2026 వినాయక చవితి సందర్భంగా సంచిక నిర్వహించిన బాలల కథల పోటీని విజయవంతం చేసిన రచయితలకు కృతజ్ఞతలు.
బాలల కథల పోటీకి పెద్ద సంఖ్యలో పాల్గొని, ఎంతో ఉత్సాహంతో విభిన్నమైన కథలను పంపిన రచయితలందరికీ బహు కృతజ్ఞతలు తెలియచేస్తుంది సంచిక. బాలల కోసం రచనలు చేయటం కష్టమైన పని. ముఖ్యంగా, రచనలు చేసేవారు అధికంగా పెద్ద వయసువారే. వారు తమ బాల్యానుభవాలను గుర్తు చేసుకుంటూ, ప్రస్తుతం పిల్లలు పెరుగుతున్నవాతావరణం, వారి ఎదురుగా ఉన్న సవాళ్ళు, సమస్యలను గుర్తించి, పరిష్కారాలు సూచిస్తూ, పిల్లలల్లోని సృజనాత్మకతకూ, ఊహాశక్తికీ ఊపునుచ్చే రీతిలో, వారి ఆలోచనలకొక దిశనిచ్చే రీతిలో రచనలను సృజించటం సామాన్యమైన పని కాదు. పైగా, ఈ కథలు ఏదో నీతి చెప్తున్నట్టుండకూడదు. ఇలా ఉండండి అని నిర్దేశిస్తున్నట్టుండకూడదు. సున్నితంగా నిజానిజాలను వివరిస్తూ, నిజం, వారే స్వయంగా గ్రహించేట్టుండాలి. బాల కథా రచయితలు భావి తరాలకు చేసే గొప్ప మేలేమిటంటే, పిల్లల్లో ఆరంభం నుంచే పఠనాసక్తి కలిగించే అంశాలతో కథా రచన చేయటం. బాల కథలు నీతులు చెప్పనవసరం లేదు. వారిలో పఠనాసక్తి కలిగిస్తే చాలు, వారి ఊహా శక్తికి రెక్కలనిస్తే చాలు, తమ గమ్యం నిశ్చయించుకుని ఆ వైపు దూసుకుపోతారు పిల్లలు. అందుకే, బాలకోసం రచనలు చేయటం, ఈ సమాజంలోనయినా, అత్యంత ఆవశ్యకం.
దాదాపుగా 150 కథలు అందాయి. సంచిక ఏర్పాటు చేసుకున్న ప్రక్రియ ప్రకారం బహుమతికి అర్హమయిన కథల ఎంపిక జరిగింది. అధిక శాతం రచయితలు కథలను విభిన్నంగా రాయాలని ప్రయత్నించారు. ముఖ్యంగా, ఆధునిక సమాజంలో పిల్లలను ఆకర్షించి తప్పుదారి పట్టించే అంశాలను ఎత్తి చూపిస్తూ, వాటినుంచి పిల్లలు తమని తాము కాపాడుకొనే పద్ధతులను సృజనాత్మకంగా సూచించారు. కొన్ని కథల్లో, పిల్లలకు వినూత్నమైన ఆలోచనలనిచ్చి వారి సృజనాత్మకతకు దిశనివ్వాలన్న ప్రత్నాలు కనిపించాయి. విభిన్నంగా రాయాలన్న తపనలో కొందరు రచయితలు ఆంగ్ల సైన్స్ ఫిక్షన్ సినిమాలను కథగా అందించాలని ప్రయత్నించటమూ కనిపించింది. కొన్ని కథలు మనకలవాటయిన రీతిలో నీతులు చెప్పాలని ప్రయత్నించాయి. ఈ కథలలోంచి న్యాయ నిర్ణేతలకు తమకు ఉత్తమంగా అనిపించిన ఏడు కథల జాబితాను ఆందించారు.
న్యాయనిర్ణేతలిచ్చిన కథల జాబితా ద్వారా రచయితలను గుర్తించి వారి పేర్లు కథలకు జోడిస్తున్నప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురయింది. ఒకే కథకుడి మూడు కథలు ఎంపికయిన ఏడు కథలలో ఉన్నాయి. ఇది విచిత్రమైన పరిస్థితి. ఇంతవరకూ సంచిక ఎదుర్కోని పరిస్థితి. ఒకే కథకుడికి మూడు బహుమతులెలా ఇస్తాము? ఒక రచయితకు ఒక బహుమతే సబబు. కాబట్టి, ఈ మూడు కథల్లోంచి ఒక కథను ఎన్నుకుని మిగతా కథల్లోంచి ఇంకో రెండు కథలను ఎన్నుకుంటే ఇంకో ఇద్దరు రచయితలను ప్రోత్సహించినట్టు అవుతుంది కాబట్టి, ఈ సూచనను న్యానిర్ణేతలకు ఇచ్చి ఏవైనా రెండు కథలను సూచించమని అడిగాము. అప్పుడు న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలు ఆలోచనలో పడేశాయి.
సంచికలో ఒక రచయిత ఒకే కథ పంపించాలన్న నియమం లేదు. ఒక రచయిత ఎన్ని కథలయినా పంపించవచ్చు. కాబట్టి, ఒక రచయిత ఒకే కథకు బహుమతి ఇవ్వాలన్న నియమంలో తర్క దూరం కదా! ఒక రచయిత ఒకే కథకు బహుమతి ఇచ్చేట్టయితే, ఎన్ని కథలయినా పంపవచ్చన్నది అర్థం లేనిదవుతుంది కదా? పైగా, నియమాలలో, ఎన్ని కథలు పంపినా ఉత్తమంగా ఉన్న ఒకే కథను ఎంపికచేస్తామనీ చెప్పలేదు. అదీగాక, మనం ఎంచుకుంటున్నది ఉత్తమ కథలు కానీ రచయితలను కాదు కదా? అదీగాక, ఒకే రచయిత పంపిన మూడు కథలూ ఉత్తమ స్థాయిలో ఉండి, ఏ కథనూ పక్కన పెట్టే వీలు లేక, ఏ కథ మరో కథతో పోల్చి తీసేసే వీలు లేక మూడు కథలనూ ఎన్నుకోవాల్సివచ్చిందనీ, వాటిల్లోంచి ఒక కథను ఎన్నుకోవటం తమవల్ల కాదనీ, న్యాయనిర్ణేతలు నిర్మొహమాటంగా చెప్పేశారు. దాంతో, ఒకే కథకుడి రాసిన మూడు కథలకూ బహుమతులివ్వాలని నిశ్చయించింది సంచిక.
నిజమే, కథల పోటీల్లో మనం ఉత్తమ కథలను ఎంపిక చేసి బహుమతులందచేస్తాము. బహుమతి ప్రత్యక్షంగా కథకు. కథ వల్ల రచయితకు బహుమతి తప్ప, రచయిత వల్ల కథకు బహుమతి కాదు. కాబట్టి, ఒక రచయిత పంపిన ఒకటి కన్నా ఎక్కువ కథల్లో, ఒకటి కన్నా ఎక్కువ కథలు బాగుంటే, ఇతర కథలతో పోలిస్తే ఈ కథలు ఉత్తమ స్థాయిలో ఉంటే, ఒకే రచయిత రాసిన కథలకు ఒకటి కన్నా ఎక్కువ బహుమతులివ్వటంలో దోషం లేదన్న నిర్ణయానికి వచ్చింది సంచిక. అందుకే, ఈ సారి ఎంపికయిన కథల్లో, ఒకే రచయితవి మూడు కథలు కనిపిస్తాయి. ఇలాంటి చక్కని కథలు రాసి సంచికకు అతి చక్కని కథలు అందిస్తున్న రచయితలందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఉత్తమ నాణ్యత, ఉన్నతమైన సృజనాత్మకతలతో అలరారే కథలతో సంచికను అలరించాలనీ, తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేయాలని సంచిక తెలుగు రచయితలందరినీ ముకుళిత హస్తాలతో అభ్యర్ధిస్తున్నది.
న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన కథలు, రచయితలు:
- మనసు చేసే మాయ – మాచిరాజు కామేశ్వర రావు
- మనలోని మాయ – డా. మామిడాల శైలజ
- విజయానికి వంతెన – మాధవి బైటారు (దేవి తనయ)
- చిన్ని వివేక్ – విచిత్ర భూతం – కరణం హరికిషన్
- చందమామ మాయమైంది! – రమణ బంధకవి
- ‘లైబ్రరీ ఎక్స్ప్రెస్ – టైమ్ ట్రావెల్’ – రమణ బంధకవి
- మిణుగురుల బడి – రమణ బంధకవి
వీరికి ఒక్కొక్కరికి 1000/- చొప్పున బహుమతి మొత్తం పంపడమైనది. సాధారణ ప్రచురణకు స్వీకరించిన రచనల జాబితా వచ్చే ఆదివారం ప్రచురిస్తాము.

