అలలు నిజాలు చెప్పవు
కలలు అబద్ధాలు నేర్పవు
పగలు రేయీ పరుగులో
మనిషి అరిగిపోయాడు
మాటకు మోహమాటం
పూటకు అనుమానం
పున్నమినాడయినా
చీకటితో సహవాసం
నీటిఊట ఊరిస్తోంది
వేసవి చినుకు నేనంటూ
ఉనికికోసం తరిస్తోంది
గుండెతడికి కలవరిస్తోంది
గరీబుది గులాంగిరీ
అమీర్ దో దాదాగిరి
మినార్ల నగరంలో
మిణుకుమంటూ మనిషి
దారంతా దీపాలై
పాపాలను వెలిగిస్తే
శాపాల చెలిమితో
నగరం భగవానుని నీడలో
రాత్రంతా నక్షత్రాల వాన
ఎదురుచూపుల ఆత్రంతో
బెదురుచూపుల గాలులు
బెంగటిల్లిన పల్లెలా
సి. ఎస్. రాంబాబు పేరెన్నికగల కథా రచయిత. కవి. “పసిడి మనసులు” అనే వీరి కథా సంపుటి పలువురి ప్రశంసలు పొందింది.