Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బతుకు

[‘బతుకు’ అనే శీర్షికతో కవితను   అందిస్తున్నారు డా. గాదిరాజు మధుసూదన రాజు.]

ఒంపులన్నీ వొంగిపోయే సొంపులన్నీ కుంగిపోయే
జట్టు మొత్తం వీగిపోయే జుట్టు మొత్తం ఊడిపోయే

మేజువాణీ భోజనాలే గుండె చుట్టూ చేటులాయే
రోజువారీ మోజుతీరే చుట్టుముట్టే ఆపదాయే

తప్పులన్నీ నిప్పులాయే గుప్పుమంటూ మంటలాయే
ఆయువేమో వాలిపోయే ఆశలేమో వెల్లువాయే

కన్నవాళ్ళూ ఉండరాయే పుట్టినోళ్ళూ ఉండరాయే
చూడఇంపౌ మేడలున్నా చూడతోడే లేకపోయే

కూడబెట్టే కోట్ల డబ్బూ చావగొట్టే దోసమాయే
పట్టులన్నీ జారిపోయే గుట్టులన్నీ గోలలాయే

మూల్గులన్నీ మూగపోయేమూక లన్నీ మూగిపోయే
పొద్దులన్నీ సాగిపోయే సుద్దులన్నీ మాగిపోయే

మేలు కోల్పే లేకపోయే మోక్ష మార్గం తప్పిపోయే
యాత్ర మొత్తం గాదిరాజా మాయలోనే సాగిపోయే

Exit mobile version