Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బంధించిన బాల్యం

[శ్రీమతి షామీర్ జానకీదేవి రచించిన ‘బంధించిన బాల్యం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

రాఘవరావుది పల్లెటూరు జీవితం.. భార్య సీత, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు.. మధ్యలో అప్పుడప్పుడు వచ్చే అక్క, చెల్లి.. తను టీచర్‌గా తరువాత హెడ్ మాస్టర్‌గా అక్కడే రిటైర్ అయ్యాడు.. రెండు బెడ్ రూములతో ఒక ఇల్లు, రెండెకరాల పొలం, ఇవీ అతని ఆస్తులు.. తండ్రి ఉన్నప్పుడు పెంకుటింట్లో ఉండేవారు.. తరువాత, కాలానుగుణంగా బ్యాంకు వారి సహాయంతో మంచి ఇల్లు కట్టుకున్నాడు..

ఇల్లు దక్షిణం గోడకు జరిపి ఉత్తరంలో ఎక్కువ స్థలం వచ్చేట్లుగా కట్టించాడు.. ఈశాన్యంలో బావి పక్కనే అరటి చెట్లు.. తండ్రి ఉన్నప్పుడు ఆయన బావి దగ్గరే స్నానం చేసేవారు.. ఆ నీళ్ళు మొక్కలకు అందేలా బావి చుట్టూ సిమెంట్‌తో కట్ట కట్టించి నీళ్ళు చెట్లకు పోయేలా కాలువ కట్టించాడు.. పాత రోజుల్లో సౌకర్యానికి అంత ప్రాధాన్యత ఉండేది కాదు..

పిల్లలు పెద్దవాళ్ళు కావడంతో వారి కోసం కొంత ఆధునికత ఏర్పరచుకున్నారు.. బావికి మోటారు, బాత్రూములో గీజరు, కారు ఇలా సిటీ హంగులు స్వంతం చేసుకున్నారు.. ఇద్దరు కొడుకులు ప్రవీణ్, ప్రశాంత్ పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్నారు.. తరువాత ఇంటర్, ఇంజనీరింగ్ సిటీలో హాస్టల్లో ఉండి చదివారు.. ఆ తరువాత ఎమ్.ఎస్ అంటూ అమెరికాకు జంప్.. ప్రస్తుతం పెళ్ళి చేసుకుని ఇద్దరూ అమెరికాలోనే సెటిల్ అయ్యారు.. పెద్దవాడికి ఒక కొడుకు, కూతురు.. రెండో వాడికి ఒక కొడుకు.. ఇద్దరూ 5 గంటల డ్రైవ్ దూరంలో ఉన్నారు.. అప్పుడప్పుడు కలుసుకుంటూ వుంటారు.. ఆ మాత్రం బంధాలు నిలుపుకుంటే చాలు అనుకుంటాడు రాఘవరావు..

పెద్ద కోడలు ఈ మధ్యనే ఉద్యోగంలో చేరింది.. ఇద్దరు పిల్లలకు ఎక్కువ గ్యాప్ లేదు.. బాబుకు మూడేళ్ళు పాపకు రెండేళ్ళు.. తల్లిదండ్రులను ఒక ఆరునెలల కోసం అమెరికా పిలిపించుకున్నాడు..

ఉదయం ఏడు గంటలకు వెళ్ళి పోతారు కొడుకు, కోడలు.. వెంట బాబుని తీసుకెళ్ళి డే కేర్‌లో వదిలి వెళ్తారు.. నిద్ర కళ్ళతోనే వెళ్ళిపోతాడు పిల్లాడు.. అక్కడ డే కేర్ వాళ్ళే ఫుడ్ పెడతారు.. ఎండ, వాన, మట్టి వాసన, ఇసుకలో ఆడటం, నీళ్ళలో తడవడం ఇవేమీ పిల్లలకు తెలియవు.. చుట్టూ మంచు.. ఉంటే ఇల్లు, కారు లేదా డే కేర్.. నాలుగు రోజుల్లో పాప అలవాటైంది.. అక్కడ వాతావరణానికి అనుగుణంగా ఉంటున్నారు..

రోజూ కొడుకు కోడలు పిల్లవాడితో వెళుతుంటే ఒక రకమైన ఆవేదన కలుగుతుంది.. వాళ్ళు వెళ్ళగానే ఆయన మనసు గతం వైపు పరుగెడుతుంది..

తమ బాల్యం ఎంతో ఆనందంగా ఉండేది.. అప్పుడే కొత్తగా ఊర్లో బోరు పంపులు పెట్టారు.. ఒకరి తరువాత ఒకరు బోరు కొడుతూ ఆ నీళ్ళలో చేసిన విన్యాసాలు.. ఎంతో సరదాగా ఉండేది.. ఒకసారి బోరు క్రింద కూర్చున్న తనకు అది కొట్టుకుని రక్తం వచ్చింది.. అందరూ భయపడి పోయారు.. జరిగింది నాన్నకు చెపితే ఎంతో కూల్‌గా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి రెండు కుట్లు వేయించి బ్యాండేజితో ఇంటికి తీసుకొచ్చారు..

ఒకసారి వర్షం అని అమ్మ గొడుగు ఇచ్చి పంపింది.. గొడుగు పక్కన పెట్టి నీళ్ళలో ఆడుకుంటూ చేసిన డాన్స్ ఇంకా కళ్ళలో మెదులుతోంది.. బాల్యం అనుభూతుల పర్వం.. కాని వాటన్నింటినీ పిల్లలకు దూరం చేస్తున్నామా.. ఏమో?..

ఇప్పుడేంటి ఏది కొట్టుకున్నా భయమే.. ప్రతిదానికి పరీక్షలే.. తిన్నా, తినకున్నా భయమే.. అటు నడవకు కుర్చీ కొట్టుకుంటుంది.. ఇది తినకు జలుబు చేస్తుంది.. బయటికి వెళ్ళిరాగానే చేతులు కడుక్కున్నావా?.. ఇవీ అనుక్షణం మనం వాళ్ళకు వేసే ప్రశ్నలు.. ఇక ఆ పిల్లలు ఏం చెయ్యాలి?.. ఇలా అన్నీ ఆంక్షలే.. అడుగడుగునా భయపడుతూ ఉంటే, ఈ జీవితంలో పిల్లలకు ఆనందం ఎప్పుడు లభిస్తుంది?.. వారికి ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుంది?..

ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ సహజమే అయినా, జీవితంలో అన్నీ ఒడిదుడుకులు చూసిన మనకు వింతగా అనిపించినా, వాటికి తలవొగ్గటం మినహా ఏమీ చేయలేని అశక్తులం.. అనుకుంటూ నిట్టూర్చాడు.

Exit mobile version