తెలుగు చలనచిత్రసీమలోనే కాదు, భారత చలనచిత్ర రంగంలోనే అసమాన ప్రజ్ఞాధురీణ, బహుముఖ ప్రజ్ఞాశాలి, వివిధ రంగాలలో తొలి భారతీయ మహిళ ఆమె. నటగాయని, నటీమణి, రచయిత్రి, నిర్మాత్రి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, స్టూడియో అధినేత్రి… ఇలా వివిధ రంగాలలో ఎనలేని, ఎన్నలేని కృషిచేసిన వనితాశిరోమణి శ్రీమతి పి.భానుమతీ రామకృష్ణ,
1925 సెప్టెంబర్ 7వ తేదీన నాటి మదరాసు ప్రెసిడెన్సీ (నేటి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా)లోని దొడ్డవరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు బొమ్మరాజు సరస్వతమ్మ, వెంకటసుబ్బయ్య గార్లు. తల్లిదండ్రులే ఈమెకు సంగీత గురువులు.
భారతదేశంలో పేరుపొందిన సంగీత విద్వాంసులు యం.యస్.సుబ్బులక్ష్మి, బాలగంధర్వ, రోషనారా బేగం, హీరాబాయి బరోడేకర్ వంటి వారి రికార్డులను విని అలవోకగా ఆలపించేవారామె.
సినిమాలలో నటించేందుకు అవకాశాలు వచ్చినా వీరికి, వీరి తండ్రికి ఇష్టం లేకపోవడంతో వదులుకున్నారు. కాని ప్రముఖ నటులు శ్రీ గోవిందరాజుల సుబ్బారావుగారు ప్రోత్సహించారు.
‘వరవిక్రయం’ సినిమాలో తొలిసారిగా నటించారు. తరువాత ‘మాలతీ మాధవం’, ‘ధర్మపత్ని’, ‘భక్తిమాల’ చిత్రాలలో నటించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మద్రాసు నుండి ఒంగోలు వచ్చేశారు. తరువాత మళ్ళీ ‘కృష్ణ ప్రేమ’లో నటించారు. ఆ సమయంలోనే అసోసియేట్ డైరెక్టర్ పి.రామకృష్ణ గారిని వివాహమాడారు.
వివాహం తరువాత వీరిద్దరూ సినిమాలకు దూరం కావాలనుకున్నారు. అయితే ప్రముఖ దర్శకులు శ్రీ బి.యన్.రెడ్డి గారి ప్రోత్సాహంతో ‘స్వర్గసీమ’ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ‘ఓహోహ్హో పావురమా….’ పాట పాడి, నటించి నాటి కుర్రకారుని వెర్రెక్కించారు. ఇది వేంపు పాత్ర కావడం విశేషం. తరువాత ‘తాసిల్దార్’, ‘గృహప్రవేశం’లలో నటించారు.
అప్పటినుండి ఆమె సినీ ప్రయాణం అప్రతిహతంగా కొనసాగింది. స్టూడియో అధినేత్రి అయ్యారు.
కుమారుడు భరణి పేరు మీద ‘భరణి సంస్థ’ ద్వారా ‘రత్నమాల’, ‘లైలామజ్ను’, ‘ప్రేమ’ వంటి చిత్రాలను నిర్మించి నటించారు. బి.యన్.రెడ్డి గారి ‘మల్లీశ్వరి’ సినిమా ఈమెను అంబరాన నిలిపింది. 1953వ సంవత్సరంలో తెలుగు, తమిళ, హిందీ భాషలలో త్రిభాషా చిత్రం ‘చండీరాణి’కి దర్శకత్వం వహించి, ఏకకాలంలో మూడు భాషలలో దర్శకత్వం వహించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు.
‘మిస్సమ్మ’ చిత్రంలో కొంత సినిమా చిత్రించిన తరువాత నిర్మాతతో విబేధించారు. ఆ తరువాత ఆ పాత్ర మహానటిని వరించడం మనకు తెలుసు.
1954వ సంవత్సరంలో నిర్మించిన ‘చక్రపాణి’ చిత్రంతో సంగీత దర్శకురాలిగా మారారు. ‘వరుడు కావాలి’, ‘బాటసారి’, ‘విప్రనారాయణ’, ‘గృహలక్ష్మి’, ‘చింతామణి’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘అనురాగం’, ‘పలనాటి యుద్ధం’ వంటి చిత్రాలలో విభిన్న పాత్రలను ధరించి, జీవం పోశారు. మలిదశలో మట్టిలో మాణిక్యం, మంగమ్మగారి మనవడు, తాతమ్మ కల, అమ్మాయి పెళ్ళి, అంతా మనమంచికే, బామ్మ మాట – బంగారుబాట, పెద్దరికం, చామంతి వంటి చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలను ధరించి గుణచిత్రనటిగా పేరు తెచ్చుకున్నారు.
“సన్నజాజి తీవలోయ్ – సంపంగి పూవులోయ్” (అంతా మన మంచికే), “ఉయ్యాల జంపాలలూగ రావయా!” (చక్రపాణి) వంటి లాలిపాటలను అద్భుతంగా ఆలపించారు.
“మదనా! – నవమదనా! స్వాగతమోయీ!” (రత్నమాల), “చేరరావో శాంతిమయ సీమా!” (లైలామజ్ను), “జీవనడోలీ! మధుర జీవనకేళీ! ఇదే ప్రేమసుధావాహినీ” (చండీరాణి) గీతాలను ప్రేమపూర్వక స్వరంతో వెలువరించారు.
“కోతీబావకు పెళ్ళంటా కోవెల తోటా విడిదంట” (మల్లీశ్వరి), “కన్నులే నీ కోసం కాచుకున్నవి! వెన్నెలే అందుకనీ వేచి ఉన్నవీ” (గృహలక్ష్మి) వంటి ఉడికింపు గీతాలను సరదా లొలికిస్తూ ఆలపించారు.
“ప్రేమే నేరమవునా? మాపై పగేలా!” (లైలామజ్ను), “ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు – కన్నీరు ఆనవాలుగ బావమ్రోల” (మల్లీశ్వరి) వంటి విరహ గీతాలను వేదనాపూరిత స్వరంతో కన్నీరొలికిస్తారు.
“పిచ్చి పిచ్చి పిచ్చీ రకరకాల పిచ్చీ”, “దులపర బుల్లోడా! దుమ్ము దులపర బుల్లోడా!” వంటి గీతాలను ఉత్సాహంగా ఆలపించి ఉరకలేయించారు.
వాగ్గేయకారుల కీర్తనలు, తరంగాలు, భక్తి గీతాలు ఆమె స్వరం నుండి అలవోకగా జాలువారి ఈ నాటికీ శ్రోతలను అలరించడం విశేషం. “విన్నపాలు వినవలె వింత వింతలూ” (అనురాగం), “నగుమోము గనలేని నా జాలి తెలిసీ” (వివాహబంధం), “శాంతమూ లేక సౌఖ్యమూ లేదు” (విచిత్ర వివాహం), “మేలుకోవయ్యా! కావేటి రంగా! శ్రీరంగా!” (విప్రనారాయణ), “శ్రీ సూర్యనారాయణ మేలుకో!” (ముద్దుల మనవడు) వంటి భక్తి గీతాలు ఈ నాటికీ ప్రేక్షక శ్రోతలను భక్తిసముద్రంలో ఓలలాడిస్తూనే ఉన్నాయి.
‘బాటసారి’ చిత్రంలో జిక్కితో కలిసి ఆలపించిన “కనులకు దోచీ చేతికందనీ ఎండమావులున్నై….. బదులు కోసమై వెదుకుట మాని బ్రతుకుటయే న్యాయం” వేదాంత తత్వాన్ని బోధిస్తుంది.
తొలిదశలో నటగాయనిగా ముగ్ధ, వేంపు, కథానాయక, నెరజాణ, గయ్యాళి నాగమ్మగా నటించిన భానుమతి, మలిదశలో వదిన, అత్త, అమ్మ, అమ్మమ్మ, నానమ్మ పాత్రలలో నిండుగా కనిపించి మెప్పించారు. ఈ చిత్రాలలోనూ నటగాయనిగా హల్చల్ చేశారు.
సాధారణంగా హాస్యరచనలు చేయడం చాలా కష్టమని అందరికీ తెలుసు. ఈమె ‘అత్తగారి కథలు’ వంటి హాస్యకథలను తెలుగు పాఠకులకు అందించారు. ‘నాలో నేను’ ఆత్మకథను వ్రాసి తనేమిటో పాఠక ప్రేక్షకులకు తెలియజేశారు. ‘మై సెవరల్ వరల్డ్స్’ అనే పెర్ల్ బక్ నవలను అనువదించారు.
ఈనాటికీ అత్తగారి కథలను వింటుంటే, చదువుతుంటే నవ్వుల పువ్వులు విరుస్తాయి. దీనికి లభించిన సాహిత్య అకాడమీ పురస్కారం వృథా కాలేదనిపిస్తుంది.
‘నాలో నేను’కు 1994లో కేంద్ర ప్రభుత్వం వారి స్వర్ణకమలం లభించింది.
1985వ సంవత్సరంలో ‘మద్రాసు ప్రభుత్వం సంగీత కళాశాల’ ప్రిన్సిపాల్‌గా నియమింపబడ్డారు. 1986లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ను పొందారు.
భారత ప్రభుత్వం వారిచేత 1966లో ‘పద్మశ్రీ’, 2000లో ‘పద్మభూషణ్’ పురస్కారాలను అందుకున్నారు.
1975వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి, 1985వ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్లను పొందారు. తమిళనాడు ప్రభుత్వం వారి కళైమామణి, ఫిల్మ్ ఫేర్ వారి ‘లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు’లతో సహా ఎన్నెన్నో పురస్కారాలను పొందారు.
ఈ విధంగా చిత్రసీమలోని వివిధ విభాగాలలో పరిణతి సాధించిన ఈ విదుషీమణి రచయిత్రిగా, సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యురాలిగా, డాక్టర్ భానుమతీ రామకృష్ణ మెట్రిక్యులేషన్ పాఠశాల నిర్వాహకురాలిగా వీరు అందించిన సేవలు అజరామరం.
వీరు 2005వ సంవత్సరం డిశంబర్ 24వ తేదీన చెన్నైలో మరణించారు. వీరి జ్ఞాపకార్థం 2013వ సంవత్సరం మే 3వ తేదీన భారతీయ సినిమాకు వందేళ్ళు పూర్తయిన సందర్భంగా ‘Hundred Years of Indian Cinema’ సిరీస్‌లో 50 మంది సినీ ప్రముఖుల స్టాంపులను విడుదల చేసింది భారత ప్రభుత్వ తపాలాశాఖ. ఈ స్టాంపులలో మన భానుమతిగారు ఉండడం తెలుగువారిగా మనకు గర్వకారణం.
శ్రీమతి భానుమతీ రామకృష్ణ అద్వితీయ ప్రతిభావంతురాలైనప్పటికీ…
“మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్ని నాళ్ళకీ బతుకు పండెనో”
పాట మాత్రం కోట్లాది తెలుగు ప్రేక్షక హృదయాలలో ఈనాటికీ చిరంజీవిగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ది. 24-12-2020 భానుమతి రామకృష్ణ వర్ధంతి సందర్భంగా ఈ నివాళి. ఆమెకు నమోవాకములు.
Image Courtesy: Internet