[మధ్య ప్రదేశ్ లోని బటేశ్వర్ మందిర సముదాయాన్ని సందర్శించి ఆ అనుభూతులను సంచిక పాఠకులకు అందిస్తున్నారు సుధా ఆత్రేయ.]
కొన్ని ప్రయాణాలు కేవలం ఒక ప్రదేశానికి తీసుకెళ్లవు. అవి కాలాన్ని వెనక్కి తిప్పి, వెయ్యేళ్ల క్రితం జీవించిన మనుషుల మధ్య నిలబెడతాయి. మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో, చంబల్ లోయల నిశ్శబ్ద ఒడిలో దాగి ఉన్న బటేశ్వర్ ఆలయాల యాత్ర నాకు అలాంటి అనుభూతినే ఇచ్చింది.
2019 పద్మ అవార్డుల మహోత్సవం దూరదర్శన్‌లో తిలకిస్తున్నాను. అతిసామాన్యులు అని ప్రపంచం అనుకున్న కొందరు ఎంతటి మహామహులో చూసి గుండె బరువెక్కింది. ఏ ప్రతిఫలం ఆశించకుండా వారు సమాజానికి చేసిన సేవ చూస్తే మనమెంత అల్పులమో అని కళ్ళు చెమర్చాయి. ఆ వరుసలో నన్ను హఠాత్తుగా కట్టిపడేసిన ఒక మహానుభావుడు డా. కె.కె. ముహమ్మద్ గారు, గొప్ప పురాతత్వ శాస్త్రజ్ఞుడు. వీరు జరిపిన తవ్వకాలే రామజన్మభూమి తీర్పు రామభక్తులకు అనుకూలంగా రావటానికి ప్రధాన కారణం. పద్మశ్రీ అవార్డుల కార్యక్రమం తర్వాత టీవీలో ఈ పద్మ అవార్డు గ్రహీతల్లో కొందరిపై డాక్యుమెంటరీ ప్రసారం చేశారు. అందులో ముహమ్మద్ గారిపై కూడా ఉంది. వారి గురించి చెబుతూ అక్కడక్కడ వారి ఇంటర్వ్యూలలోని బిట్లను చూపించారు. అందులో ఒక బిట్ నన్ను యూట్యూబ్‌లో వెతికేలా చేసింది. అదే డా. కె.కె. ముహమ్మద్ గారి గ్రేట్ ఎస్కవేషన్స్‌లో ఒకటైన బటేశ్వర్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. వారి ఇంటర్వ్యూ నన్ను ఎంతగా ఆవహించిందంటే, ఆ క్షణమే మనసులో ముద్రవేసుకున్నాను ఈ బటేశ్వర్ మందిర సముదాయాన్ని ఖచ్చితంగా కళ్ళారా చూడాలని. కానీ ఆ ఏడాది ఇంట్లో పెద్దలకు అనారోగ్యం రావటంతో కుదరలేదు. ఆపై రెండేళ్లు ప్రతివారి జీవితం కరోనాతో స్తంభించిపోయింది. దాంతో నా బటేశ్వర్ సందర్శన కోరిక ఎక్కడో మనసు అట్టడుగున కూరుకుపోయింది. అప్పుడప్పుడు యూట్యూబ్‌లో ఫేవరేట్స్‌లో పలకరించినా, ఒక నిట్టూర్పుతో, బెంగతో కూడిన చిరునవ్వుతో వెనక్కు నెట్టేయడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను.
పెద్దలు అన్నట్టు కోరిక బలంగా ఉంటే కొన్నిసార్లు నిజమవుతుంది, కొన్నిసార్లే సుమా! ఆ బటేశ్వరుడే విన్నాడేమో మరి, అనుకోకుండా మావారి బాస్ వెళ్లాల్సిన ఢిల్లీ రాచకార్యం, ఆయనకు అంతకన్నా పెద్ద పని రావటంతో మావారికి పడింది. ఇది నా మనసులో ఏదో ఆశ చిగురింపజేసింది. తన రెండ్రోజుల ఢిల్లీ పని తర్వాత వారాంతపు సెలవులు కలిసిరావటంతో బటేశ్వర్ ప్రస్తావన మావారి ముందుంచాను. తనకూ గ్వాలియర్ చూడాలని ఉండటంతో వెంటనే ఒప్పేసుకున్నారు. ఆ క్షణం నాకెంత సంతోషం కలిగిందో మాటల్లో చెప్పలేను! శ్రీవారి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావటంతో టికెట్స్ బుక్ చేశాను, ఏళ్ల కోరిక ఇప్పుడు నిజమవుతుందన్న గంతులు వేసే ఆనందంతో. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్‌లో, అక్కడ నుంచి గ్వాలియర్‌కు ఎలా వెళ్దామా అని చూస్తే మా కోసమే వేచి ఉన్నట్టు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి గ్వాలియర్‌కు రాజధాని ఎక్స్‌ప్రెస్, అదీ మాకు అనుకూలమైన సాయంత్రం ఐదింటికి సమయం కలిసిరావటంతో వెంటనే బుక్ చేసేశాను. ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్ అవ్వటం మూలాన టికెట్ల బుకింగ్ చాలా సులభంగా చేయగలిగాను.
చూస్తుండగానే ప్రయాణపు తేదీ వచ్చేసింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ చివరికి ఫలించబోతున్న ఉద్వేగ సమయమది. అనుకున్న సమయానికి ఢిల్లీలో దిగేశాము. ఢిల్లీలో బ్యాంక్ గెస్ట్‌హౌస్‌లో మా బస. నన్ను రూములో దింపి తను ఆఫీస్ వెళ్లిపోయారు. సాయంత్రం తను రాగానే మా గెస్ట్‌హౌస్ దగ్గరలో ఉన్న ఢిల్లీ మెట్రో ఎక్కి కుతుబ్‌మినార్ చూసేందుకు వెళ్ళాము. కొంచెం బాధ కలిగించే విషయం ఏంటంటే దేశరాజధానిలో శుభ్రతా లోపం. ఇది చూసి మనసు కొంచెం చివుక్కుమంది. టికెట్టు తీసుకొని లోపలికి అడుగు పెట్టగానే సుదూరం నుంచే మువ్వన్నెల రంగుల విద్యుద్దీపాలతో అలంకరించబడిన కుతుబ్‌మినార్ ఆకాశాన్ని ముద్దాడుతూ కనిపించింది. ఆ దృశ్యం చూసి క్షణకాలం మాటలు రాలేదు. కుతుబ్‌మినార్ ప్రాంతం మాత్రం శుభ్రంగా ఉండటం కొంత ఊరటనిచ్చింది.
మావారి ఆఫీసు పని అనుకున్న సమయానికి పూర్తవడంతో ఎటువంటి తొందరపాటు లేకుండా మళ్ళీ ఢిల్లీ మెట్రో ఎక్కి నిజాముద్దీన్ స్టేషన్‌కు సమయానికి చేరుకున్నాము. స్టేషన్ చాలా పెద్దది. అక్కడి విపరీతమైన రద్దీని చూసి కొంచెం ఆందోళన కలిగింది. లగేజీ స్కానింగ్ చేయించుకొని ప్లాట్‌ఫార్మ్ చేరుకొనేపాటికి గంట పట్టింది. మేము ప్లాట్‌ఫార్మ్ చేరగానే రైలు అప్పటికే వచ్చియుండటంతో నెమ్మదిగా ఎక్కి కూర్చున్నాము. రాజధాని ఎక్స్‌ప్రెస్ సరికొత్త భారతదేశానికి నిదర్శనం అనటం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. చాలా శుభ్రంగా, ముఖ్యంగా బాత్రూములు చాలా బాగుండటం సంతోషం. పెయిడ్ మీల్స్ కూడా శుచిగా రుచిగా ఉన్నాయి. రాత్రి ఎనిమిదింటికి గ్వాలియర్ చేరుకున్నాము. ఎన్నో ఏళ్ల కల ఇక కొన్ని గంటల దూరంలోనే ఉందన్న ఆనందంతో గుండె ఉప్పొంగింది. ఆటో మాట్లాడుకుని స్టేట్ బ్యాంక్ గెస్ట్‌హౌస్ చేరుకున్నాము.
మరురోజు ఉదయం ట్రావెలర్స్ వారితో మాకు కావలసిన ప్రదేశాలను మాకు కావలసిన విధంగా చూపించేట్టు మాట్లాడుకున్నా, ఇక్కడా భార్యాభర్త మధ్య తగవు తప్పలేదు. నేనో మొదట బటేశ్వర్ అని తనో గ్వాలియర్ కోట అని వాదులాడుకుంటుంటే భాష రాకపోయినా భావం అర్థమయ్యింది కాబోలు మా కారు డ్రైవర్ నాకే ఓటు వేశాడు. నచ్చకపోయినా నవ్వుతూ అనుసరించక తప్పలేదు శ్రీవారికి. ఏంటో ఆరాటం, దూరం దగ్గరవుతున్నకొద్దీ ఆనందం.
బటేశ్వర్ గ్వాలియర్ నుంచి దాదాపు నలభై కిలోమీటర్ల దూరం. దారి పొడవునా రెండువైపులా చంబల్ నదీ లోయ కనిపిస్తుంటే, మనసులో ఏదో వింత భావన కలిగింది. ఒకప్పుడు ఈ లోయలు బందిపోట్ల భయానికి పర్యాయపదంగా ఉండేవని తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ లోయలు ఎంతటి చరిత్రను తనలో దాచుకున్నాయో అనిపించి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. డా. కె.కె. ముహమ్మద్ గారు ఈ ప్రాంతానికి మొదటిసారి వచ్చినప్పుడు ఇదే లోయ ఒక నేరస్థుల ఆవాసంగా ఉండేదని, భయంకర బందిపోటుల అనుమతి లేకుండా ఇక్కడ అడుగు పెట్టడం కూడా సాధ్యం కాదని విన్నప్పుడు, ఆయన ధైర్యానికి మనసులోనే నమస్కరించుకున్నాను. ఒక మనిషి తన అంతరాత్మ పిలుపు కోసం ఎంతటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నారో అనుకుంటుంటే మనసు భారమైంది.
కారు మొరెనా దాటి, పల్లె దారుల్లో ముందుకు సాగుతుండగా దూరంగా ఇసుకరాతి శిఖరాలు కనిపించడం మొదలైంది. గుండె వేగం పెరిగింది. ఆ ఆలయాల సముదాయంలో కారు దిగగానే కొద్దిసేపు అలా నిశ్శబ్దంగా నిలబడిపోయాను. ఏఎస్ఐ బోర్డుపై ఉన్న వివరాల ప్రకారం, ఒకప్పుడు ఇక్కడ శివుడు, విష్ణువు, దేవికి అంకితమైన 200కు పైగా ఆలయాలు ఉండేవి. భూకంపాల వల్ల అవి శిథిలాలుగా మారి శతాబ్దాల పాటు అడవుల్లో మరుగున పడ్డాయి. అన్ని ఆలయాలు ఒకేచోట ఎందుకు కట్టారో సరైన కారణం ఇప్పటికీ తెలియలేదు. కానీ ఆ చెల్లాచెదురైన రాళ్లను ఒక్కొక్కటిగా ఏరి, జిగ్‌సా పజిల్‌ను అమర్చినట్టుగా తిరిగి ఆలయాలను నిలబెట్టిన డా. కె.కె. ముహమ్మద్ గారి బృందం చేసిన కృషి ముందు ఎవరైనా తలవంచకుండా ఉండలేరు.
ఒక్కో ఆలయం ముందు నిలబడి శిల్పాలను తాకుతుంటే, వాటి వెనుక ఉన్న శిల్పుల ప్రతిభ, పునరుద్ధరణ బృందం పట్టుదల, ఘనమైన భారతీయ సంస్కృతి అన్నీ కళ్లముందు ప్రత్యక్షమైనట్లనిపించి కళ్ళు తడిబారాయి.
ఇంతటి అద్భుతాన్ని నిర్మించింది గుర్జర–ప్రతీహార సామ్రాజ్యం. క్రీ.శ. 8వ నుంచి 10వ శతాబ్దం మధ్య వారు ఉత్తర భారతదేశంలో దేవాలయ నిర్మాణ కళను అత్యున్నత స్థాయికి చేర్చారు. అంతేకాదు, దాదాపు మూడు శతాబ్దాల పాటు పశ్చిమ దిశ నుంచి వచ్చిన అరబ్బుల విస్తరణను అడ్డుకోవడంలో వీరి పాత్ర భారత చరిత్రలో అత్యంత కీలకమైనదిగా చరిత్రకారులు చెబుతారు.
ఇక్కడ శివుడు, విష్ణువు, గణపతి, దేవి, సూర్యుడు తదితర దేవతల శిల్పాలు కనిపిస్తాయి. చిన్న పరిమాణంలోని ఆలయాలైనా వాటి శిల్పకళ ఖజురాహోకు పూర్వ దశను గుర్తుచేస్తుంది. చాలా మంది పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం బటేశ్వర్ దేవాలయ సముదాయం, తరువాతి కాలంలో నిర్మించిన ఖజురాహో ఆలయాల నిర్మాణ శైలికి ఒక పూర్వగామిగా భావిస్తారు. అరబ్బుల దండయాత్రలను అడ్డుకొని భారతీయ సంస్కృతిని కాపాడడమే కాక, శైవ, వైష్ణవ, శాక్త సంప్రదాయాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చారని ఆలయాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నాగర శైలిలో నిర్మించబడ్డ ఈ ఆలయాలు రేఖా శిఖరాలు, సున్నితమైన ద్వారబంధాలు, శిల్పాలతో అలంకరించిన స్తంభాలు ఆ కాలపు శిల్పకళా వైభవాన్ని నేటికీ సజీవంగా నిలబెడుతున్నాయి. ఒక శిల్పాన్ని స్పృశించినప్పుడు నా మనసులో ఒక్క ఆలోచనే మెదిలింది. ఈ రాయిని చెక్కిన శిల్పి పేరు మనకు తెలియదు. అతని జీవితం గురించి చరిత్ర మౌనంగా ఉంది. కానీ అతని చేతి స్పర్శ మాత్రం ఈ రాయిలో ఇప్పటికీ జీవిస్తోంది. అదేకదా కళాకారుడి అమరత్వం.
పురావస్తు శాఖ వారికి ఈ ఆలయాల గురించి ఖచ్చితమైన సమాచారం ఉన్నా, ఆ ప్రాంతం పూర్తిగా కర్కశ చంబల్ దొంగల ఆధీనంలో ఉండటంతో పురావస్తు శాఖ కూడా ఎన్నో సంవత్సరాలు ఏమీ చేయలేకపోయింది.
2004లో పురావస్తు శాఖ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టుగా ఉన్న డా. కె.కె. ముహమ్మద్ గారు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఎలాగైనా ఆ అద్భుత భారతీయ వారసత్వ సంపదను జాతికి అందించాలన్న కృతనిశ్చయంతో అందరూ ప్రమాదం అని చెబుతున్నా లెక్కచేయక దొంగలను కలిసేందుకు నిశ్చయించుకొని అటుగా అడుగులు వేశారు. అప్పుడు ఈ ప్రాంతం భయంకరమైన బందిపోటు నిర్భయ్ సింగ్ గుజ్జర్ ఆధీనంలో ఉండేది. అతని అనుమతి లేకుండా అక్కడ ఒక్క రాయిని కూడా కదిలించడం అసాధ్యం. ఎన్నోసార్లు విన్నవించుకున్న తరువాత నిర్భయ్ సింగ్‌ను కలిసే అవకాశం దక్కింది.
ఎంతో ఓర్పుతో ముహమ్మద్ గారు అతనితో మాట్లాడి, ఈ ఆలయాలు అతని పూర్వీకుల వారసత్వమని వివరించారు. ఆ మాటలు అతని మనసును తాకాయేమో. పునరుద్ధరణ పనులకు అనుమతి ఇవ్వడమే కాక, వాటికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తానని హామీ ఇచ్చాడు. దురదృష్టవశాత్తు కొద్ది రోజులకే అతను పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అయినప్పటికీ అతని అనుచరులు ఇచ్చిన మాట నిలబెట్టుకుని పనులకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. విధ్వంసకుడిగా ముద్రపడ్డ ఒక మనిషి కూడా, తన మూలాల పట్ల ప్రేమతో ఒక పవిత్ర కార్యానికి తోడ్పడ్డాడని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది.
ఆ తర్వాత దాదాపు ఐదేళ్లపాటు ఆయన బృందం అహర్నిశలు శ్రమించి, 80కు పైగా ఆలయాలను తిరిగి నిలబెట్టింది. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పురావస్తు పునరుద్ధరణ ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. పునర్నిర్మాణంలో కొత్త రాళ్లు ఉపయోగించకుండా, సాధ్యమైనంత వరకు అసలు రాళ్లనే వాటి అసలు స్థానాల్లో అమర్చడం (Anastylosis) అనే అంతర్జాతీయ పురావస్తు పద్ధతిని అనుసరించటం వల్ల బడ్జెట్ భారం ఎక్కువవడంతో పునరుద్ధరణ పనులు తరువాత మందగించాయి. 2021లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ (సుధా మూర్తి గారి ఆధ్వర్యంలో), పురావస్తు శాఖ మరియు నేషనల్ కల్చర్ ఫండ్‌తో కలిసి బటేశ్వర్‌లోని విష్ణు ఆలయం, బావి, మఠం తదితర నిర్మాణాల పునరుద్ధరణకు ₹4 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. దీంతో నిలిచిపోయిన పనులకు మళ్లీ ఊపు వచ్చింది.
ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా ఒకప్పుడు నేలపై చెదరిపోయిన రాళ్లు, నేడు మళ్లీ శిఖరాలుగా నిలబడి ఉన్నాయి. ఆ రోజు నేను కేవలం ఒక పురాతన ఆలయ సముదాయాన్ని చూసి రాలేదు. ఒక మనిషి పట్టుదల, ఒక నాగరికత వైభవం, కాలాన్ని జయించిన భారతీయ సంస్కృతిని చూసి వచ్చాను.
తిరిగి వెళుతూ వెనక్కు తిరిగి చూశాను. బటేశ్వర్ నాతో ఏమీ మాట్లాడలేదు. కానీ దాని నిశ్శబ్దం ఇలా చెప్పింది:
“శిథిలాలు చరిత్ర ముగింపు కాదు. వాటిని చదవగలిగినవారికి అవే నాగరికతకు సజీవ గ్రంథాలు.”

