Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బామ్మ – బంగారం

[శ్రీమతి అక్షర రాసిన ‘బామ్మ – బంగారం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

మా బామ్మ దగ్గర బోలెడు నగలు ఉండేవని వినికిడి. నేను మా బామ్మకు రెండో కొడుక్కి కూతుర్ని. మా అక్క- చెల్లీ, అన్నా- తమ్ముళ్లు ఎవరూ కూడా ఆ నగల గురించి మా అమ్మా, పింతల్లి, దొడ్డమ్మలు రకరకాలుగా చెప్పుకోవటం, చెవులు కొరుక్కోవటం వినటమే కానీ చూసి ఎరగము. విని ఊహించుకున్నాము. ఆవిడ దగ్గర బంగారంలో లేని నగ అంటూ లేదుట. ఆవిడ నగలు మా అమ్మ తరం వారికి ఒక చర్చనీయాంశం ఎందుకు అయిందంటే మా తాతగారి హయాంలో మా బామ్మ ఒంటి నిండా ఆ నగలు పెట్టుకుని దర్జాగా తీయించుకున్న ఫోటోలు నిదర్శనంగా మేమందరం చూసాము. కానీ నాకు బుద్ధి ఎరిగిన దగ్గరనుండి ఆవిడను తెల్లటి వస్త్రాల్లోనే చూసాము తప్ప ఒంటి మీద ఒక్క నగ ఏనాడూ చూసి ఎరగము. మరి అంత బంగారం ఆవిడ ఎక్కడ దాచి పెట్టుకుందో బ్రహ్మ రహస్యమై కూర్చుంది. ఆ రహస్యం ఆవిడ తన సంతానం తోనే పంచుకోలేదు మరి కోడళ్ళని నమ్ముతుందా?

ఆవిడ, తన తరవాత ఆ బంగారం ఎవరికి ఎలా పంచి పెడుతుందా అని అందరూ ఎవరికి తోచినట్టు వారు ఊహాగానం చేసుకోవటం నేను చూశాను. ఆవిడ బంధువర్గంలో నమ్మిన వారికి ఏమైనా చెప్పి ఉంచారేమో అంత కంటే తెలీని విషయం. ఆవిడ నోటికి భయపడి హాస్యానికైనా ఈ విషయం ఆవిడ ఎదుట ఎవరూ ఎత్తేవారం కాదు.

మా బామ్మ దగ్గర ఒక గమ్మత్తైన ఇనప పెట్టి ఉండటం మేము ఎరిగిన  విషయం. అది ఆవిడ ఖజానా. ఎక్కడకు వెళ్ళినా అది వెంట లేకుండా ఉండేది కాదు. అది తమాషాగా రెండు వేపుల్నుంచీ తెరుచుకునేది. తెరవాలంటే మాత్రం మా బామ్మ నలువైపులా పరీక్షగా తనని ఎవరూ గమనించటం లేదు కదాని చూసి గోడ వైపు తిరిగి తెరిచి పని ముగించుకుని చాలా జాగర్త వహించేది. అందుకే మాకు అనుమానం కాదు, దృఢమైన విశ్వాసం ఆవిడ నగలు మొత్తం ఆ పెట్టిలో లేక పోయినా వాటి తాలూకు రహస్యం తప్పక అందులో ఉండి ఉంటుందని. మాలో ఎవరైనా దాని మీద వేలు వేసినా ఒప్పుకునేది కాదు. ఆ పెట్టి ఆవిడ పంచ ప్రాణాలు.

మా బామ్మ ఆరుగురు అక్క చెల్లెలు. ఎవరికి లేని గయ్యాళితనం నోటి దురద ఈవిడకే రావటంతో ఆవిడకు మిత్రులకంటే శత్రువులే ఎక్కువ. ఈవిడ బంగారం విషయం వారి తోబోట్టువులకి తెలుసునేమో అన్న అనుమానం రాకపోలేదు మా అమ్మా వాళ్ళకి. కానీ ఎవర్ని ఎలా అడగాలో తెలీక ఊరుకున్నారు. అమ్మ ముగ్గురు తోడికోడల్లో చిన్నావిడ అనగా మా పింతల్లి అంటే బామ్మ కొంచెం అభిమానం చూపించటంతో అందరూ తీర్మానించేసుకున్నారు ఆఖర్లో బామ్మ తన చిన్న కొడలి చేతుల్లోనే తన సొమ్ము అంతా  పెడుతుందని. మాకు పాపం ఒక నోరు లేని అత్త కూడా ఉంది. ఒక సందర్భంలో మా అత్తతో, తన కన్యాదానం అప్పుడే పెట్టవల్సిందంతా పెట్టేశాను ఇంకేమీ తన దగ్గర్నుంచి ఆశించవద్దని అందరి ముందూ బాహాటంగా చెప్పేశారు ఆవిడ. తను ఆశించినంత పెద్ద ఉద్యోగస్థుడు కానందున మా అత్త-మావ అంటే ఆవిడకు చులకన. అందువల్ల తన బంగారంలో ఒక చిన్న భాగం అయినా ఆ కూతురికి అంటే మా అత్తకి పెడుతుందని ఎవరూ అనుకోలేదు.

మా నాన్నగారు చెప్పారు ఒకసారి -వెనకటికి ఒకావిడ తన పెద్ద వయస్సులో తన కొడుకు కోడలి పై నమ్మకం లేక తన సొమ్ము అంతా పొరుగింటి పుల్లమ్మ దగ్గర దాచుకుందట, ఒక నోటూ పత్రం లేకుండానే. పోయే ముందు ఆవిడ మతి స్తిమితం లేక ఎవరికి ఏమీ చెప్పే స్థితిలో లేక పోయారుట. వీరికి తెలిసిన విషయమే అయినా ఏ రుజువూ లేక ఆ సొమ్ము అంతా వదులుకోవాల్సి వచ్చిందిట.

“ఆవిడేవరో ఎందుకు? రేపు మీ అమ్మగారు కూడా అటువంటి పనే చేసెట్టు ఉన్నారు, చూసుకోండి.” అంది అమ్మ అక్కసు కొద్దీ.

“పోనిలేవే మనకి ప్రాప్తం ఉంటే ఎక్కడ దాచినా మనకు దక్కుతుంది. లేకపోయినా మనం చేయగలిగింది ఏమీలేదు.” అన్నారు మా నాన్నగారు మహా వేదాంతిలా.

“అసలు మీరందరూ అలా ఊహాగానం చేసుకుంటున్నారు కానీ ఆవిడ ఎప్పుడో తన అవసరాలకి బంగారం అమ్మేసి ఉండొచ్చును కదా?” అని ఒక కొత్త కోణం చూపించారు. ఎందుకో నాకు నాన్నగారు అడిగినది నిజమే అనిపించింది. లేకపోతే బామ్మ అన్ని నగలు కుటుంబంలోఎవరికీ తెలీకుండా ఎన్నాళ్ళు, ఎక్కడ దాచి ఉంచగలదు!!

***

ముగ్గురు కొడుకుల దగ్గర వంతుల వారీగా వెళ్ళి ఉండి ఒక దగ్గర ఎవరిపై అయినా కోపం వచ్చినప్పుడు మరో కొడుకు దగ్గరకు వెళ్ళి ఉండేది బామ్మ. తన ఇష్ట ప్రకారం ఆవిడ ఒక దగ్గర్నుంచి ఇంకో దగ్గరకు వెళ్ళిపోయేది, అంతే  కానీ ప్రేమాభిమానంగా వచ్చి తమతో ఉండమని ఎవరూ ఆహ్వానించేవారు కాదు, ఆ నోటి దురుసు కారణంగా. ఆఖరకు విసుగేసి తను పుట్టి పెరిగిన ఊరు కొల్లూరులో చిన్న ఇల్లు చూసుకుని ఒక్కర్తీ ఉంటూ జీవన యాపన చేయటానికి నిర్ణయించుకుంది. మా బాబాయి వెంట వెళ్ళి సదుపాయంగా ఉన్న ఇల్లు చూసి పెట్టి, ఆవిడకు కావాల్సినవి అమర్చి పెట్టి, దూరపు బంధువు అంతకు మించి శ్రేయాభిలాషి అయిన వెంకటాద్రి గారితో, మధ్య మధ్య బామ్మను చూసి వస్తూండమని అప్ప చెప్పి వచ్చారు. వెంట తన చిన్న ఇనప పెట్టితో, మరో పెట్టిలో తన బట్టలు పెట్టుకుని వెళ్లిన  ఆవిడ ఓ పదిహేనేళ్లు హాయిగా ఒక్కర్తీ కాలం గడిపింది ఆ రోజుల్లోనే. ముగ్గురు కొడుకులు వంతుల వారీగా ఆవిడ ఖర్చుల కోసం కొంత సొమ్ము పంపిస్తూ ఉండేవారు. ఈ మధ్యలో ఎక్కడ ఏ పెళ్లి పేరంటం ఉన్నా వెళ్ళి వచ్చేది బామ్మ. మా మావయ్య కొడుకు అనగా బామ్మ పెద్ద మనవడి పెళ్ళికి వచ్చి వధువుకి తన మూడు పేట్ల చంద్రహారం కానుకగా ఇవ్వటం చూసి మా అమ్మా వాళ్ళు మళ్ళీ చెవులు కోరుక్కున్నారు – ‘బహుశా బంగారం అంతా  ఆవిడ తన మనవళ్లూ మనవరాల కోసం ఉంచింద’ని. కానీ ఆ తరువాత ఏ పెళ్లికి అలాంటి విశేషం గోచరించక పోయేసరికి అందరికీ అర్థం అయింది – ‘ఓహో బామ్మకి పెద్ద మనవడంటే విశేషమైన అభిమానం’ అని. మిగతా మనవలకి అందులో హక్కు లేదని.

బామ్మకి ఎనభయ్య తొమ్మిదో ఏట వెంకటాద్రిగారి దగ్గర నుంచి ‘బామ్మ మంచం  మీద నుంచి లేవలేక పోతున్నది వచ్చి తీసుకు వెళ్ళ’మని కబురు వస్తే మళ్ళీ మా చిన్న బాబాయి వెళ్ళి ఆవిడను తీసుకు వచ్చారు. ఇంకేముంది? మా అమ్మా దొడ్డమ్మా నిర్ధారణ చేసేసుకున్నారు “అదిగో చిన్నాడు బాగానే ప్లాన్ వేశాడు. ఆఖరి నాలుగు రోజులు ఏదో కొంత సేవ చేసి ఆవిడ బంగారం దోచేద్దామ్మని.” నా బుద్ధి ఎరిగన దగ్గర్నుంచీ వింటూ ఉన్న కథ. ఇన్నాళకి ఇక ఊరుకుని ఉండలేక అన్నాను- “మరి ఇన్నాళూ నువ్వేందుకు ఊరుకున్నావమ్మా? ముందే ఆవిడను దగ్గర ఉంచుకుని సేవ చేసి ఉంటే నీకే పెట్టేదేమూ కదా బామ్మ ఆ బంగారం?” నేను అలా అడిగానని అమ్మ నాలుగు రోజులు నాతో మాట్లాడలేదు.

***

చిన్న కొడుకు దగ్గరకు వచ్చాక ఒక ఏడాది మంచం పై తీసుకుని, తీసుకుని  కన్ను మూసింది బామ్మ. ముగ్గురు కొడుకులి కుటుంబాలే కాకుండా దగ్గర బంధువులు అందరూ వచ్చి వెళ్లారు. మిగతా బంధువులు వెళ్ళిపోయాక, బామ్మ సంతానం వారి సంతానమే మిగిలాము. మా అందరిలో అందరి కంటే చిన్నవాడూ అల్లరివాడైన గోవిందు బామ్మ ప్రాణమైన ఇనప పెట్టి తెచ్చి మధ్యలో పెట్టి తెరిచి చూదామ్మా అని అడిగాడు అందరినీ. వెంటనే మరో ప్రశ్న “మరి దాని తాళాలు?” తాళం పగలకొట్టాలి అన్ననిర్ణయానికి వచ్చారు అందరూ. “ఇంకా నేను కన్ను మూసి పట్టుమని పదిహేను రోజులైనా అవలేదు, ‘మీ దుంపలు తెగా’ అప్పుడే నా ప్రాణపదమైన పెట్టి పగల కొట్టటానికి మీకు చేతులు ఎలా  వచ్చాయర్రా పాపాత్ములారా!!” అని బామ్మ ఆత్మ ఘోషించదా? అనుకున్నాకానీ మిగతా సంశయాలని, వివేకాన్ని, విచక్షణని ఇంత కాలం నుంచి అణిగి ఉన్న కుతూహలం జయించింది. అందరి సమక్షంలో పెట్టి తాళం పగలగొట్టారు. ఏం లాభం! మా జీవితంలో ఎవరూ ఎన్నడూ చెందనంత నిరాశ నిస్పృహ ఆ క్షణంలో చెందాం. అందులో నగలు ఉండవని మాకు తెలుసు. కనీసం ఒక ఉత్తరం ముక్కో ఒక తాళం చేవో ఉంటుంది ఏమో అనుకున్నాము. ‘ఇంత కాలం నుంచీ ఎంతలా మమ్మల్ని ఫూల్స్ ని చేసావే బామ్మా’ అనుకున్నా. ఉస్సురుమంటూ అందరూ ఇక ఆ నగల మాట మర్చిపోయి ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిదన్నఒకరకమైన నిరాశాజనకమైన నిర్ణయానికి వచ్చేశాము. పన్నెండవ రోజు బయట గేటు చప్పుడు విని చూస్తే వెంకటాద్రిగారు లోపలికి వస్తూ కనిపించారు.

“ఏమీ అనుకోకురా కబురు తెలిసి ఇన్ని దినాలకు వచ్చినందుకు. ఈ రోజు కూడా మీ అమ్మ నా మీద పెద్ద బాధ్యత మోపి వెళ్లినందుకు ఎలాగో వీలు చూసుకుని వచ్చాను. భోజనం చేసి నా బాధ్యత తీర్చుకుని సాయంకాలం బండికి తిరిగి వెళి పోతాను రా” అన్నారాయన బాబాయితో.

‘అంత పెద్ద బాధ్యత ఆయనపై ఏం వేసి ఉంటుందా!!!’ అనుకుంటున్నారు అందరూ మనసులో పైకి చెప్పక పోయినా. పిల్లలతో సహా అందరి భోజనాలు అయ్యాక అందరినీ ముందు హాల్లోకి పిలిచి కూర్చోమని చెప్పి సెంటర్  టేబుల్ మీద ఒక మూట ఉంచారు వెంకటాద్రిగారు.

“మీ అమ్మ, బాబాయిగారు అనగా మీ నాన్నగారు పోయిన కొత్తలోనే మా నాన్నగారిని పిలిపించి ఈ సొమ్మువారికి అప్పగించారు. ఆయన పోతూ పోతూ ఆ బాధ్యత వారసత్వంగా నాకు ఇచ్చి పోయారు. కొల్లూరు వచ్చి స్థిరపడ్డాక ఆ బాధ్యత తిరిగి ఆవిడకే అప్పచెపుదామని వెళ్ళాను కానీ తన దగ్గర ఉంచుకుంటే ప్రమాదం అని, నేను ఎంత వద్దని మొత్తుకున్నా వినిపించుకోలేదు. ఆవిడ బ్రతికి ఉన్నప్పుడే ఆవిడ ఎదుటే ఈ సొమ్ము మీకు అప్పచెపుదామనుకుంటే నా పనులలో నాకు కుదిరింది కాదు..” అంటూ మూట విప్పారు ఆయన. ‘ఇక వాటి మాట మర్చిపోదామన్న నిర్ణయానికి వచ్చాక మళ్ళీ కథలో ఇదేం మలుపు రా బాబూ!!’ అనుకున్నా. బహుశా అందరి మనసులో అదే ప్రశ్న మొలకెత్తి  ఒకర్ని ఒకరు చూసుకుంటున్నాము. మూట విప్పిన వెంటనే  అందులో మా వాళ్ళు అనుకుంటున్న నగల కుప్ప కనిపించింది అందరికీ.

“ఇదిగోరా, మీరు నన్ను నమ్మినా అనుమానించినా మీ అమ్మ నన్ను నమ్మి ఈ సొమ్ము నాకు జాగర్తగా దగ్గర పెట్టుకోమని ఉంచినందుకు, నా దృష్టిలో దానికి వారసులయిన ఆవిడ మనవళ్లకి చెందుతుందని నా అభిప్రాయం. ఇటువంటి సమయంలో అందరూ ఒక దగ్గర ఉంటారని ఎలాగో వీలు చూసుకుని నా బాధ్యత నెరవేర్చుకుందామని ఇలా వచ్చా. ఇక ఇది మీ అందరి సొత్తు. ఇది మీరు ఎలా పంచుకుంటారో మీ ఇష్టం.” అని తను చెప్పాల్సింది ముగించారు వెంకటాద్రిగారు.

వింటున్నది కంటునది నిజమేనా అన్నట్లు మేమందరమూ ఒకరి వేపు ఒకరు చూస్తున్నాము. ఇంట్లోవారిని ఎవర్నీ నమ్మకుండా మా బామ్మ మేము సందేహించినట్టుగానే తన బంధువు దగ్గర తన సొమ్ము దాచి పెట్టుకున్నది. నిజానికి వెంకటాద్రి గారు స్వయంగా వచ్చి అది మాకు అప్పచెప్పి ఉండకపోతే ఆయన్ను అడిగేవారు ఎవరూ లేరు. ఆయనలో ఉన్న నిజాయితీ, మానవత్వ విలువలకి చేతులెత్తి దణ్ణం పెట్టాలి. మనిషిలో ఇంకా ఇంత ధర్మం ఉండబట్టే ఈ భూమి ఇలా నిలబడి ఉన్నది కదా!!! ‘మూడో కంటికి తెలీనీకుండా ఇన్నాళూ ఎంత చక్కగా దాచిపెట్టవే బామ్మా ఇంత బంగారం!!!!’ అని అబ్బుర పడ్డాను.

***

నాకూ మా చెల్లి వంతు వచ్చిన చెరో వంకీ తీసుకెళ్లి మా అమ్మకి అప్పగించి “మాకు కావల్సినప్పుడు అడిగి తీసుకుంటాములే అప్పటివరకూ నువు పెట్టుకో” అని అమ్మ చెరో చేతికి వంకీ ఎక్కించాము.

“ఏమోనే మీ బామ్మ నా చేతికి ఉన్న తన వంకీలు చూసి రాత్రి కలలోకి వచ్చి తిట్టదు కదా!!” అంటూనే  అద్దంలో వంకీలతో కూడిన తన చేతుల్ని చూసుకుని మురిసిపోతున్న మా అమ్మను చూసి నేను చెల్లి  ఒకర్ని ఒకరు చూసుకుని నవ్వుకుంటూ కనుబొమలు ఎగరేసుకున్నాము.

Exit mobile version