[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘బంగారు శోకం’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
కరెక్ట్‌గా శేఖర్ బండి ఆపీ ఆపగానే, లలిత అటు ఇటు అయోమయంగా చూసి, “ఏవండీ ఇక్కడ మామూలుగా ఆపారా? లేక కావాలనే ఆపారా. ఒకసారి మీ తల కుడి వైపుకి తిప్పి చూడండి” అందామె.
అతను భయం భయంగా కుడిపక్కకి తిరిగి చూసాడు. అదో పెద్ద జువెలరీ షాప్. భయంగా ఒక గుటక మింగి, తర్వాత క్షణంలో కాస్త ధైర్యం తెచ్చుకుని, “కావాలనే ఆపాను. ఈరోజు నీ పుట్టినరోజు కదా, అడక్కడక్క ఓ బంగారు ఉంగరం కావాలన్నావ్. సరే నీ మాట ఎందుకు కాదనాలి. అందుకే ఎప్పటినుంచో వాయిదా వేస్తూ వచ్చినా, ఈ పుట్టినరోజుకి నీకు బంగారం ఉంగరం కొనాలని డిసైడ్ అయ్యాను” చెప్పాడు చిరునవ్వుతో
దాంతో “నిజమా” అంటూ బండి మీద నుండి ఓ గెంతు గెంతి, “భలే భలే” అని చప్పట్లు కొట్టి “మా మంచి శ్రీవారు” అంటూ శేఖరం బుగ్గ గిల్లి, ఆ షాప్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది.
‘దీనికి సంతోషం వస్తే, కాళ్లు నేల మీద ఆనవు’, అనుకుంటూ బండి పక్కకి పార్క్ చేసి, లోపలికి వెళ్ళాడు.
గోల్డ్ షాప్ సేల్స్‌మన్ నవ్వుతూ వచ్చి “రండి సార్ ఏం కావాలి” అడిగాడు.
“ఉంగరాలు కావాలి” చెప్పగానే “అటు” అన్నాడు
“సరే అయితే, కానీ నా దగ్గర తులం ఉంగరం ఉంది. దానికి మీరు ఎంత రేటు కడితే, దానికి తగ్గట్టుగానే ఓ కొత్త ఉంగరం మా ఆవిడకి తీసుకుంటాను. ఎక్కువ పడితే, ఆ డబ్బు ఇచ్చేసి ఉంగరం తీసుకుంటాను” చెప్పాడు
“సరే సరే అటు వెళ్ళండి.మీ ఉంగరానికి ఎస్టిమేషన్ వేసి ఇస్తారు” అన్నాడు ఆ సేల్స్‌మన్.
అటుగా ఒక మూల చిరాకు మొహంతో కూర్చున్న వ్యక్తి వైపు నడిచి “ఇదిగోండి, ఈ ఉంగరానికి ఎంత వస్తుందో చూడండి” అన్నాడు తన ఉంగరం తీసిస్తూ.
అతను దాన్ని ఏగాదిగా చూసి, “ఆగండి ఒక నిమిషం” అన్నాడు నిర్లక్ష్యంగా. తర్వాత ఉంగరం తీసుకుని అటు ఇటు చూసి, బాగా పరికించి చూసి, వెయిట్ చూసాడు. “మీరు అన్నట్టుగానే పదకొండు గ్రాముల పైన ఉంది”. అని ఇంకా డౌట్‌గా చూస్తున్నాడు. తరువాత మెల్ట్ అని ఒక చిన్న కాగితం పై రాసి శేఖర్ చేతిలో పెట్టాడు. పైగా దాంట్లో లక్షా ఇరవై వేలు అని రాశాడు.
దాంతో శేఖర్ సందేహంగా “అదేమిటి లక్షా ఇరవై వేలు అని రాశారు. తులం లక్షా యాభై వేలు ఉంది కదా”. అడిగాడు ఆశ్చర్యంగా.
“ఈ ఉంగరం పాతది కదా. కరిగిస్తే అపుడు కరెక్ట్‌గా తెలుస్తుంది. ముందు కొత్త ఉంగరం చూడండి” అన్నాడతడు.
సరే అని మాడు మొహంతో, మాటిచ్చాక తప్పుతుందా, అని అప్పటికే బాగా ఉత్సాహంగా ఉంగరాలు చూస్తున్న లలిత దగ్గరకి వెళ్ళి, “నీకు ఏదైనా ఉంగరం నచ్చిందా” అని అడిగాడు.
“ఈ ఉంగరం బాగుందండి”
“ఎంతట” అన్నాడు
“తులం ఉంగరం, లక్షా డెబ్భై ఐదు వేలు అంటున్నారు” కళ్ళు పత్తి కాయల్లా పెద్దగా చేస్తూ చెప్పింది
“అదేమిటి! తులం లక్షా యాభై వేల ధర ఉంది కదా”అడిగాడు.
“తరుగు, మజూరి అన్ని చార్జీలతోనూ కలిపి అట” అంది.
“మరీ అంతా” అడిగాడు నోరెళ్లబెడుతూ.
“మరి ఏమనుకుంటున్నారు. ఇది బంగారం కొట్టు. మీరు ఎప్పుడో అమావాస్యకి, పౌర్ణమికీ కొంటే ఇలానే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ రింగ్ తీసుకుంటాను” అంది వేలికి పెట్టుకుని.
“సరే నా ఉంగరానికి ఎంత ఇస్తారో చూస్తాను ఉండు” అంటూ మళ్ళీ ఆ ఎస్టిమేషన్ కౌంటర్ దగ్గరకి వెళ్ళాడు.
అతను శేఖర్ ఉంగరాన్ని ముక్కలు ముక్కలు చేసి, తుక్కుతుక్కు చేసి, కళ్ళ ముందే దాన్ని కరిగించి, పిసరంత ఉండ చేసాడు. దాన్ని పరీక్షగా చెక్ చేసి, “ఇందులో కొంచెం రాగి కలిసినట్టు ఉందండి పైగా పాతది కూడా అయిపోయింది. పైగా కొంత వెయిట్ కూడా తగ్గుతున్నట్టు అనిపించింది” అని ఇంకేదో అనేంతలో
“నోరు మూసుకొని, ఎంత వస్తుందో చెప్తావా” విసుగ్గా అన్నాడు.
“ఇది అంత రాదండి, వస్తే ఎనభై వేలు రావచ్చు” అన్నాడు
“అదేమిటి లక్ష యాభై వేలు రాసావు కదా ఇప్పుడు ఇలా అంటున్నావ్. అది, పైగా నా బంగారు ఉంగరాన్ని కట్ చేసి కరగబెట్టి నాశనం చేసావ్ కూడా” అసహనంగా అన్నాడు.
“మీకు ఇష్టమైతే తీసుకోండి, లేదంటే లేదు” అన్నాడు పిసరంత ముద్దగా చేసిన చిన్న ఉండని తన చేతిలో పెడుతూ
“బంగారం ఉంగరం కరగబెట్టి నాకే మళ్లీ కబుర్లు చెప్తావా” అని పళ్ళు కొరుకుతుండగా,
“ఎంతసేపండీ” అరిచింది లలిత.
లలిత పిలుపు విన్న శేఖర్ “సరే చస్తానా, సరే ఆ రేటే కట్టు” అన్నాడు
తర్వాత డబ్బు ఇచ్చి ఉంగరం, బిల్లు తీసుకుని ముందుకు నడుస్తుండగా, ఒక అందమైన అమ్మాయి పక్కన నిలబడి “ఇది చూడండి” అంది.
“ఏమిటది” అన్నాడు
“ఇది గోల్డ్ స్కీం అప్లికేషన్, మా దగ్గర వాయిదాలు కట్టి బంగారం కొంటే మీరు కొన్న దాంట్లో తరుగు తగ్గిస్తాం. మీరు వెయ్యి నుంచి మొదలు ఎంత కట్టినా పర్వాలేదు. ఇంకా కావాలంటే సంవత్సరం అయ్యాక మీకు తరుగు మజూరీలో ఆదా అయిన డబ్బులు మీ చేతిలో పెడతాం” అంది.
“వద్దు ఇప్పటికే మేం మోసపోయింది చాలు ఇంకా ఇలాంటి స్కీముల స్కాములలోకి మమ్మల్ని లాగొద్దు” అని ఆ పేపర్ని పర పరా చింపేసి ఆమె మొహం మీద కొట్టి, అక్కడి నుంచి బయటపడుతూ, ‘ఇలా చీటికీ మాటికీ బంగారం కొనడం వల్లే, మన విదేశీ నగదు నిలవలు తగ్గిపోతున్నాయ్. ఇలా ఎగబడి బంగారం కొనడం, ఇంటితో పాటు ఇండియాకీ మంచిది కాదని అర్థవైంది. పైగా కొన్నా, అమ్మినా షాప్ వాడికే లాభం. మోసం చేయకుండా సరైన ధరకి బంగారం అమ్మే వాళ్ళు ఎక్కడో కొద్దిమంది ఉన్నారు’ అనుకుంటూ ఏడుపు మొహంతో షాప్ బయటకి నడిచాడు.
కానీ ఇవేవీ పట్టనట్టు, లలిత తన ఉంగరం చూసుకుంటూ తెగ మురిసిపోసాగింది.
