ఆయన తిక్కన మార్గాన్ని అనుసరించాడనిపిస్తుంది. అంగుళీకాన్ని పుచ్చుకుని ఆమె పలికిన పలుకుల్ని 14 పద్యాల్లో వ్రాశాడు.

“పరుషోక్తి బాధ చూడకు,
పరిణామ సుఖముచూడు, బ్రతికెద వసురే
శ్వర! మందు చేదుచూడకు, పెరిగిన
తెవులడగ జూడు పెద్దతనానన్!”

అని విభీషణుడు రావణాసురుడికి చెప్పిన హితవు సార్వజనీనంగా ఉంటుంది. కఠినమైన మాటవలన కలిగిన బాధని కాదు, పరిణామ సుఖాన్ని చూడమంటాడు. మందు చేదుని కాదు రోగాన్ని తగ్గిస్తుందన్న దాని మీద దృష్టిపెట్టమంటాడు.

“ధనులగు కోడెకాండ్రకును దంగెటిజున్నులు కోరి నిండు జ
వ్వనమునఁ జేరుపేదతెరువర్లకు నందని మ్రానిపండ్లు డా
సినగతి దక్కి యేరికిని జిక్కని చక్కని మాయలేళ్లు మో
హన మధురాధరస్తన ధృగంచల భాసిను లవ్విరాగినుల్”

డబ్బున్న కోడెకారుకి తంగెటి జున్నులా, దారిన పోయే పేదబాటసారులకు అందని మానిపండ్లలా ఎవరికీ అందీ అందకుండా మధురాధరస్తన ధృగంచల భాసినులైన విరాగినుల్ని ఈ పద్యంలో వర్ణిస్తున్నాడు. అంగదుడు రావణుణ్ణి నిలేసిన అద్భుత దృశ్యం చూడండి:

“నిను దన చంకవేచుకొని వీరవిథాన చతుష్టయంబునన్
జనిచని సాంధ్యకృత్యములు సల్పెడు నంతకుఁ ద్రిప్పి తెచ్చి పెం
పున నటవైచి కొంకరులు పోయిన నీమెయి చక్కనొక్కి పో
ననిచిన వాలినందనుడ్డ నంగదుఁడన్ దశకంఠ! వింటివే!”

నిన్ను చంకలో వేసుకుని చతుస్సాగరాలలోనూ సంధ్యావందనం పూర్తయ్యేదాకా తిప్పి తెచ్చిఅక్కడ పడేస్తే, కొంకర్లు పోయిన నీ శరీరాన్ని చక్కనొక్కి పంపిన ఆ వాలి ఉన్నాడే.. ఆయన కొడుకుని! అంగడుణ్ణి .. విన్నావా..” అనడుగుతాడు అంగదుడు.

“హా యను, గాధినందన మఖారి నిశాట మదాపహారి బా
హా యను గ్రావజీవదపదాంబురుహా యను రాజలోక సిం
హా యను, బోషి తార్యనివహా యను, గానల కేగితే నిరీ
హా యను, నిర్వహింప గలనా నిను బాసి రఘూద్వహా! యనున్‌”

రామభద్రుడి ఈ పద్యం చదివినప్పుడు ఇలాంటిదే తిక్కన గారి పద్యం గుర్తుకొస్తుంది:

“హా! యను, ధర్మరాజ తనయా! యను, నన్నెడబాయ నీకు జ
న్నే! యను, దల్లి నేప జనునే! యను, గృష్ణుడు వీడెవచ్చె రా
వే! యను, నొంటివోక దగవే! యను, నేగతి బోవువాడ నే
నో యభిమన్యుడా యను, బ్రియోక్తుల నుత్తర దేర్పవే యనున్‌”

లోతుగాచూస్తే, ఈ రెండింటిలో రామభద్రుడి పద్యంలోనే నడక ఎక్కువ వేగవంతంగా కనిపిస్తుంది. జానకీ దేవి మెడలో శ్రీరామచంద్రుడు మంగళసూత్రాలు కట్టిన దృశ్యం ఎంత కమనీయంగా ఉందో చూడండి:

“హాటకగర్భదైవత మహర్షులు దీవెనలియ్యగా, నిరా
ఘాట మరుధ్వధూ మధురగానము నింగి చెలంగ, జానకీ
పాటలగంధి కంధ్ర శుభప్రదవేళ ఘటించె నా జగ
న్నాటక సూత్రధారి రఘునాథుడు మంగళసూత్రమయ్యెడన్”

హాటకగర్భ అంటే హిరణ్యగర్భుడైన బ్రహ్మ మొదలైన దేవతలు దీవెనలిస్తుంటే, నిరాఘాటంగా మరుద్వధూమధుర గానం ఆకాశాన్నంటుతుంటే, ఆ జగన్నాటక సూత్రధారి రఘునాథుడు సూత్రధారణ చేశాడట. ఇప్పుడు డిజే సౌండ్ల మధ్య గుండెపోట్లు వచ్చే ధ్వనులతో పిచ్చెక్కించే వాళ్లు ఈ పద్యాన్ని చదవాలి.

హనుమంతుడు సముద్రాన్ని లంఘించే దృశ్యాన్ని ఒక చిత్రకారుడు రంగుల్లో చిత్రిస్తే ఎంత ఉద్విఘ్నభరితంగా ఉంటుందో ఈ పద్యం చదివితే అంతటి అనుభూతి కలుగుతుంది:

“తన చూ పంబుధిమీఁదఁ జాచి శ్రవణ ద్వంద్వంబు రిక్కించి వం
చిన చంచద్భుజముల్ సముత్కటకతీసీమంబులన్ బూన్చి తోఁ
క నభోవీధికిఁబెంచి యంఘ్ర లిఱియంగాఁ బెట్టి బిట్టూది గ్ర
క్కున నక్కొండ యడంగఁ గ్రొక్కి పయికిం గుప్పించి లఘించుచోన్”

హనుమంతుడు తన చూపుల్ని సముద్రం మీదకు ప్రసరింపచేశాడట. రెండు చెవుల్నీ రిక్కించీ,భుజాల్ని ముందుకువంచి, నడుము మీద రెండు చేతులూ వేసి పాదాల్ని నొక్కి పెట్టి గట్టిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకుని ఆ కొండని అణగదొక్కుతూ ఒక్క ఉదుటున సముద్రం పైకి లంఘించాడట.

రామాభ్యుదయ దివ్యప్రబంధాల్లో ఒకటి. వైష్ణవభక్తిని కవితా సామగ్రిని త్రాసులో చెరో వైపూ వేసి ఎటూ మొగ్గకుండా నిలిపి బాధ్యతాయుతంగా రామభద్రుడు ఈ కావ్యాన్ని వ్రాశాడు. మనసు పెట్టి చదివితే ఎవరి సహకారం లేకుండానే చాలా వరకూ అర్థం అవుతుంది. విష్ణుభక్తిని కూడగడుతూనే ‘ఆహా’ అనిపించే పద్యాలతో రసాస్వాదన కూడా చేయించే కావ్యం ఇది!

Exit mobile version