Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బంగారు పిచ్చుక కథ

[వివిధ జంతువుల ప్రత్యేకతలను చిన్న వ్యాసాలుగా బాలబాలికలకు అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]

పిల్లలూ!

ఎగిరెగిరి గంతు వేస్తున్న పిల్లలని “పిచ్చుకుంత లేవు. ఎందుకురా! అలా ఎగురుతావు” అని అనేవారు ఒకప్పుడు. డబ్బుండి, అమాయకంగా ఉండే పిల్లలని చూస్తే – వాడు లేదా అమ్మాయి బంగారు పిచ్చుక! రా – అని అనేవాళ్ళు.

నిజమయిన బంగారు పిచ్చుకలు సూడాన్ లోని ఎర్రసముద్రతీరంలో కనిపిస్తాయట. ఈ పిచ్చుకల కథా కమామిషు ఏమిటో చూద్దాం. పిచ్చుకలు విత్తనాలు, ధాన్యాలు, గింజలు, మనకి పనికిరాని వ్యర్థ పదార్థాలని తింటాయి. చిన్న చిన్న కీటకాలని కూడా తింటాయి. ఇవి లేత గోధుమ, బూడిద రంగులలో ఉంటాయి.

మగపిచ్చుకలకి నలుపు, తెలుపు మచ్చలుంటాయి. కాబట్టి తేలికగా గుర్తుపట్టగలుగుతాం. ఇవి పరిమాణంలో చాలా చిన్నవి. పొట్టి, బొద్దుగా, చిన్న తోక ఉంటాయి. అయితే వీటి ముక్కు మాత్రం బలంగా ఉంటుంది.

మన ఇళ్ళలో ఉండే పిచ్చుకలు మామూలుగా రెండు నుండి అయిదు వరకూ గుడ్లని పెడతాయి. కొన్ని సందర్భాలలో ఏడు కూడా ఉండొచ్చు. 11 నుండి 14 రోజుల పాటు ఆడ, మగ పిచ్చుకలు గుడ్లను పొదగడం విశేషం పిచ్చుక పిల్లలు 14 రోజులు దాటగానే తమ బ్రతుకు తాము బ్రతకడం కోసం గూడు వదిలి వెళతాయి. ఇదివరలో కాదుగాని విదేశాలలో ఎప్పటి నుంచో మన దేశంలో ఇటీవలి కాలంలో మన మనుషులు కూడా పదిహేను పదహారేళ్ళకి సంపాదన మొదలు పెట్టి తమ బతుకు తాము బతుకుతున్నారు (చాలా పేద కుటుంబాల పరిస్థితి ఇది).

ఈ పిల్లలు సుమారు 16 సెం.మీ. పొడవుంటాయి. వీటి బరువు సుమారు 24 నుండి 40 గ్రాముల వరకూ ఉంటుంది. గంటకు 45 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో ఎగురుతాయి. వీటికి నడవడం కంటే ఎగరడం చాలా ఇష్టం. లాంగ్ జంప్‍లో మనం వాటితో పోటీ పడలేం.

మన ఇళ్ళలో ఉండే పిచ్చుకలు జీవితాంతం ఒక దానికొకటి జతగా బతకడం విశేషం. మన లానే గూడు కట్టుకోవడం, పిల్లలను పెంచడంలో ఒక పద్ధతిని పాటిస్తాయి.

గూడు కట్టడాన్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి. పాత ఇళ్ళ కప్పులు, తాటాకు, పెంకుటిళ్ళు చూరుల కింద, వరండాలలో, దట్టమైన పొదలలో, చెట్ల గుహలలో గూళ్ళని కడతాయి. ఎక్కడెక్కడికో ఎగురుకుంటూ, గంతులేసుకుంటూ గడ్డిపర కలని, పక్షుల ఈకలను తెచ్చి గూడు కట్టుకుంటాయి. ఆడ, మగ పిచ్చుకలు రెండు కలసి గూడును కడతాయి. ఇది ఎలా అనిపిస్తుందంటే పేద వారు ఆడ, మగ కలసి తాటాకులు, రెమ్మలు, కొబ్బరాకులు, వాసాలు, కంబారు తాడు మొదలయిన వాటిని ఉపయోగించి అందమయిన ఇళ్ళు కట్టినట్లు. ఇవి పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. వివిధ వ్యర్థాలను, కీటకాలను తిని మన పరిసరాలను శుభ్రపరుస్తాయి. ముఖ్యంగా వృక్షజాతులలో పరపరాగ సంపర్కం ద్వారా విత్తనాలను వివిధ ప్రదేశాలకు చేరవేస్తాయి.

అయితే ఈ మధ్య కాలంలో కనుమరుగవుతున్న పూరిళ్ళు, పెంకుటిళ్ళ స్థానంలో పెరుగుతున్న కాంక్రీటు అరణ్యాలు, పర్యావరణ కాలుష్యం పెరగడం, వివిధ రంగాలలో సంభవించిన సాంకేతిక మార్పులు, వివిధ టవర్ల నిర్మాణం, పంట పొలాలు తగ్గిపోవడం మూలంగా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి.

కానీ కొండలు, అడవులు, చెట్లు అధికంగా ఉండే ప్రాంతాలలో పిచ్చుకలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. దీనికో ఉదాహరణ. మేము ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని గుట్టలు, అడవులకి మధ్యలో ఉండే ఊరిలో ఉంటున్నాం. మా ఇల్లు, మా చుట్టు పక్కల ఇళ్ళలోని ఎ.సి. అవుటర్‌కి, గోడకి మధ్య ఖాళీ స్ధలం పిచ్చుకలు గూళ్ళు కట్టుకుని జీవనం సాగిస్తున్నాయి. ఎంత అబ్బురంగా ఉంటందో అవి ఆహారం తెచ్చుకోవడం, గూడు కట్టుకోవడం చూస్తుంటే! మేమందరం కూడా వాటికి ఆహారం, నీరు అందిస్తుంటాం. మర్చిపోయానండోయ్! వరికంకులు వేలాడేస్తే ముక్కుతో వడ్లని వలిచి బియ్యం తింటుంటాయ్? దొంగచూపులు చూస్తుంటాయ్!

ఇదండీ మన (మా) పిచ్చుక కథ.

Exit mobile version