Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బంజరు భూమిలో మొలకలు

[బాలబాలికల కోసం ‘బంజరు భూమిలో మొలకలు’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

నారాయణకు రెండు ఎకరాల బంజరు భూమి ఉంది. దానినిండా రాళ్ళే! అందువలన ఏ పంట వేయలేక పోతున్నాడు. కాని ఆ భూమిలో రెండుచోట్ల తనకు పేరు తెలియని రెండు చెట్లు మొలకెత్తాయి.

పోనీ ఏవైతేనేం చెట్లే కదా అని ఇంటినుండి కుండలో నీళ్ళు తెచ్చి వాటికి పోయసాగాడు. నారాయణది మంచిమనసు. అందుకే అప్పుడప్పుడూ  ఆ బంజరు భూమి మీద వచ్చి వాలే పక్షులకు, తిరిగే చిన్నజంతువులకు గింజలు, తెచ్చు కున్న రొట్టెలోని ముక్కలు వేసేవాడు.

నారాయణలోని మంచితనాన్ని కొండమీద కూర్చుని ఉన్న గంధర్వుడు గమనించి అతని మంచితనానికి ఎంతో ఆనందపడ్డాడు.

అయినా నారాయణలోని మంచితనాన్ని మరింత పరీక్షించాలని తన శక్తితో ఓ పావురం గాయంతో నారాయణ ముందు పడేటట్లు చేసాడు! ఆ పావురాన్ని చూసి నారాయణ చలించిపోయాడు. వెంటనే దానిని తనపై బట్టలో జాగ్రత్తగా ఎత్తి ఊర్లోకి తీసుకవెళ్ళి తనకు తెలిసిన జంతు వైద్యుడికి చూపించి మందువేసి కట్టుకట్టించి రక్షించాడు. పావురం పూర్తిగా కోలుకుని ఎగిరింది. ఇదంతా గమనించిన గంధర్వుడు నారాయణ బంజరు భూమిని గురించి కూడా ఆలోచించి మేలు చేయాలనుకున్నాడు. ఆ రోజు రాత్రి నారాయణకు కలలో గంధర్వుడు కనిపించి, “నీ బంజరు భూమిని గురించి బాధపడకు. నీకు కొన్ని ప్రత్యేకమైన విత్తనాలు ఇస్తాను. ఈ వానాకాలంలో పాతు. ఏకాస్త వానపడినా అవి మొలకెత్తుతాయి. నీకెంతో మేలు చేస్తాయి” చెప్పాడు కలలో గంధర్వుడు.

నారాయణ ఉలిక్కిపడి లేచి చూస్తే తన మంచానికి పక్కనే ఓ చిన్నమూటలో తనకు తెలియని విత్తనాలు కనబడ్డాయి! వాటికి దండంపెట్టి పూజామందిరంలో దేవుడి ముందు పెట్టి తన జీవితం బాగుపడాలని ప్రార్థించి తీసుకువెళ్ళి తన బంజరు భూమిలో నాటాడు.

అప్పుడే చిత్రంగా వాన వచ్చింది.

కొద్దిరోజుల్లోనే విత్తనాలు  మొలకెత్తాయి. ఆ పచ్చని చెట్లకు రంగుల పూలు ఎర్రని పండ్లు కాచాయి!

వాటిని చూసి నారాయణ ఎంతో సంతోషంతో గంధర్వుడికి మనసులోనే నమస్కారం పెట్టాడు.

ఒకరోజు రాజుగారి ఆస్థానవైద్యుడు నారాయణ బంజరు భూమి వద్దకు ఏదో పని ఉందని వచ్చి ఆ చెట్లను చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ చెట్లు, పండ్లు విశేష వైద్య గుణాలు కలవి. అవి ఎన్నో మొండి రోగాల చికిత్సకు పనిచేస్తాయి. ఈ విషయం ఆస్థాన వైద్యుడి ద్వారా రాజు తెలుసుకుని నారాయణను అభినందించి “ఆ పండ్లు తన వైద్యుడికి ఇస్తే తగిన ధనం ఇస్తాను” అని చెప్పాడు.

రాజుగారికి అనేక కృతజ్ఞతలు తెలిపి గంధర్వుడికి మనస్సులోనే నమస్కరించాడు.

ఆ పచ్చని పండ్లచెట్లను చూసిన పక్షులు, ఉడతలు మొదలైన జంతువులు కూడా సంతోషించాయి.

చూసారా, మనం చేసే మంచి పనుల వలన మనకు తెలియకుండానే మనకు దీవెనలు ఉంటాయి.

Exit mobile version