[శ్రీ పాలకుర్తి రామమూర్తి రచించిన ‘బాధ్యత అప్పగింత నుండి కార్యసాధన వరకు..’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
శ్రీ కంకంటి పాపరాజుగారు వ్రాసిన ఉత్తర రామాయణంలో చిన్న సంఘటనను పరిశీలిస్తే ఉదాత్తమైన సార్వకాలిక సత్యం ఒకటి దర్శనమిస్తుంది.
ఒకనాడు శ్రీరాముడు సభదీరి యున్నాడు. ఆ సమయంలో చ్యవనుడు మొదలైన కొందరు ఋషులు వచ్చారు. వారి ఆగమన వార్త తెలిసి తానే ఎదురేగి వారిని స్వాగతించి, వచ్చిన కార్యమేమిటో తెలుపుమని వారిని అడిగాడు రాముడు.
వారు ఈ విధంగా చెపుతారు. ఒకసారి ‘మధు’డనే అసురుడు ఘోరమైన తపస్సుచేయగా శివుడు ప్రత్యక్షమై అతనికి ఒక త్రిశూలాన్ని సృజించి యిచ్చాడు. దాని మహిమను గూర్చి చెపుతూ శివుడు “ఇది నీవు ప్రయోగించగా శత్రువు ఎంతటి భయంకరుడైనా వానిని గెలిచి తిరిగి నిన్ను చేరుకుంటుంది. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. నీ మనసులో ధర్మము మరిస్తే అది నీ వద్దనుండి నన్ను చేరుకుంటుంది”, అంటూ శివుడు హెచ్చరించి త్రిశూలాన్ని ‘మధు’కు ఇస్తాడు. దానిని ధరించిన మధు అది తన కుమారునికి కూడా ప్రయోజనకారిగా ఉండేట్లుగా వరాన్ని పొందుతాడు. దాని లక్షణం “ఎంతవరకైతే అది తన చేతులో ఉంటుందో అంత వరకు శత్రువులను జయిస్తాడు. యుద్ధ సమయంలో శూలాన్ని మరిచి తీసుకువెళ్ళకపోతే మాత్రం శత్రువుచేత హతుడవుతాడు” అంటూ శివుడు హెచ్చరించి అంతర్ధానమవుతాడు. ఇక్కడ సార్వకాలిక అంశాన్ని గుర్తించాలి. కాలమేదయినా శక్తి ధర్మబద్ధమైతే విజయం.. కాకపోతే అపజయమే.
దీనిని ఆధునిక సమాజంలో ఒక పారిశ్రామికవేత్త తన జీవితమంతా శ్రమించి ఒక పరిశ్రమను స్థాపించాడనుకుందాము. దానికి ఉత్తముడూ, మార్గదర్శకుడూ, సలహాదారుడూ, గురువుయైన వ్యక్తి కారణమూ ప్రేరణ అయినాడని అనుకుందాము. ప్రేరణనిచ్చిన వ్యక్తి నిర్వహణలో కొన్ని మార్గదర్శకాలను చెపుతూ.. అత్యాశకు వెళ్ళి ఫలితాలే కావాలని అధర్మమార్గంలో చరిస్తే అపజయం వరిస్తుందనీ.. ప్రక్రియ ఆధారంగా ధర్మమార్గంలో చరిస్తే ఉత్తమఫలితాలను అందుకుంటావని చేసిన హెచ్చరికగా భావించవచ్చు. ఆధునిక దృష్టికోణంలో చూస్తే ధర్మమార్గం ప్రక్రియ ఆధారితమని, అధర్మం ఫలితాల ఆధారితమని అనుకుందాము.
తదుపరి ‘మధు’ ఆ శూలాన్ని తన కుమారుడైన ‘లవణు’డనే వానికి అప్పగించి ధర్మమార్గాన్ని తప్పకుండా ఉండాలని, యుద్ధానికి వెళ్ళే సమయంలో ఏనాడూ త్రిశూలాన్ని మరచి వెళ్లవద్దని హెచ్చరించి తాను తపస్సుకై వెళతాడు. లవణుడు శంకరుడు ఇచ్చిన త్రిశూలబల గర్వంతో, హింసామార్గంలో ప్రవర్తిస్తూ, భౌతిక సుఖాలలో ఓలలాడుతూ, దుర్మార్గవర్తనుడై ప్రజలను హింసిస్తూ అరాచకం సృష్టిస్తూ ఉన్నాడు. అతనిని వధించి ప్రజలకు శాంతిని ప్రసాదించాలని ఋషులు రాముని కోరుతారు.
దానికి రాముడు తప్పక అతనిని సంహరిస్తానని చెపుతూ “లవణాసురుని ఆహారవిహారాలు, ఆచారవ్యవహారాల గురించిన సమాచారం ఇవ్వండి” అని అడిగి తెలుసుకుంటాడు. ఆహారవిహారాలు, ఆచారవ్యవహారాల గురించిన సమాచారం తెలుసుకోవడం అంటే శత్రువు బలాబలాలను సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం. తదుపరి రాముడు శత్రఘ్నునికి లవణాసుర వధ బాధ్యతను అప్పగిస్తూ, “శత్రువును గెలిచి ఆ రాజ్యాన్ని నీవే పాలించు” అంటూ యుద్ధానికి వెళ్ళేందుకు అవసరమైన సన్నాహాలు ముందు జాగ్రత్త చర్యల గురించి చెపుతాడు. అంతేకాదు, ఆ సభలోనే శత్రుఘ్నునికి లవణుని రాజ్యమైన ‘మధుపట్టణానికి’ రాజుగా ప్రకటించి, పట్టాభిషేకం చేస్తాడు. అలా చేయడం వల్ల ఆ కార్య నిర్వహణ వల్ల తనకు లభించే ప్రయోజనం ఏమిటి? అని అధికారి నిర్ణయించుకోవడమే కాక ఆ ప్రయోజనం అతనికి ప్రేరణగానూ పనిచేస్తుంది.
శత్రుఘ్నునికి బాధ్యతను అప్పగించే సమయంలో రాముడు.. అత్యంత గొప్పనైన ఒక అస్త్రాన్ని ఇస్తూ.. దాని ఔన్నత్యాన్ని చెపుతాడు. అది బ్రహ్మదేవుడు సృజించాడని, దానిని వినియోగించి విష్ణువు మధుకైటభులను వధించాడని, “ఆ అస్త్రం నాకు లభించింది. దానిని నీకిస్తాను. అది నీ వద్ద ఉంటే లవణాసురుడే కాదు ఎవరు ఎదురుగా ఉన్నా విజయాన్ని సాధించగలవు”, అంటూ ఆ అస్త్రాన్ని ఇస్తాడు.
ఈ సందర్భంలో బాధ్యతను అప్పగించడమే కాక, అవసరమైన వనరులు, వసతులను అప్పగించడం, శత్రువు బలాబలాలను తెలియచెప్పడం, ఎదురవబోయే అడ్డంకులు, తమకున్న అవకాశాలను వివరించడం.. ఇలా పలు విషయాలను వివరించడం కనిపిస్తుంది. నిజానికి యుద్ధంలో విజయానికి సైనికుల బలం ముఖ్యమైనదే కాని వనరులు, వసతులు, వస్తు సరఫరా, మానవ వనరుల నిర్వహణ, సమాచారం, సమయం, రహస్యత, సైనికుల సంతృప్తి లాంటి విస్తృతమైన అంశాలు కూడా ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి నాయకుడు ఒకరికి బాధ్యతను అప్పగించే సమయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, అవసరమైన వనరులు, సమాచారాన్ని అందించాలి. కార్యనిర్వహణకు అవసరమైన స్వేచ్ఛను కూడా ఆ అధికారికి ఇవ్వాలి.
యుద్ధానికి వెళ్ళే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ.. “శత్రువు చేతిలో త్రిశూలం ఉన్న సమయంలో వానిని ఓడించడం అసంభవం కాబట్టి వాని చేతిలో శూలం ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళవద్దు. శూలం చేతిలో లేకుండా ఒంటరిగా ఏమరుపాటుతో ఉన్న సమయంలో వానిని ఒక్కసారిగా ఊపిరి సలపనీయకుండా చుట్టుముట్టి వధించాలి. పట్టణానికి వెలుపలకు శూలంలేకుండా వచ్చే సమయంవరకు నిరీక్షించాలి. ఒకసారి శత్రువు చేతికి చిక్కితే అతడు పట్టణానికి పారిపోయే ప్రయత్నం చేసేలోపే వాడిని అంతం చేయాలి”, అంటాడు.
ఇక సైన్య సన్నద్ధత గూర్చి చెపుతూ.. నాలుగువేల బలమైన గుర్రాలను, పటిష్టమైన రెండువేల రథాలను, వేయి ఏనుగులను, పదివేలమంది సుశిక్షితులైన వీరభటులను తీసుకువెళ్ళమని చెపుతాడు. వారితో పాటుగా కవులను, నటులను, గాయకులను, వందిమాగధులను తీసుకువెళ్ళమని చెపుతాడు. వీరెందుకు? అంటే.. వీరి ద్వారా సైనికులు ఉత్తేజితులు కావడమే కాక వారిలో మనోబలమూ హెచ్చవుతుంది. వీరికి అదనంగా ‘ఉరవ్యుల’ను (వైశ్యులను) కూడా తీసుకువెళ్ళంటాడు. అక్కడి ఖర్చులకు లక్షవరహాలను తీసుకువెళ్ళమని చెపుతాడు.
అయితే.. యుద్ధానికి వెళ్ళేందుకు కత్తిపట్టి యుద్ధం చేయగలిగిన సైనికులు అవసరం అవుతారు. కాని వైశ్యులతో పనియేమిటి? అంటే.. యుద్ధం చేసే వారితో పాటు యుద్ధాన్ని కొనసాగించే సామాజిక, ఆర్థిక వ్యవస్థ కూడా అవసరమని భావించాలి.
ప్రాచీన కాలమైనా, ఆధునిక కాలమైనా.. యుద్ధం అంటే కేవలం కత్తులు పట్టుకుని పోరాడే సైనికుల సమూహం మాత్రమే కాదు. సైన్యానికి ఆహారం, ఆయుధాలు, పశువులు, పశువుల దాణాయే కాక ఇతర వస్తు సరఫరాలు నిరంతరం సాగాలి. ప్రాచీన వర్ణవ్యవస్థలో వైశ్యుల ప్రధాన బాధ్యత వ్యవసాయం, పశుపోషణ, వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాలు. కాబట్టి యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే సైనికులు ఎంత ముఖ్యమో వాటి నిర్వహణావ్యవస్థ కూడా అంతే కీలకమైనది. యుద్ధం కేవలం అస్త్రశస్త్రబలం పైనే కాకుండా సరైన సమయంలో సరైన వ్యక్తులకు సమాచారంతో సహా ప్రతీదీ అందించాల్సిన అవసరం ఉంటుంది. ఆ సరఫరా వ్యవస్థ.. సైన్యానికి అవసరమైన ఆహారం, వస్తువులు, ధనం, రవాణాదులను సకాలంలో అందించడంలో విఫలమైతే యోధులెందురు ఉన్నా యుద్ధం కొనసాగదు. అందువల్ల వైశ్యులను తీసుకెళ్లడం అంటే వారి వృత్తికి సంబంధించిన సేవలనునిర్వహించడానికి సైన్యంతో పాటుగా తీసుకు వెళ్ళడంగా భావించాలి.
నిజానికి రాజ్యపాలనా వ్యవహారంలో విజయానికి కత్తిపట్టి యుద్ధంచేసే క్షత్రియుడు ఎంత ప్రధానమో యుద్ధాన్ని నడిపించే ఆర్థిక, సరఫరా వ్యవస్థకు తోడ్పడే వైశ్యుడు కూడా అంతే ముఖ్యుడనే ఆసక్తికరమైన అంశం గుర్తించాలి.
యుద్ధానికి వెళ్ళే శత్రుఘ్నునితో రాముడు.. “ధనలోభంతో భటులను అనాదరణ చేయవద్దు. అలాగని వారికి ఎక్కువ శ్రమను ఇచ్చి అలసట చెందే విధంగా కార్యప్రణాళికను రూపొందించవద్దు” అంటాడు. దానితో వారిలో ఒత్తిడి పెరిగిపోయి కార్యభంగం కావచ్చు. “రాజు యొక్క ధనాన్ని, రాజ్యాన్ని, దుర్గాన్ని సంరక్షించేవారు సైనికులే కాబట్టి వారిలో ఏ పరిస్థితిలోనూ అసంతృప్తిని పెంచవద్దు”, అంటాడు. “వారితో బాటుగా, యుద్ధంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతివ్యక్తినీ తగిన విధంగా సన్మానింపుము”, అంటాడు. ఇక్కడ రెండు అంశాలు ప్రధానమైనవి. మొదటి అందరినీ సన్మానించడం కాగా రెండవది ఎవరిని ఏ విధంగా సన్మానించాలో తెలిసి తగిన విధంగా సన్మానించాలి. అలాకాక అందరినీ ఒకే గాటన కట్టివేస్తే.. కొందరిలో అది అసంతృప్తికి కారణం కావచ్చు. అలాంటి సూక్ష్మమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచన చేస్తున్నాడు, రాముడు.
యుద్ధ సన్నద్ధతలో నీటి వసతి కల్పన ప్రధానమైనది. స్వఛ్ఛమైన నీరు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవాలి. శత్రువులు దానిని విషపూరితం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
సేనావాహిని పెద్దదిగా ఉంటే దానిని గుర్తించడం శత్రువులకు సులువవుతుంది. వారు అప్రమత్తులౌతారు. కాబట్టి సుశిక్షితులైన, ధైర్యవంతులైన, కార్యసాధకులైన, ఉత్సాహవంతులైన, దక్షులైన కొద్ది సైన్యంతో అత్యంత రహస్యంగా వెళ్ళి కార్యాన్ని సాధించుకొని రమ్మంటాడు.
మరొక ముఖ్యాంశాన్ని కూడా చెపుతాడు, రాముడు. ఎప్పుడైతే శత్రువును వధిస్తావో వెంటనే ఆ సమాచారాన్ని మాకు వేగంగా పంపించు. ఏ మాత్రం ఆలస్యమైనా ఇక్కడ మేమంతా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది, అంటాడు.
ఈ భాగాన్ని ఆధునికంగా విశ్లేషించుకుంటే.. ఇందులో..
పాపరాజుగారు, సరఫరా వ్యవస్థను ప్రస్తావిస్తాడు. దీనిని నేటి సంస్థలకు అన్వయించుకుంటే ఏ సంస్థలోనైనా ఉత్పత్తి చేసే వ్యక్తులే సంస్థను నడిపించరు. నాణ్యమైన ముడిసరుకుల సేకరణ, ఉత్పత్తి చేయడం, ఉత్పత్తులు నిల్వపరచడం, రవాణా, పంపిణీ వరకు మొత్తం సరఫరా వ్యవస్థ సమర్థంగా పనిచేసినప్పుడే సంస్థ విజయాన్ని సాధిస్తుంది అన్న ప్రాధమికాంశం స్పష్టమౌతున్నది.
అలాగే సరైన వ్యక్తులకు సరైన బాధ్యతలను అప్పగించడమే కాక వనరులు, వసతులను కల్పించడం అవసరం. ఒక సంస్థలో ప్రతి వ్యక్తిని ఒకే పనికి ఉపయోగించలేం. కోతి చెట్లెక్క గలుగుతుంది.. ఏనుగు ఎక్కలేదు. ఏనుగు బరువులు మోస్తుంది కాని కోతి మోయలేదు. అందుకే వ్యక్తి సామర్థ్యం, బాధ్యత, అవసరాన్ని బట్టి సరైన వ్యక్తిని సరైన స్థానంలో నియమించడమే సమర్థమైన నిర్వహణ అనే ఆధునిక యాజమాన్య నిర్వహణ సూత్రంతో దానిని అన్వయించుకోవచ్చు. ‘అర్హత మాత్రమే కాదు, సమర్థతను బట్టి బాధ్యత’ అనే భావనతో కూడా దీనిని చూడవచ్చు.
ఉద్యోగుల సంక్షేమం కూడా ప్రధానమన్న భావన. సైనికులకు అధిక శ్రమ కలిగించవద్దని, వారిని నిర్లక్ష్యం చేయవద్దని రాముడు చెప్పిన అంశం గుర్తించాలి. నిర్వాహకుడు లక్ష్యాన్ని సాధించడమే కాదు.. ఆ కార్య సాధనలో సహకరించే వ్యక్తుల శక్తిని, ఉత్సాహాన్ని, సంతృప్తిని కాపాడటం కూడా నిర్వహణలో భాగమే.
కార్య సాధనలో శ్రమించిన వ్యక్తులకు గుర్తింపు, ప్రోత్సాహం అవసరం.. ఎవరిని ఏ విధంగా సన్మానించాలో తెలిసి, తగిన విధంగా సన్మానించాలి. ఇది దాదాపుగా ఈనాటి సమర్థతను గుర్తించడంగా భావించవచ్చు. అందరికీ ఒకే రకమైన ప్రోత్సాహకాలను అందించడం కన్నా ఎవరి సేవ ఏమిటో గుర్తించి తగిన విధంగా గౌరవించడం వల్ల అందరినీ సంతృప్తి పరిచినట్లవుతుంది.
ముఖ్యంగా ప్రమాద నిర్వహణను చెప్పాడు, రాముడు. లవణాసురుని చేతిలో త్రిశూలం ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్లవద్దని, అతను శూలం లేకుండా ఒంటరిగా బయటకు వచ్చే సమయాన్ని గమనించాలని రాముడు చెప్పడం చాలా ముఖ్యమైన అంశం. శత్రువు తను సంపూర్ణ బలంతో సన్నద్ధుడై ఉన్నప్పుడు తొందరపడి చర్యకు దిగకుండా, అతని బలహీనతను గుర్తించి అనుకూలమైన సమయంలో అనువైన పద్ధతిని ఎంచుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. దానితో ప్రమాదాన్ని నివారించుకునే అవకాశంతో పాటుగా విజయాన్ని పొందే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. శత్రువు బలాన్ని అంచనా వేయకుండా చర్యకు దిగకపోవడం ప్రమాద నిర్వహణగా ఆధునిక యాజమాన్యం చెపుతుంది. ఇక్కడ రాముడు శత్రువు బలాన్ని మాత్రమే కాదు, అతని బలహీనతను కూడా గుర్తించాడు. దీనిని వ్యూహాత్మక ప్రణాళికా రచనకు ప్రతీకగా చెప్పుకోవచ్చు.
ఆధునిక నిర్వహణలోనూ ప్రత్యర్థి బలాబలాలను అంచనా వేసి, తగిన సమయాన్ని ఎంచుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించి విజయావకాశాలను పెంచుకోవచ్చు.
సమాచార నిర్వహణ.. విజయం సాధించిన వెంటనే సమాచారం పంపమన్న సూచన బలమైన ప్రతీకగా కనిపిస్తుంది. పనిని అప్పగించిన సమయంలో నాయకునిలోనూ ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా అది ప్రమాదకరమైన కార్యనిర్వహణ అయినప్పుడు. సమాచారం ఉండటం ఒక పార్శ్వం కాగా అది సరైన సమయంలో సరైన వ్యక్తికి చేరడం మరొక పార్శ్వం. నిర్ణయం తీసుకునే వ్యక్తికి సమాచారం ఆలస్యంగా చేరితే, మంచి సమాచారం కూడా ప్రయోజనాన్ని కోల్పోతుంది.
ఏ మాత్రం ఆలస్యమైనా ఇక్కడ మేమంతా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది అనడం గమనార్హం. ఇక్కడ రాముడు దేవుడన్న ఆధ్యాత్మిక భావనను పక్కనపెట్టి, ఈ ఘట్టాన్ని నాయకత్వ దృష్టికోణంలో చూస్తే, బాధ్యతను అప్పగించిన నాయకుడిలోనూ కార్యఫలితంపై ఆందోళన ఉండటం సహజమేననే అంశం కనిపిస్తుంది. నిజానికి ఒక సంస్థలో సమస్య వచ్చినప్పుడు సమాచారం దాచిపెట్టడం లేదా ఆలస్యం చేయడం సమస్యను మరింత జటిలం చేస్తుంది. వాస్తవ పరిస్థితిని సకాలంలో నిర్ణయం తీసుకునే బాధ్యత గలిగినవారికి తెలియజేయడం నిర్వాహకుని బాధ్యత.
సుశిక్షితులైన, ధైర్యవంతులైన, కార్యసాధకులైన, ఉత్సాహవంతులైన, దక్షులైన కొద్ది సైన్యంతో.. వెళ్ళడం అనేది ఈనాటి వ్యవస్థలలో ప్రధానంగా వినిపించే నినాదం. ‘పెద్ద బృందం మరియు సమర్థమైన బృందం’ మధ్య ఎంపిక చేయవలసి వస్తే సమర్థతకే ప్రాధాన్యత నివ్వాలి. అవసరమైన నైపుణ్యాలు కలిగిన సరైన బృందం ఉంటే తక్కువ వనరులతో కూడా లక్ష్యాన్ని సాధించవచ్చు. అవసరానికి మించిన మానవ వనరుల కంటే, అవసరమైన సామర్థ్యం కలిగిన మానవ వనరులే ముఖ్యం.. అనే భావనను ఇందులో గమనించవచ్చు.
సైనికులకు నీరు అందించడం, అది కలుషితం కాకుండా చూడడం ఏ సందర్భంలోనైనా మౌలిక వసతుల కల్పనకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఇవి యుద్ధంలో ప్రత్యక్షంగా కత్తి పట్టే పని కాకపోయినా, సైన్య సామర్థ్యాన్ని నిలబెట్టే మౌలిక వ్యవస్థలుగా భావించాలి. ఉద్యోగులు ఉండటం మాత్రమే సంస్థకు సరిపోదు; వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి.. అన్న భావనగా చూడవచ్చు.
ముగింపుగా.. రాముడు శత్రుఘ్నునికి కేవలం “వెళ్లి యుద్ధం చేయి” అనలేదు. శత్రువు చేతిలో శూలం ఉంటే ఏం చేయాలి? శూలం లేకుండా ఎప్పుడు బయటకు వస్తాడు? ఎప్పుడు దాడి చేయాలి? సైన్యం ఎలా ఉండాలి? నీటి వసతి ఎలా ఉండాలి? సైనికులను ఎలా చూసుకోవాలి? విజయం సాధించిన తరువాత సమాచారం ఎలా పంపాలి? ఈ అంశాలన్నీ యుద్ధానికి పంపే ముందే ఆలోచించి బాధ్యతను అప్పగించాడు. బాధ్యతను అప్పగించడం అంటే పని అప్పగించడం మాత్రమే కాకుండా ఆ పనిని విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన వనరులు, సమాచారం, అధికారాన్ని కూడా అప్పగించడం.. వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను రచించడమే కాక ముందుగానే “ఇలా జరిగితే ఏమి చేయాలి?” అనే అనేక పరిస్థితులను ఊహించి ప్రణాళిక రూపొందించాడు, అనుకోవాలి. అంతేకాక, మానవ వనరుల నిర్వహణ, సరఫరా వ్యవస్థ నిర్వహణ, ఆర్థిక నిర్వహణ, ప్రమాద నిర్వహణ, సమాచార నిర్వహణ, సమయ నిర్వహణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రతిభకు తగిన గుర్తింపు, మౌలిక సదుపాయాల నిర్వహణ, వ్యూహాత్మక ప్రణాళిక, అత్యవసర పరిస్థితుల ప్రణాళిక, సకాలంలో నిర్ణయం, సమాచార ప్రసారం ఇవన్నీ కూడా పరోక్షంగా తొంగిచూస్తున్న ఈనాటి ఆధునిక యాజమాన్య నిర్వహణాంశాలు.
అందుకే భారతీయ ప్రాచీన సాహిత్యం సార్వకాలిక సాహిత్యంగా కనిపిస్తుంది. కత్తి పట్టినవాడితో యుద్ధం జరుగుతుంది.. కానీ అతని వెనుక నిలిచిన సమర్థమైన వ్యవస్థ వల్లనే యుద్ధం కొనసాగుతుంది, విజయం సాధ్యపడుతుంది, అనుకోవచ్చు.
పాలకుర్తి రామమూర్తి సింగరేణి కాలరీస్‌లో పని చేసి ఫైనాన్స్ అండ్ ఎకౌంట్స్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేశారు. ‘భారతీ స్తవము’, ‘వేద సంస్కృతి – వివాహ సంస్కారోద్దేశ్యము’, ‘శ్రీ సరస్వతీ సన్నిధానము’, ‘గంగావతరణం’ వంటి సంప్రదాయ పద్య కావ్యాలతో పాటుగా ‘వ్యక్తిత్వం విజయపథం’ వంటి వ్యక్తిత్వ వికాస గ్రంథాలతో మొత్తం 17 పుస్తకాలు రచించారు. ఎన్నో వ్యాసాలు వ్రాశారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రెయినర్‌గా వ్యవహరిస్తున్నారు. 25 టెలీఫిల్మ్లలో పాల్గొన్నారు. యువతరానికి మేధోపరమైన, భావోద్వేగ నైపుణ్యాలను అందించడంలో ఆసక్తి.
