[జానీ క్యాష్, జూన్ కార్టర్ పాడిన ‘బికాజ్ ఐ లవ్ యు’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- జానీ క్యాష్ – ‘బికాజ్ ఐ లవ్ యు’
- ఆల్బమ్ – హలో ఐ యాం జానీ క్యాష్ (1970)
- రచన – జానీ క్యాష్
- నిర్మాత – బాబ్ జాన్సన్
~
జానీతో కలిసి జూన్ ఎన్నో స్టేజ్ ప్రదర్శనలిచ్చారు. వీరిద్దరు గానం చేసిన డ్యూయెట్లలో నాకు ఇష్టం అయిన పాట, స్త్రీ పురుషుల సహజీవనాన్ని, వారి దైనిక జీవితంలోని పరస్పర తోడ్పాటును అందంగా వర్ణించే ‘బికాజ్ ఐ లవ్ యు’.
జీవితం అంటే చిన్న చిన్న ఆనందాలు, సాధారణంగా గడిచిపోయే రోజులు. ఎక్కువ శాతం సామాన్యుల జీవితాలు ఇలాగే సాగుతాయి.. వాటిలోనే ప్రేమ ఆదరణను వెతుక్కుంటారు. అలాంటి ఓ అతి సాధారణ జంట తాము ఒకరికొకరు ఎలా తోడుగా నిలబడతారో తమ సహజీవనం ఎలా ఉంటుందో చెప్పుకునే సందర్భం ఇది. గొప్ప గొప్ప అసాధ్యాలు తాము చేసేస్తాం అని వాళ్లు చెప్పుకోరు. కాని నిజానికి తమ దినచర్యలో ఒకరి పక్కన ఒకరు నిలబడి ఉండటం కన్నా గొప్ప సాహచర్యం ఉండని అర్థం చేయించే గీతం ఇది. దీని అందం ఇందులోని సాధారణతయే. దీన్ని ఆ ఇద్దరూ గానం చేసిన తీరు చాలా బావుంటుంది. పాట మధ్యలో జూన్ ఇచ్చే ఆ విరుపులు శ్రోతల మనసుకు అహ్లాదాన్ని కలిగిస్తాయి. ప్రేమ కోసం గొప్ప గొప్ప కార్యాలు చేయనక్కర్లేదని, చిన్న చిన్న పనులు కలిసి చేసుకోవడంలో లభించే ఆనందం, అనుభవించే దగ్గరితనం, మనుషుల మధ్య అనుబంధాన్ని గట్టిపరుస్తుందని వివరించే గీతం ఇది.
I’ll sweep out your chimney, yes, and I will bring you flowers
Yes, and I will do for you most anything you want me to
If we live in a cottage, you will feel like it’s a castle
By the royal way you’re treated and attention shown to you
(నేను నీ ఇంటి పొగగొట్టాన్ని చిమ్మి శుభ్రం చేస్తాను, అవును నేను నీ కోసం పూలు తీసుకొస్తాను. నీవు ఏది అడిగినా నీకోసం అది చేస్తాను. మనం ఒక చిన్న ఇంట్లో నివసించినా, నీకు అది ఒక రాజభవనంలా అనిపిస్తుంది. నీకు లభించే రాజసం ఉట్టిపడే ఆదరణ, నీ పట్ల నేను చూపించే ప్రత్యేక శ్రద్ధ అలా ఉంటాయి.)
అతను ఆమె కోసం వంటిల్లు శుభ్రం చేసి అక్కడ ఉండే పొగగొట్టాన్ని శుభ్రంగా చిమ్మి ఉంచి ఆమెకు సహాయపడుతూ ఆమె కోసం రోజు పూలు కోసుకు వస్తానని అంటున్నాడు. ఆమె దానికి బదులుగా తాము ఉండే ఇల్లు చిన్నదే అయినా దాన్ని తాను తన ప్రేమ, ఆదరణ, అప్యాయతలతో రాజమహలుగా తీర్చి దిద్దుతానని, అతనిలో రాజసం తగ్గకుండా చూసుకుంటానని చెప్తుంది. ఇంటి పని ఆమెకు అప్పజెప్పకుండా తానూ తన వంతుగా పని చేస్తానని, ఆమెను పూల బహుమతులతో సత్కరిస్తానని చెప్పడంలో ఆమెకు ఆనందాన్ని, సహాయాన్ని అందించే తోడుగా నిలబడతాననే ప్రమాణం ఉంది. అలాగే అతనితో కలిసి ఉండే ఇల్లు చిన్నదయినా అతన్ని రారాజుగా చూసుకుంటున్నాన్ని ఆమె చెప్పడంలో అతని బాధ్యతను తాను సంపూర్ణంగా స్వీకరిస్తున్నాననే సూచన ఉంది. ఒక జంట జీవితాన్ని కలిసి గడపే విషయంలో పంచుకోవలసిన బాధ్యతల ప్రస్తావనను ఇలా పాటగా రాసారు కవి.
I’ll be there beside you, if you need a crying shoulder
Yes, and I’ll be there to listen when you need to talk to me
When you wake up in the darkness, I will put my arms around you
And hold you ’til the morning sun comes shining through the trees
(నువ్వెప్పుడన్నా బాధతో కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తే, నేను నా భుజాన్ని నీకు అందిస్తాను. అవును, నాతో ఏదైనా నీకు చెప్పుకోవాలనిపించినప్పుడు, వినడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. రాత్రి చీకటిలో నీకు మెలుకువ వచ్చినప్పుడు, నేను నిన్ను నా చేతుల మధ్య దగ్గరకు తీసుకుంటాను. ఉదయపు సూర్యకాంతి చెట్ల గుండా మనపై ప్రసరించేంత వరకు నిన్ను అలాగే హత్తుకుని ఉంటాను)
తమ జీవితం అంతా ఆనదంగానే ఉంటుందన్న కలల ప్రపంచంలో వాళ్ళు విహరించట్లేదు. కాని ఎల్లవేళలా ఒకరికొకరుగా నిలిచి ఉంటామని ప్రమాణం చేస్తున్నారు. ఆమె మనసు బాగోలేక కన్నీళ్ళూ కార్చే సమయంలో తన భుజాన్ని ఆమెకు అందిస్తానని, తోడుగా నిలుస్తానని ఆమె ఏమి చెప్పుకోవాలన్నా వినడానికి సిద్ధంగా ఉంటానని అతను ప్రమాణం చేస్తుంటే, ఆమె అతను ఒత్తిడి, అలజడులకు గురయి రాత్రి నిద్ర పట్టక మెలుకువగా ఉంటే, అతన్ని తన ఒడిలోకి తీసుకుని రాత్రంతా తోడుగా ఉంటానని ఆమె బదులిస్తుంది.
I’ll be right beside you, no matter where you travel
I’ll be there to cheer you ’til the sun comes shining through
If we’re ever parted, I will keep the tie that binds us
And I’ll never let it break ’cause I love you
(నువ్వు ఎక్కడికి ప్రయాణించినా, నేను నీ వెంటే ఉంటాను. సూర్యుడు ప్రకాశించే వరకు నిన్ను ఉత్సాహపరుస్తూ నీతోనే అడుగులు కదుపుతాను. మనం ఎప్పుడైనా దూరంగా ఉండాల్సి వస్తే, మనల్ని కలిపి ఉంచే ఈ బంధాన్ని నేను కాపాడుకుంటాను, అది ఎప్పటికీ తెగిపోనివ్వను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను)
ఇది ఈ పాటకు కోరస్లా వస్తుంది. జూన్, జానీ ఇద్దరూ కలిసి గానం చేసే చరణం ఇది. జీవితంలో వాళ్లు ఎక్కడకు ప్రయాణించినా, ఒకరికొకరుగా ఉంటామని, సూర్యకాంతి ఉన్నంత వరకు ఒకరి ఆనందం కోసం మరొకరు ఆలోచిస్తూనే ఉంటామని, ఏ కారణంతోనయినా దూరంగా ఉండవల్సి వస్తే, ఈ బంధం చెడకుండా దాన్ని తెగిపోనివ్వకుండా మసలుకుంటామని చెప్తూ తాము ఒకరికొకరు ఎందుకు ముఖ్యమో చివర్లో ప్రకటిస్తున్నారు.. “నిన్ను నేను ప్రేమిస్తున్నాను” అంటూ..
వారిద్దరికీ పరస్పరం ఉన్న ఇష్టమే చిన్న చిన్న ఆనందాలను పంచుకోవడానికి, పరస్పర సౌకర్యం కోసం ఆలోచించి పనులు పంచుకోవడానికి కారణం. నిన్ను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఇవన్నీ చేస్తాను అని చెప్పడం ప్రేమను వ్యక్తీకరించే ఒక పద్ధతి. అసలు ఇవన్నీ చేసేదే నిన్ను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అని చెప్పుకోవడం ఈ జంట బాంధవ్యాన్ని ఇంకా అందంగా వ్యక్తీకరిస్తుంది.
I will bring you honey from the bee tree in the meadow
And the first time there’s a rainbow, I’ll bring you a pot of gold
I’ll pick all your troubles and I’ll throw ’em in the river
Then I’ll bundle down beside you and I’ll keep you from the cold
(పచ్చిక బయల్లోని తేనె పట్టు చెట్టు నుండి నీకోసం తేనెను తెచ్చి ఇస్తాను. మొదటిసారి ఇంద్రధనుస్సు కనిపించినప్పుడు, నీకోసం ఒక కుండ నిండా బంగారం తీసుకొస్తాను. నీ బాధలన్నింటినీ ఏరి నదిలో పారేస్తాను, ఆ తర్వాత నీ పక్కనే చేరి, చలి తగలకుండా నిన్ను కాపాడతాను)
పల్లె జీవితంలో దొరికే అపురూపమైన ఆనందాలు, చెట్టుపై నుండి స్వచ్చమైన తేనె, రంగురంగుల ఇంధ్రధనుస్సు నడుమ విహారాలు, నది తీరాన నడక, సహచరి వెచ్చటి స్పర్శ. ఒకరితో ఒకరు వీటిని పంచుకుంటామని ఆ జంట చెప్పుకోవడంలో గ్రామీణ జీవితంలోని సౌందర్యం, ప్రకృతి నడుమ జీవించడంలోని సహజత్వం, వారి సాహచర్యంలోని మాధుర్యం, శ్రోతలకు గొప్ప ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
I’ll be right beside you, no matter where you travel
I’ll be there to cheer you ’til the sun comes shining through
If we’re ever parted, I will keep the tie that binds us
And I’ll never let it break ’cause I love you
(నువ్వు ఎక్కడికి ప్రయాణించినా, నేను నీ వెంటే ఉంటాను. సూర్యుడు ప్రకాశించే వరకు నిన్ను ఉత్సాహపరుస్తూ నీతోనే అడుగులు కదుపుతాను. మనం ఎప్పుడైనా దూరంగా ఉండాల్సి వస్తే, మనల్ని కలిపి ఉంచే ఈ బంధాన్ని నేను కాపాడుకుంటాను, అది ఎప్పటికీ తెగిపోనివ్వను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను)
ఈ పాటలో మళ్ళీ రిపీట్ అయే చరణం ఇది. పాటంతా ఎక్కడా ఆగకుండా సాగిపోతుంది. కాని సగం తర్వాత మళ్ళీ మొదటి చరణాలు తిరిగి వినిపిస్తాయి. ఇది కంట్రీ గీతాల ప్రత్యేక శైలి. జానీ క్యాష్ ఈ శైలిలోనే ఎక్కువ పాటలు గానం చేసారు. అందుకే ఆయన చాలా పాటలు పల్లవి చరణం లాంటి సూత్రాలకు కట్టుబడి ఉండవు. కవితలా సాగిపోతూ ఉంటాయి. వాక్యాలు రెండు సార్లు పాడడం ఉండదు. పాటని ఒక ఫోలో పాడుతూ వెళ్లి చివరకు మళ్ళీ ఆ చరణాలు మొత్తం పాడడం జరుగుతుంది. జానీ క్యాష్ గాత్రంలోని గాంభీర్యతను ఈ శైలి బాగా కుదురుతుంది. దీన్ని సోలో గీతాలతో పాటు డ్యూయెట్లకూ ఉపయోగించడం ఆయన ప్రత్యేకత.
Yes, I’ll sweep out your chimney, yes, and I will bring you flowers
Yes, and I will do for you most anything you want me to
If we live in a cottage, you will feel like it’s a castle
By the royal way you’re treated and attention shown to you
(అవును, నేను నీ ఇంటి పొగగొట్టాన్ని చిమ్మి శుభ్రం చేస్తాను, అవును నేను నీ కోసం పూలు తీసుకొస్తాను. నీవు ఏది అడిగినా నీకోసం అది చేస్తాను. మనం ఒక చిన్న ఇంట్లో నివసించినా, నీకు అది ఒక రాజభవనంలా అనిపిస్తుంది. నీకు లభించే రాజసం ఉట్టిపడే ఆదరణ, నీ పట్ల నేను చూపించే ప్రత్యేక శ్రద్ధ అలా ఉంటాయి.)
ఈ పల్లవిని తిరిగి పాడుతూ దీన్ని పాటలా కాక సంభాషణగా ముగిస్తారు ఇద్దరూ. అది ఈ పాటకు ఇంకా అందాన్నిస్తుంది. పాటగా మొదలెట్టి మాటగా దీన్ని ముగించడం ఈ పాటకు ఒక నిండుతనాన్ని తీసుకొస్తుంది.
కంట్రీ డ్యూయెట్లలో నాకు ప్రత్యేకంగా ఈ పాట మరీ మరీ ఇష్టం. వింటున్నంత సేపు అతి సాధారణ గ్రామీణ జీవితాన్ని అనుభవిస్తున్న భావం కలుగుతుంది.
ఈ పాటను క్రింది లింక్ లో వినవచ్చు.
https://www.youtube.com/watch?v=KU1X6B2PdHU

