[బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి పి. భానుమతి శతజయంతి 2025 సందర్భంగా శ్రీ సారధి మోటమఱ్ఱి అందిస్తున్న ప్రత్యేక రచన.]
మొన్న 07-సెప్టెంబర్-2025 న భానుమతి గారి శతజయంతి పురస్కరించుకొని అందిస్తున చిరు నివాళి. నటిగా, గాయకురాలిగా ఎందరో రాణించారు. కానీ, భానుమతి గారికి దక్షిణభారత చిత్రసీమలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఒక ప్రత్యేక స్థానం, అది నిర్వివాదాంశం. నటి, గాయకురాలు, కథ, మాటల రచయిత, నిర్మాత, దర్శకురాలు, సంగీత సారథ్యం, స్టూడియో సారథ్యం, అనేక హాస్య కథల అల్లిక, ఒక విలక్షణ డైలాగ్ డెలివరీ! ఈ విభిన్న రంగాలలో ఆరితేరి అనేక మన్ననలు తోపాటు, భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ, తమిళనాడు ప్రభుత్వం నుండి కళైమామణి పురస్కారాలతో పాటు, అనేకానేక పురస్కారాలు అందుకున్న అసాధారణ తెగువ – ఇవన్నీ భానుమతి సొత్తు!
భానుమతి అక్కినేని తో 12 (అందు 7 సొంతవి), యన్ టి ర్ తో 14 (అందు 4 సొంతవి) చిత్రాలలో నటించారు. అగ్ర నటులు ఇద్దరు ఆమె దర్శకత్వంలో నటించడం కూడా ఒక విశేషం. అక్కినేనితో వచ్చిన అద్భుత చిత్రాలలో: లైలా మజ్ను, విప్రనారాయణ, బాటసారి, చక్రపాణి కాగా, యన్ టి ర్ తో నటించి అశేష అభిమానం అందుకున్న చిత్రాలు: మల్లీశ్వరి, పల్నాటి యుద్ధం, తోడు నీడ. విప్రనారాయణ ప్రత్యేకత ఏమిటంటే, చిత్రసీమకు రాకముందు, అక్కినేని ఆడవేషంలో అలరించి పేరు తెచ్చుకున్న, దేవదేవి పాత్రను, భానుమతి ధరించగా, అక్కినేని భక్తుడుగా అజరామరంగా నటించి రక్తి కట్టించిన చిత్రము. అక్కినేని తన నటనలో అద్భుతంగా, కష్టతరంగా అనిపించినది బాటసారే అంటారు. బాటసారి, భానుమతి, అక్కినేని నటనలకు ఎంతో వన్నె తెచ్చిన సినిమా అని చెప్పక తప్పదు.
ఆ విధంగా నటిగా, నాట్యకత్తెగా, తన పాటలు తానే పాడుకొనే గాయకురాలిగా, సినిమా నిర్మాణ, దర్శకత్వ, సంగీత, కథ, మాటలు లాంటి సాంకేతిక విభాగాలను కూడా నిర్వర్తించి, కొన్ని పాత్రలకు రూపకల్పన తానే చేసుకొన్న నిరుపమాన కళాకారిణి, భానుమతి. బహుశా, తెలుగులో గాని, భారత చిత్రసీమలో కానీ, ప్రపంచంలో ఏ నటి అందుకోని విశిష్ట స్థానం అందుకొన్నది భానుమతి గారే అని చెప్పక తప్పదు.
డా. ఊటుకూరి సత్యనారాయణ లోతైన పరిశోధనల ఆధారంగా వారు అందించిన వివరాల నుండి భానుమతి గారి చిత్రసీమ వివరాలను జత చేసిన నాలుగు పట్టికలలో అమర్చాను. దానిపై కొంత వివరణ క్రింద అందిస్తున్నాను.
పట్టిక-4 భానుమతి నటించిన చిత్రాలు, అవి విడుదల అయిన సంవత్సరం తెలియచేస్తాయి. మిగతా మూడు పట్టికల కూర్పుకు ఈ వివరాలు ఆధారభూతం.
పట్టిక-1 ప్రకారం, భానుమతి అత్యధికంగా తమ నిర్మాణత (13+5), దర్శకత్వం (10+8) లోని చిత్రాలలో నటించారు. రామకృష్ణ గారు భానుమతి గారి భర్త. ఆమె నటించిన చిత్రాలకు అధకంగా మాటలు అందించనవారు సముద్రాల, నరసరాజు గార్లు. విశ్లేషిస్తే, ఆమెతో ఏ ఇతర నిర్మాత లేదా దర్శకుడు అత్యధికంగా పనిచేసినట్లు కనబడదు.
పట్టికలు-2,3 ప్రకారం, భానుమతి అత్యధికంగా యన్. టి. రామారావు (14), ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు తో 12 చిత్రాలలోను నటించారు. వివరాల బట్టి, భానుమతి మరియు యన్ టి ర్ ఇరివురి సొంత చిత్రాల్లో నటించారు. కానీ అన్నపూర్ణ సంస్థలో భానుమతి నటించలేదు. భానుమతి పాడిన పాటలలో అత్యధికంగా సముద్రాల వారి రచన (48). అలాగే ఆమె రాజేశ్వర రావు గారి స్వర సారధ్యంలో (42) అధికంగా పాడారు. ఆ తరువాత స్వీయ సంగీత సారధ్యంలో 35 పాటలు పాడుకున్నారు. ఆమె ఘంటసాలతో అత్యధికంగా అంటే 23 పాటలు పాడారు. విశేషమేమిటంటే యన్. టి. రామారావు లానే, ఆమె నటించిన చిత్రాలకు అత్యధికంగా ఆమెనే కథను సమకూర్చుకున్నారు.
ఈ పట్టికలలోని వివరాలు ఆమె బహుముఖ ప్రజ్ఞను తేటతెల్లం చేస్తాయి. బహుశా అంటువంటి నటి మరియొకరు లేరు, రాబోరు కూడా అనిపిస్తుంది! ఆ విధంగా భానుమతికి భానుమతే సాటి! అంతే!
– సారధి మోటమఱ్ఱి
– గణాంకాల మూలం: డా. సత్యనారాయణ ఊటుకూరి
ఏకీకృత భావనతో వీక్షించ గలిగితే – ప్రకృతి అంతా, భిన్న విజ్ఞానాల సమాహారమేనని; కళల మరియు శాస్త్రీయ శాలలు, వేరు వేరు కాదని; వాటి అభేద భావనయే – జ్ఞానానికి పరాకాష్టయని – మోటమర్రి సారధి ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే ఒక కవిత వ్రాయంలో, ఒక వంతెన నిర్మించడంలో లేదా ఒక కంప్యూటర్ ప్రోగ్రాం సృజించడంలో – భేదాలు తనకెప్పుడూ అగపడలేదంటారు.
మనుషులు, మనుషుల తత్వాలు; కొండలు, కోనలు; నదులు, సముద్రాలు; వినీలాకాశం, నిర్మలత్వం – ఇవన్నీ ఆయనకు ప్రేరణ కలిగించేవే. మానవజాతిని ఉన్నత స్థితికి కొనిపోవాలని, అత్యున్నత సాహితీ సంపదను, మనకందించిన, ప్రపంచ పరివ్యాప్తంగా ఉన్న కవులు, రచయితలందరికీ, మనమెంతో ఋణపడి ఉన్నామని అభిప్రాయపడతారు.
మానవజాతి చరితను క్లుప్తంగా క్రోడీకరించిన, స్వామి వివేకానంద, ఈ నాలుగు మాటలు, తననెంతో ప్రభావితం చేశాయని చెబుతారు:
“మనిషి అడుగు వేసినప్పుడు, ముందుకు పోయేది – మెదటి కంటే, అతని ఉదరమే (ఆకలి)! ఉదరాన్ని (ఆకలిని) దాటి, మానవజాతి ముందుకు అడుగు వెయ్యడానికి, యుగాలు పట్టవచ్చు.”
