[తమ ప్రాథమిక పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, బాల్య స్నేహితులను తలచుకుంటున్నారు డా. చలం ఆరంబాకం ఈ రచనలో.]
“రేయ్! నువు సారు కుర్చీలో కూచునావ్ర” , సారు కాడ చెప్తాంటనే కుడిచేయి చాచి నాకు సీమసింత గుబ్బలు ఇయకపోతే అనే అర్థం వచ్చేలా,.. చేయని తప్పుకు, తెలివిగా బ్లాక్‌మెయిల్, చానామంది పిలకాయలలాగే నాకు, ఒక్క క్షణమైన అయ్యారు కుర్చీలో కూచోవాలనే కోరికున్నా, అయ్యోరంటే చచ్చేటంత భయం అందుకే ఆ ప్రయత్నం ఎప్పుడూ చేయల.
పట్టాభిగాడు (మారుపేరు) ఉద్దేశంగానే కుర్చీలో పడేటట్టు నెట్టినా, కనీసం నా నిక్కరు గూడైన కుర్చీని తాకకముందే చివుక్కులేసేసా స్ప్రింగ్ లా, రెండు చేతులు కుర్చీకి గట్టిగా అదిమిపట్టీ. నేనొకణ్ణే కాదు, చాలామంది పిలకాయలు వీడి బాధితులే.
పట్టాభి అంటే అందరికీ భయం. శరీర దారుఢ్యం, చాటంత ముఖం, అన్నిటికి మించి అల్లరి. సింపుల్‌గా చెప్పాలంటే చిన్న సైజు రౌడీ. బడికి అప్పుడప్పుడు మాత్రమే వచ్చేవాడు, అది కూడా ఇంట్లోవాళ్ళు కొట్టుకుంట, తన్నుకుంట, లాక్కొచ్చి బడిలో పడేసి “సారు, ఈ నాకొడుకిని ఇంటికి పంపొద్దు. ఇక్కడే పాతేయండి,” అని చెప్పి దణ్ణం పెట్టీ ఆవేశంగా వెళ్ళేవారు.
అయ్యోరంటే భయం లేని కొంతమంది పిలకాయలు దర్జాగా కుర్చీలో కూచోవడమే కాదు, బెత్తాని చేత్తో పట్టుకొని అచ్చం అయ్యోరు మాదిరే అభినయం చేసేవాళ్ళు. ఎవరో ఒకరిద్దరు దైర్యంచేసి “సార్! వాడు మీ కుర్చీలో కూచునాడు సార్” అని నిజం చెప్పినా, “అమ్మతోడు, నేనసలు కూచోన్లేదు సార్”, కుడిచేయి నెత్తిన ఎడమచేయి రొమ్ముకు అడ్డంగా మడిచి అతి వినయంగా ముందుకు వంగి, ఒకవేళ వాళ్ళు కూచునట్టు అయ్యోరుకు రూఢిగా తెలిసినా, తెలియనట్టు; అదేమంత పెద్ద విషయమే కాదన్నట్టుంటుంది సార్ వాలకం. వీరిని మాత్రం కనీసం పల్లెత్తి మాట కూడా అనేవాడు కాదు.
కారణం!.. సారింట్లో పని బాటే వీరి చదువు, ఈ షోదా పిలకాయలు, సిగ్మెండ్ ఫ్రాయిడ్ కన్నా రెండాకులు ఎక్కువే చదివారు. అయ్యోరు మనస్తత్వాన్ని ఎప్పుడో పసిగట్టి, అంత చిన్నవయసులోనే, కుర్చీలో కూచునగాని, సారు మమల్ని ఏమి చేయలేడనే ధీమా, గర్వం , పొగరు ప్రదర్శించేవారు మా ముందు.
దాదాపు పది సెంటీమీటర్ల ఎత్తు, పరిమితంగా ఉన్న ఒకటి, రెండు నేల బెంచీలు మీదకు ఎవరు ముందెల్తే వారికే ఆ పూట సొంతం. ఒకరిపై ఒకరిని నెట్టి బెంచిపై కూచోవడమే మా గొప్ప విజయం. సీటును ఎవరు ఆక్రమించే అవకాశమే లేకుండా బెంచి కింద పలక తోసి ఈ సీటు నాదే అనే సంకేతం.
అర్జెంటుగా వచ్చే మల, మూత్ర విసర్జన కోసం పక్కనే ఉన్న ఓటేరు కాలువ ముళ్ళ కంపల్లోకి దౌడు. నిక్కరు బొత్తాలు ఇప్పుకొంటా, ఇంట్లో టాయిలెట్సే కాదు కనీసం స్నానగదులు కూడా సరిగా ఉండేవి కాదు. అవి కూడా ఓపెన్ టాప్, ఇంకా బెస్టంటే, పైన గోతంపట్ట, చిలుము పట్టిన రేకు డబ్బా అంతే. ఏదో కొంతమంది డబ్బున్నోళ్లకు లెట్రిన్లు ఉన్నా ఇప్పటిలా ఆధునిక సెప్టిక్ ట్యాంక్లు కావు, సఫాయి సిబ్బంది, చేతులకు రక్షణ తొడుగులు, ముక్కుకు కనీసం రుమాలు లేకుండా, చిన్నరేకు ముక్కతో దుర్గంధపూరిత మలాన్ని తీసివేయయడం సర్వ సాధారణమే.
మా బడికి ఉత్తరాన ప్రత్యేకంగా వీరి కోసమే ఎపుడో (అప్పట్లో వూరికి దూరంగా) నిర్మించిన మున్సిపాలిటీ ఆస్బెస్టాస్ పాడైపోయిన రేకుల గృహసముదయాలు, పశువుల ఆసుపత్రి పక్కన, భారీ చింతచెట్ల కింద ఉండేవి. అందుకే వారు మాకు తరచూ తారసపడేవారు, వారిలో చాలా మంది రూపం ఇంకా నా మదిలో స్పష్టంగా ఉంది.
సేకరించిన మలాన్ని, రెండు చక్రాల తోపుడు డబ్బాల్లో భారంగా నెట్టుకుంటూ వెళ్ళేవారు. ఆ ముఖ కవళికలలో చీదరింపు, అసహ్య చాయలెప్పుడు కనిపించలా. మా బతుకింతేననే నిష్ఠూరం కాదు, మా బతుకిదేలే అనే భ్రమ, ఈ పని కోసమే భగవంతుడు మమ్మల్ని పుట్టించాడనే అమాయక, పవిత్ర భావన తప్ప!
పెంట బండితో వీళ్ళెదురైతే, మా ముందు నుండి వీరు దూరంగా వెళ్ళేదాకా, చూపుడు బొటనవేలుతో గట్టిగా ముక్కుతోపాటు కళ్ళు కూడా తొంభై శాతం మూసేసి ఉంచేవాళ్ళం.
ఈ ఆధునిక యుగంలో కూడా మారని జీవితాలు ఎవరవైనా ఉన్నాయంటే అవి ఖచ్చితంగా పారిశుధ్య కార్మికులవే..
ఏదో ఒకటి రెండు కన్నీటి తుడుపుచర్యలు తప్ప, ఎన్నో దిగమింగే అవమానాలు, సజీవంగా పడకెక్కించే రోగాలతో, జడివానైనా; మండే ఎండైనా, ఊరంతా పండగైనా, వీళ్ళింట్లో చావైనా పుట్టుకైనా, దుఃఖం సంతోషాలు తెలియని దుర్గంధంలో పుడుకుపోతున్న దరిద్రపు జీవితాలు, వీరికి తెలిసిందంత సగం నిద్రలో కళ్ళు నులుపుకొంటూ, మురికి ఊబిలోకి దూకటం. అంతే!
“గల్లీ చిన్నది పాకివోళ్ళ కథ (గరీబోళ్ళ) పెద్దది” – గోరేటి వెంకన్నకు క్షమాపణలతో.
ముళ్ళ కంప లేత చిగుళ్ళు తుంచి చొక్కా జోబిలో వేసుకోవడం, బడికి వెళ్ళే ముందు తప్పనిసరి, ఇలా చేస్తే అయ్యోరు కొట్టడనేది మా దృఢ నమ్మకం. అయినా దెబ్బలు తప్పక పోయేవి. ఈ సాంప్రదాయం ఏడవ తరగతి చివరిదాకా కొనసాగింది.
సంత మైదానంలో వున్న అంకాలమ్మ గుడికి అప్పుడప్పుడు మిత్రుడు సుబ్బరాయులతో, ఇంట్లో కుంకుమ పొట్లాల్ని తీసుకెళ్ళి రాతివిగ్రహం ముందు పెట్టి భక్తిగా మొక్కేవారం, బెత్తం దెబ్బలు పడకూడదని.
అమ్మవారి రూపం చూస్తుంటే భయం. మా వైపే ఉరుమి చూసునట్లుండేది కోపంగా. పైగా జనసంచారం కూడా లేని ప్రదేశం. ఈ ప్రయత్నం కూడా వృథా ప్రయాసే, వర్కవుట్ కాలా. చర్మం చిట్లే దెబ్బలు సదా మామూలే.
ప్రతి సాయంత్రం బడి వాకిట్లో (రోడ్లో) గంగిరావి చెట్టు కింద వరుసగా నిలబడి ఎక్కాలు చెప్పాలి, బిగ్గరగా గొంతు చిరిగేటట్టు. ఎక్కాలు రాని మా మొద్దు పిలకాయలు ఎలా తప్పించుకోవాలనే ముందస్తు ప్రణాళికలు.
నిక్కరు జోబీలో, గనిసి గడ్డ, బెల్లంముక్కలు, మురుకుపొలుకులు, బొండాలు, బొరుగుంట, కమ్మరకట్టు బఠాణి, ఉప్పుశెనగలు, రేగు, నేరేడు పండ్లు. మట్టినేల చిరిగిన జనపనార గోతం పట్టపైన, ఝమ్మనే ఈగల నాదం మధ్య అందమైన తినుబండారాలవి. సహచరుల వద్ద వస్తుమార్పిడితో నెమలీకలు తీసుకొని పుస్తకాల పేజీల్లో పెట్టి మురిపెంగా చూస్తూ మురిసిపోవడం అదో ఆనందం.
రోజూ సాయంత్రం ఉప్మా, పిండి కలిపిన చిక్కటి పాలు విధిగా ఇచ్చేవారు. ఇవి రష్యా నుండి బడిపిల్లల ఆరోగ్యం కోసం పంపేవారట. కమ్మటి ఉప్మా, చిక్కటి పాల రుచులు ఇప్పటికీ నాలిక పైనుండి వెళ్ళలేదంటే నమ్మండి.
తోవలో దొరికే అయస్కాంతం, సినిమా ఫిల్మ్ రీల్ ముక్కలు, గోళీలు, చిన్నాచితక వస్తువులతో నిక్కరు రెండు జోబిలు భారంగా ఉండేవి, అలా వుంటేనే మాకు ఆనందం, సౌకర్యం. లేదంటే ఏదో కోల్పోయిన ఫీల్.
ముక్కు చీమిడి, చెమట, కోడి ముక్కు నేలకేసి దుద్దినట్లు, చొక్కాకే దుద్ది ఆ మురికిపట్టిన బట్టలతోనే నిద్ర, నో నైట్ డ్రెస్. చాకలి తెచ్చే బట్టల కోసం ఎదురుచూపు అప్పటి దాక అవే బట్టలు.
అయ్యోరు బూతులు తిట్టినా, రక్తగాయాలయేట్లు తీవ్రంగా కొట్టినా మా మనో భావాలెప్పుడు దెబ్బతినలా. ఇంట్లో చెప్పాలంటే భయం, ఒకవేళ చెప్పినా “చావకొట్టి దూలానికి వేలాడదీయండి” అని సారుకు వత్తాసు.
అమ్మాయిలు సంఖ్య మాతో పోల్చుకుంటే చాలా తక్కువే. మేడంకు సొంత పనులు చేసే తనకిష్టమైన పిల్లలతో అల్లరి పిలకాయలకు మొట్టికాయలు వేసే డ్యూటీ అప్పగించడం అన్నీ పాఠశాలల్లో పరిపాటే.
టీచర్ లేనప్పుడైతే పర్లేదు కాని, టీచరమ్మ తరగతిలో ఉన్నప్పుడే ఈ దారుణం జరిగేది, అయ్యోరమ్మ ఏదో నవల్లో మునిగో, చిరుతిండ్లు తింటో, ఇరుగుపొరుగు ఆడాళ్లతో పిచ్చాపాటితో, అసలు పట్టించుకునేవారు కాదు.
తోటి విద్యార్థుల మీద అనధికారిక పెత్తనం వీరిదే. తనకు గిట్టనివారిపై వాళ్ళ తప్పులేకపోయినా పిడికిలి బిగించి కుడిచేయి ఆకాశానికెత్తి బలంగా తలకాయ చిట్లిపోయెలా మొట్టికాయ వేయడం చాలా బాధ కలిగించే విషయం. పిల్లల సున్నిత మనస్తత్వాన్ని ఎరిగిన టీచర్లు ఈ ఘోరాన్ని ప్రొత్సహించడం ఇప్పటికీ నాకు చాలా బాధ కలిగించే విషయం. తోటి విద్యార్థే సాటి విద్యార్థుల్ని శిక్షిస్తుంటే బాధతో తల్లడిల్లేవి మా పసిహృదయాలు. చెప్పుకోలేని బాధకు గురయ్యేవారం.
కాస్త హయ్యర్ క్లాస్‍లో ఐతే అల్లరి చేసే పిలకాయల పేర్లు పలకలో రాయడం, ఇది కూడా పైన చెప్పినట్లే లీడర్ వ్యక్తిగత కక్షకు మిగతా పిల్లలం బలయ్యేవారం. అభంశుభం తెలియని పిల్లల మధ్య రాగద్వేషాలు.
“మాఇంటికెళ్ళి కాఫీ తేరా” అని ఎవరికైతే సారు చెప్తాడో, వాడో పెద్ద హీరోలా ఫోజు. సారుకు నేనెంతో క్లోజ్ అనే హావభావాల్లో చెప్పకనే చెప్పేవారం. ఇప్పటి సినీ, రాజకీయ సెలెబ్రెటీల పక్కన నిలబడేవారికి మించి. ఈ సదవకాశం ఐదవ తరగతిలో, చాలాసార్లు నాకే దక్కేది. ఆ కొద్దిసేపైన చదువు గోలకు దూరం కావడానికి, సారింటికి వెళ్ళడానికి పోటీపడేవారం, ఏకకాలంలో, స్వామి కార్యం స్వకార్యమంటే ఇదే కదా!
బడికి పూర్తి విశ్రాంతి దొరికే కళ్ళ కళ్ళక, అమ్మవారు సోకితే ఇక చెప్పలేని ఆనందం. బడికెళ్ళడం అటుంచి మాపై అమ్మవారు అవహించారని ఇంట్లో చిన్న మాట కూడా అనేవారు కాదు, కొట్టడం అసలే వుండదు. పైగా “అమ్మా, నీకు ఏ ప్రసాదం ఇష్టం?” వినయంగా భక్తి ప్రపత్తులతో అడిగేవారు. ఈ మాటల్లో భక్తి కన్నా వారిలో భయమే ఎక్కువగా కనిపించేది. వారి మాటల్లో, అమ్మవారికి (మాకు) పూజ కార్యక్రమల నిర్వహణ కోసం, ఊరి నుండి, జానకి, మునెవ్యలు రెక్కలు కట్టుకొని వాలిపోయేవారు. ఈ పూజ తంతు నిర్వహించడం వింతగా ఉన్నా ఏదో తెలియని ఆనందం, అస్తమానం చీవాట్లు పెట్టే పేరెంట్స్‌తో, ఇలా వంగి వంగి దణ్ణాలు పెట్టించుకోవడం థ్రిల్.
అందుకే ఇంట్లో, బడిలో ఎవరికి అనారోగ్యం వచ్చినా, మాకు రావాలని ఎవరికి వారు మనస్ఫూర్తిగా కోరుకొనేవారం. బ్రెడ్, పాలు, హోటల్ ఇడ్లీ సాంబారు, జ్వరం పుణ్యాన, అదనం.
ఓటేరు కాలవంటే కూడా ఇష్టమే, వర్షం నీరు నిండుగా ప్రవహించి బడికెళ్ళాడానికి అడ్డుపడినందుకు. మమల్ని ఇంటికే పరిమితం చేసి ఆనందపరిచే జడివాన కూడా ఇష్టమే.
గడ్డితో కప్పిన అద్దె పూరిళ్ళే మా అందమైన పాఠశాలలు. వానాకాలంలో మట్టి పలక క్లీన్ చేసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉండేది. కప్పు నుండి కారే నీటి ధారలతో శుభ్రం! ఎండైతే సమయకాలన్నిబట్టి వృత్త, దీర్ఘ వృత్తాకారంలో అచ్చంగా సర్కస్‍లో పడే స్పాట్‌లైట్లా, పైకప్పు నుండి దూరివచ్చే సూర్యకిరణాల్ని, బలపంతో గుర్తుపెట్టి సూక్ష్మంగా వాటి గమనాన్ని గమనించేవారం. చదువు మీద ఆసక్తి లేని పిలకాయలకి, ఇదో టైంపాస్!
స్వేచ్ఛగా ఒకరి భుజాలు ఒకరు నులకమంచం దారంలా పెనవేసుకొని కథలు చెప్పుకుంటూ బడికి, యే ఒకరిద్దరో సినిమా సూసొచ్చినోడు, బడంతా తెలిసేలా దండోర వేసి వేసి గొప్పగా చెప్పేవాడు. మిగతా పిలకాయలం వాడి చుట్టూ మూగేవారం, కథ కోసం.
వాల్‌పోస్టర్ కనిపిస్తే ఆ సన్నివేశాన్ని అడిగి మరీ చెప్పించుకొని సినిమా చూసిన ఫీల్‍తో కాసంత తృప్తి చెందేవాళ్ళం. హీరో చేసే ఫైట్స్, డిష్యుం, డిష్యుం, నోటితో లయబద్ధమైన మ్యూజిక్ తో సహా.. ఇక కల్పిత కథలైతే అంతులేని కథలా, చాలాకాలం కొనసాగేవి.. జోబిలోని తినుబండారాల్ని ఆస్వాదిస్తూ దిక్కులన్నిపరికిస్తూ.., అప్పటికింకా మా బుర్రలో కులం మతం ప్రాంత భేదాల పాషాణం తలకెక్కలా. మార్గమధ్యంలో, గారడీ అన్న చేసే మాయ మర్మాలు., వీధి సర్కస్‌లో కోతి విన్యాసాలు, బుట్టలోని నాగుపాము పడగ విప్పి చేసే నాట్యాలు, గంగిరెద్దులాటల్ని ఆసక్తి, వింతగా తిలకిస్తూ – తొమ్మిది, పదవ తరగతిలో మాత్రమే ముగ్గురు కూచునే ఎత్తైన బెంచీలకి వచ్చాం. అప్పటిదాకా గరకు నేలపైనే, అయినా మాకెప్పుడు నడుమునొప్పి, ముడ్డి నొప్పిలాంటి అసౌకర్యాలు కలగలా! కాకపోతే వున్న కొద్దిపాటి నిక్కర్లు నేలకేసి దోకడం వల్ల కుడిఎడమ ముడ్డి మీద పెద్ద సైజు బొక్కలు కనిపించేవి వృత్తాకారంలో.
చెప్పులడిగితే పైతరగతికి వెళితే కొనిస్తామంటూ తొమ్మిది, పదవ తరగతి వరకు నెట్టుకొంటు వచ్చేవారు. ఉన్న చెప్పులు పాడైపోతే కొత్తవి మరెప్పుడో, సుదీర్ఘ కాలం అరిగిపోయి చిరిగి, సగం పాదం మట్టిని తాకేవి, పట్టి తెగిపోతే పెండ్లి మండపం దగ్గరున్న బర్మా చెప్పులంగట్లో కొత్త పట్టి మార్చడం (చిల్లరుంటే) లేదంటే, మొలతాడులో వేలాడుతున్న సేఫ్టీ పిన్ తగిలించి మరికొంత కాలం, పూర్తిగా శిథిలమయేదాకా వాడడం. అప్పుడు మాత్రమే రబ్బరు చెప్పుల విడిచిపెట్టేవాళ్ళం. మరికొంతమందికి అసలు చెప్పులుండేవి కావు.
ఖరీదైన నీళ్ళ బాటిల్స్, అందమైన స్నాక్స్ బాక్సుల ఆనవాళ్ళే తెలియదాయే. దప్పికైతే బడి పక్కనున్న ఇళ్లళ్ళో, “అక్కా నీళ్ళు” అని అడిగి తాగడం, ఇంటర్వెల్‌లో తప్పనిసరి. అందుకు వారు కూడా సిద్ధంగా ఉండేవారు పెద్ద
ఇత్తడి నీళ్ళ చెంబుతో. ఎంతటి వయోవృద్దులైనా, అక్క, అన్న సంభోదనే. వారి వయసును బట్టి పిలవాలనే కనీస జ్ఞానం మాలో ఎవరికి లేదు.
సమాచార పౌరసంబంధ శాఖ రాత్రి వీధుల్లో ప్రదర్శించే బ్లాక్ అండ్ వైట్ డాక్యుమెంటరీలు; ముఖ్యంగా వ్యవసాయ మెలకువలు, ఆర్మీ విన్యాసాలు, దేశ రాజకీయ ప్రధానఘట్టాలు ప్రదర్శించడం, సినిమాలా ఇంట్రెస్ట్ లేక, బోరుగా ఉన్నా ఉచితం కాబట్టి కాసేపు కాలక్షేపం చేసేవారం.
“రెండకట్ల రెండు, రెండురెండ్ల నాలుగు” ఇప్పటికీ నా చెవిలో మారుమోగుతోంది. గంగిరావి చెట్టుకింద ఎదురుగా కుర్చీలో మీనాక్షి మేడమ్ బెత్తంతో! మా ప్రాథమిక పాఠశాల టీచర్లు, సుబ్బరాయులు సారు, కావమ్మ, సుభద్రమ్మ, జయలక్ష్మి, మీనాక్షి మేడంలు.
అయ్యోరి కుర్చీ మారింది, చదువులు మారాయి, అయ్యోరు విద్యార్థుల మనస్తత్వం కూడా! కాకపోతే గతంలా భయం వీడి, వీరి మధ్య బంధం బలపడింది; కులం అనే విడదీయరాని గాఢ బంధం!!
***
శ్రీకాళహస్తి సంతమైదానం (గతంలో కావమ్మగుడి వీధిలో) అద్దాల మేడ, బంగారు సంకెళ్లు లేని అందమైన నా ప్రాథమిక పాఠశాలకు.. ప్రేమతో!!
