[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘బతికిన వేళ్ళు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆ గాలి సొద నన్ను రమ్మని పిలిచే
వాసనల గుబాళింపు అది
అక్కడ పచ్చి పచ్చిగా పరుగెత్తిన
రుధిర ఛాయలను చూపింది రెటీనాపై
బంధాలూ అనుబంధాలకూ నెలవు
ఆ మట్టి మమతానురాగాలకు బిందువు
ఊరు నా బతుకే కానీ
అక్కడ నేను లేను
ఐనా, నా అరిపాదాలను
నేనొదిలేసిన పాదముద్రలు
నిమిరె ఆప్యాయంగా
బతికిన ఊరులో నా వారసత్వం గుడిసె గుండెలు
నేనుండని ఇల్లు పొదిగిన జ్ఞాపకాల ఊసులు
ఆకాశం ఎగిరేసిన రెక్కలు గతం ఆశలు
కూతకెళ్ళిన కబడ్డీ ఆటలో
గీతదాటని విజయమే నేర్పు
పూలు విరిసిన గాలి నెమలి నాట్యాలు
ఊరి పొలిమేర నినదించే మౌనశబ్దాలు
కోల్పోయింది నాలో వచ్చి వాలిన
నా తనువూగింది
తీరని దాహం తీర్చిన నాస్టాల్జియా
నీటినీ కన్నీటినీ అనుభవించిన నాకు ఊరు గొప్ప తరువు
అడుగులేసిన పాదాలకు నడకై
ఎండావానకు తడిసిన ఇల్లు నా గురువు
ఊరు పరిచయం అక్కరలేని ఏరు
ఇల్లు పూరించలేని అద్భుత కావ్యం
ఏమోగాని ఆ తీయని బంధం నాదే
అస్తిత్వం కోసం చేసే ప్రయాణంలో అలసటలేని దారి
వెదికే బాటసారికి అపూర్వ మిత్రులు ఆ ఊరూ ఇల్లూ
నాలో బతికిన వేళ్ళు
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.