Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బతుకు వెతలు!

[శ్రీమతి శాంతిశ్రీ బెనర్జీ రచించిన ‘బతుకు వెతలు!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

పొద్దున్నే కోడికూతలకు ఎప్పటిలాగానే మెలకువ వచ్చింది రాజమ్మకు. చకచకా లేచి ఇంటి పనుల్లో జొరబడింది. ఆమెకు నలుగురు పిల్లలు. ముందు వరుసగా ముగ్గురు కూతుళ్లు. ఆఖరిగా కొడుకు. పెళ్ళయి, పిల్లలు పుట్టి, వారికి కొంత వయస్సు వచ్చేంతవరకు ఆమె జీవితం సాఫీగానే, ఆనందంగానే సాగింది. జాలరి కులానికి చెందిన భర్త అప్పారావు సముద్రంలో చేపల వేటకు రాజమ్మ తమ్ముడితో పాటుగా వెళ్ళేవాడు. తెచ్చిన చేపలను రాజమ్మ సముద్రపు ఒడ్డున ఒక పక్కగా ఎన్నో తరాల నుంచి జాలరి ఆడవాళ్లు చేపలు అమ్ముకునే స్థలానికి వెళ్ళి అమ్ముతుండేది. వచ్చిన ఆదాయంతో ఇల్లు గడుస్తుండేది.

నాలుగేళ్ళ క్రితం ఎప్పటిలాగే ఒక రోజు అప్పారావు, రాజమ్మ తమ్ముడు నాగరాజు చేపల వేటకు తమ తమ పడవల్లో సముద్రంలోకి వెళ్ళారు. కానీ సాయంత్రం నాగరాజొక్కడే బావ కనపడటం లేదంటూ ఏడ్చుకుంటూ వచ్చాడు. సముద్రంలో కలిసిపోయాడన్నారు కొందరు. వస్తాడు కొన్ని రోజులు ఓపిక పట్టమని ఓదార్చారు మరికొందరు. ఎంతో ఆశతో ఎదురుచూసింది రాజమ్మ చాలా రోజులు. ఆమె ఆశ నిరాశే అయ్యింది. చివరకు తన పిల్లల కోసం బతకాలని, వారి భవిష్యత్తు చక్కదిద్దాలని, వాళ్ళని బాగా చదివించాలని అనుకుని దుఃఖాన్ని దిగమింగుకుంది. తమ్ముడు తెచ్చిన చేపలను అమ్ముతూ కుటుంబాన్ని నడపసాగింది.

ఇంటిపనుల్లో మునిగిన రాజమ్మ స్కూలుకు వెళ్ళే తన పిల్లల కోసం రొట్టెలు, కూర చేసింది. ఈ లోపల పదిహేనేళ్ళ పెద్ద కూతురు లేచి రెండు గదుల పెంకుటింటి ముందు నీళ్ళు జల్లి, ముగ్గు వేసింది. ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేసింది. ఆ తర్వాత స్నానం చేసి, స్కూలు యునిఫామ్ వేసుకుని, తన చెల్లెళ్ళను, తమ్ముడిని లేపి స్నానాలు చేయించి రెడీ చేసింది. పిల్లలందరూ రొట్టెలు తిని, కాలినడకన దగ్గర్లోనే ఉన్న గవర్నమెంట్ స్కూలుకి వెళ్ళారు. మధ్యాహ్నం స్కూలు వాళ్ళే ఫ్రీగా భోజనం పెడతారు. నాలుగింటికి మళ్ళీ ఇంటికి చేరుతారు. ఈ లోపల రాజమ్మ చేపలు అమ్ముకుని ఇంటికి వచ్చేది.

పిల్లలు స్కూలుకు వెళ్ళిన తర్వాత రాజమ్మ గబగబా స్నానం చేసి, చీర కట్టుకుని, సముద్ర ఒడ్డుకెళ్ళి, తమ్ముడిచ్చిన చేపలను పెద్ద గంపలో వేసుకుని జాలరి స్త్రీలు చేపలు అమ్ముకునే స్థలానికొచ్చింది. చేపలను శుభ్రపరచి, వాటిని రకాల ప్రకారం అమర్చింది. ఆ రోజు శనివారం అవడంతో అమ్మకాలు బాగానే ఉన్నాయి. ఇంకో రెండు గంటల్లో చేపలు పూర్తిగా అమ్ముడుపోతాయని అనుకుంటున్న సమయంలో  మచిలీపట్నం మున్సిపాలిటీ అధికారులు పోలీసులను వెంటబెట్టుకుని అక్కడకి వచ్చారు.

చేపలు అమ్ముకునే స్త్రీలందరినీ ఆ ప్రదేశం వెంటనే ఖాళీ చెయ్యమని మైకుల్లో అనౌన్స్ చేశారు. ఈ ప్రదేశాన్ని శుభ్రపరచి, అందంగా చెయ్యాలని పైనుంచి ఆదేశాలొచ్చాయని చెప్పారు. త్వరలో టౌన్లో పకడ్బందీగా శుభ్రమైన కొత్త చేపల మార్కెట్ కట్టబోతున్నారని కూడా చెప్పారు. వెంటనే ఖాళీ చెయ్యకపోతే స్త్రీలందరినీ చట్టవిరుద్ధంగా ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారన్న ఆరోపణ మీద అరెస్ట్ చేస్తామని బెదిరించారు.

మహిళలందరూ నిర్ఘాంతపోయి గగ్గోలు పెట్టసాగారు. ఆక్రోశంతో పెద్ద గొంతులతో అరవసాగారు. కొంచెం నిదానంగా ఉండే రాజమ్మ చేష్టలుడిగి, గుడ్లప్పగించి చూడసాగింది. వారిలో కొంచెం ధైర్యం ఉన్న గుంపు నాయకురాలు వజ్రమ్మ ముందుకు వచ్చి,

“అయ్యలూ! ఇది మా తాత ముత్తాతల కాడ నుంచి సేపలు అమ్ముకుంటున్న సోటు. దీని మీద మాకు అక్కులున్నయ్. ఇది సంద్రానికి దగ్గర కాబట్టి సేపలు ఈడకు తెచ్చి అమ్ముకోడం మాకు ఈలుగా ఉంటది. బాబు గార్లూ! మీరు ఈ సోటును బాగు సేయాలనుకుంటే ఇక్కడ్నే నీళ్ల పంపులు పెట్టండి. మంచిగా దుకాణాలు కట్టండి. ఈడ నుంచి మమ్మల్ని పొమ్మనే పెత్తనం సేయమాకండి. అసలూ మీకాడ మమ్మల్ని ఖాళీ సేయించే అడ్డరు కాయితం ఉందా?” అని ప్రశ్నించింది.

ఆమె మాటలకు అధికారికి విపరీతంగా కోపం వచ్చి, “ఎక్కువగా వాగుతున్నావే? నువ్వు వీళ్ళకు నాయకురాలివా? ఇదిగో మున్సిపాలిటీ ఆఫీసు ఎవిక్షన్ ఆర్డర్, అంతేకాకుండా ఈ స్థలం శుభ్రపరచాలని మీరు ఆమోదించి సంతకాలు చేసిన కాగితం కూడా ఉంది” అని చూపించాడు.

“అయ్యో! మేం ఈ సోటుని సక్కంగా, ఈలుగా సేత్తారనుకుని ఏలి ముద్రలేసాం గానీ మమ్మల్ని ఎల్లిపొమ్మంటారని అనుకోలేదు” అంది ధైర్యంగా మరో మహిళ కొండమ్మ.

“మీరు సంతకాలు చేసిన కాగితం తెలుగులోనే ఉంది. చదువు చట్టుబండలు లేని మీకు అది అర్థం కాకపోతే మా తప్పుకాదు. వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేకపోతే మీ మీద కేసు వేస్తాం. గంపలు సర్దుకుని వెళ్ళకపోతే మహిళా పోలీసులతో లాఠీచార్జ్ చేయిస్తాం!” అని బెదిరించాడు.

ఇక చేసేది లేక వాళ్ళందరూ గంపలతో దూరంగా వెళ్ళి నిలబడి విషాదభరిత ముఖాలతో చూడసాగారు. క్షణాల్లో బుల్డోజర్ వచ్చి వాళ్ళ షాపులన్నిటినీ నేలమట్టం చేసి ఆ ప్రదేశాన్ని ఆనవాలు లేకుండా మార్చివేసింది. మళ్ళీ వాళ్ళు అక్కడకి రాకుండా పోలీసులను కాపలా పెట్టారు. ఇది చూసి స్త్రీలందరూ గగ్గోలుగా కన్నీళ్ళు కార్చారు. దుఃఖం నిండిన మనస్సులతో ఇళ్ళకు వెళ్ళారు. రాజమ్మ విచారంగా ఇల్లు చేరింది. ‘రేపటి నుండి ఏటి దిక్కు! నాను, పిల్లలు ఏమవుతాం?’ అనుకుంటూ దిగులు పడింది. ఆమెకు అన్నం కూడా సహించలేదు. నాలుగింటికి పిల్లలు స్కూలు నుంచి వచ్చారు. పెద్దపిల్ల తల్లిని చూస్తూనే గ్రహించింది. ఏదో జరిగిందని, తల్లి పక్కన చేరి,

“ఏమయిందమ్మా! అలా ఉన్నావేంటి?” అని అడిగింది. రాజమ్మ ఏడుస్తూ అంతా చెప్పింది.

ఇంతలో వజ్రమ్మ ఇంకా చాలామంది ఆడవాళ్లను వెంటేసుకుని వచ్చి, బయట నుంచే “రాజమ్మా! బయలుదేరు. రాయి సెట్టు కింద మీటింగ్ పెట్టుకుందాం. సిగ్గిరి రా!” అంటూ వెళ్ళింది.

పెద్దపిల్ల తల్లిని లేవదీసి, కన్నీళ్ళు తుడిచి, “వెళ్ళమ్మా! ఏదో ఒక పరిష్కారం ఉండకపోదు” అంది.

రాజమ్మ నెమ్మదిగా రావిచెట్టు కింద ఉన్న స్త్రీల గుంపును చేరుకుంది. అందరూ వచ్చిన తర్వాత వజ్రమ్మ పెద్ద గొంతుకతో,

“ఈళ్ళు మనల్ని సంద్రం నుండి ఏరు సేయాలని సూత్తున్నరు. సేపలు అమ్ముకుంటూ కట్టపడుతూ కుటుంబకాలను సక్కదిద్దుకుంటున్న మనల్ని కట్టాలపాలు సెయ్యాలని అనుకుంటున్నరు. మనలో కొందరితో ఏరుగా మాటలు కలిపి మనల్ని ఇడదీయాలని సూత్తున్నరు. మనల్ని ఈడ నుంచి ఎల్లగొట్టే ముందు మనకి మాట మాత్రం సెప్పలేదు. మన కట్టనట్టాలేమిటో ఇచారించలేదు. కొన్ని డబ్బులైనా ఇచ్చి మనం నిలబడేలా సేయలేదు. మన సోటుని బాగు సేయాలన్న వంకతో మన బతుకుల్లో సిచ్చు పెడుతున్నరు. ఈ అన్నాయం సయించకూడదు. ఎదురు తిరగాలా. అందుకే రేపు మెయిన్ రోడ్డు చౌరస్తా కాడ ధర్నా సేద్దాం! అందరూ రావాలా!” అంది. అందరూ ముక్తకంఠంతో “సరే” అన్నారు.

మరుసటి రోజు ట్రాఫిక్ ఆపి మెయిన్ రోడ్డు చౌరస్తా దగ్గర ధర్నా చేశారు. వారికి అండగా మిగతా జాలర్లందరూ కూడా నిలబడ్డారు. ట్రాఫిక్ ఆపడం వలన అసౌకర్యానికి గురైన ప్రజలు వారి పరిస్థితి గమనించి అధికారుల మీద ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా మరుసటిరోజు స్త్రీలు మళ్ళీ ధర్నాకు ఉపక్రమించక ముందే వాళ్ళు చేపలు అమ్ముకునేందుకు తాత్కాలికంగా సమద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో టౌన్లో స్థలాన్ని కేటాయించారు. సముద్రానికి అంత దూరంలో స్థలం ఏర్పాటు చెయ్యడం వారికి అసంతృప్తి కలిగినా చేసేది లేక సమాధానపడ్డారు బెస్త మహిళలు.

రాజమ్మకు తన గంపతో అంత దూరం నడుస్తూ వెళ్ళడం కష్టంగా తోచేది. కానీ చేసేదేముంది? నెలసరి వచ్చినప్పుడు, నీరసంగా అనిపించినప్పుడు రిక్షాలో వెళ్ళేది. కానీ రోజూ రిక్షాలో వెళ్ళడానికి ఆమెకు ఇష్టంగా ఉండేది కాదు. పైసలు ఖర్చవుతాయని. ఇంకా నలభై ఏళ్ళు కూడా నిండని, అందాలు ఉట్టిపడే ఆమె గంప మోసుకుని వెళ్ళేటప్పుడు పోకిరి వెధవల వేధింపులను కూడా ఎదుర్కొనేది. ఈ సమస్యలన్నీ ఆమె సముద్రం దగ్గర చేపలు అమ్ముకున్నప్పుడు ఉండేవి కావు. ఈ కొత్త స్థలంలో చేపలు కూడా సరిగా అమ్ముడుపోవడం లేదు. ఆదాయం, అదివరకులా లేదు. అతికష్టం మీద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నది.

***

నెల రోజుల తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్థలం పక్క కొత్త చేపల మార్కెట్ ఆఘమేఘాల మీద కట్టారు. కొత్త మార్కెట్లో ఎటువంటి ఆందోళనలు జరుగకుండా జాగ్రత్తలు పాటించారు. సిసిటివి కెమెరాలు పెట్టి, పోలీసుల నిఘా ఏర్పాటు చేశారు. షాపులన్నీ నిండిన తర్వాత నెలకు ఇంతని మహిళా మత్స్యకారుల దగ్గర వసూలు కూడా చెయ్యాలని నిర్ణయించారు. అది వారిమీద అదనపు ఆర్థిక భారం అవుతుందని తెలిసి కూడా.

అక్కడ స్టాల్స్‌లో చేపలు అమ్ముకునేందుకు అందరికీ నెంబర్లతో టోకెన్లు ఇచ్చారు. కొందరికి మంచి నెంబర్లు వచ్చి మొదటి వరుసల్లో స్టాల్స్ వచ్చాయి. కొందరికి వెనుక వరుసల్లో స్టాల్స్ వచ్చాయి. ముందు వరుసల్లో వారికి అమ్మకాలు బాగుంటే, వెనుక వరుసల వారికి అమ్మకాలు సరిగ్గా జరిగేవికాదు. దీనితో వాళ్ళు అసంతృప్తులయ్యారు. వాళ్లల్లో వాళ్ళకి పోట్లాటలు ప్రారంభం అయి అది వరకు సామూహిక ఐకమత్యంతో మెలిగిన వారిలో ఈర్ష్యాసూయలు చోటుచేసుకున్నాయి.

రాజమ్మకు కూడా వెనుక వరుసల్లో స్టాల్ వచ్చింది. కొనేవాళ్ళు వచ్చినట్టు వచ్చి ముందు వరుసల్లోని వారి దగ్గర కొనుక్కు వెళుతుంటే, ఆమె చేపలు పూర్తిగా అమ్ముడుపోయేవి కాదు. ఆదాయం సరిపోక కుటుంబం అస్తవ్యస్తం అయింది.

కొందరు ప్రతిపక్ష నేతలు వారి దగ్గరికి వచ్చి, వారి అవస్థలకు విచారం వ్యక్తం చేసి, ఏదో ఒకటి చేస్తామని ఆశపెట్టి వెళ్ళారు కానీ, ఏమీ చెయ్యలేదు. వారి సమస్యలను తమకనుకూలంగా మార్చుకున్నారు కొందరు కార్పొరేట్ హోటల్ వాళ్ళు. కొత్త మార్కెట్లో సమయ పరిమితుల వలన అమ్ముడుపోని మిగిలిన చేపలను మహిళలు హోటల్ వాళ్ళకి అతి చౌకగా అమ్మేవారు. తమ రెస్టారెంట్లలో కస్టమర్స్‌కి ఎక్కువ ధరతో కమ్మని సముద్రపు ఆహారం వడ్డించి అధిక లాభాలు గడిస్తున్నారు హోటల్ వాళ్ళు.

***

పరిస్థితులు ఇలా సాగుతుండగా, ఒక రోజు కొత్త మార్కెట్లో ఒక సంఘటన జరిగింది. కొండమ్మ కూతురు రంగనాయకి అప్పుడప్పుడు మార్కెట్లో తల్లికి బదులుగా ముందు వరసలోని స్టాల్లో చేపలు అమ్ముతుండేది. ఆమె పద్దెనిమిదేళ్ళ అందమైన పడుచు పిల్ల. మధ్య వయస్సులో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆమె మీద కన్నువేశాడు. ఒక రోజు తల్లిలేని సమయంలో దాని పమిట లాగి సరసాలాడబొయ్యాడు. అది గమనించి ముందు వరుసలోని స్త్రీలు వాడి మీద ధ్వజమెత్తారు. పెద్ద పోట్లాట జరగసాగింది. పోలీస్‌ని ఉద్యోగం నుంచి తీసెయ్యాలని మహిళలు పట్టుబట్టారు.

ఇదంతా గమనిస్తున్న రాజమ్మ, తన పక్క స్టాల్ల్లోని వజ్రమ్మ దగ్గరికెళ్ళి,

“వజ్రక్కా! మనం కూడా ఎల్లి ఆళ్ళకి అండగ నిలబడదాం. ఎంతైనా మనం మనం ఒకటే గందా!” అంది.

“మన సేపలు సరిగ్గా అమ్ముడుపోవడం లేదని ఆళ్ళకి తెలుసు. ఆళ్ళు మనకి అండగా నిలబడ్డరా?” అంది వజ్రమ్మ కోపంగా.

“రంగనాయకి మన బిడ్డలాంటిది. రేపు మన బిడ్డలకి కూడా ఇట్టాటి కట్టం రావచ్చు! మనం అందరం కలసి ఎదురుతిరిగితే ఆ పోలీసోడికి తగిన సాస్తి జరుగుద్ది. ఇక ఏరే ఆలోసన సేయమాకు! పద!” అంది.

వజ్రమ్మకు ఆమె మాటలు సబబుగా అనిపించి, మిగతా ఆడవాళ్ళని కూడా కలుపుకుని ఆ పోలీసు మీద విరుచుకుపడింది. వీళ్ళ సామూహిక ధాటికి తట్టుకోలేక ఆ పోలీస్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు.

ఈ ఘటనతో ముందు వరుస ఆడవాళ్లు వీరి మంచితనాన్ని గుర్తించారు. వీరి కోసం ఏమైనా చెయ్యాలని అనుకున్నారు.

అది అదునుగా తీసుకుని వజ్రమ్మ “మనందరం పెద్ద సార్లకు అర్జీ పెట్టుకుందాం. దాని పకారం అందరికి ఒకే వరసలో దుకాణాలు ఉండేలా సేయాలని, అన్ని దిక్కుల నుండి షాపులకెళ్ళే ఈలుండాలనీ, సేపలు అమ్ముకునే టైం పరిమితులు తీసేయాలనీ అడుగుదాం. మన కోరికలు సెల్లవంటే ఈడ కాకుండా ఏరే సోటుకెల్లి సేపలమ్ముకుంటామని సెపుదాం. ఒకేళ మన అర్జీని సేత్తబుట్టలో ఏత్తే కోర్టు సుట్టూ తిరగానికి తయారుగా ఉండాల” అంది.

ఆమె మాటలు అందరికి సబబుగా ఆనిపించాయి. “అర్జీని పట్టించుకోకపోతే కోర్టు సుట్టూ నాయం వచ్చే వరకు నిలబడటానికి సిద్ధమని” కూడా వజ్రమ్మకు మాట ఇచ్చారు. మరుసటి దినం అందరు కలిసి కట్టుగా అర్జీ ఇచ్చి వచ్చారు.

రాజమ్మకి ఈ మార్పు, అందరూ మళ్ళీ ఐకమత్యంగా కలసిపోవడం శుభసూచకంగా అనిపించింది. తమ తీర్మానానికి పై అధికారులు అనుకూలంగా స్పందిస్తారని, తమ జీవితాలు కుదుటపడతాయని ఆశతో ఎదురు చూడసాగింది!

Exit mobile version