[చొప్పదండి సుధాకర్ గారు రచించిన ‘బహురూపులు అను మనం..!!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
“డాడీ! ఈ కోటేషన్ చూశారా? ఏంత బాగుందో” తండ్రి వద్దకు వచ్చి చిన్న పేపర్ కటింగ్ అందిస్తూ అన్నాడు వెంకట్.
మట్టితో కట్టిన కొత్త ఇంటి ముందు, మామిడాకుల పందిరి కింద చెక్క పీటపై కూచుని అక్కడి పరిసరాల తాలుకు పరిమళాలు ఆస్వాదిస్తోన్న విశ్వం ఏదో లోకం లోంచి జారిపడ్డట్టు చప్పున తేరుకొన్నాడు.
“ఏమిట్రా అదీ..”
“చదవండీ” వెంకట్ చిన్న చీటి అందిచాడు.
“అతి తక్కువ పనులు చేసేవారే తమకు సమయం సరిపోవడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు” కాగతాన్ని విప్పి చదివి కొడుక్కేసి చూసి మెచ్చుకోలుగా నవ్వాడు విశ్వం.
“ఇల్లు బాగుంది డాడీ! మనమూ ఇటువంటిదే కట్టుకొందాం” ఇరవయేళ్ళ వెంకట్ చిన్న పిల్లాడిలా అడిగాడు.
“ఇటువంటి ఇల్లు హైద్రబాద్‌లో కడితే నవ్వుతార్రా!”
“ఎందుకనీ” ఆశ్చర్యంగా అడిగాడు వెంకట్.
“ఇదంటే పల్లెటూరు. ఇక్కడ ఎట్లా కట్టినా పరవాలేదు! కానీ హైద్రబాద్‌లో ఇలాంటి మట్టి ఇల్లు ఒక జోక్..!”
“అంటే మనకు నచ్చిన ఇల్లు మనం కట్టుకోలేమా?”
“ఒక్క మాటలో చెప్పాలంటే అంతే! మన జీవితాన్ని మనకిష్టమొచ్చిన రీతిలో కూడా గడపలేం ఈ కాలంలో” నిర్వేదంగా అన్నాడు విశ్వం.
“పోనీ ఇక్కడే కట్టుకొందాం! మనకు ఇక్కడా స్థలం ఉంది కదా..!”
“ఎందుకురా మనమిక్కడ ఉండేదీ లేదూ – చేసేది లేదూ..”
“మీ రిటైర్‌మెంట్ తర్వాత హైద్రాబాద్‌తో మనకేం పనీ?”
“మీ చదువులూ – అవీ ఉంటాయిగా..” అనునయంగా అన్నాడు విశ్వం.
“చదువుల్దేముంది డాడీ! మీరంతా హైదరాబాద్‌లో చదివే ఉద్యోగాలు తచ్చుకున్నారా? అదీగాక మీ మీటలతో ఇన్నాళ్ళూ అనేవారు కదా! రిటైర్మెంట్ తర్వాత పుట్టిన ఊరి కెళ్ళిపోతాననీ..” వెంకట్ గుర్తు చేశాడు.
“చూద్దాం లే! అయినా ఎందుకంతగా పట్టుపడుతున్నావ్! ఈ ఊరు అంత బాగా నచ్చిందా..” చుట్టూ చూస్తూ నవ్వి సంకేతంగా కనుబొమ్మలు ఎగరేశాడు.
“సూపర్‌గా నచ్చింది. ఎంత బాగుందో! ఇన్నాళ్ళూ నాకీ ఊరు చూపించనందుకు మీకు పనిష్మెంటు ఇవ్వాలి” చిరుకోపంగా అన్నాడు.
“ఏదీ – ఇంకా పూర్తిగా చూడందే. వాగు చూడాలి! చుట్టూ ఉన్న గుట్టలు చెరువూ – అవి చూశామంటే ఇక హైద్రాబాద్ మాట ఎత్తేలా లేవ్..” కొడుకుని ఉడికించేడు విశ్వం.
“బాగుంటాయా.. ఎపుడెళ్దాం డాడీ..” ఉత్సుకతతో అన్నాడు వెంకట్.
“చూశాక నువ్వే చెబుదూగానీ.”
“ఎపుడెళ్దాం డాడీ! సాయంకాలం పోదామా?”
“చూద్దాం – ఒక వేళ ఇవాళ వీలు కాకపోతే రేపు డెఫినెట్‌గా వెళ్దాం”
“ఎక్కడికీ హైద్రబాదే – అబ్బ ఉండలేక పోతున్నాను.. ష్.. కరెంట్ లేదూ.. నీళ్ళూ రావడం లేదు ఇంట్లో అంతా మట్టి సున్నం పేడ వాసన. ఇరుకిరుకు గదులు..” సమస్యలన్నీ ఒకేసారి ఏకరువు పెడుతూ మాటల్లోకి చొరబడింది మణి.
“వెళ్దామనేది హైద్రబాద్‍కి కాదు మమ్మీ! ఊరు చూడడానికి” వెంకట్ తల్లికి వివరించేడు.
“ఇంకా ఊరూ – అడవీ చూస్తూ ఎన్నాళ్ళుంటారు ఇక్కడ.”
“అదేమిటే నిన్ననేగా వచ్చాం.. అదీ దాదాపు పదిహేనేళ్ళ తర్వాత వచ్చాము.. ఇంకో నాలుగు రోజులుండి వెళ్దాం లే..!” సముదాయింపుగా అన్నాడు విశ్వం అనబడు భర్త..!
“నాలుగు రోజులా.. చచ్చి ఊరుకొంటాను..!”
“మరి పల్లెటూళ్ళంటే ఏమిటనుకొన్నావ్! హైద్రబాద్‌లో అపార్ట్‌మెంట్ దిగకుండా పెత్తనాలు చేయడం అనుకొన్నావా.. ఇక్కడంతా కష్టమే.”
“అయితే మాత్రం మనకెందుకూ? ఈ తద్దినం.. పడేవాళ్ళు పడనీ కష్టాలు” దీర్ఘం తీసింది మణి.
“నీ కొడుకేమో ఇంకా ఇక్కడే ఉండిపోదామంటున్నాడు.”
“వాడు నా కొడుకైతే ఆ మాట అనేవాడే కాదు. అక్షరాల వాడు అయ్య కొడుకే.. అందుకే మీకు మల్లే వాడికి పుట్టిన ఊరుపై పిచ్చి తగులుకొంది” ధుమధుమలాడుతూ వెళ్ళిపోయింది మణి.
నవ్వుకొన్నారు తండ్రీ కొడుకులు!
“డాడీ ఇందాక మీకిచ్చిన కొటేషన్ ఏదీ?”
“ఇక్కడే.. ఆ ఇదిగో.. ఎక్కడ సంపాదిస్తావురా ఇవన్నీ” అభినందన పూర్వకంగా నవ్వి అన్నాడు విశ్వం.
“ఎక్కడపడితే అక్కడ. ఓసారి మీరే అన్నారుగా ఒక్క సూక్తి చాలు జీవితాన్ని మార్చెయ్యడానికి..” ఆగిపోయాడు వెంకట్.
“నిజమేలే.. గుడ్”
విశ్వం యూనివర్శిటీలో ఫ్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. వయసు యాభయి పైనే.. అసాధరణమైన ప్రతిభాపాటవాలు. గొప్ప తార్కికదృష్టి, దీటైన హేతుబద్ధత అన్నీ కలసి అతడికో ప్రత్యేకతను ఆపాదించి పెట్టాయి.
చీకూ చింతలేని జీవితం. కావాల్సినంత తీరిక అతడిని నిలువనీయలేదు. చుట్టూ ఉన్న సమాజానికి ఏదో చేసి తీరాలన్న ఆరాటం అతడిని సామాజిక కార్యకర్తగా తద్వారా పర్యావరణవేత్తగా తీర్చిదిద్దింది. ఇపుడతడు కేవలం ఫ్రొఫెసరే కాదు. రాష్ట్రం మొత్తం మీద అనితర సాధ్యమైన ఫాలోయింగ్ ఉన్న క్యారెక్టర్. ఏం మాట్లాడినా, ఏం చేసినా సంచలనమే..! చర్చనీయాంశమే!!
మొన్నటికి మొన్న వాతావరణానికి, దాని సమతుల్యత కాపాడడానికి సొంతంగా తాను తయారు చేసిన ‘నోట్’ ఒకటి కేంద్రపర్యావరణ బోర్డు పరిశీలనకు స్వీకరించడం అతడి మేథస్సుకు, కార్యకుశలతకు అసలయిన తార్కాణం. వెరసి విశ్వం ఇపుడు రాష్ట్రంలోని మేధావి వర్గానికి సంబంధించి అత్యంత కీలకమైన వ్యక్తి. పర్యావరణానికి ముప్పు కలిగించే, కనీసం ప్రభావం చూపే విధ్యా నిర్ణయమేదీ తీసుకోవాలన్నా అతడి అనుమతి లేకుండా అంశం ‘అంగుళం’ కూడా ముందుకు కదలదని నొక్కి వక్కాణించవచ్చు.
అంతటి మేధావి తన బిడ్డ కావడం పుట్టిపెరిగిన ఊరికి గర్వకారణం కాకుండా ఉంటుందా? ఎంత మాత్రం కాదు. అందుకే ‘అల్లీపురం’ గర్విస్తోంది. దాదాపు పదిహేనేళ్ళ తర్వాత తొలిసారిగా ఆ వూళ్ళో అడుగు పెట్టినందుకు అతడిని ఆప్యాయంగా పలకరించి పులకరిస్తోంది.
నిజమే! విశ్వం తన బిజీ షెడ్యూల్‌ని కొన్నాళ్ళు అటకెక్కించి పుట్టిన ఊళ్ళో జరుగుతోన్న ఒక అతి సాధారణ వేడుకకు వేంచేసినాడు. ఆ వేడుక అతడి తమ్ముడు రాజయ్య కొత్త ఇంటికి సంబంధించినది. దానికి అతడు హజరు కావడం అంత ‘ముఖ్యం’ కాకున్నా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అయినా తన ఊరునీ ఊళ్ళో ఉన్న ఒకప్పటి పాత మిత్రులని కలవచ్చని తీరిక చేసుకొని మరీ రావడం, అదీ కుటుంబసమేతంగా రావడం నిస్సందేహంగా అతడి ఔన్నత్యాన్ని సూచించేదే!
ఫలితంగా ఆ సాయంకాలం ఇష్టాగోష్టిలాంటి సమావేశం ఒకటి జరిగింది మిత్రులతో.
***
“విశ్వం సారూ..! నువ్వేమో పెద్ద పెద్ద పనులు జేస్తున్నవనీ, పల్లెటూళ్ళల్లలో మాలాంటి మట్టి పిసుకుకునేటోళ్ళ కోసం పోరాడుతున్నావని ఊరి పొరగాండ్లెవుడూ హోటల్ కాడ, పేపర్లు చదువుతూ ముచ్చట్లాడుతుంటే ఇంటిమి. ఆల్లను ఏందిరా అని అడిగితే అసలు ముచ్చట చెప్పరు. మాకేమో సదువు రాదాయే. అసలు గదేందో చెప్పరాదు సారూ..!” చుట్టూ మూగిన దాదాపు ముప్పయి మందిలో ఓ తలచెడిన పెద్దాయన అడిగాడు.
“అదీ.. పర్యావరణం పట్ల ఉద్యమం యాదయ్యా!” విశ్వం ఓపిగ్గా చెప్పాడు.
“అంటే ఏంది బాంచన్..?” అంత పెద్దవాడు ఇన్నేళ్ళ తర్వాత కూడా తన పేరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొన్నందుకు లోలోన పొంగిపోతూ అన్నాడు యాదయ్య.
“అదంతా పెద్ద కథలే యాదయ్యా! అయినా నీకు తెలిసేలా కొంచెం అటూ.. ఇటూ చేసి చెబుతాను. మన దేశం పై విదేశీ బహుళ జాతి కంపెనీల కన్నుపడింది. అంటే వేల కోట్ల రూపాయలతో వ్యాపారం చేసే కంపెనీలన్నమాట. వాటికి వాటి సరుకులు కొనే వినియోగదారులు కావాలి. చూసేనేమో ప్రపంచంలోనే జనాభాలో మనదేశం మొదటి స్థానంలో ఉందాయే. ఇంతటి మానవ వనరులని, మార్కెట్‌ని సొంతం చేసుకుంటే వారి వ్యాపారానికి, ఆదాయానికి తిరుగుండదని ఎత్తులలేసి గ్లోబళీకరణ పేరుతో ఉచ్చులోకి లాగి, ఒక పద్దతి ప్రకారం దేశాన్ని నాశనం చేయాలని కాచుకూర్చున్నారు” వీలయినంత మేర వాళ్ళ స్థాయికి దిగి విశదీకరించాడు విశ్వం.
“గట్లెట్లా మనం ఇనొద్దు” యాదయ్య అమాయకంగా అన్నాడు.
“వినొద్దంటే ఎవరు వింటారు? మనిషికి సుఖం అలవాటు కానే వద్దు. అయ్యిందా అందుకోసం ఎంత కయినా దిగజారుతాడు. అందుకే వాణ్ణి నానా రకాలుగా ప్రలోభ పెట్టి వ్యాపారంలోకి లాగేస్తున్నారు. నీకు అర్థం అయ్యేలా చెప్పాలంటే మునుపు మీరు సిద్ధిపేటకయినా అవలీలగా నడిచి వెళ్ళేవారు. పొలాల దగ్గరకయితే అడిగేదేలేదు. ఇపుడు నీ మనవడు సిద్ధిపేట, పొలం కాదు ఊళ్ళోనే దోస్తును కలవాలన్నా బండి మీద తప్ప నడిచివెళ్ళడు. ఎందుకు? వాడి వ్యాపారానికి బలి అయి బండి తప్ప నడక మరచిపోయామా లేదా?”
“అవునయ్యా.. నా మమ్మడు ఆఖర్కి.. ఊరవలికిపోయినా బండే..!”
“అంటే వాడి మోసానికి, వేషానికి మనం బోల్తా పడ్డట్టే కదా!” విశ్వం ప్రశ్నించేడు.
“ఎన్కటికి బైరువులోళ్ళని ఉండేటోళ్ళు.. గట్లన్నమాట” ఎవరో నెత్తి గోక్కుని అన్నారు.
“ఆఁ.. ఆఁ.. బైరూవులోళ్ళు పొట్టకూటి కోసం వేషాలేస్తే వీళ్ళమో వ్యాపారం కోసం వేషాలెస్తున్నారు. ఒక రకంగా ఎన్కటోళ్ళే నయం” ఇంకెవరో సుట్టి పీల్చి తీర్మానించేరు.
“ఉదాహరణకు మనం పొలంలో ఒకప్పుడు గొర్రె పెంట, వూడికమన్ను కానుగాకు వంటి ఎరువులు వాడి వంట పండిచుకొనే వాళ్ళం. ఇపుడేమయింది? ఎవరన్నా వాటి జోలికి పోతున్నారా.. డిఏపి ఎరువులనీ, గుళికలనీ, నువాక్రాన్ అంటూ ఎగబడుతున్నారు. కొన్ని పోలాలయితే ఒక కంపెనీకి ప్రచారకర్తగాను వ్యవహరిస్తున్నాయి. వాడు మన పొలంలో బోర్డు పెట్టేస్తాడు. ఈ పొలంలో ఫలానా ఎరువే వాడామని ప్రచారం చేసుకుంటాడు. ఇదేమిటీ వాడి వ్యాపార ఉచ్చులో చిక్కుకు పోవడం కాదా!.. దీని వల్ల ఎవరికి నష్టం మనకే కదా! పనికొచ్చేదాన్ని పారవేసుకొని, ఇంకేదో డబ్బు పెట్టి కొనుక్కొన్నట్టే కదా!” ఊపిరి తీసుకోవడానికి ఆగేడు విశ్వం.
“ఔను సుమా..” వింటున్న ఒక పెద్ద మనిషి నిట్టూర్చేడు.
“ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు మనకు అవసరం ఉన్నాలేకున్నా బలవంతాన ఛాయ్. కాఫీ అలవాటు చేసిన బ్రిటీష్ వాళ్ళు, ఆ తర్వాత దాన్ని వ్యాపారంగా మార్చి కోట్లు సంపాదించారు. ఇంకా సంపాదిస్తున్నారు! అంటే వాడి వ్యాపారం తద్వారా వచ్చే లాభం కోసం మనకు కొన్నింటిని అలవాటు చేసి తర్వాత దానికి మనల్ని బానిసలుగా చేసి డబ్బుగా మార్చుకొని పీడించకు తింటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ సెల్‌ఫోన్‍లు, శీతల పోనీయాలు, ఆరోగ్యం పేరిట సూపర్ స్పెషాలటీ హాస్పటళ్ళు. రక్తపరీక్ష మూత్ర పరీక్ష ఇంకా పేరు తెలియని పరీక్షలు..”
“నిజమేనయ్యా..” నెత్తికి చేతులు పెట్టుకొన్నాడు యాదయ్య.
“దీనివల్ల క్రమేపి కులవృత్తులు నశించి పోతున్నాయ్! నేత కార్మికులకు పని లేదు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వృత్తులన్నీ కనుమరుగైపోతున్నాయ్.. చేసేందుకు పని లేక జనం బతకడానికి మరో దారి లేక కూలీలుగా మారుతున్నారు. ఊళ్ళో పంటలు ప్రభావితమౌతున్నాయ్. వాతావరణంలో సమతుల్యత లోపించి వర్షాలు తగ్గిపోయాయి, లేదా అకాల వర్షాలు, ఇంకా రానున్న కాలంలో దృశ్యం మరింత భయంకరంగా మారిపోతుంది. ఉన్నవాడి దగ్గర కోట్ల కొద్దీ డబ్బు మూలుగుతుంటే లేని వాడికి ఆశలు మిక్కుటమయి ఆశాంతితో కొట్టుకు చస్తారు” బాధగా అన్నాడు.
“వానలు పడకపోవడానికి దీనికి సంబంధమేందయ్యా?”
“ప్రతిదీ వ్యాపారం అయిన చోట నైతికవిలువలు నశిస్తాయి. ఇందాక చెప్పుకొన్నట్టు మనిషికి సుఖం అలవాటయ్యాక తన సుఖం కోసం దేనికి నష్టం కలిగించడానికయినా వెనుకాడడు. అది ప్రకృతియినా. పక్కవాడయినా పట్టించుకోడు. ఒకప్పుడు కరెంట్ అంటే మనకు తెలియదు. అపుడు అన్ని పనులు మనమే చేసుకొన్నాం. కరెంట్‌తో కొన్ని పనులు సులభమౌతాయని తెలిసి, అన్ని పనులకు దాన్ని అన్వయించుకొన్నాం. ఇపుడెవరయినా పిండి విసురుకొంటున్నారా.. వడ్లు దంచుకొంటున్నారా.. పొలానికి నీళ్ళు యాతం, మోటతో తోడుకొంటున్నారా..! ఊహు.. అన్నింటికి కరెంట్ వాడకమే! మీకు తెలుసో తెలియదో ఇపుడు ఇల్లు ఉడవడానికి బట్టలు ఉతకడానికి కరెంట్ వాడుతున్నారు. ఇట్లా అన్నంత కరెంట్ వాడకం లొంగిపోయి కొత్త బొగ్గు నిల్వల కోసం భూమిని తవ్వేస్తున్నారు. చెట్లను నరకేస్తున్నారు. ఒకప్పుడు ఉన్న అడవి ఇప్పుడు అల్లీపురంలో లేదందుకూ..? అడవి లేనపుడు వాతావరణంలో వేడి పెరిగి వర్షాలు తగ్గిపోతాయి. ఇందువల్ల భూగర్భజలాలు దిగజారిపోతాయి. రోడ్ల వెడల్పు పేరుతో వందల వెళ్ళ వృక్షాలు నరికస్తున్నారా లేదా?” ప్రశ్నించాడు విశ్వం.
“అవునయ్యా.. మన వాగంటే జీవనదితో సమానం.. అది ఎండిపోగా నా ఎనభై ఏళ్ళ జీవితంలో చూల్లేదు.. అటువంటిది అయిదేళ్ళుగా చుక్క నీళ్ళు లేవు”.
“నేనిందాకా చెప్పింది అదే! గ్లోబలీకరణ వల్ల మనిషి రకరకాల ఆకర్షణలకు లోనయి వాటికి క్రమేపి బానిసయి లేని బాధలు కొని తెచ్చుకుంటున్నాడు. అందులో భాగంగానే తామర తంపరగా పెరుగిన ఇళ్ళ నిర్మాణం. అక్కర ఉన్నా లేకున్నా ఒకర్ని మించిన అందంగా మరొరకు ఇల్లు కడుతూ. అంతస్తుల మీద అంతస్తులు కట్టి తద్వారా ఇసుకకి గిరాకి పెంచేడు. ఇప్పుడు బంగారం కన్నా ఇసుక కొరతగా ఉంది. ఒకప్పుడు ఒక డొక్కు ఇంట్లో పది కుటుంబాలు అన్యోన్యంగా కలిసిమెలసి ఉండేవి. ఇప్పుడు ఒక్కడికె రెండు మూడు ఇళ్ళు.. సరే ఆ విషయం ఇపుడు అప్రస్తుతమనుకున్నా, ఈ రకంగా నిర్మాణాలు పెరిగిపోవడం వల్ల ఎక్కడా ఇసుకా సరిపోవడం లేదు. పరిస్థితి ఎంత వరకూ వచ్చిందంటే ఇసుక తయారు చేసే ఫిల్టర్లు కూడా వచ్చేశాయ్. దీంతో వాగుల్లో నదుల్లో ఇసుక కరువయి నీళ్ళు నిలవడం లేదు. ఫలితం అంతిమంగా మళ్ళీ కరువువైపు దారితీయడం..” విశ్వం గొంతులో అంతులేని ఆవేదన! వెంకట్ తండ్రి చెప్పే ప్రతి మాటా శ్రద్ధగా వింటున్నాడు.
“కాని పంతులూ! మీరనే గ్లోబలీకరణ వల్ల కొన్ని మంచి పనులు కూడా జరుగుతున్నాయి కదా! మచ్చుకి కొన్ని రోడ్లు బాగుపడ్డాయి. ఊరురా కరెంట్ వచ్చింది. సిసి రోడ్లు.. ఫోన్లోచ్చాయి. ఏ వార్తయినా ఇల్లు కదలకుండా క్షణాల్లో దేశమంతా చేరవేయగలగుతున్నాం. ఇదంతా అవసరం లేదంటారా?” కొంచెం చదువుకొని మధ్యలోనే వదిలేసిన బాపతు అడ్డలుంగీ ఒకటి ప్రశ్నించంది ధైర్యంగా..!
“నిజమే కానీ అది కూడా వాడి వ్యాపారంలో ఒక భాగమే! రోడ్లు బాగు పడ్డాకే మోటారు బైకులు. అటోల అమ్మకాలు దండిగా పెరిగాయ్ కదా!”
“అదీ నిజమే అనుకోండి.. అయినా ప్రయాణాలు సులువయ్యాయి కదా!”
“అంటే ఈ సౌకర్యం లేనపుడు మనం బతకలేదా! ఇప్పుడు మనం ఎలా తయారయ్యామంటే చేతిలో బండి లేకుంటే, ఫోన్ పని చేయకుంటే చావు వార్తను కూడా పక్క ఊళ్ళోకి సైతం వెళ్ళి చెప్పలేనంత.. ఇదేనా మనం కోరుకొనే సౌ..కర్యం..?” విశ్వం గొంతులో వెటకారం ధ్వనించింది.
“అంటే ఎవడో లాభపడుతున్నాడని మనం ఎన్కటి వెర్రి వెధవల్లాగ ఉండిపోవాలా.. అభివృద్ధి చెందకూడదా..” బరిలోంచి పారిపోవడం నచ్చని అడ్డలుంగీ తన వాదన తాను చేస్తునే ఉంది.
“అక్కడే మోసపోతున్నాం! మన అభివృద్ధి ఎంత మోతాదులో ఉండాలో అంత ఉండాలి తప్ప, మోతాదు మించిన అభివృద్ధి కూడా అనర్థమే.”
“అంటే మీరు చెప్పేది శానా విచిత్రంగా ఉంది సారూ! మాదిగోని కోడుకు ఇంకా చెప్పులు కుట్టాలే.. లేదా డప్పుకొట్టాలె! మంగళోని కొడుకు గడ్డమే గీకాలె అన్నట్టుంది. వాడూ సదువుకోవద్దా పైకి రావాద్దా?..”
“పైకి రావద్దని కాదు.. నా మాట మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు.”
“ఇంక అర్థమయ్యేది ఏంది సారూ..? ప్రతి చోట, ప్రతి సారి చదువుకున్నోడు చదువుకోన్నోన్ని చేసే మోసమే ఇది” కరుగ్గా అన్నాడు సదరు లుంగీ.
“ఎహే నీయక్క ఉండెహె!” చర్చ పక్కదారి పడుతుండడంతో యాదయ్య అతడిని కసురుకొన్నాడు. మిగిలిన వాళ్ళంతా అతడికి వత్తాసు పలికారు.
“అడగనీ యాదయ్యా!” అతడి వాదనను ఆహ్వానిస్తూ అన్నాడు విశ్వం.
“ఏం అడుగుడు పంతులూ! వాడన్నింటికి గిట్లో అడ్డం పోడుగునరుకుతడు గనీ.. మరి ఇటువంటి వాటిని దూరం చేయడానికి మీరేం జేస్తుండు” వడ్ల బ్రహ్మయ్య కల్పించుకొని అడిగాడు.
“ఏం చేస్తాం. బలవంతున్ని ముఖాముఖి ఎదుర్కోరేం కదా! అందుకే వీలయినంత కరకుగా, శాంతియుతంగా ఉద్యమాలు చేస్తూ విజ్ఞప్తులు అందజేస్తాం.”
“మరి వాళ్ళు వింటారా..? ”
“అంతా బోగస్! గిట్ల లొల్లి జేసినట్టు యాక్షన్ చేసి వీళ్ళెంత కమీషన్ దొబ్బుతారో..” అడ్డలుంగీ తనలో తాను అనుకొంటున్నట్టు గొణిగి అక్కడినుండి వెళ్ళిపోయాడు.
“వాడి గురించి నువ్వేం మనుకోకయ్యా! వాడి తీరే అంత. తిక్కలమ్డీ కొడుకు” ఎవరో నచ్చజెతున్నట్టు అన్నారు.
“అదేం లేదులే! నాకివ్వన్ని లెక్కలోకి రావు. నన్ను ఇంత కన్నా ఘోరంగా తిట్టిన వాళ్ళున్నారు. ఒక ఉద్యమం నెత్తికెత్తుకొన్నాక ఇవన్నీ తప్పవు. నా ఆవేదన ఇది కాదు యాదయ్యా! మనిషి అనవసర ఆడంబరాలకు విలాసాలకు ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నాడో అర్థం కాదు. చెట్టు మీద కనిపించే మామిడి పండు నొదిలి మ్యాంగో జ్యూస్ కోసం, చల్లని కుండలో మజ్జిగ వొదులుకొని బట్టర్ మిల్స్ అంటూ అర్రులు చాస్తున్నాడు. చేతికిక మూతికి అంటకుండా భోజనం పెడ్తాం. కానీ వెయ్యి రూపాయలు తీస్కుంటారు. అంటే అది పచ్చి మోసం అని తెల్సినా అటే మొగ్గు చూపుతున్నారు. ఈ ధోరణి ఇక మారదా అన్నదే నా బాధ” అంటూనే లేచాడు విశ్వం.
“నిజమేనయ్యా” అందరూ లేచారు.
“ముందు ఈ పరిస్థితి పోవాలి. అది పోకుండా ఎవరు ఎన్ని ఉద్యమాలు చేసినా అంతా బూడిదలో పోసిన పన్నీరే!” నిట్టూర్చేడు.
మరో నిమిషంలో అంతా వెళ్ళిపోయేరు. ఇంట్లోకి వస్తున్న తండ్రిని మెచ్చుకోలుగా చూసేడు వెంకట్. వాళ్ళకది మామూలే! వాస్తవానికి వాళ్ళు తండ్రీ కొడుకులైనా మంచి స్నేహితులుగానే మెలుగుతారు. ఒకర్నొకరు అభినందించుకొంటారు. ముఖ్యంగా ఏదయినా సాధించినపుడు.
***
“ఇదే మన ఊరి వాగు రా వెంకట్! ” ఇసుకలో కాసింత దూరం నడిచి ఆయాస పడిపోతూ ఓ పెద్ద బండరాయి మీద కూచుంటూ అన్నాడు విశ్వం.
“బాగుంది డాడీ! ఎంత వయ్యారంగా మలుపు తిరిగిందో!” రెండు ప్రక్కలా కనుచూపుమేర మెడలు సాచి చూస్తూ అన్నాడు వెంకట్,
“ఇపుడంటే సన్నని పాయలుగా ప్రవహిస్తోంది గానీ దీని అసలైన అందం చూడాలంటే వర్షాకాలమే రావాలి. గలగలా ప్రవహిస్తూ వచ్చపోయే వారిని పలకరిస్తూ, తనువూ, మనసూ పునీతం చేస్తూ అపరగంగై ఈ ఊరిని ఆశీర్వదిస్తుంటుంది. వీటిని పిల్లిగుండ్లు అంటారు. వీటిపై గూచుండి పారే వాగులో కాళ్ళాడించడం ఒక వర్ణించనలవి కాని అనుభూతి” విశ్వం గొంతు పారవశ్యంగా మారిపోయింది.
“నిజమే డాడీ.. ఊహించగలను” వెంకట్ గొంతులో ఏదో బాధ.
ఆ బాధ వాగుని ఎండగట్టిన మనుషుల స్వార్థం మీదో లేక తానూ అటు మాట అనుభూతి పొందకలేకపోయానన్న వెలితో ఇదమిత్థంగా అర్థం కాలేదు విశ్వంకి.
“అవిగో ఆ కనిపించేదే మల్లన్న గుట్ట. ఆ గుట్ట ఎక్కితే చుట్టు పక్కల పదిహేను కిలోమీటర్ల మాత్రంలో ఊళ్ళన్ని కనిపిస్తాయి. ఆ పక్కనే గండి చెరువు. అక్కడికెళితే ఇప్పటికయినా నన్ను నేను మరచిపోతాననుకో!” చిన్ననాటి తీపి జ్ఞాపకాలూ, అనుభవాలు అతడి కళ్ళలో వెలుగులు చిమ్మేయి.
“అక్కడికి వెళ్దామా డాడీ..”
“ఎందుకురా..?”
“ఆ గుట్ట ఎక్కేద్దాం.” పట్టలేని ఉత్సుకతతో అన్నాడు వెంకట్.
“ఇప్పుడు నా ఆరోగ్యం సహకరించదేమోరా ! కావాలంటే నీతోటి వాళ్ళనెవర్నయినా తోడు తీసుకొని వెళ్ళు..”
“సర్లెండి..” తండ్రి మాటల్లో యథార్థాన్ని గ్రహించి నొచ్చుకొన్నాడు. అయిదారు నిమిషాలు ఇద్దరి మధ్య మాటలేమీ లేవు.
“ఇటు వెనక వైపు వెళితే ఓ మేడిపళ్ళ చెట్టుంటుంది. వాటి రుచి ఎంత తీపే? అదిగో అక్కడే.. అదే.. ఇన్నాళ్ళూ దాన్ని ఎవరు కొట్టివేయకుండా మిగిల్చారంటే నమ్మలేకున్నాను” చుట్టూ ఉన్న చెట్లన్నీ కనుమరుగయి నా అదొక్కటే మిగిలి ఉండడం చూసి నమ్మలేనట్టు అన్నాడు.
“వెళ్ళి తెచ్చుకొందామా డాడీ! వద్దులే నేనే వెళ్ళి తెస్తాను” తండ్రి పరిస్థితి గుర్తొచ్చి మాట సవరించుకొన్నాడు.
“పరవాలేదు లేరా! ఈ మాత్రం నడవగలను” అంటూ లేచి ఇద్దరూ కలిసి వాయిలి పొదల్లోంచి పోతోంటే విశ్వం టక్కున ఆగిపోయాడు.
“ఒరేయ్ ఇదే మిట్రా బురద.. బురద.. ఇంత వేసవిలో ఇక్కడ నీళ్ళెక్కడివిరా! పైన పొలమేదయినా ఉండి నీళ్ళు పొంగిపోతున్నాయా?” నమ్మలేనట్టు అణువణువు పరికించి చూస్తూ అన్నాడు.
“లేదు డాడీ! చుట్టూ ఫర్లంగు దూరం పొలమే లేదు.”
“మరి ఈ నీళ్ళెక్కవిడివిరా? భూగర్భ జలాలు అడగంటి పోయాయని బోర్లు ఫెయిలయ్యాయని రైతులంతా మొత్తుకొంటుంటే..” – డొంకలో ఎండిపోయిన తుప్పల మధ్య పచ్చిగా నీళ్ళు ఊరుతూ సన్నగా ప్రవహిస్తోన్న దృశ్యం అతడిని ఆశ్చర్యచకితున్ని చేస్తుంటే రెప్ప వేయకుండా చూస్తూ నిలబడిపోయడు.
“మనిషెంత చెడిపోయినా నీళ్ళు చెడిపోవుగద బాబాయ్! పది రోజులుగా ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి బోర్లు పని చేయడం లేదు. అందుకే నీటి జల పైకి తన్నుకొస్తుంది.” అప్పుడే అటుగా వెళ్తొన్న రైతు ఒకడు జవాబిచ్చేడు.
విశ్వంకి కొరడాతో చెళ్ళున కొట్టినట్టుయింది!
“నిజమే! నిలువెత్తు స్వార్థంతో ఒకడిని మించి ఒకడు వందల ఫీట్ల లోతు బోర్లు వేసుకుంటూ పోతే భూగర్భ జలాలు పడిపోక ఏం చేస్తాయి” జీవిత పరమార్థం ఏదో బోధపడ్డట్టయింది. చాలా సేపు మనిషి కాలేకపోయాడు. అట్లా ఎంత సేపు ఉండిపోయాడో అతిడికే తెలియదు.
“డాడీ ఇదేమిటీ?” గొట్టి పడిన తేనె ముద్దలా సాగిన ప్లాస్టిక్ లా ఉన్న పదార్ధమేదో పట్టుకొని అడిగాడు వెంకట్.
“అదీ.. అదీ.. తుమ్మబంక కాబోలు” అంటూ చేతిలోకి తీసుకొని అటూ ఇటూ తిప్పి “ఆ తుమ్మ బంకే.. ” నిర్ధారించుకొన్నాడు విశ్వం.
“అంటే ఏంటి డాడీ..”
“ఛ.. పిల్లలకు కనీసం తుమ్మ బంక అంటే కూడా తెలియని దరిద్రపు గొప్ప కాలం వచ్చేసింది. ” అంటూ తనలో తాను గొణుక్కొని “ఇది గమ్ రా..” అన్నాడు వినిపించేలా..
“గమ్ ట్యూబ్‌లో కానీ బాటిల్‌లో కానీ ఉంటుంది కదా డాడీ!” తికమక పడిపోయేడు వెంకట్. అయితే అతడికి అర్థమయ్యేలా చెప్పడానికి మరింత తికమక పోయాడు విశ్వం.
“అది ఆర్టిఫిషియల్.. ఇది నేచురల్..” చివరకు బతికిపోయేడు.
“మరి ఇది ఎట్లా తయారవుతుందీ?” వెంకట్ ప్రశ్న.
“చెట్టుకి ఎదయినా గాయం తగిలితే స్రవించే పదార్థమే ఈ గమ్.”
“అన్ని చెట్లకు ఇలాగే వస్తుందా..”
“లేదు రా. కొన్ని చెట్లకే ముఖ్యంగా వేప, తుమ్మ.. మరికొన్ని”
“బాగుంది డాడీ, ఇంటరెస్టింగ్ అక్కడ ఇంకా ఉంది తెస్తా..” సమాధానం కోసం చూడకుండా రివ్వున పరిగెత్తాడు వెంకట్.
“ఒరేయ్ మరి మేడిపళ్ళు?” విశ్వం నవ్వుతూ అన్నాడు.
“నువ్వు అవితే.. నేను ఇది తెస్తా.. అక్కడికి వెళ్ళాకా ఏదయినా అంటించుకోవడానికి పనికొస్తుంది.”
“నీ తలకాయ, అయిదు రూపాయలు పారేస్తే బజార్లో దొరికే దానికి ఇంత హైరానా ఎందుకురా! పైగా చెట్టు కింద ముళ్ళుంటాయి జాగ్రత్త.”
వెంకట్ అవేవీ వినేట్టు లేడు. అరగంట పాటు వెతికి దాదాపు కిలో తుమ్మ బంక తీసుకొచ్చాడు. రకరకాల రూపాలు. రకరకాల సైజులు చూసి మురిసిపోతున్నాడు.
“ఎక్స్‌లెంట్‌గా ఉన్నాయి. చిన్న చిన్న ప్లాస్టిక్ బొమ్మల్లా.” జేబు నిండిపోయిన గర్వంతో అన్నాడు. మేడి పళ్ళు కూడా తీసుకొని ఇల్లు చేరేసరికి ఎండ నడినెత్తి మీదికొచ్చింది.
***
“వెళ్ళొస్తొమమ్మా..” విశ్వం తమ్మున్నీ, మరదలు వెంకాయమ్మను ఉద్దేశించి అన్నాడు.
“మళ్ళీ ఎప్పుడయినా వస్తుండక్కా” మణికి పసుపూ కుంకుమ జాకెట్ గుడ్డలు చీరె పళ్ళెంలో పెట్టి కాళ్ళు మొక్కింది వెంకాయమ్మ.
“అమ్మో మళ్ళీ రావడమా? ఈ నాలుగు రోజులకే చచ్చిపోయామనుకో” ఏదో జైలు నుండి స్వేచ్ఛ లభించినట్టు చటుక్కున అంది మణి.
“అదేమక్కా! మా ఊరు అంత మొహం మొత్తిందా!” నొచ్చుకొంది వెంకాయమ్మ.
“మొహం కొట్టక నచ్చడానికి ఇదేమయినా ఊటీయా, సింగపూరా. నేనయితే చచ్చిపోయాననుకో.” తనేదో ఆకాశమార్గాన విహిరించే యక్షకన్యయి శాపవశాత్తు ఆ ఊళ్ళో అడుగు పెట్టినట్టు అవమాన పడిపోయింది.
“దాని మాటలకేం గానీ, కుదిరితే ఎప్పుడో వస్తాం లేమ్మా” సర్ది చెప్పాడు విశ్వం.
“మీరొస్తే రండీ! నేను మాత్రం చస్తే రాను. హమ్మో హరిబుల్” నిష్కర్షగా అంది.
విశ్వంకి చిర్రెత్తుకొచ్చింది. మనుషులెంత కృత్రిమ పటాటోపం ప్రదర్శిస్తారు. పుట్టడమే తూగుటుయ్యాల్లో పుట్టి, రాజమహల్లో పెరిగినట్టు గతం మర్చిపోయి ఎందుకంతగా విర్రవీగుతారో? అసలు తాను రేయింబగళ్ళు కష్టపడి ఉద్యోగం తెచ్చుకోకపోతే తన భార్య వీళ్ళకన్నా మెరుగ్గా ఉండేదా? అనకూడదు గానీ విజయం తనదైతే విర్రవీగడం వీరి వంతు. ఆలోచనలు మెదడను తొలిచేస్తుంటే అన్యమనస్కంగానే కారు ఎక్కాడు. ఊరు దాటగానే ఉండబట్టలేక “నీకసలు ఎపుడు ఏం మట్లాడాలో తెలియదా.. ఎందకంట పొగరు. నీవేం పుట్టుకతో శ్రీమంతురాలివా?” సూటిగా అడిగాడు.
“మీకే తెల్సు ఆఢాళ్ళు కష్టాలు? ఉన్న నాలుగు రోజులు మీ మరదలు ఎంత ఈసు చూపిందో నా మీద” అంటూ ఎదురు దాడికి దిగింది.
“ఆమో ఈర్ష్య చూపడంలో అర్థం ఉంది. కానీ నీ అహంకారంలోనే రీజన్ లేదు. ఎందుకంటే వాళ్ళు కుళ్ళుకొనే స్థాయిలోనే మనమున్నాం కదా..”విశదీకరించబోయాడు విశ్వం పెళ్ళానికి.
“అందుకు మనమేం చేస్తాం. వాళ్ళ ఖర్మ అట్లా ఏడిచింది..” పుల్లవిరుపుగా అంది మణి.
“ఖర్మ వాళ్ళది కాదు, తమది అదృష్టం. నేను చదువుకొంటుంటే తమ్ముడు నాన్నకి వ్యవసాయంలో సాయపడుతూ తన జీవితాన్ని త్యాగం చేసి నా విజయానికి పరోక్షంగా తోడ్పడ్డాడు. అందుకే వాడట్లా మిగిలిపోయాడు. నిజానికి చదువులో వాడు నాకన్నా చురుకు. నిజంగా వాడే గనక చదివి ఉంటే నాకన్నా ఉన్నత స్థితిలో ఉండేవాడు.”
“ఇంకా నయం ఉద్యోగం కూడా అతడే ఇప్పించాడని అన్లేదు” అడ్డంగా వాదించింది మణి.
“పోనీలే డాడీ..” వెంకట్ ఇద్దరికీ కుదిర్చే ప్రయత్నం చేశాడు. విశ్వం కూడా భార్యతో వాదించి ప్రయోజనం లేదని మౌనం వహించేడు.
***
“ఈ పట్టుచీర ఇట్లా తగలబడిందేమిరా..?” మణి కేకలేస్తోంది.
“ఏమయింది మమ్మీ! అయ్యో నేనే, పొట్లాంలో తుమ్మ బంక కట్టి బ్యాగులో పెట్టాను. వాటర్ బాటిల్ దానిపై లీకయినట్టుంది” వెంకట్ నొచ్చుకొన్నాడు.
యాభయివేల పట్టు చీర మీద లతలు లతలుగా పేరుకుపోయి అట్టలు కట్టిన మరకలు చూసి మణి కాళికలా మారిపోయంది.
“నీ బొందరా పట్టుచీర.. బంగారం లాంటి పట్టుచీర నాశనం చేసేవ్..”
“నే చెప్పాను కదారా! ఆ తుమ్మ బంక నీళ్ళు తగిలితే అట్లా అవుతుందనీ . తీసుకు రావద్దనీ..” అప్పుడే అక్కడ కొచ్చిన విశ్వం కసిరేడు.
“సారీ డాడీ! డ్రైక్లీనింగ్ చేస్తే పోదా?”
“పోతుంది కానీ, చీర సర్వనాశనం అవుతుంది. సిగ్గు లేదురా! అడ్డమైన పనులు, లేకి గుణాలు” అలుపూ సొలుపూ లేకుండా అరుస్తూనే ఉంది. ఆమె కెంతో ఇష్టమైన క్రీమ్ కలర్ చీర అది. ఇరవై కొట్లు తిరిగి తిరిగీ చివరకు ఏరి కోరి కొనుక్కొంది. గట్టిగా పది సార్లు కట్టుకొన్న జ్ఞాపకం లేదు. ఇంతలేనే ఎందుకూ పనికి రాకుండా పోయింది.
“నేనిక్కడికీ ముందే చెప్పాను. ఆ దిరద్రం వొద్దురా అనీ..” విశ్వం కూడా భార్యకే వత్తాసు పలికేడు.
“పోనీలే డాడీ! ఆ మరకలు మళ్ళీ కన్పించకుండా ఏ మాత్రం చీర పాడవకుండా బాగు చేయించే పూచీ నాది. నువ్వయినా నాకు సపోర్డు చేస్తావనుకొంటే నువ్వూ తిడుతున్నావ్.”
“తిట్టనా మరీ, పొద్దున స్టీల్ చెంబులో నువు నానబెట్టినది ఆ గమ్మే తెలియక మంచి నీళ్ళనుకొని తాగబోయాను. ఇంటినిండా ఒలికిపోయింది. నోరూ ఫ్లోరూ పాడు.. పాడూ..” విసుక్కొన్నాడు విశ్వం.
“అరే అంతా పోయిందా? ” వెంకట్ గొంతులో ఆరాటం.
“ఉందిలే! ఇంకా అది ఎన్ని పనులు చెడగొట్టాలో, తీసుకెళ్ళి కాలవలో పోస్తే సరి!”
వెంకట్ అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయాడు.
***
“బిల్డింగ్ మొత్తానికి ఒకే రకమయిన ఇసుక అదీ నాణ్యమైనది కావాలి! ఎక్కడ నుండి తెస్తావో నీ ఇష్టం. డబ్బు ఎంతైనా పరవాలేదు. మాల్ బాగా లేకపోతే మాత్రం నేనూరుకోను. నీ వల్ల కాకపోతే చెప్పు, మరో మేస్త్రీని మాట్లాడుకుంటాను” కరకుగా ఉంది ఆ గొంతు.
“సిర్సిల్ల వాగిసుక అయితే నెంబర్ ఏక్. కానీ అక్కడి చుట్టు పక్కల ఊరు వాళ్ళు తీసుకురానివ్వడం లేదు. రోడ్ మీద చెకింగ్ కూడా మస్తుగా ఉంది. తేవడం శానా కష్టం”
“ఏం కష్టమయ్యా? ఒట్టి పిరికి వాడిలా ఉన్నావ్, ఎలా బతుకుతావ్”
“అది కాదు సార్..”
“ఏది కాదు. డబ్బెంతయినా తీసుకో అన్నానా?”
“అవుననుకో.. అయినా కష్టమే సార్..!”
“అయితే వొద్దులే.. మరో మనిషిని చూసుకొంటా.. ఆలోచించుకో కనీసం అయిదు లక్షల ఇసుక అవసరపడుతుంది..” ఆ గొంతు రాజకీయం చూపింది.
“సరే సార్.. నేనే తెస్తాను..” మేస్త్రీ బతిమాలుతున్నాడు.
“సరే కానీ మోసం చేశావో అస్సలు బాగుండదు. సిర్సిల్ల వాగిసుక అంటే సిర్సిల్ల వాగుదే కావాలి..”
“తెల్సు సార్.. మీరు ఖచ్చితం మనిషిని..” నవ్వాడు మేస్త్రీ.
“అయితే ఎల్లుండి శుక్రవారం మంచి రోజు వచ్చి అడ్వాన్స్ తీసుకుపో..”
“అట్లే కానీయండి సార్..”
పొద్దున లేస్తూనే విశ్వం మళ్ళీ కేకలేస్తున్నాడు. ఆ కేకల్లో పట్టరాని ఆవేశం ఉంది. భరించలేని బి.పి.తో ఊగిపోతున్నాడు కళ్ళు ఎర్రగా అయిపోయాయి.
“ఏమైందండీ..” మణి అడిగింది.
“ఈ వెంకట్ గాడెక్కడ చచ్చాడు! వాడు చేసే పనులతో నా ప్రాణం పోయేలా ఉంది !” ఉద్యోగం హోదా.. అనుభవం, వయసు అన్ని మరచిపోయి బూతులు అందుకొన్నాడు.
“ఏమైందండీ.. ఏమైందంటే చెప్పరే..” రెట్టించింది భార్యామణి.
“ఇంకా ఏం కావాలి? ఆ స్టీల్ చెంబులోని నానవేసిన తుమ్మ బంక వొలికి నా రీసెర్చ్ ఆర్టికల్ పేపర్ల మీద పడింది.”
“ఓస్ అంతేనా! ఇంకా ఏదో సర్టిఫికెట్ల మీద పడ్డట్టు అరుస్తారే..”
“హాఁ.. అదొక్కటే తక్కువ ఇంకా వాటి మీద పడాలా.. ఇవీ ముఖ్యమైన కాగితాలేనే.. ఇపుడో ఆంగ్ల పత్రికకు పంపాలి. రాత్రంతా కూచుండి రాశాను.”
“గొప్ప పని చేశారు. అయినా దానికి నా మీద అరుస్తారేం? వాణ్ణే అడగండీ..”
“అయినా వాడికిదేం పిచ్చే! మనకెపుడో అరకొరగా అవసరపడే గమ్ ఇలా కేజీలకు కేజీలు తెచ్చి ఇట్లా వస్తవులన్నీ పాడుచేస్తూ ప్రాణం తీస్తున్నాడు.”
“నాకేం తెల్సు! వాడికి మీ బాపతు పిచ్చే! అదిగో వస్తున్నాడు, వాడినే అడగండి.” హాల్లో కనిపించిన కొడుకును చూస్తూ అంది. ఆ తర్వాత అరగంట విశ్వం తిట్లతో వెంకట్ తలవాచిపోయింది.
***
“డాడీ!
మనం మన ఊరికి వెళ్ళిరావడం కాదుగానీ నాకెన్నో కొత్త కొత్త విషయాలు తెలిసొచ్చాయి. అందులో ముఖ్యంగా మీ అసలైన మనస్తత్వం. ఇట్లా అంటున్నాని ఏమీ అనుకోకండి. ప్రస్తుతం సమాజం నానారకాల రుగ్మతలతో కునారిల్లడానికి మీ లాంటి.. సారీ.. మనలాంటి బహురూపులే అసలు కారణం. మనం బాగా సుఖానికి అలవాటు పడిపోయాము. అందువల్లే గ్లోబలీకరణ, సామాజ్యవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థ మనల్ని దెబ్బతీయగలుగుతున్నాయ్. ఒక్క తుమ్మ చెట్టు బంకను అదీ ఉత్తగానే వస్తున్నా నిలువ చేసే ఓపికా, ఇష్టం లేక అయిదు రూపాయల ట్యూబ్ తెచ్చుకొని అవసరం వెళ్ళదీస్తుకొంటున్నాం. చేనేత కార్మికుల దీనావస్థ గురించి గంటల కొద్దీ లెక్టర్లిచ్చే మనం ఎన్నడూ చేనేత చొక్కా కుట్టించుకోం సరికదా! కనీసం లుంగీ తువ్వాలు కూడా గీచి గీచి బేరమాడి కొంటాం. వాగులెండిపోతున్నాయని గొంతెండిపోయేలా అరుస్తాం.. మళ్ళీ మన బిల్డింగులకి మాత్రం నాణ్యమైన ఇసుకే కావాలి. పట్నాలకి వలసలు పెరుగుతున్నాయని, పల్లెలు వొట్టిపోతున్నాయని వాపోయే మనం ఏ పనీ లేకున్నా ఇక్కడెందుకుండాలి? ఎందుకు విశ్వం గారూ! రెండు ముఖాల ధోరణి ఎవర్ని ఉద్ధరించడానికీ! అసలు దొంగలం మనమే! దొంగల్ని పాత్రధారుల్ని చేసివాడు అత్యంత నిబద్ధంగా ‘దొంగాట’ ఆడుతున్నాడు. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం! సమాజం తద్వారా ప్రపంచం మారాలంటే ముందు మనం మారాలి! ఐనా నేను మీకు చెప్పేంత వాడిని కాదులెండీ! ఏదో నాకు తోచిన మాటలివి.
వెంకట్.”
డ్రెస్సింగ్ టేబుల్ మీద కనిపించిన చీటి చదివి అప్రతిభడయిపోయేడు విశ్వం. చాలాసేపు అభావంగా ఉండిపోవాల్సి వచ్చింది.
“మణీ.. వెంకట్ ఏడీ..?”
“ఇవాళ వాడి పుట్టిన రోజు కదా! ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళాడు.”
“అవును కదూ! తొందరగా బయటకెళ్ళి వాడికో డ్రస్సు తేవాలి!”
“మీకు గుర్తుంటుదన్న ఆశ నాకెప్పుడూ లేదు గానీ, రాత్రి ఓ డ్రస్సు తెచ్చి బీరువాలో పెట్టాను.” అలవాటుగా దెప్పి పొడిచింది మణి.
“సారీ మణీ! ఇంతకు డ్రస్సు.. ఆఁ.. బీరువాలో ఉంది కదూ!”
అయిందారు నిమషాల తర్వాత డ్రస్సు వెదికి పట్టుకొని దాంట్లో అయిదొందల కట్ట ఒకటి పెట్టి ఓ చిన్న చీటి రాసి ఉంచాడు విశ్వం.
“నిజమే కన్నా! మనం మారకుండా ప్రపంచం మారాలని ఆశించడం మూర్ఖత్వమే కాదు. దేశద్రోహం కూడా!..”
మళ్ళీ ఆ వాక్యం చదువుకొని సంతృప్తిగా నిట్టూర్చాడు విశ్వం.
చొప్పదండి సుధాకర్ కథా రచయిత. నవలా రచయిత, కవి. సిద్ధిపేట నివాసి. వృత్తి రీత్యా అధ్యాపకుడు.
